Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఆదికాండము 12:1-9

దేవుడు అబ్రామును పిలచుట

12 అబ్రాముతో యెహోవా ఇలా అన్నాడు,

“నీ దేశాన్ని, నీ ప్రజలను విడిచిపెట్టు.
నీ తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి,
    నేను నీకు చూపించు దేశానికి వెళ్లు.
నిన్ను ఆశీర్వదిస్తాను.
నిన్ను ఒక గొప్ప జనముగా నేను చేస్తాను.
    నీ పేరును నేను ప్రఖ్యాతి చేస్తాను.
ఇతరులను ఆశీర్వదించటానికి ప్రజలు
    నీ పేరు ఉపయోగిస్తారు.
నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను.
    నిన్ను శపించే వాళ్లను నేను శపిస్తాను.
భూమి మీదనున్న మనుష్యులందరిని ఆశీర్వదించడానికి
    నేను నిన్ను ఉపయోగిస్తాను.”

అబ్రాము కనానుకు వెళ్లుట

కనుక అబ్రాము యెహోవాకు విధేయుడై కనాను వెళ్లాడు. అతడు హారానును విడిచిపెట్టాడు, లోతు అతనితో కూడ వెళ్లాడు. ఈ సమయంలో అబ్రాము వయస్సు 75 సంవత్సరాలు. అబ్రాము హారానును విడిచిపెట్టినప్పుడు అతడు ఒంటరివాడు కాడు. తన భార్య శారయిని, తమ్ముని కుమారుడు లోతును, హారానులో వారికి కలిగిన సమస్తాన్ని అబ్రాము తనతో తీసుకు వెళ్లాడు. హారానులో అబ్రాము సంపాదించిన బానిసలు అంతా వారితో వెళ్లారు. అబ్రాము, అతని వర్గంవారు హారాను విడిచి, కనాను దేశానికి ప్రయాణం చేశారు. అబ్రాము కనాను దేశంగుండా సంచారం చేశాడు. అబ్రాము షెకెము పట్టణానికి పయనించి మోరేలో ఉన్న మహా వృక్షం దగ్గరకు వచ్చాడు. ఆ కాలంలో కనానీ ప్రజలు ఈ దేశంలో నివసించారు.

అబ్రాముకు యెహోవా ప్రత్యక్షమయి, “ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను” అన్నాడు.

ఆ స్థలంలో అబ్రాముకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. కనుక ఆ స్థలంలో యెహోవాను ఆరాధించటానికి అబ్రాము ఒక బలిపీఠం కట్టాడు. తర్వాత అబ్రాము ఆ స్థలం విడిచిపెట్టి బేతేలుకు తూర్పున ఉన్న పర్వత ప్రాంతాలకు వెళ్లాడు. అక్కడ అబ్రాము తన గుడారం వేసుకొన్నాడు. పడమటికి బేతేలు పట్టణం ఉంది. తూర్పున హాయి పట్టణం ఉంది. ఆ స్థలంలో యెహోవా కోసం మరో బలిపీఠాన్ని అబ్రాము నిర్మించాడు. అక్కడ అబ్రాము యెహోవాను ఆరాధించాడు. ఆ తర్వాత అబ్రాము మరల ప్రయాణం మొదలు పెట్టాడు. నెగెబు[a] దిశగా అతడు ప్రయాణం చేశాడు.

కీర్తనలు. 33:1-12

33 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి.
    నమ్మకమైన మంచి మనుష్యులారా, ఆయనను స్తుతించండి.
సితారా వాయిస్తూ, యెహోవాను స్తుతించండి.
    యెహోవాకు పదితంతుల స్వరమండలాన్ని వాయించండి.
ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి.
    ఆనంద గీతాన్ని ఇంపుగా పాడండి.
దేవుని మాట సత్యం!
    ఆయన చేసే ప్రతిదాని మీద నీవు ఆధారపడవచ్చును.
నీతిన్యాయాలను దేవుడు ప్రేమిస్తాడు.
    యెహోవా భూమిని తన ప్రేమతో నింపాడు.
యెహోవా ఆజ్ఞ ఇవ్వగానే లోకం సృష్టించబడింది.
    భూమి మీద ఉన్న సమస్తాన్నీ దేవుని నోటి నుండి వచ్చే శ్వాస సృజించింది.
సముద్రంలోని నీరు అంతటినీ దేవుడు ఒక్కచోట రాశిగా కూర్చాడు.
    మహా సముద్రాన్ని దాని స్థానంలో ఆయనే ఉంచాడు.
భూమి మీద ప్రతి మనిషీ యెహోవాకు భయపడి ఆయనను గౌరవించాలి.
    ఈ లోకంలో జీవించే మనుష్యులందరూ ఆయనకు భయపడాలి.
ఎందుకంటే దేవుడు ఆదేశించిన తక్షణం దాని ప్రకారం నెరవేరుతుంది.
    ఏదైనా “నిలిచిపోవాలని” ఆయన ఆజ్ఞ ఇస్తే, అప్పుడు అది ఆగిపోతుంది.
10 జనసమూహాల పథకాలను పనికిమాలినవిగా యెహోవా చేయగలడు.
    వారి తలంపులన్నింటినీ ఆయన నాశనం చేయగలడు.
11 అయితే యెహోవా సలహా శాశ్వతంగా మంచిది.
    ఆయన తలంపులు తర తరాలకు మంచివి.
12 యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటాడో ఆ ప్రజలు ధన్యులు.
    దేవుడే వారిని తన స్వంత ప్రజలుగా ఏర్పాటు చేసుకొన్నాడు.

రోమీయులకు 4:13-25

విశ్వాసంద్వారా దేవుని వాగ్దానం పొందెను

13 అబ్రాహాము మరియు అతని సంతానం ప్రపంచాన్ని వారసత్వంగా పొందుతారని దేవుడు వాగ్దానం చేసాడు. ఈ వాగ్దానం ధర్మశాస్త్రాన్ని పాటించినందుకు చెయ్యలేదు. అతనిలో విశ్వాస ముండటంవలన దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానం చేసాడు. 14 ఒకవేళ వారసులు కావటానికి ధర్మశాస్త్రం కారణమైతే, విశ్వాసానికి విలువ ఉండదు. పైగా వాగ్దానానికి అర్థం ఉండదు. 15 ధర్మశాస్త్రం ఉంటే దేవుని ఆగ్రహం ఉంటుంది. కాని ధర్మశాస్త్రం లేకపోతే దాన్ని అతిక్రమించే ప్రశ్నేరాదు.

16 ఆ వాగ్దానము విశ్వాసము ఉండటంవల్ల సంభవిస్తోంది. అది ఉచితంగా లభించాలని దేవుని ఉద్దేశ్యం. అది అబ్రాహాము సంతానానికంతా వర్తిస్తుందని దేవుడు అభయమిచ్చాడు. అంటే ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళకే కాకుండా అబ్రాహాములో ఉన్న విశ్వాసాన్ని తమలో వ్యక్తం చేసేవాళ్ళకు కూడా అది వర్తిస్తుందన్న మాట. అబ్రాహాము మనందరికీ తండ్రి. 17 దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నేను నిన్ను ఎన్నో జనాంగములకు తండ్రిగా చేస్తాను.”(A) దేవుని దృష్టిలో అబ్రాహాము మనకు తండ్రిలాంటి వాడు. దేవుడు చనిపోయినవాళ్ళకు ప్రాణం పొయ్యగలడు. తన ఆజ్ఞలతో లేనివాటిని సృషించగలడు. అలాంటి దేవుణ్ణి అబ్రాహాము విశ్వసించాడు.

18 నిరాశ సమయంలో అబ్రాహాము ఆశతో నమ్ముకొన్నాడు. అందుకే అతడు ఎన్నో జనములకు తండ్రి అయ్యాడు. “నీ సంతతివాళ్ళు చాలా మంది ఉంటారు” అని దేవుడు చెప్పిన ప్రకారమే జరిగింది. 19 అప్పటికి అబ్రాహాముకు సుమారు నూరు సంవత్సరాల వయస్సు. అతని శరీరం బలహీనంగా ఉండింది. పైగా శారాకు గర్భం దాల్చే వయస్సు దాటిపోయి ఉంది. ఈ సంగతులు అబ్రాహాముకు తెలుసు. అయినా అతని విశ్వాసం సన్నగిల్లలేదు. 20 దేవుడు చేసిన వాగ్దానంలో అతడు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. దానికి మారుగా అతడు దృఢ విశ్వాసంతో దేవుణ్ణి స్తుతించాడు. 21 దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని నిలుపుకోగలడని, ఆ శక్తి ఆయనలో ఉందని అబ్రాహాముకు సంపూర్ణమైన విశ్వాసం ఉండినది. 22 ఈ కారణంగానే, “దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు” 23 “నీతిమంతునిగా పరిగణించాడు” అన్న పదాలు అతనికొరకు మాత్రమే వ్రాయబడలేదు. 24 అవి మనకోసం కూడా వ్రాయబడ్డాయి. మనము మన యేసు ప్రభువును బ్రతికించిన దేవునియందు విశ్వసిస్తున్నాము. కనుక దేవుడు మనల్ని కూడా నీతిమంతులుగా పరిగణిస్తాడు. 25 దేవుడు మన పాపాల కోసం ఆయన్ని మరణానికి అప్పగించాడు. మనం నీతిమంతులం కావాలని ఆయన్ని బ్రతికించాడు.

మత్తయి 9:9-13

మత్తయిని పిలవటం

(మార్కు 2:13-17; లూకా 5:27-32)

యేసు అక్కడి నుండి బయలుదేరి వెళ్తుండగా, మత్తయి అనేవాడు కూర్చొని పన్నులు వసూలు చేస్తూ ఉండటం చూసాడు. యేసు అతనితో, “నన్ను అనుసరించు!” అని అన్నాడు. మత్తయి లేచి ఆయన్ని అనుసరించాడు.

10 యేసు మత్తయి యింట్లో భోజనానికి కూర్చుని ఉండగా, చాలామంది పన్నులు సేకరించే వాళ్ళు, పాపులు వచ్చారు, వాళ్ళంతా యేసుతో, ఆయన శిష్యులతో కలిసి భోజనానికి కూర్చున్నారు. 11 పరిసయ్యులు ఇది గమనించి యేసు శిష్యులతో, “మీ ప్రభువు పన్నులు సేకరించే వారితోను, పాపులతోను కలిసి ఎందుకు భోజనం చేస్తాడు?” అని అడిగారు.

12 యేసు ఇదివిని, “ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉండదు. రోగంతో ఉన్న వాళ్ళకే వైద్యుని అవసరం ఉంటుంది. 13 ‘నేను కోరేది దయ, జంతువుల బలినికాదు’(A) అనే వాక్యానికి అర్థమేమిటో వెళ్ళి నేర్చుకోండి. ఎందుకంటే నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు. పాపులను పిలవటానికి వచ్చాను” అని అన్నాడు.

మత్తయి 9:18-26

యేసు బాలికను బ్రతికించటం, ఒక స్త్రీని నయం చేయటం

(మార్కు 5:21-43; లూకా 8:40-56)

18 యేసు ఈ విధంగా మాట్లాడుతుండగా యూదుల సమాజమందిరానికి అధికారిగా ఉన్నవాడు ఒకడు వచ్చి, ఆయన ముందు మోకరిల్లి, “నా కూతురు చనిపోయింది. కాని మీరు వచ్చి మీ చేయి ఆమె మీద ఉంచితే ఆమె బ్రతుకుతుంది” అని అన్నాడు.

19 యేసు, ఆయన శిష్యులు లేచి అతని వెంట వెళ్ళారు.

20 వాళ్ళు వెళ్తుండగా పండ్రెండేండ్ల నుండి రక్త స్రావంతో బాధ పడ్తున్న ఒక స్త్రీ వెనుక నుండి వచ్చి ఆయన అంగీ యొక్క కొనను తాకింది. 21 ఆమె, “నేను ఆయన వస్త్రాన్ని తాకగలిగితే చాలు నాకు నయమైపోతుంది” అని తనలో తాను అనుకొన్నది.

22 యేసు వెనక్కు తిరిగి ఆమెను చూసి, “ధైర్యంగా వుండమ్మా! నీ విశ్వాసమే నిన్ను బాగుచేసింది” అని అన్నాడు.

23 యేసు ఆ అధికారి యింట్లోకి ప్రవేశిస్తూ, అక్కడ పిల్లన గ్రోవి వాయించే వాళ్ళు, గోల చేస్తున్న వాళ్ళు ఉండటం చూసాడు. 24 వాళ్ళతో, “వెళ్ళిపొండి, ఆమె చనిపోలేదు. నిద్రపోతూ ఉంది, అంతే!” అని అన్నాడు. వాళ్ళాయన్ని హేళన చేసారు. 25 ఆయన వాళ్ళను పంపేసాక లోపలికి వెళ్ళి ఆ అమ్మాయి చేయి తాకాడు. ఆమె వెంటనే లేచి నిలుచుంది. 26 ఈ వార్త ఆ ప్రాంతమంతా వ్యాపించింది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International