Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:41-48

వావ్

41 యెహోవా, నీ నిజమైన ప్రేమ నాకు చూపించుము.
    నీవు వాగ్దానం చేసినట్టే నన్ను రక్షించుము.
42 అప్పుడు నన్ను అవమానించే ప్రజలకు నా దగ్గర జవాబు ఉంటుంది.
    యెహోవా, నీవు చెప్పే విషయాలు నేను నిజంగా నమ్ముతాను.
43 నీ సత్యమైన ఉపదేశాలను నన్ను ఎల్లప్పుడూ చెప్పనిమ్ము.
    యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాల మీద నేను ఆధారపడుతున్నాను.
44 యెహోవా, నేను శాశ్వతంగా ఎప్పటికీ నీ ఉపదేశాలను అనుసరిస్తాను.
45 అందుచేత నేను క్షేమంగా జీవిస్తాను.
    ఎందుకంటే, నీ న్యాయ చట్టాలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను గనుక.
46 యెహోవా ఒడంబడికను గూర్చి నేను రాజులతో చర్చిస్తాను.
    వారి ఎదుట భయపడకుండా నేను మాట్లాడుతాను.
47 యెహోవా, నీ ఆజ్ఞలను చదవటము నాకు ఆనందం.
    ఆ ఆజ్ఞలంటే నాకు ప్రేమ.
48 యెహోవా, నేను నీ ఆజ్ఞలను గౌరవిస్తున్నాను. వాటిని నేను ప్రేమిస్తున్నాను.
    మరియు నేను వాటిని ధ్యానం చేస్తూ వాటిని గూర్చి మాట్లాడుతాను.

ఆదికాండము 17

సున్నతి ఒడంబడికకు గురుతు

17 అబ్రాముకు 99 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడి యిలా చెప్పాడు: “నేను సర్వశక్తిమంతుడైన దేవుడిని. నా కోసం ఈ పనులు చేయి. నాకు విధేయుడవై, సరైన జీవితం జీవించు. ఇలా గనుక నీవు చేస్తే, మన ఇద్దరి మధ్య ఒక ఒడంబడికను నేను తయారు చేస్తాను. నిన్ను బాగా అభివృద్ధి చేస్తాను.”

అప్పుడు దేవునియెదుట అబ్రాము సాష్టాంగ పడ్డాడు. అతనితో దేవుడు అన్నాడు. “మన ఒడంబడికలో నా భాగం ఇది. అనేక జనములకు నిన్ను తండ్రిగా నేను చేస్తాను. నీ పేరు నేను మార్చేస్తాను. నీ పేరు అబ్రాము కాదు, నీ పేరు అబ్రాహాము. అనేక జనాంగములకు నీవు తండ్రివి అవుతావు గనుక, నీకు నేను ఈ పేరు పెడుతున్నాను. నీకు నేను పెద్ద సంతానాన్ని ఇస్తాను. నీనుండి క్రొత్త జనాంగాలు ఉద్భవిస్తాయి. నీనుండి క్రొత్త రాజులు వస్తారు. నీకు, నాకు మధ్య ఒక ఒడంబడికను నేను ఏర్పాటు చేస్తాను. నీ సంతానానికి ఈ ఒడంబడిక వర్తిస్తుంది. నేను నీకు దేవునిగా ఉంటాను. నీ సంతానానికి దేవునిగా ఉంటాను. నీవు పరాయివాడిగా నివసిస్తున్న ఈ దేశాన్ని, అంటే కనాను దేశాన్ని నీకును, నీ సంతానపు వారందిరికిని శాశ్వతపు హక్కుగా ఇస్తాను. నేను మీకు దేవునిగా ఉంటాను.”

అబ్రాహాముతో దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “ఇక, ఒడంబడికలో నీ భాగం యిది. ఒడంబడికను నీవు నిలబెట్టాలి. నీవూ, నీ సంతానమంతా నా ఒడంబడికకు విధేయులు కావాలి. 10 మీరు విధేయులు కావాల్సిన ఒడంబడిక ఇదే. ఇది మీకు, నాకు మధ్య ఒడంబడిక. ఇది నీ సంతానము వారి కోసమూను; పుట్టిన ప్రతి పిల్లవాడికి తప్పక సున్నతి చెయ్యాలి. 11 నీకు, నాకు మధ్యగల ఒడంబడికను నీవు అనుసరిస్తావని తెలియచేసేందుకు నీవు నీ మర్మాంగపు ముందు చర్మాన్ని కోయాలి. 12 నీ జనములో పుట్టిన ప్రతి బాలుడు, నీ జనమునుండి కాక, ఇతర జనములనుండి డబ్బుతో బానిసగా కొనబడిన వారిలో ప్రతి పురుషుడు సున్నతి చేయించుకొనవలెను. 13 కనుక నీ జాతి అంతటిలో ప్రతి పిల్లవానికి సున్నతి జరుగుతుంది. నీ వంశంలో పుట్టిన ప్రతి పిల్లవాడికి, లేక బానిసగా కొనబడిన పిల్లవాడికి సున్నతి జరుగుతుంది. 14 ఇది నా చట్టం, నీకు నాకు మధ్యనున్న ఒడంబడిక. సున్నతి చేయని ఏ మగవాడైనా సరే తన ప్రజల్లో నుండి తొలగించివేయబడతాడు. ఎందుచేతనంటే, ఆ వ్యక్తి నా ఒడంబడికను ఉల్లంఘించాడు కనుక.”

వాగ్దాన పుత్రుడు ఇస్సాకు

15 అబ్రాహాముతో దేవుడు అన్నాడు: “నీ భార్య శారయికి నేను ఒక క్రొత్త పేరు పెడ్తాను. ఆమె క్రొత్త పేరు శారా.[a] 16 ఆమెను నేను ఆశీర్వదిస్తాను. ఆమెకు ఒక కుమారుణ్ణి నేను ఇస్తాను, మరి నీవు తండ్రివి అవుతావు. అనేక క్రొత్త జనాంగములకు ఆమె తల్లి అవుతుంది. జనముల రాజులు ఆమెలోనుండి వస్తారు.”

17 దేవుణ్ణి గౌరవించుటకు అబ్రాహాము ముఖం క్రిందికి దించుకొన్నాడు. అయితే అతడు నవ్వి, తనలో తాను అనుకొన్నాడు: “నా వయస్సు 100 సంవత్సరాలు. నాకు కొడుకు పుట్టజాలడు. మరి శారా వయస్సు 90 సంవత్సరాలు. ఆమెకు శిశువు జన్మించడం అసాధ్యం.”

18 అప్పుడు అబ్రాహాము దేవునితో ఇలా అన్నాడు: “నా కుమారుడు ఇష్మాయేలు జీవించి నిన్ను సేవిస్తాడని ఆశిస్తున్నాను.”

19 దేవుడు చెప్పాడు: “లేదు! నీ భార్య శారాకు కుమారుడు పుడతాడని నేను చెప్పాను. అతనికి ఇస్సాకు[b] అని నీవు పేరు పెడ్తావు. అతనితో నేను నా ఒడంబడిక చేసుకొంటాను. ఆ ఒడంబడిక అతని సంతానాలన్నిటితోను శాశ్వతంగా కొనసాగే ఒడంబడికగా ఉంటుంది.

20 “ఇష్మాయేలును గూర్చి నీవు నన్ను అడిగావు, నేను విన్నాను. అతణ్ణి నేను ఆశీర్వదిస్తాను. అతనికి చాలా మంది పిల్లలు ఉంటారు. పన్నెండు మంది మహా నాయకులకు అతడు తండ్రి అవుతాడు. అతని కుటుంబం ఒక గొప్ప జాతి అవుతుంది. 21 అయితే ఇస్సాకుతో నేను నా ఒడంబడిక చేస్తాను. శారాకు పుట్టబోయే కుమారుడు ఇస్సాకు. వచ్చే సంవత్సరం సరిగ్గా ఇదే కాలంలో నీకు కుమారుడు పుడతాడు.”

22 అబ్రాహాముతో దేవుడు మాట్లాడటం ముగించిన తర్వాత అబ్రాహాము ఒంటరిగా ఉన్నాడు. దేవుడు లేచి అబ్రాహామును విడిచి వెళ్లిపోయాడు. 23 తన కుటుంబంలోని మగవాళ్లకు, బాలురకు సున్నతి చేయమని అబ్రాహాముతో దేవుడు చెప్పాడు కనుక ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన సేవకులందరిని అబ్రాహాము సమావేశపర్చాడు. డబ్బుతో కొనబడిన సేవకులను గూడ అబ్రాహాము సమావేశపర్చాడు. అబ్రాహాము ఇంటిలోని ప్రతి పురుషుడు, బాలుడు ఒక చోట సమావేశ పర్చబడ్డారు. వారందరికి సున్నతి చేయబడింది. అబ్రాహాము దేవుడు చెప్పినట్లు వారందరికి సున్నతి చేశాడు.

24 అబ్రాహాముకు సున్నతి జరిగినప్పుడు అతని వయస్సు 99 సంవత్సరాలు. 25 అతని కుమారుడు ఇష్మాయేలుకి సున్నతి జరిగినప్పుడు అతడు 13 ఏండ్లవాడు. 26 అబ్రాహాము, అతని కుమారుడు ఇష్మాయేలు ఇద్దరును ఒకే రోజున సున్నతి చేయబడ్డారు. 27 ఆ రోజునే అబ్రాహాము ఇంటిలోని మగవాళ్లందరికి గూడ సున్నతి జరిగింది. అతని ఇంట పుట్టిన సేవకులందరికి, అతడు కొన్న సేవకులందరికి సున్నతి జరిగింది.

హెబ్రీయులకు 13:1-16

చివరి మాటలు

13 పరస్పరం సోదరుల్లా జీవించండి. తెలియనివాళ్ళకు ఆతిథ్యమివ్వండి. కొందరు యిలా చేసి తమకు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యమిచ్చారు. చెరసాలల్లో ఉన్నవాళ్ళను, మీరు వాళ్ళతో సహా ఉన్నట్లు భావించి జ్ఞాపకంచేసుకోండి. అదేవిధంగా కష్టాలనుభవిస్తున్న వాళ్ళను, మీరు వాళ్ళతో సహా కష్టాలనుభవిస్తున్నట్లు భావించి జ్ఞాపకంచేసుకోండి.

వివాహాన్ని అందరూ గౌరవించాలి. వివాహపాన్పును నిష్కళంకంగా ఉంచాలి. వ్యభిచారుల్ని, వివాహితులతో లైంగిక సంబంధాలను పెట్టుకొన్నవాళ్ళను దేవుడు శిక్షిస్తాడు. ధనాశ లేకుండా జీవితాలు గడపండి. మీ దగ్గరున్నదానితో సంతృప్తి చెందండి. ఎందుకంటే దేవుడు ఈ విధంగా అన్నాడు:

“నేను నిన్ను ఎన్నటికీ విడువను
నిన్నెన్నటికీ ఒంటరివాణ్ణి చెయ్యను.”(A)

అందువల్ల మనం దృఢ విశ్వాసంతో,

“ప్రభువు నా రక్షకుడు,
    నాకే భయంలేదు.
మానవుడు నన్నేమి చెయ్యగలడు?”(B)

అని అంటున్నాము.

మీకు దైవసందేశాన్ని ఉపదేశించిన గురువుల్ని జ్ఞాపకముంచుకోండి. వాళ్ళ జీవిత విధానం వలన కలిగిన మంచిని గమనించండి. వాళ్ళ విశ్వాసాన్ని అనుసరించండి. నిన్న, నేడు, నిరంతరం యేసు క్రీస్తు ఒకే విధంగా ఉంటాడు. ఎన్నో రకాల విచిత్రమైన బోధలు ఉన్నాయి. వాటివల్ల మోసపోకండి. దైవానుగ్రహంతో మన హృదయాలు శక్తి పొందాలి గాని ఆహారంతో కాదు. ఆహార నియమాలవల్ల వాళ్ళకు లాభం కలుగదు.

10 యూదుల గుడారంలో సేవచేసే యాజకులకు మన బలిపీఠం మీద బలి ఇచ్చినదాన్ని తినే అధికారంలేదు. 11 పాపాలకు ప్రాయశ్చిత్తంగా అర్పించటానికి ప్రధాన యాజకుడు జంతువుల రక్తాన్ని అతి పవిత్రస్థానంలోకి తీసుకు వెళ్ళేవాడు. ఆ జంతువుల దేహాల్ని శిబిరానికి ఆవలి వైపు కాల్చేవాడు. 12 మనుష్యుల్ని తన రక్తంతో పవిత్రం చెయ్యాలని యేసు నగరపు సింహద్వారానికి ఆవల మరణించాడు. 13 అందువల్ల శిబిరం వెలుపలనున్న ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన అవమానాన్ని పంచుకుందాం. 14 మనకు స్థిరమైన పట్టణం లేదు. కాని మున్ముందు రానున్న పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాము. 15 అందువల్లే మనం యేసు ద్వారా దేవుణ్ణి అన్ని వేళలా స్తుతించుదాం. మన నోటి ద్వారా కలిగే స్తుతిని ఆయనకు బలిగా అర్పించి, ఆయన పేరులో ఉన్న కీర్తిని పంచుకుందాం. 16 ఇతరులకు ఉపకారం చెయ్యండి. మీకున్నదాన్ని యితరులతో పంచుకోండి. ఇలాంటి పనులు దేవునికి చాలా యిష్టం.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International