Revised Common Lectionary (Semicontinuous)
విశ్వాసుల సహవాసం
42 వాళ్ళు అపొస్తలుల బోధను వింటూ సహవాసములోను, రొట్టె విరుచుటలోను పాలి భాగస్థులై, ప్రార్థన చేయుటలో నిమగ్నులై యుండేవాళ్ళు. 43 దేవుడు అపొస్తలుల ద్వారా ఎన్నో అద్భుతాలు చేసాడు. చిహ్నాలు చూపాడు. ప్రతి ఒక్కనిలో దైవ భీతి కలిగింది. 44 భక్తులంతా ఒకే చోట సమావేశమయ్యారు. తమ దగ్గరున్న ప్రతి వస్తువును అందరితో కలిసి పంచుకొనేవాళ్ళు. 45 తమ ఆస్తిని, వస్తువుల్ని అమ్మి అవసరమున్న వాళ్ళకు యిచ్చేవాళ్ళు. 46 ప్రతి రోజు మందిరావరణంలో ఒకే ఉద్దేశ్యంతో సమావేశమయ్యేవాళ్ళు. ఇండ్లలో సమావేశమై ఆహారాన్ని పంచుకొని తినేవాళ్ళు. మంచి మనస్సుతో అమితానందంగా భుజించేవాళ్ళు, 47 దేవుణ్ణి స్తుతించేవాళ్ళు. ప్రజలందరూ వాళ్ళను యిష్టపడేవాళ్ళు. ప్రభువు తాను రక్షించినవాళ్ళను విశ్వాసులతో చేరుస్తూ వచ్చాడు.
దావీదు కీర్తన.
23 యెహోవా నా కాపరి
నాకు కొరత ఉండదు
2 పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు.
ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు.
3 ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలం ప్రసాదిస్తాడు.
ఆయన నిజంగా మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను మంచితనపు మార్గాల్లో నడిపిస్తాడు.
4 చివరికి మరణాంధకారపు లోయలో నడిచినప్పుడు కూడా
నేను భయపడను. ఎందుకంటే, యెహోవా, నీవు నాతో ఉన్నావు.
నీ చేతికర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాయి కనుక.
5 యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాకు భోజనం సిద్ధం చేశావు.
నూనెతో నా తలను నీవు అభిషేకిస్తావు.
నా పాత్ర నిండి, పొర్లిపోతుంది.
6 నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో ఉంటాయి.
మరియు నేను ఎల్లకాలం యెహోవా ఆలయంలో నివసిస్తాను.
19 ఎందుకంటే, తనకు అన్యాయంగా సంభవిస్తున్న బాధల్ని దేవుణ్ణి దృష్టిలో ఉంచుకొని అనుభవించే వ్యక్తి శ్లాఘనీయుడు. 20 నీవు చేసిన తప్పులకు దెబ్బలు తిని ఓర్చుకుంటే అందులో గొప్పేమిటి? కాని మంచి చేసి కూడ బాధల్ని అనుభవించి ఓర్చుకుంటే అది దేవుని సాన్నిధ్యంలో శ్లాఘనీయమౌతుంది. 21 దేవుడు మిమ్మల్ని పిలిచింది అందు కోసమే! మీకు ఆదర్శంగా ఉండాలనీ, మీరు తన అడుగు జాడల్లో నడచుకోవాలనీ క్రీస్తు మీకోసం కష్టాలనుభవించాడు.
22 “ఆయన ఏ పాపం చేయలేదు!
ఆయన మాటల్లో ఏ మోసం కనబడలేదు!”(A)
23 వారాయన్ని అవమానించినప్పుడు ఎదురు తిరిగి మాట్లాడలేదు. కష్టాలను అనుభవించవలసి వచ్చినప్పుడు ఆయన ఎదురు తిరగలేదు. దానికి మారుగా, న్యాయంగా తీర్పు చెప్పే ఆ దేవునికి తనను తాను అర్పించుకున్నాడు. 24 ఆయన మన పాపాలను సిలువపై భరించాడు. పాపం చేస్తూ జీవించటం మానుకున్న మనం నీతిగా జీవించాలని యిలా చేసాడు. ఆయన దెబ్బల ద్వారా మన రోగాలు మాని పోయాయి. 25 ఎందుకంటే, ఇదివరలో మీరు దారి తప్పిన గొఱ్ఱెల్లా ప్రవర్తించారు. కాని యిప్పుడు మీరు, మీ ఆత్మల్ని కాపలా కాచే కాపరి, అధిపతి దగ్గరకు తిరిగి వచ్చారు.
గొఱ్ఱెలకాపరి, తన గొఱ్ఱెలు
10 యేసు, “ఇది నిజం. గొఱ్ఱెల దొడ్డిలోకి తలుపు ద్వారా వెళ్ళకుండా గోడనెక్కి వెళ్ళేవాడు దొంగ, దోపిడిగాడు. 2 తలుపు ద్వారా ప్రవేశించేవాడు ఆ గొఱ్ఱెలకు కాపరి. 3 ద్వారపాలకుడు అతని కోసం తలుపు తెరుస్తాడు. గొఱ్ఱెలు అతని స్వరము గుర్తిస్తాయి. ఆ గొఱ్ఱెలు అతనివి. అతడు ఆ గొఱ్ఱెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి తీసుకొని వెళ్తాడు. 4 తన గఱ్ఱెల్ని వెలుపలికి పిలుచుకొని వచ్చాక అతడు ముందు నడుస్తాడు. వాటికి అతని స్వరం తెలుసు కనుక అవి అతణ్ణి అనుసరిస్తాయి. 5 అవి క్రొత్త వాని వెంట వెళ్ళవు. క్రొత్త వాని స్వరం గుర్తుపట్టలేవు. కనుక పారిపోతాయి.” అని అన్నాడు.
6 యేసు ఈ ఉపమానం ఉపయోగించి బోధించాడు. కాని వాళ్ళకు ఆయనేమి చెబుతున్నాడో అర్థం కాలేదు.
యేసు మంచి కాపారి
7 అందువల్ల యేసు మళ్ళీ ఈవిధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “నిజంగా నేను గొఱ్ఱెలకు ద్వారాన్ని. 8 నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు దొంగలు, దోపిడిగాళ్ళు. కనుక గొఱ్ఱెలు వాళ్ళ మాటలు వినలేదు. 9 నేను ద్వారాన్ని. నా ద్వారా ప్రవేశించిన వాళ్ళు రక్షింపబడతారు. వాళ్ళు స్వేచ్ఛతో లోపలికి వస్తూ పోతూ ఉంటారు. ఆ గొఱ్ఱెలకు పచ్చిక బయళ్ళు కనిపిస్తాయి. 10 దొంగ దొంగతనం చేయటానికి, చంపటానికి, నాశనం చేయటానికి వస్తాడు. నేను వాళ్ళకు క్రొత్త జీవితం ఇవ్వాలని వచ్చాను. ఆ క్రొత్త జీవితం సంపూర్ణమైనది.
© 1997 Bible League International