Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
అపొస్తలుల కార్యములు 2:14

పేతురు ఉపన్యసించటం

14 ఇది విని పేతురు పదకొండుగురితో లేచి, పెద్ద గొంతుతో ప్రజల్ని సంబోధిస్తూ, “తోటి యూదా సోదరులారా! యెరూషలేంలో నివసిస్తున్న సమస్త ప్రజలారా! నన్ను దీన్ని గురించి మీకు చెప్పనివ్వండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి.

అపొస్తలుల కార్యములు 2:22-32

22 “ఇశ్రాయేలు ప్రజలారా! ఇది వినండి. దేవుడు నజరేతు నివాసియైన యేసును, తాను ప్రత్యేకంగా నియమించాడన్న విషయం మీకు నిరూపించాలని ఆయన ద్వారా మహత్యాలు, అద్భుతాలు మీకోసం చేసాడు. సూచనలు చూపాడు. ఈ మహత్యాలు, అద్భుతాలు చేసినట్లు, సూచనలు చూపినట్లు మీకు ఇదివరకే తెలుసు. 23 దైవ సంకల్పానుసారం ఆయన దివ్య జ్ఞానానుసారం యేసు మీకు అప్పగింపబడ్డాడు. ఆ తర్వాత మీరు దుర్మార్గుల సహాయంతో ఆయనను సిలువకు వేసి, మేకులు కొట్టి ఆయన్ని చంపారు. 24 కాని దేవుడాయన్ని బ్రతికించాడు. ఆయనకు మరణవేదననుండి విముక్తి కలిగించాడు. మరణానికి ఆయన్ని బంధించి ఉంచటం చేతకాలేదు. 25 దావీదు యేసును గురించి ఈ విధంగా అన్నాడు:

‘ప్రభువును, నేను నా ముందు అన్ని వేళలా చూసాను.
    నన్ను రక్షించటానికి ప్రభువు నా వెంట ఉన్నాడు!
26 అందుకే నా మాటల్లో
    ఆనందం నిండియున్నది.
అందుకే నా దేహం ఆశతో జీవిస్తోంది.
27     ఎందుకంటే, నా ఆత్మను నీవు చనిపోయిన వాళ్ళతో వదిలివేయవు
    నీవు నీ భక్తుని దేహాన్ని కుళ్ళనీయవు.
28 నాకు జీవపు దారుల్ని చూపావు!
    నా వెంటే ఉండి నాకు ఆనందం కలిగించావు!’(A)

29 “సోదరులారా! మన వంశీయుడైన దావీదును గురించి నేనిది ఖచ్చితంగా చెప్పగలను. అతడు చనిపొయ్యాడు. అతణ్ణి సమాధి చేసారు. ఆ సమాధి ఈ నాటికీ ఉంది. 30 దావీదు ఒక ప్రవక్త. దావీదు వంశంలో పుట్టిన వాణ్ణొకణ్ణి సింహాసనంపై కూర్చోబెడ్తానని దేవుడు అతనికి ప్రమాణ పూర్వకంగా వాగ్దానం చేసాడు. ఇది దావీదుకు తెలుసు. 31 ఈ జరుగనున్న దాన్ని గురించి దావీదుకు ముందే తెలుసు. అందువల్లే అతడు క్రీస్తు బ్రతికి రావటాన్ని గురించి ఈ విధంగా అన్నాడు:

‘దేవుడు ఆయన్ని సమాధిలో వదిలివేయ లేదు.
ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు.’

క్రీస్తు సమాధినుండి లేచే విషయమై దావీదు మాటలాడుచూ ఉన్నాడు. 32 కావున దేవుడు ఈ యేసునే మృత్యువునుండి బ్రతికించినాడు. దీనికి మేమంతా సాక్ష్యము.

కీర్తనలు. 16

దావీదుకు అభిమాన కావ్యము.

16 దేవా నేను నీమీద ఆధారపడ్డాను గనుక నన్ను కాపాడుము.
“యెహోవా, నీవు నా యజమానివి
    నాకు గల ప్రతి మంచిది నీ నుండి నాకు లభిస్తుంది”
    అని నేను యెహోవాతో చెప్పాను.
మీరు ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధుల గురించి కూడా చెప్పారు,
    “వారు నాకు గోప్పవారు, వారే నన్ను సంతోషపెట్టువారు.”

కాని ఇతర దేవుళ్లను పూజించుటకు పరుగులెత్తే మనుష్యులకు అధిక బాధ కలుగుతుంది.
    ఆ దేవతలకు వారు ఇచ్చే రక్తపు అర్పణల్లో నేను భాగం పంచుకోను.
    ఆ దేవతల పేర్లు కూడ నేను పలుకను.
నా భాగం, నా పాత్ర యెహోవా దగ్గర్నుండి మాత్రమే వస్తుంది.
    యెహోవా, నీవే నన్ను బలపరచావు.
    యెహోవా, నీవే నా వంతు నాకు ఇమ్ము.
నా వంతు చాలా అద్భుతమయింది.
    నా స్వాస్థ్యము చాలా అందమయింది.
యెహోవా నాకు చక్కగా నేర్పించాడు. కనుక నేను ఆయనను స్తుతిస్తాను.
    రాత్రియందు, నా అంతరంగపు లోతుల్లోనుండి ఉపదేశములు వచ్చాయి.

నేను ఎల్లప్పుడూ యెహోవాను నా యెదుట ఉంచుకొంటాను.
    ఎందుకనగా ఆయన నా కుడి ప్రక్కన వున్నాడు.
    నేను ఎన్నడూ కదల్చబడను. ఆయన కుడిప్రక్కను నేను ఎన్నడూ విడువను.
కనుక నా ఆత్మ, నా హృదయము ఎంతో సంతోషంగా ఉన్నాయి.
    నా శరీరం కూడ క్షేమంగా బ్రతుకుతుంది.
10 ఎందుకంటే, యెహోవా, నీవు నా అత్మను చావు స్థలంలో విడిచిపెట్టవు గనుక.
    నీ పరిశుద్ధుడిని సమాధిలో కుళ్లిపోనీయవు.
11 సరైన జీవిత విధానాన్ని నీవు నాకు నేర్పిస్తావు.
    యెహోవా, నీతో ఉండటమే నాకు సంపూర్ణ సంతోషం కలిగిస్తుంది.
    నీ కుడిప్రక్కన ఉండటం నాకు శాశ్వత సంతోషం కలిగిస్తుంది.

1 పేతురు 1:3-9

సజీవమైన ఆశాభావం

మన ప్రభువైన యేసు క్రీస్తుకు తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించుదాం. ఆయనకు మనపై అనుగ్రహం ఉండటం వల్ల యేసు క్రీస్తును బ్రతికించి మనకు క్రొత్త జీవితాన్ని యిచ్చాడు. అంతేకాక మనలో సజీవమైన ఆశాభావాన్ని కలిగించాడు. నాశనంకాని, మచ్చలేని, తరగని వారసత్వం పొందటానికి ఆశించండి. దేవుడు మీకోసం దాన్ని పరలోకంలో దాచి ఉంచాడు.

చివరి దశలో మనకు వ్యక్తం కావటానికి రక్షణ సిద్ధంగా ఉంది. మీలో విశ్వాసం ఉండటంవల్ల, అది లభించే వరకూ మీకు దైవశక్తి రక్షణ కలిగిస్తుంది. కొంతకాలం సంభవించిన అనేక రకాల కష్టాల్ని అనుభవించవలసి వచ్చినప్పుడు మీరు అనుభవించారు. దానికి ఆనందించండి. మీ విశ్వాసం యథార్థమైనదని రుజువగుటకు ఈ శ్రమలు మీకొచ్చాయి. బంగారం నిప్పుచేత కాల్చబడి శుద్ధి అయినా, చివరికది నాశనం కాక తప్పదు. మీ విశ్వాసం బంగారం కంటే విలువైనదిగా యుండి యేసు క్రీస్తు వచ్చినప్పుడు ప్రశంస, మహిమ, ఘనత పొంద తగినదిగా వుంటుంది.

మీరాయన్ని చూడలేదు. అయినా ప్రేమిస్తున్నారు. ప్రస్తుతం చూడటం లేదు. అయినా విశ్వసిస్తున్నారు. వ్యక్తం చేయలేని దివ్యమైన ఆనందం మీలో నిండిపోయింది. ఎందుకంటే ఏ ఉద్దేశ్యంతో మీరు విశ్వసిస్తున్నారో ఆ ఉద్దేశ్యం నెరవేరుతోంది. మీ ఆత్మలకు రక్షణ లభిస్తోంది.

యోహాను 20:19-31

యేసు తన శిష్యులకు కనిపించటం

(మత్తయి 28:16-20; మార్కు 16:14-18; లూకా 24:36-49)

19 ఆ ఆదివారం సాయంకాలం శిష్యులందరు ఒకే చోట సమావేశమయి ఉన్నారు. యేసు వచ్చి వాళ్ళ మధ్య నిలుచొని, “మీకు శాంతి కలుగుగాక!” అని అన్నాడు. 20 ఇలా అన్నాక ఆయన తన చేతుల్ని, ప్రక్క భాగాన్ని చూపించాడు. ప్రభువును చూసాక శిష్యులకు చాలా ఆనందం కలిగింది.

21 యేసు మళ్ళీ, “మీకు శాంతి కులుగు గాక! తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను” అని అన్నాడు. 22 ఇలా అన్నాక, “పవిత్రాత్మను పొందండి!” అని వాళ్ళపై ఊదాడు. 23 ఆ తర్వాత, “మీరు ఎవరి పాపాలు క్షమిస్తే వారి పాపాలు క్షమింపబడతాయి. మీరు ఎవరి పాపాలు క్షమించకపోతే వారి పాపాలు క్షమించబడవు” అని వాళ్ళతో అన్నాడు.

తోమా యేసును చూడటం

24 యేసు వచ్చినప్పుడు పండ్రెండుగురిలో ఒకడైన తోమా శిష్యుల్తోలేడు. ఇతణ్ణి “దిదుమ” అని పిలిచే వాళ్ళు. 25 మిగత శిష్యులు తోమాతో, “మేము ప్రభువును చుసాము” అని అన్నారు. కాని తోమా, “నేను స్వయంగా ఆయన చేతులకున్న మేకుల గాయాల్ని చూసి, వాటిని చేతుల్తో తాకి, ఆయన ప్రక్క డొక్కపై నా చేతుల్ని ఉంచాక ఆయన్ని నమ్ముతాను” అని అన్నాడు.

26 ఒక వారం రోజుల తర్వాత యేసు శిష్యులు ఒక యింట్లో ఉన్నారు. తోమా కూడా వాళ్ళతో ఉన్నాడు. తలుపులు మూసి వేసి ఉన్నా యేసు లోపలికి వచ్చి వాళ్ళ మధ్య నిలుచొని, “మీకు శాంతి కలుగుగాక!” అని అన్నాడు. 27 యేసు తోమాతో, “నా చేతులు చూడు. నీ వేళ్ళతో వాటిని తాకు. నా ప్రక్క భాగంపై నీ చేతుల్ని ఉంచు! ఇక అనుమానించకు” అని అన్నాడు.

28 తోమా ఆయనతో, “దేవా! నా ప్రభూ!” అని అన్నాడు.

29 అప్పుడు యేసు అతనితో, “నన్ను చూసావు కనుక నమ్మావు. నన్ను చూడకున్నా విశ్వసించే వాళ్ళు ధన్యులు” అని అన్నాడు.

ఈ గ్రంథం వ్రాయటంలో ఉద్దేశ్యం

30 నేను ఈ గ్రంథంలో వ్రాసినవే కాక, యేసు ఇంకా అనేకమైన మహాత్కార్యాలు చేసాడు. వాటన్నిటినీ శిష్యులు చూసారు. 31 యేసు “క్రీస్తు” అని, “దేవుని కుమారుడు” అని, ఆయన్ని విశ్వసించిన వాళ్ళకు ఆయన పేరిట అనంత జీవితం లభిస్తుందని మీరు నమ్మాలనే ఉద్దేశ్యంతో యివి వ్రాయబడ్డాయి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International