Revised Common Lectionary (Semicontinuous)
దావీదుకు అభిమాన కావ్యము.
16 దేవా నేను నీమీద ఆధారపడ్డాను గనుక నన్ను కాపాడుము.
2 “యెహోవా, నీవు నా యజమానివి
నాకు గల ప్రతి మంచిది నీ నుండి నాకు లభిస్తుంది”
అని నేను యెహోవాతో చెప్పాను.
3 మీరు ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధుల గురించి కూడా చెప్పారు,
“వారు నాకు గోప్పవారు, వారే నన్ను సంతోషపెట్టువారు.”
4 కాని ఇతర దేవుళ్లను పూజించుటకు పరుగులెత్తే మనుష్యులకు అధిక బాధ కలుగుతుంది.
ఆ దేవతలకు వారు ఇచ్చే రక్తపు అర్పణల్లో నేను భాగం పంచుకోను.
ఆ దేవతల పేర్లు కూడ నేను పలుకను.
5 నా భాగం, నా పాత్ర యెహోవా దగ్గర్నుండి మాత్రమే వస్తుంది.
యెహోవా, నీవే నన్ను బలపరచావు.
యెహోవా, నీవే నా వంతు నాకు ఇమ్ము.
6 నా వంతు చాలా అద్భుతమయింది.
నా స్వాస్థ్యము చాలా అందమయింది.
7 యెహోవా నాకు చక్కగా నేర్పించాడు. కనుక నేను ఆయనను స్తుతిస్తాను.
రాత్రియందు, నా అంతరంగపు లోతుల్లోనుండి ఉపదేశములు వచ్చాయి.
8 నేను ఎల్లప్పుడూ యెహోవాను నా యెదుట ఉంచుకొంటాను.
ఎందుకనగా ఆయన నా కుడి ప్రక్కన వున్నాడు.
నేను ఎన్నడూ కదల్చబడను. ఆయన కుడిప్రక్కను నేను ఎన్నడూ విడువను.
9 కనుక నా ఆత్మ, నా హృదయము ఎంతో సంతోషంగా ఉన్నాయి.
నా శరీరం కూడ క్షేమంగా బ్రతుకుతుంది.
10 ఎందుకంటే, యెహోవా, నీవు నా అత్మను చావు స్థలంలో విడిచిపెట్టవు గనుక.
నీ పరిశుద్ధుడిని సమాధిలో కుళ్లిపోనీయవు.
11 సరైన జీవిత విధానాన్ని నీవు నాకు నేర్పిస్తావు.
యెహోవా, నీతో ఉండటమే నాకు సంపూర్ణ సంతోషం కలిగిస్తుంది.
నీ కుడిప్రక్కన ఉండటం నాకు శాశ్వత సంతోషం కలిగిస్తుంది.
ఆమెకు యెరూషలేము స్త్రీల ప్రశ్నలు
9 అతిసుందరవతీ, ఇతర ప్రియులకంటె నీ ప్రియుని విశేషం ఏమిటి?
ఇతర ప్రియుల కన్న నీ ప్రియుడు దేనిలో ఎక్కువ?
అంతగా ఎక్కువ కనుకనేనా, మాచేత ప్రమాణం చేయించుకున్నావు?
యెరూషలేము స్త్రీలకు ఆమె సమాధానం
10 నా ప్రియుడు ఎర్రగా ప్రకాశించు శరీరం కలవాడు, తెల్లనివాడు.
పదివేలలోనైన గుర్తింపుగలవాడు.
11 మేలిమి బంగారు పోలిన శిరస్సు గలవాడు తుమ్మెద రెక్కలవంటి
నొక్కునొక్కుల కారునల్లటి శిరోజాలవాడు.
12 అతని కనులేమో సెలయేటి ఒడ్డున ఎగిరే పావురాలకళ్లలాంటివి.
పాల మునిగిన పావురాలవలెను,
బంగారంలో పొదిగిన రత్నాల వలెను,
13 అతడి చెక్కిళ్లు సుగంధ ఉద్యానాల
పరిమళ పుష్పరాశులవలెను,
అతని పెదవులు అత్తరువారి బోళంతో
తడిసిన కెందామరలు (ఎర్ర తామరలు).
14 అతని చేతులు వజ్రాలు పొదిగిన
బంగారు కడ్డీల సమానం
అతని శరీరం నీలాలు తాపిన నున్నటి
దంత దూలము వలెను,
15 అతని పాదాలు బంగారు దిమ్మమీది
పాలరాతి స్తంభాల వలెను,
అతని సుదీర్ఘ శరీరం లెబానోను పర్వతం మీది
నిటారైన దేవదారు వృక్షాన్ని తలపింపజేయును.
16 ఔనౌను, యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు అత్యంత వాంఛనీయుడు,
అతని అధరం పెదవి అత్యంత మధురం
అతనే నా ప్రియుడు,
నా ప్రాణ స్నేహితుడు.
యెరూషలేము స్త్రీలు ఆమెకు చెప్తారు
6 అతి సుందరవతీ,
ఎచ్చటికి వెళ్ళాడు నీ ప్రియుడు?
ఏ దిక్కు కెళ్లాడు?
నీ ప్రియుని సంగతి మాకు చెప్పు, వెదుకుటకు మేము నీకు తోడ్పడతాము.
ఆమె వారికిచ్చిన సమాధానం
2 సుగంధ పుష్పాల ఉద్యాన వనానికి నా ప్రియుడు వెళ్లాడు.
తన సుగంధాలు వెదజల్లు పూలమొక్కల తోటకు గొర్రెలు మేపడానికి వెళ్లాడు
3 నేను ఎర్రని పుష్పాల నడుమ గొర్రెలు మేపుతున్న నా ప్రియునిదానను.
నా ప్రియుడు నా వాడు.
క్రీస్తు బ్రతికి రావటం
15 సోదరులారా! నేను మీకు ప్రకటించిన సువార్తను విని దాన్ని సంపూర్ణంగా విశ్వసించారు. దాన్ని మీకు మళ్ళీ జ్ఞాపకం చెయ్యాలని నా ఉద్దేశ్యం. 2 నేను బోధించిన సువార్తను మీరు విడవకుండా అనుసరిస్తే అది మీకు రక్షణ కలిగిస్తుంది. లేనట్లయితే మీ విశ్వాసం వృధా అయిపోతుంది.
3 నేను పొందినదాన్ని మీకు మొదట అందించాను. లేఖనాల్లో వ్రాయబడిన విధంగా క్రీస్తు మన పాపాల నిమిత్తం మరణించాడు. 4 లేఖనాల్లో వ్రాయబడిన విధంగా ఆయన పాతిపెట్టబడి మూడవ రోజున బ్రతికింపబడ్డాడు. 5 పేతురుకు కనిపించాడు. ఆ తదుపరి పన్నెండు మందికి కనిపించాడు. 6 ఒకేసారి ఐదు వందల మందికి కనిపించాడు. వాళ్ళలో చాలా మంది ఇంకా జీవించివున్నారు. కొందరు మాత్రమే చనిపొయ్యారు. 7 ఆ తర్వాత ఆయన యాకోబుకు కనిపించాడు. అపొస్తలులందరికీ కనిపించాడు. 8 చివరకు అయోగ్యుడనైన నాకు కూడా కనిపించాడు.
9 ఎందుకంటే, అపొస్తలుల్లో నేను అధముణ్ణి. దేవుని సంఘాన్ని హింసించిన వాణ్ణి. కనుక అపొస్తలుడనని అనిపించుకోవటానికి కూడా అర్హుణ్ణి కాను. 10 కాని దేవుని దయవల్ల ఈ స్థాయిలో ఉన్నాను. ఆయన దయ వృథా కాలేదు. నేను వాళ్ళందరికన్నా కష్టించి పని చేసాను. ఇది నిజానికి నేను చెయ్యలేదు. దేవుని దయ నాతో ఈ పని చేయించింది. 11 నేను బోధించినా లేక వాళ్ళు బోధించినా మేమంతా ఒకటే బోధించాము. మీరు దాన్ని విశ్వసించారు.
© 1997 Bible League International