Revised Common Lectionary (Semicontinuous)
దావీదు కీర్తన.
23 యెహోవా నా కాపరి
నాకు కొరత ఉండదు
2 పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు.
ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు.
3 ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలం ప్రసాదిస్తాడు.
ఆయన నిజంగా మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను మంచితనపు మార్గాల్లో నడిపిస్తాడు.
4 చివరికి మరణాంధకారపు లోయలో నడిచినప్పుడు కూడా
నేను భయపడను. ఎందుకంటే, యెహోవా, నీవు నాతో ఉన్నావు.
నీ చేతికర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాయి కనుక.
5 యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాకు భోజనం సిద్ధం చేశావు.
నూనెతో నా తలను నీవు అభిషేకిస్తావు.
నా పాత్ర నిండి, పొర్లిపోతుంది.
6 నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో ఉంటాయి.
మరియు నేను ఎల్లకాలం యెహోవా ఆలయంలో నివసిస్తాను.
గొర్రెల మందవంటి ఇశ్రాయేలు
34 యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 2 “నరపుత్రుడా, నీవు నా తరఫున ఇశ్రాయేలు గొర్రెల కాపరులకు (పాలకులకు) వ్యతిరేకంగా మాట్లాడు. నా తరఫున వాళ్లతో మాట్లాడు. ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని వారికి తెలుపు: ‘ఇశ్రాయేలు కాపరులారా మీకు మీరే బాగా తింటున్నారు. అది మీకు చాలా హానికరం! ఓ కాపరులారా, మీరు మందను ఎందుకు మేపరు? 3 బాగా బలిసిన గొర్రెలను మీరు తింటారు. మీ దుస్తులకై వాటి ఉన్నిని వినియోగించుకుంటారు. బలిసిన గొర్రెలను మీరు చంపుతారు; కాని మందను మాత్రం మీరు మేపరు. 4 బలహీనంగా ఉన్న వాటిని మీరు బలంగా తయారు చేయలేదు. జబ్బు చేసిన గొర్రెల విషయమై మీరు శ్రద్ధ తీసుకోలేదు. గాయ పడిన గొర్రెలకు మీరు కట్టు కట్టలేదు. కొన్ని గొర్రెలు అటు ఇటు చెదరి వెళ్లిపోయాయి. అయినా మీరు వెళ్లి వాటిని తీసుకురాలేదు. తప్పిపోయిన గొర్రెలను వెదకటానికి మీరు వెళ్లలేదు. మీరు చాలా క్రూరులు, కఠినాత్ములు—ఆ రకంగా మీరు మందను నడిపించ ప్రయత్నించారు!
5 “‘కాపరిలేని కారణంగా ఇప్పుడు మంద చెల్లాచెదరై పోయింది. ప్రతి అడవి జంతువుకు అవి ఆహారమైనాయి. అలా అవి చిందర వందరై పోయాయి. 6 నా మంద ప్రతి పర్వతం మీద, ప్రతి కొందమీద తిరుగాడింది. నా మంద భూమిమీద అంతటా చెల్లాచెదరై పోయింది. వాటిని వెదకటానికి గాని, చూడటానికి గాని ఎవ్వరూ లేరు.’”
7 కావున ఓ గొర్రెల కాపరులారా! యెహోవా మాట వినండి. నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: 8 “నా జీవముతోడుగా మీకు నేనిలా మాట ఇస్తున్నాను. అడవి జంతువులు నా మందను పట్టుకున్నాయి. అవును, నా మంద అన్ని క్రూర జంతువులకూ ఆహారమయ్యింది. ఎందువల్లనంటే వాటికి నిజమైన కాపరిలేడు. నా గొర్రెల కాపరులు నా మంద విషయమై తగిన జాగ్రత్త తీసుకోలేదు. మరియు ఆ కాపరులు కేవలం నా మందను చంపుకు తిన్నారే గాని, దానిని మేపలేదు.”
9 అందువల్ల, ఓ కాపరులారా, యెహోవా మాట వినండి! 10 యెహోవా ఇలా చెపుతున్నాడు: “నేను ఆ కాపరులకు విరోధిని! నా గొర్రెల కొరకు నేను వారిని అడుగుతాను. నేను వారిని తీసివేస్తాను ఇక ఎంతమాత్రం వారు నా మందకు కాపరులుగా కొనసాగరు! దానితో వారు మందను చంపి తమ పొట్టను నింపుకోలేరు. వారి బారినుండి నా మందను నేను రక్షించుకోగలుగుతాను. అప్పుడు నా గొర్రెలు వారికి ఆహారం కాజాలవు.”
11 నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “నాకు నేనే వారికి కాపరిగా వ్యవహరిస్తాను. చెదరి పోయిన నా గొర్రెలను నేనే వెదకుతాను. నేను వాటి విషయమై జాగ్రత్త తీసుకుంటాను. 12 తన గొర్రెలు తప్పిపోయినప్పుడు ఒక కాపరి వాటి వెంట ఉంటే, అతడు వెళ్లి వాటికొరకు వెదకగలడు. అదే విధంగా, నేను నా గొర్రెల కొరకు వెదకుతాను. నేను నా గొర్రెలను రక్షించుకుంటాను. ఒకానొక ముసురు పట్టిన చీకటి రోజూ చెదరిపోయిన నా గొర్రెలను ఆయా ప్రాంతాల నుండి వెదకి తీసుకు వస్తాను. 13 ఆయా దేశాలనుండి వాటిని తిరిగి తీసుకొని వస్తాను. ఆ ప్రాంతాల నుండి వాటిని కూదీస్తాను. వాటి స్వదేశానికి వాటిని తీసుకొని వస్తాను. ఇశ్రాయేలు పర్వతాల పైన, సెలయేటి గట్ల మీద, ప్రజలు నివసించే అన్ని ప్రాంతాలలోను నేను వాటిని మేపుతాను. 14 నేను వాటిని పచ్చిక బీళ్లకు నడిపిస్తాను. ఇశ్రాయేలు కొండలశిఖరాల పైకి అవి వెళతాయి. అవి అక్కడ పచ్చిక మేసి, మంచి ప్రదేశంలో హాయిగా పండుకొంటాయి. ఇశ్రాయేలు పర్వతాల మీద మంచి పచ్చిక భూములలో అవి మేత మేస్తాయి. 15 అవును, నా మందను నేనే మేపుతాను. వాటిని ఒక విశ్రాంతి స్థలానికి నడిపిస్తాను.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
16 “పోయిన గొర్రెలను నేను వెదకుతాను. చెదరి పోయిన గొర్రెలను నేను తిరిగి తోలుకు వస్తాను. గాయపడిన గొర్రెలకు కట్లు కడతాను. నీరసపడిన గొర్రెలు బలపడేలా చేస్తాను. కాని ఆ బలిసిన, శక్తివంతమైన గొర్రెల కాపరులను మాత్రం నేను నాశనం చేస్తాను. వారికి అర్హమైన శిక్ష వారికి నేను విధిస్తాను.”
తప్పిపోయిన గొఱ్ఱె ఉపమానం
(మత్తయి 18:12-14)
15 ఒక రోజు పన్నులు వసూలు చేసే వాళ్ళు, పాపులు ఆయన చెప్పినవి వినటానికాయన చుట్టూ సమావేశమయ్యారు. 2 కాని పరిసయ్యులు, శాస్త్రులు, “ఇతడు పాపుల్ని పిలిచి వాళ్ళతో కలిసి తింటాడు” అని గొణిగారు.
3 అప్పుడు యేసు వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: 4 “మీలో ఒకని దగ్గర వంద గొఱ్ఱెలు ఉన్నాయనుకోండి. అందులో ఒక గొఱ్ఱె తప్పిపోతే అతడు తన తొంబది తొమ్మిది గొఱ్ఱెల్ని అక్కడ బయల్లో వదిలేసి ఆ తప్పిపోయిన గొఱ్ఱె దొరికేదాకా వెతకడా? 5 అది దొరికిన వెంటనే దాన్ని భుజాలపై మోసికొని ఆనందంతో 6 యింటికి వెళ్ళి తన స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచి, ‘తప్పిపోయిన నా గొఱ్ఱె దొరికింది. మనమంతా ఆనందించుదాం’ అని అంటాడు. 7 నేను చెప్పేదేమిటంటే అదేవిధంగా మారుమనస్సు పొందనవసరం లేని తొంభైతొమ్మిది మంది నీతిమంతుల విషయంలో కలిగె ఆనందంకన్నా పాపం చేసిన ఒక్కడు మారుమనస్సు పొందితే పరలోకంలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఆనందిస్తారు.
© 1997 Bible League International