Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ద్వితీయోపదేశకాండము 33-34

మోషే ప్రజలను ఆశీర్వదించటం

33 దైవజనుడైన మోషే తాను చనిపోకముందు ఇశ్రాయేలు ప్రజలకు యిచ్చిన ఆశీర్వాదం ఇది. మోషే చేప్పినది:

“యెహోవా సీనాయినుండి వచ్చెను.
    యెహోవా శేయీరులో ప్రభాత వెలుగులా ఉన్నాడు.
    ఆయన పారాను కొండ నుండి ప్రకాశించే వెలుగులా ఉన్నాడు.
యెహోవా 10,000 మంది పరిశుద్ధులతో వచ్చాడు.
    ఆయన కుడిచేతి వైపున దేవుని గొప్ప గొప్ప మహా సైనికులు ఉన్నారు.
అవును, యెహోవా తన ప్రజలను ప్రేమిస్తాడు.
    ఆయన పరిశుద్ధ ప్రజలంతా ఆయన చేతిలో ఉన్నారు.
వారు ఆయన అడుగుజాడల్లో నడుస్తారు.
    ప్రతి ఒక్కరూ ఆయన ప్రబోధాలు అంగీకరిస్తారు.
మోషే మనకు ధర్మశాస్త్రం యిచ్చాడు.
    అది యాకోబు ప్రజలందరికీ చెందుతుంది.
ప్రజలు, వారి నాయకులు
    సమావేశమైనప్పుడు యెషూరూనుకు[a] రాజు ఉన్నాడు.
    యెహోవాయే వారి రాజు.

రూబేనుకు ఆశీర్వాదాలు

“రూబేను మరణించక, జీవించునుగాక!
    ఆతని వంశంలో అనేకమంది ప్రజలు ఉందురు గాక!”

యూదాకు ఆశీర్వాదాలు

యూదా వంశం గూర్చి మోషే ఈ విషయాలు చెప్పాడు:

“యెహోవా, యూదా నాయకుడు సహాయం కోసం మొరపెట్టినప్పుడు ఆలకించు.
    అతణ్ణి తన ప్రజల దగ్గరకు చేర్చు.
అతణ్ణి బలంవతుణ్ణి చేయి. అతడు తన శత్రువులను ఓడించటానికి సహాయం చేయి!”

లేవీకి ఆశీర్వాదాలు

లేవీని గూర్చి మోషే ఇలా చెప్పాడు.

“నీ నిజమైన అనుచరుడు లేవీ ఊరీము, తుమ్మీమునకు[b] కాపలా ఉండేవాడు.
    నీ పత్యేక మనిషి వాటిని కాపాడుతాడు.
మస్సా దగ్గర నీవు లేవీ ప్రజలను పరీక్షించావు.
వాళ్లు నీ వాళ్లని (నిన్ను ప్రేమించుటకు) మెరీబా[c] నీళ్ల దగ్గర నీవు రుజువు చేసావు.
లేవీ తన తండ్రి, తల్లిని గూర్చి చెప్పాడు.
‘వారి విషయం నేను లెక్క చేయను’
అతడు తన సొంత సోదరులను స్వీకరించలేదు.
తన సొంత పిల్లల్ని తెలుసుకోలేదు.
లేవీయులు నీ మాటకు విధేయులయ్యారు
    నీ ఒడంబడికను నిలబెట్టారు.
10 యాకోబుకు[d] నీ నియమాలను ఇశ్రాయేలుకు నీ ధర్మశాస్త్రాన్ని వారు బోధిస్తారు.
వాళ్లు నీ యెదుట ధూపం వేస్తారు.
    నీ బలిపీఠం మీద పరిపూర్ణ దహన బలులు అర్పిస్తారు.

11 “యెహోవా, లేవీకి చెందిన వాటిని ఆశీర్వదించు
    అతడు జరిగించే వాటిని స్వీకరించు.
అతని మీద దాడి చేసే వాళ్లను నాశనం చేయి.”

బెన్యామీనుకు ఆశీర్వాదాలు

12 బెన్యామీను గూర్చి మోషే ఇలా చెప్పాడు.

“యెహోవా బెన్యామీనును ప్రేమిస్తున్నాడు.
    బెన్యామీను ఆయన చెంత క్షేమంగా జీవిస్తాడు.
అతనిని యెహోవా ఎల్లప్పుడూ కాపాడతాడు.
    మరియు యెహోవా అతని దేశంలో నివసిస్తాడు.”[e]

యోసేపుకు ఆశీర్వాదాలు

13 యోసేపును గూర్చి మోషే ఇలా చెప్పాడు:

“యెహోవా అతని దేశాన్ని ఆశీర్వదించును గాక.
    ఆకాశం నుండి శ్రేష్ఠమైన వాటితో
    భూమి క్రింద దాగి ఉన్న లోతైన ధన సంపదతో
14 సూర్యుని శ్రేష్ఠఫలాలతో
    నెల నెలా శ్రేష్ఠపంటలతో
15 ప్రాచీన పర్వతాల నుండి శ్రేష్ఠఫలాలతో
    కొండల్లో శాశ్వతంగా ఉంచబడే శ్రేష్ఠ పదార్థాలతో
16 భూమి నుండి శ్రేష్ఠమైన బహుమానాలు, దాని పూర్ణ ఆశీర్వాదాలతో,
మండుతూ ఉండే పొదలో నివాసం చేసే యెహోవా కటాక్షంతో,
    తన సోదరులనుంచి వేరుగావించబడ్డ యోసేపు తలమీద యోసేపు నడినెత్తి మీద ఆశీర్వాదం వచ్చునుగాక.
17 యోసేపు దొడ్డిలో మొట్టమొదట పుట్టిన ఎద్దుకు ఎంతో శోభ,
    ఈ ఎద్దు కొమ్ములు అడవి దున్నపోతు కొమ్ములంత పెద్దవిగా ఉంటాయి.
యోసేపు మందలు మనుష్యుల్ని తోసివేస్తాయి. అందర్నీ,
    భూదిగాంతాల వరకు తోసివేస్తాయి.
అవును, మనష్షేకు వేలాదిమంది ప్రజలు ఉన్నారు,
    అవును, ఎఫ్రాయిముకు పది వేలమంది ప్రజలు ఉన్నారు.”

జెబూలూనుకు, ఇశ్శాఖారుకు ఆశీర్వాదాలు

18 జెబూలూను గూర్చి మోషే చెప్పినది:

“జెబూలూనూ, నీవు బయటకు వెళ్లినప్పుడు,
ఇశ్శాఖారూ, నీ యింటివద్ద నీ గుడారాలలో సంతోషంగా ఉండు.
19 వారు తమ ప్రజలను కొండకు (కర్మెలు) పిలుస్తారు.
    అక్కడ వారు సరైన బలులు అర్పిస్తారు.
ఎందుకంటే, సముద్రాల్లోని సమృద్ధిని వారు తీసుకొంటారు.
    ఇసుకలో దాగి ఉన్న ఐశ్వర్యాలను మీరు తీసుకుంటారు గనుక.”

గాదుకు ఆశీర్వాదాలు

20 గాదును గూర్చి మోషే ఇలా చెప్పాడు:

“గాదును విశాలపర్చే దేవునికి స్తోత్రాలు!
గాదు సింహంలా పడుకుంటాడు,
    చేతిని, నడినెత్తిని చీల్చేస్తాడు.
21 శ్రేష్ఠభాగం అతడు తనకోసం ఎంచుకుంటాడు
    అక్కడ రాజభాగం అతనికి ఉంచబడుతుంది.
ప్రజానాయకులు అతని దగ్గరకు వస్తారు ఇశ్రాయేలీయుల యెడల అతడు దయ చూపుతాడు.
    యెహోవా దృష్టికి మంచివాటిని అతడు చేస్తాడు
    యెహోవా అతని పక్షంగా తీర్పుతీరుస్తాడు.”

దానుకు ఆశీర్వాదాలు

22 దాను గూర్చి మోషే ఇలా చెప్పాడు:

“దాను బాషాను నుండి దూకే సింహపు పిల్ల.”

నఫ్తాలీకి ఆశీర్వాదాలు

23 నఫ్తాలీ గూర్చి మోషే ఇలా చెప్పాడు.

“నఫ్తాలీ, నీవు దయపొంది తృప్తిగా ఉన్నావు,
    యెహోవా ఆశీర్వాదాలతో నిండిపోయావు,
(గలలీ) పశ్చిమ, దక్షిణాల భూమిని నీవు తీసుకో.”

ఆషేరుకు ఆశీర్వాదాలు

24 ఆషేరును[f] గూర్చి మోషే ఇలా చెప్పాడు:

“కుమారులలో ఆషేరు అత్యధికంగా ఆశీర్వదించబడినవాడు;
    అతణ్ణి తన సోదరులకు ప్రియమైన వాడ్నిగా ఉండనియ్యండి.
    అతణ్ణి తన పాదాలు తైలముతో కడుగుకోనివ్వండి.
25 నీ తాళాలు యినుపవి, యిత్తడిని,
    నీ బలం జీవితం అంతా ఉంటుంది.”

మోషే దేవుణ్ణి స్తుతించుట

26 “ఓ యెషూరూనూ, దేవునివంటి వాడు ఎవ్వరూ లేరు.
దేవుడు తన మహిమతో నీకు సహాయం చేసేందుకు.
    మేఘాల మీద ఆకాశంలో విహరిస్తాడు.
27 నిత్యుడైన దేవుడు
    నీకు భద్రతా స్థలం.
శాశ్వతంగా ఆదుకునే హస్తాలు
    నీక్రింద ఉన్నాయి.
దేవుడు శత్రువును నీదగ్గర నుండి వెళ్లగొట్టేస్తాడు.
‘శత్రువును నాశనం చేయి’ అంటాడు.
28 కనుక ఇశ్రాయేలు క్షేమంగా జీవిస్తాడు,
    ధాన్యం, ద్రాక్షారసం ఉండే దేశంలో
యాకోబు ఊట క్షేమంగా ఉంటుంది.
    అవును, అతని ఆకాశం మంచును కురిపిస్తుంది.
29 ఇశ్రాయేలూ, నీవు సంతోషంగా ఉన్నావు.
    యెహోవా చేత రక్షించబడిన దేశంగా నీవలె ఏ దేశమూ లేదు.
యెహోవాయే నీకు సహాయం చేసేవాడు.
    నీ విజయానికి యెహోవాయే ఖడ్గం.
    నీ శత్రువులు నీకు విధేయులై వస్తారు.
వారి అబద్ధపు దేవతల పూజా స్థలాల
    మీద మీరు నడుస్తారు.”

మోషే మరణించటం

34 మోషే మోయాబు పల్లపు ప్రాంతాల నుండి యెరికో లోయలోని నెబో కొండ మీద పిస్గా శిఖరం మీదికి వెళ్లాడు. గిలాదునుండి దానువరకు దేశం మొత్తం యెహోవా మోషేకు చూపించాడు. ఎఫ్రాయిము, మనష్షేల దేశం అంతా, నఫ్తాలీ అంతా యెహోవా అతనికి చూపించాడు. యూదా దేశం మధ్యదరా సముద్రం వరకు ఆయన అతనికి చూపించాడు. నెగెవు ప్రాంతాన్ని, సోయెరు నుండి ఈతచెట్ల పట్టణం యెరికోకు పోయే లోయ అంతా మోషేకు యెహోవా చూపించాడు. “అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను వాగ్దానంచేసిన దేశం యిదే. ‘మీ సంతతివారికి ఈ దేశం నేను యిస్తాను’ అని వారితో నేను చెప్పాను. నిన్ను ఆ దేశం చూడనిచ్చాను, నీవు అక్కడికి వెళ్లలేవు” అని మోషేతో యెహోవా చెప్పాడు.

అప్పుడు యెహోవా సేవకుడు మోషే అక్కడ మోయాబు దేశములో చనిపోయాడు. ఇలా జరుగుతుందని యెహోవా మోషేతో ముందే చెప్పాడు. బెత్పెయోరు అవతల మోయాబు దేశంలోని లోయలో యెహోవా మోషేను పాతి పెట్టాడు. అయితే మోషే సమాధి ఎక్కడ ఉందో ఈ రోజువరకు ఎవరికీ తెలియదు. మోషే చనిపోయినప్పుడు అతని వయస్సు 120 సంవత్సరాలు. అతని కళ్లు మసక కాలేదు. అతడు ఇంకా బలంగానే ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మోయాబు పల్లపు ప్రాంతాల్లో 30 రోజుల పాటు మోషే కోసం ఏడ్చారు. ఇది పూర్తి సంతాప దినాల సమయము.

యెహోషువ క్రొత్త నాయకుడవటం

అప్పుడు నూను కుమారుడైన యెహోషువ మీద మోషే చేతులు పెట్టిన కారణంగా యెహోషువ జ్ఞానాత్మతో పూర్తిగా నిండిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ మాట విన్నారు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించినట్టు వారు చేసారు.

10 కాని ఆ సమయమునుండి మళ్లీ మోషేవంటి ప్రవక్త జన్మించలేదు. యెహోవా దేవునికి మోషే ముఖాముఖిగా తెలుసు. 11 ఈజిప్టు దేశంలో యెహోవా చేత పంపబడి మోషే చేసిన అద్భుతాలు, మహాత్కార్యాలు, ఏ ప్రవక్తా ఎన్నడూ చేయలేదు. ఆ అద్భుతాలు, మహాత్కార్యాలు ఈజిప్టులో ఫరోకు, అతని సేవకులందరికీ, ప్రజలందరికి చూపించబడ్డాయి. 12 మోషే చేయగా ఇశ్రాయేలు ప్రజలంతా చూసిన ఆ శక్తివంతమైన ఆశ్చర్యకార్యాలు ఏ ప్రవక్తా ఎన్నడూ చేయలేదు.

కీర్తనలు. 119:145-176

ఖాఫ్

145 యెహోవా, నా హృదయపూర్తిగా నేను నీకు మొరపెడ్తున్నాను.
    నాకు జవాబు ఇమ్ము. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను.
146 యెహోవా, నేను నీకు మొరపెట్టుతున్నాను. నన్ను రక్షించుము.
    నేను నీ ఒడంబడికకు విధేయుడనవుతాను.
147 యెహోవా, నిన్ను ప్రార్థించుటకు నేను వేకువనే మేల్కొన్నాను. నీ మాటకోసం నేను వేచియుంటాను.
    నీవు చెప్పేవాటియందు నేను నమ్మకముంచుతాను.
148 నీ వాక్యాన్ని ధ్యానించుటకు
    నేను చాలా రాత్రివరకు మెళకువగా ఉన్నాను.
149 నీవు దయతో నా మాట విను.
    యెహోవా, నీ న్యాయ శాస్త్రానుసారముగా నన్ను జీవింపనిమ్ము.
150 మనుష్యులు నాకు విరోధంగా కీడు పథకాలు వేస్తున్నారు.
    యెహోవా, ఆ మనుష్యులు నీ ఉపదేశాలను అనుసరించరు.
151 యెహోవా, నీవు నాకు సన్నిహితంగా ఉన్నావు.
    నీ ఆజ్ఞలు అన్నీ నమ్మదగినవి.
152 నీ ఉపదేశాలు శాశ్వతంగా కొనసాగుతాయని
    చాలా కాలం క్రిందట నీ ఒడంబడిక నుండి నేను నేర్చుకొన్నాను.

రేష్

153 యెహోవా, నా శ్రమను చూచి, నన్ను తప్పించుము.
    నీ ఉపదేశాలను నేను మరువలేదు.
154 యెహోవా, నాకోసం నా పోరాటం నీవు పోరాడి, నన్ను రక్షించుము.
    నీ వాగ్దానం ప్రకారం నన్ను జీవించనిమ్ము.
155 దుష్టులు జయించరు. ఎందుకంటే,
    వారు నీ న్యాయ చట్టాలను అనుసరించరు.
156 యెహోవా, నీవు చాలా దయగలవాడవు.
    నీవు చెప్పే సరియైన వాటిని చేసి, నన్ను జీవించనిమ్ము
157 నన్ను బాధించుటకు ప్రయత్నిస్తున్న శత్రువులు నాకు చాలామంది ఉన్నారు.
    కాని నేను మాత్రం నీ ఒడంబడికను అనుసరించటం ఆపివేయలేదు.
158 ఆ ద్రోహులను నేను చూస్తున్నాను.
    ఎందుకంటే యెహోవా, వారు నీ మాటకు విధేయులు కారు.
159 చూడుము, నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను.
    యెహోవా, నీ ప్రేమ అంతటితో నన్ను జీవించనిమ్ము.
160 యెహోవా, ఆది నుండి నీ మాటలు అన్నీ నమ్మదగినవి.
    నీ మంచి ధర్మశాస్త్రం శాశ్వతంగా నిలుస్తుంది.

షీన్

161 ఏ కారణం లేకుండానే బలమైన నాయకులు నా మీద దాడి చేశారు.
    కాని నేను మాత్రం నీ ధర్మశాస్త్రానికే భయపడి, దాన్ని గౌరవిస్తాను.
162 యెహోవా, అప్పుడే ఐశ్వర్యపు నిధి దొరకిన వానికి ఎంత సంతోషమో,
    నీ వాక్యం నన్ను అంత సంతోష పరుస్తుంది.
163 అబద్ధాలంటే నాకు అసహ్యం! నేను వాటిని తృణీకరిస్తాను.
    యెహోవా, నీ ఉపదేశాలు నాకు ఇష్టం.
164 నీ మంచి న్యాయ చట్టాలను బట్టి
    నేను రోజుకు ఏడుసార్లు నిన్ను స్తుతిస్తాను.
165 నీ ఉపదేశాలను ప్రేమించే మనుష్యులకు నిజమైన శాంతి లభిస్తుంది.
    ఆ మనుష్యులను ఏదీ పడగొట్టలేదు.
166 యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను కనిపెడ్తున్నాను.
    నేను నీ ఆజ్ఞలకు విధేయుడనయ్యాను.
167 నేను నీ ఒడంబడికను అనుసరించాను.
    యెహోవా, నీ న్యాయ చట్టాలు అంటే నాకు ఎంతో ప్రేమ.
168 నీ ఒడంబడికకు, నీ ఆజ్ఞలకు నేను విధేయుడనయ్యాను.
    యెహోవా, నేను చేసింది ప్రతిది నీకు తెలుసు.

తౌ

169 యెహోవా, నా సంతోష గీతం ఆలకించుము.
    నీ వాగ్దాన ప్రకారం నన్ను జ్ఞానం గలవానిగా చేయుము.
170 యెహోవా, నా ప్రార్థన వినుము.
    నీవు వాగ్దానం చేసినట్టే, నన్ను రక్షించుము.
171 నీవు నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించావు
    కనుక నేను స్తుతి గీతాలతో ఉప్పొంగిపోతాను.
172 నీ మాటలకు నన్ను జవాబు చెప్పనిమ్ము.
    నా పాట నన్ను పాడనిమ్ము. యెహోవా, నీ న్యాయచట్టాలన్నీ మంచివి.
173 నేను నీ ఆజ్ఞలను అనుసరించాలని నిర్ణయించుకొన్నాను
    గనుక నన్ను ఆదుకొని, నాకు సహాయం చేయుము.
174 యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను కోరుతున్నాను.
    కాని నీ ఉపదేశాలు నన్ను సంతోష పరుస్తాయి.
175 యెహోవా, నన్ను జీవించనిమ్ము. నిన్ను స్తుతించనిమ్ము.
    నీ న్యాయ చట్టాలు నాకు సహాయం చేయనిమ్ము.
176 నేను తప్పిపోయిన గొర్రెలా తిరిగాను.
    యెహోవా, నా కోసం వెదకుతూ రమ్ము.
నేను నీ సేవకుడను.
    మరియు నేను నీ ఆజ్ఞలను మరువలేదు.

యెషయా 60

దేవుడు వస్తున్నాడు

60 “నా వెలుగైన యెరూషలేమా లెమ్ము!
    నీ వెలుగు (దేవుడు) వస్తున్నాడు. యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తుంది.
ఇప్పుడు భూమిని,
    దాని ప్రజలను చీకటి ఆవరించి ఉంది.
కానీ యెహోవా నీ మీద ప్రకాశిస్తాడు.
    నీ చుట్టూరా ఆయన మహిమను ప్రజలు చూస్తారు.
ఆ సమయంలో రాజ్యాలు నీ వెలుగు (దేవుడు) దగ్గరకు వస్తాయి.
    ప్రకాశవంతమైన నీ వెలుగు దగ్గరకు రాజులు వస్తారు.
నీ చుట్టూ చూడు,
    చూడు ప్రజలు చూట్టూ చేరి, నీ దగ్గరకు వస్తున్నారు.
ఆ ప్రజలు దూరం నుండి వస్తున్న నీ కుమారులు.
    మరియు వారితో నీ కుమార్తెలు వస్తున్నారు.

“భవిష్యత్తులో ఇది సంభవిస్తుంది. ఆ సమయంలో నీ ప్రజలను నీవు చూస్తావు.
    ఆనందంతో మీ ముఖాలు ప్రకాశిస్తాయి.
మొదట, మీరు భయపడతారు,
    కానీ తర్వాత మీరు సంబరపడతారు.
సముద్రాల ఆవలి రాజ్యాల ఐశ్వర్యాలన్నీ నీ ముందు ఉంచబడతాయి.
    రాజ్యాల ఐశ్వర్యాలు నీకు సంక్రమిస్తాయి.
మిద్యాను, ఏయిఫాల నుండి ఒంటెల మందలు
    నీ దేశంలో నిండిపోతాయి.
షేబనుండి ఒంటెలు బారులు తీరి వస్తాయి.
    బంగారం, బోళం అవి తెస్తాయి.
ప్రజలు యెహోవాకు స్తుతులు పాడతారు.
కేదారు గొర్రెలు అన్నీ నీకు ఇవ్వబడుతాయి.
    నెబాయోతు పొట్టేళ్లు నీకోసం తీసుకొని రాబ డతాయి.
అవి నా బలిపీఠం మీద స్వీక రించదగిన బలి అర్పణలవుతాయి.
    ఆశ్చర్యకరమైన నా ఆలయాన్ని నేను ఇంకా అందంగా తీర్చిదిద్దుతాను.
ప్రజలను చూడు!
    ఆకాశాన్ని వేగంగా దాటిపోయే మేఘాల్లా వారు త్వరపడుతున్నారు.
    వాటి గూళ్లకు ఎగిరిపోతున్న పావురాల్లా ఉన్నారు వారు
దూర దేశాలు నాకోసం కనిపెడ్తున్నాయి.
    తర్షీషు మహా ఓడలు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి.
దూర దేశాలనుండి నీ పిల్లలను తీసుకొని వచ్చేందుకు ఆ ఓడలు సిద్ధంగా ఉన్నాయి.
    మరియు వారి వెండి బంగారాలను ఆ ఓడలు తీసుకొని వస్తాయి.
    నీ దేవుడు యెహోవాను గౌరవించుటకు ఇది జరుగుతుంది.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు అద్భుత కార్యాలు చేస్తాడు గనుక ఇది జరుగుతుంది.
10 ఇతర దేశాలనుండి వచ్చిన పిల్లలు నీ గోడలను తిరిగి నిర్మిస్తారు.
    వారి రాజులు నిన్ను సేవిస్తారు.

“నేను కోపగించినప్పుడు, నేను నిన్ను బాధించాను.
    కానీ ఇప్పుడు, నేను నీకు దయచూపించ గోరుతున్నాను.
    కనుక నేను నిన్ను ఆదరిస్తాను.
11 నీ ద్వారాలు ఎల్లప్పుడూ తెరచి ఉంటాయి.
    రాత్రిగాని పగలుగాని అవి మూయబడవు.
రాజులు, రాజ్యాలు వారి ఐశ్వర్యాలను నీకు తీసుకొని వస్తారు.
12 కొన్ని దేశాలు, రాజ్యాలు నిన్ను సేవించవు. కానీ ఆ దేశాలు, రాజ్యాలు పాడైపోయి, నాశనం అవుతాయి.
13 లెబానోనులోని గొప్పవన్నియు నీకు ఇవ్వబడుతాయి.
    దేవదారు, సరళ, గొంజి వృక్షాలను ప్రజలు నీ వద్దకు తీసుకొని వస్తారు.
నా పరిశుద్ధ ఆలయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు
    నీవు ఈ వృక్షాలను ఉపయోగిస్తావు.
(ఈ స్థలం నా సింహాసనం ఎదుట పాదపీఠంలా ఉంటుంది.
    నేను దానికి చాలా ఘనత ఇస్తాను.)
14 గతంలో ప్రజలు నిన్ను బాధించారు.
    ఆ ప్రజలు నీ ఎదుట సాష్టాంగపడతారు.
గతంలో ప్రజలు నిన్ను ద్వేషించారు.
    ఆ ప్రజలు నీ పాదాల దగ్గర సాగిలపడతారు.
‘యెహోవా పట్టణం’ అని ‘ఇశ్రాయేలు పరిశుద్ధుని సీయోను’ అనీ ఆ ప్రజలు నిన్ను పిలుస్తారు.

15 “నీవు మళ్లీ ఎన్నటికీ ఒంటరిగా విడువబడవు.
    నీవు మరల ఎన్నడు ద్వేషించబడవు. నీవు మరల ఎన్నడూ ఖాళీగా ఉండవు.
నిన్ను నేను శాశ్వతంగా గొప్ప చేస్తాను.
    నీవు ఎప్పటికి, శాశ్వతంగా సంతోషిస్తావు.
16 నీకు అవసరమైన వస్తువులను రాజ్యాలు నీకు ఇస్తాయి.
    అది ఒక బిడ్డ తన తల్లి దగ్గర పాలు తాగినట్టుగా ఉంటుంది.
నీవైతే రాజులనుండి ఐశ్వర్యాలను త్రాగుతావు.
    అప్పుడు, నిన్ను రక్షించు యెహోవాను నేనే అని నీవు తెలుసు కొంటావు.
    యాకోబు యొక్క మహా గొప్పవాడు నిన్ను కాపాడును అని నీవు తెలుసుకొంటావు.

17 “ఇప్పుడు నీకు ఇత్తడి ఉంది.
    నేను నీకు బంగారం తెస్తాను.
ఇప్పుడు నీకు ఇనుము ఉంది,
    నేను నీకు వెండి తెస్తాను.
నీ చెక్కను నేను ఇత్తడిగా మార్చేస్తాను.
    నీ బండలను ఇనుముగా నేను మార్చేస్తాను.
నీ శిక్షను నేను శాంతిగా మార్చేస్తాను.
ఇప్పుడు ప్రజలు నిన్ను బాధిస్తున్నారు.
    కానీ ప్రజలు నీకు మంచి కార్యాలు చేస్తారు.
18 ప్రజలు మరల ఎన్నడూ నీ ఎడల నీచంగా ఉండరు.
నీ దేశంలో నీ దగ్గర్నుండి
    ప్రజలు మరల ఎన్నడూ దొంగిలించరు.
‘రక్షణ’ అని నీ గోడలకు నీవు పేరుపెడతావు.
    ‘స్తుతి’ అని నీ ద్వారాలకు నీవు పేరుపెడతావు.

19 “ఇంకెంత మాత్రం పగలు సూర్యుడు నీకు వెలుగుగా ఉండడు.
    చంద్రకాంతి ఇంకెంత మాత్రం నీకు వెలుగుగా ఉండదు. ఎందుకు?
ఎందుకంటే యెహోవాయే నీకు శాశ్వత వెలుగుగా ఉంటాడు.
    నీ దేవుడే నీ మహిమ.
20 నీ ‘సూర్యుడు’ ఇక ఎన్నటికీ అస్తమించడు.
    నీ ‘చంద్రుడు’ ఇక ఎన్నటికీ చీకటిగా ఉండడు. ఎందుకు?
ఎందుకంటే యెహోవా నీకు శాశ్వత వెలుగుగా ఉంటాడు.
    మరియు నీ దుఃఖకాలం అంతం అవుతుంది.

21 “నీ ప్రజలు అందరూ మంచివారుగా ఉంటారు.
    ఆ ప్రజలు భూమిని శాశ్వతంగా పొందుతారు.
నేనే ఆ ప్రజలను చేశాను.
    నా స్వహస్తాలతో నేనే చేసిన అద్భుతమైన మొక్క వారు.
22 అతి చిన్న కుటుంబం ఒక పెద్ద వంశం అవుతుంది.
    కడసారపు వ్యక్తి ఒక బలమైన రాజ్యం అవుతాడు.
సమయం సరిగ్గా ఉన్నప్పుడు,
    యెహోవానను నేను త్వరగా వస్తాను.
    నేను ఈ సంగతులను జరిగిస్తాను.”

మత్తయి 8

యేసు రోగిని నయం చేయటం

(మార్కు 1:40-45; లూకా 5:12-16)

యేసు కొండదిగి రాగా, ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు. కుష్టురోగంతో ఉన్న వాడొకడు వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “మీరు తలచుకొంటే నన్ను బాగుచెయ్యగలరు” అని అన్నాడు.

యేసు తన చేయి చాపి అతణ్ణి తాకుతూ, “నీకు బాగు కావాలని కోరుతున్నాను, స్వస్థుడవుకమ్ము!” అని అన్నాడు. వెంటనే అతనికి నయమైపోయింది. అప్పుడు యేసు అతనితో, “ఈ సంఘటనను గురించి ఎవ్వరికీ చెప్పకు. కాని యాజకుని దగ్గరకు వెళ్ళి నీ దేహాన్ని చూపి, మోషే ఆజ్ఞాపించిన కానుకను అర్పించు. తద్వారా నీకు నయమైనట్లు వాళ్ళకు రుజువౌతుంది” అని అన్నాడు.

యేసు శతాధిపతి సేవకుని నయం చేయటం

(లూకా 7:1-10; యోహాను 4:43-54)

యేసు కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాక శతాధిపతి ఒకడు ఆయన దగ్గరకు వచ్చి, ఆయన సహాయం కావాలని కోరుతూ, “ప్రభూ! నా సేవకుడు పక్షవాతం వచ్చి యింట్లో పడుకొని ఉన్నాడు. వానికి చాలా బాధ కలుగుతోంది” అని అన్నాడు.

యేసు, “నేను వచ్చి నయం చేస్తాను” అని అన్నాడు.

కాని శతాధిపతి సమాధానంగా, “ప్రభూ! మీరు మా యింటి గడపలో కాలు పెట్టటానికి కూడా నేను అర్హుడను కాను. కాని మీరు మాటంటే చాలు, నా సేవకునికి నయమైపోతుంది. ఎందుకంటే, నేను కూడా అధికారుల క్రింద ఉన్నవాణ్ణి. నా క్రింద కూడా సైనికులున్నారు. నేను ఈ సైనికునితో ‘వెళ్ళు’ అంటే వెళ్తాడు; ఆ సైనికునితో ‘రా’ అంటే వస్తాడు. నా సేవకునితో ‘ఇది చేయి’ అంటే చేస్తాడు” అని అన్నాడు.

10 యేసు ఇది విని ఆశ్చర్యపొయ్యాడు. ఆయన తన వెంట వస్తున్న వాళ్ళతో, “ఇది సత్యం. ఇంత గొప్ప విశ్వాసమున్న వ్యక్తి నాకు ఇశ్రాయేలీయులలో ఎవ్వరూ కనిపించలేదు. 11 నేను చెప్పెదేమిటంటే, తూర్పునుండి, పడమరనుండి, చాలామంది ప్రజలు వస్తారు. వచ్చి, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో కలిసి దేవుని రాజ్యంలో జరిగే విందులో పాల్గొంటారు. 12 కాని దేవుడు తన రాజ్యానికి తమ పుట్టుకవల్ల వారసులైన వాళ్ళను అవతల దూరంగా చీకట్లో పారవేస్తాడు. అక్కడ వాళ్ళు ఏడుస్తూ బాధననుభవిస్తారు.”

13 ఇలా అని, యేసు శతాధిపతితో, “వెళ్ళు! నీవు విశ్వసించినట్లే జరుగుతుంది” అని అన్నాడు. అదే క్షణంలో అతని సేవకునికి నయమైపోయింది.

యేసు అనేకులను నయం చేయటం

(మార్కు 1:29-34; లూకా 4:38-41)

14 యేసు పేతురు యింటికి వచ్చి పేతురు అత్త జ్వరంతో మంచం పట్టి ఉండటం చూసాడు. 15 ఆయన ఆమె చేతిని తాకగానే, జ్వరం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. ఆమె లేచి ఆయనకు సపర్యలు చెయ్యటం మొదలుపెట్టింది.

16 ప్రజలు సాయంత్రం కాగానే, దయ్యాలు పట్టిన వాళ్ళను చాలా మందిని యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. ఆయన ఒక మాటతో దయ్యాల్ని వదిలించాడు. రోగాలున్న వాళ్ళందరికి నయం చేసాడు. 17 యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన ఈ మాటలు నిజం కావటానికి ఇలా జరిగింది:

“మన రోగాల్ని ఆయన తనపై వేసుకొన్నాడు. మన బాధల్ని ఆయన అనుభవించాడు.”(A)

యేసును వెంబడించటం

(లూకా 9:57-62)

18 యేసు తన చుట్టూ ఉన్న ప్రజల గుంపును చూసి, తన శిష్యులతో సరస్సు అవతలి వైపుకు వెళ్ళండని అన్నాడు. 19 అప్పుడు శాస్త్రుడొకడు ఆయన దగ్గరకు వచ్చి, “బోధకుడా! మీరెక్కడికి వేళ్తే నేనక్కడికి వస్తాను” అని అన్నాడు.

20 యేసు, “నక్కలు దాక్కోవటానికి బిలములున్నాయి. గాలిలో ఎగిరే పక్షులు ఉండటానికి గూళ్ళున్నాయి. కాని మనుష్యకుమారుడు తల వాల్చటానికి కూడ స్థలం లేదు” అని అతనితో అన్నాడు.

21 మరొక శిష్యుడు, “ప్రభూ! మొదట నా తండ్రిని సమాధి చేసుకోనివ్వండి” అని అన్నాడు.

22 యేసు అతనితో, “చనిపోయిన తమ వాళ్ళను చనిపోయే వాళ్ళు సమాధి చేసుకోనిమ్ము! నీవు నన్ను అనుసరించు!” అని అన్నాడు.

యేసుని శిష్యులు ఆయన శక్తిని చూడటం

(మార్కు 4:35-41; లూకా 8:22-25)

23 యేసు పడవనెక్కాడు. ఆయన శిష్యులు ఆయన్ని అనుసరించారు. 24 అకస్మాత్తుగా ఒక పెద్ద తుఫాను ఆ సరస్సు మీదికి రావటం వల్ల ఆ పడవ అలల్లో చిక్కుకు పోయింది. ఆసమయంలో యేసు నిద్రపోతూ ఉన్నాడు. 25 శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని నిద్రలేపుతూ, “ప్రభూ! రక్షించండి. మునిగిపోతున్నాము!” అని అన్నారు.

26 యేసు, “మీ విశ్వాసం ఏమైంది? ఎందుకు భయపడుతున్నారు?” అని అంటూ లేచి గాలిని, అలల్ని శాంతించమని ఆజ్ఞాపించాడు. అవి శాంతించాయి.

27 వాళ్ళు ఆశ్చర్యపడి, “ఈయనేలాంటి వాడు? గాలి, అలలు కూడా ఈయన మాట వింటున్నాయే!” అని అన్నారు.

దయ్యం పట్టిన యిద్దరిని నయం చేయటం

(మార్కు 5:1-20; లూకా 8:26-39)

28 యేసు, సరస్సు ఆవలి పైపుననున్న గదరేనీయుల ప్రాంతాన్ని చేరుకున్నాడు. దయ్యాలు పట్టిన మనుష్యులిద్దరు స్మశానం నుండి వచ్చి ఆయన్ని కలుసుకొన్నారు. వీళ్ళ క్రూర ప్రవర్తన వల్ల ఆ దారిమీద ఎవ్వరూ వెళ్ళేవాళ్ళు కారు. 29 అవి, “దేవుని కుమారుడా! మాకేం చెయ్యాలని వచ్చావు తగిన సమయం రాకముందే మమ్మల్ని శిక్షించాలని యిక్కడికి వచ్చారా?” అని బిగ్గరగా అన్నాయి.

30 వాళ్ళకు కొంత దూరంలో ఒక పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది. 31 ఆ దయ్యాలు యేసుతో, “మీరు మమ్మల్ని వెళ్ళగొట్టాలని అనుకొంటే ఆ పందుల గుంపులోకి పంపండి” అని ప్రాధేయపడ్డాయి.

32 ఆయన వాటితో, “వెళ్ళండి!” అని అన్నాడు. అందువల్ల అవి వెలుపలికి వచ్చి ఆ పందుల్లోకి ప్రవేశించాయి. ఆ పందుల గుంపంతా నిటారుగా ఉన్న కొండ మీదనుండి జారి సరస్సులో పడి చనిపొయ్యాయి. 33 ఆ పందుల్ని కాస్తున్న వాళ్ళు అక్కడి నుండి పరుగెత్తి గ్రామంలోకి వెళ్ళి జరిగిందంతా, అంటే ఆ దయ్యం పట్టిన వాళ్ళకేమైందో అంతా చెప్పారు. 34 ఇది విని ఆ గ్రామమంతా యేసును కలవటానికి వచ్చింది. వాళ్ళాయన్ని చూసాక తమ పరిసరాల్ని వదిలి వెళ్ళమని ఆయనను ప్రాధేయపడ్డారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International