సంఖ్యాకాండము 20:1-13
Telugu Holy Bible: Easy-to-Read Version
మిర్యాము మరణము
20 మొదటి నెల ఇశ్రాయేలు ప్రజలు సీను అరణ్యానికి వచ్చారు. ప్రజలు కాదేషులో నివాసం చేసారు. మిర్యాము చనిపోయి, అక్కడే పాతి పెట్టబడింది.
మోషే పొరబాటు
2 ఆ స్థలంలో ప్రజలకు చాలినంతగా నీళ్లు లేవు. కనుక ప్రజలు మోషే, అహరోనులతో ఫిర్యాదు చేయటానికి సమావేశమయ్యారు. 3 ప్రజలు మోషేతో వాదించారు. వారు ఇలా అన్నారు: “ఒక వేళ మా సోదరుల్లా మేము కూడా యెహోవా ఎదుట మరణించి ఉంటేబాగుండేది. 4 యెహోవా ప్రజలను నీవు ఈ అరణ్యంలోనికి ఎందుకు తీసుకొచ్చావు? మేమూ, మా పశువులూ ఇక్కడే చావాలని కోరుతున్నావా? 5 ఈజిప్టు నుండి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఈ పనికిమాలిన చోటుకు మమ్మల్ని నీవెందుకు తీసుకువచ్చావు? ఇక్కడ ధాన్యం లేదు. అంజూరపు పండ్లు, ద్రాక్షాపండ్లు, దానిమ్మ పండ్లు ఏమీ లేవు. కనీసం తాగటానికి నీళ్లు కూడ లేవు.”
6 కనుక మోషే, అహరోను ఆ జనాన్ని విడిచి, సన్నిధి గుడార ద్వారం దగ్గరకు వెళ్లారు. వారు సాష్టాంగపడగా యెహోవా మహిమ ప్రత్యక్షమయింది.
7 యెహోవా మోషేతో మాట్లాడాడు: 8 “నీ సోదరుడు అహరోనును, ఈ జనాన్ని తీసుకుని ఆ బండ దగ్గరకు వెళ్లు నీ కర్ర కూడా తీసుకుని వెళ్లు. ఆ బండ ఎదుట ప్రజలతో మాట్లాడు. అప్పుడు ఆ బండనుండి నీళ్లు ప్రవహిస్తాయి. అప్పుడు ప్రజలకు, పశువులకు నీవు ఆ నీళ్లు ఇవ్వవచ్చును” అన్నాడు ఆయన.
9 కనుక యెహోవా చెప్పిన ప్రకారం మోషే ఆయన ఎదుటనుండి కర్ర తీసుకున్నాడు. 10 అప్పుడు ప్రజలంతా ఆ బండ ముందు సమావేశం కావాలని మోషే, అహరోను వారితో చెప్పారు. అప్పుడు మోషే, “మీరు ఎప్పుడూ సణుగుతున్నారు. ఇప్పుడు నా మాటవినండి. ఈ బండలోనుండి నీళ్లు వచ్చేటట్టు మేము చేస్తాము” అన్నాడు. 11 మోషే తన చేయి పై కెత్తి రెండుసార్లు ఆ బండను కొట్టాడు. బండనుండి నీళ్లు ప్రవహించటం మొదలయ్యింది. ప్రజలు, పశువులు ఆ నీళ్లు త్రాగారు.
12 అయితే మోషే, అహరోనులతో యెహోవా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలంతా చుట్టూచేరారు. కానీ మీరు నాకు ఘనత చూపలేదు. నీళ్లను ప్రవహింప జేసిన శక్తి నా దగ్గరనుండి వచ్చిందని ఇశ్రాయేలు ప్రజలకు మీరు చూపించలేదు. మీరు నన్ను నమ్ముకొన్నట్లుగా మీరు ప్రజలకు చూపించలేదు. ఆ ప్రజలకు నేను వాగ్దానం చేసిన దేశాన్ని వారికి ఇస్తాను. అయితే వాళ్లను ఆ దేశంలోనికి నడిపించేవాళ్లు మాత్రం మీరు కారు.”
13 ఈ స్థలం మెరీబా[a] జలాలు అని పిలువబడింది. ఇక్కడనే ఇశ్రాయేలు ప్రజలు యెహోవాతో వాదించారు. ఆయన పవిత్రుడని యెహోవా ఇక్కడనే వారికి చూపించాడు.!
Read full chapterFootnotes
- 20:13 మెరీబా అనగా వివాదము.
© 1997 Bible League International