Add parallel Print Page Options

యేసుని శిష్యులు ఆయన శక్తిని చూడటం

(మత్తయి 8:23-27; లూకా 8:22-25)

35 ఆ రోజు సాయంత్రం ఆయన తన శిష్యులతో, “సముద్రం అవతలివైపుకు వెళ్దాం!” అని అన్నాడు. 36 శిష్యులు, అక్కడ ఉన్న ప్రజా సమూహాన్ని వదిలి పడవలో ఉన్న యేసును తమవెంట తీసుకు వెళ్ళారు. మరికొన్ని పడవలు కూడా వాళ్ళను అనుసరించాయి. 37 ఇంతలో తీవ్రమైన ఒక పెనుగాలి వీచింది. అలలు రేగి ఆ పడవలోకి నీళ్ళు వచ్చాయి. పడవ నిండి పోసాగింది. 38 పడవ వెనుక వైపు యేసు తలక్రింద ఒక దిండు పెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయన్ని లేపి ఆయనతో, “బోధకుడా! మేము మునిగి పోయినా మీకు చింతలేదా?” అని అన్నారు.

39 ఆయన లేచి గాలిని, అలల్ని గద్దిస్తూ, “ఆగిపో, నెమ్మదించు!” అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి తీవ్రత తగ్గిపోయింది. అంతటా శాంతం ఏర్పడింది.

40 ఆయన తన శిష్యులతో, “మీరెందుకింత భయపడుతున్నారు? మీలో యింకా విశ్వాసం కలుగలేదా?” అని అన్నాడు.

41 వాళ్ళకు చాలా భయంవేసింది. తమలో తాము, “ఎవరీయన? గాలి, అలలు కూడా ఆయన మాటకు లోబడుతున్నాయే!” అని ఆశ్చర్యపడ్డారు.

Read full chapter