Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
నిర్గమకాండము 36-38

36 “కనుక బెసలేలు, అహోలీయాబు, ఇంకా నైపుణ్యంగల పురుషులందరూ యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నీ చేస్తారు. ఈ పరిశుద్ధ స్థలం నిర్మించేందుకు అవసరమైన వాటిన్నింటినీ చేయటానికి అవసరమైన జ్ఞానం, అవగాహన దేవుడు ఈ మనుష్యులకు ఇచ్చాడు.”

తర్వాత బెసలేలును, అహోలీయాబును, యెహోవా నైపుణ్యాన్ని ఇచ్చిన ఇతర నిపుణులను మోషే పిలిచాడు. పనిలో సహాయం చేయాలని వీళ్లంతా వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు కానుకగా తెచ్చిన వస్తువులన్నింటిని మోషే ఈ మనుష్యులకు ఇచ్చాడు. పవిత్ర గుడారం నిర్మించడానికి వీటన్నింటినీ వారు ఉపయోగించారు. ప్రతి ఉదయం ప్రజలు కానుకలు తెస్తున్నారు. చివరకు నిపుణులైన పని వాళ్లు ఒక్కొక్కరు, ఆ పవిత్ర స్థలంలో వారు చేస్తున్న పని విడిచి పెట్టి, మోషేతో మాట్లాడటానికి వెళ్లారు. “ప్రజలు కానుకలను విపరీతంగా తెచ్చేసారు. గుడారం పని ముగించడానికి కావలసిన దానికంటే మా దగ్గర ఎక్కువే ఉంది” అన్నారు వారు.

అప్పుడు, “ఇంక ఏ స్త్రీగాని, పురుషుడుగాని గుడారం కోసం ఏ విధమైన కానుక తీసుకురాకూడదు” అని బస్తి అంతటికీ మోషే కబురు చేసాడు. పవిత్ర స్థలానికి అవసరమైన దానికంటే ఎక్కువ వస్తువులను ప్రజలు సిద్ధం చేసారు.

పవిత్ర గుడారం

అప్పుడు నిపుణులు పవిత్ర గుడారం తయారు చేయటం మొదలు పెట్టారు. నీలం, ఎరుపు సన్నని నారబట్టతో పది తెరలు వారు చేసారు. రెక్కలు గల కెరూబుల చిత్రాలను ఆ బట్ట మీద వారు కుట్టి పెట్టారు. ప్రతి తెర ఒకే కొలత. అది 14 గజాలు పొడువు, 2 గజాల వెడల్పు. 10 అయిదు తెరలు కలిపి ఒక భాగంగాను మిగిలిన అయిదు ముక్కలు కలిపి మరో భాగంగాను కలపబడ్డాయి. 11 తర్వాత మొదటి అయిదు తెరల భాగానికి బట్ట అంచు వెంబడి నీలం గుడ్డతో ఉంగరాలు చేశారు. మరో అయిదు ముక్కల భాగానికి కూడ అలానే చేశారు. 12 ఒక భాగంలో చివరి తెర మీద 50 ఉంగరాలు మరో భాగంలో చివర తెర మీద 50 ఉంగరాలు ఉన్నాయి. ఈ ఉంగరాలు ఒక దానికి ఒకటి ఎదురెదురుగా ఉన్నాయి. 13 అప్పుడు వారు 50 బంగారు ఉంగరాలు చేశారు. రెండు తెరలను ఒకటిగా కలిపేందుకు ఈ బంగారు ఉంగరాలను వారు ఉపయోగించారు. అందుచేత గుడారం మొత్తం పవిత్ర స్థలంగా కలపబడింది.

14 అప్పుడు పవిత్ర గుడారం పైకప్పు కోసం మేక వెంట్రుకలతో 11 తెరలను పనివారు తయారు చేసారు. 15 మొత్తం 11 తెరలు ఒకే కొలత గలవి. వాటి పొడువు 15 గజాలు, వెడల్పు 2 గజాలు. 16 అయిదు తెరలను ఒక భాగంగా కలిపి కుట్టారు. పనివాళ్లు తర్వాత ఆరు తెరలను మరో భాగంగా కలిపి కుట్టారు. 17 మొదటి భాగంలోని చివరి తెర అంచుకు 50 ఉంగరాలు అమర్చారు. మరో భాగంలోని చివరి తెర అంచుకు 50 ఉంగరాలు అమర్చారు. 18 ఈ రెండు భాగాలను ఒక్కటిగా కలిపేందుకు 50 ఇత్తడి కొలుకులను పనివారు తయారు చేసారు. 19 తర్వాత గుడారానికి ఇంకా రెండు పై కప్పులను వారు తయారు చేసారు. ఒక పై కప్పు ఎరుపు రంగు వేసిన గొర్రె చర్మంతోను, మరొకటి నాణ్యమైన తోలుతోను చేయబడ్డాయి.

20 తర్వాత తుమ్మ కర్రతో పనివారు పలకలు చేసారు. 21 ఒక్కో పలక పొడవు 15 అడుగులు, వెడల్పు 27 అంగుళాలు. 22 ఒక్కో పలక అడుగున పక్క పక్కగా రెండు కొక్కీలు ఉన్నాయి. పవిత్ర గుడారపు పలకల్లో ప్రతి ఒక్కటీ ఇలాగే చేయబడింది. 23 గుడారం దక్షిణ భాగానికి 20 చట్రాలను వారు తయారు చేసారు. 24 ఆ తర్వాత ఈ 20 చట్రాల క్రింద పెట్టడానికి 40 వెండి దిమ్మలను వారు చేసారు. ప్రతి పలకకీ రెండేసి దిమ్మలు ఉన్నాయి. ఒక్కో బల్ల క్రింద ప్రతి పక్క కర్రలు, ఒక దిమ్మ. 25 గుడారం అవతలి వైపుకు (ఉత్తరం వైపు) కూడా వారు 20 పలకలు చేసారు. 26 ఒక్కో చట్రం క్రింద రెండేసి చొప్పున 40 వెండి దిమ్మలు అతడు చేసాడు. 27 పవిత్ర గుడారం వెనుక భాగానికి (పడమటి వైపున) ఆరు పలకలు అతడు చేసాడు. 28 పవిత్ర గుడారం వెనుక వైపు మూలలకు రెండు చట్రాలు అతడు చేసాడు. 29 ఈ చట్రాలు అడుగు భాగాన కలిపి బిగించబడ్డాయి. పై భాగాన అది జతచేయబడ్డ ఉంగరంలో అమర్చబడ్డాయి. ప్రతి మూలకూ అతడు ఇలాగే చేసాడు. 30 కనుక పవిత్ర గుడారం పశ్చిమాన 8 చట్రాలు, 16 వెండి దిమ్మలు అంటే ఒక్కో చట్రం కింద రెండేసి దిమ్మలు ఉన్నాయి.

31 తర్వాత అతడు తుమ్మ కర్రతో అడ్డ కర్రలు చేసాడు – పవిత్ర గుడారం మొదటి పక్కకు 5 అడ్డ కర్రలు, 32 పవిత్ర గుడారం రెండో పక్కకు 5 అడ్డ కర్రలు, గుడారం వెనుక పక్కకు 5 అడ్డ కర్రలు. 33 ఒక్కో చట్రంలోనుంచి దూరి అన్ని చట్రాల గుండా అమర్చబడేటట్టు మధ్య అడ్డ కర్రను అతడు చేసాడు. 34 ఈ చట్రాలను బంగారంతో అతడు తాపడం చేసాడు. అడ్డ కర్రలను పట్టి ఉంచేందుకు బంగారు ఉంగరాలను అతడు చేసాడు.

35 తర్వాత అతి పవిత్ర స్థలం యొక్క ప్రవేశ ద్వారానికి తెరను వారు చేయటానికి నాణ్యమైన సన్నని నారబట్ట, నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణపు బట్ట వారు ఉపయోగించారు. నాణ్యమైన బట్టమీద కెరూబుల చిత్రాలను అతడు కుట్టాడు. 36 తుమ్మ కర్రతో నాలుగు స్తంభాలు చేసి వాటికి బంగారం తాపడం చేసారు. ఆ స్తంభాలకు బంగారు కొక్కీలు వారు చేసారు. ఆ స్తంభాలకు నాలుగు వెండి దిమ్మలను వారు చేసారు. 37 తర్వాత గుడారం ప్రవేశ ద్వారానికి ఒక తెరను వారు తయారు చేసారు. నాణ్యమైన బట్ట, నీలం, ధూమ్ర వర్ణం, ఎరుపు బట్టను వారు ఉపయోగించారు. ఆ బట్ట మీద చిత్ర పటాల బుట్టాపని వారు చేసారు. 38 తర్వాత ఈ తెరకోసం అయిదు స్తంభాలు, కొక్కీలు వారు చేసారు. స్తంభాల శిఖరాలకు, తెరల కడ్డీలకు అతడు బంగారు తాపడం చేసాడు. స్తంభాలకు అయిదు ఇత్తడి దిమ్మలను వారు చేసారు.

ఒడంబడిక పెట్టె (మందసము)

37 తుమ్మ కర్రతో పవిత్ర పెట్టెను బెసెలేలు చేసాడు. ఆ పెట్టె పొడవు 45 అంగుళాలు, వెడల్పు 27 అంగుళాలు. ఎత్తు 27 అంగుళాలు, పెట్టె లోపల, బయట స్వచ్ఛమైన బంగారంతో అతడు తాపడం చేసాడు. తర్వాత పెట్టె చుట్టూ బంగారు నగిషీబద్ద కట్టాడు. బంగారు ఉంగరాలు నాలుగు చేసి నాలుగు మూలలా వాటిని అమర్చాడు. పెట్టె మోయటానికి ఈ ఉంగరాలు ఉపయోగించబడ్డాయి. ఒక్కో ప్రక్క రెండేసి ఉంగరాలు ఉన్నాయి. తర్వాత పెట్టెను మోసేందుకు కర్రలను అతడు చేసాడు. తుమ్మ కర్రతో చేసి ఆ కర్రలకు స్వచ్ఛమైన బంగారం తాపడం చేసాడు. పెట్టెకు ఒక్కో ప్రక్క ఉంగరాల గుండా కర్రలను దూర్చిపెట్టాడు. తర్వాత స్వచ్ఛమైన బంగారంతో అతడు మూత చేసాడు. దాని పొడవు 45 అంగుళాలు, వెడల్పు 27 అంగుళాలు. తర్వాత బెసలేలు కొట్టబడ్డ బంగారంతో రెండు కెరూబులను చేసాడు. ఆ కెరూబులను మూత కొనల మీద ఉంచాడు. ఒక కొనమీద ఒక కెరూబును, మరో కొనమీద మరో కెరూబును ఉంచాడు. అంతా ఒకే భాగంలో ఉండేటట్టు ఆ కెరూబులు మూతతో కలిపి చేయబడ్డాయి. కెరూబుల రెక్కలు ఆకాశంవైపు విప్పబడ్డాయి. ఆ కెరూబుల రెక్కలు పెట్టెను కప్పి ఉంచాయి. కెరూబులు ఎదురెదురుగా మూతను చూస్తూ ఉన్నాయి.

ప్రత్యేక బల్ల

10 తర్వాత అతడు తుమ్మ కర్రతో బల్లను చేసాడు. ఆ బల్ల పొడవు 36 అంగుళాలు, వెడల్పు 18 అంగుళాలు, ఎత్తు 27 అంగుళాలు. 11 అతడు ఆ బల్లను బంగారంతో తాపడం చేసాడు. బల్ల నాలుగు ప్రక్కల బంగారు నగిషీబద్ద చేసాడు. 12 అప్పుడు అతడు ఆ బల్ల చుట్టూ మూడు అంగుళాల చట్రం చేసాడు. ఆ చట్రం మీద బంగారు నగిషీబద్దను అతడు ఉంచాడు. 13 అప్పుడు అతడు ఆ బల్లకు నాలుగు బంగారు ఉంగరాలు చేసాడు. నాలుగు మూలలా నాలుగు బంగారు ఉంగరాలు అతడు అమర్చాడు. అక్కడే నాలుగు కాళ్లు ఉన్నాయి. 14 ఉంగరాలను బల్ల పైభాగంలో చట్రానికి దగ్గరగా అతడు పెట్టాడు. బల్లను మోసేందుకు ఉపయోగించే కర్రలను ఉంగరాలు పట్టి ఉంచుతాయి. 15 తర్వాత బల్లలను మోసేందుకు కర్రలను అతడు చేసాడు. తుమ్మ కర్ర ఉపయోగించి చేసిన, ఆ కర్రలకు స్వచ్ఛమైన బంగారు పూత పూసాడు. 16 అప్పుడు బల్ల మీద ఉపయోగించే వస్తువులన్నింటినీ తయారు చేసాడు. పానార్పణము పోసేందుకు పళ్లెములు, గరిటెలు, గిన్నెలు, పాత్రలు అతడు తయారు చేసాడు. ఇవన్నీ స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడ్డాయి.

దీప స్తంభం

17 తర్వాత అతడు దీపస్తంభం చేసాడు. స్వచ్ఛమైన బంగారం ఉపయోగించి, దాని దిమ్మను, స్తంభాన్ని తీర్చిదిద్దాడు. తర్వాత పువ్వుల్లా కనపడే గిన్నెలు చేసాడు. గిన్నెలకు మొగ్గలు, పువ్వులు ఉన్నాయి. అన్నీ స్వచ్ఛమైన బంగారంతోనే చేయబడ్డాయి. ఈ వస్తువులన్నీ ఒకే భాగంగా కలుపబడ్డాయి. 18 దీపస్తంభం ప్రక్కల్లో ఆరు కొమ్మలు ఉన్నాయి. ఒక పక్క మూడు కొమ్మలు, మరో పక్క మూడు కొమ్మలు ఉన్నాయి. 19 ఒక్కో కొమ్మకు మూడేసి బంగారు పూలున్నాయి. ఈ పూలు బాదం పూలవలె చేయబడ్డాయి. వాటికి మొగ్గలు, రేకులు ఉన్నాయి. 20 బంగారంతో చేయబడ్డ నాలుగు పూవులు దీపస్తంభంపు కాండానికి ఉన్నాయి. అవి కూడా మొగ్గలు, రేకులతో బాదం పూవుల్లానే ఉన్నాయి.

21 ఆరు కొమ్మలు రెండేసి చొప్పున మూడు భాగాలుగా ఉన్నాయి. ఒక్కో కొమ్మ విభాగం కింద ఒక్కో మొగ్గ ఉంది. 22 మొగ్గలు, కొమ్మలు, దీపస్తంభం అన్నీ స్వచ్ఛమైన బంగారంతో చేయబడ్డాయి. ఈ బంగారం అంతా కొట్టబడి, ఒకే భాగంగా చేయబడింది. 23 ఈ దీపస్తంభానికి అతడు ఏడు దీపాలు చేసాడు. తర్వాత అతడు పళ్లెం, పట్టకారులు చేసాడు. సమస్తం స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది. 24 దీపస్తంభం, దాని పరికరాలు అన్నీ తయారు చేయడానికి అతడు 75 పౌన్ల స్వచ్ఛమైన బంగారం ఉపయోగించాడు.

ధూప వేదిక

25 ధూపం వేసేందుకు అతడు ధూప వేదిక చేసాడు. తుమ్మ కర్రతో అతడు దీన్ని చేసాడు. వేదిక చతురస్రాకారం. దాని పొడవు 18 అంగుళాలు, వెడల్పు 18 అంగుళాలు, ఎత్తు 36 అంగుళాలు. వేదిక మీద నాలుగు కొమ్మలు ఉన్నాయి. ఒక్కొక్క మూలను ఒక్కొక్క కొమ్మ ఉంది. ఈ కొమ్మలు వేదికతో కలిపి ఒకే భాగంగా చేయబడ్డాయి. 26 పై భాగం, అన్ని ప్రక్కలు, కొమ్మలకీ అతడు బంగారు తాపడం చేసాడు. తర్వాత అతడు బలిపీఠం చుట్టూ బంగారు నగిషీబద్ద చేసాడు. 27 బలిపీఠానికి అతడు రెండు బంగారు ఉంగరాలు చేసాడు. బలపీఠం నగిషీబద్దకు అడుగు భాగాన ఒక్కో ప్రక్క ఒక్కోటిగా బంగారు ఉంగరాలను అమర్చాడు. వేదికను మోసే కర్రలను ఈ బంగారు ఉంగరాలు పట్టి వుంచేవి. 28 స్తంభాలను తుమ్మ కర్రతో చేసి, బంగారం తాపడం చేసాడు అతడు.

29 తర్వాత అభిషేకించే పవిత్ర తైలం చేసాడు. స్వచ్ఛమైన పరిమళ వాసనగల ధూపం కూడ అతడు చేసాడు. అత్తరు చేసే నైపుణ్యంగల ఒకని చేత ఇవన్నీ చేయబడ్డాయి.

దహన బలులకు పీఠం

38 తర్వాత బెసలేలు బలిపీఠం కట్టాడు. ఇది దహన బలులను దహించటానికి ఉపయోగించిన బలిపీఠం. తుమ్మ కర్రతో అతడు బలిపీఠం చేసాడు. బలిపీఠం చతురస్రం, దాని పొడువు ఏడున్నర అడుగులు, వెడల్పు ఏడున్నర అడుగులు, ఎత్తు నాలుగున్నర అడుగులు. ఒక్కొక్క మూలకు ఒక కొమ్మును అతడు చేసాడు. కొమ్ములను బలిపీఠంతో ఏకభాగంగా అతడు చేసాడు. తర్వాత అతడు దాన్నంతటినీ యిత్తడితో తాపడం చేసాడు. తర్వాత బలిపీఠం మీద ఉపయోగించే పరికరాలు అన్నింటినీ అతడు చేసాడు. బిందెలు, గరిటెలు, గిన్నెలు, ముల్లు గరిటెలు, నిప్పు పాత్రలు అతడు చేసాడు. తర్వాత అతడు బలిపీఠం కోసం ఒక వలలాంటి ఇత్తడి జల్లెడ తయారు చేసాడు. ఈ ఇత్తడి జల్లెడ వలలా ఉంది. బలిపీఠం అడుగున అంచు కింద ఉంచబడింది. అది అడుగు భాగాన కింద నుండి బలిపీఠం లోనికి సగం వరకు వుంది. తర్వాత ఇత్తడి ఉంగరాలు చేసాడు. బలిపీఠాన్ని మోసే కర్రలను పట్టి వుంచేందుకు ఈ ఉంగరాలు ఉపయోగించ బడ్డాయి. ఆ ఉంగరాలకు ఇత్తడి జల్లెడ నాలుగు మూలలను అతడు అమర్చాడు. తర్వాత అతడు తుమ్మకర్రతో కర్రలు చేసి, వాటిని యిత్తడితో తాపడం చేసాడు. ఆ కర్రలను ఉంగరాలలో అమర్చాడు అతడు. బలిపీఠం పక్కలో ఉన్న కర్రలు బలిపీఠాన్ని మోసేందుకు ఉపయోగించబడ్డాయి. బలిపీఠం చేయడానికి అతడు తుమ్మ కర్ర పలకలను ఉపయోగించాడు. బలిపీఠం లోపల ఖాళీ గంగాళం వుంది.

దాని దిమ్మను అతడు ఇత్తడితో చేసాడు. స్త్రీలు ఇచ్చిన ఇత్తడి అద్దాలను అతడు ఉపయోగించాడు. సమావేశ గుడార ప్రవేశం దగ్గర పరిచర్య చేసే స్త్రీలు వీరు.

పవిత్ర గుడారం చుట్టూ ఆవరణ

తర్వాత ఆవరణ చుట్టూ తెరలను అతడు చేసాడు. దక్షిణం వైపు తెరల పొడవు 50 గజాలు. 10 దక్షిణం వైపు 20 స్తంభాల ఆధారంతో తెరలు నిలబడ్డాయి. ఈ తెరలు సన్నని నారతో చేయబడ్డాయి. ఆ స్తంభాలు 20 యిత్తడి దిమ్మల మీద ఉన్నాయి. స్తంభాలకు, కర్రలకు కొక్కీలు వెండితో చేయబడ్డాయి. 11 ఆవరణ ఉత్తరం వైపుకూడ దక్షిణం వైపులాగే ఉంది. 20 ఇత్తడి దిమ్మల మీద 20 స్తంభాలు ఉన్నాయి. స్తంభాలకు, కర్రలకు కొక్కీలు వెండితో చేయబడ్డాయి.

12 ఆవరణ పడమటి వైపు తెరలు 25 గజాలు పొడవు. స్తంభాలు 10, దిమ్మలు 10 ఉన్నాయి. స్తంభాలకు కొక్కెములు బిగించే తెరల కడ్డీలు వెండితో చేయబడ్డాయి.

13 ఆవరణ ప్రవేశం తూర్పున ఉంది. తూర్పున 25 గజాలు వెడల్పు, 14 ప్రవేశానికి ఒక ప్రక్క ఏడున్నర గజాలు పొడవు గల ఒక తెర ఉంది. ఆ తెరకు మూడు స్తంభాలు, మూడు దిమ్మలు ఉన్నాయి. 15 ప్రవేశానికి మరో పక్క ఇంకో తెర ఉంది. దాని పొడవు కూడ ఏడున్నర గజాలు. ఆ తెరకు కూడా మూడు స్తంభాలు, మూడు దిమ్మలు ఉన్నాయి. 16 ఆవరణ చుట్టూ ఉన్న తెరలన్నీ నాణ్యమైన బట్టతో చేయబడ్డాయి. 17 స్తంభాలకు దిమ్మలు ఇత్తడితో చేయబడ్డాయి. కొక్కెములు, తెరల కడ్డీలు వెండితో చేయబడ్డాయి. స్తంభాల శిఖరాలు కూడ వెండితో తాపడం చేయబడ్డాయి. ఆవరణలోని స్తంభాలన్నీ తెరల వెండి కడ్డీలతో కలుపబడ్డాయి.

18 నీలం, ఎరుపు ధూమ్రవర్ణం బట్ట, నాణ్యమైన సన్నని నార బట్టతో ఆవరణ ప్రవేశానికి తెర చేయబడింది. నిపుణుడు వీటన్నింటినీ కలిపి కట్టాడు. ఆ తెర 10 గజాలు పొడవు, రెండున్నర గజాలు ఎత్తు ఉంది. ఆవరణలో తెరల వలే అవి కూడ అదే ఎత్తు ఉన్నాయి. 19 ఆ తెర నాలుగు స్తంభాలు, నాలుగు ఇత్తడి దిమ్మల మీద ఆధారపడి ఉంది. 20 స్తంభాల మీద కొక్కెములు వెండితో చేయబడ్డాయి. స్తంభాల శిఖరాలు, బిగించే కడ్డీలు వెండితో చేయబడ్డాయి.

21 పవిత్ర గుడారం (ఒడంబడిక గుడారం) తయారు చేసేందుకు ఉపయోగించిన వస్తువులన్నింటినీ రాసి పెట్టమని లేవీ ప్రజలకు మోషే ఆజ్ఞాపించాడు. అహరోను కుమారుడు ఈతామారు ఈ జాబితా బాధ్యత వహించాడు.

22 దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన సమస్తాన్ని యూదా వంశపు హూరు కుమారుడైన ఊరు కుమారుడు బెసలేలు తయారు చేసాడు. 23 ఇంకా దాను వంశపు అహీమాసాకి కుమారుడు అహోలీయాబు అతనికి సహాయం చేసాడు. అహోలీయాబు నిపుణుడు, నమూనాలు గీయగలడు. శ్రేష్ఠమైన నారబట్టలతో నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణంగల బట్టతో బుట్టా పని చేయగలవాడు అతడు.

24 పవిత్ర గుడారం కోసం రెండు టన్నులకంటే ఎక్కువ బంగారం యెహోవాకు అర్పణగా ఇవ్వబడింది. (ఆలయపు అధికారిక కొలత ప్రకారం ఇది తూచబడింది).

25 ప్రజలు మూడుముప్పావు టన్నులకు మించి వెండిని యిచ్చారు. (ఇది ఆలయపు అధికారిక కొలత ప్రకారం తూచబడింది). 26 ఇరవై సంవత్సరాలు, అంతకు పైబడ్డ మగవాళ్లందరిని లెక్కించారు. మొత్తం 6,03,550 మంది మగవారున్నారు. వారిలో ప్రతి ఒక్కడు ఒక వెండి బాకా (అరతులం వెండి) పన్ను చెల్లించాలి. (ఒక వెండి బాకా అంటే అధికారిక కొలత ప్రకారం ఒక అరతులం.) 27 అందులో మూడు ముప్పావు టన్నుల వెండి పవిత్ర గుడారపు 100 దిమ్మలు చేసేందుకు, తెరచేసేందుకు వినియోగించబడింది. ఒక్క దిమ్మకు 75 పౌన్ల వెండి వారు ఉపయోగించారు. 28 కొక్కెములు, తెరల కడ్డీలు చేయటానికి, స్తంభాలకు వెండి తాపడం చేయటానికి మరో 50 పౌన్ల వెండి ఉపయోగించబడింది.

29 ఇత్తడి ఇరవై ఆరున్నర టన్నులకు పైగా యెహోవాకు ఇవ్వబడింది. 30 సన్నిధి గుడార ప్రవేశం దగ్గర దిమ్మలు చేయటానికి ఆ ఇత్తడి ఉపయోగించబడింది. బలిపీఠం, ఇత్తడి తెర చేసేందుకు కూడా వారు ఇత్తడి ఉపయోగించారు. బలిపీఠం కోసం పరికరాలు, పాత్రలు అన్నీ చేయటానికి కూడా ఇదే ఇత్తడి వాడబడింది. 31 ఆవరణ చుట్టూ తెరల దిమ్మలు చేసేందుకు, ప్రవేశం దగ్గర తెరల దిమ్మలు చేసేందుకు కూడా ఇదే ఇత్తడి వాడబడింది. పవిత్ర గుడారానికి, ఆవరణ చుట్టూ ఉన్న తెరలకూ కావల్సిన మేకులు చేసేందుకు కూడా ఇత్తడి ఉపయోగించబడింది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International