Chronological
22 “ఒక ఎద్దును లేక గొర్రెను దొంగతనం చేసిన వాడిని నీవు ఎలా శిక్షిస్తావు? వాడు ఆ జంతువును చంపేసినా లేక అమ్మేసినా అతడు దాన్ని తిరిగి ఇవ్వలేడు. కనుక వాడు దొంగిలించిన ఒక్క ఎద్దుకు బదులు అయిదు ఎడ్ల నివ్వాలి. లేక వాడు దొంగతనం చేసిన ఒక్క గొర్రెకు బదులు నాలుగు గొర్రెలు ఇవ్వాలి. దొంగతనానికి అతడు శిక్ష చెల్లించాలి. 2-3 వాడికి స్వంతది అంటూ ఏమీ లేకపోతే, వాడ్ని బానిసగా అమ్మాలి. అయితే ఆ జంతువు ఇంకా వాని దగ్గరే ఉంటే, దాన్ని, నీవు చూస్తే అప్పుడు వాడు ఆ దొంగిలించిన ప్రతి జంతువుకు బదులుగా రెండు జంతువుల్ని యజమానికి ఇవ్వాలి. ఆ జంతువు ఎద్దు, గాడిద, గొర్రె, ఏదైనా ఫర్వాలేదు. 4 దొంగ రాత్రివేళ ఒక ఇంటికి కన్నము వేయటానికి ప్రయత్నిస్తూండగా చంపబడితే, వాణ్ణి చంపిన నేరం ఎవ్వరి మీదా ఉండదు. అయితే ఇది పగలు జరిగితే వాణ్ణి చంపిన వాడు నేరస్థుడే (దోషి).
5 “ఒకడు తన పొలంలో లేక ద్రాక్షాతోటలో మంట రాజబెడితే, ఆ మంట పాకిపోయి, పక్కవాడి పొలాన్ని లేక ద్రాక్షా తోటను కాల్చివేస్తే అతడు తన శ్రేష్ఠమైన పంటను తన పొరుగువాడికి నష్టపరిహారంగా ఇవ్వాలి.
6 “ఒకడు తన పొలంలో ముళ్ల పొదలను తగుల బెట్టడానికి మంట పెట్టవచ్చును. కానీ ఆ మంట పెద్దదై పొరుగువాడి పొలాన్ని లేక పొరుగువాడి పొలంలో పండుతున్న ధాన్యాన్ని కాల్చివేస్తే, అప్పుడు ఆ మంటను రాజబెట్టిన వ్యక్తి తాను కాల్చివేసిన వాటికి బదులుగా డబ్బు చెల్లించాలి.
7 “ఒకడు తన డబ్బును లేక ఇంకేవైనా వస్తువుల్ని పొరుగువాని ఇంట్లో దాచి పెట్టమని తన పొరుగువాణ్ణి అడగవచ్చు. ఆ పొరుగువాడి ఇంట్లోనుంచి ఆ డబ్బు లేక వస్తువులు దొంగిలించబడితే, నీవేం చేయాలి? దొంగను పట్టుకొనేందుకు నీవు ప్రయత్నం చేయాలి. నీవు ఆ దొంగను పట్టుకొంటే, అప్పుడు వాడు ఆ వస్తువుల విలువకు రెండంతలు చెల్లించాలి. 8 కానీ ఆ దొంగను నీవు పట్టుకోలేక పోతే, ఆ ఇంటి యజమాని నేరస్థుడైతే, అప్పుడు దేవుడే న్యాయం తీరుస్తాడు. ఆ ఇంటి యజమాని దేవుని ఎదుటికి వెళ్లాలి. అతడే దొంగిలించి ఉంటే దేవుడు న్యాయం తీరుస్తాడు.”
9 “పోయిన ఒక ఎద్దు లేక గాడిద, గొర్రె లేక వస్త్రం లేక ఇంక దేన్నిగూర్చిగానీ ఇద్దరు వ్యక్తులకు ఒడంబడిక కుదరకపోతే, అప్పుడు నీవేం చేయాలి? ‘ఇది నాది’ అని ఒకడంటే, లేదు, ‘ఇది నాది’ అని ఇంకొకడు అంటాడు. ఆ ఇద్దరు మనుష్యులు దేవుని ఎదుటికి వెళ్లాలి. నేరస్థుడు ఎవరో దేవుడే నిర్ణయిస్తాడు. తప్పుచేసిన వాడు ఆ వస్తువు విలువకు రెండంతలు అవతలి వానికి చెల్లించాలి.
10 “తన జంతువు విషయమై శ్రద్ధ పుచ్చుకోవడం ద్వారా తనకు సహాయం చేయమని ఒకడు తన పొరుగు వాణ్ణి అడగవచ్చు. ఈ జంతువు గాడిద కావచ్చు, ఎద్దు కావచ్చు, గొర్రె కావచ్చు. అయితే ఆ జంతువు చనిపోయినా, ఆ జంతువుకు దెబ్బ తగిలినా లేక ఎవరూ చూడకుండా ఆ జంతువును ఇంకెవరైనా తీసుకొనిపోయినా నీవేం చేయాలి? 11 ఆ జంతువును తాను దొంగిలించలేదని ఆ పొరుగువాడు వివరించి చెప్పాలి. ఇదే కనుక సత్యం అయితే, తాను దొంగతనం చేయలేదని ఆ పొరుగువాడు యెహవాకు ప్రమాణం చేయాలి. జంతువు యజమాని ఈ ప్రమాణాన్ని అంగీకరించాలి. ఆ పొరుగువాడు జంతువుకోసం దాని యజమానికి ఏమీ చెల్లించనక్కర్లేదు. 12 అయితే, ఆ పొరుగు వాడు జంతువును దొంగిలిస్తే, అప్పుడు ఆ జంతువు కోసం దాని యజమానికి అతడు విలువ చెల్లించాలి. 13 ఒకవేళ అడవి మృగాలు ఆ జంతువును చంపేస్తే, ఆ పొరుగువాడు దాని శవాన్ని రుజువుగా తీసుకురావాలి. చంపబడ్డ జంతువు కోసం దాని యజమానికి ఆ పొరుగువాడు ఏమీ చెల్లించనక్కరలేదు.
14 “ఒకడు తన పొరుగు వాని దగ్గర దేన్నయినా బదులు తీసుకొంటే దానికి అతడే బాధ్యుడు. ఒకవేళ ఒక జంతువుకు దెబ్బ తగిలినా లేక ఆ జంతువు చచ్చినా, అప్పుడు ఆ పొరుగువాడు దాని యజమానికి వెల చెల్లించాలి. యజమాని స్వయంగా అక్కడ లేడు గనుక ఆ పొరుగువాడే దానికి బాధ్యుడు. 15 అయితే దాని యజమాని ఆ జంతువుతో కూడా ఉంటే, పొరుగువాడు ఏమీ చెల్లించనక్కరలేదు. లేక, ఆ పొరుగువాడు ఆ జంతువుతో పని చేయించుకొనేందుకుగాను డబ్బు చెల్లిస్తుంటే, ఆ జంతువుకు దెబ్బ తగిలినా, అది చచ్చినా, అతడు ఏమీ చెల్లించనక్కర్లేదు. ఆ జంతువును వాడుకొనేందుకు అతడు చెల్లించిన డబ్బే సరిపోతుంది.
16 “పెళ్లికాని పవిత్రమైన ఒక పడుచుదానితో ఒకవేళ ఒకడికి లైంగిక సంబంధం ఉంటే, అతడు ఆమెను పెళ్లి చేసుకోవాలి. ఆమె తండ్రికి అతడు నిండుగా కట్నం యివ్వాలి. 17 అతణ్ణి పెళ్లి చేసుకొనేందుకు ఆమె తండ్రి అంగీకరించకపోయినా, అతడు ఆ డబ్బు చెల్లించాల్సిందే. ఆమె కోసం పూర్తి మొత్తాన్ని అతడు చెల్లించాలి.
18 “నీవు ఏ స్త్రీనీ కూడా శకునం చెప్పనివ్వకూడదు. ఒకవేళ ఏ స్త్రీ అయినా చెప్తే, అలాంటి దాన్ని నీవు బతకనివ్వకూడదు.
19 “నీవు ఎవ్వర్నీ జంతు సంయోగం చెయ్యనియ్యకూడదు. ఇలా కనుక జరిగితే, ఆ వ్యక్తిని చంపేయాలి.
20 “ఎవడైనా సరే దేవుడు కాని వాడికి బలి అర్పిస్తే, అలాంటివాడ్ని నాశనం చేయాలి. యెహోవా దేవుడు ఒక్కడికే నీవు బలులు అర్పించాలి.” 21 “జ్ఞాపకం ఉంచుకో ఇదివరకు మీరు ఈజిప్టు దేశంలో పరాయివాళ్లు. కనుక మీ దేశంలో ఉండే విదేశీయులలో ఎవర్నీ మీరు మోసం చేయకూడదు. కొట్టగూడదు.
22 “విధవరాండ్రకు, అనాధలకు మీరు ఎన్నడూ ఎట్లాంటి కీడు చేయకూడదు. 23 ఆ విధవరాండ్రకు లేక అనాధలకు మీరు ఏదైనా కీడు చేస్తే అది నాకు తెలుస్తుంది. వారి శ్రమను గూర్చి నేను వింటాను. 24 అంతేకాదు, నాకు చాల కోపం వస్తుంది. కత్తితో నేను మిమ్మల్ని చంపేస్తాను. అప్పుడు మీ భార్యలు విధవరాండ్రయి పోతారు. మీ పిల్లలు అనాధలు అయిపోతారు.
25 “నా ప్రజల్లో ఒకరు పేదవారైతే, నీవు వానికి డబ్బు అప్పిస్తే, ఆ డబ్బుకు నీవు అతని దగ్గర వడ్డీ తీసుకోకూడదు. ఆ డబ్బు త్వరగా తిరిగి ఇచ్చి వేయమని నీవు అతణ్ణి తొందర చేయకూడదు: 26 అతడు నీకు బాకీ ఉన్న డబ్బు నీకు చెల్లిస్తాడని ప్రమాణంగా ఎవరైనా ఒకరు తన అంగీని నీకు ఇవ్వవచ్చును. కాని సూర్యాస్తమయం కాకముందే నీవు ఆ అంగీని తిరిగి ఇచ్చివేయాలి. 27 ఒకవేళ ఆ వ్యక్తికి ఆ అంగీ లేకపోతే, తన శరీరాన్ని కప్పుకొనేందుకు అతనికి ఇంకేమీ లేకపోవచ్చును. అతను నిద్రపోయినప్పుడు చల్లబడిపోతాడు. మరి అతడు నాకు మొరబెడితే, అప్పుడు నేను అతని మొర వింటాను. నేను దయగలవాణ్ణి కనుక నేను వింటాను.
28 “నీ దేవుణ్ణిగాని, నీ ప్రజల నాయకులనుగాని నీవు దూషించగూడదు.
29 “కోత కాలంలో నీ మొదటి గింజల్ని, నీ ఫలాల్లో మొదటి రసాన్ని నీవు నాకు ఇవ్వాలి. సంవత్సరాంతం వరకు వేచి ఉండొద్దు.
“నీ పెద్దకుమారుల్ని నాకు ఇవ్వు. 30 అలాగే నీ ఆవుల్లో, గొర్రెల్లో, మొదట పుట్టిన వాటిని నాకు ఇవ్వు. అవి ఏడు రోజులు వాటి తల్లితో ఉండవచ్చు. ఎనిమిదవ రోజున వాటిని నాకు ఇవ్వాలి. 31 మీరు నా ప్రత్యేక ప్రజలు. కనుక అడవి మృగాలు చంపిన ఏదో ఒకదాని మాంసం మీరు తినవద్దు. చచ్చిన ఆ జంతువులను కుక్కల్ని తిననివ్వండి.
23 “ప్రజలకు వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పకండి. న్యాయస్థానంలో మీరు సాక్షులుగా ఉంటే, ఒక దుర్మార్గుడు అబద్ధాలు చెప్పేందుకు సహాయం చేయడానికి ఒప్పుకోవద్దు.
2 “మిగిలిన వారంతా చేస్తున్నారనిచెప్పి నీవు ఏదీ చేయవద్దు. ఒక గుంపు ప్రజలు తప్పు చేస్తుంటే, నీవు వారితో కలువ వద్దు. నీవు చెడ్డ పనులు చేసేటట్టు ఆ ప్రజలు నిన్ను ఒప్పించనియ్యవద్దు. సరియైనది, న్యాయమైనది నీవు చెయ్యాలి.
3 “ఒక పేదవానికి తీర్పు జరుగుతుంటే, కొన్నిసార్లు అతని విషయంలో జాలిపడి, కొందరు అతణ్ణి బలపరుస్తారు. నీవు అలా చేయకూడదు. (అతనిది సరిగ్గా ఉంటేనే బలపర్చు.)
4 “తప్పిపోయిన ఒక ఎద్దును లేక గాడిదను నీవు చూస్తే, దాన్ని దాని యజమానికి నీవు తిరిగి అప్పగించాలి. ఆ యజమాని నీకు శత్రువైనా సరే, నీవు ఇలా చేయాల్సిందే. 5 మోయలేనంత భారం ఉండడం చేత ఒక జంతువు నడవలేక పోతున్నట్టు నీవు చూస్తే, నీవు ఆగి ఆ జంతువుకు సహాయం చేయాలి. ఆ జంతువు నీ శత్రువులలో ఒకనికి చెందినా సరే నీవు దానికి సహాయం చేయాలి.
6 “ఒక పేదవానికి ప్రజలు అన్యాయం చేయకూడదు. ఇతరులు ఎవరికైనా తీర్చినట్టే తీర్పు తీర్చాలి.
7 “ఏదైనా విషయంలో ఒకడు నేరస్థుడు అని నీవు చెబితే, నీవు చాల జాగ్రత్తగా ఉండాలి. ఒకడి మీద అబద్ధపు నిందలు వేయవద్దు. నిర్దోషియైన ఒకడ్ని తాను చేయని పనికి శిక్షగా ఎన్నడూ మరణించనివ్వవద్దు. ఒక నిర్దోషిని చంపేవాడు ఎవడైనా సరే చెడ్డవాడే, ఆ మనిషిని నేను క్షమించను.
8 “ఒకడు తప్పు చేస్తూ నీవు అతనితో ఏకీభవించాలని చెప్పి, నీకు డబ్బు ఇవ్వ జూస్తే, ఆ డబ్బు తీసుకోవద్దు. అలా చెల్లించిన డబ్బు న్యాయమూర్తులు సత్యాన్ని చూడకుండా చేస్తుంది. అలా చెల్లించిన డబ్బు మంచివాళ్లు అబద్ధాలు చెప్పేటట్టు చేస్తుంది.
9 “విదేశీయుని యెడల నీవు ఎన్నడూ తప్పు చేయకూడదు. మీరు ఈజిప్టు దేశంలో నివసించినప్పుడు మీరు పరాయి వాళ్లేనని జ్ఞాపకం ఉంచుకోవాలి. (ఒకడు తన స్వంతంకాని దేశంలో వుంటే వాడికి ఎలా వుంటుందో మీరు అర్థం చేసుకోవాలి.)
ప్రత్యేకమైన పండుగలు
10 “విత్తనాలు చల్లి పంటకోసి, ఆరు సంవత్సరాల పాటు భూమిని సాగుచేయండి. 11 అయితే ఏడో సంవత్సరం భూమిని ఉపయోగించకండి. (ఏడో సంవత్సరం భూమికి ఒక ప్రత్యేక విశ్రాంతి సమయంగా ఉండాలి) మీ పొలాల్లో ఏమీ నాటవద్దు. ఒకవేళ అక్కడ ఏవైనా పంటలు పెరిగితే, వాటిని పేద ప్రజలను తీసుకోనివ్వాలి. మిగిలిపోయిన ఆహారాన్ని అడవి మృగాల్ని తిననివ్వాలి మీ ద్రాక్షాతోటలు, ఒలీవ మొక్కలు, తోటల విషయంలో కూడ మీరు అలాగే చేయాలి.
12 “ఆరు రోజులు పని చేయండి. ఏడోరోజున విశ్రాంతి! మీ బానిసలు, ఇతర పని వాళ్లకు దీనివల్ల విశ్రాంతి, మరియు విరామం లభిస్తుంది. మీ ఎడ్లు, మీ గాడిదలకు కూడ విశ్రాంతి దొరుకుతుంది.
13 “ఈ ఆజ్ఞలన్నింటికీ విధేయులు కావాలని మాత్రం ఖచ్చితంగా తెల్సుకోండి. వేరే దేవుళ్లను పూజించకండి. చివరకి వాళ్ల పేర్లు కూడా మీరు పలుకగూడదు.
14 “ప్రతి సంవత్సరం మూడు ప్రత్యేక పండుగలు మీకు ఉంటాయి. ఈ పండుగల రోజుల్లో మీరు నన్ను ఆరాధించటానికి నా ప్రత్యేక స్థలానికి రావాలి. 15 మొదటిది పులియని రొట్టెల పండుగ. ఇది నేను మీకు ఆజ్ఞాపించినట్టే ఉంటుంది. ఈ సమయంలో పులియజేసే పదార్థం వినియోగించకుండా చేయబడ్డ రొట్టెలు మీరు తింటారు. ఇలా ఏడు రోజుల పాటు కొనసాగుతుంది. అబీబు[a] మాసంలో మీరు దీన్ని చేయాలి. ఎందుకంటే మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన సమయం యిదే. ఆ సమయంలో ప్రతి వ్యక్తి ఒక బలి అర్పణ నాకు తీసుకురావాలి.
16 “రెండోది కోత పండుగ. ఈ పండుగ వేసవి పూర్వార్ధంలో అంటే మీ పొలాల్లో మీరు నాట్లు వేసిన పంటల కోత మొదలుబెట్టే సమయంలో ఉంటుంది. మూడోది గుడారాల పండుగ.
“ఇది ఆకురాలు కాలంలో ఉంటుంది. ఇది మీ పొలాల్లో పంటలన్నీ కూర్చుకొనే సమయంలో ఉంటుంది.
17 “కనుక యెహోవా ప్రభువుతో ఉండేందుకు సంవత్సరానికి మూడుసార్లు పురుషులంతా ఒక ప్రత్యేక స్థలానికి వస్తారు.
18 “నీవు ఒక జంతువును చంపి దాని రక్తం బలిగా అర్పించేటప్పుడు, పులియజేసే పదార్థంతో చేయబడ్డ రొట్టెలు నీవు అర్పించకూడదు. ఈ బలి అర్పణలోని మాంసం మీరు తినేటప్పుడు ఆ మాంసం అంతా ఒక్క రోజులోనే తినెయ్యాలి. మాంసంలో ఏమీ మర్నాటికి మిగల్చకూడదు.
19 “మీరు మీ పంట కూర్చుకొనే కోత కాలంలో మీరు కోసే ప్రతి దానిలో మొదటి భాగం మీ యెహోవా దేవుని ఆలయానికి తీసుకురావాలి.
“దాని తల్లి పాలతో ఉడకబెట్టబడిన మేకపిల్ల మాంసాన్ని మీరు తినకూడదు.”
ఇశ్రాయేలీయులు దేశాన్ని ఆక్రమించుటకు దేవుడు సహాయం చేయటం
20 దేవుడు యిలా చెప్పాడు: “మీకు ముందర ఒక దేవదూతను నేను పంపుతున్నాను. మీ కోసం నేను సిద్ధం చేసిన చోటికి ఈ దేవదూత మిమ్మల్ని నడిపించటం జరుగుతుంది. 21 ఈ దేవదూతకు విధేయులుగా వెంబడించండి. ఆయన మీద తిరుగుబాటు చేయవద్దు. ఆయన విషయంలో మీరు చేసే తప్పిదాలను ఈ దేవదూత క్షమించడు. ఆయనలో నా శక్తి ఉంది. 22 ఆయన చెప్పే ప్రతి దానికీ మీరు లోబడాలి. నేను మీతో చెప్పే ప్రతీదీ మీరు చేయాలి. మీ శత్రువులందరికీ నేను వ్యతిరేకంగా ఉంటాను. మీకు వ్యతిరేకంగా ఉండే ప్రతి వ్యక్తికి నేను విరోధినే.”
23 దేవుడు చెప్పాడు: “ఈ దేశంలోనుంచి నా దూత మిమ్మల్ని నడిపిస్తాడు. అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనే వేర్వేరు ప్రజల మీదికి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. అయితే వీళ్లందర్నీ నేను ఓడిస్తాను.
24 “వాళ్ల దేవుళ్లను పూజించవద్దు. ఆ దేవుళ్లకు ఎన్నడూ సాష్టాంగపడవద్దు. వాళ్ల జీవిత విధానంలో మీరు ఎన్నడూ జీవించకూడదు. వాళ్ల విగ్రహాల్ని మీరు నాశనం చేయాలి. వాళ్ల దేవుళ్లను వాళ్లు జ్ఞాపకం చేసుకొనేందుకు వాళ్లకు తోడ్పడే వాటన్నిటినీ మీరు విరుగగొట్టాలి. 25 మీ యెహోవా దేవుణ్ణి మీరు సేవించాలి. మీరు ఇలా చేస్తే, భోజన పానీయాలు సమృద్ధిగా ఇచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. సర్వరోగాల్నీ మీలోనుండి తొలగించి వేస్తాను. 26 మీ స్త్రీలంతా పిల్లల్ని కనగల్గుతారు. వారి శిశువుల్లో ఏ ఒక్కరూ పుట్టుకలో చావరు. మిమ్మల్ని అందరినీ సుదీర్ఘ ఆయుష్షుతో బ్రతకనిస్తాను.
27 “మీరు మీ శత్రువుతో యుద్ధం చేసేటప్పుడు నా మహత్తర శక్తిని మీ ముందర పంపిస్తాను. మీరు మీ శత్రువులందర్నీ ఓడించటానికి నేను మీకు సహాయం చేస్తాను. మీకు వ్యతిరేకంగా ఉండే మనుష్యులు యుద్ధంలో కలవరపడిపోయి, పారిపోతారు. 28 మీకు ముందు కందిరీగలను[b] నేను పంపిస్తాను. ఆ కందిరీగలు మీ శత్రువులు పారిపొయ్యేట్టు చేస్తాయి. హివ్వీ ప్రజలు, కనానీ ప్రజలు, హిత్తీ ప్రజలు, మీ దేశాన్ని వదిలేస్తారు. 29 అయితే త్వరగా మీ దేశాన్ని విడిచి పెట్టేటట్టు నేను వాళ్లను బలవంతం చేయను. ఇదంతా నేను ఒక్క సంవత్సరంలోనే చేయను. ఆ ప్రజల్ని నేను అంత వేగంగా వెళ్లగొడితే, దేశం ఖాళీగా ఉంటుంది. అలాగైతే అడవి మృగాలు అధికమై దేశాన్ని ఆక్రమించుకొంటాయి. అవి మీకు చాల తొందర కలిగిస్తాయి. 30 కనుక ఆ ప్రజల్ని చాలా నిదానంగా బయటకు వెళ్లగొడతాను. దేశంలోనికి మీరు చొచ్చుకు పోతూనే ఉంటారు. మరి మీరు ఎక్కడికి వెళ్లినా, అక్కడ ఇతర ప్రజలను నేను బలవంతంగా వెళ్లగొట్టేస్తాను.
31 “ఎర్ర సముద్రం నుండి యూఫ్రటీస్ నదివరకు ఉన్న దేశం అంతా నేను మీకు యిస్తాను. ఫిలిష్తీ సముద్రం (మధ్యధరా సముద్రం) పశ్చిమాన సరిహద్దుగాను, అరేబియా ఎడారి తూర్పు సరిహద్దుగాను ఉంటాయి. అక్కడ నివసిస్తున్న ప్రజల్ని మీరు ఓడించేటట్టు చేస్తాను.
32 “ఆ ప్రజల్లో ఎవరితో గాని లేక వారి దేవుళ్లతోగాని మీరు ఎలాంటి ఒడంబడికలూ చేసుకోకూడదు. 33 వాళ్లను మీ దేశంలో ఉండనివ్వవద్దు. మీరు వాళ్లను ఉండనిస్తే, మీరు పాపం చేయటానికి వాళ్లు కారకులు అవుతారు. ఒకవేళ మీరు వాళ్లను ఉండనిస్తే వాళ్లు ఒక ఉరిలా ఉంటారు. మీరేమో వాళ్ల దేవుళ్లను పూజించటం మొదలు పెడతారు.”
దేవుడు మరియు ఇశ్రాయేలీయులు ఒడంబడిక చేయటం
24 మోషేతో దేవుడు ఇలా చెప్పాడు: “నీవు, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలీయుల డెబ్బయి మంది పెద్దలు (నాయకులు) పర్వతం మీదకు వచ్చి అంత దూరంలోనుంచే నన్ను ఆరాధించాలి. 2 అప్పుడు మోషే తాను మాత్రం యెహోవాకు సమీపంగా రావాలి. మిగతా పురుషులు యెహోవాకు సమీపంగా రాకూడదు. మిగతా ప్రజలు పర్వతం మీదకి కూడా రాకూడదు.”
3 కనుక యెహోవా ఇచ్చిన నియమాలు, ఆజ్ఞలు అన్నింటిని గూర్చీ మోషే ప్రజలతో చెప్పాడు. అప్పుడు ప్రజలంతా, “యెహోవా చెప్పిన ఆజ్ఞలు అన్నింటికీ మేము విధేయులమవుతాము” అన్నారు.
4 కనుక యెహోవా ఆజ్ఞలు అన్నింటినీ మోషే రాసాడు. మర్నాటి ఉదయం పర్వతం దగ్గర మోషే ఒక బలిపీఠం నిర్మించాడు. ఇశ్రాయేలీయుల పన్నెండు వంశాల్లో ఒక్కోదానికి ఒకటి చొప్పున పన్నెండు రాళ్లు నిలబెట్టాడు. 5 అప్పుడు బలులు అర్పించటానికి యువకులను మోషే పంపించాడు. దహన బలులుగా, సమాధాన బలులుగా ఎడ్లను ఈ మనుష్యులు అర్పించారు.
6 ఈ జంతువుల రక్తాన్ని మోషే భధ్రం చేసాడు. రక్తంలో సగాన్ని పాత్రల్లో ఉంచాడు మోషే. మిగతా సగం రక్తాన్ని బలిపీఠం మీద ఆయన పోసాడు.[c]
7 ప్రత్యేక ఒడంబడిక వ్రాయబడ్డ పత్రాన్ని మోషే చదివాడు. ఆయన చదువుతోంది ప్రజలంతా వినగలిగేటట్టు మోషే ఆ ఒడంబడిక పత్రం చదివాడు. అప్పుడు ప్రజలు, “యెహోవా మాకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ మేము విన్నాము. వాటికి విధేయులం అయ్యేందుకు మేము ఒప్పుకొంటున్నాము” అన్నారు.
8 తర్వాత బలి అర్పణ రక్తంతో నిండిన పాత్రలను మోషే పట్టుకొన్నాడు. ఆ రక్తాన్ని ప్రజలమీద మోషే చిలకరించాడు[d] “మీతో యెహోవా ఒక ప్రత్యేక ఒడంబడిక చేసాడు అని ఈ రక్తం సూచిస్తుంది. మీకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలే ఈ ఒడంబడికను వివరిస్తాయి,” అని ఆయన చెప్పాడు.
9 అప్పుడు మోషే, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలు పెద్దలు డెబ్బయి మంది పర్వతం మీదకు వెళ్లారు. 10 పర్వతం మీద ఈ మనుష్యులు ఇశ్రాయేలీయుల దేవుణ్ణి చూసారు. ఆకాశం అంత నిర్మలంగా కనబడుతున్న నీలంలాటి దేనిమీదనో దేవుడు నిలబడ్డాడు. 11 ఇశ్రాయేలు నాయకులంతా దేవుణ్ణి చూచారు, కాని దేవుడు వాళ్లను నాశనం చేయలేదు.[e] వాళ్లంతా కలిసి తిని త్రాగారు.
దేవుని ఆజ్ఞలు పొందడానికి మోషే వెళ్లటం
12 “పర్వతం మీద నా దగ్గరకు రా, నా ప్రబోధాలను, ఆజ్ఞలను పలకలుగా ఉన్న రెండు రాళ్ల మీద రాసాను. ఈ ప్రబోధాలు ప్రజలకోసం. ఆ రాతి పలకలను నేను నీకిస్తాను” అని యెహోవా మోషేతో చెప్పాడు.
13 కనుక మోషే, ఆయన సహాయకుడైన యెహోషువ కలసి దేవుని పర్వతం మీదకు వెళ్లారు. 14 మోషే, “మాకోసం ఇక్కడ వేచి ఉండండి. మేము తిరిగి మీ దగ్గరకు వస్తాము. నేను లేనప్పుడు అహరోను, హోరు మీ దగ్గరే ఉన్నారు. ఎవరికైనా సమస్య ఉంటే వాళ్ల దగ్గరకు వెళ్లండి,” అని ఆ పెద్దలతో (నాయకులతో) చెప్పాడు.
మోషే దేవున్ని కలుసుకోవడం
15 అప్పుడు మోషే పర్వతం మీదికి వెళ్లాడు. ఆ పర్వతాన్ని మేఘం కప్పేసింది. 16 సీనాయి పర్వతం మీద యెహోవా మహిమ దిగివచ్చింది. ఆరు రోజుల పాటు పర్వతాన్ని మేఘం కప్పేసింది. ఏడోరోజున ఆ మేఘంలోనుంచి యెహోవా మోషేతో మాట్లాడాడు. 17 ఇశ్రాయేలు ప్రజలు యెహోవా మహిమను చూడగలిగారు. అది ఆ పర్వతం మీద మండుతున్న అగ్నిలా వుంది.
18 అప్పుడు మోషే ఆ పర్వతం మీద యింకా పైకి ఎక్కి మేఘంలోకి వెళ్లాడు. నలభై పగళ్లూ, నలభై రాత్రులు మోషే ఆ పర్వతం మీదే ఉన్నాడు.
© 1997 Bible League International