Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
నిర్గమకాండము 25-27

పవిత్రమైన వస్తువులకొరకు బహుమానాలు

25 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “నాకు కానుకలు తీసుకు రమ్మని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు. నాకు ఇవ్వాల్సింది ఏమిటి? ప్రతి మనిషి తన హృదయంలో తీర్మానించుకోవాలి. నా కోసం ఈ కానుకల్ని స్వీకరించు. ప్రజల దగ్గర్నుండి నీవు స్వీకరించాల్సిన వాటి జాబితా యిది: బంగారం, వెండి, కంచు, నీలం వస్త్రం, ఊదారంగు వస్త్రం, ఎరుపు వస్త్రం, మేలిమి వస్త్రం, మేక బొచ్చు, గొర్రె చర్మాలు, మేలురకం తోళ్లు, తుమ్మకర్ర దీపాలకు నూనె, ధూపం. ప్రత్యేక అభిషేక తైలానికి[a] సువాసన చేకూర్చే పరిమళ వస్తువులు, ఇంకా లేత పచ్చరాళ్లు, ఏఫోదు[b] మీద లేక న్యాయ తీర్పుపై వస్త్రం మీద పొదిగించడానికి విలువైన రాళ్లు.”

పవిత్ర గుడారం

(ఇంకా దేవుడు ఇలా అన్నాడు): “నా కోసం ప్రజలు ఒక పవిత్ర స్థలాన్ని నిర్మిస్తారు. అప్పుడు నేను వారి మధ్య నివసిస్తాను. పవిత్ర గుడారం ఎలా ఉండాలో నేను మీకు చూపిస్తాను. దానిలో ఏమేమి వస్తువులు ఎలా ఉండాలో నేను మీకు చూపిస్తాను. సరిగ్గా నేను నీకు చూపించినట్టు ఒడంబడిక పెట్టె తయారు చెయ్యి.

ఒడంబడిక పెట్టె (మందసము)

10 “తుమ్మకర్ర ఉపయోగించి ఒక ప్రత్యేక పెట్టె తయారు చెయ్యి. ఈ పెట్టె పొడవు 45 అంగుళాలు, వెడల్పు 27 అంగుళాలు, ఎత్తు 27 అంగుళాలు ఉండాలి. 11 ఆ పెట్టెలోపల, బంగారు రేకుతో పెట్టెను కప్పాలి. ఆ పెట్టె చుట్టూ అంచుల మీద బంగారపు నగిషీబద్ద పెట్టాలి. 12 ఆ పెట్టె చుట్టూ మోసేందుకు నాలుగు బంగారు ఉంగరాలను తయారు చెయ్యాలి. ఆ పెట్టెకు ఒక్కోపక్క రెండేసి చొప్పున నాలుగు మూలలా ఆ ఉంగరాలను అమర్చాలి. 13 తర్వాత పెట్టెను మోసేందుకు కర్రలను తయారు చేయాలి. ఈ కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారం పొదిగించాలి. 14 ఆ పెట్టె మూలల్లో ఉన్న ఉంగరాల గుండా ఆ కర్రలను పెట్టాలి. ఆ పెట్టెను మోసేందుకు ఈ కర్రలను ఉపయోగించాలి. 15 ఈ కర్రలు ఎప్పుడూ వాటి ఉంగరాల్లోనే ఉండాలి. కర్రలను బయటికి తియ్యవద్దు.”

16 దేవుడు అన్నాడు: “నేను ఒడంబడికను[c] నీకు ఇస్తాను. ఆ ఒడంబడికను ఈ పెట్టెలో పెట్టు. 17 ఆ పెట్టెకు ఒక మూత[d] చెయ్యాలి. స్వచ్ఛమైన బంగారంతో దీన్ని చెయ్యాలి. 45 అంగుళాల పొడవు, 27 అంగుళాల వెడల్పుతో దీన్ని చెయ్యాలి. 18 తర్వాత రెండు బంగారు కెరూబు దూతలను చేసి ఆ మూతకు రెండుకొనల మీద పెట్టాలి. కొట్టిన బంగారంతో ఈ దూతల్ని చేయాలి. 19 ఆ మూతకు ఒక కొనమీద ఒక దూతను, మరో కొనమీద మరో దూతను ఉంచాలి. మూత, దూతలు అంతా ఒకే వస్తువుగా చేయాలి. 20 కెరూబులు ఒకదానికి ఎదురుగా ఇంకొకటి ఉండాలి. ఆ దూతల ముఖాలు మూత వైపుకు చూస్తూ ఉండాలి. ఆ కెరూబుల రెక్కలు మూతను అవరించి ఉండాలి. ఆ కెరూబుల రెక్కలు ఆకాశం వైపు ఎత్తబడి ఉండాలి.

21 “ఒడంబడిక రుజువు నేనే మీకిచ్చాను. ఆ ఒడంబడికను పెట్టెలో పెట్టి, ప్రత్యేక మూతను పెట్టెమీద పెట్టాలి. 22 నేను నిన్ను కలుసుకొనేటప్పుడు ఆ ఒడంబడిక పెట్టె ప్రత్యేక మూత మీద ఉన్న కెరూబు దూతల మధ్యనుండి నేను మాట్లాడుతాను. అక్కడినుండే నేను నా ఆజ్ఞలన్నింటినీ ఇశ్రాయేలు ప్రజలకు యిస్తాను.

రొట్టెల బల్ల

23 “తుమ్మ కర్రతో ఒక బల్ల తయారు చెయ్యాలి. ఈ బల్ల పొడవు 36 అంగుళాలు, వెడల్పు 18 అంగుళాలు, ఎత్తు 27 అంగుళాలు ఉండాలి. 24 బల్లను స్వచ్ఛమైన బంగారంతో కప్పాలి. దాని చుట్టూ బంగారపు నగిషీబద్ద పెట్టాలి. 25 తర్వాత 4 అంగుళాల బంగారు నగీషీ బద్దను బల్ల చుట్టూ చేయాలి. ఇది కూడ స్వచ్ఛమైన బంగారంతో చేయాలి. 26 అప్పుడు నాలుగు బంగారు ఉంగరాలు చేసి, బల్ల నాలుగు మూలలా వాటిని ఉంచాలి. ఒక్కో కాలు దగ్గర ఒక్కో ఉంగరం పెట్టాలి. 27 బల్ల పైభాగానికి చుట్టూవున్న నగిషీ బద్దకు సమీపంగా ఉంగరాలను ఉంచాలి. బల్లను మోసే మోత కర్రలను ఈ ఉంగరాలు పట్టి ఉంచుతాయి. 28 మోత కర్రలు చేసేందుకు తుమ్మ కర్రను ఉపయోగించి వాటికి బంగారంతో తాపడం చేయాలి. వాటితో బల్లను మోయాలి. 29 బల్లమీద ఉండే ప్రతి పళ్లెము, గిన్నె స్వచ్ఛమైన బంగారంతో చేయబడాలి. అర్పితాలను పోసేందుకు ఉపయోగించే పాత్రలు, గిన్నెలు స్వచ్ఛమైన బంగారంతో చెయ్యబడి ఉండాలి. 30 ప్రత్యేకమైన రొట్టెను[e] నా యెదుట బల్ల మీద పెట్టాలి. అవి నా యెదుట ఎల్లప్పుడూ అక్కడ ఉండాలి.

దీప స్తంభం

31 “అప్పుడు నీవు ఒక దీపస్తంభం చేయాలి. దీపస్తంభంలో ప్రతి భాగాన్నీ సాగకొట్టబడ్డ స్వచ్ఛమైన బంగారంతో చేయాలి. అందంగా కనబడేటట్టు దీపానికి పూలు చేయాలి. ఈ పూలలో మొగ్గలు, రేకులు స్వచ్ఛమైన బంగారంతో చేయాలి. ఇవన్నీ దీప స్తంభంతోపాటు ఒకే వస్తువుగా కలిసి ఉండాలి.

32 “దీపస్తంభానికి ఒక ప్రక్క మూడు కొమ్మలు మరో ప్రక్క మూడు కొమ్మలు మొత్తం ఆరు కొమ్మలు ఉండాలి. 33 ఒక్కో కొమ్మకు మూడు పువ్వులు ఉండాలి. ఈ పువ్వులను మొగ్గలు, రేకులుగల బాదం పూలుగా చేయి. 34 దీప స్తంభానికి మరో నాలుగు పూలు చేయి. ఈ పూలు మొగ్గలు, రేకులుగల బాదం పూవుల్లా చేయబడాలి. 35 కాండమునకు ఇరు ప్రక్కల మూడేసి కొమ్మల చొప్పున దీపస్తంభానికి ఆరు కొమ్మలు ఉండాలి. కొమ్మలు కాండంలో కలిసే మూడు చోట్లలో ఒక్కో దాని కింద మొగ్గలు, రేకులు గల ఒక పువ్వును చేయి. 36 పువ్వులు కొమ్మలతో సహా మొత్తం దీపస్తంభం స్వచ్ఛమైన బంగారంతో చేయబడాలి. ఈ బంగారం అంతా సాగకొట్టబడిన ఒకే ముక్కగా ఉండాలి. 37 అప్పుడు దీపస్తంభం మీదకు ఏడు దీపాలు చేయి. ఈ దీపాలు దీపస్తంభం ఉన్న చోట వెలుగునిస్తాయి. 38 ప్రమిదలు, దీపపు వత్తులను తిప్పే పిడి చేసేందుకు స్వచ్ఛమైన బంగారం ఉపయోగించు. 39 దీపస్తంభం, దానితోబాటు ఉపయోగించే వస్తువులను చేసేందుకు 75 పౌన్ల స్వచ్ఛమైన బంగారం ఉపయోగించు. 40 ప్రతీది సరిగ్గా నేను నీకు ఆ పర్వతం మీద చూపించిన ప్రకారమే చేసేందుకు చాల జాగ్రత్తపడు.

పవిత్ర గుడారం

26 “పది తెరలతో పవిత్ర గుడారం చెయ్యాలి. సున్నితమైన బట్ట, నీలం, ఎరుపు, ఊదా రంగుల బట్టతో ఈ తెరలు చేయాలి. రెక్కలుగల కెరూబుల చిత్ర పటాలను ఒక నిపుణుడు తెరలమీద కుట్టాలి. తెరలన్నీ ఒకే కొలతలో తయారు చేయాలి. ప్రతి తెర 14 గజాల పొడవు 2 గజాల వెడల్పు ఉండాలి. తెరలను రెండు భాగాలుగా కుట్టాలి. అయిదు తెరలను ఒక విభాగానికి, అయిదు తెరలను మరో విభాగానికి కలిపి కుట్టాలి. చివరి తెర అంచుకు ఉంగరాలు కుట్టాలి. ఈ ఉంగరాలు చేసేందుకు నీలము గుడ్డ ఉపయోగించాలి. తెరల రెండు విభాగాల కింది అంచులకు ఉంగరాలు ఉండాలి. మొదటి విభాగంలోని చివరి తెరకు 50 ఉంగరాలు, రెండో విభాగంలోని చివరి తెరకు 50 ఉంగరాలు ఉండాలి. ఈ ఉంగరాలను జత చేయటానికి 50 బంగారు ఉంగరాలు చెయ్యాలి. పవిత్ర గుడారం అంతా ఒక్కటిగా ఉండటానికి ఇది తెరలన్నింటినీ జత చేస్తుంది.

“తర్వాత పవిత్ర గుడారాన్ని కప్పేందుకు ఇంకో గుడారాన్ని నీవు చెయ్యాలి. ఈ గుడారం చేయటానికి మేక వెంట్రుకలతో చేయబడ్డ 11 తెరలను ఉపయోగించు. ఈ తెరలన్నీ ఒకే కొలతలో ఉండాలి. అవి 15 గజాలు పొడవు, 2 గజాలు వెడల్పు ఉండాలి. అయిదు తెరలను ఒక విభాగంగా కలిపి కుట్టాలి. తర్వాత మిగిలిన ఆరు తెరలను మరో విభాగంగా కలిపి కుట్టాలి. ఆరో తెరను గుడారం ముందటి భాగాన్ని కప్పేందుకు ఉపయోగించాలి. తలుపులా తెరచుకొనేందుకు వీలుగా దీన్ని చుట్టిపెట్టాలి. 10 ఒక భాగంలోని చివరి తెర అంచుకు 50 కొలుకులు తయారు చెయ్యాలి. మరో విభాగంలోని చివరి తెర కింది అంచుకు కూడ అలానే చెయ్యాలి. మరో విభాగంలోని చివరి తెర కింది అంచుకు కూడ అలానే చెయ్యాలి. 11 అప్పుడు 50 ఇత్తడి ఉంగరాలు చెయ్యాలి. గుడ్డ ఉంగరాలను జతచేయటానికి ఈ ఇత్తడి ఉంగరాలను ఉపయోగించాలి. ఇలా చేయడంవల్ల తెరలన్నీ కలిసి ఒకే గుడారంగా తయారవుతాయి. 12 ఈ తెరలు పవిత్ర గుడారం కంటె పొడవుగా ఉంటాయి. కనుక తెరల్లో కొంత భాగం గుడారం వెనుకగా వేలాడుతుంటాయి. 13 తెర గుడారం ప్రక్కల్లో వేలాడుతుంటుంది. ఇది గుడారాన్ని భద్రంగా ఉంచుతుంది. 14 పవిత్ర గుడారానికి ఇంకా రెండు పైకప్పులు చేయాలి. ఒకటి ఎర్ర రంగు పూసిన పొట్టేలు చర్మంతో చేయాలి. ఇంకొకటి మేలు రకం తోలుతో చెయ్యాలి.

15 “పవిత్ర గుడారం చట్రానికి ఉపయోగించే పలకలను తుమ్మకర్రతో చెయ్యాలి. 16 చట్రాలు 15 అంగుళాల పొడవు, 27 అంగుళాల వెడల్పు ఉండాలి. 17 ప్రతి చట్రం ఒకేలా ఉండాలి. ప్రతి చట్రానికి పక్క పక్కగా రెండేసి పక్కకర్రలు (దిమ్మలో అమర్చేవి) ఉండాలి. 18 పవిత్ర గుడారం దక్షిణ పక్కకు 20 చట్రాలు చేయాలి. 19 ప్రతి చట్రం కింద పెట్టడానికి రెండేసి వెండిదిమ్మలు చేయాలి. కనుక చట్రాలన్నింటికీ 40 వెండిదిమ్మలు నీవు చేయాలి. 20 పవిత్ర గుడారం ఉత్తరదిక్కుకోసం ఇంకా 20 చట్రాలు చెయ్యాలి. 21 అంటే ఒక్కో చట్రానికి రెండేసి చొప్పున చట్రాలకోసం మొత్తం 40 వెండి దిమ్మలు చెయ్యాలి. 22 గుడారం వెనుక పశ్చిమ కొనకు ఇంకా ఆరు చట్రాలు నీవు చేయాలి. 23 మూలల కోసం రెండు చట్రాలు చెయ్యాలి 24 మూలల్లో ఉండే రెండు చట్రాలు జత చేయాలి. రెండుచట్రాలు అడుగు భాగాన జతపర్చబడాలి. పైభాగంలో ఉన్న ఒక ఉంగరం రెండు చట్రాలను జత పరుస్తుంది. 25 కనుక (గుడారం చివరన) మొత్తం ఎనిమిది చట్రాలు ఉంటాయి. ఒక్కో చట్రం కింద రెండు దిమ్మల చొప్పున మొత్తం 16 వెండి దిమ్మలుంటాయి.

26 “పవిత్ర గుడారం చట్రాలకు తుమ్మ కర్రతో అడ్డకమ్ములు చేయాలి. పవిత్ర గుడారం మొదటి ప్రక్కకు అయిదు అడ్డకమ్ములు ఉండాలి. 27 పవిత్ర గుడారం పశ్చిమాన వెనుకవైపు చట్రానికి అయిదు అడ్డకమ్ములు ఉండాలి. పవిత్ర గుడారం పశ్చిమ దిక్కున చట్రానికి అయిదు అడ్డకమ్ములు ఉండాలి. (అంటే పవిత్ర గుడారం వెనుక) 28 అయిదు చట్రాలకు మధ్య ఉండే అడ్డకమ్మి పైనుండి కిందికి సగం సగంగా ఉండాలి. ఈ కొననుండి ఆకొన వరకు చట్రాల గుండా ఈ అడ్డకమ్మి దూర్చబడాలి. 29 చట్రాలను బంగారంతో తాపడం చేయాలి. అడ్డకమ్ములను పట్టి ఉంచడానికి చట్రాలకు ఉంగరాలు చెయ్యాలి. 30 నేను నీకు పర్వతం మీద చూపించినట్టే, పవిత్ర గుడారం నిర్మించు.

పవిత్ర గుడారం లోపల

31 “సున్నితమైన వస్త్రంతో గుడారం లోపలి భాగం కోసం ప్రత్యేకమైన ఒక తెరను తయారు చెయ్యాలి. నీలం, ఊదా, ఎరుపు రంగు బట్టతో ఈ తెరను తయారు చేయాలి. కెరూబుల చిత్రపటాలను ఈ బట్టమీద కుట్టాలి. 32 తుమ్మ కర్రతో నాలుగు స్తంభాలు చెయ్యి. బంగారు కొక్కేల ఆ నాలుగు స్తంభాలకు అమర్చు. స్తంభాలకు బంగారు తాపడం చెయ్యి. స్తంభాల కింద నాలుగు వెండి దిమ్మలు పెట్టు. తర్వాత తెరను బంగారు కొక్కేల మీద వ్రేలాడదీయి. 33 కొక్కేల మీద తెరను వేలాడ దీసిన తరువాత, ఒడంబడిక పెట్టెను తెర వెనుక పెట్టు. పవిత్ర స్థానాన్ని, మహా పవిత్ర స్థానాన్ని, ఈ తెర వేరుచేస్తుంది. 34 మహా పవిత్ర స్థానంలో ఒడంబడిక పెట్టె మీద మూత పెట్టు.

35 “పవిత్ర స్థానంలో నీవు చేసిన బల్లను తెర అవతలి ప్రక్క పెట్టు. పవిత్ర గుడారంలో ఉత్తరంగా బల్ల ఉండాలి. పవిత్ర గుడారంలో దక్షిణంగా దీపం ఉండాలి. ఇది బల్ల ప్రక్క అడ్డంగా ఉండాలి.

పవిత్ర గుడారపు ద్వారం

36 “తర్వాత గుడారం ద్వారానికి ఒక తెర చెయ్యి. తెర చేయటానికి నీలం, ఊదా, ఎరుపు బట్టను సున్నితమైన బట్టను ఉపయోగించు. ఆ బట్టలో చిత్రపటాలను అల్లిక చేయాలి. 37 తలుపుపై ఉండే తెరకు బంగారు కొక్కేలు చేయాలి. బంగారు తాపడం చేయబడ్డ అయిదు తుమ్మకర్ర స్తంభాలు చెయ్యాలి. అయిదు స్తంభాలకూ అయిదు ఇత్తడిదిమ్మలు చేయాలి.

అర్పణలు దహించడానికి బలిపీఠం

27 “తుమ్మకర్రతో ఒక బలిపీఠం నిర్మించు. బలిపీఠం చతురస్రంగా ఉండాలి. అది 7 1/2 అంగుళాల పొడవు 7 1/2 అంగుళాల వెడల్పు 4 1/2 అంగుళాల ఎత్తు ఉండాలి. బలిపీఠం నలుమూలలా ఒక్కోదానికి ఒక్కో కొమ్ము చేయాలి. అంతా ఒక్క వస్తువుగా ఉండేటట్టు ఒక్కో కొమ్మును దాని మూలకు జత చేయాలి. బలిపీఠాన్ని యిత్తడితో తాపడం చేయాలి.

“బలిపీఠం మీద ఉపయోగించబడే పరికరాలు, పాత్రలు అన్నింటినీ ఇత్తడితో చేయాలి. బిందెలు, పారలు, పాత్రలు, పళ్లపారలు, నిప్పునెత్తే పెంకులు ఇత్తడితో చేయాలి. బలిపీఠం నుండి బూడిద ఎత్తి శుభ్రం చేయడానికి యివి ఉపయోగించబడతాయి. ఒక పెద్ద యిత్తడి జల్లెడలాంటి దానిని చేయాలి. తెర నాలుగు మూలలకు నాలుగు యిత్తడి ఉంగరాలు చెయ్యాలి. బలిపీఠానికి అడుగున మెట్టు కింద తెరను పెట్టాలి. కింద నుండి బలిపీఠంలో సగం పై వరకు, తెర ఉంటుంది.

“బలిపీఠపు కర్రలు చేయడానికి తుమ్మకర్ర ఉపయోగించి వాటిని ఇత్తడితో తాపడం చేయాలి. బలిపీఠం రెండు వైపులా ఉండే ఉంగరాల్లోనుంచి ఆ కర్రలను దూర్చాలి. బలిపీఠం మోయడానికి ఈ కర్రలను ఉపయోగించాలి. బలిపీఠం గుల్లగా ఉంటుంది. దాని ప్రక్కలు పలకలతో చేయబడతాయి. నేను నీకు పర్వతం మీద చూపించినట్టే బలిపీఠాన్ని తయారు చెయ్యి.

గుడారానికి ఆవరణను ఏర్పరచటం

(“పవిత్ర గుడారం చుట్టూ తెరలతో కట్టు. ఇది గుడారానికి ఆవరణ అవుతుంది.) దక్షిణం వైపున యాభై గజాల పొడవు తెరలు గోడగా ఉండాలి. సున్నితమైన బట్టతో ఈ తెరలు చేయబడాలి. 10 ఇరవై స్తంభాలు, ఆ స్తంభాల కింద 20 యిత్తడి దిమ్మలు ఉపయోగించాలి. స్తంభాల కొక్కేల తెరల కడ్డీలు వెండితో చేయాలి. 11 దక్షిణ వైపున ఉన్నంత పొడవే ఉత్తరం వైపున కూడా ఉండాలి. దానికి 100 తెరలు, 20 స్తంభాలు, 20 ఇత్తడి దిమ్మలు ఉండాలి. స్తంభాల కొక్కేలు తెరల కడ్డీలు వెండితోనే చేయబడాలి.

12 “ఆవరణం పడమటికొనవైపు 25 గజాల పొడవుగల తెరలతో ఒక గోడగా ఉండాలి. ఆ గోడ మీద 10 స్తంభాలు, 10 దిమ్మలు ఉండాలి. 13 ఆవరణ తూర్పు వైపు కూడా 25 గజాల పొడవు ఉండాలి. 14 (ఈ తూర్పు వైపే ఆవరణకు ప్రవేశం) ప్రవేశ ద్వారానికి అన్ని వైపులా ఏడున్నర గజాల పొడవు గల తెరలు ఉండాలి. ఆ పక్క మూడు స్తంభాలు మూడు దిమ్మలు ఉండాలి. 15 అవతల వైపున కూడా ఏడున్నర గజాల పొడవుగల తెరలు ఉండాలి. ఆ పక్కన మూడు స్తంభాలు మూడు దిమ్మలు ఉండాలి.

16 “ఆవరణ ప్రవేశాన్ని కప్పడానికి 10 అంగుళాల పొడవుగల తెర చెయ్యాలి. సున్నితమైన బట్ట నీలం, ఎరుపు, ఊదారంగు బట్టలతో ఆ తెరను చేయాలి. ఆ తెరమీద చిత్ర పటాల అల్లిక ఉండాలి. నాలుగు స్తంభాలు, నాలుగు దిమ్మలు ఉండాలి. 17 ఆవరణ చుట్టూ ఉండే స్తంభాలన్నీ వెండి కడ్డీలతో జత కలపాలి. స్తంభాల కొక్కేలు వెండితోను, స్తంభాల దిమ్మలు యిత్తడితోను చేయాలి. 18 ఆవరణ 50 గజాల పొడవు 25 గజాల వెడల్పు ఉండాలి. ఆవరణ చుట్టు గోడ ఏడున్నర అడుగుల ఎత్తు ఉండాలి. తెరలు సున్నితమైన బట్టతో చేయాలి. స్తంభాలన్నింటి కింద ఉండే దిమ్మల్ని ఇత్తడితోనే చేయాలి. 19 అన్ని పరికరాలు, పవిత్ర గుడారం మేకులు పవిత్ర గుడారంలో ఉపయోగించే ఇతర వస్తువులు అన్నిటినీ ఇత్తడితోనే చేయాలి. మేకులు (ఆవరణ చుట్టూ తెరలకు) అన్నీ ఇత్తడితో చేయాలి.

దీపాలకు నూనె

20 “శ్రేష్ఠమైన ఒలీవ నూనె తీసుకొని రమ్మని ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించు. ప్రతి సాయంకాలం వెలిగించాల్సిన దీపం కోసం ఈ నూనె ఉపయోగించు. 21 దీపం విషయం అహరోను, అతని కుమారులు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. సన్నిధి గుడారంలో మొదటి గదిలోకి వారు వెళ్తారు. ఇది ఒడంబడిక పెట్టె ఉండే గది బయట (రెండు గదులను వేరు పరచే) తెర ముందర ఉంటుంది. ఇక్కడ సాయంత్రం నుండి తెల్లవారే వరకు యెహోవా ఎదుట దీపాలు తప్పక వెలుగుతూ ఉండేటట్టు వారు బాధ్యత వహిస్తారు. ఇశ్రాయేలు ప్రజలు, వారి వారసులు శాశ్వతంగా ఈ ఆజ్ఞకు విధేయులు కావాలి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International