Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
నిర్గమకాండము 30-32

ధూప పీఠం

30 “తుమ్మ కర్రతో ఒక వేదిక చేయి. ధూపం వేసేందుకు ఈ పీఠమును నీవు ఉపయోగించాలి. వేదికను 18 అంగుళాలు పొడవు, 18 అంగుళాలు వెడల్పు గల చతురస్రముగా నీవు చేయాలి. దీని ఎత్తు 36 అంగుళాలు ఉండాలి. నాలుగు మూలల కొమ్ములు ఉండాలి. ఈ కొమ్ముల్ని వేదికతో కలిపి ఒకటిగా చేయాలి. బలిపీఠం పైభాగాన్ని, అన్ని ప్రక్కలను స్వచ్ఛమైన బంగారం పొదిగించాలి. బలిపీఠం చుట్టూ బంగారు నగిషిబద్ద పెట్టాలి. నగిషీబద్ద అడుగు భాగాన బంగారు ఉంగరాలు నాలుగు ఉండాలి. ఈ బలిపీఠానికి ఎదురుగా రెండు బంగారు ఉంగరాలు ఉండాలి. బలిపీఠం మోసే కర్రలకోసం ఈ బంగారు ఉంగరాలు ఉపయోగించబడతాయి. తుమ్మకర్రతోనే ఆ కర్రలు చేయాలి. కర్రలకు బంగారు తాపడం చేయాలి. ప్రత్యేక తెరముందు ఈ బలిపీఠాన్ని ఉంచాలి. ఒడంబడిక పెట్టెను తెర అవతల ఉంచాలి. ఆ పెట్టె మూతకు ముందర బలిపీఠం ఉంచాలి. నేను నిన్ను కలుసుకోనే చోటు ఇదే.

“ప్రతీ ఉదయం పరిమళ ద్రవ్యాల ధూపాన్ని బలిపీఠం మీద అహరోను వేయాలి. దీపాలు సరిచేసేందుకు వచ్చినప్పుడు అతడు దీనిని చేయాలి. మరల సాయంత్రం అతడు ధూపం వేయాలి. ఇది అతడు సాయంత్రం దీపాలను సరిచేసే వేళ. కనుక ప్రతిరోజూ శాశ్వతంగా యెహోవా ఎదుట ధూపం వేయబడుతుంది. ఇంకే విధమైన ధూపం వేసేందుకు గాని, దహన బలి కోసంగాని ఈ బలిపీఠాన్ని ఉపయోగించవద్దు. ఏ విధమైన ధాన్యార్పణగాని, పానార్పణంగాని అర్పించేదుకు ఈ బలిపీఠాన్ని ఉపయోగించవద్దు.

10 “సంవత్సరానికి ఒక సారి అహరోను యెహోవాకు ఒక ప్రత్యేక బలి అర్పించాలి. ప్రజల పాప పరిహారం నిమిత్తం చెల్లించేందుకు పాపపరిహారార్థ బలి రక్తాన్ని అహరోను ఉపయోగించాలి. ఈ బలిపీఠపు కొమ్ముల దగ్గర అహరోను దీనిని చేయాలి. ఇది, ప్రాయశ్చిత్తార్థ దినం అని పిలువబడుతుంది. ఇది యెహవాకు అతి ప్రత్యేక దినం.”

ఆలయ పన్ను

11 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు, 12 “ఎంత మంది ప్రజలు ఉన్నారో నీకు తెలిసేటట్టు, ఇశ్రాయేలు ప్రజల్ని లెక్కబెట్టు. ఇలా చేసినప్పుడల్లా, ప్రతి వ్యక్తి తనకోసం యెహోవాకు క్రయధనం చెల్లించాలి. ప్రతి వ్యక్తి ఇలా చేస్తే ఏ విధమైన దారుణం ప్రజలకు సంభంవిచదు. 13 లెక్కించబడ్డ ప్రతి మనిషి అరతులం చెల్లించాలి. (ఇది అధికార పూర్వకమైన తులంలో సగం, అధికార తులం అంటే 20 గొర్రెలు). ఈ అరతులం యెహోవాకు అర్పణం. 14 లెక్కించబడి, 20 సంవత్సరాలు లేక అంతకు ఎక్కువ వయసుగల ప్రతి వ్యక్తి యెహోవాకు ఈ అర్పణ చెల్లించాలి. 15 ధనికులు అరతులం కంటె ఎక్కువ చెల్లించకూడదు. ప్రజలందరూ ఒకే అర్పణ యెహోవాకు చెల్లించాలి. ఇది మీ ప్రాణం కోసం చెల్లించే అర్పణ. 16 ఇశ్రాయేలు ప్రజల దగ్గర్నుండి ఈ సొమ్ము పోగుచేయి. సన్నిధి గుడారంలో సేవకోసం ఈ సొమ్ము ఉపయోగించు. యెహోవా తన ప్రజలను జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఈ చెల్లింపు ఒక విధానం. వారు తమ స్వంత ప్రాణాల నిమిత్తం చెల్లిస్తారు.”

కడుగుకొనేందుకు గంగాళం

17 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు, 18 “ఇత్తడి గంగాళం[a] ఒకటి చేసి ఇత్తడి పీటమీద దాన్ని పెట్టు. కడుగుకొనేందుకు నీవు దీనిని ఉపయోగించాలి. సన్నిధి గుడారానికి, బలిపీఠానికి మధ్య దీనిని ఉంచి, నీళ్లతో నింపు. 19 ఈ గంగాళంలోని నీళ్లతో అహరోను, అతని కుమారులు వారి కాళ్లు చేతులు కడుక్కోవాలి 20 సన్నిధి గుడారం ప్రవేశించేటప్పుడు, లేక బలిపీఠం సమీపించేటప్పుడు ప్రతిసారీ వారు నీళ్లతో కడుక్కోవాలి. ఈ విధంగా వారు మరణించరు. 21 మరియు తాము చావకుండా ఉండేందుకు వారు తమ కాళ్లు చేతులు కడుక్కోవాలి. అహరోనుకు, అతని ప్రజలకు ఎప్పటికీ కొనసాగే చట్టం యిది. భవిష్యత్తులో జీవించే అహరోను సంతతి వాళ్లందరికీ యిది కొనసాగుతుంది.”

అభిషేక తైలం

22 అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 23 “శ్రేష్ఠమైన సుగంధద్రవ్యాలు సంపాదించు. పరిమళ ధూపం చేయడానికి 500 తులాల స్వచ్ఛమైన గోపరసం, 250 తులాల సువాసనగల లవంగపట్ట, 500 తులాల సుగంధ ద్రవ్యాలు, 24 500 తులాల లవంగపట్ట తీసుకో. వీటన్నింటినీ కొలిచేందుకు అధికారిక కొలత ఉపయోగించు. మరియు మూడు పళ్ల ఒలీవ నూనె తీసుకో.

25 “ఒక పరిమళ అభిషేక తైలంగా చేయటానికి వీటన్నింటినీ కలపాలి. 26 సన్నిధి గుడారం మీద, ఒడంబడిక పెట్టె మీద ఈ తైలం పోయి, వీటికి ఒక ప్రత్యేక ఉద్దేశం వుంది అని ఇది తెలియజేస్తుంది. 27 బల్లమీద, దానిమీద ఉన్న పాత్రలన్నింటిమీద తైలం పోయి. దీపం మీద, దాని పరికరాలన్నింటి మీద ఈ తైలం పోయి. ధూపవేదిక మీద తైలం పోయి. 28 ఇంకా దేవునికి అర్పణలు దహనం చేసే బలిపీఠం మీద ఈ తైలం పోయి. ఆ బలిపీఠం పైన ఉండే సమస్తం మీద ఈ తైలం పోయి. గంగాళంమీద, దాని పీటమీద ఈ తైలం పోయి. 29 వీటన్నింటినీ నీవు పవిత్రం చేయాలి. అవి యెహోవాకు చాల ప్రత్యేకం. వీటిని ఏది తాకినా అది పవిత్రం అవుతుంది.

30 “అహరోను, అతని కుమారుల మీద ఈ తైలంపోయి. వారు ఒక ప్రత్యేక విధానంలో నన్ను సేవిస్తున్నారని ఇది తెలియజేస్తుంది. అప్పుడు యాజకులుగా వారు నా సేవ చేయవచ్చు. 31 అభిషేక తైలం ఎల్లప్పుడు నాకు ప్రత్యేకమైనదిగా ఉంటుందని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు. 32 సామాన్యమైన సుగంధ తైలంగా ఎవరూ దీనిని వాడకూడదు. ఈ ప్రత్యేక తైలం తయారు చేసిన విధానంలో సుగంధ తైలం తయారు చేయకూడదు. ఈ తైలం పవిత్రం, ఇది మీకు చాల ప్రత్యేకమైనదిగా ఉండాలి. 33 ఎవరైనా ఈ పవిత్ర తైలం వలె సుగంధ తైలం తయారు చేసి అన్యునికి యిస్తే, ఆ వ్యక్తి తన ప్రజల్లో నుండి వేరు చేయబడాలి.”

ధూపం

34 అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు, “ఈ పరిమళ ద్రవ్యాలను తీసుకురా! జటామాంసి, గోపి చందనం, గంధపుచెక్క స్వచ్ఛమైన సాంబ్రాణి. ఈ పరిమళ ద్రవ్యాలన్నీ సమపాళ్లలో ఉండేటట్టు తప్పక చూడాలి. 35 సుగంధ పరిమళ ధూపంగా ఉండేటట్టు ఈ పరిమళ ద్రవ్యాలన్నిటినీ కలపాలి. పరిమళ తైలం తయారుచేసే వాడు చేసినట్టే దీనిని చేయాలి. మరియు ఈ ధూపంలో ఉప్పు కలుపు. అది దీనిని స్వచ్ఛమైనదిగా, ప్రత్యేకమైనదిగా చేస్తుంది. 36 ధూప ద్రవ్యంలో కొంత మెత్తటి పొడుం అయ్యేంత వరకు నూరాలి. సన్నిధి గుడారంలో, ఒడంబడిక పెట్టె ఎదుట ఆ పొడుం ఉంచు. ఇది నేను నిన్ను కలుసుకొనే చోటు. ఈ ధూపపు పొడుంను దాని ప్రత్యేక పని కోసమే నీవు ఉపయోగించాలి. 37 యెహోవా కోసం ఈ ప్రత్యేక విధానంలో మాత్రమే నీవు ఈ ధూపాన్ని ఉపయోగించాలి. ఈ ధూపాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో నీవు తయారు చేయాలి. ఇంక ఏ యితరమైన ధూపం చేయడానికి కూడ ఈ ప్రత్యేక పద్ధతిని వినియోగించవద్దు. 38 ఒక వ్యక్తి, తన కోసం ఈ ధూపం కొంత తయారు చేసి, దాని పరిమళాన్ని అనుభవించాలని కోరవచ్చు. అయితే, అతడు గనుక అలా చేస్తే, వాడు తన ప్రజల నుండి వేరు చేయబడాలి.”

బెసలేలు, అహోలీయాబు

31 అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “యూదా గోత్రంలో ఊరు కుమారుడైన బెసలేలును నేను ఏర్పరచుకొన్నాను (హూరు కుమారుడు ఊరు). బెసలేలును నేను దేవుని ఆత్మతో నింపాను. అన్ని రకాల వస్తువులు చేసేందుకు జ్ఞానం, నైపుణ్యం నేను అతనికి ఇచ్చాను. నమూనాలు గీయటంలో బెసలేలు చాల ప్రజ్ఞ గలవాడు. బంగారు, వెండి, ఇత్తడితో అతడు వస్తువులు చేయగలడు. బెసలేలు అందమైన నగలను చెక్కి, పొదుగగలడు. అతడు చెక్క పని చేయగలడు. బెసలేలు అన్ని రకాల పనులు చేయగలడు. అతనితో పని చేయటానికి అహూలీయాబును కూడ నేను ఏర్పరచుకొన్నాను. అహూలీయాబు దాను గోత్రపు అహీసామాకు కుమారుడు. నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ చేయగలిగేటట్టు మిగిలిన పనివాళ్లందరికీ నేను నైపుణ్యం యిచ్చాను.

సన్నిధి గుడారం

ఒడంబడిక పెట్టె

పెట్టెను మూసే కరుణా పీఠము.

బల్ల, దానిమీద ఉండాల్సినవన్నీ ధూప వేదిక

దహన బలులు దహించే బలిపీఠం బలిపీఠం దగ్గర

ఉపయోగించే వస్తువులు గంగాళం, దాని క్రింద పీట.

10 యాజకుడు అహరోనుకు ప్రత్యేక వస్త్రాలన్నీ,

అతని కుమారులు యాజకులుగా పరిచర్య చేసేటప్పుడు ధరించాల్సిన ప్రత్యేక వస్త్రాలన్నీ,

11 అభిషేకానికి పరిమళ సువాసనగల తైలం,

పవిత్ర స్థలానికి అవసరమైన పరిమళ వాసనగల ధూపం.

ఈ పని వాళ్లు నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం అన్ని వస్తువులనూ తయారు చేస్తారు.”

సబ్బాతు

12 అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 13 “ఇశ్రాయేలు ప్రజలతో దీన్ని చెప్పు; ‘నా ప్రత్యేక విశ్రాంతి రోజులను గూర్చిన నియమాలను మీరు పాటించాలి. రాబోయే తరాలన్నింటిలో మీకు, నాకు మధ్య అవి ఒక గురుతుగా ఉంటాయి కనుక మీరు ఇలా చేయాలి. యెహోవానైన నేనే మిమ్మల్ని నా ప్రత్యేక ప్రజలుగా ఏర్పరచుకొన్నానని ఇది మీకు తెలియజేస్తుంది.

14 “‘సబ్బాతు[b] రోజును ఒక ప్రత్యేక రోజుగా చేయి. ఏ వ్యక్తి అయినా సరే సబ్బాతు రోజును మామూలు రోజుగానే పరిగణిస్తే, ఆ వ్యక్తిని చంపేయాలి. సబ్బాతు రోజున ఏ వ్యక్తి అయినా సరే పనిచేస్తే ఆ వ్యక్తి తన ప్రజల నుండి వేరు చేయబడాలి. 15 పని చేయడానికి వారంలో ఇంకా ఆరు రోజులున్నాయి. అయితే, ఏడో రోజు చాల ప్రత్యేకమైన విశ్రాంతి రోజు. సబ్బాతు నాడు ఏ వ్యక్తి అయినా సరే పనిచేస్తే వాణ్ణి చంపెయ్యాలి. 16 ఇశ్రాయేలు ప్రజలు సబ్బాతు రోజును జ్ఞాపకం ఉంచుకొని, దాన్ని ఒక ప్రత్యేక రోజుగా చేయాలి. ఇది నాకూ, వారికీ మధ్య శాశ్వతంగా కొనసాగే ఒడంబడిక. 17 ఇశ్రాయేలీయులకూ, నాకూ మధ్య శాశ్వత సంకేతం సబ్బాతు రోజే. యెహోవా ఆరు రోజులు పనిచేసి ఆకాశాన్ని, భూమిని చేసాడు. ఏడోరోజున ఏ పని చేయక విశ్రాంతి తీసుకొన్నాడు.’”

18 అలా సీనాయి పర్వతం మీద యెహోవా మోషేతో మాట్లాడ్డం ముగించాడు. అప్పుడు ఆజ్ఞలు రాయబడ్డ రెండు రాతి పలకలను యెహోవా మోషేకు ఇచ్చాడు. దేవుడు తన వ్రేలితో రాళ్లమీద ఈ ఆజ్ఞలు రాసాడు.

బంగారు దూడ

32 చాలాకాలం గడిచిపోయినా, మోషే పర్వతం దిగి రాకపోవడం ప్రజలు గమనించారు. కనుక ప్రజలు అహరోను చుట్టూ చేరారు, “చూడు, ఈజిప్టు దేశం నుండి మోషే మమ్మల్ని బయటకు నడిపించాడు. అయితే అతనికి ఏమయిందో మాకు తెలియదు. అందుచేత మా ముందర నడవడానికి ఒక దేవతను చేసి మమ్మల్ని నడిపించు” అని వారతనితో చెప్పారు.

“మీ భార్యలు, కుమారులు, కుమార్తెలకు చెందిన బంగారు వస్తువులను తీసుకురండి” అని అహరోను ప్రజలతో అన్నాడు.

కాబట్టి ప్రజలంతా వారి బంగారు వస్తువులను పోగుచేసి వాటిని అహరోను దగ్గరకు తెచ్చారు. ప్రజల దగ్గర నుండి అహరోను బంగారం తీసుకున్నాడు. అప్పుడు వాటితో ఒక దూడ విగ్రహం చేసాడు. విగ్రహం చెక్కడానికి అహరోను ఉలి ఉపయోగించాడు. (తర్వాత దానికి బంగారం పొదిగించాడు.)

అప్పుడు ప్రజలు, “ఓ ఇశ్రాయేలూ, ఈజిప్టు నుండి మిమ్మల్ని బయటకు నడిపించింది ఈ దేవుడే” అన్నారు.

అహరోను వీటన్నింటినీ చూసాడు. కనుక ఆ దూడ ఎదుట ఒక బలిపీఠం నిర్మించాడు. అప్పుడు అహరోను ఒక ప్రకటన చేసాడు. “రేపు యెహోవాకు ప్రత్యేక పండుగ” అని చెప్పాడు.

మర్నాడు ఉదయం పెందలాడే ప్రజలు మేల్కొన్నారు. వాళ్లు జంతువులను చంపి దహన బలులుగాను, సమాధాన బలులుగాను అర్పించారు. తిని, తాగేందుకు ప్రజలు కూర్చున్నారు. అప్పుడు వాళ్లు విచ్చలవిడిగా సంబరం చేసుకున్నారు.

అదే సమయంలో మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఈ పర్వతం దిగి వెళ్లు. నీ ప్రజలు, ఈజిప్టు దేశం నుండి నీవు బయటకు తీసుకు వచ్చిన ప్రజలు భయంకర పాపం చేసారు. వాళ్లు చేయాలని నేను ఆజ్ఞాపించిన సంగతుల నుండి వాళ్లు చాల త్వరగా తప్పి పోయారు. కరిగించిన బంగారంతో వాళ్లు ఒక దూడను చేసుకొన్నారు. వాళ్లు ఆ దూడను పూజిస్తూ దానికి బలులు చెల్లిస్తున్నారు. ‘ఇశ్రాయేలూ, ఈజిప్టు నుండి నిన్ను బయటకు రప్పించిన దేవుడు ఇదే, అని ప్రజలు చెప్పుకొనుచున్నారు.’”

“ఈ ప్రజలను నేను చూశాను. వీళ్లు ఎప్పుడూ నన్ను వ్యతిరేకించే మొండి ప్రజలని నాకు తెలుసు. 10 కనుక కోపంతో వాళ్లను నాశనం చేయనివ్వు, అప్పుడు నీలోనుండి ఒక జనాన్ని నేను తయారు చేస్తాను” అని మోషేతో యెహోవా అన్నాడు.

11 అయితే, మోషే తన దేవుడైన యెహవాను బ్రతిమాలుకొని: “ప్రభూ! నీ కోపం చేత నీ ప్రజలను నాశనం చేయకు. నీవే నీ మహాశక్తితో బలంతో ఈ ప్రజలను ఈజిప్టు నుండి తీసుకువచ్చావు. 12 అయితే, నీవే నీ ప్రజలను నాశనం చేస్తే, ‘యెహోవా తన ప్రజలకు చెడ్డకార్యాలను చేయాలని తలపెట్టాడు. అందుకే ఆయన వాళ్లను ఈజిప్టు నుండి బయటకు రప్పించాడు. పర్వతాల్లోనే వాళ్లను చంపాలని ఆయన అనుకున్నాడు. భూమి మీద తన ప్రజల్ని నాశనం చేయాలని ఆయన అనుకొంటున్నాడు’ అని ఈజిప్టు ప్రజలు చెప్పవచ్చు. కనుక నీ ప్రజల మీద కోపగించవద్దు. నీ కోపం విడిచిపెట్టేయి. నీ ప్రజల్ని నాశనం చేయకు. 13 నిన్ను సేవించిన మనుష్యులు అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలును (యాకోబు) జ్ఞాపకం చేసుకో. నీవు నీ పేరు ప్రయోగించి ఆ మనుష్యులకు వాగ్దానం చేసావు. ‘నీ ప్రజలను ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంతగా చేస్తాను. నేను వారికి వాగ్దానం చేసిన ఈ దేశం అంతా నీ ప్రజలకు ఇస్తాను. ఈ దేశం శాశ్వతంగా వారిదే అవుతుంది’ అని నీవు చెప్పావు.”

14 కనుక యెహోవా తన ప్రజలను గూర్చి సంతాపపడ్డాడు. ఆయన చేస్తానన్న కీడును వారికి చేయలేదు. అంటే, ప్రజలను ఆయన నాశనం చేయలేదు.

15 అప్పుడు మోషే పర్వతం దిగి వెళ్లాడు. ఆజ్ఞలు రాయబడ్డ రెండు రాతి పలకలు మోషే దగ్గర ఉన్నాయి. రాతికి వెనుక, ముందు రెండు వైపుల ఆజ్ఞలు రాయబడి ఉన్నాయి. 16 దేవుడు తానే ఆ రాళ్లను చేసాడు. మరియు దేవుడే ఆ రాళ్ల మీద ఆజ్ఞలు రాసాడు.

17 వారు పర్వతం దిగి వెళ్తున్నప్పుడు ప్రజలు బస చేసిన చోటు నుండి వచ్చిన శబ్ధం యెహోషువా విన్నాడు, “కింద బసలో యుద్ధధ్వని వినిపిస్తున్నట్టుంది” అని మోషేతో యెహోషువా అన్నాడు.

18 “అందుకు మోషే, అది జయధ్వనులు చేస్తున్న సైన్యం శబ్దం కాదు. ఓటమివల్ల ఒక సైన్యం ఏడుస్తున్న శబ్దమూ కాదు అది, నాకు వినబడుతోన్నది సంగీత శబ్దం” అని జవాబిచ్చాడు.

19 మోషే బసను సమీపించినప్పుడు, అతడు బంగారు దూడను, ప్రజలు నాట్యమాడటమూ చూసాడు. మోషేకు చాలా కోపం వచ్చి, ఆ ప్రత్యేక రాతి పలకలను నేలకేసి కొట్టాడు. పర్వతం కింది భాగంలో ఆ రాతి పలకలు ముక్కలు ముక్కలయ్యాయి. 20 అప్పుడు ప్రజలు చేసిన దూడను మోషే నాశనం చేసాడు. దాన్ని మంటల్లో వేసి కరిగించేసాడు. అప్పుడు ఆ బంగారం దుమ్ము అయ్యేంత వరకు నూరేసాడు. ఆ దుమ్మును నీళ్లలో పడేసి ఇశ్రాయేలు ప్రజల చేత బలవంతంగా ఆ నీళ్లు తాగించాడు.

21 “ఈ ప్రజలు నీకేమి చేసారు? ఇలాంటి చెడ్డ పాపం చేయడానికి నీవెందుకు వాళ్లను నడిపించావు?” అని అహరోనును మోషే అడిగాడు.

22 “అయ్యా, కోపగించకు. ఈ ప్రజలు తప్పు చేసేందుకు ఎప్పుడూ సిద్ధమేనని నీకు తెలుసు. 23 ‘ఈజిప్టు నుండి మోషే మమ్మల్ని నడిపించాడు. అయితే అతనికి ఏమయిందో మాకు తెలియదు. కనుక మమ్మల్ని నడిపించేందుకు మా కోసం ఒక దేవతను తయారు చేయి’ అని ప్రజలు నాతో అన్నారు. 24 కనుక ‘మీవద్ద ఉన్న బంగారు నగలను నాకు ఇవ్వండి’ అని ప్రజలతో చెప్పాను. ప్రజలు వారి బంగారం నాకు ఇచ్చారు. నేను ఆ బంగారాన్ని అగ్నిలో వేసాను. అగ్నిలో నుండి ఆ దూడ బయటకు వచ్చింది” అని అహరోను జవాబిచ్చాడు.

25 అహరోను అక్కడ గలభాకు కారణమని మోషే తెలుసుకున్నాడు. శత్రువులంతా చూడగలిగేటట్టు ప్రజలు వెర్రివాళ్లలా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. 26 కనుక నివాసాల ప్రవేశం దగ్గర మోషే నిలబడ్డాడు. “యెహోవాను వెంబడించాలని కోరేవారు ఎవరో వారు నా దగ్గరకు రావాలి.” అన్నాడు. లేవీ కుటుంబానికి చెందిన ప్రజలంతా మోషే దగ్గరకు పరుగెత్తారు.

27 అప్పుడు మోషే అన్నాడు, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఏమి చెబుతున్నాడో నేను మీకు చెబుతాను. ‘ప్రతి మనిషి తన కత్తి తీసుకొని మన బసలో ఒక చివర నుండి మరో చివరకు వెళ్లాలి. ప్రతి మనిషి తన సోదరుణ్ణి, స్నేహితుల్ని, ఇరుగు పొరుగువారిని చంపాల్సి వచ్చినా మీరు వారిని చంపాలి.’”

28 లేవీ కుటుంబానికి చెందిన ప్రజలు మోషే మాటకులోబడ్డారు. ఆ రోజు ఇశ్రాయేలీయులలో సుమారు 3,000 మంది చనిపోయారు. 29 అప్పుడు, “మీ కుమారులను, మీ సోదరులను దీవించే వారినిగా యెహోవా నేడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు” అని మోషే చెప్పాడు.

30 మర్నాటి ఉదయం ప్రజలందరికి మోషే, “మీరు భయంకర పాపం చేసారు. అయితే ఇప్పుడు నేను యెహోవా దగ్గరకు పైకి వెళ్తాను. ఆయన మీ పాపం విషయం మిమ్మల్ని క్షమించేందుకు నేనేమైనా చేయగలనేమో” అని చెప్పాడు. 31 కనుక మోషే యెహోవా దగ్గరకు తిరిగి వెళ్లి, “దయచేసి ఆలకించు! ఈ ప్రజలు చాలా చెడ్డ పాపం చేసి, బంగారంతో దేవుణ్ణి చేసారు. 32 ఇప్పుడు ఈ పాపం విషయం వారిని క్షమించు. నీవు గనుక వారిని క్షమించకపోతే, నీవు వ్రాసిన గ్రంథంలో[c] నా పేరు తుడిచేయి” అన్నాడు.

33 అయితే మోషేతో యెహోవా అన్నాడు, “నాకు వ్యతిరేకంగా ఎవరు పాపం చేస్తారో ఆ ప్రజల పేర్లు మాత్రమే నా గ్రంథంలో నుండి తుడిచి వేస్తాను. 34 కనుక కిందకు వెళ్లి, నేను నీకు చెప్పిన చోటుకు ప్రజలను నడిపించు. నీకు ముందు నా దేవదూత నడుస్తూ నిన్ను నడిపిస్తాడు. పాపం చేసిన వాళ్లను శిక్షించవలసిన సమయం వచ్చినప్పుడు వాళ్లు శిక్షించబడుతారు.” 35 కనుక ఆ ప్రజలకు భయంకర వ్యాధి వచ్చేటట్టు యెహోవా చేసాడు. వారు బంగారు దూడను చేయమని అహరోనుతో చెప్పినందువల్ల అతను అలా చేసాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International