Chronological
పిలాతు సమక్షంలో యేసు
(మత్తయి 27:1-2, 11-14; మార్కు 15:1-5; యోహాను 18:28-38)
23 మహాసభ సభ్యులందరూ లేచి యేసును పిలాతు ముందుకు పిలుచుకు వచ్చి, 2 “ఇతడు మన దేశాన్ని తప్పుదారి పట్టించటం మేము గమనించాము. చక్రవర్తికి పన్నులు కట్టరాదని, తాను క్రీస్తునని, రాజునని చెప్పుకుంటున్నాడు” అని ఫిర్యాదు చేసారు.
3 ఇది విని పిలాతు యేసుతో, “నీవు యూదుల రాజువా?” అని అడిగాడు.
“ఔను, మీరన్నది నిజం!” అని యేసు సమాధానం చెప్పాడు.
4 ఆ తర్వాత పిలాతు ప్రధాన యాజకులతో, ప్రజలతో, “ఇతనికి శిక్ష విధించటానికి నాకు ఏ కారణం కనిపించటం లేదు” అని అన్నాడు.
5 కాని వాళ్ళు, “ఇతడు తన బోధనలతో యూదయ ప్రాంతంలో ఉన్న ప్రజలనందరిని పురికొలుపుచున్నాడు. ఇది యితడు గలిలయలో ప్రారంభించి యిక్కడి దాకా వచ్చాడు” అని మళ్ళీ మళ్ళీ అన్నారు.
హేరోదు సమక్షంలో యేసు
6 ఇది విని పిలాతు వాళ్ళను, “అతడు గలిలయ దేశస్థుడా?” అని అడిగాడు. 7 యేసు, హేరోదు పాలిస్తున్న ప్రాంతానికి చెందినవాడని తెలుసుకొన్న వెంటనే, పిలాతు ఆయన్ని హేరోదు దగ్గరకు పంపాడు. అప్పుడు హేరోదు యెరూషలేములో ఉన్నాడు.
8 హేరోదుకు చాలాకాలం నుండి యేసును చూడాలని ఉంది. కనుక ఆయన్ని చూడగానే హేరోదుకు చాలా ఆనందం కలిగింది. యేసును గురించి విన్నవాటిని బట్టి ఆయన ఏదైనా మహాత్యం చేస్తాడేమోనని ఆశించాడు. 9 అతడు యేసును ఎన్నో ప్రశ్నలు అడిగాడు. కాని యేసు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. 10 ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసుపై తీవ్రంగా నేరారోపణ చేస్తూ అక్కడే నిలుచొని ఉన్నారు. 11 హేరోదు, అతని భటులు యేసును తిరస్కరించి, హేళన చేస్తూ నవ్వారు. ఆయనకు రాజ దుస్తులు తొడిగించి తిరిగి పిలాతు దగ్గరకు పంపారు. 12 ఆ రోజు హేరోదు, పిలాతు ఇద్దరూ మిత్రులయ్యారు. ఆనాటివరకు వాళ్ళు శత్రువులుగా ఉన్నారు.
మరణదండన విధించటం
(మత్తయి 27:15-26; మార్కు 15:6-15; యోహాను 18:39–19:16)
13 పిలాతు ప్రధానయాజకుల్ని, పాలకుల్ని, ప్రజల్ని, సమావేశపరిచాడు. 14 వాళ్ళతో, “తిరుగుబాటు చెయ్యటానికి ప్రజల్ని పురికొలుపుతున్నాడని అతణ్ణి మీరిక్కడికి పిలుచుకు వచ్చారు. మీ సమక్షంలోనే అతణ్ణి విచారించాము. మీ నేరారోపణలకు నాకు ఏమాత్రం కారణం కనపడటంలేదు. 15 హేరోదుకు కూడా ఏ తప్పూ కనిపించలేదు. కనుకనే అతణ్ణి తిరిగి మా దగ్గరకు పంపాడు. మరణ దండన పొందవలసిన నేరం అతడు చెయ్యలేదని మీరు గమనించారు. 16 అందువల్ల కొన్ని కొరడా దెబ్బలు కొట్టి విడుదల చేస్తాను” అని అన్నాడు. 17 [a]
18 వాళ్ళంతా ఒకే గొంతుతో, “అతణ్ణి చంపండి, బరబ్బను విడుదల చెయ్యండి” అని కేకలు వేశారు. 19 బరబ్బ తాను పట్టణంలో చేసిన ఒక తిరుగుబాటు కారణంగా, హత్య కారణంగా కారాగారంలో ఉన్నాడు.
20 యేసును విడుదల చెయ్యాలనే ఉద్దేశ్యంతో పిలాతు మళ్ళీ విజ్ఞప్తి చేశాడు. 21 కాని వాళ్ళు బిగ్గరగా, “అతణ్ణి సిలువకు వెయ్యండి!” అని కేకలు వేశారు.
22 మూడవసారి, పిలాతు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “ఎందుకు? అతడేమి నేరం చేశాడు? అతనికి మరణ దండన విధించటానికి నాకు ఏ కారణం కన్పించలేదు. అందువల్ల కొన్ని కొరడా దెబ్బలు కొట్టి విడుదల చేస్తాను.” అని అన్నాడు.
23 కాని, అతణ్ణి సిలువకు వెయ్యమని కేకలు వేయటం వాళ్ళు మానలేదు. చివరకు వాళ్ళు గెలిచారు. 24 పిలాతు వాళ్ళడిగినట్లు చెయ్యటానికి ఒప్పుకున్నాడు. 25 తిరుగుబాటు కారణంగా, హత్య కారణంగా కారాగారంలో ఉన్న వాళ్ళడిగిన బరబ్బను విడుదల చేసి యేసును వాళ్ళ కప్పగించాడు.
యేసుని సిలువకు వేయటం
(మత్తయి 27:32-44; మార్కు 15:21-32; యోహాను 19:17-19)
26 వాళ్ళు యేసును తీసుకొని వెళ్తూ, గ్రామం నుండి పట్టణంలోకి వస్తున్న సీమోను అనే వాణ్ణి పట్టుకొని అతనిపై సిలువను పెట్టి యేసు వెనుక నడిపించారు. సీమోను కురేనే గ్రామస్థుడు.
27 చాలామంది ప్రజలు యేసు వెనుక నడుస్తూ ఉన్నారు. వాళ్ళలో కొందరు స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళు గుండెలు బాదుకుంటూ, ఏడుస్తూ యేసు వెనుక నడిచారు. 28 యేసు వాళ్ళవైపు తిరిగి, “యెరూషలేము బిడ్డలారా! నా కోసం దుఃఖించకండి. మీ కోసం, మీ సంతానం కోసం దుఃఖించండి. 29 ‘గొడ్రాళ్ళుగా ఉన్న స్త్రీలు ధన్యులని, పిల్లలు కనని కడుపులు, పాలివ్వని స్తనములు ధన్యములైనవి’ అనే రోజులు వస్తాయి. 30 అప్పుడు వాళ్లు పర్వతాలతో తమ మీద పడమని అంటారు. కొండలతో కూలి తమను కప్పి వేయమని అడుగుతారు.(A) 31 చెట్టు పచ్చగా ఉన్నప్పుడే ప్రజలు ఈ విధంగా చేస్తే అది ఎండిపొయ్యాక ఏం చేస్తారు?” అని అన్నాడు.
32 మరణ దండన విధించటానికి, ఇద్దరు నేరస్థుల్ని కూడా యేసు వెంట తీసుకొని వెళ్తూ ఉన్నారు. 33 కల్వరి[b] అనబడే స్థలాన్ని చేరుకొన్నాక ఆ నేరస్థులు యిద్దర్నీ ఒకణ్ణి యేసుకు కుడివైపు, మరొకణ్ణి ఎడమవైపు ఉంచి ముగ్గుర్నీ సిలువకు వేసారు.
34 యేసు, “తండ్రి, వాళ్ళను క్షమించు, వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు”[c] అని అన్నాడు.
వాళ్ళు చీట్లు వేసి ఆయన దుస్తుల్ని పంచుకొన్నారు. 35 ప్రజలు జరుగుతున్న వాటిని చూస్తూ నిలబడి ఉన్నారు. పాలకులు ఎగతాళి చేసారు. వాళ్ళు, “ఇతర్లను రక్షించాడే! తాను దేవుడెన్నుకొన్న వాడైనట్లైతే, తాను ‘క్రీస్తు’ అయినట్లైతే తనను తాను రక్షించుకోనీ!” అని అన్నారు.
36 భటులు కూడా దగ్గరకు వచ్చి ఆయన్ని హేళన చేసారు. వాళ్ళు ఆయనకు పులిసిన ద్రాక్షారసం యిస్తూ 37 “నీవు యూదుల రాజువైతే నిన్ను నీవు రక్షించుకో!” అని ఎగతాళి చేసారు. 38 “ఇతడు యూదుల రాజు” అని వ్రాసి సిలువకు తగిలించారు.
39 ఆయనతో సహా సిలువకు వేయబడిన ఒక నేరస్థుడు, “నీవు క్రీస్తువు కదా! నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు!” అని అవమానపరిచాడు.
40 కాని మరొక నేరస్థుడు మొదటి వాణ్ణి గద్దిస్తూ, “నీవు దేవునికి భయపడవా! నీవు కూడా అదే శిక్ష అనుభవిస్తున్నావు కదా! మనల్ని శిక్షించటం న్యాయమే. 41 మనము చేసిన నేరానికి తగిన శిక్ష అనుభవిస్తున్నాము. కాని ఆయన ఏ అపరాధమూ చెయ్యలేదు” అని అన్నాడు. 42 ఆ తదుపరి ఆయనతో, “యేసూ! నీవు నీ రాజ్యం చెయ్యటం మొదలు పెట్టినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకో” అని అన్నాడు.
43 యేసు, “ఇది నిజం, ఈ రోజు నువ్వు నాతో సహా పరదైసులో[d] ఉంటావు” అని సమాధానం చెప్పాడు.
యేసు మరణం
(మత్తయి 27:45-56; మార్కు 15:33-41; యోహాను 19:28-30)
44-45 అప్పుడు మధ్యాహ్నం పండ్రెండు గంటల సమయం. సూర్యుడు ప్రకాశించటం మానేయటం వల్ల అప్పటినుండి మూడు గంటలదాకా ఆ దేశమంతా చీకటితో నిండిపోయింది. మందిరంలో ఉన్న తెర రెండు భాగాలుగా చినిగి పోయింది. 46 యేసు బిగ్గరగా, “తండ్రి! నా ఆత్మను నీ చేతుల్లో పెడ్తున్నాను” అని అన్నాడు. వెంటనే తన ప్రాణం వదిలాడు.
47 శతాధిపతి జరిగిందిచూసి దేవుణ్ణి స్తుతిస్తూ, “ఈయన నిజంగా నీతిమంతుడై ఉన్నాడు!” అని అన్నాడు.
48 ఈ దృశ్యం చూడాలని గుమికూడిన ప్రజలు జరిగినదాన్ని చూసి తమ గుండెలు బాదుకుంటూ వెళ్ళిపోయారు. 49 కాని ఆయనకు తెలిసిన వాళ్ళు, గలిలయ నుండి ఆయన్ని అనుసరిస్తూ వచ్చిన స్త్రీలు, యివన్నీ చూస్తూ కొంతదూరంలో నిలుచొని ఉన్నారు.
యేసును సమాధి చేయటం
(మత్తయి 27:57-61; మార్కు 15:42-47; యోహాను 19:38-42)
50 అరిమతయియ యూదుల గ్రామం. ఆ గ్రామానికి చెందిన యోసేపు అనేవాడు అక్కడ ఉన్నాడు. అతడు మహాసభ సభ్యుడు. 51 నీతిమంతుడు, మంచివాడు. యోసేపు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మహాసభ సభ్యులు యేసుకు మరణ శిక్ష విధించటానికి నిర్ణయించినప్పుడు అతడు ఒప్పుకోలేదు. 52 యోసేపు పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని తీసుకెళ్ళటానికి అనుమతి పొందాడు. 53 అతడు ఆ దేహాన్ని సిలువ నుండి క్రిందికి దింపి ఒక విలువైన బట్టలో చుట్టాడు. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి యిదివరకు ఎవర్నీ పెట్టని ఒక సమాధిలో ఉంచాడు. ఆ సమాధి పెద్దరాయి మలచి సిద్ధం చేయబడి ఉంది. 54 అది విశ్రాంతిరోజు కొరకు సిద్ధమౌతున్న రోజు. అది ప్రారంభం అవ్వబోతుంది.
55 యేసు వెంట గలిలయనుండి వచ్చిన స్త్రీలు యోసేపు వెంట వెళ్లి సమాధిని, అతడు ఆ సమాధిలో యేసు దేహాన్ని ఉంచిన దృశ్యాన్ని చూసారు. 56 ఆ తర్వాత వాళ్ళు యింటికి వెళ్ళి, అత్తరు, సుగంధ ద్రవ్యాలు సిద్ధం చేసారు.
కాని విశ్రాంతి రోజు ప్రారంభం అయినందువల్ల వాళ్ళు మోషే శాస్త్రం ప్రకారం ఏ పనీ చేయలేదు.
యేసును బంధించటం
(మత్తయి 26:47-56; మార్కు 14:43-50; లూకా 22:47-53)
18 యేసు ప్రార్థించటం ముగించాక తన శిష్యులతో కలిసి ప్రయాణమయ్యాడు. అంతా కలిసి కెద్రోను లోయ దాటి వెళ్ళారు. అక్కడ ఒక ఒలీవల తోట ఉంది. వాళ్ళు ఆ తోటలోకి వెళ్ళారు.
2 యేసు తన శిష్యులతో తరుచు యిక్కడ కలుసుకొంటూ ఉండేవాడు కనుక ఆయనకు ద్రోహం చేసిన యూదాకు ఈ స్థలం తెలుసు. 3 అందువల్ల యూదా ఒక సైనిక దళాన్ని, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన కొంతమంది రక్షక భటుల్ని వెంట బెట్టుకొని వచ్చాడు. వాని వెంట ఉన్న వాళ్ళు ఆయుధాలను, దివిటీలను, దీపాలను, పట్టుకొని వాణ్ణి అనుసరించారు.
4 యేసుకు జరుగనున్నదంతా తెలుసు. ఆయన ముందుకు వచ్చి, “వాళ్ళతో మీకెవరు కావాలి?” అని అడిగాడు.
5 “నజరేతుకు చెందిన యేసు!” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
“ఆయన్ని నేనే!” అని యేసు అన్నాడు. ద్రోహం చేసిన యూదా వాళ్ళతో నిలుచుని ఉన్నాడు. 6 యేసు, “నేనే ఆయన్ని” అని అనటం విని వాళ్ళు ఒక అడుగు వెనక్కు వేసి క్రింద పడిపోయారు.
7 యేసు, “మీకెవరు కావాలి?” అని మళ్ళీ అడిగాడు.
వాళ్ళు, “నజరేతుకు చెందిన యేసు” అని సమాధానం చెప్పారు.
8 యేసు, “ఆయన్ని నేనే అని చెప్పానుగా? మీరు నా కోసం చూస్తుంటే వీళ్ళను మాత్రం వెళ్ళ నివ్వండి” అని అన్నాడు. 9 “నీవు నాకప్పగించిన వాళ్ళలో ఒక్కణ్ణి కూడా నేను పోగొట్టుకోలేదు” అని ఆయన అన్న మాటలు నిజం కావటానికి యిలా జరిగింది.
10 సీమోను పేతురు దగ్గర ఒక కత్తి ఉండింది. అతడు ఆ కత్తి దూసి ప్రధాన యాజకుని సేవకుణ్ణి నరకటానికి పోయి, అతని కుడి చెవి నరికి వేసాడు. ఆ సేవకుని పేరు “మల్కు.” 11 యేసు పేతురుతో, “నీ కత్తి ఒరలో పెట్టు! నా తండ్రి యిచ్చిన పాత్ర నేను త్రాగకుండా ఉంటానా?” అని అన్నాడు.
యేసును అన్న దగ్గరకు పిలుచుకు వెళ్ళటం
(మత్తయి 26:57-58; మార్కు 14:53-54; లూకా 22:54)
12 ఆ తర్వాత సైనిక దళము, దళాధిపతి, రక్షక భటులు యేసును బంధించి, మొదట అన్న దగ్గరకు తీసుకు వెళ్ళారు. “అన్న” “కయపకు” కూమార్తె నిచ్చిన మామ. 13 “కయప” ఆ సంవత్సరానికి ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. 14 ప్రజల కొరకు ఒకే ఒక వ్యక్తి చనిపోవటం మంచిదని యూదులకు సలహా ఇచ్చిన వాడు ఇతడే!
పేతురు తెలియదనటం
(మత్తయి 26:69-70; మార్కు 14:66-68; లూకా 22:55-57)
15 సీమోను పేతురు, అతనితో పాటు యింకొక శిష్యుడు యేసు వెంట వెళ్ళారు. ఈ యింకొక శిష్యుడు ప్రధాన యాజకునికి తెలిసినవాడు. అందువల్ల అతడు యేసు వెంట ప్రధాన యాజకుని యింటి ఆవరణంలోకి వెళ్ళాడు. 16 కాని పేతురు బయట ద్వారం దగ్గర ఉండవలసి వచ్చింది. ప్రధాన యాజకునికి పరిచయమున్న ఆ యింకొక శిష్యుడు, బయటికి వచ్చి అక్కడవున్న కాపలా ఆమెతో మాట్లాడి పేతుర్ని లోపలికి పిలుచుకు వెళ్ళాడు. 17 “నీవు అతని శిష్యుల గుంపుకు చెందిన వాడవు కావా?” అని ద్వారం దగ్గరున్న కాపలాది పేతుర్ని అడిగింది.
“లేదు!” అని అతడు జవాబు చెప్పాడు.
18 చలిగా ఉంది కనుక రక్షక భటులు, సేవకులు, చలిమంట వేసి దాని చుట్టూ నిల్చున్నారు. పేతురు వెళ్ళి వారితో సహా చలికాచుకొనుచున్నాడు.
ప్రధానయాజకుడు యేసుని ప్రశ్నించటం
(మత్తయి 26:59-66; మార్కు 14:55-64; లూకా 22:66-71)
19 ప్రధానయాజకుడు యేసును ఆయన శిష్యుల్ని గురించి, ఆయన బోధిస్తున్న విషయాల్ని గురించి ప్రశ్నించాడు. 20 యేసు, “నేను సమాజమందిరాలలోను, యూదులు సమావేశమయ్యే దేవాలయంలోను బహిరంగంగా ఈ ప్రపంచానికి బోధించేవాణ్ణి. నేను రహస్యంగా ఏదీ బోధించలేదు. 21 అలాంటప్పుడు నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు. నేను చెప్పిన వాటిని గురించి, నా బోధనలను విన్న వాళ్ళను అడగండి. నేను చెప్పినవి వాళ్ళకు తెలుసు” అని అన్నాడు.
22 యేసు ఈ విధంగా మాట్లాడటం వలన ఆయన ప్రక్కన నిలుచున్న ఒక రక్షక భటుడు ఆయన చెంప మీద కొడుతూ, “ప్రధానయాజకునితో అలాగేనా మాట్లాడటం?” అని అన్నాడు.
23 యేసు, “నేను ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే చెప్పు. కాని నేను నిజం మాట్లాడాను. మరినన్నెందుకు కొట్టావు?” అని అడిగాడు.
24 ఆ తర్వాత అన్న ఆయనకు కట్టిన త్రాళ్ళు విప్పకుండా ప్రధాన యాజకుడు కయప దగ్గరకు పంపాడు.
పేతురు రెండవసారి, మూడవసారి తెలియదని అనటం
(మత్తయి 26:71-75; మార్కు 14:69-72; లూకా 22:58-62)
25 సీమోను పేతురు నిలుచొని యింకా చలికాగుతూ ఉన్నాడు. వాళ్ళు “నీవు అతని శిష్యుల్లో ఒకడివి కాదా?” అని అడిగారు.
“కాదు” అని పేతురు అన్నాడు.
26 ప్రధాన యాజకుని దగ్గర ఒకడు పని చేస్తూ ఉండేవాడు. వీని బంధువు చెవును పేతురు నరికివేసాడు. వాడు పేతురుతో, “నీవు అతనితో కలిసి తోటలో ఉండగా చూడలేదని అనుకొంటున్నావా?” అని అన్నాడు.
27 పేతురు మళ్ళీ, “లేదు” అన్నాడు. వెంటనే కోడి కూసింది.
పిలాతు సమక్షంలో యేసు
(మత్తయి 27:1-2, 11-31; మార్కు 15:1-20; లూకా 23:1-25)
28 ఆ తర్వాత యూదులు యేసును కయప నుండి రోము రాజ్యాధికారి భవానానికి తీసుకు వెళ్ళారు. తెల్లవారింది. పస్కా పండుగ భోజనం చెయ్యటానికి ముందు మైలపడ కూడదని వాళ్ళు రాజభవనంలోకి వెళ్ళలేదు. 29 పిలాతు వాళ్ళను కలవటానికి వెలుపలికి వచ్చి, “ఇతడేమి తప్పు చేసాడు?” అని అడిగాడు.
30 “అతడు నేరస్థుడు కానట్లైతే మీకు అప్పగించే వాళ్ళంకాదు!” అని అన్నారు.
31 పిలాతు, “అతణ్ణి మీరే తీసుకు వెళ్ళి మీ ధర్మ శాస్త్రాన్ననుసరించి విచారణ చేసుకోండి” అని అన్నాడు.
32 యూదులు, “మాకు మరణశిక్ష విధించే అధికారం లేదే!” అని సమాధానం చెప్పారు. యేసు, తాను ఎలాంటి మరణం పొందనున్నాడో యిది వరకే చెప్పాడు. అది నిజం కావాలని యిలా జరిగింది.
33 పిలాతు భవనంలోకి వెళ్ళి యేసును పిలిపించాడు. ఆయనతో, “నీవు యూదుల రాజువా?” అని అడిగాడు.
34 యేసు, “అది నీవు స్వయంగా వేసిన ప్రశ్నాలేక యితర్లు నా గురించి అలా చెప్పారా?” అని అడిగాడు.
35 పిలాతు, “నేను యూదుణ్ణి అని అనుకుంటున్నావా? నీ వాళ్ళు, మీ ప్రధాన యాజకుడు నిన్ను నాకు అప్పగించారు. నీవు ఏం చేసావు?” అని అడిగాడు.
36 యేసు, “నా రాజ్యం ఈ ప్రపంచానికి సంబంధించింది కాదు. అలాగైనట్లైతే నా అనుచరులు యూదుల చేత నేను బంధింపకుండా ఉండాలని వాళ్ళతో యుద్ధం చేసేవాళ్ళు. కాని నా రాజ్యం పరలోక సంబంధమైంది” అని అన్నాడు.
37 “అలాగైతే నీవు రాజువన్నమాట!” అని పిలాతు అన్నాడు.
యేసు జవాబు చెబుతూ, “నన్ను రాజని నీవనటం నిజమే. నేను సత్యాన్ని గురించి చెప్పటానికి జన్మించాను. ఆ కారణంగానే ఈ ప్రపంచంలోకి వచ్చాను. సత్యాన్ని ప్రేమించే వాళ్ళు నా మాట వింటారు.”
38 “సత్యం అంటే ఏమిటి?” అని పిలాతు అడిగాడు. ఇలా అన్నాక అతడు మళ్ళీ యూదుల దగ్గరకు వెళ్ళి, “అతణ్ణి శిక్షించటానికి నాకు ఏ కారణం కనిపించటం లేదు! 39 కాని మీ ఆచారం ప్రకారం ప్రతి పస్కాపండుగకు ఒక ఖైదీని విడుదల చెయ్యటం నా ధర్మం, ‘యూదుల రాజును’ విడుదల చేయమంటారా?” అని అడిగాడు.
40 వాళ్ళు బిగ్గరగా కేకలు వేస్తూ, “వద్దు, అతణ్ణి కాదు. బరబ్బను విడుదల చెయ్యండి!” అని అన్నారు. ఈ బరబ్బ ఒక బందిపోటు దొంగ.[a]
19 ఆ తర్వాత పిలాతు యేసును తీసుకు వెళ్ళి కొరడాలతో కొట్టించాడు. 2 భటులు ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి యేసు తలపై పెట్టారు. ఆయనకు ఊదారంగు వస్త్రాన్ని తొడిగించారు. 3 ఆయన దగ్గరకు మాటి మాటికి వెళ్ళి, “యూదుల రాజా! జయము!” అని అంటూ ఆయన ముఖం మీద కొట్టారు.
4 పిలాతు మరొకసారి వెలుపలికి వచ్చి యూదులతో, “యిదిగో చూడండి! అతణ్ణి మీ ముందుకు తెస్తున్నాను. అతణ్ణి శిక్షించటానికి నాకే కారణం కనిపించటంలేదు. ఇది మీరు గ్రహించాలి” అని అన్నాడు. 5 యేసుకు ముళ్ళ కిరీటాన్ని, ఊదారంగు దుస్తుల్ని ధరింపజేసి వెలుపలికి తీసుకొచ్చారు. పిలాతు వాళ్ళతో, “ఆ మనిషిని చూడండి!” అని అన్నాడు.
6 ప్రధానయాజకులు, అధికారులు యేసును చూడగానే, “సిలువకు వెయ్యండి! సిలువకు వెయ్యండి!” అని కేకలు వేసారు.
కాని పిలాతు, “మీరే తీసుకు వెళ్ళి సిలువకు వెయ్యండి. అతణ్ణి శిక్షించటానికి నాకే కారణం కనిపించటం లేదు” అని అన్నాడు.
7 కాని యూదులు, “మాకో న్యాయశాస్త్రం ఉంది. తాను, ‘దేవుని కుమారుడను’ అని అన్నాడు కనుక, మా న్యాయశాస్త్రం ప్రకారం అతడు మరణ దండన పొందాలి!” అని అన్నారు.
8 పిలాతు ఇది విని యింకా భయపడి పొయ్యాడు. 9 అతడు తిరిగి భవనంలోకి వెళ్ళి యేసుతో, “నీ స్వగ్రామం ఏది?” అని అడిగాడు. కాని యేసు దానికి సమాధానం చెప్పలేదు. 10 పిలాతు, “నాతో మాట్లాడటానికి నిరాకరిస్తున్నావా? నిన్ను విడుదల చేయటానికి, సిలువకు వేయటానికి నాకు అధికారం ఉందని నీకు తెలియదా?” అని అన్నాడు.
11 యేసు సమాధానంగా, “పైన ఉన్నవాడు యిస్తే తప్ప నీకు నాపై ఏ అధికారం లేదు. కనుక నన్ను నీకు అప్పగించిన వాడు ఎక్కువ పాపం చేసాడు” అని అన్నాడు.
12 ఆ క్షణం నుండి, పిలాతు యేసును విడుదల చెయ్యాలని ప్రయత్నించాడు. కాని యూదులు, “ఇతణ్ణి విడుదల చేస్తే నీవు చక్రవర్తికి మిత్రుడవు కాదు. తాను రాజునన్న ప్రతి ఒక్కడూ చక్రవర్తిని వ్యతిరేకించిన వాడౌతాడు!” అని కేకలు వేసారు.
13 ఇది విని పిలాతు యేసును వెలుపలికి పిలుచుకొని వచ్చాడు. “రాళ్ళు పరచిన స్థలంలో” ఉన్న న్యాయపీఠంపై కూర్చున్నాడు. దీన్ని హీబ్రూ భాషలో “గబ్బతా” అని అంటారు. 14 అది పస్కా పండుగకు సిద్ధపడబొయ్యేరోజు. అప్పుడు ఉదయం సుమారు ఆరు గంటల సమయం. పిలాతు యూదులతో, “ఇదిగో మీ రాజు” అని అన్నాడు.
15 కాని వాళ్ళు, “తీసుకు వెళ్ళండి, తీసుకు వెళ్ళండి. సిలువకు వేయండి!” అని కేకలు వేసారు.
పిలాతు, “మీ రాజును సిలువకు వేయ మంటారా?” అని అన్నాడు.
ప్రధానయాజకులు, “చక్రవర్తి తప్ప మాకు వేరే రాజు లేడు” అని సమాధానం చెప్పారు.
16 తదుపరి, పిలాతు ఆయన్ని సిలువకు వెయ్యమని భటులకు అప్పగించాడు.
యేసుని సిలువకు వేయటం
(మత్తయి 27:32-44; మార్కు 15:21-32; లూకా 23:26-39)
17 భటులు యేసును తీసుకు వెళ్ళారు. తన సిలువను మోసుకొని యేసు “పుర్రె స్థలాన్ని” చేరుకున్నాడు. హీబ్రూ భాషలో దీన్ని “గొల్గొతా” అంటారు. 18 ఇక్కడ ఆయన్ని సిలువకు వేసారు. ఆయనకు ఇరువైపు మరొక యిద్దర్ని సిలువకు వేసారు.
19 పిలాతు, ఒక ప్రకటన వ్రాయించి ఆయన సిలువకు తగిలించాడు. ఆ ప్రకటనలో, “నజరేతు నివాసి యేసు యూదుల రాజు” అని వ్రాయబడి ఉంది. 20 యేసును సిలువకు వేసిన స్థలము పట్టణానికి దగ్గరగా ఉంది. ఆ ప్రకటన హీబ్రూ, రోమా, గ్రీకు భాషల్లో వ్రాయబడి ఉంది. కనుక చాలా మంది యూదులు ఈ ప్రకటన చదివారు.
21 యూదుల ప్రధాన యాజకులు దీన్ని గురించి పిలాతు ముందు ఫిర్యాదు చేస్తూ, “‘యూదుల రాజు’ అని వ్రాసారెందుకు? ‘ఇతడు, తాను యూదుల రాజని అన్నాడు’ అని వ్రాయండి” అని అన్నారు.
22 పిలాతు, “వ్రాసిందేదో వ్రాసాను” అని సమాధానం చెప్పాడు.
23 భటులు యేసును సిలువకు వేసాక ఆయన దుస్తుల్ని నాలుగు భాగాలుగా చేసి తలొకటి పంచుకున్నారు. వాళ్ళు ఆయన పొడుగాటి అంగీని కూడా లాక్కున్నారు. అది పైనుండి క్రింది దాకా కుట్టు లేకుండా నేయబడి ఉంది. 24 ఆ భటులు, “దీన్ని చింపకుండా చీట్లు వేసి ఎవరికి దొరుకుతుందో చూద్దాం!” అని మాట్లాడుకున్నారు. ఈ విధంగా అనుకున్నట్లు చేసారు:
“వాళ్ళు నా దుస్తుల్ని పంచుకొన్నారు!
నా దుస్తుల కోసం చీట్లు వేసారు!”(A)
లేఖనాల్లో వ్రాయబడిన విషయం నిజం కావటానికి యిలా జరిగింది.
25 యేసు సిలువదగ్గర ఆయన తల్లి, తల్లి యెక్క సోదరి, క్లోపా భార్య మరియ, మగ్దలేనే మరియ, నిలుచొని ఉన్నారు. 26 యేసు తన తల్లి, తన ప్రియ శిష్యుడు అక్కడ నిలుచొని ఉండటం చూసాడు. తన తల్లితో, “అమ్మా! ఇదిగో నీ కుమారుడు” అని అన్నాడు. 27 ఆ శిష్యునితో, “ఇదిగో నీ తల్లి!” అని అన్నాడు. ఆనాటి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు.
యేసు మరణం
(మత్తయి 27:45-56; మార్కు 15:33-41; లూకా 23:44-49)
28 ఆ తర్వాత యేసు అంతా ముగిసిందని గ్రహించాడు. ఆయన, “నాకు దాహం వేస్తోంది” అని అన్నాడు. లేఖనాల్లో వ్రాసింది నిజంకావటానికి ఇలా జరిగింది. 29 పులిసిన ద్రాక్షారసం ఉన్న ఒక కుండ అక్కడ ఉంది. వాళ్ళు ఒక స్పాంజి ఆ కడవలో ముంచి, హిస్సోపు చెట్టుకొమ్మపై ఆ స్పాంజి పెట్టి, దాన్ని యేసు పెదాలకు అందించారు. 30 ఆయన దాన్ని రుచిచూచి, “అంతా ముగిసింది” అని అన్నాడు. ఆ మాట అన్నాక, తలవాల్చి ఆత్మను అప్పగించాడు.
31 అది పండుగకు సిద్దమయ్యే రోజు. మరుసటి రోజు విశేషమైన విశ్రాంతి రోజు[b] కనుక ఆ రోజు వాళ్ళను సిలువపై వదిలి వేయటం యూదులకు యిష్టం లేదు. అందువల్ల వాళ్ళు వారి కాళ్ళు విరగ్గొట్టి వారిని క్రిందికి దింపి వెయించుమని పిలాతును అడిగారు. 32 భటులు వచ్చి యేసుతో సిలువకు వేయబడిన మొదటి వాని కాళ్ళు, రెండవ వాని కాళ్ళు విరగ్గొట్టారు. 33 వాళ్ళు యేసు దగ్గరకు వచ్చి ఆయన అప్పటికే చనిపోయినట్లు గమనించారు. అందువల్ల వాళ్ళు ఆయన కాళ్ళు విరగ్గొట్టలేదు.
34 దానికి మారుగా భటుల్లో ఒకడు యేసు డొక్కను బల్లెంతో పొడిచాడు. వెంటనే రక్తం, నీళ్ళు కారాయి. 35 మీరు కూడా విశ్వసించాలని ఈ సంఘటన చూసిన వాడు దీన్ని గురించి చెప్పాడు. అతడు చెప్పింది నిజం. తాను సత్యం పలుకుతున్నట్లు అతనికి తెలుసు. 36-37 లేఖనాల్లో వ్రాయబడిన విషయాలు నిజం కావటానికి యిలా జరిగింది. ఒకచోట ఇలా వ్రాయబడి ఉంది: “ఆయనలో ఒక్క ఎముక కూడ విరువబడదు.”(B) మరొక చోట, ఇలా వ్రాయబడివుంది: “తాము పొడిచిన వాని వైపు వాళ్ళు చూస్తారు.”(C)
యేసును సమాధి చేయటం
(మత్తయి 27:57-61; మార్కు 15:42-47; లూకా 23:50-56)
38 ఆ తర్వాత “అరిమతయియ” గ్రామానికి చెందిన యోసేపు, యేసు దేహాన్నివ్వమని పిలాతును అడిగాడు. యోసేపు యూదులంటే భయపడేవాడు. కనుక రహస్యంగా యేసు శిష్యుడైనాడు. పిలాతు అంగీకారం పొంది అతడు యేసు దేహాన్ని తీసుకు వెళ్ళాడు.
39 అతని వెంట “నీకొదేము” కూడా ఉన్నాడు. క్రితంలో ఒక నాటి రాత్రి యేసును కులుసుకున్న వాడు యితడే. ఇతడు ముప్పై అయిదు కిలోలబోళం, అగరుల మిశ్రమాన్ని తన వెంట తీసుకు వచ్చాడు. 40 వాళ్ళిద్దరూ కలిసి యేసు దేహాన్ని సుగంధ ద్రవ్యాల్లో ఉంచి, దాన్ని నారగుడ్డలో చుట్టారు. ఇలా చెయ్యటం యూదుల సాంప్రదాయం. 41 యేసును సిలువకు వేసిన చోట ఒక తోట ఉంది. ఆ తోటలో ఒక కొత్త సమాధిఉంది. ఆ సమాధిలో అంతవరకు ఎవర్నీ ఉంచలేదు. 42 అది యూదులు పండుగకు సిద్ధం అవ్వ బోయే రోజు. పైగా ఆ సమాధి సిలువకు సమీపంలో ఉంది. కనుక వాళ్ళు ఆయన దేహాన్ని ఆ సమాధిలో ఉంచారు.
© 1997 Bible League International