Add parallel Print Page Options

యేసుని సిలువకు వేయటం

(మత్తయి 27:32-44; లూకా 23:26-39; యోహాను 19:17-19)

21 కురేనే పట్టణానికి చెందిన సీమోను అనే వాడొకడు పొలాలనుండి ఆ దారిన వెళ్తూ ఉన్నాడు. ఇతడు అలెక్సంద్రుకు మరియు రూపునకు తండ్రి. భటులు యితనితో బలవంతంగా సిలువ మోయించారు. 22 వాళ్ళు యేసును గొల్గొతాకు తీసుకువచ్చారు. గొల్గొతా అంటే “పుర్రెలాంటి స్థలం” అని అర్థం. 23 అక్కడ వాళ్ళు ఆయనకు ద్రాక్షారసంలో మత్తు కలిపి త్రాగమని యిచ్చారు. కాని ఆయన త్రాగలేదు. 24 ఆ తర్వాత వాళ్ళాయన్ని సిలువకు వేసారు. ఆయన దుస్తులు పంచుకోవటానికి చీట్లు వేసి ఎవరికి వచ్చినవి వాళ్ళు తీసుకొన్నారు.

25 ఆయన్ని సిలువ వేసినప్పుడు ఉదయం తొమ్మిది గంటలు. 26 ఆయనపై మోపబడిన నేరాన్ని, “యూదులరాజగు యేసు” అని ఒక పలకపై వ్రాసి తగిలించారు. 27 ఆయనతో సహా యిద్దరు బందిపోటు దొంగలను ఒకణ్ణి కుడి వైపు, మరొకణ్ణి ఎడమవైపు సిలువకు వేసారు. 28 [a]

29 ఆ దారి మీద నడిచివెళ్ళే వాళ్ళు ఆయన్ని అవమానపరచారు. వాళ్ళు తమ తలలాడిస్తూ, “మరి మందిరాన్ని పడగొట్టి మూడు రోజుల్లో మళ్ళీ కట్టిస్తానన్న వాడవు గదా. 30 సిలువ నుండి క్రిందికి దిగి నిన్ను నీవు కాపాడుకోలేవా?” అని అన్నారు.

31 ప్రధాన యాజకులు, శాస్త్రులు కూడా ఆయన్ని హేళన చేస్తూ “ఇతరులను రక్షించాడు కాని తనను తాను రక్షించుకోలేడు. 32 ఈ క్రీస్తు, ఈ ఇశ్రాయేలు రాజు సిలువనుండి క్రిందికి దిగివస్తే చూసి అప్పుడు విశ్వసిస్తాము” అని పరస్పరం మాట్లాడుకొన్నారు. ఆయనతో సహా సిలువకు వేయబడ్డ వాళ్ళు కూడా యేసును అవమానించారు.

Read full chapter

Footnotes

  1. 15:28 కొన్ని గ్రీకు ప్రతులలో 28వ వచనం చేర్చబడింది: “‘తద్వారా ఆయన్ని నేరస్తులతో సమానంగా పరిగణించారు’ అని శాస్త్రాల్లో వ్రాసిన వాక్యం నిజమయింది.”