Add parallel Print Page Options

పిలాతు సమక్షంలో యేసు

(మత్తయి 27:1-2, 11-14; లూకా 23:1-5; యోహాను 18:28-38)

15 తెల్లవారుఝామున ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభకు చెందిన అందరు సభ్యులు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు యేసును బంధించి తీసుకెళ్ళి పిలాతుకు[a] అప్పగించారు.

పిలాతు, “నీవు యూదులకు రాజువా?” అని అడిగాడు.

“మీరే అంటున్నారుగా!” అని యేసు సమాధానం చెప్పాడు.

ప్రధానయాజకులు యేసు మీద ఎన్నో నేరాలు మోపారు. అందువల్ల పిలాతు యేసుతో మళ్ళీ, “నీవు సమాధానం చెప్పదలచుకోలేదా? వాళ్ళు నీ మీద ఎన్ని నేరాలు మోపుతున్నారో చూడు!” అని అన్నాడు.

అయినా యేసు సమాధానం చెప్పలేదు. ఇది చూసి పిలాతుకు చాలా ఆశ్చర్యం వేసింది.

మరణదండన విధించటం

(మత్తయి 27:15-31; లూకా 23:13-25; యోహాను 18:39–19:16)

పండుగ రోజు ప్రజల కోరిక ప్రకారం ఒక నేరస్తుణ్ణి విడుదల చేయటం ఒక ఆచారం. తిరుగుబాటులో పాల్గొని హత్యలు చేసిన వాళ్ళు కారాగారంలో ఉన్నారు. వాళ్ళలో బరబ్బ ఒకడు.

ప్రజలు పిలాతు దగ్గరకు వచ్చి ప్రతి సంవత్సరం విడుదల చేసినట్లే ఆ సంవత్సరం కూడా ఒకణ్ణి విడుదల చెయ్యమని కోరారు. 9-10 ప్రధానయాజకులు అసూయవల్ల యేసును తనకప్పగించారని పిలాతుకు తెలుసు. కనుక, “యూదుల రాజును విడుదల చెయ్యమంటారా?” అని అడిగాడు. 11 కాని ప్రధానయాజకులు యేసుకు మారుగా బరబ్బాను విడుదల చేసేటట్లు పిలాతును కోరమని ప్రజలను పురికొల్పారు.

12 పిలాతు, “మరి మీరు ‘యూదుల రాజు’ అని పిలిచే ఈ మనిషిని ఏం చెయ్యమంటారు?” అని అడిగాడు.

13 వాళ్ళు, “సిలువకు వేయుము!” అని కేకలు వేసారు.

14 “ఎందుకు? అతడు చేసిన నేరమేమిటి?” అని పిలాతు అడిగాడు.

ప్రజలు యింకా బిగ్గరగా, “అతణ్ణి సిలువకు వేయండి” అని కేకలు వేసారు.

15 ఆ ప్రజల గుంపును ఆనందపరచాలని వాళ్ళు అడిగినట్లు బరబ్బను విడుదల చేసాడు. కొరడా దెబ్బలు కొట్టి సిలువకు వెయ్యమని యేసును భటులకు అప్పగించాడు.

16 భటులు యేసును రాజభవనంలో, అంటే ప్రేతోర్యమునకు తీసుకెళ్ళి, భటులందరిని సమావేశ పరచారు. 17 వాళ్ళాయనకు ఊదారంగు రాజ దుస్తులను తొడిగించారు. ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలపై పెట్టారు. 18 ఆ తర్వాత, “యూదుల రాజా! జయము!” అని ఆయన్ని పిలుస్తూ కేకలు వేసారు. 19 ఆయన తలపై కర్రతో మాటి మాటికి కొడుతూ ఆయన మీద ఉమ్మివేసారు. ఆయన ముందు వంగి తమ మోకాళ్ళపై కూర్చొని ఆయన్ని వ్యంగ్యంగా పూజించారు. 20 ఆయన్ని హేళన చేసిన తర్వాత, ఊదారంగు దుస్తుల్ని తీసేసి ఆయన దుస్తుల్ని ఆయనకు తొడిగించారు. ఆ తర్వాత ఆయన్ని సిలువకు వేయటానికి తీసుకు వెళ్ళారు.

Read full chapter

Footnotes

  1. 15:1 పిలాతు యూదయ రాష్ట్రపాలకుడు. క్రీ. శ. 26-36.