Beginning
సన్బల్లటు, టోబీయా
4 మేము యెరూషలేము ప్రాకారాన్ని నిర్మిస్తున్నామన్న వార్తను సన్బల్లటు విన్నాడు. అతను కోపంతో ఉగ్రరూపం దాల్చాడు. అతను యూదులను ఎగతాళి చెయ్యనారంభించాడు. 2 సన్బల్లటు తన మిత్రులతోనూ, షోమ్రోను సైన్యంతోనూ మాట్లాడాడు. అతను ఇలా అన్నాడు: “ఈ బలహీన యూదులు చేస్తున్నపని యేమిటి? మనం ఊరుకొంటామని అనుకుంటున్నారా వీళ్లు? తాము బలులు ఇద్దామనే అనుకుంటున్నారా వీళ్లు? బహూశః ఒక్క రోజులో ప్రాకార నిర్మాణం పని పూర్తి చేస్తామని అనుకుంటున్నట్లుంది వీళ్లు. ఈ చెత్త, దుమ్ము గుట్టల్నుంచి రాళ్లకు జీవం పొయడం వీళ్ల తరం కాదు. ఇవి వట్టి బూడిద రాసులు, ధూళి కుప్పలు!”
3 సన్బల్లటుతోనే ఉన్న అమ్మోనీయుడు టోబీయా ఇలా అందుకున్నాడు: “ఈ యూదులు తామేదో గొప్పగా కట్టేస్తున్నామని అనుకుంటున్నట్లుంది. దాని మీద ఒక చిన్న నక్కపిల్ల ఎక్కితే చాలు, వాళ్ల రాతి గోడ కాస్తా కుప్పకూలిపోతుంది!”
4 నెహెమ్యా ఇలా దైవ ప్రార్థన చేశాడు: “ఓ మా దేవా, మా మొర ఆలకించు. వీళ్లకి మేమంటే ద్వేషం. ఈ సన్బల్లటు, టోబీయా మమ్మల్ని అవమానిస్తున్నారు. వాళ్ల నిందలు వాళ్లకే వచ్చేటట్లు చెయ్యి దేవా. బానిసలుగా, చెరబట్టబడిన వాళ్ల మాదరిగా వాళ్లను సిగ్గుపడనియ్యి. 5 వాళ్ల నేరాన్ని తీసివేయవద్దు. వారి పాపాలను క్షమించవద్దు. ప్రాకారం నిర్మిస్తున్న వాళ్లను వీళ్లు అవమానించారు, వాళ్లని వీళ్లు నిరుత్సాహపరిచారు.”
6 మేము యెరూషలేము ప్రాకారాన్ని నిర్మించాము, మేము నగరం చుట్టూ గోడకట్టాము. అయితే, అది ఉండాల్సిన దానికి సగం ఎత్తు మాత్రమే ఉంది. జనం హృదయపూర్వకంగా పనిచేశారు. అందుకే మేము ఇంత మాత్రమైనా కట్టగలిగాము.
7 కాని, సన్బల్లటు, టోబియా, అరబ్బీయులు, అమ్మోనీయులు, అష్డోదువాసులు, కోపంతో నిండు కొనియున్నారు. జనం యెరూషలేము ప్రాకారాలు బాగుచేసే పని కొనసాగిస్తున్నట్లు, గోడల మధ్య కంతలను పూడుస్తున్నట్లు వాళ్లు విన్నారు. ఈ విషయమై వాళ్లు అధికముగా కోపగించుకొని 8 ఒకచోట కూడి యెరూషలేముకు వ్యతిరేకంగా కుట్రలు పన్నారు. వాళ్లు యెరూషలేముకు వ్యతిరేకంగా కల్లోలం లేవగొట్టాలనీ, వాళ్లు వచ్చి నగరం మీద పోరాటం జరపాలనీ పథకం పన్నారు. 9 అయితే, మేము మా దేపుణ్ణి ప్రార్థించాము. అంతేకాదు, వాళ్లు వస్తే, వాళ్లని ఎదిరించి పోరాడగలిగేందుకుగాను గోడలమీద రాత్రింబగళ్లు కాపలా కోసం కాపలావారిని పెట్టాం.
10 అప్పుడు యూదా వాసులు తమ నిరుత్సాహాన్ని ఇలా వెలిబుచ్చారు: “పనివాళ్లు అలసిపోతున్నారు. దోవలో బోలెడు దుమ్మూ, రద్దూ పేరుకు పోయాయి. మనం గోడ కట్టడాన్ని కొనసాగించలేము. 11 పోతే, మన శత్రువులేమో ఇలా అంటున్నారు: ‘యూదులపై మనము అకస్మాత్తుగా దాడిచేద్దాము. వాళ్లు మనలను చూడకముందే, మనం ఎవరమో తెలిసికోకముందే మనం వాళ్ల మధ్య ఉంటాము, వాళ్లని చంపేస్తాము. దానితో వాళ్ల పని నిలిచిపోతుంది.’”
12 తర్వాత మన శత్రువుల మధ్య నివసించే మన యూదులు మా దగ్గరికి వచ్చి, “మన శత్రువులు మనచుట్టూ వున్నారు. మేము ఎటు తిరిగితే అటు వాళ్లు ప్రత్యక్షమౌతున్నారు” అంటూ పదే పదే చెప్పారు.
13 అందుకని, నేను కొందర్ని గోడ బాగా పోట్టిగా వున్న చోట్ల గోడ వెనక కాపలా పెట్టాను. నేను వాళ్లని గోడకి కంతలున్న స్థలాల్లో నిలిపాను. నేను ఆయా కుటుంబాలను ఒక చోట చేర్చి, కత్తులు, శూలాలు, విల్లమ్ములతో నిలిపాను. 14 అప్పుడు నేను ముఖ్యమైన కుటుంబాలతో, ఉద్యోగులతో, మిగిలిన జనంతో ఇల చెప్పాను: “మన శత్రువులంటే భయపడకండి. మన ప్రభువును తలుచుకోండి. యెహోవా గొప్పవాడు, శక్తిశాలి! మీరు మీ సోదరుల కోసం, మీ కుమారుల కోసం, మీ కుమార్తెల కోసం పోరాడాలి! మీరు మీ భార్యల కోసము, మీ గృహాల కోసం పోరాడాలి!”
15 తమ పథకాలు మాకు తెలిసిపోయాయన్న విషయం మా శత్రువులు విన్నారు. తమ పథకాలను దేవుడు భగ్నం చేశాడని వాళ్లు గ్రహించారు. తర్వాత మేమందరం తిరిగి పని ప్రారంభించాము. ప్రతి ఒక్కడూ తను వదిలిన పని భాగానికి తిరిగి వెళ్లాడు. 16 ఆనాటి నుంచి నా మనుషుల్లో సగం మంది గోడ కట్టడంలో నిమగ్నులు కాగా, మిగిలిన సగం మంది ఈటెలు, బల్లెములు, విల్లమ్ములు, కవచాలతో కాపలా పనిలో నిమగ్నులయ్యారు. సేనాధిపతులు ప్రాకార నిర్మాణంలో నిమగ్నులైన యూదా ప్రజలందరి వెనుక నిలిచారు. 17 గోడ కట్టేవాళ్లు, వాళ్ల సహాయకులు ఒక చేత్తో పనిముట్లను, మరో చేత్తో ఆయుధాలను పట్టుకున్నారు. 18 పని చేస్తున్న ప్రతి ఒక్క తాపీవాడూ తన ప్రక్కనే ఒక కత్తిని పెట్టుకున్నాడు. శత్రువుల రాకను గురించి హెచ్చరించేందుకు బూర ఊదేవాడు నా ప్రక్కన నిలబడ్డాడు. 19 అప్పుడు నేను ఆయా ప్రముఖ కుటుంబాల వాళ్లను, ఉద్యోగులను, మిగిలిన జనాన్ని ఉద్దేశించి ఇలా చెప్పాను, “ఇది చాలా పెద్ద పని. మనం గోడ పొడుగునా విస్తరించివున్నాము. మనం ఒకరికొకరం దూరంగా వున్నాము. 20 అందుకని, మీకు బూర శబ్దం వినిపించినప్పుడు, అక్కడికి మీరంతా పరుగున రండి. మనమంతా అక్కడ కలుద్దాము. మన దేవుడు మన పక్షాన పోరాడుతాడు!”
21 ఈ విధంగా మేము యెరూషలేము ప్రాకార నిర్మాణపు పని కొనిసాగించాము. మాలో సగం మంది శూలాలు ధరించి నిలబడ్డారు. మేము ఉదయం పొద్దు పొడిచినప్పటినుంచి రాత్రి చుక్కలు పొడిచే దాకా పనిచేశాము.
22 అప్పుడు నేను వాళ్లకి ఈ విషయాలు కూడా చెప్పాను: “ప్రతి ఒక్క తాపీవాడూ, అతని సహాయకుడూ రాత్రివేళ యెరూషలేములోనే వుండిపోవాలి. అప్పుడు వాళ్లు రాత్రుళ్లు కాపలాదార్లుగా, పగళ్లు పని వాళ్లుగా ఉండగలుగుతారు.” 23 సరే, నేనుగాని, నా సోదరులుగాని, నా మనుష్యులు గాని, కాపలావాళ్లుగాని, మాలో ఎవ్వరం మా దుస్తులు విప్పలేదు. మాలో ప్రతిఒక్కరూ అన్ని సమయాల్లో, చివరకు నీళ్లకు వెళ్లినప్పుడూ సైతం, ఆయుధాలు ధరించేవున్నాము.
బీదలకు నెహెమ్యా సహాయం
5 తమ యూదా సోదరుల మీద చాలామంది బీదవాళ్లు ఫిర్యాదు చేయసాగారు. 2 వాళ్లలో కొందరు, “మాకు చాలామంది పిల్లపాపలు వున్నారు. మేముతిండి తిని బ్రతికి వుండాలంటే, మాకు ధాన్యము దొరకాలి!” అన్నారు.
3 మరికొందరు, “ఇది కరువు కాలం. మేము ధాన్యము కోసం మా పొలాలు, ద్రాక్షతోటలు, ఇళ్లు కుదువ పెట్టాల్సి వస్తోంది” అని మొత్తుకున్నారు.
4 వేరే కొందరు, “మేము మా పొలాలకీ, ద్రాక్షాతోటలకీ రాజు విధించిన పన్నులు చెల్లించాలి. అయితే, ఆ పన్నులు చెల్లించేందుకు మా దగ్గర డబ్బులు లేక అప్పులు చేయవలసి వస్తోంది. 5 ఆ ధనికుల్ని చూడండి. మేము వాళ్లలాంటి మనుష్యులం కామా? వాళ్ల కొడుకులకి మా కొడుకులు ఏమైనా తీసి పోయారా? అయితేనేమి, మేము మా కొడుకుల్నీ, కూతుళ్లనీ బానిసలుగా అమ్ముకోవలసి వస్తోంది. ఇప్పటికే మాలో కొంతమందిమి మా కూతుళ్లను బానిసలుగా అమ్ముకోవలసి వచ్చింది! మాకు వేరే గత్యంతరం లేదు! ఇప్పటికే మేము మా పొలాలను, ద్రాక్షాతోటలను కోల్పోయాము! అవి ఇప్పుడు ఇతరుల చేతుల్లోకి పోయాయి” అని వాపోయారు.
6 వాళ్ల ఫిర్యాదులు వినేసరికి నాకు చాలా కోపం వచ్చింది. 7 నన్ను నేనే అణచుకుని, ఆ ధనిక కుటుంబాల దగ్గరికీ, ఉద్యోగుల వద్దకీ వెళ్లి, వారి మీద కోపగించుకొని ఇలా చెప్పాను: “మీరు మీ సోదరులకే అప్పులిచ్చి, వారిని వడ్డీ కట్టమని అడుగుతున్నారు. మీరిది కట్టి పెట్టాలి!” అప్పుడు నేను జనులందర్నీ ఒక చోట సమావేశ పరచి, 8 వాళ్లతో ఇలా చెప్పాను, “మన యూదా సోదరులు ఇతర దేశాల వాళ్లకి బానిసలుగా అమ్మబడుతున్నారు. మనం వాళ్లని కొని, వాళ్లని స్వతంత్రులను చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించాము. కాని ఇప్పడు మీరు మళ్లీ వాళ్లని బానిసలుగా అమ్మేస్తున్నారు!”
ఆ ధనికులూ, ఉద్యోగులూ మౌనంగా ఉండి పోయారు. వాళ్లకి ఏమి చెప్పేందుకూ తోచలేదు. 9 సరే, నేను ఇంకా ఇలా కొనసాగించాను: “మీరు చేస్తున్న పని సరైనది కాదు. దేవునిపట్ల భయభక్తులు కలిగి వుండాలన్న విషయం మీకు తెలుసు ఇతరులు చేసే సిగ్గుచేటైన పనులు మీరు చెయ్యకూడదు! 10 నా మనుష్యులూ, నా సోదరులూ, నేను కూడా డబ్బూ, ధాన్యము అప్పుగా ఇస్తున్నాను. అయితే, ఆ అప్పుల మీద వడ్డీ చెల్లించమని నిర్బంధించడం మనం మానుకోవాలి! 11 మీరు వాళ్లనుంచి తీసుకున్న పొలాలు, ద్రాక్షాతోటలు, ఒలీవ పొలాలు, ఇళ్లు వాళ్లకి తక్షణం తిరిగి ఇచ్చెయ్యాలి! మీరు వాళ్ల దగ్గర వసూలు చేసిన వడ్డీ సొమ్ము కూడా వాళ్లకి తక్షణం తిరిగి ఇచ్చెయ్యాలి! వాళ్లకి అప్పుగా ఇచ్చిన డబ్బుకు, ధాన్యానికీ, తాజా ద్రాక్షారసానికి, ఒలీవ నూనెకు మీరు ఒక శాతం వడ్డి తీసుకుంటున్నారు. మీరు సొమ్ము వాళ్లకి తిరిగి ఇచ్చెయ్యాలి!”
12 అప్పుడా ధనవంతులూ, ఉద్యోగులూ ఇలా సమాధానమిచ్చారు, “మేము వారి ఆస్తులను, వారిమీద వేసిన వడ్డీలను తిరిగి ఇచ్చేస్తాము. మేము వాళ్ల దగ్గర్నుంచి ఇంకేమీ అడగము. నెహెమ్యా, మేము నీవు చెప్పినట్లే చేస్తాము.”
తర్వాత నేను యాజకులను పిలిచాను. ధనికులచేతా, ఉద్యోగులచేతా తాము చెప్పిన మాటలను అమలు చేస్తామని యాజకుల సమక్షంలో దేవునికి ప్రమాణం చేసేలా చూశాను. 13 తర్వాత నేను నా దుస్తుల మడతలు పోయేలా వాటిని దులిపి, ఇలా చెప్పాను, “తన వాగ్దాన భంగం చేసిన ప్రతివానికీ దేవుడు ఇదే చేస్తాడు. దేవుడు వాళ్లని వాళ్ల ఇళ్ల నుంచి బయటికి విసిరిపారేస్తాడు. తాము కూడబెట్టుకున్న వన్నీ వాళ్లు కోల్పోతారు! ఆ వ్యక్తి తన సర్వస్వం కోల్పోతాడు!”
నేను చెప్పిన ఈ విషయాలన్నింటికీ వాళ్లందరూ ఒప్పుకొనెదమని చెప్పిరి. వాళ్లంతా, “ఆమేన్!” అన్నారు. యెహోవాను స్తుతించారు. ఆ మనుష్యులు తాము ఒప్పుకొన్న ప్రకారం అన్ని జరిగించిరి.
14 అంతే కాదు, యూదా ప్రాంతానికి నేను అధికారిగా వున్నంత కాలం, నేనుగాని, నా సోదరులుగాని పాలనాధికారికి అనుమతింపబడిన ఆహారం ఎన్నడూ తినలేదు. నా ఆహారం కొనే నిమిత్తం నేనెన్నడూ జనాన్ని పన్నులు చెల్లించేలా నిర్బంధించలేదు. నేను అర్తహషస్త రాజ్య పాలనలో ఇరవయ్యవ ఏడాది నుంచి ముప్పై రెండవ ఏడాది దాకా[a] పాలనాధికారిగా వున్నాను. నేను యూదాకి పన్నెండేళ్లపాటు పాలనాధికారిగా వున్నాను. 15 కాని, నా కంటె ముందు పాలించిన అధికార్లు జన జీవితాన్ని ఎక్కువ భారం చేశారు. వాళ్లు ప్రతి ఒక్కరినుంచీ నిర్బంధంగా నలభై తులాల[b] వెండిని వసూలు చేశారు. అంతేకాదు, వాళ్లు జనం నుంచి తమ ఆహారాన్నీ, ద్రాక్షారసాన్నీ రాబట్టుకున్నారు. ఆ అధికార్ల కింది నాయకులు కూడా జనం మీద అధికారం చలాయించి, వాళ్ల జీవితాన్ని మరింత దుర్భరం చేశారు. కాని నేను అందుకు భిన్నంగా దేవునియందు భయభక్తులతో వ్యవహరించాను, అందుకే నేను వాళ్లు చేసిన పనులేవీ చేయలేదు. 16 యెరూషలేము ప్రాకార నిర్మాణానికి నేను బాగా కష్టించి పనిచేశాను. నా మనుష్యులందరూ ప్రాకార నిర్మాణం కోసం అక్కడ చేరారు. మేము ఏ ఒక్కరి దగ్గరినుంచీ భూమి సంపాదించుకోలేదు!
17 అంతే కాదు, నేను నిత్యం నూట ఏభై మంది యూదులకు భోజనం పెట్టాను. నా భోజనపు బల్ల దగ్గర వాళ్లకి ఎల్లప్పుడూ ప్రవేశం లభించేది. మా చుట్టుపట్ల వున్న ఇతర దేశప్రజలు కూడ నా బల్లదగ్గర భోజనం చేశారు. 18 నాతోబాటు నా భోజనశాలలో భోజనం చేసిన వాళ్లకి ప్రతిరోజూ ఈ కింది ఆహార పదార్థాలు పెట్టాను: ఒక ఆవు, ఆరు మేలైన గొర్రెలు రకరకాల పక్షులు. ప్రతి పది రోజులకీ ఒకసారి రకరకాల ద్రాక్షారసం నా భోజనపు బల్ల వద్దకి తెప్పించబడేవి. అయితేనేమి, నేను మాత్రం పాలనాధికారికి అనుమతింపబడిన ఆహారాన్ని కావాలని అడగలేదు. నా భోజనం కోసం నేనెన్నడూ జనం దగ్గర బలవంతాన పన్నులు వసూలు చేయలేదు. జనం చేస్తున్నపని బాగా కష్టమైనదని నాకు తెలుసు, 19 నా దేవా, ఈ ప్రజలకు నేను చేసిన మేలునంతటినీ జ్ఞాపకముంచుకొని నాకు సహాయం చేయుము.
ఎదురైన మరిన్ని సమస్యలు
6 నేను ప్రాకార నిర్మాణం పూర్తి చేశానన్న సంగతిని సన్బల్లటు, టోబీయా, అరబీయుడైన గెషెము మా ఇతర శత్రువులూ విన్నారు. మేము గోడలోని కంతలన్నీ పూడ్చాము. అయితే, ద్వారాలకు మేమింకా తలుపులు అమర్చలేదు. 2 సన్బల్లటూ, గెషెమూ నాకు, “నెహెమ్యా, నువ్వొకసారి వస్తే మనం కలుసు కుందాము. ఓనో మైదానంలోని కెఫీరిము గ్రామంలో కలుసుకోవచ్చు” అని కబురంపారు. అయితే, వాళ్లు నాకు హాని తలపెట్టారని నాకు తెలుసు.
3 అందుకని, దూతల ద్వారా నేను వాళ్లకి, “నేను చాలా ముఖ్యమైన పనిలో నిమగ్నమై వున్నాను. అందు కని, నేను రాలేను. మిమ్మల్ని కలుసు కొనడానికై నేను పని చేయుట ఆపినప్పుడు, పని ఆగుట నాకిష్టము లేదు” అని సమాధానం పంపాను.
4 సన్బల్లటూ, గెషెమూ అదే సందేశాన్ని నాకు నాలుగుసార్లు పంపారు. ప్రతి ఒక్కసారీ నేను వాళ్లకి నా వెనకటి సమాధానమే పంపాను. 5 అప్పుడు అయిదవసారి, సన్బల్లటు అదే సందేశాన్ని తన సహాయకుని ద్వారా నాకు పంపాడు. అతడి చేతిలో విప్పియున్న ఒక లేఖవుంది. 6 ఆ లేఖలో ఇలా పేర్కొనబడింది,
“ఒక విషయం నాలుగు ప్రక్కలా ప్రచారమవుతోంది. ఎక్కడ చూసినా జనం అదే చెప్పుకుంటున్నారు. మరి, అన్నట్టు, గెషెము అది నిజమే అంటున్నాడు. నీవూ, యూదులూ రాజు మీద తిరగబడాలని కుట్రపన్నుతున్నట్లు జనం చెప్పుకుంటున్నారు. అందుకే నీవు యెరూషలేము ప్రాకారం నిర్మిస్తున్నావట. అంతేకాదు, నీవు యూదులకు కాబోయే రాజువని కూడా జనం చెప్పుకుంటున్నారు. 7 యెరూషలేములో నిన్ను గురించి ఈ విషయాన్ని ప్రకటించేటందుకు నీవు ప్రవక్తలను ఎంపిక చేశావన్న విషయం, ‘యూదాలో ఒక రాజు వున్నాడు!’ అన్న విషయం ప్రచారంలో వుంది.
“నెహెమ్యా, ఇప్పుడు నిన్ను నేను హెచ్చరిస్తున్నాను. అర్తహషస్త రాజురు ఈ విషయం వింటారు. అందుకని, నీవు రా, మనం కలిసి కూర్చుని ఈ విషయం మాట్లాడుకుందాము.”
8 అందుకని, నేను సన్బల్లటుకి ఈ క్రింది సమాధానం పంపాను: “మీరు చెబుతున్నదేమీ ఇక్కడ జరగడం లేదు. ఇదంతా మీ ఊహా కల్పితం మాత్రమే.”
9 మన శత్రువులు మనల్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్ల మట్టుకు వాళ్లు, “ఈ యూదులు భయంతో బిక్కచచ్చి, జావకారిపోయి పని కొనసాగించేందుకు అసమర్థులవుతారు. అప్పుడిక ప్రాకార నిర్మాణం పూర్తికాదు” అనుకుంటున్నారు.
కాని నేను, “దేవా, నన్ను బలపరచుము” అని ప్రార్థించాను.
10 నేనొక రోజున దెలాయ్యా కొడుకు షెమయా ఇంటికి వెళ్లాను. దెలాయ్యా మెహేతబేలు కొడుకు. ఇంటి వద్దనే వుండవలసిన షెమయా ఇలా అన్నాడు: “నెహెమ్యా, ఆలయానికి పోయి కూర్చుందాము. లోపలికి పోయి తలుపులు మూసుకుందాము. ఎందుకంటే నిన్ను చంపేందుకు మనుష్యులు వస్తున్నారు. ఈ రాత్రి నిన్ను చంపేందుకు వాళ్లొస్తున్నారు.”
11 అయితే, నేను షెమయాతో ఇలా అన్నాను: “నాలాంటి మనిషి పారిపోవాలంటావా? నాలాంటి వాడు తన ప్రాణం కాపాడుకొనేందుకు దేవాలయంలోకి పారిపోకూడదు, నేనలా వెళ్లను!”
12 షెమయాని దేవుడు పంపించలేదని నాకు తెలుసు. టోబీయా, సన్బల్లటు అతనికి డబ్బు ముట్టజెప్పారు కనుక, అతను నాకు వ్యతిరేకంగా హితబోధ చేశాడు. 13 నన్ను ఇరుకున పెట్టేందుకూ, భయపెట్టేందుకూ వాళ్లు షెమయాని కుదుర్చుకున్నారు. భయపడి, ఆలయానికి పారిపోవడం ద్వారా నేను పాపం చెయ్యాలని వాళ్లు కోరుకున్నారు. అప్పుడు, నన్ను భయపెట్టి, నాకు అపకీర్తి తెచ్చేందుకు నా శత్రువులకి అవకాశం చిక్కి వుండేది.
14 ఓ నా దేవా, దయచేసి టోబియా, సన్బల్లటులు చేస్తున్న పనులు గమనించు. వాళ్లు చేసిన పాపిష్టి పనులు కూడా గుర్తు చేసుకో. నన్ను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్న నోవద్యా అనే ప్రవక్త్రిని, తదితర ప్రవక్తలను కూడా గుర్తు చేసుకో.
ప్రాకార నిర్మాణం పూర్తయింది
15 ఈ విధంగా యెరూషలేము ప్రాకార నిర్మాణం ఏలూలు[c] నెల ఇరవై ఐదవ రోజున పూర్తయింది. ఆ గోడ కట్టడం పూర్తి చేసేందుకు ఏభై రెండు రోజులు పట్టింది. 16 అప్పుడు, మేము గోడ కట్టడం పూర్తి చేసినట్లు మా శత్రువులందరూ విన్నారు. గోడ కట్టడం పూర్తయిందన్న విషయాన్ని మా చుట్టు ప్రక్కల దేశపు ప్రజలందరూ చూశారు. దానితో, వాళ్లు ధైర్యం కోల్పోయారు. ఎందుకంటే, ఈ పని మన దేవుని సహాయం వల్ల జరిగిందని వాళ్లు అర్థం చేసుకున్నారు.
17 అంతేకాదు, ఆ రోజుల్లో, గోడ కట్టడం పూర్తయిన దరిమిలా, యూదాలోని ధనికులు టోబీయాకి ఎన్నో ఉత్తరాలు పంపుతూవచ్చారు. టోబీయా వాళ్ల జాబులకి సమాధానాలు వ్రాస్తూండే వాడు. 18 యూదాలో చాలామంది అతనికి విధేయులుగా వుంటామని మాట ఇచ్చినందువల్ల, వాళ్లు అతనికి ఆ జాబులు వ్రాశారు. దీనికి కారణం ఏమిటంటే, టోబీయా అరహు కుమారుడైన షెకన్యాకి అల్లుడు. టోబీయా కొడుకు యోహానాను మెషూల్లము కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. మెషూల్లము బెరెక్యా కొడుకు. 19 గతంలో వాళ్లు టోబీయాకి ఒక ప్రత్యేక వాగ్దానం చేశారు. అందుకని, వాళ్లు నాకు టోబీయా ఎంతో మంచివాడని చెప్తూ వచ్చారు. నేను చేస్తున్న పనులను గురించి వాళ్లు టోబీయాకి చెప్తూండేవారు. నన్ను భయపెట్టేందుకని టోబీయా నాకు లేఖలు పంపుతూ వచ్చాడు.
© 1997 Bible League International