Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 దినవృత్తాంతములు 18-20

మీకాయా రాజైన అహాబును హెచ్చరించటం

18 యెహోషాపాతుకు ఎక్కువగా ధనం, గౌరవం లభించాయి. రాజైన అహాబుతో అతడు వివాహం[a] ద్వారా ఒక ఒడంబడిక ఏర్పరచుకొన్నాడు. కొద్ది సంవత్సరాల తరువాత యెహోషాపాతు సమరయ (షోమ్రోను) లో అహాబును చూడటానికి వెళ్లాడు. యెహోషాపాతు, అతని పరివారం యొక్క గౌరవార్థం అహాబు అనేక గొర్రెలను, ఆవులను వధించాడు. ఆ సమయాన రామోత్గిలాదు పట్టణంపై దాడి చేయటానికి అహాబు యెహోషాపాతును ప్రోత్సహించాడు. “రామోత్గిలాదుపై దండెత్తటానికి నీవు నాతో వస్తావా?” అని అహాబు యెహోషాపాతును అడిగాడు. అహాబు ఇశ్రాయేలు రాజు. యెహోషాపాతు యూదా రాజు. అహాబుకు యెహోషాపాతు యిలా సమాధాన మిచ్చాడు: “నేను నీవాడను. నా మనుష్యులు నీవారు. మేము యుద్ధానికి నీతో వస్తాము. కాని ముందుగా మనం యెహోవా వర్తమానం ఏమైనా వుంటుందేమో చూద్దాం,” అని యెహోషాపాతు అన్నాడు.

అందువల్ల అహాబు నాలుగు వందల మంది ప్రవక్తలను పిలిపించాడు. అహాబు వారితో, “మేము రామోత్గిలాదు పట్టణం మీదికి యుద్ధానికి వెళ్లవచ్చా? లేదా?” అని అన్నాడు.

అప్పుడు ప్రవక్తలు, “వెళ్లండి; ఎందువల్లనంటే దేవుడు రామోత్గిలాదును మీరు ఓడించేలా చేస్తాడు” అని అహాబుకు సమాధాన మిచ్చారు.

కాని యెహోషాపాతు యిలా అన్నాడు: “ఇక్కడ యెహోవా యొక్క ప్రవక్త ఎవరైనా వున్నారా? యెహోవా ప్రవక్తలలో ఒకని ద్వారా ఆయన ఏమి చెబుతున్నాడో తెలుసుకోవలసిన అవసరం వుంది.”

అప్పుడు రాజైన అహాబు యెహోషాపాతుతో యిలా అన్నాడు: “ఇక్కడ ఇంకా ఒక మనిషి వున్నాడు. మనం అతని ద్వారా యెహోవాను అడుగుదాం. కాని ఈ మనిషిని నేను అసహ్యించుకుంటాను. ఎందువల్లనంటే అతడు యెహోవా నుండి నాకు ఒక్క మంచి వర్తమానం కూడ అందచేయడు. నాకు ఎప్పుడూ చెడువార్తలే తెస్తాడు. ఆ వ్యక్తి పేరు మీకాయా. అతడు ఇమ్లా కుమారుడు.”

కాని యెహోషాపాతు, “అహాబూ నీవు అలా అనరాదు” అని అన్నాడు.

అప్పుడు రాజైన అహాబు తన అధికారులలో ఒకనిని పిలిచి, “ఇమ్లా కుమారుడైన మీకాయాను త్వరగా తీసుకొని రమ్మని పంపాడు.”

ఇశ్రాయేలు రాజైన అహాబు, యూదా రాజైన యెహోషాపాతు తమతమ రాజదుస్తులు ధరించారు. వారిద్దరు సమరయ (షోమ్రోను) నగర ముఖద్వారం దగ్గర వున్న నూర్పిడి కళ్లం వద్ద తమతమ సింహాసనాలపై కూర్చున్నారు. అక్కడకు వచ్చియున్న నాలుగువందల మంది ప్రవక్తలు రాగల సంగతుల వర్తమానాలను రాజుల ముంగిట చెబుతున్నారు. 10 కెనయనా కుమారుని పేరు సిద్కియా. సిద్కియా కొన్ని ఇనుప కొమ్ములు చేయించుకు వచ్చాడు. సిద్కియా యిలా అన్నాడు: “యెహోవా ఈ రకంగా చెప్పుచున్నాడు: ‘నీవు ఈ ఇనుప కొమ్ములు వినియోగించి, అరామీయులు (సిరియనులు) నశించిపోయే వరకు వారిని పొడుస్తావు.’” 11 ప్రవక్తలంతా అదే విషయం చెప్పారు. వారిలా అన్నారు: “రామోత్గిలాదు పట్టణానికి వెళ్లు. నీకు విజయం చేకూరుతుంది. రాజు అరాము ప్రజలను ఓడించేలా యెహోవా తోడ్పడుతాడు.”

12 మీకాయాను పిలవటానికి వెళ్లిన దూత అతనితో యీలా చెప్పాడు: “మీకాయా, వినండి; ప్రవక్తలంతా ఒకే రీతిగా ప్రవచిస్తున్నారు. రాజుకు విజయం చేకూరుతుందని వారు చెబుతున్నారు. వారు చెప్పినట్లుగానే నీవు కూడా తెలియజేయి. నీవు కూడ మంచి విషయాలే చెప్పు.”

13 “యెహోవా జీవముతోడు నేను నా దేవుడు తెలియజేసిన రీతినే చెబుతాను” అని మీకాయా అన్నాడు.

14 పిమ్మట మీకాయా రాజైన అహాబు వద్దకు వచ్చాడు. రాజు అతనితో, “మీకాయా, మేము రామోత్గిలాదు పట్టణంపై దండెత్తటానికి వెళ్లవచ్చునో, లోదో తెలియజేయి” అని అన్నాడు.

అందుకు మీకాయా, “వెళ్లి దాడి చేయి, దేవుడు నీవాప్రజలను ఓడించేలా చేస్తాడు,” అని చెప్పాడు.

15 అహాబు రాజు మీకాయాతో, “గతంలో చాలా సార్లు నిజమే ప్రవచించేలా యెహోవా పేర నీచేత ప్రమాణం చేయించాను,” అని అన్నాడు.

16 అప్పుడు మీకాయా యీలా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలంతా పర్వతాలపై చిందరవందరై పోయినట్లు నేను చూశాను. వారు కాపరిలేని గొర్రెల్లా వున్నారు. యెహోవా చెప్పినదేమంటే, ‘వారికి నాయకుడు లేడు. కావున ప్రతి ఒక్కడినీ క్షేమంగా ఇంటికి పోనిమ్ము.’”

17 అది విని ఇశ్రాయేలు రాజు అహాబు యెహోషాపాతుతో యిలా అన్నాడు: “మీకాయా నాకు ఎప్పుడూ యెహోవా నుండి మంచి వార్త తేడని నేను నీకు ముందే చెప్పాను! నా గురించి అతడు తెచ్చేవన్నీ చెడు వర్తమానాలే!”

18 మీకాయా ఇంకా యిలా అన్నాడు: “యెహోవా వర్తమానాన్ని వినండి! యెహోవా తన సింహాసనంపై కూర్చుని వున్నట్లు నేను చూశాను. పరమండల సైన్యమంతా ఆయన చుట్టూ చేరివుంది. 19 యెహోవా, ‘ఇశ్రాయేలు రాజైన అహాబు అక్కడ చంపబడే విధంగా, యుక్తిగా రామోత్గిలాదుపై అతనిని యుద్ధానికి ఎవరు పంపగలరు?’ అని అడిగినాడు. ఆయన చుట్టూ చేరిన పలువురు పలురకాలుగా చెప్పారు. 20 పిమ్మట ఒక ఆత్మవచ్చి యెహోవా ముందు నిలబడి, ‘అహాబును నేను మోసపుచ్చుతాను’ అని అన్నది. ‘ఎలా?’ అని యెహోవా ఆత్మని అడిగాడు. 21 ‘నేను అసత్యలాడే ఆత్మగా మారి అహాబు ప్రవక్తలలో ప్రవేశించి వారి నోట అబద్ధాలు పలికిస్తాను’ అని ఆత్మ చెప్పింది. అది విని ‘అహాబును మోసగించటంలో నీకు జయమగు గాక! నీవు బయటకు వెళ్లి కార్యము సాధించు’ అని యెహోవా అన్నాడు.

22 “అహాబూ, ఇప్పుడు చూడు; యెహోవా ఒక అసత్య ఆత్మను నీ ప్రవక్తలలో ప్రవేశపెట్టాడు. నీకు కీడు మూడుతుందని యెహోవా చెప్పియున్నాడు.”

23 పిమ్మట సిద్కియా తిన్నగా మీకాయా వద్దకు వెళ్లి చెంపమీద చాచికొట్టాడు. సిద్కియా తండ్రి పేరు కెనయనా. సిద్కియా యిలా అన్నాడు: “మీకాయా, యెహోవా వద్దనుండి వచ్చిన ఆత్మ నన్ను వదిలి నిన్నావరించటానికి ఎటునుండి వచ్చింది?”

24 దానికి మీకాయా “సిద్కియా, నీవు లోపలి గదిలోకి పోయి దాగుకొనే రోజున నీవది తెలుసుకొంటావు!” అని సమాధానమిచ్చాడు.

25 పిమ్మట రాజైన అహాబు యిలా అన్నాడు: “మీకాయాను తీసుకొని వెళ్లి నగరపాలకుడైన ఆమోనుకు, రాజకుమారుడైన యెవాషుకు అప్పజెప్పండి. 26 రాజాజ్ఞగా ఆమోనుకు, యెవాషుకు యిలా చెప్పండి: ‘మీకాయాను చెరసాలలో పెట్టండి. నేను యుద్ధం నుండి తిరిగి వచ్చేవరకు అతనికి రొట్టె నీరు తప్ప ఇతర ఆహారమేదీ యివ్వవద్దు.’”

27 మీకాయా యిలా సమాధానమిచ్చాడు: “అహాబూ, నీవు యుద్ధాన్నుండి క్షేమంగా తిరిగి వస్తే, యెహోవా నా ద్వారా మాట్లాడి యుండలేదని అర్థం. ఓ ప్రజలారా, నా మాటలు విని జ్ఞాపకం పెట్టుకోండి!”

రామోత్గిలాదులో అహాబు చంపబడటం

28 పిమ్మట ఇశ్రాయేలు రాజైన అహాబు, యూదా రాజైన యెహోషాపాతు రామోత్గిలాదు పట్టణాన్ని ముట్టడించారు. 29 అహాబు రాజు యెహోషాపాతుతో, “యుద్ధంలోకి వెళ్లే ముందు నేను నా వేషం మార్చివేస్తాను. కాని నీవు మాత్రం నీ రాజదుస్తులే ధరించు” అని అన్నాడు. ఇశ్రాయేలు రాజు మారువేషం వేసిన పిమ్మట రాజులిద్దరూ యుద్ధానికి వెళ్లారు.

30 అరాము (సిరియా) రాజు తన రథాల అధిపతులకు ఒక ఆజ్ఞ యిచ్చాడు. అతడు వారితో యిలా అన్నాడు: “ఎంత గొప్ప వాడేగాని, ఎంత సామాన్యుడే గాని, మీరు ఎవ్వరితోనూ పోరాడవద్దు. కాని మీరు ఇశ్రాయేలు రాజైన అహాబుతోనే యుద్ధం చేయండి.” 31 రథాధిపతులు యెహోషాపాతును చూచినప్పుడు అతడే ఇశ్రాయేలు రాజైన అహాబు అనుకున్నారు! అతన్ని ఎదిరించటానికి వారు యెహోషాపాతు మీదికి తిరిగారు. కాని యెహోషాపాతు కేకలు పెట్టటంతో యెహోవా అతనికి సహాయపడ్డాడు. రథాధిపతులు యెహోషాపాతును వదిలి పోయేలాగు దేవుడు వారి మనస్సు మార్చాడు. 32 వారు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజు కాదని తెలిసికొన్నప్పుడు వారతనిని తరమటం మానివేశారు.

33 కాని ఒక సైనికుడు దేనికీ గురిపెట్టకుండా ఒక బాణాన్ని మామూలుగా వదిలాడు. కాని ఆ బాణం ఇశ్రాయేలు రాజైన అహాబుకు తగిలింది. కవచం కప్పకుండా వున్న అతని శరీర భాగంలో ఆ బాణం తగిలింది. అప్పుడు అహాబు తన రథసారధితో, “రథాన్ని వెనుకకు తిప్పి నన్ను యుద్ధరంగం నుండి బయటకు తీసుకొని వెళ్లు. నేను గాయపడ్డాను.” అని చెప్పాడు.

34 ఆ రోజు యుద్ధం తీవ్రంగా జరిగింది. అహాబు తన రథంలో ఆనుకొని సాయంత్రంమయ్యే వరకు అరామీయులను (సిరియనులు) చూస్తూ నిలబడివున్నాడు. సూర్యుడు అస్తమించే సమయంలో అహాబు చనిపోయాడు.

19 యూదా రాజైన యెహోషాపాతు యెరూషలేములోని తన యింటికి క్షేమంగా తిరిగి వచ్చాడు. దీర్ఘదర్శియగు యెహూ ఎదురేగి యెహోషాపాతును కలిశాడు. యెహూ తండ్రి పేరు హనానీ. యెహోషాపాతుతో యెహూ ఈ విధంగా చెప్పాడు: “నీవు దుష్టులకు ఎందుకు సహాయపడ్డావు? యెహోవాను అసహ్యించుకునే వారిని నీ వెందుకు ప్రేమిస్తున్నావు? అందువల్లనే యెహోవా నీపట్ల కోపంగా వున్నాడు. కాని నీ జీవితంలో నీవు కొన్ని మంచి పనులు చేశావు. నీవు అషేరా దేవతా స్తంభాలను ఈ దేశం నుండి తొలగించావు. దేవుని అనుసరించాలని నీ హృదయంలో నిశ్చయించుకున్నావు.”

యెహోషాపాతు న్యాయాధిపతులను నియమించటం

యెహోషాపాతు యెరూషలేములో నివసించాడు. మళ్లీ అతడు ప్రజలను కలియటానికి బెయేర్షెబా పట్టణం నుండి కొండల ప్రాంతమైన ఎఫ్రాయిము వరకు సంచారం చేశాడు. యెహోషాపాతు ప్రజలమధ్య తిరిగి మళ్లీ వారిని తమ పూర్వీకులు ఆరాధించిన యెహోవా వైపుకు తిప్పాడు. యెహోషాపాతు యూదాలో న్యాయాధిపతులను నియమించాడు. యూదాలో కోటలుగల పట్టణాలన్నిటిలో అతడు న్యాయాధిపతులను నియమించాడు. యెహోషాపాతు ఆ న్యాయాధిపతులతో యిలా చెప్పాడు: “మీరు చేసే పనిలో మీరు మిక్కిలి మెళకువతో మెలగండి. ఎందువల్లనంటే మీరు తీర్పు తీర్చేది ప్రజల తరుపున కాదు. యెహోవా తరుపున మీరొక నిర్ణయం తీసుకొనేటప్పుడు యెహోవా మీతో వుంటాడు. కావున మీలో ప్రతి ఒక్కడూ యెహోవాకు భయ పడాలి. మీ పనిలో మీరు జాగ్రత్త వహించండి. ఎందువల్లనంటే మన దేవుడైన యెహోవా పక్షపాతం లేనివాడు. న్యాయశీలి. యెహోవా ఎన్నడూ కొందరిని మరికొందరికంటె ముఖ్యులుగా చూడక సమంగా చూస్తాడు. తన తీర్పును మార్చటానికి యెహోవా ధనం ఆశించడు.”

యెరూషలేములో కొంతమంది లేవీయులను, యాజకులను, మరికొందరు ఇశ్రాయేలు పెద్దలను న్యాయాధిపతులుగా యెహోషాపాతు ఎంపిక చేశాడు. యెరూషలేములో వున్న ప్రజల సమస్యలను పరిష్కరించటానికి వారు యెహోవా ధర్మశాస్త్రాన్ని ఉపయోగిస్తారు. యెహోషాపాతు యిలా కొన్ని ఆజ్ఞలను యిచ్చాడు. యెహోషాపాతు యిలా చెప్పాడు: “మీ నిండు హృదయంతో మీరు విశ్వాసపాత్రంగా సేవ చేయాలి. మీరు యెహోవాకు భయపడాలి. 10 హత్యావిషయాలు, చట్టపరమైన, ఆజ్ఞాపరమైన నియమ నిబంధనలకు సంబంధించిన నేరాలు అనేకం మీ దృష్టికి తేబడతాయి. నగరాలలో నివసించే మీ సోదరుల వద్ద నుండి ఈ విషయాలు మీ తీర్పుకు వస్తాయి. మీ వద్దకు వచ్చిన నేరస్తులను, వాదాలాడే వారిని అందరినీ యెహోవాపట్ల పాపం చేయవద్దని మీరు హెచ్చరించాలి. మీరు నమ్మకంగా పనిచేయని ఎడల మీ మీదికి, మీ సోదరుల మీదికి యెహోవా కోపాన్ని రప్పించిన వారవుతారు. నేను చెప్పినట్లు చేయండి. అప్పుడు తప్పు చేశామనే భావన మీకు వుండదు.

11 “అమర్యా ప్రముఖ యాజకుడు. యెహోవాకు సంబంధించిన అన్ని విషయాలలో అతడు మీమీద ఆధిపత్యం వహిస్తాడు. రాజుకు సంబంధించిన విషయాలలో మీకు మార్గదర్శకుడుగా జెబద్యావున్నాడు. జెబద్యా తండ్రి పేరు ఇష్మాయేలు. యూదా వంశంలో జెబద్యా ఒక పెద్ద. ఇంకను లేవీయులు మీకు లేఖకులుగా పని చేస్తారు. మీరు ప్రతి పనీ ధైర్యంగా చేయండి. న్యాయమార్గాన నడిచే ప్రజలకు యెహోవా అండగా వుండుగాక!”

యెహోషాపాతు యుద్దం ఎదిరించటం

20 తరువాత మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరు కలిసి యెహోషాపాతుతో యుద్ధం ప్రారంభించటానికి వచ్చారు. కొందరు మనుష్యులు యెహోషాపాతు వద్దకు వచ్చి యిలా అన్నారు: “ఎదోము నుంచి ఒక పెద్ద సైన్యం నీమీదికి వస్తూ వుంది. ఆ సైన్యం మృత సముద్రానికి అవతలి పక్క నుండి వస్తూ వుంది. వారు ఇప్పటికే హససోను తామారు అనబడే ఏన్గెదీలో ఉన్నారు.” యెహోషాపాతు భయపడ్డాడు. తాను ఏమి చేయాలో యెహోవాను అడిగి తెలిసికోవాలని యెహోషాపాతు నిశ్చయించాడు. యూదాలో ప్రతి ఒక్కడూ ఉపవాసం చేయలని ఒక నిర్ణీత సమయాన్ని ప్రకటించాడు. యూదా ప్రజలు యెహోవా సహాయం కోరటానికి ఒక చోట సమావేశమయ్యారు. వారు యూదా పట్టణాలన్నిటి నుండీ యెహోవా సహాయం కోరటానికి వచ్చారు. యెహోషాపాతు ఆలయ నూతన ప్రాంగణం ముందు వున్నాడు. యూదా, యెరూషలేము ప్రజల సమావేశంలో అతడు నిలబడ్డాడు. అతడు ఈ విధంగా ప్రార్థించాడు:

“మా పూర్వీకుల దేవుడవైన ఓ ప్రభూ, నీవే పరలోక అధిపతివి. ప్రపంచ రాజ్యాలన్నిటినీ ఏలేవాడవు నీవే! నీకు అధికారం, బలం వున్నాయి! నిన్నెదిరించి ఎవ్వడూ నిలువలేడు! నీవు మా దేవుడివి! ఈ దేశంలో నివసించే ప్రజలను బయటకు పొమ్మని ఒత్తిడి చేశావు. ఈ పని నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ముంగిట చేశావు. ఈ రాజ్యాన్ని అబ్రాహాము సంతతివారికి శాశ్వతంగా యిచ్చావు. అబ్రహాము నీ స్నేహితుడు. అబ్రహాము సంతతివారు ఈ రాజ్యంలో నివసించి, నీ పేరు మీద ఒక ఆలయాన్ని కట్టించారు. వారు, ‘యుద్ధాలు, శిక్ష, వ్యాధులు, కరువు కాటకాలు మొదలైన ఈతి బాధలు మాకు సంభవించినప్పుడు, ఈ మందిరం ముందు, నీ సన్నిధిని నిలబడతాము. ఈ మందిరం నీ పేరు మీద వుంది. మాకు ఆపద వచ్చినప్పుడు నీకు మొర పెట్టుకొంటాము. అప్పుడు నీవు మా మొరాలకించి మమ్ము రక్షిస్తావు’ అని అన్నారు.

10 “కాని ఇప్పుడు అమ్మోను, మోయాబు, మరియు శేయీరు పర్వత ప్రాంత మనుష్యులు ఇక్కడ వున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుండి బయటికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులను వారి రాజ్యంలోనికి నీవు వెళ్లనీయలేదు[b] అందువల్ల ఇశ్రాయేలు ప్రజలు వారి జోలికి పోకుండా తిరిగి వచ్చి, వారిని నాశనం చేయలేదు. 11 కాని మేము వారిని నాశనం చేయకుండా వదిలిపెట్టినందుకు వారు మాకు ఏ రకమైన ప్రతిఫలం ఇస్తున్నారో చూడు. నీ దేశం నుండి మమ్మల్ని తరిమి వేయటానికి వారు వచ్చారు. ఈ దేశాన్ని నీవు మాకు యిచ్చి యున్నావు. 12 మా దేవా, ఆ మనుష్యులను శిక్షించుము! మామీదికి దండెత్తి వస్తున్న ఈ మహా సైన్యాన్ని ఎదిరించే శక్తి మాకు లేదు! మేము ఏమి చేయాలో మాకు తోచటంలేదు! అందువల్ల నీ సహాయం కొరకు ఎదురు చూస్తూన్నాం.”[c]

13 యూదా ప్రజలంతా తమ పసిబిడ్డలు, భార్యలు, పిల్లలతో యెహోవా ముందు నిలబడ్డారు. 14 అప్పుడు యెహోవా ఆత్మ యహజీయేలు మీదికి వచ్చింది. యహజీయేలు తండ్రి పేరు జెకర్యా. జెకర్యా తండ్రి పేరు బెనాయా. బెనాయా తండ్రి పేరు యెహీయేలు. యెహీయేలు తండ్రి పేరు మత్తన్యా. యహజీయేలు ఒక లేవీయుడు. ఆసాపు సంతతిలోనివాడు. సమావేశం మధ్యలో 15 యహజీయేలు నిలబడి యిలా అన్నాడు: “రాజైన యెహోషాపాతూ, యూదా, యెరూషలేములలో నివసిస్తున్న ప్రజలారా వినండి! యెహోవా మీకు ఈ విధంగా తెలియజెప్పుతున్నాడు: ‘ఈ మహా సైన్యాన్ని చూచి మీరు భయపడవద్దు. చింతించవద్దు. ఎందువల్లననగా ఇప్పుడు యుద్ధం మీది కాదు. ఇది దేవుని యుద్ధం. 16 రేపు మీరు అక్కడకి వెళ్లి ఆ సైన్యంతో యుద్ధం చేయండి. వారు జీజు కనుమ ద్వారా వస్తారు. యెరూవేలు ఎడారికి అవతలి పక్కనున్న లోయ చివర మీరు వారిని చూస్తారు. 17 ఈ యుద్ధంలో మీరు పోరాడవలసిన అవసరం లేదు. మీరీ స్థానాలలో దృఢంగా నిలబడండి. యెహోవా మిమ్ముల్ని రక్షించటం మీరు చూస్తారు. యూదా, యెరూషలేము ప్రజలారా భయపడకండి! చింతించవద్దు! యెహోవా మీ పక్షాన వున్నాడు. కావున రేపు వారి మీదికి వెళ్లండి.’”

18 యెహోషాపాతు తన శిరస్సు నేల తాకేలా సాష్టాంగపడ్డాడు. యూదా ప్రజలు, యెరూషలేములో వుంటున్న వారు యెహోవా ముందు సాష్టాంగపడ్డారు. వారంతా యెహోవాను ఆరాధించారు. 19 లేవీయులలో కహాతీయుల కుటుంబాలవారు, కోరహీయులు నిలబడి ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవాకు స్తోత్రం చేశారు. వారు గొంతెత్తి స్తోత్రం చేశారు.

20 తెల్లవారుఝామునే యెహోషాపాతు సైన్యం తెకోవ ఎడారికి వెళ్లింది. వారు బయలుదేరి వెళ్లేటప్పుడు యెహోషాపాతు నిలబడి యిలా అన్నాడు: “యూదా ప్రజలారా, యెరూషలేము వాసులారా, నేను చెప్పేది వినండి. మీ దేవుడైన యెహోవాలో విశ్వాసముంచండి. అప్పుడు మీరు దృఢంగా నిలువ గలుగుతారు. యెహోవా ప్రవక్తలలో విశ్వాసముంచండి. మీరు విజయం సాధిస్తారు!”

21 యెహోషాపాతు ప్రజల సలహాను ఆలకించాడు. అతడు గాయకులను నియమించాడు. యెహోవా పరిశుద్ధుడు, అద్భుతమైన వాడు గనుక ఆయనను స్తుతించటానికి ఆ గాయకులు ఎంపిక చేయబడ్డారు. వారు సైన్యానికి ముందు నడుస్తూ యెహోవాకు స్తుతి గీతాలు పాడారు.

“యెహోవాకు భజన చేయండి;
    ఆయన ప్రేమ తరగనిది!”

అంటూ వారు సంకీర్తన చేశారు. 22 ఆ మనుష్యులు పాడుతూ, దేవుని స్తుతిస్తూ వెళ్తూండగా, అమ్మోను, మోయాబు ప్రజల మీదికి, శేయీరు పర్వత ప్రాంతం వారిమీదికి మాటు వేసిన మనుష్యులను యెహోవా పంపాడు. వారంతా యూదా రాజ్యం మీదికి దండెత్తి వస్తున్నారు. వాళ్లు బాగా దెబ్బలు తిన్నారు. 23 అమ్మోనీయులు, మోయాబీయులు కలిసి శేయీరు పర్వత ప్రాంతం వారితో యుద్ధానికి దిగారు. అమ్మోనీయులు, మోయాబీయులు కలిసి శేయీరు పర్వతప్రాంతం వారిని చంపి నాశనం చేశారు. శేయీరు మనుష్యులను చంపిన తరువాత, వారు మళ్లీ ఒకరి నొకరు చంపుకున్నారు.

24 యూదా సైనికులు ఎడారిలోని కాపలా బురుజు వద్దకు వచ్చారు. వారు శత్రుసైన్యం వైపు పరిశీలించి చూశారు. కాని వారు భూమిమీద పడివున్న శవాలను మాత్రమే చూడగలిగారు, ఒక్కడు కూడా బ్రతికిలేడు. 25 శవాలపైగల విలువైన వస్తువులను తీసుకోవటానికి యెహోషాపాతు, అతని సైన్యం, వచ్చారు. వారు జంతువులను, డబ్బును, బట్టలను, ఇతర విలువైన వస్తువులను చూశారు. యెహోషాపాతు, అతని సైనికులు ఆ వస్తువులన్నిటినీ తీసుకున్నారు. ఆ వస్తువులన్నీ యెహోషాపాతు, అతని మనుష్యులు మోసుకుపోలేనన్ని వున్నాయి. శవాలనుండి తీసుకొన్న వస్తువులను మోసుకుపోవటానికి వారికి మూడు రోజులు పట్టింది. అక్కడ వస్తువులు అంత ఎక్కువగా పడివున్నాయి. 26 నాల్గవ రోజున యెహోషాపాతు, అతని సైన్యం బెరాకా[d] లోయలో సమావేశమైనారు. ఆ స్థలంలో వారు యెహోవాకి ప్రార్థనలు చేశారు. అందువల్ల ఆ స్థలానికి ఈనాటికీ “బెరాకాలోయ” అని పేరు.

27 తరువాత యూదా నుండి, యెరూషలేము నుండి వచ్చిన సైనికులను యెహోషాపాతు యెరూషలేముకు తీసుకొనిపోయాడు. వారి శత్రువులను ఓడించి, యెహోవా వారిని చాలా సంతోషపర్చాడు. 28 వారు మేళతాళాలతో యెరూషలేముకు తిరిగి వచ్చి ఆలయానికి వెళ్లారు.

29 ఇశ్రాయేలు శత్రువులతో యెహోవా యుద్ధం చేశాడని విని వివిధ దేశాల రాజులందరూ యెహోవా అంటే భయపడ్డారు. 30 అందువల్ల యెహోషాపాతు రాజ్యంలో శాంతి నెలకొన్నది. యెహోషాపాతు యొక్క దేవుడు అతనికి శాంతియుత వాతావరణాన్ని కల్పించాడు.

యెహోషాపాతు పాలన సారాంశం

31 యెహోషాపాతు యూదా రాజ్యాన్ని పాలించాడు. యెహోషాపాతు పాలన మొదలయ్యే సరికి ముప్పై ఐదేండ్లవాడు. అతడు యెరూషలేములో ఇరవైయైదు సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు అజూబా. అజూబా తల్లిపేరు షిల్హీ. 32 తన తండ్రి ఆసా నడిచిన రీతిగా యెహోషాపాతు ఉత్తమ జీవితాన్ని గడిపాడు. యెహోషాపాతు ఆసా మార్గాన్ని అనుసరించటానికి వెనుకాడలేదు. యెహోవా దృష్టికి మంచి పనులన్నీ యెహోషాపాతు చేశాడు. 33 కాని బూటకపు దేవతల పూజలకు వినియోగించిన గుట్టలను (ఉన్నత స్థలాలను) అతడు తీసివేయలేదు. ప్రజలు కూడా తమ పూర్వీకులు ఆరాధించిన దేవుని అనుసరించటానికి తమ హృదయాలను తిప్పలేదు.

34 యెహోషాపాతు ఆదినుండి అంతంవరకు చేసిన పనులన్నీ యెహో వ్రాసిన గ్రంథాలలో పొందుపర్చబడ్డాయి. యెహో తండ్రి పేరు హనానీ. ఈ విషయాలు ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.

35 చివరి రోజుల్లో యూదా రాజైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో ఒక ఒడంబడిక కుదుర్చుకున్నాడు. అహజ్యా మిక్కిలి చెడుకార్యాలు చేశాడు. 36 తర్షీషు[e] పట్టణానికి పయనించే ఓడలను చేయించటానికి యెహోషాపాతు అహజ్యాతో కలిశాడు. వారు ఓడలను ఎసోన్గెబెరులో నిర్మించారు. 37 అప్పుడు ఎలీయెజెరు అనే ప్రవక్త యెహోషాపాతుకు వ్యతిరేకంగా ప్రవచించాడు. ఎలీయెజెరు తండ్రి పేరు దోదావాహు. ఎలీయెజెరు మారేషా పట్టణానికి చెందినవాడు. అతడు ఈ రకంగా చెప్పాడు: “యెహోషాపాతూ, నీవు అహజ్యాతో కలిశావు. అందువల్ల యెహోవా నీ పనులను సర్వనాశనం చేస్తాడు.” అలానే అతని ఓడలు పగిలిపోయాయి. అందువల్ల యెహోషాపాతు, అహజ్యాలు తర్షీషుకు ఓడలను పంపలేకపోయారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International