Book of Common Prayer
సంగీత నాయకునికి: ఒక స్తుతి కీర్తన.
66 భూమి మీద ఉన్న సమస్తమా, దేవునికి ఆనందధ్వని చేయుము!
2 మహిమగల ఆయన నామాన్ని స్తుతించండి.
స్తుతిగీతాలతో ఆయనను ఘనపరచండి.
3 ఆయన కార్యాలు అద్భుతమైనవి. ఆయనకు ఇలా చెప్పండి:
దేవా, నీ శక్తి చాలా గొప్పది. నీ శత్రువులు సాగిలపడతారు. వారికి నీవంటే భయం.
4 సర్వలోకం నిన్ను ఆరాధించుగాక.
నీ నామమునకు ప్రతి ఒక్కరూ స్తుతి కీర్తనలు పాడుదురుగాక.
5 దేవుడు చేసిన అద్భుత విషయాలను చూడండి.
అవి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.
6 సముద్రాన్ని[a] ఆరిపోయిన నేలలా దేవుడు చేశాడు.
ఆయన ప్రజలు నదిని దాటి వెళ్లారు.[b]
అక్కడ వారు ఆయనపట్ల సంతోషించారు.
7 దేవుడు తన మహా శక్తితో ప్రపంచాన్ని పాలిస్తున్నాడు.
సర్వత్రా మనుష్యులను దేవుడు గమనిస్తున్నాడు.
ఏ మనిషీ ఆయన మీద తిరుగుబాటు చేయలేడు.
8 ప్రజలారా, మా దేవుని స్తుతించండి.
స్తుతి కీర్తనలు ఆయన కోసం గట్టిగా పాడండి.
9 దేవుడు మాకు జీవాన్ని ఇచ్చాడు.
దేవుడు మమ్మల్ని కాపాడుతాడు.
10 దేవుడు మమ్మల్ని పరీక్షించాడు. మనుష్యులు నిప్పుతో వెండిని పరీక్షించునట్లు దేవుడు మమ్మల్ని పరీక్షించాడు.
11 దేవా, నీవు మమ్మల్ని ఉచ్చులో పడనిచ్చావు.
భారమైన బరువులను నీవు మాపైన పెట్టావు.
12 మా శత్రువులను నీవు మా మీద నడువ నిచ్చావు.
అగ్నిగుండా, నీళ్ల గుండా నీవు మమ్మల్ని ఈడ్చావు.
కాని క్షేమ స్థలానికి నీవు మమ్మల్ని తీసుకొచ్చావు.
13-14 కనుక నేను నీ ఆలయానికి బలులు తీసుకొస్తాను.
నేను కష్టంలో ఉన్నప్పుడు నిన్ను నేను సహాయం కోసం అడిగాను.
నేను నీకు చాల వాగ్దానాలు చేసాను.
ఇప్పుడు, నేను వాగ్దానం చేసినవాటిని నీకు ఇస్తున్నాను.
15 నేను నీకు పాపపరిహారార్థ బలులు ఇస్తున్నాను.
నేను నీకు పొట్టేళ్లతో ధూపం[c] ఇస్తున్నాను.
నేను నీకు ఎద్దులను, మేకలను ఇస్తున్నాను.
16 దేవుని ఆరాధించే ప్రజలారా, మీరంతా రండి.
దేవుడు నా కోసం ఏమి చేసాడో నేను మీతో చెబుతాను.
17 నేను ఆయన్ని ప్రార్థించాను.
నేను ఆయన్ని స్తుతించాను.
18 నా హృదయం పవిత్రంగా ఉంది.
కనుక నా యెహోవా నా మాట విన్నాడు.
19 దేవుడు నా మొరను విన్నాడు.
దేవుడు నా ప్రార్థన విన్నాడు.
20 దేవుని స్తుతించండి!
దేవుడు నాకు విముఖుడు కాలేదు. ఆయన నా ప్రార్థన విన్నాడు.
దేవుడు తన ప్రేమను నాకు చూపించాడు!
సంగీత నాయకునికి: వాయిద్యాలతో స్తుతి కీర్తన.
67 దేవా, మమ్ములను కనికరించి, మమ్ములను ఆశీర్వదించుము.
దయచేసి మమ్ములను స్వీకరించుము.
2 దేవా, భూమి మీద ప్రతి మనిషినీ నిన్ను గూర్చి తెలుసుకోనిమ్ము.
నీవు మనుష్యులను ఎలా రక్షిస్తావో ప్రతి దేశం నేర్చుకోనిమ్ము.
3 దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరుగాక!
మనుష్యులంతా నిన్ను స్తుతించెదరుగాక!
4 దేశాలన్నీ ఆనందించి, సంతోషించుగాక!
ఎందుకంటే నీవు మనుష్యులకు న్యాయంగా తీర్పు తీరుస్తావు
మరియు ప్రతి దేశాన్నీ నీవు పాలిస్తావు.
5 దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరు గాక!
మనుష్యులంతా నిన్ను స్తుతించెదరు గాక!
6 దేవా, మా దేవా, మమ్మల్ని దీవించుము.
మా భూమి మాకు గొప్ప పంట ఇచ్చేటట్టుగా చేయుము.
7 దేవుడు మమ్మల్ని దీవించుగాక.
భూమిమీద వున్న ప్రతి ఒక్కరూ దేవునికి భయపడి, ఆయనను గౌరవించెదరు గాక.
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
19 ఆకాశాలు దేవుని మహిమను తెలియజేస్తున్నాయి.
యెహోవా చేతులు చేసిన మంచివాటిని అంతరిక్షం తెలియజేస్తుంది.
2 ప్రతి క్రొత్త రోజూ ఆ గాథను మరింత చెబుతుంది.
ప్రతి రాత్రి దేవుని గురించి మరింత ఎక్కువగా తెలియజేస్తుంది.
3 నిజానికి నీవు ఏ ఉపన్యాసం గాని మాటలుగాని వినలేవు.
మనం వినగలిగిన శబ్దం ఏదీ అవి చేయవు.
4 అయినా వాటి “స్వరం” ప్రపంచం అంతా ప్రసరిస్తుంది.
వాటి “మాటలు” భూమి చివరి వరకూ వెళ్తాయి.
అంతరిక్షం సూర్యునికి ఒక ఇల్లు లాంటిది.
5 తన పడక గది నుండి వచ్చే సంతోష భరితుడైన పెండ్లి కుమారునిలా సూర్యుడు బయటకు వస్తాడు.
పందెంలో పరుగెత్తడానికి ఆత్రంగా ఉన్న ఆటగానిలా సూర్యుడు
ఆకాశంలో తన దారిని మొదలు పెడతాడు.
6 సూర్యుడు అంతరిక్షంలోని ఒక దిశలో మొదలు పెడ్తాడు,
మరియు ఆవలి దిశకు అది పరుగెడుతుంది.
దాని వేడి నుండి ఏదీ దాక్కొలేదు. యెహోవా ఉపదేశాలు అలా ఉన్నాయి.
7 యెహోవా ఉపదేశాలు పరిపూర్ణం.
అవి దేవుని ప్రజలకు బలాన్నిస్తాయి.
యెహోవా ఒడంబడిక విశ్వసించదగింది.
జ్ఞానం లేని మనుష్యులకు అది జ్ఞానాన్ని ఇస్తుంది.
8 యెహోవా చట్టాలు సరియైనవి.
అవి మనుష్యులను సంతోషపెడ్తాయి.
యెహోవా ఆదేశాలు పరిశుద్ధమైనవి.
ప్రజలు జీవించుటకు సరైన మార్గాన్ని చూపడానికి అవి కన్నులకు వెలుగునిస్తాయి.
9 యెహోవాను ఆరాధించుట మంచిది.
అది నిరంతరము నిలుస్తుంది.
యెహోవా తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి.
అవి సంపూర్ణంగా సరియైనవి.
10 శ్రేష్ఠమైన బంగారంకంటె యెహోవా ఉపదేశాలను మనము ఎక్కువగా కోరుకోవాలి.
సాధారణ తేనె పట్టు నుండి వచ్చే శ్రేష్ఠమైన తేనె కంటె అవి మధురంగా ఉంటాయి.
11 యెహోవా ఉపదేశాలు నీ సేవకుణ్ణి చాలా తెలివిగలవాణ్ణిగా చేస్తాయి.
నీ చట్టాలు పాటించేవారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు.
12 యెహోవా, ఏ వ్యక్తీ, తన స్వంత తప్పులన్నింటినీ చూడలేడు.
కనుక నేను రహస్య పాపాలు చేయకుండా చూడుము.
13 యెహోవా, నేను చేయాలనుకొనే పాపాలు చేయకుండా నన్ను ఆపుచేయుము.
ఆ పాపాలు నా మీద అధికారం చెలాయించ నీయకుము.
నీవు నాకు సహాయం చేస్తే, అప్పుడు నేను గొప్ప పాపము నుండి, పవిత్రంగా దూరంగా ఉండగలను.
14 నా మాటలు, తలంపులు నిన్ను సంతోషపెడ్తాయని నేను ఆశిస్తున్నాను.
యెహోవా, నీవే నా ఆశ్రయ దుర్గం. నీవే నన్ను రక్షించేవాడవు.
సంగీత నాయకునికి: కోరహు కుమారుల అలామోతు రాగ గీతం.
46 దేవుడు మా ఆశ్రయం, మా శక్తి.
ఆయన యందు, మాకు కష్ట కాలంలో ఎల్లప్పుడూ సహాయం దొరుకుతుంది.
2 అందుచేత భూమి కంపించినప్పుడు,
మరియు పర్వతాలు సముద్రంలో పడినప్పుడు మేము భయపడము.
3 సముద్రాలు పొంగినను, చీకటితో నిండినను,
భూమి, మరియు పర్వతాలు కంపించినను మేము భయపడము.
4 ఒక నది ఉంది. దాని కాలువలు దేవుని నివాసానికి,
మహోన్నత దేవుని పరిశుద్ధ పట్టణానికి సంతోషం తెచ్చి పెడ్తాయి.
5 ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. కనుక అది ఎన్నటికీ నాశనం చేయబడదు.
సూర్యోదయానికి ముందే దేవుడు సహాయం చేస్తాడు.
6 రాజ్యాలు భయంతో వణకుతాయి.
యెహోవా గద్దించగా ఆ రాజ్యాలు కూలిపోతాయి. భూమి పగిలిపోతుంది.
7 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
8 యెహోవా చేసే మహత్తర కార్యాలు చూడండి.
ఆ కార్యాలు భూమి మీద యెహోవాను ప్రసిద్ధి చేస్తాయి.
9 భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను యెహోవా ఆపివేయగలడు.
సైనికుల విల్లులను, వారి ఈటెలను ఆయన విరుగగొట్టగలడు. రథాలను ఆయన అగ్నితో కాల్చివేయగలడు.
10 దేవుడు చెబుతున్నాడు, “మౌనంగా ఉండి, నేను దేవుణ్ణి అని తెలుసుకొనండి.
రాజ్యాలతో నేను స్తుతించబడతాను.
భూమిమీద మహిమపర్చబడతాను.”
11 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
ప్రజలను యెహోవా శిక్షించాడు
26 మోషే, అహరోనులతో యెహోవా ఇలా చెప్పాడు: 27 “ఈ దుర్మార్గులు ఇంకెన్నాళ్లు ఇలా నా మీద ఫిర్యాదు చేస్తుంటారు? వారి ఫిర్యాదులు, సణుగుడు నేను విన్నాను. 28 కనుక వారితో ఇలా చెప్పు, మీరు ఫిర్యాదు చేసిన విషయాలన్నింటినీ యెహోవా తప్పక జరిగిస్తాడు. మీకు ఏమి సంభవిస్తుందంటే, 29 ఈ అరణ్యంలోనే మీ శరీరాలు చచ్చిపడతాయి. మీలో 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉన్న వాళ్లంతా మన ప్రజల్లో సభ్యులుగా లెక్కించబడ్డారు. మీలో ప్రతి ఒక్కరూ, యెహోవానైన నా మీద ఫిర్యాదు చేసారు. కనుక మీలో ప్రతి ఒక్కరు అరణ్యంలోనే చస్తారు. 30 మీకు ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశంలో మీరు ఒక్కరుకూడా ప్రవేశించరు. యెపున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ మాత్రమే ఆ దేశంలోనికి ప్రవేశిస్తారు. 31 మీరు భయపడి, ఆ కొత్త దేశంలో మీ శత్రువులు మీ పిల్లలను మీ దగ్గరనుండి తీసుకుని పోతారని ఫిర్యాదు చేసారు. అయితే ఆ పిల్లల్నే ఆ దేశంలోకి నేను తీసుకొని వెళ్తానని నేను మీతో చెబుతున్నాను. మీరు అంగీకరించకుండా నిరాకరించిన వాటిని వారు అనుభవిస్తారు. 32 మీ విషయానికొస్తే, మీ శరీరాలు ఈ అరణ్యంలోనే రాలిపోతాయి.
33 “మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 సంవత్సరాలపాటు కాపరులుగా ఉంటారు. మీకు విశ్వాసం లేదు గనుక వారు శ్రమపడుతారు. మీరంతా చచ్ఛేంతవరకు వారు ఈ అరణ్యంలోనే ఉండాలి. అప్పుడు మీ అందరి శరీరాలు ఈ అరణ్యంలోనే పడి పోతాయి. 34 మీ పాపాలకోసం 40 సంవత్సరాలు మీరు శ్రమ అనుభవిస్తారు. (ఆ దేశాన్ని కనుగొన్న 40 రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో సంవత్సరం చొప్పున.) నేను మీకు వ్యతిరేకంగా ఉండటం ఎంతో దారుణంగా ఉంటుందని మీరు తెలుసుకుంటారు.”
35 “నేను యెహోవాను, నేనే మాట్లాడాను. ఈ దుర్మార్గులందరికీ ఇవన్నీ నేను చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. వీరంతా కలిసి నామీదికి వచ్చారు. అందుచేత వీళ్లంతా ఇక్కడే అరణ్యంలోనే చస్తారు.”
36 ఆ కొత్త దేశాన్ని కనుగొనేందుకు మోషే పంపించిన మనుష్యులు తిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజల్లో ఫిర్యాదులు వ్యాపింప చేసారు. ఆ దేశంలో ప్రవేశించటానికి సరిపడినంత బలంగల వాళ్లం కాదు అని వారే చెప్పారు. 37 ఇశ్రాయేలు ప్రజల్లో కష్టాలు వ్యాపించటానికి వాళ్లే బాధ్యులు. అందుకని వాళ్లందర్నీ చంపేయటానికి ఒక రోగాన్ని రప్పించాడు యెహోవా. 38 అయతే ఆ దేశాన్ని పరిశీలించటానికి పంపబడ్డవాళ్లలో నూను కుమారుడైన యెహోషువ, యెపున్నె కుమారుడైన కాలేబు కూడ ఉన్నారు. యెహోవా వాళ్లిద్దర్నీ రక్షించాడు. మిగతా పదిమందిని చని పోవునట్లు చేసిన రోగం వారికి రాలేదు.
కనానులో ప్రవేశించటానికి ప్రజలు ప్రయత్నించటం
39 ఈ సంగతులన్నీ మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. ప్రజలు చాలా, చాలా విచారించారు. 40 మర్నాడు ఉదయాన్నే ప్రజలు కొండల దేశానికి బయల్దేరారు. ఆ ప్రజలు, “మేము పాపము చేసాము. మేము యెహోవా మీద నమ్మకం ఉంచనందుకు మేము విచారిస్తున్నాము. యెహోవా వాగ్దానం చేసిన దేశానికి మేము వెళ్తాము” అన్నారు.
41 కానీ మోషే ఇలా అన్నాడు: “యెహోవా ఆజ్ఞకు మీరెందుకు విధేయులవటం లేదు? మీకు జయం కలుగదు. 42 మీరు ఆ దేశం వెళ్లవద్దు. యెహోవా మీకు తోడుగా లేడు. మీ శత్రువులు మిమ్మల్ని తేలికగా ఓడించేస్తారు. 43 అక్కడ అమాలేకీయులు, కనానీయులు మీతో పొరాడుతారు. మీరు యెహోవానుండి వేరైపోయారు. అందుచేత మీరు వాళ్లతో యుద్ధం చేసేటప్పుడు ఆయన మీకు తోడుగా ఉండడు. మీరంతా వారి ఖడ్గాలతో చంపబడతారు.”
44 కానీ ప్రజలు మోషేను నమ్మలేదు. వారు అలానే ఆ కొండల దేశంవైపు వెళ్లారు. అయితే మోషేగాని, యెహోవా ఒడంబడిక పెట్టెగాని వారితో వెళ్లలేదు. 45 అప్పుడు ఆ కొండల దేశంలో నివసిస్తున్న అమాలేకీ ప్రజలు, కనానీ ప్రజలు దిగివచ్చి ఇశ్రాయేలు ప్రజలమీద దాడిచేసారు. అమాలేకీ ప్రజలు, కనానీ ప్రజలు తేలికగా వీరిని ఓడించి, హోర్మా వరకు వారిని తరిమికొట్టారు.
యెరూషలేములో సమావేశం
15 కొందరు యూదయనుండి అంతియొకయకు వచ్చి అక్కడున్న సోదరులకు, “సున్నతి అనే మోషే ఆచారాన్ని పాటిస్తే తప్ప మీకు రక్షణ లభించదు” అని బోధించారు. 2 ఈ కారణంగా పౌలు, బర్నబా వాళ్ళతో తీవ్రమైన వాదనలు, చర్చలు చేసారు. అపొస్తలుల్ని ఈ విషయాన్ని గురించి సంప్రదించాలనే ఉద్దేశ్యంతో పౌలును, బర్నబాను, మరి కొంతమందిని యెరూషలేమునకు పంపాలనే నిర్ణయం జరిగింది.
3 అక్కడున్న సంఘం వీళ్ళకు వీడ్కోలు యిచ్చింది. వీళ్ళు ఫోనీషియ, సమరయ పట్టణాల ద్వారా ప్రయాణం చేస్తూ యూదులు కానివాళ్లలో వచ్చిన మార్పును గురించి అక్కడి వాళ్ళకు చెప్పారు. ఇది సోదరులందరికీ చాలా ఆనందం కలిగించింది. 4 వీళ్ళు యెరూషలేము చేరగానే సంఘము, అపొస్తలులు, పెద్దలు అంతా కలిసి వీళ్ళకు స్వాగతం యిచ్చారు. పౌలు, బర్నబా దేవుడు తమ ద్వారా చేసిన వాటిని వాళ్ళకు చెప్పారు. 5 పరిసయ్యుల తెగకు చెందిన కొందరు భక్తులు లేచి, “యూదులు కానివాళ్ళు తప్పక సున్నతి చేసుకోవాలి. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలి” అని అన్నారు.
6 అపొస్తలులు, పెద్దలు కలిసి ఈ విషయాన్ని పరిశీలించారు. 7 ఎన్నో చర్చలు జరిగాక పేతురు లేచి యిలా అన్నాడు: “సోదరులారా! యూదులు కానివాళ్ళు నా నోటినుండి సువార్త విని విశ్వాసులు కావాలని చాలా కాలం క్రిందటే దేవుడు మనందరినుండి నన్నెన్నుకొన్నట్లు మీకు తెలుసు. 8 మానవుల మనస్సు తెలిసిన దేవుడు, మనకిచ్చినట్లే పవిత్రాత్మను వాళ్ళకు కూడా యిచ్చి వాళ్ళను అంగీకరించినట్లు మనకు తెలియ చేసాడు. 9 మనకు, వాళ్ళకూ వ్యత్యాసం చూపలేదు. వాళ్ళు విశ్వసించారు. కనుక వాళ్ళ హృదయాలను పవిత్రం చేసాడు. 10 మరి అలాంటప్పుడు బరువైన ఈ కాడిని శిష్యుల మెడపై ఎందుకు పెడ్తున్నారు? ఈ బరువును మనము, మన పెద్దలు కూడా మోయలేక పోయాము కదా! దేవుడు కోప్పడుతాడో లేదో చూడాలని ఉందా? 11 యేసు ప్రభువు దయతో మనము, వీళ్ళు కూడా రక్షింపబడుతామని నమ్ముతున్నాము.”
12 సభలో ఉన్నవాళ్ళందరూ నిశ్శబ్దం వహించారు. బర్నబా, పౌలు యూదులు కానివాళ్ళలో దేవుడు తమ ద్వారా చేసిన మహిమల్ని గురించి, అద్భుతాల్ని గురించి చెప్పగా వాళ్ళు విన్నారు.
యేసును వెంబడించుటవలన కష్టములు వచ్చును
(మత్తయి 10:34-36)
49 “నేను ఈ భూమ్మీద అగ్ని వేయడానికి వచ్చాను. ఆ అగ్ని యిదివరకే రగిలి ఉండాలని ఆశించాను. 50 కాని నేను పొందవలసిన బాప్తిస్మము ఉంది. అది జరిగే వరకు నాకీ వేదన తప్పదు. 51 శాంతిని కలుగ జేయుటకు నేనీ భూమ్మీదికి వచ్చాననుకొంటున్నారా? కాదు. దీన్ని విభజించటానికి వచ్చాను. 52 ఇప్పటి నుండి ఒక కుటుంబంలో ఐదుగురు ఉంటే, వాళ్ళు విడిపోయి, ముగ్గురు ఒకవైపుంటే ఇద్దరొకవైపు: యిద్దరొక వైపుంటే ముగ్గురొక వైపు చేరి పోట్లాడుతారు.
53 తండ్రి కుమారునితో,
కుమారుడు తండ్రితో,
తల్లి కూతురుతో,
కూతురు తల్లితో,
అత్త కోడలితో,
కోడలు అత్తతో పోట్లాడుతారు.”
కాలాన్ని అర్థం చేసుకోండి
(మత్తయి 16:2-3)
54 యేసు అక్కడున్న ప్రజలతో, “మీరు పడమరన మేఘాలు కమ్ముకోవటం చూసిన వెంటనే, ‘వర్షం కురుస్తుంది’ అని అంటారు. 55 దక్షిణం నుండి గాలివీయగానే, ‘వేడి ఎక్కువౌతుంది’ అని అంటారు. మీరన్నట్లే జరుగుతుంది. 56 కాని మీరు వంచకులు. భూమివైపు, ఆకాశం వైపు చూసి ఏమి జరుగబోతుందో చెప్పగలరు. కాని ప్రస్తుతం జరుగుతున్న దాన్ని చూసి ఏమి జరుగబోతుందో ఎందుకు చెప్పలేరు?
© 1997 Bible League International