Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 69

సంగీత నాయకునికి: “పుష్పాల రాగం.” దావీదు కీర్తన.

69 దేవా, నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించుము.
    నా నోటి వరకు నీళ్లు లేచాయి.
నిలబడి ఉండుటకు ఏదీ లేదు.
    నేను మునిగిపోతున్నాను. క్రింద బురదలోకి దిగజారిపోతున్నాను.
లోతైనజలాల్లో నేనున్నాను.
    అలలు నా చుట్టూ కొట్టుకొంటున్నాయి. నేను మునిగిపోబోతున్నాను.
సహాయం కోసం పిలిచి పిలిచి నేను బలహీనుడనౌతున్నాను.
    నా గొంతు నొప్పిగా ఉంది.
నా కళ్లకు నొప్పి కలిగినంతవరకు
    నేను నీ సహాయం కోసం కనిపెట్టి చూశాను.
నా తలపైగల వెంట్రుకల కంటె ఎక్కువ మంది శత్రువులు నాకున్నారు.
    ఏ కారణం లేకుండానే వారు నన్ను ద్వేషిస్తున్నారు.
    వారు నన్ను నాశనం చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
నా శత్రువులు నన్ను గూర్చి అబద్ధాలు చెబుతున్నారు.
    వారు అబద్ధమాడి నేను వస్తువులు దొంగిలించానని చెప్పారు.
    ఆ తరువాత నేను దొంగిలించని వాటికి నా చేత బలవంతంగా డబ్బు కట్టించారు.
దేవా, నేను ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు.
    నా పాపము నీ నుండి దాచి పెట్టబడలేదు.
నా దేవా, సర్వశక్తిమంతుడవైన యెహోవా, నా మూలంగా నీ అనుచరులను సిగ్గుపడనియ్యకుము.
    ఇశ్రాయేలీయుల దేవా, నా మూలంగా నీ ఆరాధకులను ఇబ్బంది పడనీయకుము.
నా ముఖం సిగ్గుతో నిండి ఉంది.
    నీ కోసం ఈ సిగ్గును నేను భరిస్తాను.
నా సోదరులు నన్ను పరాయి వానిలా చూస్తారు.
    నా తల్లి కుమారులు నన్నొక విదేశీయునిలా చూస్తారు.
నీ ఆలయాన్ని గూర్చిన నా ఉత్సాహము నన్ను దహించుచున్నది.
    నిన్ను ఎగతాళి చేసే మనుష్యుల అవమానాలను నేను పొందుతున్నాను.
10 నేను ఉపవాసం ఉండి ఏడుస్తున్నాను.
    అందు నిమిత్తం వారు నన్ను ఎగతాళి చేస్తున్నారు.
11 నా విచారాన్ని చూపించేందుకు నేను దుఃఖ బట్టలు ధరిస్తున్నాను.
    ప్రజలు నన్ను గూర్చి పరిహాసాలు చెప్పుకొంటున్నారు.
12 బహిరంగ స్థలాల్లో వారు నన్ను గూర్చి మాట్లాడుకొంటున్నారు.
    త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుతున్నారు.
13 నా మట్టుకైతే యెహోవా, ఇదే నీకు నా ప్రార్థన.
    నీవు నన్ను స్వీకరించాలని కోరుతున్నాను.
దేవా, ప్రేమతో నీవు నాకు జవాబు ఇవ్వాలని కోరుతున్నాను.
14 బురదలో నుండి నన్ను పైకి లాగుము.
    బురదలోకి నన్ను మునిగిపోనియ్యకు.
నన్ను ద్వేషించే మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
    లోతైన ఈ జలాల నుండి నన్ను రక్షించుము.
15 అలలు నన్ను ముంచివేయనీయకుము.
    లోతైన అగాధం నన్ను మ్రింగివేయనీయకుము.
    సమాధి తన నోరును నా మీద మూసికొననీయకుము
16 యెహోవా, నీ ప్రేమ మంచిది. నీ ప్రేమ అంతటితో నాకు జవాబు ఇమ్ము.
    నీ పూర్ణ దయతో నాకు సహాయం చేయుటకు మళ్లుకొనుము.
17 నీ సేవకునికి విముఖుడవు కావద్దు.
    నేను కష్టంలో ఉన్నాను. త్వరపడి నాకు సహాయం చేయుము.
18 వచ్చి నా ఆత్మను రక్షించుము.
    నా శత్రువులనుండి నన్ను తప్పించుము.
19 నా అవమానం నీకు తెలుసు.
    నా శత్రువులు నన్ను అవమానపరిచారని నీకు తెలుసు.
    వారు నన్ను కించపరచటం నీవు చూసావు.
20 సిగ్గు నన్ను కృంగదీసింది.
    అవమానం చేత నేను చావబోతున్నాను.
సానుభూతి కోసం నేను ఎదురు చూశాను.
    కాని ఏమీ దొరకలేదు.
ఎవరైనా నన్ను ఆదరిస్తారని నేను ఎదురుచూశాను.
    కాని ఎవరూ రాలేదు.
21 వారు నాకు భోజనం కాదు విషం పెట్టారు.
    ద్రాక్షారసానికి బదులుగా చిరకను వారు నాకు ఇచ్చారు.
22 వారి బల్లల మీద భోజన పానాలు పుష్కలంగా ఉన్నాయి.
    విందులు జరుగుతుంటాయి. వారి భోజనాలే వారికి ఎక్కువ అగును గాక.
23 వారి కన్నులకు చీకటి కలిగి చూడలేక పోదురు గాక! వారి నడుములు ఎడతెగకుండా వణుకునట్లు చేయుము.
24 నీ కోపమును వారిపై కుమ్మరించుము.
    నీ భయంకర కోపమును వారు సహించనిమ్ము.
25 వారి కుటుంబాలు, ఇండ్లు
    పూర్తిగా నాశనం చేయబడునుగాక.
26 నీవు వారిని శిక్షించుము. వారు పారిపోతారు.
    అప్పుడు బాధను గూర్చి వారు మాట్లాడుకుంటారు.
27 వారు చేసిన చెడ్డ పనులకు గాను వారిని శిక్షించుము.
    నీవు ఎంత మంచివాడవుగా ఉండగలవో వారికి చూపించవద్దు.
28 జీవ గ్రంథంలో నుండి వారి పేర్లు తుడిచివేయుము.
    మంచి మనుష్యుల పేర్లతో పాటు వారి పేర్లను గ్రంథంలో వ్రాయవద్దు.
29 నేను విచారంగాను, బాధతోను ఉన్నాను.
    దేవా, నన్ను లేవనెత్తుము. నన్ను రక్షించుము.
30 దేవుని నామమును కీర్తనతో నేను స్తుతిస్తాను.
    కృతజ్ఞతా గీతంతో నేను ఆయన్ని స్తుతిస్తాను.
31 ఆబోతును వధించుట, జంతువునంతటిని బలి అర్పించుటకంటె ఇది ఉత్తమము.
    ఇది దేవుణ్ణి సంతోషింపజేస్తుంది.
32 పేద ప్రజలారా, మీరు దేవుని ఆరాధించుటకు వచ్చారు.
    పేద ప్రజలారా, ఈ సంగతులను తెలుసుకొనేందుకు మీరు సంతోషిస్తారు.
33 నిరుపేదల, నిస్సహాయ ప్రజల ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు.
    యెహోవా కారాగారంలో ఉన్న తన వారిని విసర్జించడు.
34 ఆకాశమా, భూమీ, సముద్రమా,
    దానిలోని సమస్తమా, యెహోవాను స్తుతించండి.
35 యెహోవా సీయోనును రక్షిస్తాడు.
    యూదా పట్టణాలను యెహోవా తిరిగి నిర్మిస్తాడు.
ఆ భూమి స్వంతదారులు మరల అక్కడ నివసిస్తారు.
36     ఆయన సేవకుల సంతతివారు ఆ దేశాన్ని పొందుతారు.
    ఆయన నామాన్ని ప్రేమించే ప్రజలు అక్కడ నివసిస్తారు.

కీర్తనలు. 73

మూడవ భాగం

(కీర్తనలు 73–89)

ఆసాపు స్తుతి కీర్తన.

73 దేవుడు నిజంగా ఇశ్రాయేలీయుల యెడల మంచివాడు.
    పవిత్ర హృదయాలు గల ప్రజలకు దేవుడు మంచివాడు.
నేను దాదాపుగా జారిపోయి,
    పాపం చేయటం మొదలు పెట్టాను.
దుర్మార్గులు సఫలమవటం నేను చూసాను.
    ఆ గర్విష్ఠులైన ప్రజలను గూర్చి నేను అసూయ పడ్డాను.
ఆ మనుష్యులు ఆరోగ్యంగా ఉన్నారు.
    వారు జీవించుటకు శ్రమపడరు.[a]
మేము కష్టాలు అనుభవిస్తున్నట్టు ఆ గర్విష్ఠులు కష్టాలు పడరు.
    ఇతర మనుష్యుల్లా వారికి కష్టాలు లేవు.
కనుక వారు చాలా గర్విష్ఠులు, ద్వేష స్వభావులు.
    వారు ధరించే అందమైన బట్టలు, నగలు ఎంత తేటగా ఉన్నాయో ఈ విషయం కూడ అంత తేటతెల్లం.
ఆ మనుష్యులకు కనబడింది ఏదైనా వారికి నచ్చితే వారు వెళ్లి దాన్ని తీసుకొంటారు.
    వారు కోరుకొన్న పనులు వారు చేస్తారు.
ఇతరులను గూర్చి కృ-రమైన చెడ్డ మాటలు వారు చెబుతారు. వారు ఇతరులను ఎగతాళి చేస్తారు.
    వారు గర్విష్ఠులు, మొండివారు. ఇతరులను వారు ఉపయోగించుకోటానికి ప్రయత్నిస్తారు.
ఆ గర్విష్ఠులు వారే దేవుళ్లని అనుకుంటారు.
    వారు భూమిని పాలించేవారని తలుస్తారు.
10 కనుక దేవుని ప్రజలు సహితం ఆ దుర్మార్గుల వైపు తిరిగి
    వారు చెప్పే సంగతులు నమ్ముతారు.
11 “మేము చేసే సంగతులు దేవునికి తెలియవు.
    సర్వోన్నతుడైన దేవునికి తెలియదు అని ఆ దుర్మార్గులు చెబుతారు.”

12 ఆ గర్విష్ఠులు దుర్మార్గులు, ధనికులు.
    మరియు వారు ఎల్లప్పుడూ మరింత ధనికులౌతున్నారు.
13 కనుక నేనెందుకు ఇంకా నా హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి?
    నేనెందుకు ఎల్లప్పుడూ నా చేతులను పవిత్రం చేసుకోవాలి?
14 దేవా, రోజంతా నేను శ్రమ పడుతున్నాను.
    నీవేమో ప్రతి ఉదయం నన్ను శిక్షిస్తున్నావు.
15 ఈ సంగతులు నేను ఇతరులతో చెప్పాలని అనుకొన్నాను.
    కాని దేవా, నేను నీ ప్రజలను ద్రోహంగా అప్పగిస్తానని నాకు తెలిసియుండినది.
16 ఈ సంగతులను నా మనస్సునందు గ్రహించుటకు నేను ప్రయత్నించాను.
    కాని నేను నీ ఆలయానికి వెళ్లేదాకా దానిని గ్రహించడం ఎంతో కష్టతరమైనది.
17 నేను దేవుని ఆలయానికి వెళ్లాను,
    వారి చివరి గమ్యాన్ని నేను గ్రహించాను.
18 దేవా, ఆ మనుష్యులను నీవు నిజంగా అపాయకరమైన పరిస్థితిలో పెట్టావు.
    వారు పడిపోయి నాశనం అవడం ఎంతో సులభం.
19 కష్టం అకస్మాత్తుగా రావచ్చును.
    అప్పుడు ఆ దుర్మార్గులు నాశనం అవుతారు.
భయంకరమైన సంగతులు వారికి సంభవించవచ్చు.
    అప్పుడు వారు అంతమైపోతారు.
20 యెహోవా, మేము మేల్కొన్నప్పుడు
    మరచిపోయే కలవంటి వారు ఆ మనుష్యులు.
మా కలలో కనిపించే రాక్షసుల్లా ఆ మనుష్యులను
    నీవు కనబడకుండా చేస్తావు.

21-22 నేను చాలా తెలివి తక్కువ వాడను.
    ధనికులను, దుర్మార్గులను గూర్చి నేను తలంచి చాలా తల్లడిల్లి పోయాను.
దేవా, నేను నీ మీద కోపంగించి తల్లడిల్లి పోయాను.
    తెలివితక్కువగాను, బుద్ధిలేని పశువుగాను నేను ప్రవర్తించాను.
23 నాకు కావలసిందంతా నాకు ఉంది. నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను.
    దేవా, నీవు నా చేయి పట్టుకొనుము.
24 దేవా, నీవు నన్ను నడిపించి నాకు మంచి సలహా ఇమ్ము.
    ఆ తరువాత మహిమలో నేను నీతో ఉండుటకు నీవు నన్ను తీసుకొని వెళ్తావు.
25 దేవా, పరలోకంలో నాకు నీవు ఉన్నావు.
    మరియు నేను నీతో ఉన్నప్పుడు భూమిమీద నాకు ఏమికావాలి?
26 ఒకవేళ నా మనస్సు,[b] నా శరీరం నాశనం చేయబడతాయేమో.
    కాని నేను ప్రేమించే బండ[c] నాకు ఉంది.
    నాకు శాశ్వతంగా దేవుడు ఉన్నాడు.
27 దేవా, నిన్ను విడిచిపెట్టే ప్రజలు తప్పిపోతారు.
    నీకు నమ్మకంగా ఉండని మనుష్యులను నీవు నాశనం చేస్తావు.
28 కాని నేను దేవునికి సన్నిహితంగా ఉన్నాను.
    దేవుడు నా యెడల దయ చూపించాడు.
    నా యెహోవా నా కోసం శ్రద్ధ తీసుకొంటాడు. నా ప్రభువైన యెహోవా నా క్షేమస్థానం.
    దేవా, నీవు చేసిన వాటన్నిటిని గూర్చి నేను చెబుతాను.

ప్రసంగి 11:9-12:14

నీయౌవ్వన కాలంలోనే దేవుని సేవచెయ్యి

అందుకని, యువజనులారా, మీ యౌవ్వన కాలంలోనే మీరు సుఖాలు అనుభవించండి. ఆనందంగా ఉండండి! మీ మనస్సుకి ఏది తోస్తే, మీరు ఏది కోరుకుంటే అది చెయ్యండి. అయితే, మీరు చేసే పనులన్నింటికీ దేవుడు మిమ్మల్ని విచారిస్తాడని మాత్రం మరిచిపోకండి. 10 మీ కోపానికి మీరు లొంగిపోకండి. మీ శరీరం మిమ్మల్ని పాప మార్గాన నడపకుండా చూసుకోండి.[a] ప్రజలు జీవిత ప్రారంభ దశలో తాము యౌవనస్థులుగా ఉన్నప్పుడు తెలివిలేని పనులు చేస్తారు.

వృద్దాప్యంలో ఎదురయ్యే సమస్యలు

12 చెడ్డకాలం దాపురించక ముందు (నీవు ముసలి వాడవు కాకముందు), “నా జీవితం వృథా చేసు కున్నాను”[b] అని నీవు వాపోయే వయస్సు రాక ముందు, నీవింకా యౌవ్వనావస్థలో వుండగానే నీ సృష్టికర్తని నీవు గుర్తుచేసుకో.

సూర్య చంద్రులూ, నక్షత్రాలూ నీ కంటి దృష్టికి ఆనని కాలం దాపురించక పూర్వం, (నీవింకా యౌవన ప్రాయంలో ఉండగానే, నీ సృష్టికర్తని నీవు జ్ఞాపకం చేసుకో). ఒక తుఫాను తర్వాత మరొక తుఫాను వచ్చినట్లే, (కష్టాలు పదే పదే వస్తాయి).

ఆ వయస్సులో నీ చేతులు శక్తి కోల్పోతాయి. నీ కాళ్లు బలము లేక వంగుతాయి. నీ పళ్లు ఊడిపోతాయి, నీవు నీ ఆహారం నమలలేవు. నీ కళ్లు మసకబారతాయి. నీ వినికిడి శక్తి మందగిస్తుంది. వీధుల్లోని శబ్దాలు నీకు వినిపించవు. నీ గోధుమలు విసిరే తిరగలి శబ్దం కూడా నీకు వినిపించదు. స్త్రీలు పాడే పాటలు కూడా నీవు వినలేవు. అయితే, పక్షి చేసే కిలకిలారావానికే నీకు వేకువజామున మెలుకువ వచ్చేస్తుంది. (మరెందుకో కాదు, నీకు నిద్రరాదు, అందుకు.)

ఎత్తయిన ప్రదేశాలంటే నీకు భయం వేస్తుంది. నీ దోవలో ఏ చిన్న వస్తువు ఉన్నా, దానిమీద కాలువేస్తే ఎక్కడ బోల్తాపడిపోతానో అని నీకు బెదురు కలుగుతుంది. నీ జుట్టు నెరిసి, బాదం చెట్టు పూతలా కనిపిస్తుంది. నీవు కాళ్లీడ్చుకుంటూ మిడతలా నడుస్తావు. నీవు నీ కోరికను కోల్పోతావు (జీవించటానికి). అప్పుడిక నీవు నీ శాశ్వత నివాసానికి (సమాధిలోకి) పోతావు. (నీ శవాన్ని సమాధికి మోసుకెళ్తూ) విలాపకులు[c] వీధుల్లో గుమిగూడి శోకనాలు పెడతారు.

మరణం

    నీ వెండి మొలతాడు తెగక ముందే,
    బంగారు గిన్నె నలగక ముందే.
    బావి దగ్గర పగిలిన మట్టి కుండలా,
    (నీ జీవితం వృథా కాక ముందే) పగిలి బావిలో పడిపోయిన రాతి మూతలా నీ జీవితం వృథా కాకముందే
నీ యౌవనకాలంలోనే నీవు నీ సృష్టికర్తను స్మరించుకో.
మట్టిలో నుంచి పుట్టిన నీ శరీరం
    నీవు మరణించినప్పుడు తిరిగి ఆ మట్టిలోనే కలిసి పోతుంది.
కానీ, దేవుని దగ్గర్నుంచి వచ్చిన నీ ఆత్మ
    నీవు మరణించినప్పుడు తిరిగి ఆ దేవుడి దగ్గరకే పోతుంది.

అంతా వ్యర్థం, శుద్ధ అర్థరహితం. ఇదంతా కాలాన్ని వ్యర్థం చెయ్యడం అంటాడీ ప్రసంగి!

ముగింపు సలహాలు

ప్రసంగి గొప్ప జ్ఞాని. అతడు తన జ్ఞానాన్ని జనానికి బోధ చేసేందుకు వినియోగించాడు. అనేక వివేకవంతమైన బోధనలను అతడు ఎంతో శ్రద్ధగా అధ్యయనం చేసి, జాగ్రత్తగా విభజించాడు.[d] 10 ప్రసంగి సరైన పదాలు ఎంచుకునేందుకు చాలా శ్రమించాడు. అతడు యధార్థమైన, ఆధారపడదగిన ఉపదేశాలు రచించాడు.

11 జ్ఞానుల మాటలు, జనం తమ పశువులను సరైన బాటలో నడిపేందుకు ఉపయోగించే ముల్లు కర్రల వంటివి. ఆ ఉపదేశాలు విరగని గట్టి గూటాల వంటివి. (నీకు సరైన జీవన మార్గాన్ని చూపే సరైన మార్గదర్శులుగా నీవా బోధనల పైన ఆధారపడవచ్చు) ఆ జ్ఞానోపదేశాలన్నీ ఒకే కాపరి (దేవుని) నోట నుండి వచ్చినవి. 12 అందుకని కుమారుడా, (ఆ ఉపదేశాలను అధ్యయనం చెయ్యి) అయితే ఇతర గ్రంథాలను గురించి ఒక హెచ్చరిక. రచయితలు గ్రంథాలు ఎప్పుడూ వ్రాస్తూనే ఉన్నారు. అతిగా అధ్యయనం చేయడం నీకు చాలా అలసట కలిగిస్తుంది.

13-14 సరే, ఈ గ్రంథంలోని విషయాలన్నీ చదివి మనం నేర్చుకోవలసింది ఏమిటి? మనిషి చేయగలిగిన అత్యంత ముఖ్యమైన పనేమిటంటే, దేవుని పట్ల భయ భక్తులు కలిగివుండటం, దేవుని ఆజ్ఞలు పాటించడం. ఎందుకంటే, మనుష్యులు చేసే పనులన్నీ గుప్త కార్యాలతో బాటు దేవునికి తెలుసు. ఆయనకి మనుష్యుల మంచి పనులను గురించీ చెడ్డ పనులను గురించీ సర్వం తెలుసు. మనుష్యుల పనులేవీ దేవుని విచారణకు రాకుండా పోవు.

గలతీయులకు 5:25-6:10

25 మనము పరిశుద్ధాత్మ వలన జీవిస్తున్నాము. కనుక ఆయన ప్రకారము నడుచుకొందాము. 26 ఒకరికొకర్ని రేపకుండా, ద్వేషించకుండా, గర్వించకుండా ఉందాం.

అందరికీ మంచి చెయ్యండి

నా సోదరులారా! మీలో ఎవరైనా పాపం చేస్తే, మీలో ఆత్మీయంగా జీవిస్తున్నవాళ్ళు అతన్ని సరిదిద్దాలి. ఇది వినయంగా చెయ్యాలి. కాని మీరు స్వతహాగా ఆ పాపంలో చిక్కుకుపోకుండా జాగ్రత్త పడండి. పరస్పరం కష్టాలు పంచుకోండి. అప్పుడే క్రీస్తు ఆజ్ఞను పాటించినవాళ్ళౌతారు. తనలో ఏ గొప్పతనమూ లేనివాడు, తాను గొప్ప అని అనుకొంటే తనను తాను మోసం చేసుకొన్నవాడౌతాడు. ప్రతి ఒక్కడూ తన నడవడికను స్వయంగా పరీక్షించుకోవాలి. అప్పుడు తాను మరొకరితో పోల్చుకోకుండా తన నడతను గురించి గర్వించవచ్చు. ప్రతి ఒక్కడూ తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.

మంచి చేయుట ఎన్నడూ మానవద్దు

దేవుణ్ణి గురించి బోధన పొందినవాడు, బోధించిన వానికి అన్ని విధాల సహాయం చెయ్యాలి.

మోసపోకండి, ప్రతి ఒక్కడూ తాను నాటిన చెట్టు ఫలాన్నే పొందుతాడు. ఈ విషయంలో దేవుణ్ణి మోసం చెయ్యలేము. శారీరిక వాంఛలు అనే పొలంలో విత్తనం నాటితే మరణాన్ని ఫలంగా పొందుతాడు. పరిశుద్ధాత్మను మెప్పించే విధంగా నాటితే పరిశుద్ధాత్మ నుండి అనంతజీవితం అనే ఫలం పొందుతాడు. కనుక మనం విశ్రాంతి తీసుకోకుండా మంచి చేద్దాం. మనము విడువకుండా మంచి చేస్తే సరియైన సమయానికి మంచి అనే పంట కోయగలుగుతాము. 10 మనకు మంచి చేసే అవకాశం ఉంది కనుక అందరికీ మంచి చేద్దాం. ముఖ్యంగా విశ్వాసులకు మంచి చేద్దాం.

మత్తయి 16:21-28

యేసు పొందనున్న మరణం

(మార్కు 8:31–9:1; లూకా 9:22-27)

21 అప్పటి నుండి యేసు తన శిష్యులతో తాను యెరూషలేముకు వెళ్ళవలసిన విషయాన్ని గురించి, అక్కడున్న పెద్దలు, మహాయాజకులు, శాస్త్రులు తనను హింసించే విషయాన్ని గురించి, తాను పొందవలసిన మరణాన్ని గురించి, మూడవ రోజు బ్రతికి రావటాన్ని గురించి చెప్పటం మొదలు పెట్టాడు.

22 పేతురు ఆయనను ప్రక్కకు పిలిచి అలా మాట్లాడవద్దంటూ, “దేవుడు మీపై దయ చూపాలి ప్రభూ! అలా ఎన్నటికి జరగ కూడదు!” అని అన్నాడు.

23 యేసు పేతురు వైపు తిరిగి, “నా ముందు నుండి వెళ్ళిపో సాతాను! నీవు నాకు ఆటంకం కలిగిస్తున్నావు! నీవు మనుష్యుల సంగతుల గురించి ఆలోచిస్తున్నావు కాని, దేవుని సంగతులు గురించి కాదు” అని అన్నాడు.

24 యేసు తన శిష్యులతో, “నా వెంట రాదలచిన వాడు అన్నీ విడచి పెట్టి, తన సిలువను మోసుకొంటూ నన్ను అనుసరించాలి. 25 తన ప్రాణాన్ని కాపాడాలనుకొన్నవాడు దాన్ని పొగొట్టుకొంటాడు. కాని నా కోసం తన ప్రాణాన్ని ఒదులు కొన్నవాడు దాన్ని కాపాడుకుంటాడు. 26 ప్రపంచాన్నంతా జయించి తన ప్రాణాన్ని[a] పొగొట్టుకొన్న వ్యక్తికి ఏం లాభం కలుగుతుంది? ఆ ప్రాణాన్ని తిరిగి పొందటానికి అతడేమివ్వగలుగుతాడు? 27 మనుష్య కుమారుడు తన దేవదూతలతో కలిసి, తండ్రి మహిమతో రానున్నాడు. అప్పుడాయన ప్రతి ఒక్కనికి, చేసిన పనిని బట్టి ప్రతిఫలం ఇస్తాడు. 28 ఇక్కడ నిలుచున్న వాళ్ళలో కొందరు మనుష్యకుమారుడు రావటం చూసేవరకు జీవించే వుంటారు” అని గట్టిగా చెప్పాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International