Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 101

దావీదు కీర్తన.

101 ప్రేమ, న్యాయాలను గూర్చి నేను పాడుతాను.
    యెహోవా, నేను నీకు భజన చేస్తాను.
నేను జాగ్రత్తగా పరిశుద్ధ జీవితం జీవిస్తాను.
    నేను నా ఇంటిలో పరిశుద్ధ జీవితం జీవిస్తాను.
    యెహోవా, నీవు నా దగ్గరకు ఎప్పుడు వస్తావు?
నా యెదుట ఏ విగ్రహాలు[a] ఉంచుకోను.
    అలా నీకు విరోధంగా తిరిగే వారిని నేను ద్వేషిస్తాను.
    నేను అలా చేయను!
నేను నిజాయితీగా ఉంటాను.
    నేను దుర్మార్గపు పనులు చేయను.
ఒకవేళ ఎవరైనా తన పొరుగువారిని గూర్చి రహస్యంగా చెడ్డమాటలు చెబితే
    అలా చేయకుండా అతన్ని నేను ఆపివేస్తాను.
మనుష్యులు ఇతరులకంటే తామే మంచివారమని తలుస్తూ
    అతిశయించడం నేను జరుగనివ్వను.

నమ్మదగిన మనుష్యులకోసం నేను దేశం అంతటా చూస్తాను.
    ఆ మనుష్యులను మాత్రమే నేను నాకోసం పని చేయనిస్తాను.
    యదార్థ జీవితాలు జీవించేవాళ్లు మాత్రమే నా సేవకులుగా ఉండగలరు.
అబద్ధీకులను నేను నా ఇంటిలో ఉండనివ్వను.
    అబద్ధీకులను నేను నా దగ్గర ఉండనివ్వను.
ఈ దేశంలో నివసించే దుర్మార్గులను నేను ఎల్లప్పుడూ నాశనం చేస్తాను.
    దుర్మార్గులను యెహోవా పట్టణం నుండి బలవంతంగా వెళ్లగొడతాను.

కీర్తనలు. 109:1-30

సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.

109 దేవా, నా ప్రార్థనలను పెడచెవిని పెట్టవద్దు.
దుర్మార్గులు నన్ను గూర్చి అబద్ధాలు చెబుతున్నారు.
    నిజం కాని సంగతులు ఆ అబద్ధికులు చెబుతున్నారు.
ప్రజలు నన్ను గూర్చి ద్వేషపూరిత విషయాలు చెబుతున్నారు.
    ఏ కారణం లేకుండానే ప్రజలు నా మీద దాడి చేస్తున్నారు.
నేను వారిని ప్రేమిస్తున్నాను. కాని వారు నన్ను ద్వేషిస్తున్నారు.
    కనుక దేవా, ఇప్పుడు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.
ఆ ప్రజలకు నేను మంచి పనులు చేశాను.
    కాని వారు నాకు చెడ్డపనులు చేస్తున్నారు.
నేను వారిని ప్రేమించాను.
    కాని వారు నన్ను ద్వేషించారు.

నా శత్రువు చేసిన చెడు కార్యాల కోసం అతనిని శిక్షించుము.
    వానిదే తప్పు అని రుజువు చేయగల ఒక మనిషిని చూడుము.
నా శత్రువు తప్పు చేసిన దోషి అని న్యాయవాదిని తీర్పు చెప్పనీయుము.
    నా శత్రువు చెప్పే ప్రతి సంగతీ వానికి చెడుగావుండేటట్టు చేయుము.
నా శత్రువును త్వరగా చావనిమ్ము.
    నా శత్రువు ఉద్యోగం మరొకరు తీసికొనును గాక!
నా శత్రువు పిల్లలను అనాథలు కానిమ్ము, వాని భార్య విధవరాలు అగుగాక!
10 వాళ్లు వారి ఇల్లు పోగొట్టుకొని భిక్షగాళ్లు అగుదురు గాక!
11 నా శత్రువు ఎవరికైతే పైకం బాకీ ఉన్నాడో వాళ్లు అతనికి ఉన్నదంతా తీసుకోనివ్వుము.
    అతని కష్టార్జితం అంతా తెలియని వాళ్లెవరినో తీసికోనివ్వుము.
12 నా శత్రువుకు ఎవ్వరూ దయ చూపించకూడదని నా ఆశ.
    అతని పిల్లలకు ఎవ్వరూ దయ చూపించకూడదని నా ఆశ.
13 నా శత్రువును పూర్తిగా నాశనం చేయుము.
    తర్వాత తరంవారు అన్నిటిలోనుండి అతని పేరు తొలగించి వేయుదురు గాక.
14 నా శత్రువు తండ్రి పాపాలను, తల్లి పాపాలను
    యెహోవా శాశ్వతంగా జ్ఞాపకం చేసికొంటాడని నా ఆశ.
15 ఆ పాపాలను యెహోవా శాశ్వతంగా జ్ఞాపకం చేసికొంటాడని నా ఆశ.
    ప్రజలు నా శత్రువును పూర్తిగా మరచిపోయేటట్టు యెహోవా వారిని బలవంతం చేస్తాడని నా ఆశ.
16 ఎందుకంటే, ఆ దుర్మార్గుడు ఎన్నడూ ఏ మంచీ చేయలేదు.
    అతడు ఎన్నడూ ఎవరిని ప్రేమించలేదు.
    అతడు నిరుపేద, నిస్సహాయ ప్రజలకు జీవితం ఎంతో కష్టతరం చేసాడు.
17 ప్రజలకు సంభవించే చెడు సంగతులు, శాపము చూడటానికి ఆ దుర్మార్గునికి ఎంతో ఇష్టం.
    కనుక ఆ చెడు సంగతులు అతనికే సంభవించనిమ్ము.
ప్రజల కోసం మంచి సంగతులు జరగాలని ఆ దుర్మార్గుడు ఎన్నడూ అడుగలేదు.
    కనుక అతనికి మంచి సంగతులేవీ జరుగనివ్వకుము.
18 శాపాలే వానికి వస్త్రాలుగా ఉండనిమ్ము.
దుర్మార్గులు త్రాగేందుకు శాపాలే నీళ్లుగా ఉండనిమ్ము
    శాపాలే వాని శరీరం మీద తైలంగా ఉండనిమ్ము.
19 శాపాలే ఆ దుర్మార్గునికి చుట్టే వస్త్రాలుగా ఉండనిమ్ము.
    శాపాలే వాని నడుం చుట్టూ దట్టిగా ఉండనిమ్ము.

20 నా శత్రువుకు వాటన్నిటినీ యెహోవా చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
    నన్ను చంపాలని చూస్తున్న మనుష్యులందరికీ వాటన్నిటినీ యెహోవా చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
21 యెహోవా, నీవే నాకు ప్రభువు. కనుక నీ నామానికి గౌరవం కలిగే విధంగా నన్ను పరామర్శించు.
    నీకు ఎంతో గొప్ప ప్రేమ ఉంది. కనుక నన్ను రక్షించుము.
22 నేను కేవలం నిరుపేద, నిస్సహాయ మనిషిని,
    నేను నిజంగా దుఃఖంగా ఉన్నాను, నా హృదయం పగిలిపోయింది.
23 దినాంతంలో దీర్ఘ ఛాయలవలె నా జీవితం అయిపోయినట్టు నాకు అనిపిస్తుంది.
    ఎవరో నలిపివేసిన నల్లిలా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది.
24 నేను ఉపవాసం ఉండుటవలన నా మోకాళ్లు బలహీనంగా ఉన్నాయి.
    నా బరువు తగ్గిపోయి నేను సన్నబడుతున్నాను.
25 చెడ్డవాళ్లు నన్ను అవమానిస్తారు.
    వారు నన్ను చూచి వారి తలలు ఊపుతారు.
26 దేవా, యెహోవా! నాకు సహాయం చేయుము!
    నీ నిజమైన ప్రేమను చూపించి నన్ను రక్షించుము.
27 అప్పుడు నీవు నాకు సహాయం చేశావని ఆ ప్రజలు తెలుసుకొంటారు.
    నాకు కలిగిన సహాయం నీ శక్తివల్ల అని వారు తెలుసుకొంటారు.
28 ఆ దుర్మార్గులు నాకు శాపనార్థాలు పెడతారు; కాని యెహోవా, నీవు నన్ను ఆశీర్వదించగలవు.
    వారు నా మీద దాడి చేశారు కనుక వారిని ఓడించుము.
    అప్పుడు నీ సేవకుడనైన నేను సంతోషిస్తాను.
29 నా శత్రువులను ఇబ్బంది పెట్టుము!
    వారు వారి సిగ్గును వారి అంగీలా ధరించనిమ్ము.
30 యెహోవాకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
    అనేక మంది ప్రజల ఎదుట నేను ఆయనను స్తుతిస్తాను.

కీర్తనలు. 119:121-144

అయిన్

121 యెహోవా, సరియైనవి, మంచివి నేను చేశాను.
    నన్ను బాధించాలని కోరేవారికి నన్ను అప్పగించవద్దు.
122 నీవు నాకు సహాయం చేస్తావని ప్రమాణం చేయుము.
    యెహోవా, నేను నీ సేవకుడను, ఆ గర్విష్ఠులను నాకు హాని చేయనియ్యకుము.
123 యెహోవా, నన్ను రక్షించుటకు నీవు మంచి ప్రమాణం చేశావు.
    కాని నన్ను రక్షిస్తావని నీ కోసం ఎదురు చూచి నా కళ్లు అలసిపోయాయి.
124 నిజమైన నీ ప్రేమ నా మీద చూపించుము. నేను నీ సేవకుడను.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
125 నేను నీ సేవకుడను
    నేను నీ ఒడంబడికను నేర్చుకొని, గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
126 యెహోవా, యిది నీవు ఏమైనా చేయాల్సిన సమయం.
    ప్రజలు నీ న్యాయ చట్టం ఉల్లంఘించారు.
127 యెహోవా, నీ ఆజ్ఞలు
    మేలిమి బంగారంకంటె నాకు ఎక్కువ ఇష్టం.
128 నీ ఆజ్ఞలన్నింటికీ నేను జాగ్రత్తగా విధేయుడనవుతాను.
    తప్పుడు బోధలు నాకు అసహ్యం.

పే

129 యెహోవా, నీ ఒడంబడిక అద్భుతం,
    అందుకే నేను దానిని అనుసరిస్తాను.
130 ప్రజలు నీ మాట గ్రహించడం మొదలు పెట్టినప్పుడు అది వారికి సరైన జీవన విధానాన్ని చూపెట్టి దీపంలా ఉంటుంది.
    నీ మాట తెలివితక్కువ జనులను కూడా తెలివిగల వారినిగా చేస్తుంది.
131 యెహోవా, నేను నిజంగా నీ ఆజ్ఞలు ధ్యానించాలని కోరుతున్నాను.
    నేను కష్టంగా ఊపిరి పీలుస్తూ, అసహనంగా కనిపెడ్తున్న మనిషిలా ఉన్నాను.
132 దేవా, నావైపుకు తిరిగి, నా మీద దయ చూపించుము.
    నీ నామమును ప్రేమించే వారికి సరియైనవి ఏవో వాటిని చేయుము.
133 యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నన్ను నడిపించుము.
    నాపై ఏ దుష్టత్వమూ అధికారం చేయనీయవద్దు.
134 యెహోవా, నన్ను బాధించు ప్రజల నుండి నన్ను రక్షించుము.
    నేనేమో, నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
135 యెహోవా, నీ సేవకుని అంగీకరించి
    నీ న్యాయచట్టాలు నేర్పించుము.[a]
136 ప్రజలు నీ ఉపదేశాలకు లోబడనందువల్ల
    నదిలా నా కన్నీళ్లు ప్రవహించేట్టు నేను ఏడ్చాను.

సాదె

137 యెహోవా, నీవు మంచివాడవు.
    నీ చట్టాలు న్యాయమైనవి.
138 ఒడంబడికలో నీవు మాకు ఇచ్చిన న్యాయ చట్టాలు మంచివి.
    యెహోవా, మేము నీ న్యాయ చట్టాలపై నిజంగా నమ్మకముంచగలము.
139 నా ఉత్సాహం నాలో కృంగిపోయినది.
    ఎందుకంటే, నా శత్రువులు నీ న్యాయ చట్టాలను మరచిపోయారు.
140 యెహోవా, మేము నీ మాట నమ్మగలుగుటకు మాకు రుజువు ఉంది.
    అదంటే నాకు ప్రేమ.
141 నేను యువకుడను. ప్రజలు నన్ను గౌరవించరు.
    కాని నేను నీ ఆజ్ఞలు మరచిపోను.
142 యెహోవా, నీ మంచితనం శాశ్వతంగా ఉంటుంది.
    నీ ఉపదేశాలు నమ్మదగినవి.
143 నాకు కష్టాలు, చిక్కులు కలిగాయి.
    కాని నీ ఆజ్ఞలు నాకు ఆనందకరము.
144 నీ ఒడంబడిక శాశ్వతంగా మంచిది.
    నేను జీవించగలుగునట్లు నీ ఒడంబడికను గ్రహించుటకు నాకు సహాయం చేయుము.

సంఖ్యాకాండము 16:36-50

36 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: 37-38 “చచ్చిన ఆ మనుష్యుల మధ్య ఉన్న ధూపార్తులన్నింటినీ వెదకమని యాజకుడైన అహరోను కుమారుడైన ఎలియాజరుతో చెప్పు. ఆ నిప్పుకణికలను నివాసానికి దూరంగా చల్లండి. ధూపార్తులు ఇంకా పవిత్రమైనవే. ఇవి నాకు వ్యతిరేకంగా పాపం చేసిన మనుష్యులు ఉపయోగించిన ధూపార్తులు. వారి పాపం వారి ప్రాణాలు తీసింది. ధూపార్తులను రేకులుగా కొట్టండి. బలిపీఠం కప్పటానికి ఈ రేకులు వాడండి. అవి యెహోవా ఎదుట అర్పించబడినవి గనుక అవి పవిత్రం. రేకులు చేయబడ్డ ఆ ధూపార్తులు ఇశ్రాయేలు ప్రజలందరకు హెచ్చరికగా ఉండుగాక!”

39 కనుక ఆ మనుష్యుల ఇత్తడి ధూపార్తులను అన్నింటినీ ఎలియాజరు పోగుచేసాడు. వాళ్లంతా కాల్చివేయబడ్డారు గాని ధూపార్తులు మాత్రం అక్కడ ఉన్నాయి. ఆ ధూపార్తులను వెడల్పు రేకులుగా కొట్టమని కొందరితో చెప్పాడు ఎలియాజరు. అప్పుడు ఆ వెడల్పు రేకులను అతడు బలిపీఠం చుట్టూ పెట్టాడు. 40 మోషే ద్వారా యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు ఇలా చేసాడు. అహరోను కుటుంబానికి చెందిన వ్యక్తి మాత్రమే యెహోవా ఎదుట ధూపం వేయాలని ఇశ్రాయేలు ప్రజలు జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఇది సహాయకరమైన సూచన. ఇంకొక వ్యక్తి గనుక యెహోవా ఎదుట ధూపం వేస్తే, అతడు కోరహు, అతని అనుచరుల్లా అవుతాడు.

అహరోను ప్రజల్ని రక్షించటం

41 మరునాడు ఇశ్రాయేలు ప్రజలంతా మోషే, అహరోనుల మీద ఫిర్యాదు చేసారు. వారు, “యెహోవా ప్రజలను మీరు చంపారు” అన్నారు.

42 మోషే, అహరోనులు సన్నిధి గుడార ప్రవేశం దగ్గర నిలబడి ఉన్నారు. మోషే, అహరోనుల మీద ఫిర్యాదు చేయటానికి ప్రజలు ఆచోట చేరారు. అయితే వారు సన్నిధి గుడారం వైపు చూచినప్పుడు, మేఘం దానిని అవరించి, యెహోవా మహిమ అక్కడ ప్రత్యక్షమయింది. 43 అప్పుడు మోషే. అహరోనులు సన్నిధి గుడారం ఎదుటికి వెళ్లారు.

44 అప్పుడు యెహోవా మోషేతో 45 “ఇప్పుడు నేను వీళ్లను నాశనం చేస్తాను గనుక మీరు దూరంగా తొలగిపొండి” అని చెప్పాడు. కనుక మోషే, అహరోనులు సాష్టాంగపడ్డారు.

46 అప్పుడు మోషే “నీ ధూపార్తిని బలిపీఠపు నిప్పులతో నింపు. దానిమీద సాంబ్రాణి వేయి. త్వరపడి ప్రజల సమాజం దగ్గరకు వెళ్లి వారి పాపానికి ప్రాయశ్చిత్తం చేయి. యెహోవా వారి మీద కోపంగా ఉన్నాడు. కష్టాలు అప్పుడే మొదలయ్యాయి” అని అహరోనుతో చెప్పాడు.

47 కనుక మోషే చెప్పినట్టు అహరోను చేసాడు. అతడు నిప్పులు, సాంబ్రాణి తీసుకొని ప్రజలందరి మధ్యకు పరుగెత్తాడు, అయితే అప్పుటకే ప్రజల్లో రోగం మొదలయింది. ప్రజలకోసం ప్రాయశ్చిత్తంగా అహరోను ధూపం వేసాడు. 48 బ్రతికి ఉన్నవాళ్లకు, చచ్చిన వాళ్లకు మధ్య నిలబడ్డాడు అహరోను. అంతటితో ఆ రోగం ఆగిపోయింది. 49 అయితే వారి పాపం నిమత్తం అహరోను ప్రాయశ్చిత్తం చేయకముందే ఆ రోగంవల్ల కోరహు మూలంగా చచ్చినవాళ్లు కాక ఇంకా 14,700 మంది చనిపోయారు. 50 అప్పుడు సన్నిధి గుడార ప్రవేశం దగ్గర ఉన్న మోషే వద్దకు అహరోను తిరిగి వెళ్లాడు. ప్రజల్లో ఆ భయంకర రోగం నిలిచిపోయింది.

రోమీయులకు 4:13-25

విశ్వాసంద్వారా దేవుని వాగ్దానం పొందెను

13 అబ్రాహాము మరియు అతని సంతానం ప్రపంచాన్ని వారసత్వంగా పొందుతారని దేవుడు వాగ్దానం చేసాడు. ఈ వాగ్దానం ధర్మశాస్త్రాన్ని పాటించినందుకు చెయ్యలేదు. అతనిలో విశ్వాస ముండటంవలన దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానం చేసాడు. 14 ఒకవేళ వారసులు కావటానికి ధర్మశాస్త్రం కారణమైతే, విశ్వాసానికి విలువ ఉండదు. పైగా వాగ్దానానికి అర్థం ఉండదు. 15 ధర్మశాస్త్రం ఉంటే దేవుని ఆగ్రహం ఉంటుంది. కాని ధర్మశాస్త్రం లేకపోతే దాన్ని అతిక్రమించే ప్రశ్నేరాదు.

16 ఆ వాగ్దానము విశ్వాసము ఉండటంవల్ల సంభవిస్తోంది. అది ఉచితంగా లభించాలని దేవుని ఉద్దేశ్యం. అది అబ్రాహాము సంతానానికంతా వర్తిస్తుందని దేవుడు అభయమిచ్చాడు. అంటే ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళకే కాకుండా అబ్రాహాములో ఉన్న విశ్వాసాన్ని తమలో వ్యక్తం చేసేవాళ్ళకు కూడా అది వర్తిస్తుందన్న మాట. అబ్రాహాము మనందరికీ తండ్రి. 17 దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నేను నిన్ను ఎన్నో జనాంగములకు తండ్రిగా చేస్తాను.”(A) దేవుని దృష్టిలో అబ్రాహాము మనకు తండ్రిలాంటి వాడు. దేవుడు చనిపోయినవాళ్ళకు ప్రాణం పొయ్యగలడు. తన ఆజ్ఞలతో లేనివాటిని సృషించగలడు. అలాంటి దేవుణ్ణి అబ్రాహాము విశ్వసించాడు.

18 నిరాశ సమయంలో అబ్రాహాము ఆశతో నమ్ముకొన్నాడు. అందుకే అతడు ఎన్నో జనములకు తండ్రి అయ్యాడు. “నీ సంతతివాళ్ళు చాలా మంది ఉంటారు” అని దేవుడు చెప్పిన ప్రకారమే జరిగింది. 19 అప్పటికి అబ్రాహాముకు సుమారు నూరు సంవత్సరాల వయస్సు. అతని శరీరం బలహీనంగా ఉండింది. పైగా శారాకు గర్భం దాల్చే వయస్సు దాటిపోయి ఉంది. ఈ సంగతులు అబ్రాహాముకు తెలుసు. అయినా అతని విశ్వాసం సన్నగిల్లలేదు. 20 దేవుడు చేసిన వాగ్దానంలో అతడు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. దానికి మారుగా అతడు దృఢ విశ్వాసంతో దేవుణ్ణి స్తుతించాడు. 21 దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని నిలుపుకోగలడని, ఆ శక్తి ఆయనలో ఉందని అబ్రాహాముకు సంపూర్ణమైన విశ్వాసం ఉండినది. 22 ఈ కారణంగానే, “దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు” 23 “నీతిమంతునిగా పరిగణించాడు” అన్న పదాలు అతనికొరకు మాత్రమే వ్రాయబడలేదు. 24 అవి మనకోసం కూడా వ్రాయబడ్డాయి. మనము మన యేసు ప్రభువును బ్రతికించిన దేవునియందు విశ్వసిస్తున్నాము. కనుక దేవుడు మనల్ని కూడా నీతిమంతులుగా పరిగణిస్తాడు. 25 దేవుడు మన పాపాల కోసం ఆయన్ని మరణానికి అప్పగించాడు. మనం నీతిమంతులం కావాలని ఆయన్ని బ్రతికించాడు.

మత్తయి 20:1-16

ద్రాక్షతోటలోని పనివాళ్ళు

20 యేసు, “దేవుని రాజ్యాన్ని ద్రాక్షతోట యజమానితో పోల్చవచ్చు. అతడు తన తోటలో పని చెయ్యటానికి పనివాళ్ళను నియమించాలని ఉదయమే లేచి వెళ్ళాడు. ఆ రోజు పనివాళ్ళకు ఒక దెనారా యివ్వటానికి అంగీకరించి వాళ్ళను తన ద్రాక్షతోటకు పంపాడు.

“అతడు ఉదయం తొమ్మిదిగంటలకు మళ్ళీ సంతకు వెళ్ళాడు. అక్కడ మరికొంత మంది ఏ పనీ చేయకుండా వూరికే నిల్చొని ఉండటం చూసాడు. అతడు వాళ్ళతో ‘మీరు కూడా వెళ్ళి నా ద్రాక్షతోటలో పని చెయ్యండి. మీక్కూడా సమంజసమైన కూలి యిస్తాను’ అని అన్నాడు. వాళ్ళు దానికి అంగీకరించి వెళ్ళారు.

“అతడు పన్నెండు గంటలప్పుడు, మూడు గంటలప్పుడు కూడా వెళ్ళి మళ్ళీ అలాగే చేసాడు. అతడు అయిదు గంటలప్పుడు మళ్ళీ వెళ్ళి మరి కొంతమంది అక్కడ నిలుచొని ఉండటం గమనించాడు. అతడు వాళ్ళతో ‘మీరు ఏమీ చెయ్యకుండా దినమంతా యిక్కడ ఎందుకు నిలుచున్నారు?’ అని అడిగాడు.

“‘మాకెవ్వరూ పనివ్వలేదు’ అని వాళ్ళు సమాధానం చెప్పారు.

“అతడు వాళ్ళతో ‘మీరు కూడా నా ద్రాక్షతోటలో పని చెయ్యండి!’ అని అన్నాడు.

“సాయంత్రం కాగానే ఆ ద్రాక్షతోట యజమాని పెద్ద దాసునితో ‘పనివాళ్ళందరిని పిలిచి చివరకు వచ్చిన వాళ్ళతో మొదలుపెట్టి కూలి యిచ్చేయి!’ అని అన్నాడు.

“అయిదు గంటలప్పుడు పని మొదలు పెట్టిన కూలీలు వచ్చారు. వాళ్ళకు ఒక దెనారా లభించింది. 10 మొదట పని మొదలుపెట్టిన వాళ్ళువచ్చి తమకు ఎక్కువ కూలి లభిస్తుందని ఆశించారు. కాని వాళ్ళకు కూడా ఒక దెనారా లభించింది. 11-12 వాళ్ళు కూలి తీసికొని యజమానునితో ‘చివరకు వచ్చిన వాళ్ళు ఒకే గంట పని చేసారు. ఎండను సహించి దినమంతా పనిచేసిన మమ్మల్ని, వాళ్ళనూ మీరు సమానంగా చూస్తున్నారు’ అని సణగటం మొదలు పెట్టారు.

13 “కాని అతడు ఒక కూలి వానితో, ‘మిత్రమా నేను నీకు అన్యాయం చేయటం లేదు. ఒక దెనారాకు పని చేస్తానని నీవు ఒప్పుకోలేదా? 14 నీ కూలి తీసికొని వెళ్ళిపో! నీకిచ్చిన కూలినే చివరను వచ్చిన వానికి కూడా యివ్వాలనుకొన్నాను. 15 నా డబ్బుతో నా యిష్టంవచ్చినట్లు చేసుకొనే అధికారం నాకులేదా? నేను ఔదార్యం చూపుతున్నందుకు నీవు ఓర్వలేకుండా ఉన్నావా?’ అని అన్నాడు.

16 “ఈ విధంగా చివరనున్న వాళ్ళు ముందుకు వస్తారు; ముందున్న వారు చివరకు వెళ్తారు” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International