Revised Common Lectionary (Semicontinuous)
6 దేవా, నీ సింహాసనం శాశ్వతంగా కొనసాగుతుంది!
నీ నీతి రాజదండము.
7 నీవు నీతిని ప్రేమిస్తావు, కీడును ద్వేషిస్తావు.
కనుక, నిన్ను నీ స్నేహితుల మీద రాజుగా
నీ దేవుడు కోరుకొన్నాడు.
8 నీ వస్త్రాలు గోపరసం, అగరు, లవంగ, పట్టావంటి కమ్మని సువాసనగా ఉన్నాయి.
నిన్ను సంతోషపరచుటకు దంతం పొదగబడిన భవనాల నుండి సంగీతం వస్తుంది.
9 నీవు ఘనపరచే స్త్రీలలో రాజకుమార్తెలున్నారు.
నీ పెండ్లి కుమార్తె ఓఫీరు బంగారంతో చేయబడిన కిరీటం ధరించి నీ చెంత నిలుస్తుంది.
10 కుమారీ, నా మాట వినుము.
నీ ప్రజలను, నీ తండ్రి కుటుంబాన్ని మరచిపొమ్ము.
11 రాజు నీ సౌందర్యాన్ని ప్రేమిస్తున్నాడు.
ఆయనే నీకు క్రొత్త భర్తగా ఉంటాడు.
నీవు ఆయన్ని ఘనపరుస్తావు.
12 తూరు పట్టణ ప్రజలు నీ కోసం కానుకలు తెస్తారు.
వారి ధనవంతులు నిన్ను కలుసుకోవాలని కోరుతారు.
13 రాజకుమారి రాజ గృహంలో బహు అందమైనది.
ఆమె వస్త్రం బంగారపు అల్లికగలది.
14 ఆమె అందమైన తన వస్త్రాలు ధరిస్తుంది. మరియు రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది.
ఆమె వెనుక కన్యకల గుంపు కూడా రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది.
15 సంతోషంతో నిండిపోయి వారు వస్తారు.
సంతోషంతో నిండిపోయి రాజభవనంలో వారు ప్రవేశిస్తారు.
16 రాజా, నీ తరువాత నీ కుమారులు పరిపాలిస్తారు.
దేశవ్యాప్తంగా నీవు వారిని రాజులుగా చేస్తావు.
17 నీ పేరును శాశ్వతంగా నేను ప్రసిద్ధి చేస్తాను.
శాశ్వతంగా, ఎల్లకాలం ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
యెహోవా వద్దకు తిరిగివచ్చుట
14 ఇశ్రాయేలూ, నీవు పడిపోయి దేవునికి విరోధముగా పాపము చేశావు. కాబట్టి నీ దేవుడైన యెహోవా వద్దకు తిరిగిరా. 2 నీవు చెప్పబోయే విషయాల గురించి ఆలోచించుము. యెహోవా వద్దకు తిరిగిరా. ఆయనతో ఇలా చెప్పు,
“మా పాపాన్ని తీసివేయి.
మా మంచి పనులను అంగీకరించు.
మా పెదవులనుండి స్తుతిని సమర్పిస్తాము.
3 అష్షూరు మమ్మల్ని కాపాడదు.
మేమిక యుద్ధగుర్రాలపైన స్వారీ చేయము.
మేము మా స్వహస్తాలతో చేసిన విగ్రహాలను
ఇంకెప్పుడూ మరల ‘ఇది మా దేవుడు’ అని అనము.
ఎందుకంటే, అనాధుల పట్ల
జాలి చూపేది నువ్వొక్కడివే.”
యెహోవా ఇశ్రాయేలును క్షమించుట
4 అందుకు యెహోవా ఇలా అంటాడు:
“నా కోపం చల్లారింది, కనుక,
నన్ను వీడి పోయినందుకు నేను వాళ్లని క్షమిస్తాను.
నేను వాళ్లని ధారాళంగా ప్రేమిస్తాను.
5 నేను ఇశ్రాయేలీయులకు మంచువలె వుంటాను.
ఇశ్రాయేలు తామర పుష్పంలాగ వికసిస్తాడు.
అతడు లెబానోను దేవదారు వృక్షంలాగా వేరుతన్ని దృఢంగా నిలుస్తాడు.
6 అతని శాఖలు విస్తరిస్తాయి,
అతను అందమైన దేవదారు వృక్షంలాగ ఉంటాడు.
అతను లెబానోనులోని దేవదారు చెట్లు
వెలువరించే సువాసనలాగ ఉంటాడు.
7 ఇశ్రాయేలీయులు మరల నా పరిరక్షణలో జీవిస్తారు.
గోధుమ కంకుల్లాగ పెరుగుతారు.
ద్రాక్షా తీగల్లాగ పుష్పించి ఫలిస్తారు.
వారు లెబానోను ద్రాక్షారసంవలె ఉంటారు.”
విగ్రహాల విషయంలో ఇశ్రాయేలుకు యెహోవా హెచ్చరిక
8 “ఎఫ్రాయిమూ, విగ్రహాలతో ఇక నీకెంత మాత్రమూ పనిలేదు.
నీ ప్రార్థనలు ఆలకించేది నేనే. నిన్ను కాపాడేది నేనే.
నిరంతరం పచ్చగానుండే
మీ ఫలము నానుండి వస్తుంది.”
చివరి సలహా
9 వివేకవంతుడు ఈ విషయాలు గ్రహిస్తాడు.
చురుకైనవాడు ఈ విషయాలు నేర్చుకోవాలి.
యెహోవా మార్గాలు సరైనవి.
మంచివాళ్లు వాటిద్వారా జీవిస్తారు.
పాపులు వాళ్లకు వాళ్లే చనిపోతారు.
పౌలు మరియు అబద్ధపు అపొస్తలులు
11 నా తెలివితక్కువతనాన్ని మీరు కొద్దిగా సహిస్తారని ఆశిస్తున్నాను. మీరు సహిస్తున్నారని నాకు తెలుసు. 2 మీ విషయంలో నాకు అసూయగా ఉంది. ఆ అసూయ దేవుని కోసం. మిమ్మల్ని ఒకే భర్తకు అంటే క్రీస్తుకు అప్పగిస్తానని వాగ్దానం చేసాను. మిమ్మల్ని పవిత్ర కన్యగా ఆయనకు బహూకరించాలని అనుకున్నాను. 3 సర్పం కుయుక్తిగా చెప్పిన అబద్ధాలవల్ల “హవ్వ” మోసపోయినట్లే మీరునూ మోసపోతారని, మీ మనస్సులు మలినం అవుతాయని నా భయం. మీకు క్రీస్తుపట్ల ఉన్న భక్తి పవిత్రమైంది. సంపూర్ణమైనది. అది విడిచివేస్తారని నా భయం. 4 ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మేము యేసును గురించి బోధించినట్లుగాక, వేరే విధంగా బోధిస్తే మీరు దాన్ని ఆనందంగా అంగీకరిస్తారు. మా నుండి పొందిన దైవసందేశానికి, ఆత్మకు వ్యతిరేకంగా దైవసందేశాన్ని, ఆత్మను ఎవరైనా యిస్తే మీరు వాటిని అంగీకరిస్తారు.[a]
5 ఆ “గొప్ప అపొస్తలుల కన్నా” నేను కొంచెం కూడా తక్కువ కానని అంటున్నాను. 6 మాట్లాడటంలో నాకు అనుభవం లేకపోయినా జ్ఞానం ఉంది. దీన్ని గురించి మేము అన్ని విధాలా మీకు స్పష్టంగా తెలియజేసాము.
7 దైవసందేశాన్ని మీకు ఉచితంగా ప్రకటించాను. మీకు ప్రాముఖ్యత యిచ్చి నేను తగ్గించుకొన్నాను. అలా చెయ్యటం పాపమా? 8 ఇతర సంఘాలు నన్ను పోషించాయి. అందువలన మీకు సేవ చేయటానికి వాటిని దోచినట్లయింది. 9 నేను మీతో ఉన్నప్పుడు ఎవ్వరికీ భారంగా ఉండలేదు. మాసిదోనియ నుండి వచ్చిన సోదరులు నాకు కావలసినవన్నీ తెచ్చారు. నేను మీపై ఏ విధమైన భారం మోపలేదు. ఇకముందు కూడా మోపను. 10 దీన్ని గురించి నేను గర్వపడకుండా అకయ ప్రాంతంలో ఉన్నవాడెవ్వడూ నన్ను ఆపలేడు. ఇది నేను క్రీస్తు సత్యంగా చెపుతున్నాను. 11 ఎందుకు, మీ పట్ల నాకు ప్రేమ లేదనా? నేను ప్రేమిస్తున్నానని దేవునికి తెలుసు.
12 వాళ్ళు తమను గురించి గర్వంగా చెప్పుకోవాలని చూస్తారు. తాము మాతో సమానంగా ఉన్నట్లు మీరు గమనించాలని వాళ్ళ ఉద్దేశ్యం. ఆ అవకాశం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు గర్వించటానికి కారణం లేకుండా చెయ్యటానికి నేను చేస్తున్నది చేస్తూపోతాను. 13 అలాంటివాళ్ళు దొంగ అపొస్తలులు. మోసాలు చేస్తారు. క్రీస్తు అపొస్తలుల వలే నటిస్తారు. 14 దీనిలో ఆశ్చర్యమేలేదు! సాతాను కూడా తాను వెలుగుదూత అయినట్లు నటిస్తాడు. 15 మరి సాతాను సేవకులు నీతిమంతులవలె నటించటంలో ఆశ్చర్యమేలేదు! చివరన వాళ్ళు చేసిన పనుల్ని బట్టి ఫలితం పొందుతారు.
© 1997 Bible League International