Revised Common Lectionary (Semicontinuous)
6 దేవా, నీ సింహాసనం శాశ్వతంగా కొనసాగుతుంది!
నీ నీతి రాజదండము.
7 నీవు నీతిని ప్రేమిస్తావు, కీడును ద్వేషిస్తావు.
కనుక, నిన్ను నీ స్నేహితుల మీద రాజుగా
నీ దేవుడు కోరుకొన్నాడు.
8 నీ వస్త్రాలు గోపరసం, అగరు, లవంగ, పట్టావంటి కమ్మని సువాసనగా ఉన్నాయి.
నిన్ను సంతోషపరచుటకు దంతం పొదగబడిన భవనాల నుండి సంగీతం వస్తుంది.
9 నీవు ఘనపరచే స్త్రీలలో రాజకుమార్తెలున్నారు.
నీ పెండ్లి కుమార్తె ఓఫీరు బంగారంతో చేయబడిన కిరీటం ధరించి నీ చెంత నిలుస్తుంది.
10 కుమారీ, నా మాట వినుము.
నీ ప్రజలను, నీ తండ్రి కుటుంబాన్ని మరచిపొమ్ము.
11 రాజు నీ సౌందర్యాన్ని ప్రేమిస్తున్నాడు.
ఆయనే నీకు క్రొత్త భర్తగా ఉంటాడు.
నీవు ఆయన్ని ఘనపరుస్తావు.
12 తూరు పట్టణ ప్రజలు నీ కోసం కానుకలు తెస్తారు.
వారి ధనవంతులు నిన్ను కలుసుకోవాలని కోరుతారు.
13 రాజకుమారి రాజ గృహంలో బహు అందమైనది.
ఆమె వస్త్రం బంగారపు అల్లికగలది.
14 ఆమె అందమైన తన వస్త్రాలు ధరిస్తుంది. మరియు రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది.
ఆమె వెనుక కన్యకల గుంపు కూడా రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది.
15 సంతోషంతో నిండిపోయి వారు వస్తారు.
సంతోషంతో నిండిపోయి రాజభవనంలో వారు ప్రవేశిస్తారు.
16 రాజా, నీ తరువాత నీ కుమారులు పరిపాలిస్తారు.
దేశవ్యాప్తంగా నీవు వారిని రాజులుగా చేస్తావు.
17 నీ పేరును శాశ్వతంగా నేను ప్రసిద్ధి చేస్తాను.
శాశ్వతంగా, ఎల్లకాలం ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
క్రొత్త యెరూషలేము మంచితనంతో నిండిన నగరం
62 సీయోను అంటే నాకు ప్రేమ.
అందుచేత నేను ఆమె పక్షంగా ఇంకా మాట్లాడతాను.
యెరూషలేము అంటే నాకు ప్రేమ.
అందుచేత నేను మాట్లాడటం చాలించను.
మంచితనం పెద్ద వెలుగుగా ప్రకాశించేంత వరకు నేను మాట్లాడతాను.
ఒక జ్వాలలా రక్షణ నుండి ప్రకాశించేంత వరకు నేను మాట్లాడతాను.
2 అప్పుడు సకల రాజ్యాలు నీ మంచితనాన్ని చూస్తాయి.
రాజులందరూ నీ గౌరవాన్ని చూస్తారు.
అప్పుడు నీకు ఒక క్రొత్త పేరు ఇవ్వబడుతుంది.
ప్రజలారా, యెహోవా తానే మీకు ఆ క్రొత్త పేరు ఇస్తాడు.
3 యెహోవా మీ విషయం ఎంతో అతిశయిస్తాడు.
యెహోవా చేతిలో అందాల కిరీటంలా ఉంటారు మీరు.
4 “దేవుడు విడిచిపెట్టిన ప్రజలు” అని ఇంకెన్నడూ మీరు పిలువబడరు.
“దేవుడు నాశనం చేసిన దేశం” అని మీ దేశం ఇంకెన్నటికి పిలువబడదు.
“దేవుడు ప్రేమించే ప్రజలు” అని మీరు పిలువబతుతారు.
“దేవుని వధువు” అని మీ దేశం పిలువబడుతుంది.
ఎందుకంటె యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనుక.
మరియు మీ దేశం ఆయనకు చెందుతుంది.
5 ఒక యువకుడు ఒక స్త్రీని ప్రేమించినప్పుడు అతడు ఆమెను పెండ్లి చేసుకొంటాడు. మరియు ఆమె అతనికి భార్య అవుతుంది.
అదేవిధంగా మీ దేశం మీ పిల్లలకు చెందుతుంది.
ఒకడు తన నూతన భార్యతో ఎంతో సంతోషిస్తాడు.
అదే విధంగా, మీ దేవుడు మీతో ఎంతో సంతోషిస్తాడు.
యోహాను చెప్పిన సందేశం
22 ఇది జరిగిన తర్వాత యేసు తన శిష్యులతో యూదయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొద్దిరోజులు గడిపాడు, బాప్తిస్మము నిచ్చాడు. 23 అదేవిధంగా యోహాను కూడా సలీము పట్టణం దగ్గరున్న ఐనోను గ్రామంలో నీళ్ళు పుష్కలంగావుండటం వల్ల, అక్కడి ప్రజలకు బాప్తిస్మమునిస్తూ ఉన్నాడు. ప్రజలు బాప్తిస్మము పొందటానికి అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు. 24 ఇది యోహానును కారాగారంలో వెయకముందు జరిగిన సంఘటన.
25 పవిత్రం కావటానికి శుద్ధి చేసే ఆచారం విషయంలో ఒక యూదునికి, యోహాను శిష్యులకు వాదన జరిగింది. 26 వాళ్ళు యోహాను దగ్గరకు వచ్చి, “రబ్బీ! యొర్దాను నదికి అవతలి వైపున మీతో ఉన్నవాడు, మీరు ఎవర్ని గురించి సాక్ష్యము చెప్పారో ఆయన బాప్తిస్మము నిస్తున్నాడు. అందరూ అయన దగ్గరకు వెళ్తున్నారు” అని చెప్పారు.
27 యోహాను సమాధానం చెబుతూ, “దేవుడిస్తే తప్ప ఎవ్వరూ దేన్నీ పొందలేరు. 28 నేను క్రీస్తును కానని, ఆయన కన్నా ముందు పంపబడిన వాణ్ణి మాత్రమేనని నేను ముందే చెప్పాను. దీనికి మీరు సాక్ష్యం. 29 పెళ్ళి కూతురు పెళ్ళి కుమారుని సొత్తు. కాని పెళ్ళి కుమారుని స్నేహితుడు పెళ్ళికుమారుని మాట వినాలని కాచుకొని ఉంటాడు. అతని స్వరం వినిపించగానే ఆనందిస్తాడు. నాదీ అలాంటి ఆనందమే. ఆ ఆనందం నాకిప్పుడు సంపూర్ణంగా కలిగింది. 30 ఆయన ప్రాముఖ్యత పెరగాలి. నా ప్రాముఖ్యత తరగాలి.
పరలోకమునుండి వచ్చువాడు
31 “పై నుండి వచ్చినవాడు అందరికన్నా గొప్పవాడు. ఈ ప్రపంచంలో పుట్టినవాడు ఈ ప్రపంచానికి చెందుతాడు. అలాంటి వాడు ప్రాపంచిక విషయాల్ని గురించి మాట్లాడుతాడు. పరలోకం నుండి వచ్చినవాడు అందరికన్నా గొప్పవాడు. 32 ఆయన తాను చూసిన వాటిని గురించి, విన్నవాటిని గురించి సాక్ష్యం చెబుతాడు. కాని ఆయన సాక్ష్యాన్ని ఎవ్వరూ అంగీకరించరు. 33 దాన్ని అంగీకరించిన మనిషి దేవుడు సత్యవంతుడని అంగీకరిస్తాడు. 34 ఎందుకంటే దేవుడు పంపిన వాడు దేవుడు చెప్పిన మాటలు చెబుతాడు. ఆయనకు దేవుడు పవిత్రాత్మను అపరిమితంగా ఇస్తాడు. 35 తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. అందువలన అంతా ఆయన చేతుల్లో ఉంచాడు. 36 ఆ కుమారుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కడూ అనంత జీవితం పొందుతాడు. కాని ఆ కుమారుణ్ణి తృణీకరించినవాడు అనంత జీవీతం పొందలేడు. దేవుని కోపం నుండి ఎవడూ తప్పించుకోలేడు” అని అన్నాడు.
© 1997 Bible League International