Revised Common Lectionary (Semicontinuous)
దావీదు కీర్తన.
103 నా ప్రాణమా! యెహోవాను స్తుతించుము.
నా సర్వ అంగములారా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
2 నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము.
ఆయన నిజంగా దయగలవాడని మరచిపోకుము.
3 మనం చేసిన పాపాలన్నింటినీ దేవుడు క్షమిస్తున్నాడు.
మన రోగాలన్నింటినీ ఆయన బాగుచేస్తున్నాడు.
4 దేవుడు మన ప్రాణాన్ని సమాధి నుండి రక్షిస్తున్నాడు.
ఆయన ప్రేమ, జాలి మనకు ఇస్తున్నాడు.
5 దేవుడు మనకు విస్తారమైన మంచి వస్తువులు ఇస్తున్నాడు.
ఆయన మనలను యౌవన పక్షిరాజు వలె మరల పడుచువారినిగా చేస్తున్నాడు.
6 యెహోవా న్యాయం కలవాడు.
ఇతర మనుష్యుల ద్వారా గాయపరచబడి దోచుకొనబడిన ప్రజలకు దేవుడు న్యాయం జరిగిస్తాడు.
7 దేవుడు తన న్యాయ చట్టాలను మోషేకు నేర్పాడు.
తాను చేయగల శక్తివంతమైన పనులను ఇశ్రాయేలీయులకు దేవుడు చూపించాడు.
8 యెహోవా జాలిగలవాడు, దయగలవాడు.
దేవుడు సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
9 యెహోవా ఎల్లప్పుడూ విమర్శించడు.
యెహోవా ఎల్లప్పుడూ మన మీద కోపంతో ఉండడు.
10 మనం దేవునికి విరోధంగా పాపం చేశాం.
కాని మనకు రావలసిన శిక్షను దేవుడు మనకివ్వలేదు.
11 భూమిపైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో
తన అనుచరుల యెడల దేవుని ప్రేమ అంత ఎత్తుగా ఉన్నది.
12 పడమటినుండి తూర్పు దూరంగా ఉన్నట్లు
దేవుడు మననుండి మన పాపాలను అంత దూరం పారవేశాడు.
13 తండ్రి తన పిల్లల యెడల దయగా ఉంటాడు.
అదే విధంగా, యెహోవా తన అనుచరులపట్ల కూడా దయగా ఉంటాడు.
22 అన్ని చోట్లా అన్నింటినీ యెహోవా చేశాడు. అన్నిచోట్లా సమస్తాన్నీ దేవుడు పాలిస్తాడు.
అవన్నీ యెహోవాను స్తుతించాలి!
నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము!
44 “నిన్ను గురించి చెప్పుకునే ప్రజలందరికీ ఇప్పుడు ఇంకొక విషయం తోడవుతుంది. వారంతా, ‘తల్లిలాగనే కూతురు కూడ’ అని అంటారు. 45 అచ్చం నీవు నీ తల్లి కూతురువే. నీవు నీ భర్తను గురించి గాని, నీ పిల్లలను గురించి గాని శ్రద్ధ చేయవు. నీవు ఖచ్చితంగా నీ సోదరిలా వున్నావు. మీ ఇద్దరూ మీ భర్తలను, మీ పిల్లలను అసహ్యించుకున్నారు. మీరు మీ తల్లిదండ్రుల వలెనే ప్రవర్తిస్తున్నారు. నీ తల్లి హిత్తీయురాలు. నీ తండ్రి అమోరీయుడు. 46 నీ పెద్ద సోదరి సమరయ (షోమ్రోను). ఆమె నీకు ఉత్తరంగా తన కుమార్తెలతో (పట్టణాలు) నివసిస్తోంది. నీ చిన్న సోదరి సొదొమ[a] ఆమె నీకు దక్షిణంగా తన కుమార్తెలతో (పట్టణాలు) నివసిస్తూ ఉంది. 47 వారు చేసిన మహా పాపాలన్నీ నీవూ చేశావు. కాని నీవింకా ఘోరమైన తప్పు పనులు చేశావు! 48 నేనే ప్రభువును; యెహోవాను. నేను సజీవుడను. నా జీవ ప్రమాణంగా చెపుతున్నాను. నీవు, నీ కుమార్తెలు చేసినన్ని చెడు కార్యాలు నీ సోదరి సొదొమ, ఆమె కుమార్తెలు ఎన్నడూ చేయలేదు.”
49 దేవుడు ఇలా చెప్పసాగాడు: “నీ సోదరి సొదొమ, ఆమె కుమార్తెలు గర్విష్ఠులు. వారికి తినటానికి పుష్కలంగా ఉంది. వారికి కావలసినంత తీరుబడి సమయం ఉంది. వారు పేదలను గాని, నిస్సహాయులను గాని ఆదుకోలేదు. 50 సొదొమ, ఆమె కుమార్తెలు అతి గర్విష్ఠులయి నా ఎదుటనే భయంకరమైన పాపాలు చేయటం మొదలు పెట్టారు. వారు చెడుకార్యాలు చేయటం నేను చూసి, వారిని శిక్షించాను.”
51 దేవుడు ఇంకా ఇలా చెప్పాడు, “నీవు చేసిన చెడుకార్యాలలో సమరయ సగం మాత్రమే చేసింది. సమరయ చేసిన వాటికంటే ఎన్నో ఘోరమైన పనులు నీవు చేశావు! నీ తోబుట్టువుల కంటె నీవు అనేకానేక చెడుకార్యాలు చేశావు. నీతో పోల్చి చూస్తే సొదొమ, సమరయ ఎంతో మెరుగు. 52 కావున నీ సిగ్గు నీవు భరించాలి. నీతో పోల్చినప్పుడు నీ తోబుట్టువులు మంచివాళ్లుగా కన్పించేలా నీవు ప్రవర్తించావు. నీవు ఘోరమైన చెడుకార్యాలు చేశావు. అందుకు నీవు సిగ్గుపడాలి.”
1 యేసు క్రీస్తు సేవకుడును, అపొస్తలుడునైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు, మన రక్షకుడైన క్రీస్తు యొక్కయు నీతినిబట్టి మాలాగే అమూల్యమైన విశ్వాసాన్ని పొందినవాళ్ళకు వ్రాస్తున్నది.
2 దేవుణ్ణి గురించి, మన ప్రభువైన యేసు క్రీస్తును గురించి మీరు జ్ఞానం సంపాదించాలి. ఆ జ్ఞానం ద్వారా మీకు అనుగ్రహం, శాంతి సమృద్ధిగా లభించాలని కోరుతున్నాను.
మనకవసరమైన ప్రతిదాన్ని దేవుడు మనకిచ్చాడు
3 మన దేవుడు తనను గురించి మనలో ఉన్న జ్ఞానం ద్వారా తన మహిమను, మంచితనాన్ని పంచుకోవటానికి మనల్ని పిలిచాడు. అంతేకాక రక్షణ, ఆత్మీయ జీవితానికి కావలసినవాటిని దేవుడు తన శక్తి ద్వారా మనకిచ్చాడు. 4 ఈ విధంగా, అమూల్యమైనటువంటి గొప్ప వాగ్దానాన్ని మనకోసం చేసాడు. ఆ వాగ్దానాల సహాయంతో దురాశ వల్ల సంభవించే ఈ ప్రపంచంలోని పాపాలనుండి తప్పించుకొని, తన స్వభావంలో మీరు భాగం పంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఇలా చేసాడు.
5 అందువల్ల మీలో ఉన్న విశ్వాసానికి తోడుగా మంచితనాన్ని కూడా అలవరుచుకోవటానికి అన్ని విధాలా ప్రయత్నం చెయ్యండి. మంచితనానికి తోడుగా జ్ఞానాన్ని, 6 జ్ఞానానికి తోడుగా ఆత్మనిగ్రహాన్ని, ఆత్మనిగ్రహానికి తోడుగా పట్టుదలను, పట్టుదలకు తోడుగా ఆత్మీయతను, 7 ఆత్మీయతకు తోడుగా సోదర ప్రేమను, సోదర ప్రేమకు తోడుగా దయతో నిండిన ప్రేమను అలవరుచుకోండి. 8 ఈ గుణాలు మీలో పెరుగుతూ ఉండాలి. మన ప్రభువైన యేసు క్రీస్తును గురించిన జ్ఞానం మీలో ఉంది. పై గుణాలు మీలో ఉంటే ఈ జ్ఞానాన్ని ఫలవంతంగాను, ఉపయోగకరంగాను చేస్తాయి. 9 ఆ గుణాలు లేనివానికి దూరదృష్టి ఉండదు. అలాంటివాడు గ్రుడ్డివానితో సమానము. అంటే ఇలాంటి వ్యక్తి, తాను యిదివరలో చేసిన పాపాల్ని దేవుడు క్షమించాడన్న విషయం మరిచిపోయాడన్నమాట.
10 సోదరులారా! దేవుని పిలుపు, మీ ఎన్నిక ఫలించేటట్లు యింకా ఎక్కువ శ్రద్ధ వహించండి. ఇవన్నీ చేస్తూవుంటే మీరేనాటికీ క్రిందపడరు. 11 తద్వారా మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క శాశ్వతమైన రాజ్యంలోకి మీకు ఘనస్వాగతం లభిస్తుంది.
© 1997 Bible League International