Revised Common Lectionary (Semicontinuous)
జ్ఞాపకార్థ దినం[a] కోసం దావీదు కీర్తన.
38 యెహోవా, నీవు నన్ను విమర్శించేటప్పుడు కోపగించకు.
నీవు నన్ను సరిదిద్దేటప్పుడు కోపగించకుము.
2 యెహోవా, నీవు నన్ను బాధించావు.
నీ బాణాలు లోతుగా నాలో గుచ్చుకొన్నాయి.
3 నీవు నన్ను శిక్షించావు. నా శరీరం అంతా బాధగా ఉంది.
నేను పాపం చేశాను, నీవు నన్ను శిక్షించావు. అందుచేత నా ఎముకలన్నీ బాధగా ఉన్నాయి.
4 నేను చెడు కార్యాలు చేసిన దోషిని,
ఆ దోషం నా భుజాలమీద పెద్ద బరువుగా ఉంది.
5 నేను తెలివితక్కువగా ఉన్నాను.
ఇప్పుడు నాకు అవి కంపుకొడ్తున్న పుండ్లు అయ్యాయి.
6 నేను దుఃఖించేవానిలా రోజంతా విచారంగా ఉన్నాను.
రోజంతా నేను కృంగిపోయి ఉన్నాను.
7 నా నడుము వేడిగా కాలిపోతోంది.
నా శరీరం అంతా బాధగా ఉంది.
8 నేను పూర్తిగా బలహీనంగా ఉన్నాను.
నేను బాధతో ఉన్నాను గనుక నేను మూలుగుతున్నాను.
9 ప్రభువా, నీవు నా మూలుగు విన్నావు.
నా నిట్టూర్పులు నీకు మరుగు కాలేదు.
10 నా గుండె తడబడుచున్నది. నా బలం పోయింది.
నా చూపు దాదాపు పోయింది.
11 నా రోగం మూలంగా నా స్నేహితులు,
నా పొరుగువారు నన్ను చూసేందుకు రావటం లేదు.
నా కుటుంబం నా దగ్గరకు రాదు.
12 నన్ను చంపగోరేవారు తమ ఉచ్చులను వేసియున్నారు.
నాకు హాని చేయగోరేవారు నా నాశనం గూర్చి మాట్లాడుకొంటున్నారు.
వారు రోజంతా అబద్ధాలు చెప్తున్నారు.
13 అయితే నేను వినబడని చెవిటివానిలా ఉన్నాను.
మాట్లాడలేని మూగవానిలా నేను ఉన్నాను.
14 ఒకని గూర్చి మనుష్యులు చెప్పే మాటలు వినలేని చెవిటివానిలా నేను ఉన్నాను.
నేను వాదించి, నా శత్రువులదే తప్పు అని రుజువు చేయలేను.
15 కనుక యెహోవా, నీవు నన్ను కాపాడాలని వేచియుంటాను.
నా దేవా, నా ప్రభువా, నా శత్రువులకు సత్యం చెప్పుము.
16 నన్ను చూచి వారిని నవ్వనియ్యవద్దు.
నేను తొట్రుపడినప్పుడు వారిని గర్వపడనియ్యవద్దు.
17 నేను పడిపోయేటట్టు ఉన్నాను.
నేను నా బాధను మరచిపోలేను.
18 యెహోవా, నేను చేసిన చెడు కార్యాలను గూర్చి, నేను నీకు చెప్పాను.
నా పాపాలను గూర్చి నేను విచారిస్తున్నాను.
19 నా శత్రువులు ఇంకా ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నారు,
వారు ఎన్నెన్నో అబద్ధాలు చెప్పారు.
20 నా శత్రువులు నాకు కీడు చేశారు,
నేను వారికి మంచి పనులు మాత్రమే చేశాను.
మంచి పనులు చేయటానికి మాత్రమే నేను ప్రయత్నించాను.
కాని ఆ మనుష్యులు నాకు విరోధం అయ్యారు.
21 యెహోవా, నన్ను విడిచిపెట్టకు.
నా దేవా, నాకు సన్నిహితంగా ఉండు.
22 త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము.
నా దేవా, నన్ను రక్షించుము.
యెరూషలేమునుండి న్యాయం రావటం
4 చివరి రోజులలో ఇలా జరుగుతుంది.
పర్వతాలన్నిటిలో దేవుడైన యెహోవా ఆలయమున్న పర్వతం మిక్కిలి ప్రాముఖ్యంగలది అవుతుంది.
అది కొండలన్నిటిలో ఉన్నతంగా చేయబడుతుంది.
అన్యదేశాల ప్రజలు దానివద్దకు ప్రవాహంలా వస్తారు.
2 అనేక దేశాలవారు వచ్చి ఇలా అంటారు:
“రండి, మనం యెహోవా పర్వతంమీదికి వెళదాం!
యాకోబు దేవుని ఆలయానికి వెళదాం!
యెహోవా తన ధర్మాన్ని మనకు నేర్పుతాడు.
ఆయన మార్గంలో మనం నడుద్దాం.”
ఎందువల్లనంటే దేవుని బోధలు సీయోనునుండి వస్తాయి.
యెహోవా వాక్కు యెరూషలేమునుండి వస్తుంది!
3 యెహోవా అనేక జనుల మధ్య తీర్పు తీర్చుతాడు.
బహు దూరానగల బలమైన దేశాల ప్రజలకు ఆయన తీర్పు ఇస్తాడు.
అప్పుడు వారు తమ కత్తులను సాగగొట్టి వాటిని నాగలికర్రులుగా చేస్తారు.
ఆ జనులు తమ ఈటెలను సాగగొట్టి చెట్లను నరికే పనిముట్లుగా చేస్తారు.
జనులు ఒకరితో ఒకరు కత్తులతో యుద్ధం చేయటం మాని వేస్తారు.
వారిక ఎన్నడూ యుద్ధ వ్యూహాలను అధ్యయనం చేయరు!
4 లేదు, ప్రతి ఒక్కడూ తన ద్రాక్షాచెట్లక్రింద,
అంజూరపు చెట్లక్రింద కూర్చుంటాడు.
వారిని ఎవ్వరూ భయపడేలా చేయరు!
ఎందువల్లనంటే సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెప్పాడు!
5 అన్యదేశాల ప్రజలు తమతమ దేవుళ్లను అనుసరిస్తారు.
కానీ మనం మాత్రం మన దేవుడైన యెహోవా నామాన్ని సదా స్మరించుకుంటాం!
రాజ్యం తిరిగి పొందటం
6 యెహోవా చెపుతున్నాడు,
“యెరూషలేము గాయపర్చబడగా కుంటిది అయ్యింది.
యెరూషలేము అవతలకు విసిరివేయబడింది.
యెరూషలేము గాయపర్చబడింది; శిక్షింపబడింది.
అయినా నేను ఆమెను నా వద్దకు తీసుకొనివస్తాను.
7 “ఆ ‘కుంటి’ నగరవాసులే బతుకుతారు.
ఆ నగర ప్రజలు నగరం వదిలివెళ్లేలా బలవంత పెట్టబడ్డారు.
కాని నేను వారిని ఒక బలమైన రాజ్యంగా రూపొందిస్తాను.”
యెహోవా వారికి రాజుగా ఉంటాడు.
ఆయన శాశ్వతంగా సీయోను పర్వతం మీదనుండి పరిపాలిస్తాడు.
1 దైవేచ్ఛ వల్ల యేసు క్రీస్తు అపొస్తులునిగా ఉన్న పౌలు నుండి, మన సోదరుడైన తిమోతి నుండి కొరింథులో ఉన్న దేవుని సంఘానికి మరియు అకయ ప్రాంతంలోని పవిత్రులకు.
2 మన తండ్రియైన దేవుని నుండి, యేసు క్రీస్తు ప్రభువు నుండి మీకు అనుగ్రహము, శాంతి లభించాలని కోరుతున్నాను.
దేవునికి వందనాలు చెల్లించుట
3 మన యేసు క్రీస్తు ప్రభువును, తండ్రియైన దేవుణ్ణి స్తుతిద్దాము. దేవుడు దయామయుడు. మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. 4 ఆయన మన కష్టాలు తొలగిపోవటానికి సహాయం చేస్తాడు. ఆయనలాగే మనము కూడా యితరుల కష్టాలు తొలగించటానికి సహాయం చెయ్యాలని ఆయన ఉద్దేశం. 5 క్రీస్తు కష్టాల్ని మనము పంచుకొన్న విధంగా ఆయన ద్వారా కలిగే సహాయాన్ని కూడా పంచుకొందాము. 6 మీకు సహాయం చెయ్యాలని, రక్షణ కలగాలని మేము కష్టాలు అనుభవిస్తున్నాము. మీకు సహాయం చెయ్యటానికి దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. ఈ సహాయం వల్ల మేము అనుభవించిన కష్టాలు మీరు కూడా అనుభవించేటట్లు మీలో సహనం కలుగుతుంది. 7 నాకు మీ పట్ల గట్టి నమ్మకం ఉంది. మీరు మా కష్టాలు పంచుకొన్నట్లుగానే, మాకు కలిగే సహాయాన్ని కూడా పంచుకొంటారని మాకు తెలుసు.
8 మేము ఆసియ ప్రాంతంలో అనుభవించిన కష్టాలు మీకు చెప్పకుండా ఉండలేము. మాకు అక్కడ తీవ్రమైన కష్టాలు కలిగాయి. అవి మేము మోయలేనంతగా ఉండినవి. జీవిస్తామనే ఆశ కూడా పోయింది. 9 మా మనస్సులకు మరణదండన పొందినట్లు అనిపించింది. మమ్మల్ని మేము నమ్ముకోరాదని, చనిపోయినవాళ్ళను బ్రతికించే దేవుణ్ణి నమ్మాలని ఇలా జరిగింది. 10 దేవుడు మమ్మల్ని ఆ ప్రమాదకరమైన చావునుండి రక్షించాడు. ఇక ముందు కూడా రక్షిస్తాడు. మాకు ఆయన పట్ల పూర్తిగా విశ్వాసం ఉంది. 11 మీరు ప్రార్థించి మాకు సహాయం చెయ్యాలి. ఎంతమంది ప్రార్థిస్తే దేవుడు మాకు అంత సహాయం చేస్తాడు. దేవుడు మాకు ఆ సహాయం చేసాక, అందరూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొనే అవకాశం కలుగుతుంది.
© 1997 Bible League International