Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన
41 పేద ప్రజలకు సహాయం చేసే మనిషి అనేక ఆశీర్వాదాలు పొందుతాడు.
కష్టాలు వచ్చినప్పుడు యెహోవా ఆ మనిషిని రక్షిస్తాడు.
2 ఆ మనిషిని యెహోవా కాపాడి అతని ప్రాణాన్ని రక్షిస్తాడు.
ఆ మనిషికి ఈ దేశంలో అనేక ఆశీర్వాదాలు ఉంటాయి.
దేవుడు అతని శత్రువుల మూలంగా అతన్ని నాశనం కానివ్వడు.
3 ఆ మనిషి రోగిగా పడకలో ఉన్నప్పుడు
యెహోవా అతనికి బలాన్ని ఇస్తాడు. ఆ మనిషి రోగిగా పడకలో ఉండవచ్చు, కాని యెహోవా అతనిని బాగుచేస్తాడు.
4 నేను చెప్పాను, “యెహోవా, నాకు దయ చూపించుము.
నేను నీకు విరోధంగా పాపం చేసాను. కాని నన్ను క్షమించి నన్ను బాగుచేయుము.”
5 నా శత్రువులు నన్ను గూర్చి చెడు సంగతులు పలుకుతున్నారు.
“వీడెప్పుడు చచ్చి మరువబడుతాడు?” అని వారంటున్నారు.
6 కొందరు మనుష్యులు వచ్చి నన్ను దర్శిస్తున్నారు.
కాని వాళ్లు నిజంగా ఏమి తలుస్తున్నారో చెప్పరు.
ఆ మనుష్యులు నన్ను గూర్చిన వార్తలు తెలుసుకొనేందుకు మాత్రమే వస్తారు,
మరియు వారు వెళ్లి, వారి గాలి కబుర్లు ప్రచారం చేస్తారు.
7 నా శత్రువులు నన్ను గూర్చి చెడ్డ సంగతులను రహస్యంగా చెబుతారు.
వారు నాకు విరోధంగా చెడు సంగతులను తలపెడుతున్నారు.
8 “ఇతడు ఏదో తప్పుచేసాడు, అందుచేత ఇతడు రోగి అయ్యాడు.
ఇతడు తన పడక మీద నుండి ఎన్నటికి తిరిగి లేవడు” అని వారు అంటారు.
9 నా మంచి స్నేహితుడు నాతో భోజనం చేసాడు.
నేను అతన్ని నమ్మాను. కాని ఇప్పుడు నా మంచి స్నేహితుడు కూడా నాకు విరోధి అయ్యాడు.
10 కనుక యెహోవా, దయతో నన్ను కరుణించి, బాగుపడనిమ్ము.
అప్పుడు నేను వారికి తగిన విధంగా చేస్తాను.
11 యెహోవా, నా శత్రువులు నన్ను భాధించని యెడల
అప్పుడు నీవు నన్ను స్వీకరించావని నేను తెలుసుకొంటాను.
12 నేను నిర్దోషినైయుండగా నాకు సహాయం చేసితివి.
నీ సన్నిధానంలో నీవు నన్ను ఎల్లప్పుడూ నిలుచుండనిస్తావు.
13 ఇశ్రాయేలీయుల యెహోవా దేవుడు స్తుతింపబడును గాక.
ఆయన ఎల్లప్పుడూ స్తుతించబడ్డాడు. మరియు ఎల్లప్పుడూ స్తుతించబడతాడు.
ఆమేన్! ఆమేన్!
బబులోను నుంచి సందేశహరులు
39 ఆ కాలంలో బలదాను కుమారుడు మెరోదక్బలదాను బబులోనుకు రాజు. మెరోదక్ ఉత్తరాలు, కానుకలు హిజ్కియాకు పంపించాడు. హిజ్కియా జబ్బుపడి బాగయ్యాడని విన్నందువల్ల మెరోదక్ కానుకలు పంపించాడు. 2 ఈ కానుకలు హిజ్కియాకు చాలా సంతోషం కలిగించాయి. అందుచేత హిజ్కియా, మెరోదక్ మనుష్యులను తన రాజ్యంలోని ప్రత్యేక వస్తువులను చూడనిచ్చాడు. తన సకల ఐశ్వర్యాలు, వెండి, బంగారం, ఖరీదైన తైలాలు, పరిమళాలు ఆ మనుష్యులకు హిజ్కియా చూపించాడు. యుద్ధంలో ఉపయోగించే కత్తులు, డాళ్లు హిజ్కియా చూపించాడు. హిజ్కియా దాచి ఉంచినవన్నీ వారికి చూపించాడు. తన ఇంట్లో, రాజ్యంలో ఉన్నవి అన్నీ హిజ్కియా వారికి చూపించాడు.
3 ప్రవక్త యెషయా, హిజ్కియా దగ్గరకు వెళ్లి, “ఈ మనుష్యులు ఏమన్నారు? వాళ్లు ఎక్కడ్నుంచి వచ్చారు?” అని అతన్ని అడిగాడు.
“ఈ మనుష్యులు చాలా దూరదేశం నుండి నా దగ్గరకు వచ్చారు. ఈ మనుష్యులు బబులోను నుండి వచ్చారు.” అని హిజ్కియా చెప్పాడు.
4 కనుక యెషయా, “నీ రాజ్యంలో వాళ్లు ఏమి చూశారు?” అని అతణ్ణి అడిగాడు.
“నా రాజభవనంలో సమస్తమూ వాళ్లు చూశారు. నా ఐశ్వర్యాలన్నీ నేను వారికి చూపించాను” అని చెప్పాడు హిజ్కియా.
5 హిజ్కియాతో యెషయా ఇలా చెప్పాడు: “సర్వ శక్తిమంతుడైన యెహోవా మాటలు ఆలకించు. 6 భవిష్యత్తులో, నీకు ఉన్నదంతా బబులోనుకు తీసుకొని పోబడుతుంది. ధనం అంతా తీసుకొని పోబడుతుంది. ఏమీ విడువబడదు. సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పాడు ఇది. 7 బబులోను రాజు నీ కుమారులను నీనుండి పుట్టే కుమారులను తీసుకొని పోతాడు. నీ కుమారులు బబులోను రాజభవనంలో అధికారులు అవుతారు.”
8 హిజ్కియా, “యెహోవానుండి వచ్చిన ఈ మాటలు వినుటకు నాకు ఇంపుగా ఉన్నాయి” అని యెషయాతో చెప్పాడు. (“నేను రాజుగా ఉన్నంత వరకు కష్టం ఏమీ ఉండదు, శాంతి ఉంటుంది” అనుకొన్నందువల్ల హిజ్కియా ఇలా చెప్పాడు.)
యేసు పేతురు అత్తను నయం చేయటం
(మత్తయి 8:14-17; మార్కు 1:29-34)
38 యేసు సమాజమందిరాన్ని వదిలి సీమోను యింటికి వెళ్ళాడు. సీమోను అత్తకు జ్వరం తీవ్రంగా ఉంది. వాళ్ళు ఆమె జ్వరాన్ని గురించి యేసుకు చెప్పారు. 39 యేసు, ఆమె దగ్గరకు వచ్చి జ్వరాన్ని వదిలి పొమ్మని గద్దించాడు. జ్వరం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. వెంటనే ఆమె లేచి అందరిని ఆదరించటం మొదలు పెట్టింది.
యేసు అనేకులను నయం చేయటం
40 సూర్యాస్తమయమౌతుండగా ప్రజలు రక రకాల రోగాలున్న వాళ్ళను ఆయన దగ్గరకు తీసుకు వచ్చారు. ఆయన ప్రతి ఒక్కరి మీద తన చేతుల్ని ఉంచి అందరిని నయం చేశాడు. 41 “నీవు దేవుని కుమారుడవు” అని బిగ్గరగా కేకలు వేస్తూ చాలా మంది నుండి దయ్యాలు బయటకు వచ్చాయి. వాటికి తాను క్రీస్తు అని తెలియటం వల్ల యేసు వాటిని మాట్లాడవద్దని గద్దించాడు.
© 1997 Bible League International