Revised Common Lectionary (Semicontinuous)
18 కనుక మొదట్లో జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు. చాలా కాలం క్రిందట జరిగిన ఆ సంగతులను గూర్చి ఆలోచించవద్దు. 19 ఎందుకంటే నేను నూతన కార్యాలు చేస్తాను. ఇప్పుడు మీరు క్రొత్త మొక్కలా ఎదుగుతారు. ఇది సత్యమని మీకు గట్టిగా తెలుసు. నేను నిజంగానే అరణ్యంలో బాట వేస్తాను. నిజంగానే నేను ఎడారిలో నదులు ప్రవహింపజేస్తాను. 20 అడవి జంతువులు కూడ నాకు కృతజ్ఞత కలిగి ఉంటాయి. నిప్పుకోళ్లు, పెద్ద జంతువులు నన్ను ఘనపరుస్తాయి. అరణ్యంలో నేను నీళ్లను ప్రవహింప చేసినప్పుడు అవి నన్ను ఘనపరుస్తాయి. ఎడారిలో నేను నదులను ప్రవహింప జేసినప్పుడు అవి ఘనపరుస్తాయి. నేను ఏర్పరచుకొన్న నా ప్రజలకు నీళ్లు ఇవ్వటానికి నేను దానిని చేస్తాను. 21 వీరే నేను చేసిన మనుష్యులు. ఈ ప్రజలు నన్ను స్తుతించుటకు పాటలు పాడతారు.
22 “యాకోబూ, నీవు నాకు మొరపెట్టలేదు. ఎందుకంటే ఇశ్రాయేలూ, నీవు నాతో విసిగిపోయావు. 23 ప్రజలారా, మీరు మీ బలి అర్పణ గొర్రెలను నా దగ్గరకు తీసుకొని రాలేదు. మీరు నన్ను ఘనపర్చలేదు. మీరు నాకు బలులు అర్పించలేదు, మీరు నాకు బలులు ఇవ్వాలని నేను మిమ్మల్ని బలవంతం చేయలేదు. మీకు విసుగు కలిగేంత వరకు మీరు నాకు ధూపం వేయమని మిమ్మల్ని నేను బలవంతపెట్టలేదు. 24 కనుక మీరు నన్ను ఘనపర్చేందుకు అవసరమైన వస్తువులు కొనుటకు మీరు మీ డబ్బును ఉపయోగించలేదు. కానీ నేను మీ సేవకునిలా ఉండాలని మీరే నన్ను బలవంతం చేశారు. మీ చెడు క్రియలన్నీ నన్ను చాలా విసిగించే వరకు పాపం చేశారు.
25 “నేను, నేనే మీ పాపాలు తుడిచివేసే వాడ్ని. నా ఆనందం కోసం నేను దీన్ని చేస్తాను. నేను మీ పాపాలు జ్ఞాపకం చేసుకోను.
సంగీత నాయకునికి: దావీదు కీర్తన
41 పేద ప్రజలకు సహాయం చేసే మనిషి అనేక ఆశీర్వాదాలు పొందుతాడు.
కష్టాలు వచ్చినప్పుడు యెహోవా ఆ మనిషిని రక్షిస్తాడు.
2 ఆ మనిషిని యెహోవా కాపాడి అతని ప్రాణాన్ని రక్షిస్తాడు.
ఆ మనిషికి ఈ దేశంలో అనేక ఆశీర్వాదాలు ఉంటాయి.
దేవుడు అతని శత్రువుల మూలంగా అతన్ని నాశనం కానివ్వడు.
3 ఆ మనిషి రోగిగా పడకలో ఉన్నప్పుడు
యెహోవా అతనికి బలాన్ని ఇస్తాడు. ఆ మనిషి రోగిగా పడకలో ఉండవచ్చు, కాని యెహోవా అతనిని బాగుచేస్తాడు.
4 నేను చెప్పాను, “యెహోవా, నాకు దయ చూపించుము.
నేను నీకు విరోధంగా పాపం చేసాను. కాని నన్ను క్షమించి నన్ను బాగుచేయుము.”
5 నా శత్రువులు నన్ను గూర్చి చెడు సంగతులు పలుకుతున్నారు.
“వీడెప్పుడు చచ్చి మరువబడుతాడు?” అని వారంటున్నారు.
6 కొందరు మనుష్యులు వచ్చి నన్ను దర్శిస్తున్నారు.
కాని వాళ్లు నిజంగా ఏమి తలుస్తున్నారో చెప్పరు.
ఆ మనుష్యులు నన్ను గూర్చిన వార్తలు తెలుసుకొనేందుకు మాత్రమే వస్తారు,
మరియు వారు వెళ్లి, వారి గాలి కబుర్లు ప్రచారం చేస్తారు.
7 నా శత్రువులు నన్ను గూర్చి చెడ్డ సంగతులను రహస్యంగా చెబుతారు.
వారు నాకు విరోధంగా చెడు సంగతులను తలపెడుతున్నారు.
8 “ఇతడు ఏదో తప్పుచేసాడు, అందుచేత ఇతడు రోగి అయ్యాడు.
ఇతడు తన పడక మీద నుండి ఎన్నటికి తిరిగి లేవడు” అని వారు అంటారు.
9 నా మంచి స్నేహితుడు నాతో భోజనం చేసాడు.
నేను అతన్ని నమ్మాను. కాని ఇప్పుడు నా మంచి స్నేహితుడు కూడా నాకు విరోధి అయ్యాడు.
10 కనుక యెహోవా, దయతో నన్ను కరుణించి, బాగుపడనిమ్ము.
అప్పుడు నేను వారికి తగిన విధంగా చేస్తాను.
11 యెహోవా, నా శత్రువులు నన్ను భాధించని యెడల
అప్పుడు నీవు నన్ను స్వీకరించావని నేను తెలుసుకొంటాను.
12 నేను నిర్దోషినైయుండగా నాకు సహాయం చేసితివి.
నీ సన్నిధానంలో నీవు నన్ను ఎల్లప్పుడూ నిలుచుండనిస్తావు.
13 ఇశ్రాయేలీయుల యెహోవా దేవుడు స్తుతింపబడును గాక.
ఆయన ఎల్లప్పుడూ స్తుతించబడ్డాడు. మరియు ఎల్లప్పుడూ స్తుతించబడతాడు.
ఆమేన్! ఆమేన్!
18 దేవుని సాక్షిగా చెపుతున్నాను. మీకు బోధించిన విషయంలో “ఔను”, “కాదు” అనే ప్రశ్నే లేదు. 19 నేను, సిల్వాను, తిమోతి మీకు బోధించిన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు “ఔను”, “కాదు” అని అనలేదు. ఆయన అన్నివేళలా “ఔను” అని అన్నాడు. 20 దేవుడు క్రీస్తునందు చేసిన ఎన్ని వాగ్దానాలైనను “ఔను” అని అన్నట్లుగానే ఉన్నవి. అందువల్ల యేసు క్రీస్తు ద్వారా మనము “ఆమేన్” అని అంటున్నాము. ఇలా అని దేవునికి మహిమ కలిగిస్తున్నాము. 21 దేవుడు మనకు, అంటే మీకు, మాకు క్రీస్తు పట్ల ధృఢవిశ్వాసము ఉండేటట్లు చేస్తున్నాడు. మనకు అభిషేకమిచ్చినవాడు దేవుడు. 22 దేవుడు మనము తనవాళ్ళమన్న ముద్ర మనపై వేసాడు. తన ఆత్మను రానున్నదానికి హామీగా మన గుండెల్లో ఉంచాడు.
యేసు పక్షవాత రోగిని నయం చేయటం
(మత్తయి 9:1-8; లూకా 5:17-26)
2 కొద్ది రోజుల తర్వాత యేసు మళ్ళీ కపెర్నహూము పట్టణానికి వెళ్ళాడు. ఆయన ఇంటికి వచ్చాడన్న వార్త ప్రజలకు తెలిసింది. 2 చాలా మంది ప్రజలు సమావేశం అవటం వల్ల స్థలం చాలలేదు. తలుపు అవతల కూడా స్థలం లేకపోయింది. యేసు వాళ్ళకు ఉపదేశిస్తూ ఉన్నాడు. 3 ఇంతలో నలుగురు మనుష్యులు ఒక పక్షవాత రోగిని మోసికొని అక్కడికి తీసుకు వచ్చారు. 4 చాలామంది ప్రజలుండటం వల్ల రోగిని యేసు ముందుకు తీసుకు రాలేకపోయారు. అందువల్ల వాళ్ళు యేసు వున్న గది పైకప్పు తెరచి, ఆ పక్షవాత రోగిని, అతడు పడుకొని ఉన్న చాపతో సహా ఆ సందు ద్వారా యేసు ముందుకు దించారు. 5 యేసు వాళ్ళ విశ్వాసాన్ని చూసి పక్షవాత రోగితో, “కుమారుడా! నీ పాపాలు క్షమించబడ్డాయి!” అని అన్నాడు.
6 అక్కడే కూర్చొని ఉన్న కొందరు శాస్త్రులు తమలో తాము ఈ విధంగా అనుకొన్నారు. 7 “ఇతడెందుకు ఈ విధంగా అంటున్నాడు? ఇది దైవ దూషణ కాదా? దేవుడు తప్ప వేరెవ్వరు పాపాల్ని క్షమించగలరు?” అని అనుకొన్నారు.
8 వాళ్ళు తమ మనస్సులో ఈ విధంగా ఆలోచిస్తున్నారని యేసు మనస్సు తక్షణమే గ్రహించింది. ఆయన వాళ్ళతో, “మీరు దీన్ని గురించి ఆ విధంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? 9 ఏది సులభం? పక్షవాత రోగితో, ‘నీ పాపాలు క్షమించబడ్డాయి!’ అని అనటం సులభమా లేక, ‘నీ చాప తీసుకొని నడిచి వెళ్ళు!’ అని అనటం సులభమా? 10 భూలోకంలో పాపాలు క్షమించే అధికారం మనుష్య కుమారునికి ఉందని మీరు తెలుసుకోవాలి!” అని అంటూ, పక్షవాత రోగితో, 11 “నేను చెబుతున్నాను, లేచి నీ చాప తీసుకొని యింటికి వెళ్ళు!” అని అన్నాడు.
12 వెంటనే ఆ పక్షవాత రోగి లేచి నిలబడి తన చాప తీసుకొని అందరూ చూస్తుండగా నడుస్తూ వెళ్ళి పోయాడు. ఇది చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. “మేము ఇలాంటిది ఎన్నడూ చూడలేదు!” అని అంటూ దేవుణ్ణి స్తుతించారు.
© 1997 Bible League International