Old/New Testament
14 అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు: 2 “ప్రజలు వెనక్కు తిరిగి పీహ హీరోతుకు ప్రయాణం కట్టమని చెప్పు. మిగ్దోలుకు, సముద్రానికి మధ్య ప్రదేశంలో రాత్రికి బసచేయాలని వారితో చెప్పు. ఇది బయల్సెఫోను దగ్గర్లో ఉంది. 3 ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో తప్పిపోయి ఉంటారని ఫరో తలుస్తాడు. పైగా ప్రజలు వెళ్ల గలిగినచోటు ఇంకేమీ ఉండదు అనుకొంటాడు. 4 ఫరోను నేను ధైర్యశాలిగా చేస్తాను. అతడేమో మిమ్మల్ని తరుముతాడు. అయితే ఫరోను, అతని సైన్యాన్ని నేను ఓడిస్తాను. ఇది నాకు కీర్తి తెచ్చి పెడుతుంది. నేనే యెహోవానని ఈజిప్టు వాళ్లు అప్పుడు తెల్సుకొంటారు.” ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటకు విధేయులై ఆయన చెప్పినట్టు చేసారు.
ఇశ్రాయేలీయుల్ని ఫరో తరమటం
5 ఇశ్రాయేలు ప్రజలు పారిపోయారని ఫరోకు ఒక సమాచారం అందింది. ఎప్పుడైతే ఈ సంగతి విన్నారో అప్పుడు వెంటనే ఫరో, అతని అధికారులు తాము చేసిన దాన్ని గూర్చి తమ మనసు మార్చుకొన్నారు. “ఇశ్రాయేలు ప్రజల్ని అసలు మనం ఎందుకు వెళ్లనిచ్చాం? వాళ్లను మనం ఎందుకు పారిపోనిచ్చాం? ఇప్పుడు మనం మన బానిసల్ని పోగొట్టుకొన్నాం” అన్నాడు ఫరో.
6 కనుక ఫరో తన యుద్ధరథాన్ని సిద్ధం చేసుకొని, తన మనుష్యుల్ని వెంట పెట్టుకొని వెళ్లాడు. 7 తన మనుష్యుల్లో బలవంతులయిన వాళ్లు 600 మందిని, రథాలు అన్నింటిని తనతో తీసుకొని వెళ్లాడు. ఒక్కోరథానికి ఒక్కో అధికారి ఉన్నాడు. 8 ఇశ్రాయేలీయులు విజయ సంకేతంగా చేతులు పైకెత్తి వెళ్లి పోతున్నారు. కానీ ఈజిప్టురాజైన ఫరో ఇంకా ధైర్యశాలి అయ్యేటట్టు యెహోవా చేసాడు. ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని ఇంకా తరిమాడు.
9 ఈజిప్టు సైన్యంలో అశ్వదళాలు, రథాలు చాల ఉన్నాయి. వారు ఇశ్రాయేలు ప్రజల్ని తరిమి, వారు బయల్సెఫోనుకు తూర్పున పీహహీరోతు వద్ద ఎర్ర సముద్రానికి దగ్గర్లో బస చేస్తూ ఉండగానే వారిని సమీపించారు.
10 ఫరో, అతని సైన్యం తమవైపే రావడం ఇశ్రాయేలు ప్రజలు చూసారు. ప్రజలు చాల భయపడ్డారు. సహాయం చేయమని వారు యెహోవాకు మొరపెట్టారు. 11 మోషేతో వాళ్లు యిలా అన్నారు, “అసలు ఈజిప్టు నుండి నీవు మమ్మల్నెందుకు బయటకు తీసుకొచ్చావు? చావడానికి నీవు మమ్మల్ని ఈ ఎడారిలోకి తీసుకురావడం ఎందుకు? మేము హాయిగా ఈజిప్టులోనే చచ్చేవాళ్లం అక్కడ ఈజిప్టులో కావాల్సినన్ని సమాధులున్నాయి. 12 ఇలా జరుగుతుందని మేము నీతో చెప్పాము. ‘దయచేసి మమ్మల్ని విసిగించకు. మమ్మల్ని ఇక్కడే ఉండనిచ్చి, ఈజిప్టు వాళ్లకు సేవ చేయనియ్యి అని ఈజిప్టులోనే మేము చెప్పాము.’ ఇలా బయటకు వచ్చి ఈఎడారిలో చావడంకంటె ఈజిప్టులోనే ఉండిపోయి బానిసలంగా ఉంటేనే యింకా బాగుండేది మాకు.”
13 కానీ మోషే జవాబు ఇలా చెప్పాడు: “భయ పడకండి! పారిపోకండి! యెహోవా ఈనాడు మిమ్మల్ని రక్షించటం వేచి చూడండి. ఈ ఈజిప్టు వారిని ఈరోజు తర్వాత మళ్లీ ఎన్నడూ మీరు చూడరు! 14 మీరు ఊరకనే మౌనంగా ఉండటం తప్ప చేయాల్సిందేమీ లేదు. మీ పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడు.”
15 అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు, “ఇంకా నీవెందుకు నాకు మొర పెడుతున్నావు? ఇశ్రాయేలు ప్రజల్ని ముందడుగు వేయమని ఆజ్ఞాపించు 16 నీ చేతిలో కర్రను ఎర్రసముద్రం మీదకు చాపు, ఎర్రసముద్రం రెండుగా విడిపోతుంది. అప్పుడు ప్రజలు ఆరిపోయిన నేలమీద సముద్రంలోనుంచి నడిచి వెళ్లిపోవచ్చు. 17 ఈజిప్టు వాళ్లను ధైర్యంగల వాళ్లుగా నేను చేస్తాను. ఇలా చేసినందువల్ల వారు మిమ్మల్ని తరుముతారు. అయితే ఫరోకంటె, అతని అశ్వదళాలు, రథాలు, అన్నిటికంటె నేను ఎక్కువ శక్తిగలవాడ్ని అని మీకు తెలియజేస్తాను. 18 నేనే యెహోవానని ఈజిప్టు అప్పుడు తెలుసు కొంటుంది. ఫరోను, అతని అశ్వ దళాలను, రథాలను నేను ఓడించినప్పుడు వాళ్లు నన్ను గౌరవిస్తారు.”
ఈజిప్టు సైన్యాన్ని యెహోవా ఓడించటం
19 ఆ సమయంలో యెహోవా దూత ప్రజల వెనక్కు వెళ్లడం జరిగింది. (సాధారణంగా యెహోవా దూత ప్రజలకు ముందర ఉండి వారిని నడిపించడం జరుగుతుంది) కనుక ఎత్తైన మేఘం ప్రజల ముందర నుండి కదలిపోయి, ప్రజల వెనక్కు వెళ్లింది 20 ఈ విధంగా ఈజిప్టు వాళ్లకు, ఇశ్రాయేలీయులకు మధ్య ఆ మేఘం నిలిచింది. ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు ఉంది. కానీ ఈజిప్టు వారికి అంతా చీకటి. అందుచేత ఆరాత్రి ఈజిప్టు వాళ్లు ఇశ్రాయేలు ప్రజల సమీపానికి రాలేకపోయారు.
21 మోషే ఎర్ర సముద్రం మీదికి తన చేయి ఎత్తగానే తూర్పునుండి ఒక బలమైన గాలి వీచేటట్టు యెహోవా చేసాడు. ఆ గాలి రాత్రి అంతా వీచింది. సముద్రం రెండుగా విడిపోయింది. ఆ గాలి నేలను ఆరిపోయ్యేటట్టు చేసింది. 22 ఇశ్రాయేలు ప్రజలు సముద్రంలో పొడినేల మీద వెళ్లారు. వాళ్లకు కుడిప్రక్క, ఎడమప్రక్క నీళ్లు గోడలా నిలిచాయి. 23 అప్పుడు ఫరో రథాలు, అశ్వదళాలు అన్నీ వాళ్ల వెంట సముద్రంలో ప్రవేశించాయి. 24 ఆ ఉదయం ఎత్తయిన మేఘం నుండి అగ్ని స్తంభం నుండి యెహోవా ఈజిప్టు సైన్నాన్ని చూచాడు. యెహోవా వాళ్లను ఎదుర్కొని ఓడించాడు. 25 రథచక్రాలు బిగిసిపోయి కదలడం లేదు. రథాలను అదుపుచెయ్యడం చాలా కష్టతరంగా ఉంది. “మనం ఇక్కడ్నుంచి పారిపోదాం రండి! యెహోవా మనకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. ఆయన ఇశ్రాయేలీయులకోసం యుద్ధం చేస్తున్నాడు.” అంటూ ఈజిప్టు వాళ్లు కేకలు వేసారు.
26 అప్పుడు యెహోవా మోషేతో, “నీ చేయి సముద్రం మీదికి ఎత్తు, నీళ్లు పడిపోయి ఈజిప్టు రథాలను, అశ్వదళాలను ముంచేస్తాయి.” అని చెప్పాడు.
27 కనుక తెల్లవారు ఝామున మోషే తన చేతిని సముద్రం మీదికి ఎత్తాడు. నీళ్లు యధాస్థానానికి వచ్చి పడ్డాయి. ఈజిప్టు వాళ్లు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈజిప్టు వాళ్లు సముద్రంలో కొట్టుకుపోయేటట్టు యెహోవా చేసాడు. 28 నీళ్లు యధాస్థానానికి మళ్లీ రావడం చేత రథాలను, అశ్వదళాలను కప్పేశాయి. ఇశ్రాయేలు ప్రజలను తరుముకొచ్చిన ఫరో సైన్యాలన్నీ నాశనం చేయబడ్డాయి. వాళ్లలో ఒక్కడూ బతకలేదు.
29 అయితే ఇశ్రాయేలు ప్రజలు మాత్రం పొడినేల మీద సముద్రాన్ని దాటిపోయారు. వారి కుడి ఎడమ ప్రక్కల్లో నీళ్లు ఒక గోడలా నిలిచిపోయాయి. 30 ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టువాళ్లు చేతినుండి యెహోవాయే రక్షించాడు. ఎర్రసముద్ర తీరాన ఈజిప్టువాళ్ల శవాలను ఇశ్రాయేలు ప్రజలు చూచారు. 31 యెహోవా ఈజిప్టు వాళ్లను ఓడించినప్పుడు ఆయన మహత్తర శక్తిని ఇశ్రాయేలు ప్రజలు చూశారు. అందుచేత ప్రజలు యెహోవాకు భయపడి ఆయనను ఘనపర్చారు. యెహోవాను, ఆయన సేవకుడైన మోషేను నమ్మారు.
మోషే పాట
15 అప్పుడు మోషే, అతనితో బాటు ఇశ్రాయేలు ప్రజలూ యెహోవాకు ఈ పాట పాడటం మొదలు పెట్టారు.
“యెహోవాను గూర్చి నేను గానం చేస్తాను.
ఆయన గొప్ప కార్యాలు చేసాడు గనుక గుర్రాలను,
రౌతులను ఆయనే సముద్రంలో పడవేసాడు.
2 యెహోవా నా బలం,
నన్ను రక్షించేది ఆయనే ఆయన్ని గూర్చి
నేను స్తుతిగీతాలు పాడుకొంటాను.
యెహోవా నా దేవుడు,
ఆయన్ని నేను స్తుతిస్తాను.
నా పూర్వీకుల దేవుడు[a] యెహోవా
ఆయన్ని నేను ఘనపరుస్తాను.
3 యెహోవా గొప్ప వీరుడు. ఆయన పేరే యెహోవా.
4 ఫరో రథాలను, అశ్వదళాలను
యెహోవా సముద్రంలో పడవేసాడు.
ఫరో ప్రధాన అధికారులు
ఎర్ర సముద్రంలో మునిగిపోయారు.
5 లోతైన జలాలు వారిని కప్పేసాయి
లోతు నీటిలో బండల్లా వాళ్లు మునిగిపొయ్యారు.
6 “నీ కుడిచేతిలో ఆశ్చర్యం కలిగించేటంత బలం ఉంది.
ప్రభూ, నీ కుడిచేయి శత్రువును పటాపంచలు చేసింది.
7 నీకు వ్యతిరేకంగా నిలిచిన వారిని
నీ మహా ఘనత చేత నాశనం చేసావు.
గడ్డిని తగుల బెట్టినట్టు
నీ కోపం వారిని నాశనం చేసింది.
8 నీవు విసరిన పెనుగాలి
నీళ్లను ఉవ్వెత్తున నిలిపేసింది
వేగంగా ప్రవహించే నీళ్లు గట్టి గోడలా అయ్యాయి సముద్రం,
దాని లోపలి భాగాలవరకు గడ్డ కట్టెను.
9 “శత్రువు, ‘నేను వాళ్లను తరిమి పట్టుకొంటాను
వాళ్ల ఐశ్వర్యాలన్నీ దోచుకొంటాను
నేను నా కత్తి ప్రయోగించి, వాళ్ల సర్వస్వం దోచుకొంటాను
సర్వం నా కోసమే నా చేతుల్తో దోచుకొంటాను’ అని అన్నాడు.
10 కానీ నీవు వాళ్ల మీదకి గాలి రేపి
సముద్రంతో వాళ్లను కప్పేసావు
సముద్ర అగాధంలో సీసం మునిగిపోయినట్టు వాళ్లు మునిగిపొయ్యారు.
11 “యెహోవా, నీలాంటి పరాక్రమముగల దేవుడు మరొకడు లేడు
పరిశుద్ధతలో నీవు గొప్పవాడవు.
స్తుతి కీర్తనలతో ఆరాధించబడుటకు యోగ్యుడవు
ఆశ్చర్యకార్యములు చేయువాడవు నీకు సాటి వేరెవ్వరూ లేరు.
12 నీ కుడి హస్తాన్ని పైకెత్తి
ప్రపంచాన్నే నాశనం చేయగలవు!
13 నీవు రక్షించిన ప్రజల్ని
నీ దయతో నీవు నడిపిస్తావు
ఉల్లాసకరమైన నీ పవిత్ర దేశానికి
నీ బలంతో నీవు వీళ్లను నడిపిస్తావు.
14 “ఈ గాథను ఇతర జన సమూహాలు వింటారు
ఎంతైనా వాళ్లు భయపడ్తారు.
ఫిలిష్తీ ప్రజలు భయంతో వణకిపోతారు.
15 తరువాత ఎదోము నాయకులు భయంతో వణకిపోతారు.
మోయాబు నాయకులు భయంతో వణకిపోతారు.
కనాను ప్రజలు తమ ధైర్యం కోల్పోతారు.
16 ఆ ప్రజలు నీ బలాన్ని చూచి
భయంతో నిండిపోతారు
యెహోవా ప్రజలు దాటి పొయ్యేంత వరకు
ఆ ప్రజల్ని నీవు దాటించేంత వరకు వాళ్లు బండలా మౌనంగా ఉండిపోతారు.
17 యెహోవా నీవు నీ సింహాసనం కోసం సిద్ధం చేసిన
నీ పర్వతానికి నీ ప్రజల్ని నడిపిస్తావు
ఓ ప్రభూ, నీ హస్తాలతో నీ ఆలయాన్ని నిర్మించు.
18 “యెహోవా శాశ్వతంగా సదా ఏలునుగాక!”
19 ఫరో గుర్రాలు, రౌతులు, రథాలు సముద్రంలోకి వెళ్లిపొయ్యాయి. సముద్ర జలాలతో యెహోవా వాళ్లను కప్పేసాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు పొడి నేల మీద సముద్రంలో నడిచివెళ్లారు.
20 అప్పుడు అహరోను సోదరి, మహిళా ప్రవక్తి మిర్యాము తంబుర పట్టుకొంది. మిర్యాము, మిగతా స్త్రీలు పాటలు పాడుతూ నాట్యం చేయడం మొదలు పెట్టారు. మిర్యాము ఈ మాటనే మరల మరల పల్లవిగా పలికింది,
21 “ఆయన గొప్ప కార్యాలు చేసాడు
గనుక యెహోవాకు గానం చేయండి గుర్రాలను,
దాని రౌతులను ఆయన సముద్రంలో పడవేసాడు.”
ఇశ్రాయేలీయులు ఎడారిలోనికి వెళ్లటం
22 మోషే మాత్రం ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రం నుండి దూరంగా నడిపిస్తూనే ఉన్నాడు. ప్రజలు షూరు ఎడారిలోకి వెళ్లారు. ఎడారిలో మూడు రోజులు వాళ్లు ప్రయాణం చేసారు. ప్రజలకు నీళ్లు ఏవీ దొరకలేదు. 23 మూడురోజుల తర్వాత ప్రజలు మారాకు ప్రయాణమై వెళ్లారు. మారాలో నీళ్లున్నాయి గాని అవి త్రాగలేకపోయారు. ఆ నీళ్లు త్రాగలేనంత చేదుగా ఉన్నాయి. అందుకే ఆ స్థలానికి మారా[b] అని పేరు.
24 ప్రజలు మోషేకు ఫిర్యాదు చేయటం మొదలు బెట్టారు, “ఇప్పుడు మేము ఏమి త్రాగాలి?” అన్నారు ప్రజలు.
25 మోషే యెహోవాకు మొర పెట్టాడు. యెహోవా అతనికి ఒక చెట్టును చూపించాడు. మోషే ఆ చెట్టును నీళ్లలో వేసాడు. అతను యిలా చేయగానే ఆ నీళ్లు తాగే మంచి నీళ్లయ్యాయి.
ఆ స్థలంలో ప్రజలకు యెహోవా తీర్పు తీర్చి వారికి ఒక ఆజ్ఞను ఇచ్చాడు. ఆ ప్రజల విశ్వాసాన్ని కూడ యెహోవా పరీక్షించాడు. 26 “మీ యెహోవా దేవునికి మీరు విధేయులు కావాలి. ఆయన ఏవి సరైనవని చెబతాడో వాటిని మీరు చేయాలి. యెహోవా ఆజ్ఞలకు, చట్టానికి మీరు విధేయులైతే, ఈజిప్టు వాళ్లలా మీరు రోగులు అవ్వరు. నేను, యెహోవాను, ఈజిప్టు వాళ్ల మీదకు పంపిన రోగాలు ఏవీ మీ మీదకు పంపించను. నేనే యెహోవాను. మిమ్మల్ని స్వస్థపరచేవాడ్ని నేనే.”
27 అప్పుడు ప్రజలు ఏలీమునకు ప్రయాణమయ్యారు. ఏలీములో 12 నీటి ఊటలు ఉన్నాయి. ఇంకా అక్కడ 70 ఈత చెట్లు ఉన్నాయి. అందుచేత ఆ నీళ్ల దగ్గర వారు బసను ఏర్పాటు చేసుకొన్నారు.
యేసుని రూపాంతరం
(మార్కు 9:2-13; లూకా 9:28-36)
17 యేసు ఆరు రోజుల తర్వాత పేతురును, యాకోబును, యాకోబు సోదరుడైన యోహానును, ఒక ఎతైన కొండ మీదికి తన వెంట ప్రత్యేకంగా పిలుచుకు వెళ్ళాడు. 2 ఆయన అక్కడ వాళ్ళ సమక్షంలో దివ్యరూపం పొందాడు. ఆయన ముఖం సూర్యునిలా ప్రకాశించింది. ఆయన దుస్తులు వెలుతురువలే తెల్లగా మరాయి. 3 అదే క్షణంలో వాళ్ళ ముందు మోషే మరియు ఏలీయా ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు యేసుతో మాట్లాడటం శిష్యులు చూసారు.
4 పేతురు యేసుతో, “ప్రభూ! మనమిక్కడ ఉండటం మంచిది. మీరు కావాలంటే మూడు పర్ణశాలలు నిర్మిస్తాము—మీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి” అని అన్నాడు.
5 అతడు ఇంకా మాట్లాడుతుండగా ఒక కాంతివంతమైన మేఘం ఆ ముగ్గుర్ని కప్పివేసింది. ఆ మేఘం నుండి ఒక స్వరం, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన పట్ల నాకు ప్రేమ ఉంది. ఈయన నాకు చాలా నచ్చాడు. ఈయన మాట వినండి” అని వినిపించింది.
6 ఇది విని శిష్యులు భయంతో సాష్టాంగ పడ్డారు. 7 యేసు వచ్చి వాళ్ళను తాకుతూ, “లేవండి! భయపడకండి!” అని అన్నాడు. 8 వాళ్ళు తలెత్తి చూసారు. వాళ్ళకు యేసు తప్ప యింకెవరూ కనపడలేదు.
9 వాళ్ళు కొండ దిగి క్రిందికి వస్తుండగా యేసు, “మనుష్యకుమారుడు బ్రతికి వచ్చేవరకు మీరు చూసిన ఈ దృశ్యాన్ని గురించి ఎవ్వరికి చెప్పకండి” అని ఆజ్ఞాపించాడు.
10 “మరి మొదట ఏలియా రావాలని శాస్త్రులు ఎందుకంటున్నారు” అని శిష్యులు అడిగారు.
11 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఏలియా తప్పకుండా వస్తాడు. వచ్చి అన్నీ ముందున్నట్లు స్థాపిస్తాడు. 12 నేను చెప్పేదేమిటంటే, ఏలియా ఇదివరకే వచ్చాడు. కాని వాళ్ళతన్ని గుర్తించలేదు. పైగా అతని పట్ల తమ యిష్టానుసారంగా ప్రవర్తించారు. అదే విధంగా వాళ్ళు మనుష్య కుమారునికి కూడా బాధలు కలిగిస్తారు.” 13 యేసు బాప్తిస్మమునిచ్చే యోహానును గురించి మాట్లాడుతున్నట్లు శిష్యులకు అప్పుడు అర్థమయింది.
యేసు ఒక బాలుని దయ్యంనుండి విడిపించటం
(మార్కు 9:14-29; లూకా 9:37-43)
14 వాళ్ళు ప్రజల దగ్గరకు రాగానే ఒక వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి మోకరిల్లి, 15 “ప్రభూ! నా కుమారునిపై దయ చూపండి. అతడు మూర్ఛ రోగంతో చాలా బాధపడ్తున్నాడు. మాటి మాటికి నిప్పుల్లో పడ్తూ ఉంటాడు. 16 అతణ్ణి నేను మీ శిష్యుల దగ్గరకు తీసుకు వచ్చాను. కాని వాళ్ళతనికి నయం చెయ్యలేక పొయ్యారు” అని అన్నాడు.
17 అప్పుడు యేసు, “మూర్ఖులైన ఈ తరానికి చెందిన మీలో విశ్వాసం లేదు. మీకు సక్రమమైన ఆలోచనలు రావు. నేనెంత కాలమని మీతో ఉండాలి? ఎంతకాలమని మీ పట్ల సహనం వహించాలి. ఆ బాలుణ్ణి నా దగ్గరకు పిలుచుకు రండి” అని అన్నాడు. 18 యేసు ఆ దయ్యానికి వెళ్ళిపొమ్మని గట్టిగా చెప్పాడు. అది ఆ బాలుని నుండి వెలుపలికి వచ్చింది. అదే క్షణంలో ఆ బాలునికి నయమైపోయింది.
19 శిష్యులు ఆ తర్వాత యేసు దగ్గరకు ప్రత్యేకంగా వచ్చి, “మేమెందుకు దాన్ని వెళ్ళగొట్టలేక పోయాము?” అని అడిగారు.
20 యేసు, “మీలో దృఢవిశ్వాసం లేదు కనుక మీరు దాన్ని వెళ్ళగొట్టలేక పొయ్యారు. కాని ఇది సత్యం. 21 మీలో ఆవగింజంత విశ్వాసమున్నా చాలు. మీరీ కొండతో ‘అక్కడికి వెళ్ళు’ అని అంటే వెళ్తుంది. మీకు అసాధ్యమనేది ఉండదు” అని అన్నాడు.
యేసు తన మరణాన్ని గురించి మాట్లాడటం
(మార్కు 9:30-32; లూకా 9:43-45)
22 వాళ్ళంతా గలిలయలో మళ్ళీ కలుసుకొన్నప్పుడు యేసు వాళ్ళతో, “మనుష్య కుమారుడు దుర్మార్గులకు అప్పగించబడుతాడు. 23 వాళ్ళాయన్ని చంపుతారు. కాని మూడవ రోజు ఆయన తిరిగి బ్రతికి వస్తాడు” అని అన్నాడు. ఇది విని శిష్యులు చాలా దుఃఖించారు.
పన్ను చెల్లించుట గురించి యేసు బోధించటం
24 యేసు, ఆయన శిష్యులు కపెర్నహూము చేరుకొన్నారు. అక్కడ అరషెకెలు పన్నులు సేకరించే అధికారులు పేతురు దగ్గరకు వచ్చి, “మీ బోధకుడు గుడి పన్ను చెల్లించడా?” అని ప్రశ్నించారు.
25 “చెల్లిస్తాడు” అని పేతురు సమాధానం చెప్పి యింట్లోకి వెళ్ళాడు.
అతడేం మాట్లాడక ముందే యేసు, “సీమోనూ! నీవేమంటావు? రాజులు సుంకాలు, పన్నులు ఎవర్నుండి సేకరిస్తారు? తమ స్వంత కుమారుల నుండా? లేక యితర్లనుండా?” అని అడిగాడు.
26 “ఇతర్లనుండి” అని పేతురు సమాధానం చెప్పాడు.
యేసు, “అలాగయితే కుమారులు చెల్లించవలసిన అవసరం లేదన్న మాటేగా! 27 కాని వాళ్ళకాటంకం కలిగించటం నాకిష్టం లేదు. సరస్సు దగ్గరకు వెళ్ళి గాలం వెయ్యి! మొదట పట్టుకొన్న చేప నోటిని తెరిచి చూస్తే నీకు నాలుగు ద్రాక్మాల[a] నాణెం కనబడుతుంది. దాన్ని తీసుకువెళ్ళి నా పక్షాన, నీ పక్షాన వాళ్ళకు చెల్లించు!” అని అన్నాడు.
© 1997 Bible League International