Old/New Testament
యాజకుల నియామకం, వేడుక
29 “అహరోను, అతని కుమారులు యాజకులుగా ఒక ప్రత్యేక విధానంలో నన్ను సేవిస్తున్నారని తెలియజేసేందుకు నీవు చేయాల్సిన దానిని యిప్పుడు నీకు నేను చెబుతాను. ఒక గిత్తను, కళంకం లేని రెండు పొట్టేళ్లను సంపాదించు. 2 తర్వాత పులియజేసే పదార్థంలేని సన్నని గోధుమ పిండితో రొట్టె చేయాలి. ఒలీవ నూనెతో కలిపి చేసే రొట్టెలకు గూడ అవే వస్తువులు ఉపయోగించాలి. నూనెతో కలిపి చిన్న చిన్న పల్చటి అప్పడాలు చేయాలి. 3 ఈ రొట్టెలు, అప్పడాలు ఒక బుట్టలో పెట్టాలి. ఆ బుట్టను అహరోనుకు, అతని కుమారులకు ఇవ్వాలి. అదే సమయంలో గిత్తను రెండు పొట్టేళ్లను కూడ వారికి ఇవ్వాలి.
4 “తర్వాత అహరోనును అతని కుమారులను సన్నిధి గుడారం ముందటి ద్వారం దగ్గరకు తీసుకు రావాలి. నీళ్లతో వాళ్లకు స్నానం చేయించాలి. 5 అహరోనుకు అతని చొక్కా తొడిగించాలి. ప్రత్యేక ఏఫోదుతో వుండే అంగీని అతనికి ధరింపజేయాలి. అప్పుడు ఏఫోదును, న్యాయతీర్పు పైవస్త్రాన్ని అతనికి కట్టాలి. అందమైన దట్టీని అతనికి కట్టాలి. 6 తర్వాత అతని తలమీద తలపాగ చుట్టాలి. ప్రత్యేక కిరీటాన్ని బంగారు బద్ద తలపాగా చుట్టూరా ఉంచాలి. 7 అభిషేక తైలము తీసుకొని అతని తలమీద పోయాలి. అహరోను ఈ పనికి ఏర్పరచబడ్డాడని ఇది సూచిస్తుంది.
8 “తర్వాత అతని కుమారులను అక్కడికి తీసుకురావాలి. వారికి తెల్ల అంగీలు ధరింపజేయాలి. 9 అప్పుడు వారి నడుములకు దట్టీలు చుట్టాలి. ధరించేందుకు ప్రత్యేక టోపీలను వారికి ఇవ్వాలి. వారు యాజకులుగా ఉండడం అప్పుడు ప్రారంభం అవుతుంది. శాశ్వతంగా కొనసాగే ప్రత్యేక చట్టంవల్ల వారు యాజకులుగా ఉంటారు. ఈ విధంగా అహరోనును, అతని కుమారులను నీవు యాజకులుగా చేయాలి.
10 “తర్వాత సన్నిధి గుడారం ఎదుటకు గిత్తను తీసుకురావాలి. అహరోను, అతని కుమారులు ఆ గిత్త తల మీద వారి చేతులు పెట్టాలి, 11 “అప్పుడు ఆ సన్నిధి గుడారం ఎదుట ఆ గిత్తను చంపాలి. దీనిని యెహోవా చూస్తాడు. 12 అప్పుడు గిత్త రక్తంలో కొంత తీసుకొని బలిపీఠం దగ్గరకు వెళ్లాలి. బలిపీఠం కొమ్ముల మీద నీ వేళ్లతో కొంచెం రక్తం చిలకరించాలి. మిగిలిన రక్తం అంతా బలిపీఠం అడుగున కుమ్మరించాలి. 13 తర్వాత గిత్త లోపలి కొవ్వు అంతా తీయాలి. కాలేయంలో కొవ్విన భాగాన్ని రెండు మూతగ్రంథులను వాటి చుట్టూ ఉండే కొవ్వును తీసి బలిపీఠం మీద దహించాలి. 14 తర్వాత గిత్త మాంసం, చర్మం, ఇతర భాగాలు తీసుకొని మీ పాళెము వెలుపటికి వెళ్లాలి. అక్కడ, పాళెము వెలుపల వీటిని కాల్చివేయాలి. ఇది యాజకుల పాపాలను తీసివేయు అర్పణ.
15 “తర్వాత పొట్టేళ్లలో ఒకదాని తలమీద తమ చేతులు పెట్టమని అహరోనుకు, అతని కుమారులకు చెప్పు. 16 అప్పుడు ఆ పొట్టేలును చంపి ఆ రక్తం భద్రం చేయాలి. ఆ రక్తాన్ని బలిపీఠం నలువైపుల వెదచల్లాలి. 17 అప్పుడు పొట్టేలును ముక్కలు ముక్కలుగా కోయాలి. పొట్టేలు లోపలి భాగాలను కాళ్లను కడగాలి. వీటిని పొట్టేలు తల ఇతరభాగాలతో కలిపి పెట్టాలి. 18 అప్పుడు ఆ మొత్తాన్ని బలిపీఠం మీద దహించి వేయాలి. ఇది దహించబడ్డ దహన బలి. ఇది యెహోవాకు అర్పించబడింది. యెహోవా అర్పణను వాసన చూస్తాడు. అది ఆయనకు ఎంతో ప్రీతికరంగా ఉంటుంది. ఇది నిప్పు ఉపయోగించి యెహోవాకు అర్పించే అర్పణ.
19 “ఇంకో పొట్టేలు మీద వారి చేతులు వుంచమని అహరోనుకు, అతని కుమారులకు చెప్పు. 20 ఆ పొట్టేలును చంపి, దాని రక్తం భద్రం చేయాలి. అహరోనుకు, అతని కుమారులకు వారి కుడి చెవి కొనల మీద ఆ రక్తం చల్లాలి. ఇంక వారి కుడి చేతుల బొటన వేళ్ల మీద కొంత రక్తం ఉంచాలి. వారి కుడి పాదాల బొటన వేళ్లపై మరికొంత రక్తం ఉంచాలి. అప్పుడు బలిపీఠం మీద నాల్గువైపులా రక్తం చల్లాలి. 21 తర్వాత బలిపీఠం నుండి కొంత రక్తం తీసుకోవాలి. ప్రత్యేక తైలంతో దాన్ని కలిపి, అహరోను మీద, అతని బట్టల మీద దాన్ని చల్లాలి. ఆయన కుమారుల మీద, వారి బట్టల మీద దాన్ని చల్లాలి, అహరోను, అతని కుమారులు ఒక ప్రత్యేక విధానంలో నన్ను సేవిస్తున్నారని ఇది సూచిస్తుంది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే, వారి బట్టలు ఉపయోగించబడుతాయని ఇది సూచిస్తుంది.
22 “అప్పుడు పొట్టేలు నుండి కొవ్వును తీయాలి. (అహరోనును ప్రధాన యాజకునిగా చేసే ఆచార క్రమంలో ఉపయోగించబడే పొట్టేలు ఇది). తోక చుట్టూ ఉండే క్రొవ్వును, శరీరం లోపలి భాగాలను కప్పివుండే కొవ్వును తీయాలి. కాలేయంలో క్రొవ్విన భాగాన్ని తీయాలి. మూతగ్రంధులు రెండింటిని, కుడి కాలును తీయాలి. 23 పులియని పదార్థం లేకుండా నీవు చేసిన రొట్టెలు గల బుట్టను తీసుకొని యెహోవా ముందు పెట్టాలి. బుట్టలోని రొట్టె ఒకటి, ఒలీవ నూనెతో చేసిన రొట్టె ఒకటి, పలుచని చిన్న అప్పడం ఒకటి బుట్టలో నుండి బయటికి తీయాలి. 24 అప్పుడు వీటిని అహరోనుకు, అతని కుమారులకు ఇవ్వు. యెహోవా యెదుట వీటిని తమ చేతులతో పట్టుకొని ఉండమని వారితో చెప్పు. ఇది యెహోవాకు ప్రత్యేకమైన అర్పణ. 25 అప్పుడు అహరోను, అతని కుమారుల చేతుల్లోనుంచి వీటిని తీసుకొని, పొట్టేలుతో బాటు బలిపీఠం మీద పెట్టు. యెహోవా ఈ దహనబలి అర్పణ వాసన చూసి ఆనందిస్తాడు. ఇది నిప్పు ఉపయోగించి యెహోవాకు ఇచ్చే అర్పణ.
26 “అప్పుడు పొట్టేలుయొక్క బోరను తీసుకోవాలి. (ఇది అహరోను ప్రధాన యాజకునిగా చేసే ఆచార క్రమంలో ఉపయోగించే పొట్టేలు). పొట్టేలు బోరను యెహోవా సన్నిధిలో ఇచ్చి పుచ్చుకొనే ప్రత్యేక అర్పణగా అర్పించాలి. జంతువుల్లోని ఈ భాగం నీది. 27 అప్పుడు అహరోనును ప్రధాన యాజకునిగా చేయుటకు ఉపయోగించి పొట్టేలు రొమ్ము, కాలు తీసుకో, వాటిని అహరోనుకు, అతని కుమారులకు ఇయ్యి. ఇది అర్పణలో ఒక ప్రత్యేక భాగం అవుతుంది. 28 ఇశ్రాయేలు ప్రజలు ఈ భాగాలను అహరోనుకు, అతని కుమారులకు ఎల్లప్పుడూ ఇస్తూ ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు అర్పణ అర్పించినప్పుడల్లా ఈ భాగాలు ఎప్పుడూ యాజకులకే చెందుతాయి. ఈ భాగాలను వారు యాజకులకు ఇచ్చినప్పుడు అవి యెహోవాకు ఇచ్చినట్టే అవుతుంది.
29 “అహరోను తయారు చేసిన ఆ ప్రత్యేక వస్త్రాలను భద్రం చేయాలి. అతని తర్వాత జీవించే వారందరికీ ఈ వస్త్రాలు చెందుతాయి. వారు యాజకులుగా ఏర్పాటు చేయబడినప్పుడు ఈ వస్త్రాలు ధరిస్తారు. 30 అహరోను తర్వాత అతని కుమారుడు ప్రధాన యాజకుడు అవుతాడు. ఈ కుమారుడు పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేసేందుకు సన్నిధి గుడారంలోనికి వచ్చినప్పుడు ఆ వస్త్రాలు ధరిస్తాడు.
31 “అహరోనును ప్రధాన యాజకునిగా చేసేందుకు ఉపయోగించిన పొట్టేలు మాంసాన్ని ఒక పవిత్ర స్థలంలో వండాలి. 32 అప్పుడు అహరోను, అతని కుమారులు సన్నిధి గుడారం ఎదుటి ద్వారం ముందు ఆ మాంసం తినాలి. మరియు బుట్టలోని రొట్టెను కూడ వారు తినాలి. 33 వారు యాజకులుగా చేయబడ్డప్పుడు వారి పాపాలను పరిహరించేందుకు ఈ అర్పణలు ఉపయోగించబడ్డాయి. ఇప్పుడు వారు ఈ అర్పణలను తినాలి. 34 ఆ పొట్టేలు మాంసంలోగాని, ఆ రొట్టెలోగాని ఏమైనా మర్నాటి ఉదయానికి మిగిలి ఉంటే దానిని కాల్చివేయాలి. ఆ రొట్టె, మాంసం ఒక ప్రత్యేక సమయంలో, ఒక ప్రత్యేక విధానంలో మాత్రమే తినవలసినవి గనుక మీరు వాటిని తినకూడదు.
35 “అహరోను, అతని కుమారులకోసం నీవు చేయాలని నేను నీకు ఆజ్ఞాపించిన వీటన్నింటినీ నీవు చేయాలి. వీటిని ఏడురోజుల వ్యవధిలో నీవు చేయాలి. 36 రోజుకు ఒక ఎద్దు చొప్పున ఏడు రోజులు వధించాలి. ఇది అహరోను, అతని కుమారుల పాపముకోసం అర్పణగా ఉంటుంది. బలిపీఠాన్ని పవిత్రం చేసేందుకు నీవు ఈ బలులను ఉపయోగించాలి. బలిపిఠాన్ని పవిత్రం చేసేందుకు దాని మీద ఒలీవ నూనెపోయాలి. 37 ఏడురోజుల పాటు బలిపీఠాన్ని నీవు పవిత్రం చేయాలి. ఆ సమయంలో బలిపీఠం అతిపవిత్రం అవుతుంది.
38 “బలిపీఠం మీద ప్రతిరోజూ ఒక అర్పణ అర్పించాలి. ఒక సంవత్సరం వయస్సుగల రెండు గొర్రె పిల్లల్ని వధించాలి. 39 ఒక గొర్రెపిల్లను ఉదయం, మరో గొర్రెపిల్లను సాయంత్రం అర్పించాలి. 40 మొదటి గొర్రెపిల్లను నీవు వధించినప్పుడు పదవవంతు సన్నటి గోధుమ పిండిని ఒక పావు ద్రాక్షారసంతో కలిపి అర్పణగా చేయాలి. ఉదయం చేసినట్టే సాయంత్రం రెండో గొర్రెపిల్లను వధించినప్పుడు కూడ పదవవంతు సన్నని పిండిని అర్పించాలి. ఒక పావు ద్రాక్షారసం అర్పించాలి. 41 ఇది యెహోవాకు భోజన అర్పణం అవుతుంది. ఈ అర్పణ నీవు దహించినప్పుడు, యెహోవా దీని సునాసనను చూసి ఆనందిస్తాడు.
42 “ప్రతిరోజూ యెహోవాకు అర్పణగా వీటిని నీవు దహించాలి. సమావేశ గుడారం ముందు ద్వారం దగ్గర, యెహోవా ఎదుట వీటిని చేయాలి. ఇలానే ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. నీవు అర్పణ అర్పించునప్పుడు, యెహోవానైన నేను నిన్ను అక్కడ కలుసుకొని నీతో మాట్లాడుతాను. 43 ఆ స్థలంలో నేను ఇశ్రాయేలు ప్రజల్ని కలుసుకొంటాను. నా మహిమవల్ల ఆ స్థలం పవిత్ర పర్చబడుతుంది.
44 “కనుక సన్నిధి గుడారాన్ని నేను పవిత్రం చేస్తాను. మరియు బలిపీఠాన్ని నేను పవిత్రం చేస్తాను. అహరోను, అతని కుమారులు నాకు యాజకులుగా సేవ చేయగలిగేటట్టు నేను వారిని పవిత్రం చేస్తాను. 45 నేను ఇశ్రాయేలు ప్రజలతో నివసిస్తాను. నేను వారికి దేవుడిగా ఉంటాను. 46 ‘నేనే యెహోవాను, వారి దేవుడ్ని’, అని ప్రజలు తెలుసుకొంటారు. నేను వారితో నివసించేందుకు వారిని ‘ఈజిప్టునుండి బయటికి రప్పించింది నేనే’ అని వారు తెలుసుకొంటారు. నేనే వారి దేవుడైన యెహోవాను.”
ధూప పీఠం
30 “తుమ్మ కర్రతో ఒక వేదిక చేయి. ధూపం వేసేందుకు ఈ పీఠమును నీవు ఉపయోగించాలి. 2 వేదికను 18 అంగుళాలు పొడవు, 18 అంగుళాలు వెడల్పు గల చతురస్రముగా నీవు చేయాలి. దీని ఎత్తు 36 అంగుళాలు ఉండాలి. నాలుగు మూలల కొమ్ములు ఉండాలి. ఈ కొమ్ముల్ని వేదికతో కలిపి ఒకటిగా చేయాలి. 3 బలిపీఠం పైభాగాన్ని, అన్ని ప్రక్కలను స్వచ్ఛమైన బంగారం పొదిగించాలి. బలిపీఠం చుట్టూ బంగారు నగిషిబద్ద పెట్టాలి. 4 నగిషీబద్ద అడుగు భాగాన బంగారు ఉంగరాలు నాలుగు ఉండాలి. ఈ బలిపీఠానికి ఎదురుగా రెండు బంగారు ఉంగరాలు ఉండాలి. బలిపీఠం మోసే కర్రలకోసం ఈ బంగారు ఉంగరాలు ఉపయోగించబడతాయి. 5 తుమ్మకర్రతోనే ఆ కర్రలు చేయాలి. కర్రలకు బంగారు తాపడం చేయాలి. 6 ప్రత్యేక తెరముందు ఈ బలిపీఠాన్ని ఉంచాలి. ఒడంబడిక పెట్టెను తెర అవతల ఉంచాలి. ఆ పెట్టె మూతకు ముందర బలిపీఠం ఉంచాలి. నేను నిన్ను కలుసుకోనే చోటు ఇదే.
7 “ప్రతీ ఉదయం పరిమళ ద్రవ్యాల ధూపాన్ని బలిపీఠం మీద అహరోను వేయాలి. దీపాలు సరిచేసేందుకు వచ్చినప్పుడు అతడు దీనిని చేయాలి. 8 మరల సాయంత్రం అతడు ధూపం వేయాలి. ఇది అతడు సాయంత్రం దీపాలను సరిచేసే వేళ. కనుక ప్రతిరోజూ శాశ్వతంగా యెహోవా ఎదుట ధూపం వేయబడుతుంది. 9 ఇంకే విధమైన ధూపం వేసేందుకు గాని, దహన బలి కోసంగాని ఈ బలిపీఠాన్ని ఉపయోగించవద్దు. ఏ విధమైన ధాన్యార్పణగాని, పానార్పణంగాని అర్పించేదుకు ఈ బలిపీఠాన్ని ఉపయోగించవద్దు.
10 “సంవత్సరానికి ఒక సారి అహరోను యెహోవాకు ఒక ప్రత్యేక బలి అర్పించాలి. ప్రజల పాప పరిహారం నిమిత్తం చెల్లించేందుకు పాపపరిహారార్థ బలి రక్తాన్ని అహరోను ఉపయోగించాలి. ఈ బలిపీఠపు కొమ్ముల దగ్గర అహరోను దీనిని చేయాలి. ఇది, ప్రాయశ్చిత్తార్థ దినం అని పిలువబడుతుంది. ఇది యెహవాకు అతి ప్రత్యేక దినం.”
ఆలయ పన్ను
11 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు, 12 “ఎంత మంది ప్రజలు ఉన్నారో నీకు తెలిసేటట్టు, ఇశ్రాయేలు ప్రజల్ని లెక్కబెట్టు. ఇలా చేసినప్పుడల్లా, ప్రతి వ్యక్తి తనకోసం యెహోవాకు క్రయధనం చెల్లించాలి. ప్రతి వ్యక్తి ఇలా చేస్తే ఏ విధమైన దారుణం ప్రజలకు సంభంవిచదు. 13 లెక్కించబడ్డ ప్రతి మనిషి అరతులం చెల్లించాలి. (ఇది అధికార పూర్వకమైన తులంలో సగం, అధికార తులం అంటే 20 గొర్రెలు). ఈ అరతులం యెహోవాకు అర్పణం. 14 లెక్కించబడి, 20 సంవత్సరాలు లేక అంతకు ఎక్కువ వయసుగల ప్రతి వ్యక్తి యెహోవాకు ఈ అర్పణ చెల్లించాలి. 15 ధనికులు అరతులం కంటె ఎక్కువ చెల్లించకూడదు. ప్రజలందరూ ఒకే అర్పణ యెహోవాకు చెల్లించాలి. ఇది మీ ప్రాణం కోసం చెల్లించే అర్పణ. 16 ఇశ్రాయేలు ప్రజల దగ్గర్నుండి ఈ సొమ్ము పోగుచేయి. సన్నిధి గుడారంలో సేవకోసం ఈ సొమ్ము ఉపయోగించు. యెహోవా తన ప్రజలను జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఈ చెల్లింపు ఒక విధానం. వారు తమ స్వంత ప్రాణాల నిమిత్తం చెల్లిస్తారు.”
కడుగుకొనేందుకు గంగాళం
17 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు, 18 “ఇత్తడి గంగాళం[a] ఒకటి చేసి ఇత్తడి పీటమీద దాన్ని పెట్టు. కడుగుకొనేందుకు నీవు దీనిని ఉపయోగించాలి. సన్నిధి గుడారానికి, బలిపీఠానికి మధ్య దీనిని ఉంచి, నీళ్లతో నింపు. 19 ఈ గంగాళంలోని నీళ్లతో అహరోను, అతని కుమారులు వారి కాళ్లు చేతులు కడుక్కోవాలి 20 సన్నిధి గుడారం ప్రవేశించేటప్పుడు, లేక బలిపీఠం సమీపించేటప్పుడు ప్రతిసారీ వారు నీళ్లతో కడుక్కోవాలి. ఈ విధంగా వారు మరణించరు. 21 మరియు తాము చావకుండా ఉండేందుకు వారు తమ కాళ్లు చేతులు కడుక్కోవాలి. అహరోనుకు, అతని ప్రజలకు ఎప్పటికీ కొనసాగే చట్టం యిది. భవిష్యత్తులో జీవించే అహరోను సంతతి వాళ్లందరికీ యిది కొనసాగుతుంది.”
అభిషేక తైలం
22 అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 23 “శ్రేష్ఠమైన సుగంధద్రవ్యాలు సంపాదించు. పరిమళ ధూపం చేయడానికి 500 తులాల స్వచ్ఛమైన గోపరసం, 250 తులాల సువాసనగల లవంగపట్ట, 500 తులాల సుగంధ ద్రవ్యాలు, 24 500 తులాల లవంగపట్ట తీసుకో. వీటన్నింటినీ కొలిచేందుకు అధికారిక కొలత ఉపయోగించు. మరియు మూడు పళ్ల ఒలీవ నూనె తీసుకో.
25 “ఒక పరిమళ అభిషేక తైలంగా చేయటానికి వీటన్నింటినీ కలపాలి. 26 సన్నిధి గుడారం మీద, ఒడంబడిక పెట్టె మీద ఈ తైలం పోయి, వీటికి ఒక ప్రత్యేక ఉద్దేశం వుంది అని ఇది తెలియజేస్తుంది. 27 బల్లమీద, దానిమీద ఉన్న పాత్రలన్నింటిమీద తైలం పోయి. దీపం మీద, దాని పరికరాలన్నింటి మీద ఈ తైలం పోయి. ధూపవేదిక మీద తైలం పోయి. 28 ఇంకా దేవునికి అర్పణలు దహనం చేసే బలిపీఠం మీద ఈ తైలం పోయి. ఆ బలిపీఠం పైన ఉండే సమస్తం మీద ఈ తైలం పోయి. గంగాళంమీద, దాని పీటమీద ఈ తైలం పోయి. 29 వీటన్నింటినీ నీవు పవిత్రం చేయాలి. అవి యెహోవాకు చాల ప్రత్యేకం. వీటిని ఏది తాకినా అది పవిత్రం అవుతుంది.
30 “అహరోను, అతని కుమారుల మీద ఈ తైలంపోయి. వారు ఒక ప్రత్యేక విధానంలో నన్ను సేవిస్తున్నారని ఇది తెలియజేస్తుంది. అప్పుడు యాజకులుగా వారు నా సేవ చేయవచ్చు. 31 అభిషేక తైలం ఎల్లప్పుడు నాకు ప్రత్యేకమైనదిగా ఉంటుందని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు. 32 సామాన్యమైన సుగంధ తైలంగా ఎవరూ దీనిని వాడకూడదు. ఈ ప్రత్యేక తైలం తయారు చేసిన విధానంలో సుగంధ తైలం తయారు చేయకూడదు. ఈ తైలం పవిత్రం, ఇది మీకు చాల ప్రత్యేకమైనదిగా ఉండాలి. 33 ఎవరైనా ఈ పవిత్ర తైలం వలె సుగంధ తైలం తయారు చేసి అన్యునికి యిస్తే, ఆ వ్యక్తి తన ప్రజల్లో నుండి వేరు చేయబడాలి.”
ధూపం
34 అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు, “ఈ పరిమళ ద్రవ్యాలను తీసుకురా! జటామాంసి, గోపి చందనం, గంధపుచెక్క స్వచ్ఛమైన సాంబ్రాణి. ఈ పరిమళ ద్రవ్యాలన్నీ సమపాళ్లలో ఉండేటట్టు తప్పక చూడాలి. 35 సుగంధ పరిమళ ధూపంగా ఉండేటట్టు ఈ పరిమళ ద్రవ్యాలన్నిటినీ కలపాలి. పరిమళ తైలం తయారుచేసే వాడు చేసినట్టే దీనిని చేయాలి. మరియు ఈ ధూపంలో ఉప్పు కలుపు. అది దీనిని స్వచ్ఛమైనదిగా, ప్రత్యేకమైనదిగా చేస్తుంది. 36 ధూప ద్రవ్యంలో కొంత మెత్తటి పొడుం అయ్యేంత వరకు నూరాలి. సన్నిధి గుడారంలో, ఒడంబడిక పెట్టె ఎదుట ఆ పొడుం ఉంచు. ఇది నేను నిన్ను కలుసుకొనే చోటు. ఈ ధూపపు పొడుంను దాని ప్రత్యేక పని కోసమే నీవు ఉపయోగించాలి. 37 యెహోవా కోసం ఈ ప్రత్యేక విధానంలో మాత్రమే నీవు ఈ ధూపాన్ని ఉపయోగించాలి. ఈ ధూపాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో నీవు తయారు చేయాలి. ఇంక ఏ యితరమైన ధూపం చేయడానికి కూడ ఈ ప్రత్యేక పద్ధతిని వినియోగించవద్దు. 38 ఒక వ్యక్తి, తన కోసం ఈ ధూపం కొంత తయారు చేసి, దాని పరిమళాన్ని అనుభవించాలని కోరవచ్చు. అయితే, అతడు గనుక అలా చేస్తే, వాడు తన ప్రజల నుండి వేరు చేయబడాలి.”
యూదా నాయకులు యేసు అధికారాన్ని సందేహించటం
(మార్కు 11:27-33; లూకా 20:1-8)
23 యేసు మందిరానికి వెళ్ళి బోధిస్తుండగా ప్రధాన యాజకులు, పెద్దలు వచ్చి, “ఏ అధికారంతో నీవు ఈ పనులు చేస్తున్నావు? నీకి అధికారం ఎవరిచ్చారు?” అని అడిగారు.
24 యేసు సమాధానం చెబుతూ, “నేను కూడా మిమ్మల్నొక ప్రశ్న అడుగుతాను. మీరు దానికి సమాధానం చెబితే నేను ఇది ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెబుతాను. 25-26 బాప్తిస్మమివ్వమని యోహానును ఎవరు పంపారు? దేవుడా? మానవులా?” అని అడిగాడు.
వాళ్ళు, “‘దేవుడు’ అని సమాధానం చెబితే మరి అలాగైతే అతణ్ణి ఎందుకు నమ్మలేదు? అని అంటాడు ‘మానవులు’ అని సమాధానం ఇస్తే ప్రజలందరూ యోహాను ఒక ప్రవక్త అని నమ్మేవాళ్ళు కనుక వాళ్ళు ఏం చేస్తారో” అనే భయంతో పరస్పరం మాట్లాడుకొన్నారు.
27 అందువల్ల వాళ్ళు, “మాకు తెలియదు” అని సమాధానం చెప్పారు.
ఆయన, “నేను కూడా ఎవరిచ్చిన అధికారంతో యివి చేస్తున్నానో మీకు చెప్పను” అని అన్నాడు.
తండ్రి మాట పాలించిన కుమారుని ఉపమానం
28 “ఆలోచించి సమాధానం చెప్పండి. ఒకనికి యిద్దరు కుమారులుండేవాళ్ళు. అతడు మొదటి కుమారుని దగ్గరకు వెళ్ళి, ‘నాయనా! వెళ్ళి ఈ రోజు ద్రాక్షతోటలో పనిచెయ్యి!’ అని అన్నాడు.
29 “కుమారుడు, ‘నాకిష్టంలేదు’ అని సమాధానం చెప్పాడు. కాని తదుపరి తన మనస్సు మార్చుకొని పని చెయ్యటానికి వెళ్ళాడు.
30 “తండ్రి రెండవ కుమారునికి అదే విషయం చెప్పాడు. రెండవ కుమారుడు ‘వెళ్తానండి’ అని అన్నాడు. కాని వెళ్ళలేదు.
31 “ఆ యిద్దరిలో తండ్రి మాటను ఎవరు పాటించారు? అని యేసు అడిగాడు.”
“మొదటి వాడు” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, “నేను మీకు సత్యం చెబుతున్నాను. సుంకరులు, వేశ్యలు మీకన్నా ముందు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు. 32 మీకు నీతిమార్గాన్ని చూపటానికి యోహాను వచ్చాడు. మీరతణ్ణి నమ్మలేదు. కాని సుంకరులు, వేశ్యలు ఆయన్ని విశ్వసించారు. ఇది చూసాక కూడా మీరు మారుమనస్సు పొందలేదు, విశ్వసించలేదు.
రైతుల ఉపమానం
(మార్కు 12:1-12; లూకా 20:9-19)
33 “ఇంకొక ఉపమానాన్ని వినండి. ఒక ఆసామి ఉండేవాడు. అతడు ఒక ద్రాక్షతోట నాటాడు. చుట్టూ ఒక గోడ కట్టించి ద్రాక్షరసాన్ని తీయటానికి ఒక గానుగను, తొట్టిని కట్టించాడు. కావలి కాయటానికి ఒక కంచె వేయించాడు. ఆ తర్వాత ఆ ద్రాక్షతోటను కొంతమంది రైతులకు కౌలుకిచ్చి ప్రయాణమై వెళ్ళిపోయాడు. 34 కోతకాలం కాగానే తన సేవకుల్ని ఆ రైతుల దగ్గరకు పంపి తన భాగం తీసుకు రమ్మన్నాడు.
35 “ఆ రైతులు, ఆ సేవకుల్ని పట్టుకొని వాళ్ళలో ఒకణ్ణి కొట్టారు. మరొకణ్ణి చంపారు. మూడవవాణ్ణి రాళ్ళతో కొట్టి చంపారు. 36 ఆ ఆసామి ఈ సారి మొదటి కన్నా యింకా ఎక్కువ మంది సేవకుల్ని పంపాడు. కాని ఆ రైతులు వాళ్ళ పట్ల కూడా అదే విధంగా ప్రవర్తించారు. 37 ఆ ఆసామి ‘నా కుమారుణ్ణి వాళ్ళు గౌరవించవచ్చు!’ అని అనుకొని చివరకు తన కుమారుణ్ణి వాళ్ళ దగ్గరకు పంపాడు.
38 “కాని ఆ రైతులు అతని కుమారుణ్ణి చూసి, ‘ఇతడు వంశోద్ధారకుడు. రండి! ఇతణ్ణి చంపేసి అతని ఆస్థిని తీసుకొందాం’ అని పరస్పరం మాట్లాడుకొన్నారు. 39 ఆ తర్వాత కుమారుణ్ణి పట్టుకొని చంపి ద్రాక్షతోటకవతల పారవేసారు.
40 “మరి ఆ ద్రాక్షతోట యజమాని తిరిగి వచ్చాక ఆ రైతుల్ని ఏమి చేస్తాడంటారు?”
41 వాళ్ళు, “ఆ దుష్టుల్ని ఘోరంగా చంపేస్తాడు. ఆ తదుపరి పంట కాలంలో తన భాగాన్ని తనకిచ్చే రైతులకు ఆ ద్రాక్షతోటను కౌలుకిస్తాడు” అని సమాధానం చెప్పారు.
42 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “లేఖనాల్లో మీరీ విషయం ఎన్నడూ చదువలేదా?
‘ఇల్లు కట్టువాళ్ళు తృణీకరించిన రాయి ముఖ్యమైన రాయి అయింది.
ఇది ప్రభువు చేసాడు. ఆ రాయి మన కండ్లకు ఆశ్చర్యంగా కనబడుతుంది!’(A)
43 “అందువల్ల నేను చెప్పేదేమిటంటే దేవుడు తన రాజ్యాన్ని మీ నుండి తీసికొని, ఆ రాజ్యానికి తగిన విధంగా ప్రవర్తించే వాళ్ళకు యిస్తాడు. 44 ఈ బండ మీద పడ్డవాడు ముక్కలై పోతాడు. ఎవని మీద ఈ బండ పడ్తుందో అతడు నలిగి పోతాడు.”
45 ప్రధాన యాజకులు, పరిసయ్యులు యేసు చెప్పిన ఉపమానం విని ఆయన తమను గురించి మాట్లాడుతున్నట్టుగా గ్రహించారు. 46 వాళ్ళు ఆయన్ని బంధించటానికి మార్గాన్ని వెతికారు. కాని ప్రజలు ఆయన్ని ఒక ప్రవక్త అని అనుకొనే వాళ్ళు కనుక వాళ్ళు ప్రజల్ని చూసి భయపడి పోయారు.
© 1997 Bible League International