M’Cheyne Bible Reading Plan
పవిత్రమైన వస్తువులకొరకు బహుమానాలు
25 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 2 “నాకు కానుకలు తీసుకు రమ్మని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు. నాకు ఇవ్వాల్సింది ఏమిటి? ప్రతి మనిషి తన హృదయంలో తీర్మానించుకోవాలి. నా కోసం ఈ కానుకల్ని స్వీకరించు. 3 ప్రజల దగ్గర్నుండి నీవు స్వీకరించాల్సిన వాటి జాబితా యిది: బంగారం, వెండి, కంచు, 4 నీలం వస్త్రం, ఊదారంగు వస్త్రం, ఎరుపు వస్త్రం, మేలిమి వస్త్రం, మేక బొచ్చు, 5 గొర్రె చర్మాలు, మేలురకం తోళ్లు, తుమ్మకర్ర 6 దీపాలకు నూనె, ధూపం. ప్రత్యేక అభిషేక తైలానికి[a] సువాసన చేకూర్చే పరిమళ వస్తువులు, 7 ఇంకా లేత పచ్చరాళ్లు, ఏఫోదు[b] మీద లేక న్యాయ తీర్పుపై వస్త్రం మీద పొదిగించడానికి విలువైన రాళ్లు.”
పవిత్ర గుడారం
8 (ఇంకా దేవుడు ఇలా అన్నాడు): “నా కోసం ప్రజలు ఒక పవిత్ర స్థలాన్ని నిర్మిస్తారు. అప్పుడు నేను వారి మధ్య నివసిస్తాను. 9 పవిత్ర గుడారం ఎలా ఉండాలో నేను మీకు చూపిస్తాను. దానిలో ఏమేమి వస్తువులు ఎలా ఉండాలో నేను మీకు చూపిస్తాను. సరిగ్గా నేను నీకు చూపించినట్టు ఒడంబడిక పెట్టె తయారు చెయ్యి.
ఒడంబడిక పెట్టె (మందసము)
10 “తుమ్మకర్ర ఉపయోగించి ఒక ప్రత్యేక పెట్టె తయారు చెయ్యి. ఈ పెట్టె పొడవు 45 అంగుళాలు, వెడల్పు 27 అంగుళాలు, ఎత్తు 27 అంగుళాలు ఉండాలి. 11 ఆ పెట్టెలోపల, బంగారు రేకుతో పెట్టెను కప్పాలి. ఆ పెట్టె చుట్టూ అంచుల మీద బంగారపు నగిషీబద్ద పెట్టాలి. 12 ఆ పెట్టె చుట్టూ మోసేందుకు నాలుగు బంగారు ఉంగరాలను తయారు చెయ్యాలి. ఆ పెట్టెకు ఒక్కోపక్క రెండేసి చొప్పున నాలుగు మూలలా ఆ ఉంగరాలను అమర్చాలి. 13 తర్వాత పెట్టెను మోసేందుకు కర్రలను తయారు చేయాలి. ఈ కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారం పొదిగించాలి. 14 ఆ పెట్టె మూలల్లో ఉన్న ఉంగరాల గుండా ఆ కర్రలను పెట్టాలి. ఆ పెట్టెను మోసేందుకు ఈ కర్రలను ఉపయోగించాలి. 15 ఈ కర్రలు ఎప్పుడూ వాటి ఉంగరాల్లోనే ఉండాలి. కర్రలను బయటికి తియ్యవద్దు.”
16 దేవుడు అన్నాడు: “నేను ఒడంబడికను[c] నీకు ఇస్తాను. ఆ ఒడంబడికను ఈ పెట్టెలో పెట్టు. 17 ఆ పెట్టెకు ఒక మూత[d] చెయ్యాలి. స్వచ్ఛమైన బంగారంతో దీన్ని చెయ్యాలి. 45 అంగుళాల పొడవు, 27 అంగుళాల వెడల్పుతో దీన్ని చెయ్యాలి. 18 తర్వాత రెండు బంగారు కెరూబు దూతలను చేసి ఆ మూతకు రెండుకొనల మీద పెట్టాలి. కొట్టిన బంగారంతో ఈ దూతల్ని చేయాలి. 19 ఆ మూతకు ఒక కొనమీద ఒక దూతను, మరో కొనమీద మరో దూతను ఉంచాలి. మూత, దూతలు అంతా ఒకే వస్తువుగా చేయాలి. 20 కెరూబులు ఒకదానికి ఎదురుగా ఇంకొకటి ఉండాలి. ఆ దూతల ముఖాలు మూత వైపుకు చూస్తూ ఉండాలి. ఆ కెరూబుల రెక్కలు మూతను అవరించి ఉండాలి. ఆ కెరూబుల రెక్కలు ఆకాశం వైపు ఎత్తబడి ఉండాలి.
21 “ఒడంబడిక రుజువు నేనే మీకిచ్చాను. ఆ ఒడంబడికను పెట్టెలో పెట్టి, ప్రత్యేక మూతను పెట్టెమీద పెట్టాలి. 22 నేను నిన్ను కలుసుకొనేటప్పుడు ఆ ఒడంబడిక పెట్టె ప్రత్యేక మూత మీద ఉన్న కెరూబు దూతల మధ్యనుండి నేను మాట్లాడుతాను. అక్కడినుండే నేను నా ఆజ్ఞలన్నింటినీ ఇశ్రాయేలు ప్రజలకు యిస్తాను.
రొట్టెల బల్ల
23 “తుమ్మ కర్రతో ఒక బల్ల తయారు చెయ్యాలి. ఈ బల్ల పొడవు 36 అంగుళాలు, వెడల్పు 18 అంగుళాలు, ఎత్తు 27 అంగుళాలు ఉండాలి. 24 బల్లను స్వచ్ఛమైన బంగారంతో కప్పాలి. దాని చుట్టూ బంగారపు నగిషీబద్ద పెట్టాలి. 25 తర్వాత 4 అంగుళాల బంగారు నగీషీ బద్దను బల్ల చుట్టూ చేయాలి. ఇది కూడ స్వచ్ఛమైన బంగారంతో చేయాలి. 26 అప్పుడు నాలుగు బంగారు ఉంగరాలు చేసి, బల్ల నాలుగు మూలలా వాటిని ఉంచాలి. ఒక్కో కాలు దగ్గర ఒక్కో ఉంగరం పెట్టాలి. 27 బల్ల పైభాగానికి చుట్టూవున్న నగిషీ బద్దకు సమీపంగా ఉంగరాలను ఉంచాలి. బల్లను మోసే మోత కర్రలను ఈ ఉంగరాలు పట్టి ఉంచుతాయి. 28 మోత కర్రలు చేసేందుకు తుమ్మ కర్రను ఉపయోగించి వాటికి బంగారంతో తాపడం చేయాలి. వాటితో బల్లను మోయాలి. 29 బల్లమీద ఉండే ప్రతి పళ్లెము, గిన్నె స్వచ్ఛమైన బంగారంతో చేయబడాలి. అర్పితాలను పోసేందుకు ఉపయోగించే పాత్రలు, గిన్నెలు స్వచ్ఛమైన బంగారంతో చెయ్యబడి ఉండాలి. 30 ప్రత్యేకమైన రొట్టెను[e] నా యెదుట బల్ల మీద పెట్టాలి. అవి నా యెదుట ఎల్లప్పుడూ అక్కడ ఉండాలి.
దీప స్తంభం
31 “అప్పుడు నీవు ఒక దీపస్తంభం చేయాలి. దీపస్తంభంలో ప్రతి భాగాన్నీ సాగకొట్టబడ్డ స్వచ్ఛమైన బంగారంతో చేయాలి. అందంగా కనబడేటట్టు దీపానికి పూలు చేయాలి. ఈ పూలలో మొగ్గలు, రేకులు స్వచ్ఛమైన బంగారంతో చేయాలి. ఇవన్నీ దీప స్తంభంతోపాటు ఒకే వస్తువుగా కలిసి ఉండాలి.
32 “దీపస్తంభానికి ఒక ప్రక్క మూడు కొమ్మలు మరో ప్రక్క మూడు కొమ్మలు మొత్తం ఆరు కొమ్మలు ఉండాలి. 33 ఒక్కో కొమ్మకు మూడు పువ్వులు ఉండాలి. ఈ పువ్వులను మొగ్గలు, రేకులుగల బాదం పూలుగా చేయి. 34 దీప స్తంభానికి మరో నాలుగు పూలు చేయి. ఈ పూలు మొగ్గలు, రేకులుగల బాదం పూవుల్లా చేయబడాలి. 35 కాండమునకు ఇరు ప్రక్కల మూడేసి కొమ్మల చొప్పున దీపస్తంభానికి ఆరు కొమ్మలు ఉండాలి. కొమ్మలు కాండంలో కలిసే మూడు చోట్లలో ఒక్కో దాని కింద మొగ్గలు, రేకులు గల ఒక పువ్వును చేయి. 36 పువ్వులు కొమ్మలతో సహా మొత్తం దీపస్తంభం స్వచ్ఛమైన బంగారంతో చేయబడాలి. ఈ బంగారం అంతా సాగకొట్టబడిన ఒకే ముక్కగా ఉండాలి. 37 అప్పుడు దీపస్తంభం మీదకు ఏడు దీపాలు చేయి. ఈ దీపాలు దీపస్తంభం ఉన్న చోట వెలుగునిస్తాయి. 38 ప్రమిదలు, దీపపు వత్తులను తిప్పే పిడి చేసేందుకు స్వచ్ఛమైన బంగారం ఉపయోగించు. 39 దీపస్తంభం, దానితోబాటు ఉపయోగించే వస్తువులను చేసేందుకు 75 పౌన్ల స్వచ్ఛమైన బంగారం ఉపయోగించు. 40 ప్రతీది సరిగ్గా నేను నీకు ఆ పర్వతం మీద చూపించిన ప్రకారమే చేసేందుకు చాల జాగ్రత్తపడు.
యేసు సమరయ స్త్రీతో మాట్లాడటం
4 యేసు యోహాను కన్నా ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుంటున్నాడని, అతని కన్నా ఎక్కువ మందికి బాప్తిస్మము నిస్తున్నాడని పరిసయ్యులు విన్నారు. 2 నిజానికి, బాప్తిస్మము నిచ్చింది యేసు కాదు. ఆయన శిష్యులు. 3 యేసు యిది గమనించి, యూదయ వదిలి మళ్ళీ గలిలయకు వెళ్ళిపోయాడు. 4 ఆయన సమరయ ద్వారా ప్రయాణం చేయవలసివచ్చింది.
5 ప్రయాణం చేసి సమరయలోని సుఖారు అనే గ్రామాన్ని చేరుకున్నాడు. ఈ గ్రామాన్ని ఆనుకొని ఉన్న భూమిని, యాకోబు తన కుమారుడైన యోసేపుకు యిచ్చాడు. 6 అక్కడ యాకోబు బావి ఉండేది. యేసు ప్రయాణంవల్ల అలసి ఆ బావి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలు. 7 ఒక సమరయ స్త్రీ నీళ్ళు తోడుకొని వెళ్ళటానికి వచ్చింది. యేసు ఆమెతో, “అమ్మా! నాకు త్రాగటానికి నీళ్ళిస్తావా?” అని అడిగాడు. 8 ఆయన శిష్యులు ఆహారం కొనుక్కొని రావటానికి పట్టణంలోకి వెళ్ళారు.
9 ఆ సమరయ స్త్రీ ఆయనతో, “మీరు యూదులు, నేను సమరయ స్త్రీని, నన్ను నీళ్ళివ్వమని అడుగుతున్నారే?” అని అన్నది. యూదులు సమరయులతో స్నేహంగా ఉండరు.
10 యేసు సమాధానం చెబుతూ, “దేవుడు ఏమివ్వగలడో నీకు తెలియదు. నిన్ను నీళ్ళు ఎవరు అడుగుతున్నారో నీకు తెలియదు. అది నీకు తెలిసివుంటే నేను అడగటానికి బదులు నీవు నన్ను నీళ్ళు అడిగేదానివి. నేను నీకు జీవజలాన్నీ యిచ్చేవాణ్ణి” అని అన్నాడు.
11 ఆ స్త్రీ, “అయ్యా! బావి లోతుగా ఉంది. పైగా మీ దగ్గర చేదటానికి ఏమిలేదు. ఈ జీవజలం మీకెట్లాలభిస్తుంది? 12 మీరు మా తండ్రి యాకోబు కన్నా గొప్పవారా? అతడు ఈ బావి మాకిచ్చాడు. ఈ బావి నీళ్ళు అతడు, అతని కుమారులు, అతని గొఱ్ఱెలు త్రాగాయి” అని అన్నది.
13 యేసు, “ఈ నీళ్ళు త్రాగినా మళ్ళీ దాహం వేస్తుంది! 14 కాని నేనిచ్చే నీళ్ళు త్రాగినవానికి మళ్ళీ దాహం కాదు. నేనిచ్చిన నీళ్ళు అతనిలో ఒక సజీవమైన ఊటగా మారి అతనికి అనంత జీవితాన్నిస్తుంది” అని సమాధానం చెప్పాడు.
15 ఆ స్త్రీ, “అయ్యా! నాకు మళ్ళీ దాహం కలుగకుండా, నేను నీళ్ళు చేదటానికి ఇక్కడికి ప్రతిరోజూ రాకుండా ఉండేటట్లు నాకా జలాన్ని ప్రసాదించండి” అని అడిగింది.
16 ఆయన, “వెళ్ళి నీ భర్తను పిలుచుకొని రా!” అని ఆమెతో అన్నాడు.
17 “నాకు భర్తలేడు” అని ఆమె తెలియచెప్పింది.
యేసు, “నీకు భర్త లేడని సరిగ్గా సమాధానం చెప్పావు. 18 నిజానికి నీకు ఐదుగురు భర్తలుండిరి. ప్రస్తుతం నీవు ఎవరితో నివసిస్తున్నావో అతడు నీ భర్తకాడు. నీవు నిజం చెప్పావు” అని అన్నాడు.
19 ఆమె, “అయ్యా! మీరు ప్రవక్తలా కనిపిస్తున్నారు. 20 మా పూర్వులు ఈ కొండ మీద పూజించారు. కాని మీ యూదులు, ‘మేము పూజించవలసింది యిక్కడ కాదు, యెరూషలేములో పూజించాలి’ అని అంటున్నారు” అని అన్నది.
21 యేసు, “నన్ను నమ్మమ్మా! తండ్రిని ఆరాధించటానికి ఈ కొండ మీదికి గాని లేక యెరూషలేముకు గాని వెళ్ళవలసిన అవసరం తీరిపోయే సమయం వస్తుంది. 22 మీ సమరయ దేశస్థులు తెలియనిదాన్ని ఆరాదిస్తారు. రక్షణ యూదుల నుండి రానున్నది కనుక మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాము. 23 నిజమైన ఆరాధికులు తండ్రిని ఆత్మతోను, సత్యముతోను ఆరాధించే సమయం రానున్నది. ఆ సమయం ఇప్పుడే వచ్చింది కూడా. ఎందుకంటే తండ్రి అటువంటి ఆరాధికుల కోసమే ఎదురు చుస్తున్నాడు. 24 దేవుడు ఆత్మ అయివున్నాడు. కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధించాలి” అని అన్నాడు.
25 ఆ స్త్రీ, “క్రీస్తు అనబడే మెస్సీయ రానున్నాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు మాకన్నీ విశదంగా చెబుతాడు” అని అన్నది.
26 యేసు, “నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే!” అని అన్నాడు.
27 అదే క్షణంలో ఆయన శిష్యులు తిరిగి వచ్చారు. ఆయనొక స్త్రీతో మాట్లాడటం చూసి ఆశ్చర్యపడ్డారు. కాని, “మీకేమి కావాలి?” అని కాని, లేక, “ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు” అని కాని వాళ్ళు అడగలేదు.
28 ఆ స్త్రీ తన కడవనక్కడ వదిలి గ్రామంలోకి తిరిగి వెళ్ళిపోయింది. 29 ప్రజలతో, “రండి! నేను చేసిన వాటన్నిటీని చెప్పిన వ్యక్తిని చూడండి. ఈయనే క్రీస్తు అవును గదా” అని అన్నది. 30 వాళ్ళందరూ గ్రామంనుండి బయలుదేరి ఆయన దగ్గరకు వచ్చారు.
31 ఇంతలో ఆయన శిష్యులు, “రబ్బీ! భోజనం చెయ్యండి” అని వేడుకున్నారు.
32 కాని ఆయన వాళ్ళతో, “నా దగ్గర తినటానికి ఆహారం ఉంది. కాని ఆ ఆహారాన్ని గురించి మీకేమీ తెలియదు” అని అన్నాడు.
33 ఆయన శిష్యులు, “ఆయన కోసం ఎవరో భోజనం తెచ్చివుంటారు!” అని పరస్పరం మాట్లాడుకున్నారు.
34 యేసు, “నన్ను పంపిన వాని కోరిక తీర్చటం, ఆయన కార్యాన్ని పూర్తి చేయటమే, నా భోజనం. 35 ‘విత్తిన తర్వాత నాలుగు నెలల్లో పంట వస్తుంది!’ అని మీరంటున్నారు. కాని నేను చెప్పేదేమిటంటే కళ్ళు తెరచి పొలాల వైపు చూడండి. పంట కోయటానికి సిద్ధంగా ఉంది. 36 దాన్ని విత్తినవాడు, కోసేవాడు ఫలం పొందుతున్నారు. అనంత జీవితం కోసం, అతడు ఆ పంటను కోస్తున్నాడు. తద్వారా విత్తనం నాటినవాడు, పంట కోసే వాడు, యిద్దరూ ఆనందిస్తారు. 37 ‘విత్తనం ఒకడు నాటితె ఫలం ఇంకొకడు పొందుతాడు’ అన్న సామెత ఈ సందర్భంలో వర్తిస్తుంది. 38 మీరు కష్టపడి పని చెయ్యని పంట కోయటానికి మిమ్మల్ని పంపాను, దాని కోసం యితర్లు చాలా కష్టించి పని చేసారు. వాళ్ళ కష్టానికి మీరు ఫలం పొందుతున్నారు” అని చెప్పాడు.
39 ఆ పట్టణంలో ఉన్న సమరయ ప్రజలతో ఆ స్త్రీ, “నేను చేసినదంతా ఆయన చెప్పాడు” అని చెప్పింది. ఆ కారణంగా అనేకులు యేసును నమ్మారు. 40 అందువల్ల ఆ సమరయ ప్రజలాయన దగ్గరకు వెళ్ళి తమతో ఉండుమని వేడుకున్నారు. ఆయన వాళ్ళతో రెండు రోజులున్నాడు. 41 ఆయన చెప్పిన విషయాల వలన యింకా అనేకులు విశ్వాసులైయ్యారు.
42 ఆ సమరయ ప్రజలు ఆమెతో, “మొదట నీవు చెప్పిన విషయాలు విని ఆయన్ని విశ్వసించాము. కాని యిప్పుడు మేము ఆయన మాటలు స్వయంగా విన్నాము. కనుక ఆయన్ని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాము. ఆయన ప్రపంచాన్ని రక్షించటానికి వచ్చిన వాడని మాకు బాగ తెలిసిపోయింది” అని అన్నారు.
రాజ్యాధికారి కుమారునికి నయం చేయటం
(మత్తయి 8:5-13; లూకా 7:1-10)
43 రెండు రోజుల తర్వాత ఆయన గలిలయకు వెళ్ళాడు. 44 అక్కడ యేసు, “ప్రవక్తకు తన స్వగ్రామంలో గౌరవం లేదు” అని అన్నాడు. 45 ఆయన గలిలయ వచ్చాక అక్కడి ప్రజలు ఆయనకు స్వాగతమిచ్చారు. గలిలయ ప్రజలు కూడా పస్కా పండుగ కోసం యోరూషలేము వెళ్ళారు. కనుక, వాళ్ళు ఆయన అక్కడ పండుగ రోజుల్లో చేసిన వాటన్నిటిని చూశారు.
46 యేసు, తాను నీళ్ళను ద్రాక్షారసంగా మార్చిన గలిలయలోని “కానా” ను మళ్ళీ దర్శించాడు. కపెర్నహూము పట్టణంలో ఒక రాజ్యాధికారి ఉండేవాడు. అతని కుమారుడు జబ్బుతో ఉన్నాడు. 47 యేసు యూదయ నుండి గలిలయకు వచ్చాడని విని ఆ రాజ్యాధికారి ఆయన దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి చావుకు దగ్గరగా ఉన్న తన కుమారునికి నయం చేయుమని వేడుకున్నాడు. 48 “మహాత్కార్యాలు, అద్భుతాలు చూస్తే కాని మీరు నమ్మరు” అని యేసు అతనితో అన్నాడు.
49 ఆ రాజ్యాధికారి, “అయ్యా! నా కుమారుడు మరణించకముందే దయచేసి రండి!” అని అన్నాడు.
50 యేసు, “నీవు వెళ్ళు! నీ కుమారుడు జీవిస్తాడు” అని అన్నాడు.
అతడు యేసు మాట విశ్వసించి వెళ్ళి పోయాడు. 51 అతడు యింకా దారిలో ఉండగానే అతని సేవకులు ఎదురుగా వచ్చి బాబుకు నయమై పోయిందని చెప్పారు.
52 అతడు వాళ్ళను తన కుమారునికి ఏ సమయంలో నయమైందని అడిగాడు.
వాళ్ళు, “నిన్న ఒంటిగంటకు జ్వరం విడిచింది” అని సమాధానం చెప్పారు.
53 సరిగ్గా అదే సమయానికి యేసు తనతో, “నీ కుమారుడు జీవిస్తాడు” అని అన్న విషయం అతనికి జ్ఞాపకం వచ్చింది. అందువల్ల అతడు, అతని యింట్లోని వాళ్ళంతా ప్రభువుని నమ్మారు.
54 యూదయ దేశం నుండి గలిలయకు వచ్చాక యిది యేసు చేసిన రెండవ మహాత్కార్యము.
పరిచయం
1 ఈ మాటలు దావీదు కుమారుడైన సొలొమోను చెప్పిన సామెతలు. సొలొమెను ఇశ్రాయేలీయుల రాజు. 2 ప్రజలు జ్ఞానము కలిగి, సరైన వాటిని చేయటం తెలుసుకొనేందుకు ఈ సంగతులు వ్రాయబడ్డాయి. నిజమైన అవగాహన కలిగి ఉండేందుకు ప్రజలకు ఈ మాటలు సహాయం చేస్తాయి. 3 ప్రజలు జీవించేందుకు శ్రేష్ఠమైన విధానాన్ని ఈ మాటలు నేర్పిస్తాయి. నీతి, నిజాయితీ, మంచితనం కలిగి ఉండేందుకు సరైన మార్గాన్ని ప్రజలు నేర్చుకుంటారు. 4 జ్ఞానమును నేర్చుకోవాల్సిన సాధారణ మనుష్యులకు జ్ఞానముగల ఈ మాటలు నేర్చిస్తాయి. యువతీ యువకులు ఈ మాటల మూలంగా జ్ఞానము, దాని ప్రయోగాన్ని నేర్చుకొంటారు. 5 ఈ మాటల్లోని ఉపదేశాలను జ్ఞానముగలవారు కూడ జాగ్రత్తగా అనుసరించాలి. అప్పుడు వాళ్లు ఇంకా ఎక్కువ నేర్చుకొని, ఇంకా జ్ఞానముగల వారు అవుతారు. మంచి చెడుల తారతమ్యం తెలుసుకోవటంలో నిపుణతగల వారు యింకా ఎక్కువ అవగాహన సంపాదిస్తారు. 6 అప్పుడు జ్ఞానముగల కథలు, పొడుపు కథలు మనుష్యులు గ్రహించగలుగుతారు. జ్ఞానముగల వారు చెప్పే విషయాలను మనుష్యులు గ్రహించగలుగుతారు.
7 ఒక వ్యక్తి యెహోవాను గౌరవించి, ఆయనకు విధేయత చూపించటమే, నిజమైన తెలివికి మూలము. కాని పాపాన్ని ప్రేమించే మనుష్యులు జ్ఞానాన్ని, సరైన ఉపదేశాన్ని ద్వేషిస్తారు.
సొలొమోను మనకు ఇచ్చిన సలహా
8 నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశానికి నీవు విధేయుడవు కావాలి. మరియు నీ తల్లి ఉపదేశాలు కూడ నీవు పాటించాలి. 9 నీ తల్లిదండ్రుల మాటలు నీ తలను మరింత అందంగా తీర్చిదిద్దే పూల కిరీటంలా ఉంటాయి. ఆ ఉపదేశాలు నీ మెడకు అందమైన హారంలా ఉంటాయి.
10 నా కుమారుడా, పాపాన్ని ప్రేమించే ప్రజలు తమతో కూడ పాపాన్ని చేయించటానికి పయత్నిస్తారు. నీవు వారిని అనుసరించకూడదు. 11 ఆ పాపులు ఇలా చెప్పవచ్చు: “మాతో వచ్చేయి! మనం దాక్కొని, ఎవరినైనా అమాయకుణ్ణి చంపటానికి కనిపెడదాం. 12 ఎవరైనా ఒక నిర్దోషిమీద మనం దాడి చేద్దాం. మనం అతణ్ణి చంపుదాం. ఆ మనిషిని పితృ లోకానికి మనం పంపిద్దాం. అతణ్ణి మనం నాశనం చేసి, సమాధికి పంపిద్దాం. 13 చాలా ధనం, విలువ చేసే అన్ని రకాల వస్తువులు మనం దొంగిలిద్దాం. ఈ వస్తువులతో మనం మన గృహాలు నింపుకొందాం. 14 కనుక మాతో వచ్చి, వీటిని చేయటానికి మాకు సహాయం చేయి. మనకు దొరికే వస్తువులన్నింటినీ మనం అందరం పంచుకొందాం.”
15 నా కుమారుడా, పాపాన్ని ప్రేమించే మనుష్యులను వెంబడించవద్దు. వారు జీవించే విధానంలో మొదటి మెట్టు కూడా నీవు ఎక్కవద్దు. 16 ఆ చెడ్డ మనుష్యులు కీడు చేయటానికి ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటారు. వారు ఎంతసేపూ మనుష్యులను చంపాలని ఆశిస్తూంటారు.
17 ఒక పక్షి నిన్ను చూస్తూండగా ఆ పక్షిని పట్టాలని వల వేయటం నిష్ప్రయోజనం. కనుక ఆ దుర్మార్గులను కనిపెట్టి ఉండు. జాగ్రత్తగా ఉండు. ఆ దుర్మార్గులు ఇతరులను చంపాలని ఉచ్చు వేస్తున్నారు. 18 కాని నిజానికి వారికి వారే ఉచ్చు వేసుకొంటారు. వారి స్వంత ఉచ్చుతో వారే నాశనం చేయబడుతారు. 19 ఇవి దురాశపరుల పద్ధతులు అలాంటి దురాశ అది కలిగివున్నవారికి ప్రాణాంతక మవుతుంది.
మంచి స్త్రీ—జ్ఞానము
20 ఇలా విను! జ్ఞానము ప్రజలకు ఉపదేశించటానికి ప్రయత్నిస్తుంది. ఆమె (జ్ఞానము) వీధుల్లో, సంతల్లో అరుస్తుంది. 21 రద్దీగల వీధి మూలల్లో ఆమె (జ్ఞానము) పిలుస్తోంది. ఆమె (జ్ఞానము) తన మాటలు వినేందుకు ప్రజలను సమకూర్చేందుకు ప్రయత్నిస్తూ పట్టణ ద్వారాల దగ్గర ఉంటూ (జ్ఞానము) చెపుతుంది:
22 “మీరు వెర్రివాళ్లు. ఇంకెన్నాళ్లు మీరు ఇలా వెర్రి పనులు చేస్తూనే ఉంటారు? ఎన్నాళ్లు మీరు తెలివిని ద్వేషీస్తూ ఉంటారు? 23 మీరు పశ్చాత్తాపపడి నా సలహా, నా ఉపదేశం విని ఉంటే, నాకు తెలిసింది అంతా నేను మీతో చెప్పి ఉండేదాన్ని. నాకు ఉన్న తెలివి అంతా మీకు ఇచ్చి ఉండేదాన్ని.
24 “కాని మీరు నా మాట వినేందుకు తిరస్కరించారు. సహాయం చేయటానికి నేను ప్రయత్నించాను. నేను నా చేయి అందించాను. కాని నా సహాయం స్వీకరించటానికి మీరు నిరాకరించారు. 25 నా సలహా అంతటినీ మీరు నిర్లక్ష్యం చేసి, తిప్పికొట్టారు. నా మాటలు స్వీకరించటానికి మీరు నిరాకరించారు. 26 అందుచేత నేను మీ కష్టం చూచి నవ్వుతాను. మీకు కష్టం కలగటం చూచి నేను సరదా పడతాను. 27 గొప్ప కష్టం తుఫానులా మీ మీదికి వస్తుంది. సమస్యలు ఒక బలమైన గాలిలా మీ మీద కొడతాయి. మీ కష్టాలు, మీ విచారం మీ మీద మహా గొప్ప భారంగా ఉంటాయి.
28 “ఈ సంగతులన్నీ జరిగినప్పుడు మీరు నా సహాయం కోసం అడుగుతారు. కాని నేను మీకు సహాయం చేయను. మీరు నాకోసం వెదుకుతారు, కాని మీరు నన్ను కనుగొనలేరు. 29 మీరు ఎన్నడూ నా తెలివిని కోరుకోలేదు, గనుక నేను మీకు సహాయం చేయను. మీరు యెహోవాకు భయపడి ఆయనను గౌరవించుటకు నిరాకరించారు. 30 నా సలహా మాటలు వినేందుకు ప్రజలారా మీరు నిరాకరించారు. నేను సరైనదారి మీకు చూపించినప్పుడు మీరు నా మాట వినేందుకు నిరాకరించారు. 31 కనుక మీరు మీ స్వంత విదానంలోనే పనులు చేసుకోవాలి. మీ స్వంత కీడు మార్గాల్లో జీవిస్తూ మిమ్మల్ని మీరే నాశనం చేసుకొంటారు.
32 “అవివేకులు జ్ఞానాన్ని అనుసరించేందుకు నిరాకరించిన మూలంగా మరణిస్తారు. వారి బుద్ధిహీన పధ్ధతులలో కొనసాగటం వారికి సంతోషం, అదే వారిని చంపుతుంది. 33 కాని, నాకు విధేయత చూపే వ్యక్తి క్షేమంగా జీవిస్తాడు. ఆ వ్యక్తి సుఖంగా ఉంటాడు. అతడు కీడుకు భయపడాల్సిన అవసరం ఉండదు.”
చివరి హెచ్చరికలు
13 మూడవసారి మీ దగ్గరకు వస్తున్నాను. “ప్రతి విషయం యిద్దరు లేక ముగ్గురు సాక్ష్యాలతో రుజువు పరచాలి.”(A) 2 నేను రెండవ సారి వచ్చి మీతో ఉన్నప్పుడు ఈ విషయంలో మిమ్మల్ని యిదివరకే హెచ్చరించాను. నేను యిప్పుడు మీ సమక్షంలో లేను కనుక మళ్ళీ చెపుతున్నాను. 3 కనుక నేను ఈ సారి వచ్చినప్పుడు ఇదివరలో పాపంచేసినవాళ్ళను ఇప్పుడు పాపంచేసినవాళ్ళను శిక్షిస్తాను. క్రీస్తు నా ద్వారా మాట్లాడుతున్నాడన్న దానికి మీరు రుజువు అడుగుతున్నారు. మీ పట్ల క్రీస్తు బలహీనంగా ఉండడు. ఆయన మీ మధ్య శక్తివంతంగా ఉన్నాడు. 4 బలహీనతల్లో ఆయన సిలువ వేయబడ్డాడు. అయినా, దైవశక్తివల్ల జీవిస్తున్నాడు. అదే విధంగా మేము ఆయనలో బలహీనంగా ఉన్నా, దైవశక్తి వల్ల ఆయనతో సహా జీవించి మీ సేవ చేస్తున్నాము.
5 మీరు నిజమైన “విశ్వాసులా, కాదా” అని తెలుసుకోవాలనుకొంటే మిమ్మల్ని మీరు పరిశోధించుకోవాలి. మీలో యేసు క్రీస్తు ఉన్నట్లు అనిపించటం లేదా? మీరు ఈ పరీక్షల్లో ఓడిపోతే క్రీస్తు మీలో ఉండడు. 6 మేము ఈ పరీక్షల్లో విజయం సాధించిన విషయం మీరు గ్రహిస్తారని నమ్ముతున్నాను. 7 మీరు ఏ తప్పూ చేయకుండా ఉండాలని మేమే దేవుణ్ణి ప్రార్థిస్తాము. మేము పరీక్షల్లో నెగ్గినట్లు ప్రజలు గమనించాలని కాదు కాని, మేము పరీక్షల్లో నెగ్గినట్లు కనపడకపోయినా మీరు మంచి చెయ్యాలని దేవుణ్ణి ప్రార్థిస్తాము. 8 మేము సత్యానికి విరుద్ధంగా ఏదీ చెయ్యలేము. అన్నీ సత్యంకొరకే చేస్తాము. 9 మీరు బలంగా ఉంటే, మేము బలహీనంగా ఉండటానికి సంతోషిస్తాం. మీలో పరిపూర్ణమైన శక్తి కలగాలని మేము ప్రార్థిస్తున్నాము. 10 అందువల్లే నేను మీ సమక్షంలో లేనప్పుడు యివి వ్రాస్తున్నాను. అలా చేస్తే నేను వచ్చినప్పుడు నా అధికారం ఉపయోగించటంలో కాఠిన్యత చూపనవసరం ఉండదు. ఈ అధికారం ప్రభువు మీ విశ్వాసాన్ని వృద్ధిపరచటానికి యిచ్చాడు, కాని నాశనం చేయటానికి కాదు.
11 తుదకు, సోదరులారా! పరిపూర్ణులుగా ఉండటానికి ప్రయత్నించండి. నేను చెప్పేవాటిని చెయ్యండి. ఒకరితో ఒకరు సహకరిస్తూ జీవించండి. ప్రేమను, శాంతినిచ్చే దేవుడు మీతో ఉంటాడు.
12 పవిత్రమైన ముద్దుతో పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇక్కడున్న విశ్వాసులందరు తమ శుభాకాంక్షలు తెలుపమన్నారు.
13 యేసు క్రీస్తు ప్రభువు యొక్క అనుగ్రహం, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మీ అందరితో ఉండుగాక!
© 1997 Bible League International