M’Cheyne Bible Reading Plan
పది ఆజ్ఞలు
20 అప్పుడు మోషేతో దేవుడు ఈ మాటలు చెప్పాడు:
2 “నేను మీ దేవుణ్ణి, యెహోవాను. ఈజిప్టు దేశం నుండి నేనే మిమ్మల్ని బయటికి రప్పించాను. బానిసత్వం నుండి నేనే మిమ్మల్ని విడుదల చేసాను. (కనుక ఈ ఆజ్ఞలకు మీరు విధేయులు కావాలి)
3 “నేను గాక వేరే దేవుళ్లు ఎవ్వరినీ మీరు ఆరాధించకూడదు.
4 “విగ్రహాలు ఏవీ మీరు చేయకూడదు పైన ఆకాశానికి సంబంధించింది గాని, క్రింద భూమికి సంబంధించిందిగాని, భూమి క్రింద నీళ్లకు సంబంధించిందిగాని, దేని విగ్రహాన్ని లేక పటాన్ని చేయవద్దు. 5 ఎలాంటి విగ్రహాల్నీ పూజించవద్దు, సేవించవద్దు. ఎందుకంటే, యెహోవాను నేనే మీ దేవుణ్ణి. నేను నా ప్రజలు వేరే దేవుళ్లను పూజించటాన్ని ద్వేషిస్తాను.[a] ఒక వ్యక్తి నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఆ వ్యక్తి నన్ను ద్వేషిస్తున్నాడు. ఆ వ్యక్తి సంతానాన్ని మూడు, నాలుగు తరాల వరకు నేను శిక్షిస్తాను. 6 అయితే నా ఆజ్ఞలను ప్రేమించి, విధేయులయ్యే ప్రజలకు వేల తరాలవరకు నేను ఎంతో దయ చూపిస్తాను.
7 “మీ దేవుడైన యెహోవా పేరును మీరు తప్పుగా ప్రయోగించకూడదు. ఒక వ్యక్తి గనుక యెహోవా పేరును తప్పుగా ప్రయోగిస్తే, ఆ వ్యక్తి దోషి. యెహోవా అతణ్ణి నిర్దోషిగా చేయడు.
8 “సబ్బాతును ఒక ప్రత్యేక రోజుగా ఉంచుకోవడం మరచిపోవద్దు. 9 వారానికి ఆరు రోజులు మీరు మీ పని చేసుకోవచ్చు. 10 అయితే, యెహోవా గౌరవార్థం ఏడవరోజు విశ్రాంతి రోజు కనుక ఆ రోజు ఏ వ్యక్తీ పని చేయకూడదు. అంటే మీరు, మీ కొడుకులు, కూతుళ్లు, మీ ఆడ, మగ బానిసలు, చివరికి మీ జంతువులు, మీ పట్టణాల్లో నివసించే విదేశీయులు కూడాను. 11 ఎందుకంటే, యెహోవా ఆరు రోజులు పనిచేసి ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని వాటిలో ఉండే సమస్తాన్ని చేసాడు. ఏడో రోజున దేవుడు విశ్రాంతి తీసుకొన్నాడు. ఈ విధంగా ఏడవరోజును యెహోవా ఆశీర్వదించాడు. దాన్ని చాలా ప్రత్యేకమైన రోజుగా యెహోవా చేసాడు.
12 “నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చే దేశంలో నీకు పూర్తి ఆయుష్షు ఉండేటట్టుగా నీవు ఇలా చేయాలి.
13 “నీవు ఎవ్వరినీ హత్య చేయకూడదు.
14 “వ్యభిచార పాపం నీవు చేయకూడదు.
15 “నీవు దొంగతనం చేయకూడదు.
16 “నీ పొరుగువాళ్ల విషయంలో నీవు అబద్ధాలు చెప్పకూడదు.
17 “ఇతరుల వస్తువుల్ని నీవు తీసుకోవాలని ఆశ పడకూడదు. నీ పొరుగు వాడి ఇంటిని, లేక వాని భార్యను, లేక వాని ఆడ, మగ సేవకులను, లేక వాని ఆవులను, లేక అతని గాడిదలను తీసుకోవాలని నీవు ఆశపడకూడదు. నీ పొరుగువానికి చెందినది ఏదీ తీసుకోవాలని నీవు ఆశపడకూడదు.”
ప్రజలకు దేవుడంటే భయం
18 ఇంతసేపూ లోయలో ప్రజలు కొండమీది ఉరుము శబ్దం వింటూనే ఉన్నారు. మెరుపులు చూస్తునే ఉన్నారు. కొండమీద నుండి పొగ లేవడం వారు చూసారు. ప్రజలు భయపడి వణకిపోయారు. వాళ్లు కొండకు దూరంగా నిలబడి గమనించారు.
19 అప్పుడు ప్రజలు మోషేతో “నీవు మాతో మాట్లాడాలంటే మేము వింటాం. కాని దేవుణ్ణి మాత్రం మాతో మాట్లాడనివ్వకు. అలా జరిగితే మేము చస్తాము,” అని చెప్పారు.
20 అప్పుడు మోషే, “తాను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని రుజువు చేయడానికే, యెహోవా వచ్చాడు. మీరు పాపం చేయకుండా ఉండేలా మీరు ఆయనను గౌరవించాలని ఆయన కోరుతున్నాడు” అని ప్రజలకు చెప్పాడు.
21 దేవుడువున్న దట్టమైన మేఘం దగ్గరకు మోషే వెళుతోంటే, ప్రజలు ఆ కొండకు దూరంగా నిలబడ్డారు. 22 అప్పుడు ఈ సంగతులు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పమని యెహోవా మోషేతో చెప్పాడు. “ఆకాశం నుండి నేను మీతో మాట్లాడటం మీరు చూసారు. 23 కనుక మీరు బంగారంతోగాని, వెండితోగాని నాకు పోటీగా విగ్రహాలు చేసుకోకూడదు. ఈ అబద్ధపు దేవుళ్లను మీరు చేసుకోకూడదు.
24 “నా కోసం ఒక ప్రత్యేక బలిపీఠం చేయండి. ఈ బలిపీఠం చేయడానికి మట్టి ఉపయోగించండి. ఈ బలిపీఠం మీద దహనబలులు, సమాధాన బలులు, బలిగా నాకు అర్పితం చేయండి. ఇలా చేయటానికి మీ గొర్రెల్ని, పశువుల్ని వాడుకోండి. నన్ను జ్ఞాపకం చేసుకోమని నేను మీకు చెప్పే ప్రతి చోటా మీరు యిలా చేయాలి. అప్పుడు నేను వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. 25 మీరు బండలతో[b] బలిపీఠం కడితే, చెక్కబడిన బండలతో దానిని కట్టవద్దు. ఎందుకంటే, పనిముట్లతో మీరు పని చేసినప్పుడు మీరు దానిని అపవిత్రం చేస్తారు. బండల మీద మీరు ఏవైనా పని ముట్లు ప్రయోగిస్తే, ఆ బలిపీఠాన్ని నేను అంగీకరించను. 26 బలిపీఠం మీదికి వెళ్లేందుకు మీరు మెట్లు చేయకూడదు. అలా మెట్లు ఉంటే, ప్రజలు బలిపీఠం వైపుకి చూసినప్పుడు మీ దిగంబరత్వం అంతా వారికి కనబడుతుంది.”
పిలాతు సమక్షంలో యేసు
(మత్తయి 27:1-2, 11-14; మార్కు 15:1-5; యోహాను 18:28-38)
23 మహాసభ సభ్యులందరూ లేచి యేసును పిలాతు ముందుకు పిలుచుకు వచ్చి, 2 “ఇతడు మన దేశాన్ని తప్పుదారి పట్టించటం మేము గమనించాము. చక్రవర్తికి పన్నులు కట్టరాదని, తాను క్రీస్తునని, రాజునని చెప్పుకుంటున్నాడు” అని ఫిర్యాదు చేసారు.
3 ఇది విని పిలాతు యేసుతో, “నీవు యూదుల రాజువా?” అని అడిగాడు.
“ఔను, మీరన్నది నిజం!” అని యేసు సమాధానం చెప్పాడు.
4 ఆ తర్వాత పిలాతు ప్రధాన యాజకులతో, ప్రజలతో, “ఇతనికి శిక్ష విధించటానికి నాకు ఏ కారణం కనిపించటం లేదు” అని అన్నాడు.
5 కాని వాళ్ళు, “ఇతడు తన బోధనలతో యూదయ ప్రాంతంలో ఉన్న ప్రజలనందరిని పురికొలుపుచున్నాడు. ఇది యితడు గలిలయలో ప్రారంభించి యిక్కడి దాకా వచ్చాడు” అని మళ్ళీ మళ్ళీ అన్నారు.
హేరోదు సమక్షంలో యేసు
6 ఇది విని పిలాతు వాళ్ళను, “అతడు గలిలయ దేశస్థుడా?” అని అడిగాడు. 7 యేసు, హేరోదు పాలిస్తున్న ప్రాంతానికి చెందినవాడని తెలుసుకొన్న వెంటనే, పిలాతు ఆయన్ని హేరోదు దగ్గరకు పంపాడు. అప్పుడు హేరోదు యెరూషలేములో ఉన్నాడు.
8 హేరోదుకు చాలాకాలం నుండి యేసును చూడాలని ఉంది. కనుక ఆయన్ని చూడగానే హేరోదుకు చాలా ఆనందం కలిగింది. యేసును గురించి విన్నవాటిని బట్టి ఆయన ఏదైనా మహాత్యం చేస్తాడేమోనని ఆశించాడు. 9 అతడు యేసును ఎన్నో ప్రశ్నలు అడిగాడు. కాని యేసు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. 10 ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసుపై తీవ్రంగా నేరారోపణ చేస్తూ అక్కడే నిలుచొని ఉన్నారు. 11 హేరోదు, అతని భటులు యేసును తిరస్కరించి, హేళన చేస్తూ నవ్వారు. ఆయనకు రాజ దుస్తులు తొడిగించి తిరిగి పిలాతు దగ్గరకు పంపారు. 12 ఆ రోజు హేరోదు, పిలాతు ఇద్దరూ మిత్రులయ్యారు. ఆనాటివరకు వాళ్ళు శత్రువులుగా ఉన్నారు.
మరణదండన విధించటం
(మత్తయి 27:15-26; మార్కు 15:6-15; యోహాను 18:39–19:16)
13 పిలాతు ప్రధానయాజకుల్ని, పాలకుల్ని, ప్రజల్ని, సమావేశపరిచాడు. 14 వాళ్ళతో, “తిరుగుబాటు చెయ్యటానికి ప్రజల్ని పురికొలుపుతున్నాడని అతణ్ణి మీరిక్కడికి పిలుచుకు వచ్చారు. మీ సమక్షంలోనే అతణ్ణి విచారించాము. మీ నేరారోపణలకు నాకు ఏమాత్రం కారణం కనపడటంలేదు. 15 హేరోదుకు కూడా ఏ తప్పూ కనిపించలేదు. కనుకనే అతణ్ణి తిరిగి మా దగ్గరకు పంపాడు. మరణ దండన పొందవలసిన నేరం అతడు చెయ్యలేదని మీరు గమనించారు. 16 అందువల్ల కొన్ని కొరడా దెబ్బలు కొట్టి విడుదల చేస్తాను” అని అన్నాడు. 17 [a]
18 వాళ్ళంతా ఒకే గొంతుతో, “అతణ్ణి చంపండి, బరబ్బను విడుదల చెయ్యండి” అని కేకలు వేశారు. 19 బరబ్బ తాను పట్టణంలో చేసిన ఒక తిరుగుబాటు కారణంగా, హత్య కారణంగా కారాగారంలో ఉన్నాడు.
20 యేసును విడుదల చెయ్యాలనే ఉద్దేశ్యంతో పిలాతు మళ్ళీ విజ్ఞప్తి చేశాడు. 21 కాని వాళ్ళు బిగ్గరగా, “అతణ్ణి సిలువకు వెయ్యండి!” అని కేకలు వేశారు.
22 మూడవసారి, పిలాతు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “ఎందుకు? అతడేమి నేరం చేశాడు? అతనికి మరణ దండన విధించటానికి నాకు ఏ కారణం కన్పించలేదు. అందువల్ల కొన్ని కొరడా దెబ్బలు కొట్టి విడుదల చేస్తాను.” అని అన్నాడు.
23 కాని, అతణ్ణి సిలువకు వెయ్యమని కేకలు వేయటం వాళ్ళు మానలేదు. చివరకు వాళ్ళు గెలిచారు. 24 పిలాతు వాళ్ళడిగినట్లు చెయ్యటానికి ఒప్పుకున్నాడు. 25 తిరుగుబాటు కారణంగా, హత్య కారణంగా కారాగారంలో ఉన్న వాళ్ళడిగిన బరబ్బను విడుదల చేసి యేసును వాళ్ళ కప్పగించాడు.
యేసుని సిలువకు వేయటం
(మత్తయి 27:32-44; మార్కు 15:21-32; యోహాను 19:17-19)
26 వాళ్ళు యేసును తీసుకొని వెళ్తూ, గ్రామం నుండి పట్టణంలోకి వస్తున్న సీమోను అనే వాణ్ణి పట్టుకొని అతనిపై సిలువను పెట్టి యేసు వెనుక నడిపించారు. సీమోను కురేనే గ్రామస్థుడు.
27 చాలామంది ప్రజలు యేసు వెనుక నడుస్తూ ఉన్నారు. వాళ్ళలో కొందరు స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళు గుండెలు బాదుకుంటూ, ఏడుస్తూ యేసు వెనుక నడిచారు. 28 యేసు వాళ్ళవైపు తిరిగి, “యెరూషలేము బిడ్డలారా! నా కోసం దుఃఖించకండి. మీ కోసం, మీ సంతానం కోసం దుఃఖించండి. 29 ‘గొడ్రాళ్ళుగా ఉన్న స్త్రీలు ధన్యులని, పిల్లలు కనని కడుపులు, పాలివ్వని స్తనములు ధన్యములైనవి’ అనే రోజులు వస్తాయి. 30 అప్పుడు వాళ్లు పర్వతాలతో తమ మీద పడమని అంటారు. కొండలతో కూలి తమను కప్పి వేయమని అడుగుతారు.(A) 31 చెట్టు పచ్చగా ఉన్నప్పుడే ప్రజలు ఈ విధంగా చేస్తే అది ఎండిపొయ్యాక ఏం చేస్తారు?” అని అన్నాడు.
32 మరణ దండన విధించటానికి, ఇద్దరు నేరస్థుల్ని కూడా యేసు వెంట తీసుకొని వెళ్తూ ఉన్నారు. 33 కల్వరి[b] అనబడే స్థలాన్ని చేరుకొన్నాక ఆ నేరస్థులు యిద్దర్నీ ఒకణ్ణి యేసుకు కుడివైపు, మరొకణ్ణి ఎడమవైపు ఉంచి ముగ్గుర్నీ సిలువకు వేసారు.
34 యేసు, “తండ్రి, వాళ్ళను క్షమించు, వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు”[c] అని అన్నాడు.
వాళ్ళు చీట్లు వేసి ఆయన దుస్తుల్ని పంచుకొన్నారు. 35 ప్రజలు జరుగుతున్న వాటిని చూస్తూ నిలబడి ఉన్నారు. పాలకులు ఎగతాళి చేసారు. వాళ్ళు, “ఇతర్లను రక్షించాడే! తాను దేవుడెన్నుకొన్న వాడైనట్లైతే, తాను ‘క్రీస్తు’ అయినట్లైతే తనను తాను రక్షించుకోనీ!” అని అన్నారు.
36 భటులు కూడా దగ్గరకు వచ్చి ఆయన్ని హేళన చేసారు. వాళ్ళు ఆయనకు పులిసిన ద్రాక్షారసం యిస్తూ 37 “నీవు యూదుల రాజువైతే నిన్ను నీవు రక్షించుకో!” అని ఎగతాళి చేసారు. 38 “ఇతడు యూదుల రాజు” అని వ్రాసి సిలువకు తగిలించారు.
39 ఆయనతో సహా సిలువకు వేయబడిన ఒక నేరస్థుడు, “నీవు క్రీస్తువు కదా! నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు!” అని అవమానపరిచాడు.
40 కాని మరొక నేరస్థుడు మొదటి వాణ్ణి గద్దిస్తూ, “నీవు దేవునికి భయపడవా! నీవు కూడా అదే శిక్ష అనుభవిస్తున్నావు కదా! మనల్ని శిక్షించటం న్యాయమే. 41 మనము చేసిన నేరానికి తగిన శిక్ష అనుభవిస్తున్నాము. కాని ఆయన ఏ అపరాధమూ చెయ్యలేదు” అని అన్నాడు. 42 ఆ తదుపరి ఆయనతో, “యేసూ! నీవు నీ రాజ్యం చెయ్యటం మొదలు పెట్టినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకో” అని అన్నాడు.
43 యేసు, “ఇది నిజం, ఈ రోజు నువ్వు నాతో సహా పరదైసులో[d] ఉంటావు” అని సమాధానం చెప్పాడు.
యేసు మరణం
(మత్తయి 27:45-56; మార్కు 15:33-41; యోహాను 19:28-30)
44-45 అప్పుడు మధ్యాహ్నం పండ్రెండు గంటల సమయం. సూర్యుడు ప్రకాశించటం మానేయటం వల్ల అప్పటినుండి మూడు గంటలదాకా ఆ దేశమంతా చీకటితో నిండిపోయింది. మందిరంలో ఉన్న తెర రెండు భాగాలుగా చినిగి పోయింది. 46 యేసు బిగ్గరగా, “తండ్రి! నా ఆత్మను నీ చేతుల్లో పెడ్తున్నాను” అని అన్నాడు. వెంటనే తన ప్రాణం వదిలాడు.
47 శతాధిపతి జరిగిందిచూసి దేవుణ్ణి స్తుతిస్తూ, “ఈయన నిజంగా నీతిమంతుడై ఉన్నాడు!” అని అన్నాడు.
48 ఈ దృశ్యం చూడాలని గుమికూడిన ప్రజలు జరిగినదాన్ని చూసి తమ గుండెలు బాదుకుంటూ వెళ్ళిపోయారు. 49 కాని ఆయనకు తెలిసిన వాళ్ళు, గలిలయ నుండి ఆయన్ని అనుసరిస్తూ వచ్చిన స్త్రీలు, యివన్నీ చూస్తూ కొంతదూరంలో నిలుచొని ఉన్నారు.
యేసును సమాధి చేయటం
(మత్తయి 27:57-61; మార్కు 15:42-47; యోహాను 19:38-42)
50 అరిమతయియ యూదుల గ్రామం. ఆ గ్రామానికి చెందిన యోసేపు అనేవాడు అక్కడ ఉన్నాడు. అతడు మహాసభ సభ్యుడు. 51 నీతిమంతుడు, మంచివాడు. యోసేపు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మహాసభ సభ్యులు యేసుకు మరణ శిక్ష విధించటానికి నిర్ణయించినప్పుడు అతడు ఒప్పుకోలేదు. 52 యోసేపు పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని తీసుకెళ్ళటానికి అనుమతి పొందాడు. 53 అతడు ఆ దేహాన్ని సిలువ నుండి క్రిందికి దింపి ఒక విలువైన బట్టలో చుట్టాడు. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి యిదివరకు ఎవర్నీ పెట్టని ఒక సమాధిలో ఉంచాడు. ఆ సమాధి పెద్దరాయి మలచి సిద్ధం చేయబడి ఉంది. 54 అది విశ్రాంతిరోజు కొరకు సిద్ధమౌతున్న రోజు. అది ప్రారంభం అవ్వబోతుంది.
55 యేసు వెంట గలిలయనుండి వచ్చిన స్త్రీలు యోసేపు వెంట వెళ్లి సమాధిని, అతడు ఆ సమాధిలో యేసు దేహాన్ని ఉంచిన దృశ్యాన్ని చూసారు. 56 ఆ తర్వాత వాళ్ళు యింటికి వెళ్ళి, అత్తరు, సుగంధ ద్రవ్యాలు సిద్ధం చేసారు.
కాని విశ్రాంతి రోజు ప్రారంభం అయినందువల్ల వాళ్ళు మోషే శాస్త్రం ప్రకారం ఏ పనీ చేయలేదు.
దేవుడు యోబుతో మాట్లాడటం
38 అప్పుడు యెహోవా తుఫానులో నుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు.
2 “నా జ్ఞానమును అంగీకరించక పనికిమాలిన,
తెలివితక్కువ మాటలతో నన్ను ప్రశ్నించే వీడు ఎవడు?
3 యోబూ, మగవాడిలా గట్టిగా ఉండు.
నేను నిన్ను అడిగే ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండు.
4 “యోబూ, నేను భూమిని చేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు?
నీవు అంత తెలివిగల వాడెవైతే నాకు జవాబు చెప్పు.
5 యోబూ, ప్రపంచం ఎంత పెద్దగా ఉండాలో నిర్ణయించింది ఎవరు?
నీకు తెలిసినట్టే ఉంది! కొలబద్దతో ప్రపంచాన్ని ఎవరు కొలిచారు?
6 భూమికి ఆధారాలు దేనిమీద ఉన్నాయి?
భూమికి అత్యంత ముఖ్యమైన రాయిని దాని పునాదిలో వేసింది ఎవరు?
7 అది జరిగినప్పుడు ఉదయ నక్షత్రాలు కలిసి పాడాయి.
దేవదూతలు కేకలు వేసి, ఎంతో సంతోషించారు.
8 “యోబూ, భూమి అగాధములో నుండి
సముద్రం ప్రవహించినప్పుడు దానిని నిలిపేందుకు దాని తలుపులు మూసినవారు ఎవరు?
9 ఆ సమయంలో నేనే సముద్రాన్ని మేఘాలతో కప్పి వేశాను.
మరియు సముద్రాన్ని చీకటితో చుట్టి వేశాను.
10 సముద్రానికి హద్దులు నేనే నియమించాను.
మూయబడిన ద్వారాల వెనుక నేను దానిని ఉంచాను.
11 నీవు ఇంత మట్టుకు రావచ్చు. కాని ఇంకా ముందుకు రాకూడదు.
నీ గర్వపు అలలు ఆగి పోవాల్సింది ఇక్కడే, అని నేను సముద్రంతో చెప్పాను.
12 “యోబూ, ప్రారంభం కావాలని ఉదయంతోను, ప్రారంభం కావాలని రోజుతోను నీ జీవితంలో
నీవు ఎప్పుడైనా చెప్పావా?
13 యోబూ, ఉదయపు వెలుగు భూమిని ఆవరించాలని,
దుర్మార్గులు తాము దాగుకొనే స్థలాలు విడిచిపెట్టేలా ఉదయపు వెలుగు వారిని బలవంతం చేయాలని నీవు ఎన్నడయినా దానితో చెప్పావా?
14 ఉదయపు వెలుగు కొండలు,
లోయలు కనబడేటట్టు చేస్తుంది.
పగటి వెలుగు భూమి మీదికి వచ్చినప్పుడు
ఆ స్థలాల ఆకారాలు చోక్కా మడతల్లా తేటగా కనబడతాయి.
అచ్చు వేయబడిన మెత్తని మట్టిలా
ఆ స్థలాల ఆకారాలు రూపొందుతాయి.
15 దుర్మార్గులకు పగటి వెలుగు ఇష్టం లేదు.
అది బాగా ప్రకాశించినప్పుడు, వారు వారి చెడ్డ పనులు చేయకుండా అది వారిని వారిస్తుంది.
16 “యోబూ, సముద్రం మొదలయ్యే దాని లోతైన చోట్లకు నీవు ఎప్పుడైనా వెళ్లావా?
మహా సముద్రపు అట్టడుగున నీవు ఎప్పుడైనా నడిచావా?
17 యోబూ, మరణపు చీకటి చోటు ఎదుట నిలిచే ద్వారాలను
ఎవరైనా, ఎన్నడయినా నీకు చూపించారా?
18 యోబూ, భూమి ఎంత పెద్దదో నిజంగా నీవు గ్రహిస్తున్నావా?
ఇదంతా నీకు తెలిస్తే నాతో చెప్పు.
19 “యోబూ, వెలుగు వచ్చే దిశగా పోయేందుకు ఎటు వెళ్లాలి?
చీకటి ఎక్కడ నుండి వస్తుంది?
20 యోబూ, చీకటి వెలుగు ఎక్కడ నుండి వస్తాయో అక్కడికి వాటిని నీవు తీసుకొని వెళ్లగలవా?
అవి నివసించే చోటుకు ఎటుగా వెళ్లాలో నీకు తెలుసా?
21 యోబూ, నీవు చాలా ముసలివాడివి కదా?
భూమి చేయబడినప్పుడు నీవు అక్కడ ఉన్నావు కనుక నీకు ఈ సంగతులన్నీ తెలుసు అని నాకు గట్టిగా తెలుసు. నీవు లేవూ?
22 “యోబూ, నేను హిమమును, వడగండ్లను నిలువ ఉంచే గిడ్డంగులకు
నీవు ఎప్పుడైనా వెళ్లావా?
23 కష్టదినాల్లో, యుద్ధ దినాల్లో, పోరాట దినాల్లో ఉపయోగించేందుకు హిమమును,
వడగండ్లను నేను దాచిపెడతాను.
24 యోబూ, సూర్యుడు ఎక్కడ నుండి పైకి వస్తాడో అక్కడికి నీవు ఎన్నడయినా వెళ్లావా?
భూమి అంతటా వీచేందుకు తూర్పు గాలులు ఎక్కడనుండి వస్తాయో అక్కడికి నీవు ఎన్నడయినా వెళ్లావా?
25 యోబూ, భారీ వర్షం కోసం ఆకాశంలో మార్గాన్ని ఎవరు తవ్వారు?
ఉరుములోని మెరుపుకు మార్గం ఎవరు చేశారు?
26 యోబూ, మనుష్యులు ఎవరూ నివసించని చోట నీళ్లు ఉండునట్లు.
27 బీడు భూమిని తృప్తిపరచుటకు దానిని విస్తారమైన గడ్డితో పచ్చగా చేయుటకు నీళ్లు ఇచ్చి,
ఈ సంగతులను చేసిన వారు ఎవరు?
28 యోబూ, వర్షానికి తండ్రి ఉన్నాడా?
మంచు బిందువులు ఎక్కడ నుండి వస్తాయి?
29 యోబూ, హిమమునకు తల్లి ఎవరు?
ఆకాశంనుండి కురిసే మంచుకు జన్మ ఇచ్చేది ఎవరు?
30 జలాలు బండలా గట్టిగాను మహా సముద్రాల పైభాగాలు
గట్టిగాను ఎప్పుడు బిగిసిపోతాయి?
31 “యోబూ, కృత్తిక నక్షత్రాలను నీవు బిగించగలవా?
మృగశీర్షిక కట్లు నీవు విప్పగలవా?
32 యోబూ, నక్షత్రరాసులు సరియైన కాలములలో సమకూడునట్లు నీవు చేయగలవా?
లేక ఎలుగుబంటిని దాని పిల్లలతో నీవు నడిపించగలవా?
33 యోబూ, ఆకాశాన్ని పాలించే నియమాలు నీకు తెలియునా?
భూమి మీద వాటి పాలనను నీవు ప్రారంభించగలవా?
34 “యోబూ, మేఘాలు భారీ వర్షంతో నిన్ను ముంచెత్తునట్లు
నీవు కేకవేసి వాటికి ఆజ్ఞలు ఇవ్వగలవా?
35 యోబూ, నీవు కోరిన చోటికి మెరుపును పంపగలవా?
మెరుపు నీ దగ్గరకు వచ్చి యోబూ, ‘ఇదిగో మేము వచ్చాం, నీకు ఏమి కావాలి?’
అని అంటాయా?
36 “ఒక మనిషి మనస్సులో జ్ఞానం కలిగించేది ఎవరు?
మనస్సుకు గ్రహింపును ఇచ్చేది ఎవరు?
37 యోబూ, మేఘాలను లెక్కించుటకు,
అవి వాటి వర్షమును కురియునట్లు వాటికి లంచం ఇచ్చుటకు అంతటి తెలివిగలవారు ఎవరు?
38 ఆ వర్షం దుమ్మును గట్టి పరుస్తుంది.
ఆ మట్టి గడ్డలు ఒక్కటిగా అతుక్కుంటాయి.
39 “యోబూ, ఆడ సింహమునకు ఆహారం నీవు కనుగొంటావా?
ఆకలితో ఉన్న సింహపు పిల్లలకు నీవు ఆహారం పెడతావా?
40 అవి దాగుకొనే చోట్ల వాటి గుహలలో
పండుకొని లేక కూర్చొని ఉంటాయి.
41 యోబూ, కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు ఆహారం లేక అటు ఇటు తిరుగునప్పుడు
కాకులను పోషించేది ఎవరు?
చందాలు సేకరించటం
8 సోదరులారా! మాసిదోనియ దేశంలోని సంఘాల పట్ల దేవుడు చూపిన అనుగ్రహాన్ని గురించి మీకు తెలపాలని మా అభిప్రాయం. 2 వాళ్ళ కష్టాలు వాళ్ళను తీవ్రంగా పరీక్షించాయి. వాళ్ళు చాలా పేదరికం అనుభవించారు. అయినా వాళ్ళలో చాలా ఆనందం కలిగి, వాళ్ళు యివ్వటంలో మిక్కిలి ఔదార్యం చూపారు. 3 వాళ్ళు యివ్వగలిగింది స్వయంగా యిచ్చారు. అంతే కాదు, తాము యివ్వగలిగినదానికన్నా ఇంకా ఎక్కువే యిచ్చారని నేను ఖచ్చితంగా చెప్పగలను. 4 విశ్వాసులైనవారికి చేసే సహాయంలో తాము కూడా చేరుతామని వాళ్ళు మమ్మల్ని ప్రాధేయపడ్డారు. 5 మేము ఆశించినంతగా చేయలేదు. అయినా వాళ్ళు మొదట తమను తాము ప్రభువుకు అర్పించుకొన్నారు. తర్వాత దేవుని చిత్తానుసారంగా మాకును అప్పగించుకున్నారు.
6 ఈ కార్యాన్ని ప్రారంభించిన తీతును దీన్ని కొనసాగించమని వేడుకొన్నాము. మీరు చేయాలనుకొన్న ఈ సేవాకార్యాన్ని అతడు పూర్తిచేసాడు. 7 మీరు విశ్వాసంలో, మాటలో, జ్ఞానంలో, సంపూర్ణ ఆసక్తిలో, మా పట్ల వ్యక్తపరుస్తున్న ప్రేమలో అందరిని మించిపోయారు. మీ దాతృత్వంలో కూడా అందరిని మించిపోవాలని మిమ్మల్ని అడుగుతున్నాను.
8 నేను మీకు ఆజ్ఞాపించటం లేదు. ఇతరులు చేస్తున్న సేవతో మీ ప్రేమను పోల్చి చూడాలని ఉంది. మీ ప్రేమ ఎంత నిజమైందో చూడాలని ఉంది. 9 మన యేసు క్రీస్తు ప్రభువు అనుగ్రహం ఎంత గొప్పదో మీకు తెలుసు. ఆయన ఐశ్వర్యవంతుడైనా మీ కొరకు పేదవాడయ్యాడు. ఆయన పేదరికం వల్ల మీరు ఐశ్వర్యవంతులు కావాలని ఆ విధంగా చేసాడు.
10 ఈ విషయంలో మీకు ఏది మంచిదో అది చెబుతాను. పోయిన సంవత్సరం మీరు అందరికన్నా ఎక్కువగా యివ్వటమే కాకుండా అలాంటి ఉద్దేశ్యం ఉన్నవాళ్ళలో మీరే ప్రథములు. 11 కార్యాన్ని మొదలు పెట్టటంలో చూపిన ఆసక్తి దాన్ని పూర్తి చెయ్యటంలో కూడా చూపండి. మీ శక్త్యానుసారం చెయ్యండి. 12 మీకు యివ్వాలనే ఆసక్తి ఉంటే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. మీ దగ్గర లేనిదాన్ని బట్టి కాకుండా ఉన్నదాన్ని బట్టి మీరిచ్చింది అంగీకరిస్తాడు. 13 మీ మీద భారం మోపి యితరుల భారం తగ్గించాలని కాదు కాని అందరికీ సమానంగా ఉండవలెనని నా ఉద్దేశ్యం. 14 ప్రస్తుతం మీ దగ్గర అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. కనుక అవసరమున్నవాళ్ళకు మీరు సహాయం చెయ్యటం సమంజసమే. అలా చేస్తే మీకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చేస్తారు. అప్పుడు సమంజసంగా ఉంటుంది. 15 లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు:
“ఎక్కువ కూడబెట్టిన వాని దగ్గర ఎక్కువ లేదు.
తక్కువ కూడబెట్టిన వాని దగ్గర తక్కువ లేదు.”(A)
తీతును కొరింథుకు పంపటం
16 మీపట్ల నాకున్న చింతనే, దేవుడు తీతు హృదయంలో కూడా పెట్టాడు. అందుకు నేను దేవునికి కృతజ్ఞుణ్ణి. 17 తీతు మా నివేదన అంగీకరించాడు. అంతేకాక, చాలా ఉత్సాహంతో స్వయంగా మీ దగ్గరకు వస్తున్నాడు. 18 అతని వెంట యింకొక సోదరుణ్ణి పంపుతున్నాము. ఈ సోదరుడు సువార్త ప్రకటించి చేసిన సేవను అన్ని సంఘాలు అభినందిస్తున్నాయి. 19 పైగా, అతడు మా వెంట ఉండి, మాతో సహా ఈ కానుకను తీసుకు వెళ్ళాలని సంఘాలు అతణ్ణి ఎన్నుకొన్నాయి. మేమీకానుక ప్రభువు మహిమ కోసం తీసుకు వెళ్తున్నాము. సహాయం చేయాలన్న మా ఉత్సాహాన్ని చూపాలని మా ఉద్దేశ్యం.
20 ఈ గొప్ప విరాళాలు విమర్శకు గురి కాకుండా జాగ్రత్తగా యిస్తాము. 21 ప్రభువు దృష్టిలోనే కాకుండా ప్రజల దృష్టిలో కూడా ఏది ధర్మమో అది చెయ్యాలని మేము శ్రద్ధతో కష్టపడుతున్నాము.
22 అందువల్ల మా సోదరుణ్ణి కూడా వాళ్ళతో పంపుతున్నాము. ఇతన్ని మేము చాలా సార్లు పరీక్షించాము. సేవ చెయ్యాలనే ఉత్సాహం అతనిలో ఉన్నట్లు గ్రహించాము. ఇక అతనికి మీ పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉండటంవల్ల అతని ఉత్సాహం ఇంకా ఎక్కువైంది.
23 ఇక తీతు విషయమా! అతడు నేను మీకోసం చేస్తున్న సేవలో భాగస్థుడు. నాతో కలిసి పని చేసేవాడు. ఇక మేము పంపిన సోదరులు, సంఘాల ప్రతినిధులు, క్రీస్తుకు గౌరవం కలిగించేవాళ్ళు. 24 అందువల్ల, మీకు ప్రేమ ఉన్నట్లు వాళ్ళకు రుజువు చెయ్యండి. మేము మీ విషయంలో ఎందుకు గర్విస్తున్నామో వాళ్ళకు చూపండి. అలా చెయ్యటం వల్ల సంఘాలన్నీ దీన్ని గమనిస్తాయి.
© 1997 Bible League International