M’Cheyne Bible Reading Plan
ఇస్సాకును యాకోబు మోసగించుట
27 ఇస్సాకు ముసలివాడైనప్పుడు అతని చూపు సన్నగిల్లింది. ఇస్సాకు తేటగా చూడలేకపోయాడు. ఒకనాడు తన పెద్ద కుమారుని అతడు తన దగ్గరకు పిల్చాడు, “కుమారుడా!” అన్నాడు.
“ఇదిగో ఇక్కడే ఉన్నాను” అని జవాబిచ్చాడు ఏశావు.
2 ఇస్సాకు చెప్పాడు: “చూడు, నేను ముసలివాడనయ్యాను. ఒకవేళ త్వరలో నేను చనిపోతానేమో! 3 కనుక నీ విల్లు, అంబులు తీసుకొని వేటకు వెళ్లు. నేను తినటానికి ఒక జంతువును చంపు. 4 నాకు ఇష్టమైన భోజనం తయారు చేయి. అది నా దగ్గరకు తీసుకురా, నేను తింటాను. అప్పుడు నేను మరణించక ముందు నిన్ను ఆశీర్వదిస్తాను.” 5 కనుక ఏశావు వేటకు వెళ్లాడు.
ఇస్సాకు తన కుమారుడైన ఏశావుతో ఆ సంగతులు చెబ తున్నప్పుడు రిబ్కా విన్నది. 6 తన కుమారుడైన యాకోబుతో రిబ్కా చెప్పింది: “విను, నీ సోదరుడు ఏశావుతో నీ తండ్రి మాట్లాడటం నేను విన్నాను. 7 ‘నేను తినటానికి ఒక జంతువును చంపి నా కోసం భోజనం సిద్ధం చేయి, నేను భోంచేస్తాను. అప్పుడు నేను మరణించక ముందు నిన్ను ఆశీర్వదిస్తాను’ అని నీ తండ్రి చెప్పాడు. 8 కనుక, కుమారుడా, నేను చెప్పేది విని అలా చేయి. 9 మన మేకల మందలోనికి వెళ్లి, రెండు మేక పిల్లల్ని నా దగ్గరకు తీసుకురా. నీ తండ్రికి ఇష్టమైన పద్ధతిలో నేను వాటిని సిద్ధం చేస్తాను. 10 అప్పుడు ఆ భోజనాన్ని నీవే నీ తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్లు. ఆయన మరణించక ముందు నిన్ను ఆశీర్వదిస్తాడు.”
11 అయితే యాకోబు తన తల్లి రిబ్కాతో ఇలా చెప్పాడు: “అయితే నా సోదరుడి శరీరమంతా వెంట్రుకలు ఉంటాయి, అతనిలా నాకు వెంట్రుకలు ఉండవు. 12 నా తండ్రి నన్ను తాకితే నేను ఏశావును కానని ఆయన తెలుసుకుంటాడు. అప్పుడు ఆయన నన్ను ఆశీర్వదించడు. నేను ఆయన్ని మోసం చేయటానికి ప్రయత్నించినందువల్ల ఆయన నన్ను శపిస్తాడు.”
13 కనుక రిబ్కా, “ఏదైనా కష్టం వస్తే ఆ నింద నేను భరిస్తాను. నేను చెప్పినది చేయి. వెళ్లి మేకల్ని తెచ్చి నాకు ఇవ్వు” అని అతనితో చెప్పింది.
14 కనుక యాకోబు వెళ్లి రెండు మేకల్ని తీసుకొని, తెచ్చి వాటిని తల్లికి ఇచ్చాడు. ఇస్సాకుకు ఇష్టమైన ఒక ప్రత్యేక విధానంలో అతని తల్లి ఆ మేకలతో వంట చేసింది. 15 తర్వాత ఆమె తన కుమారుడు ఏశావు ఎక్కువగా ఇష్టపడి ధరించే బట్టలు తెచ్చింది. ఆ బట్టలను చిన్న కుమారుడు యాకోబుకు ధరింపజేసింది. 16 ఆ మేకల చర్మాలను రిబ్కా తీసుకొని, వాటిని యాకోబు చేతుల మీద వేసింది. 17 తర్వాత రిబ్కా తాను వండిన భోజనం తెచ్చి, దానిని యాకోబుకు యిచ్చింది.
18 యాకోబు తన తండ్రి దగ్గరకు వెళ్లి, “తండ్రీ!” అని పిల్చాడు.
“ఏమి కుమారుడా, ఎవరు నీవు?” అన్నాడు తండ్రి.
19 “నేను ఏశావును, నీ పెద్ద కుమారుడను. నీవు నాకు చెప్పిన పనులు చేశాను. నీ కోసం నేను వేటాడి తెచ్చిన జంతువులను సమకూర్చి వాటితో నీకొరకైన భోజనమును సిద్ధపరచాను. దానిని తిని, తృప్తిపొంది నన్ను ఆశీర్వదించవచ్చు” అని యాకోబు తన తండ్రితో చెప్పాడు.
20 అయితే ఇస్సాకు, “నీవు ఇంత త్వరగా ఎలా వేటాడి జంతువుల్ని చంపగలిగావు?” అని తన కుమారుణ్ణి అడిగాడు.
“త్వరగా నేను జంతువుల్ని సంపాదించటానికి నీ దేవుడైన యెహోవా నాకు సహాయంచేశాడు గనుక” అని యాకోబు జవాబిచ్చాడు.
21 అప్పుడు ఇస్సాకు, “నా కుమారుడా నేను నిన్ను తడిమి చూడాలి. కనుక నీవిలా నా దగ్గరగా రా. నిన్ను నేను తడిమి చూస్తే, నిజంగా నీవు నా కుమారుడు ఏశావువో కాదో తెలుస్తుంది” అన్నాడు యాకోబుతో.
22 కనుక తన తండ్రియైన ఇస్సాకు దగ్గరకు యాకోబు వెళ్లాడు. ఇస్సాకు అతణ్ణి తడిమి చూసి, “నీ స్వరం యాకోబు స్వరంలా ఉంది. కానీ, నీ చేతులు మాత్రం ఏశావు చేతుల్లా వెంట్రుకలతో ఉన్నాయి” అన్నాడు. 23 యాకోబు చేతులు ఏశావు చేతులవలె వెంట్రుకలతో ఉన్నందువల్ల అతడు యాకోబు అని ఇస్సాకుకు తెలియలేదు. కనుక ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడు.
24 “నిజంగా నీవు నా కుమారుడు ఏశావువేనా?” అని ఇస్సాకు అడిగాడు.
“అవును, నేనే” అని యాకోబు జవాబిచ్చాడు.
యాకోబుకు ఆశీర్వాదం
25 అప్పుడు ఇస్సాకు, “ఆ భోజనం నా దగ్గరకు తీసుకురా. నేను దానిని తిని, నిన్ను ఆశీర్వదిస్తాను” అన్నాడు. కనుక యాకోబు అతనికి భోజనం ఇచ్చాడు, అతడు భోంచేశాడు. యాకోబు అతనికి ద్రాక్షారసం ఇచ్చాడు, అతడు త్రాగాడు.
26 అప్పుడు ఇస్సాకు, “కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకో” అని అతనితో చెప్పాడు. 27 కనుక యాకోబు తన తండ్రి దగ్గరకు వెళ్లి, అతణ్ణి ముద్దు పెట్టుకొన్నాడు. అతని వస్త్రాలను ఇస్సాకు వాసన చూచి, అతణ్ణి ఆశీర్వదించాడు. ఇస్సాకు ఇలా అన్నాడు:
“నా కుమారుని వాసన యెహోవా ఆశీర్వదించిన చేని సువాసనలా ఉంది.
28 విస్తారమైన పంటలు, ద్రాక్షారసం నీకు ఉండేటట్లు వర్షాలు యెహోవా నీకు సమృద్ధిగా ఇచ్చుగాక.
29 మనుష్యులంతా నిన్నే సేవిస్తారు గాక,
జనములు నీకు సాగిలపడుదురు గాక,
నీ సోదరుల మీద నీవు పరిపాలన చేస్తావు
నీ తల్లియొక్క కుమారులు నీకు సాగిలపడి నీకు లోబడుతారు,
“నిన్ను శపించే ప్రతీ వ్యక్తి శపించబడతాడు,
నిన్ను ఆశీర్వదించే ప్రతీ వ్యక్తి ఆశీర్వదించబడతాడు.”
ఏశావుకు ఆశీర్వాదం లేకుండుట
30 యాకోబును ఆశీర్వదించటం ముగించాడు ఇస్సాకు. అప్పుడు, తన తండ్రి ఇస్సాకును విడిచి యాకోబు వెళ్తుండగా, వేటనుండి ఏశావు తిరిగి వచ్చాడు. 31 తన తండ్రికి ఇష్టమైన ప్రత్యేక విధానంలో భోజనం తయారు చేశాడు ఏశావు. దానిని ఏశావు తన తండ్రి దగ్గరకు తెచ్చాడు. అతడు తన తండ్రితో, “నాయనా, లేచి నీ కుమారుడు నీ కోసం వేటాడి తెచ్చి వండిన మాంసాన్ని తిను, అప్పుడు నీవు నన్ను దీవించగలవు”.
32 అయితే ఇస్సాకు, “ఎవరు నీవు?” అని అతన్ని అడిగాడు.
“నేను నీ మొదటి కుమారుణ్ణి, ఏశావును” అన్నాడతను.
33 అప్పుడు ఇస్సాకు చాలా బాధపడి, “అలాగైతే నీవు రాకముందు భోజనం వండి, నా దగ్గరకు తీసుకువచ్చినదెవరు? నేను అదంతా శుభ్రంగా భోంచేసి, అతణ్ణి నేను ఆశీర్వదించానుగదా. ఇప్పుడు మళ్లీ నా ఆశీర్వాదాన్ని నేను వెనుకకు తీసుకోవటానికి సమయం మించిపోయిందే” అన్నాడు.
34 తన తండ్రి మాటలు విన్నప్పుడు ఏశావులో కోపం, కక్ష రెచ్చిపోయాయి. అతను గట్టిగా ఏడ్చేసి “అలాగైతే నన్ను కూడా ఆశీర్వదించు నాయనా” అని తన తండ్రితో చెప్పాడు.
35 “నీ సోదరుడు నన్ను మోసం చేశాడు. అతను వచ్చి, నీ ఆశీర్వాదాలు తీసుకొన్నాడు” అన్నాడు ఇస్సాకు.
36 “అతని పేరే యాకోబు (మోసగాడు). అది అతనికి సరైన పేరు. రెండుసార్లు అతడు నన్ను మోసం చేశాడు. జ్యేష్ఠత్వపు హక్కు తీసివేసుకొన్నాడు, ఇప్పుడు నా ఆశీర్వాదాలు తీసివేసుకొన్నాడు” అని చెప్పి ఏశావు, “మరి నా కోసం ఆశీర్వాదాలు ఏమైనా మిగిల్చావా?” అని ప్రశ్నించాడు.
37 “లేదు, ఇప్పుడు చాలా ఆలస్యమైపోయింది. నీ మీద పరిపాలన చేసే అధికారం యాకోబుకు నేనిచ్చాను. అతని సోదరులంతా అతని సేవకులవుతారని కూడా నేను చెప్పాను. ధాన్యం, ద్రాక్షారసం, సమృద్ధిగా కలిగే అశీర్వాదం కూడా నేను అతనికి యిచ్చాను. నీకు ఇచ్చేందుకు యింకేమీ మిగల్లేదు కుమారుడా” అని జవాబిచ్చాడు ఇస్సాకు.
38 ఏశావు తన తండ్రిని బ్రతిమలాడుతూనే ఉన్నాడు. “నాయనా, నీ దగ్గర ఒక్క ఆశీర్వదమే ఉందా? నన్ను కూడా ఆశీర్వదించు నాయనా” అంటూ ఏశావు ఏడ్వటం మొదలుబెట్టాడు.
39 అప్పుడు అతనితో ఇస్సాకు ఇలా చెప్పాడు:
“నీవు సారం లేని దేశంలో నివసిస్తావు.
నీకు వర్షపాతం ఎక్కువగా ఉండదు.
40 నీ మనుగడ కోసం నీవు పోరాడాలి,
నీవు నీ సోదరునికి బానిసవు అవుతావు.
అయితే స్వతంత్రం కోసం
నీవు పోరాడతావు. అతని స్వాధీనం నుండి నీవు విడిపోతావు.”
యాకోబు దేశాన్ని వదలి వెళ్ళుట
41 ఆ తరువాత తన తండ్రి అతణ్ణి ఆశీర్వదించడంవల్ల యాకోబును ఏశావు అసహ్యించుకొన్నాడు. ఏశావు, “త్వరలోనే నా తండ్రి చనిపోతాడు, నేను అతని కోసం దుఃఖిస్తాను. కాని ఆ తర్వాత యాకోబును నేను చంపేస్తాను” అని తనలో తాను అనుకొన్నాడు.
42 ఏశావు యాకోబును చంపాలని చేస్తున్న ఆలోచనను గూర్చి రిబ్కా విన్నది. యాకోబును పిలిపించి, అతనితో ఆమె ఇలా చెప్పింది: “ఇది విను, నీ అన్న ఏశావు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. 43 అందుచేత, కుమారుడా, నేను చెప్పినట్లు చేయి. హారానులో నా సోదరుడు లాబాను ఉన్నాడు. అతని దగ్గరకు వెళ్లి దాగుకో. 44 కొన్నాళ్లపాటు అతని దగ్గరే ఉండు. నీ అన్న కోపం చల్లారే వరకు అతని దగ్గరే ఉండు. 45 కొన్ని రోజులు కాగానే నీవు నీ అన్నకు చేసినది అతడు మరచిపోతాడు. అప్పుడు నిన్ను వెనుకకు తీసుకొని రావటానికి నేను ఒక సేవకుని పంపిస్తాను. నా ఇద్దరు కుమారులను ఒకేనాడు పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు.”
46 అప్పుడు రిబ్కా ఇస్సాకుతో, “నీ కుమారుడైన ఏశావు హిత్తీ స్త్రీలను పెళ్లి చేసుకొన్నాడు. వాళ్లు మన ప్రజలు కారు గనుక వారితో నేను చాలా విసిగిపోయాను. యాకోబు కూడా వాళ్లలో ఒక స్త్రీని పెళ్లి చేసుకొంటే, నేను చావటం మంచిది” అని చెప్పింది.
యూదా నాయకులు యేసును చంపుటకు కుట్ర పన్నటం
(మార్కు 14:1-2; లూకా 22:1-2; యోహాను 11:45-53)
26 యేసు చెప్పటం ముగించాడు. ఆ తదుపరి శిష్యులతో 2 “రెండు రోజుల తర్వాత పస్కాపండుగ వస్తొందని మీకు తెలుసు. ఆ తర్వాత మనుష్య కుమారునికి శ్రమ సంభవిస్తుంది. తత్ఫలితంగా ఆయన శత్రువులు ఆయన్ని సిలువకు వేస్తారు” అని అన్నాడు.
3 ప్రధానయాజకులు, పెద్దలు, కయప అని పిలువబడే ప్రధానయాజకుని యింటి ఆవరణంలో సమావేశమై 4 యేసును ఏదో ఒక కుట్రతో బంధించి చంపాలని పన్నాగం పన్నారు. 5 “కాని పండుగ రోజుల్లో కాదు. అలా చేస్తే ప్రజల్లో అల్లర్లు చెలరేగవచ్చు” అని అనుకొన్నారు.
బేతనియ గ్రామంలో తైలాభిషేకం
(మార్కు 14:3-9; యోహాను 12:1-8)
6 బేతనియ గ్రామంలో కుష్టురోగియగు సీమోను అని పిలువబడే ఒక వ్యక్తి యింట్లో యేసు ఉన్నాడు. 7 యేసు భోజనానికి కూర్చొని ఉండగా ఒక స్త్రీ చలువరాతి బుడ్డిలో అతి విలువైన అత్తరుతో ఆయన దగ్గరకు వచ్చి ఆయన తలపై పోసింది.
8 ఇది చూసి శిష్యులకు కోపం వచ్చింది. “ఎందుకిలా వ్యర్థంచేయటం? 9 ఈ అత్తరు పెద్ద మొత్తానికి అమ్మి ఆ డబ్బు పేదవాళ్ళ కివ్వవలసింది!” అని వాళ్ళన్నారు.
10 యేసుకు ఈ విషయం తెలిసి, “ఆమెనెందుకంటున్నారు? ఆమె సరియైన పని చేసింది, 11 పేద వాళ్ళు మీతో ఎప్పుడూ ఉంటారు. కాని నేను మీతో ఎల్లకాలం ఉండబోను. 12 ఆమె ఆ అత్తరు నా శరీరం మీద పోసి నన్ను సమాధి చెయ్యటానికి సిద్ధం చేసింది. 13 ఇది సత్యం—ఈ సువార్తను ప్రపంచంలో ఏ చోట ప్రకటించినా ఆమె జ్ఞాపకార్థం ఆమె చేసింది కూడా చెప్పబడుతుంది” అని అన్నాడు.
యేసుకు ద్రోహం చేయటానికి యూదా అంగీకరించటం
(మార్కు 14:10-11; లూకా 22:3-6)
14 ఆ తర్వాత పన్నెండుగురిలో ఒకడైన యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళాడు. 15 “ఆయన్ని మీ కప్పగిస్తే మీరు నాకేమివ్వాలనుకొన్నారు?” అని వాళ్ళనడిగాడు. వాళ్ళు ముప్పై వెండి నాణెములు లెక్క పెట్టి యిచ్చారు. 16 అప్పటినుండి యూదా ఆయన్ని పట్టివ్వాలని అవకాశం కోసం ఎదురు చూడసాగాడు.
పస్కా భోజనం
(మార్కు 14:12-21; లూకా 22:7-14, 21-23; యోహాను 13:21-30)
17 పులియని రొట్టెలు తినే పండుగ రోజులు వచ్చాయి. మొదటి రోజు శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “పస్కా పండుగ భోజనం ఎక్కడ సిద్ధం చేయమంటారు?” అని అడిగారు.
18 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “పట్టణంలోకి నేను చెప్పిన వ్యక్తి దగ్గరకు వెళ్ళండి. అతనితో ‘నా సమయం దగ్గరకొచ్చింది. నేను నా శిష్యులతో కలసి పస్కా పండుగ భోజనం మీ యింట్లో చెయ్యాలనుకొంటున్నానని మా ప్రభువు చెప్పమన్నారు’ అని చెప్పండి.” 19 శిష్యులు యేసు సూచించిన విధంగా పస్కాపండుగ విందు సిద్దం చేసారు.
20 సాయంత్రం కాగానే యేసు పన్నెండు మందితో కలసి భోజనానికి కూర్చున్నాడు. 21 అంతా భోజనం చేస్తుండగా ఆయన, “ఇది సత్యం. మీలో ఒకడు నాకు ద్రోహం చేస్తాడు” అని అన్నాడు.
22 వాళ్ళకు దుఃఖం కలిగింది. ప్రతి ఒక్కడు ఆయనతో, “ప్రభూ! నేను కాదు కదా!” అని అన్నాడు.
23 యేసు సమాధానం చెబుతూ, “నాతో కలసి గిన్నెలో చెయ్యి ఉంచిన వాడు నాకు ద్రోహం చేస్తాడు. 24 మనుష్యకుమారుడు లేఖనాల్లో వ్రాసినట్లు చనిపోతాడు. కాని ఆయనకు ద్రోహంచేసిన వానికి బహుశ్రమ కలుగుతుంది. వాడు జన్మించి ఉండక పోయినట్లయితే బాగుండేది” అని అన్నాడు.
25 అప్పుడు ఆయనకు ద్రోహం చేయనున్న యూదా, “నేను కాదు కదా రబ్బీ”[a] అని అన్నాడు.
యేసు, “ఔను! నువ్వే!”[b] అని సమాధానం చెప్పాడు.
ప్రభు రాత్రి భోజనము
(మార్కు 14:22-26; లూకా 22:15-20; 1 కొరింథీ. 11:23-25)
26 వాళ్ళు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి దాన్ని విరిచి శిష్యులకిస్తూ, “ఇది తీసుకొని తినండి! ఇది నా దేహం!” అని అన్నాడు.
27 ఆ తర్వాత పాత్రను తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి వాళ్ళకిస్తూ, “అందరూ ఈ పాత్రలోవున్న దాన్ని త్రాగండి. 28 ఇది నా ఒడంబడిక[c] రక్తం. అనేకులకు పాప క్షమాపణ కలగాలని నేనీ రక్తాన్ని చిందించాను. 29 ఈ రోజు నుండి నా తండ్రి రాజ్యంలో మీతో కలసి ద్రాక్షారసాన్ని మళ్ళీ త్రాగే దాకా దీన్ని యిక మీదట త్రాగనని మీతో చెబుతున్నాను” అని అన్నాడు.
30 వాళ్ళు కీర్తనను పాడాక ఒలీవ చెట్ల కొండ మీదికి వెళ్ళారు.
యేసు తన శిష్యులు ఆయన్ను విడిచిపెడతారని చెప్పటం
(మార్కు 14:27-31; లూకా 22:31-34; యోహాను 13:36-38)
31 ఆ తదుపరి యేసు వాళ్ళతో, “ఈ రాత్రి మీరు నా కారణంగా చెదరిపోతారు. ఎందుకంటే:
‘నేను గొఱ్ఱెల కాపరిని చంపుతాను
అప్పుడా గొఱ్ఱెల మంద చెదరిపోతుంది’(A) అని వ్రాయబడివుంది.
32 కాని దేవుడు నన్ను బ్రతికించాక నేను మీకన్నా ముందే గలిలయకు వెళ్తాను” అని అన్నాడు.
33 పేతురు, “అందరూ మిమ్మల్ని వదిలి వెళ్ళినా నేను మాత్రం మిమ్మల్ని వదలి వెళ్ళను” అని సమాధానం చెప్పాడు.
34 యేసు, “ఇది సత్యం. ఈ రాత్రి కోడి కూయక ముందే నేనెవరో తెలియదని మూడు సార్లు అంటావు” అని సమాధానం చెప్పాడు.
35 కాని పేతురు, “నేను మీతో కలసి మరణిస్తాను, కాని మీరెవరో నాకు తెలియదని అనను” అని అన్నాడు. శిష్యులందరూ అదే విధంగా అన్నారు.
యేసు ఏకాంతంగా ప్రార్థించటం
(మార్కు 14:32-42; లూకా 22:39-46)
36 ఆ తర్వాత యేసు శిష్యులతో కలసి గెత్సేమనే అనే ప్రదేశానికి వెళ్ళాడు. వాళ్ళతో, “ఇక్కడే కూర్చోండి. నేను అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తాను” అని అన్నాడు. 37 యేసు పేతుర్ని, జెబెదయి యొక్క యిద్దరు కుమారుల్ని తన వెంట పిలుచుకు వెళ్ళాడు. ఆయనకు దుఃఖం వచ్చింది. మనస్సు వ్యాకులం చెందింది. 38 అప్పుడాయన వాళ్ళతో, “నా ఆత్మ మరణ వేదన పొందుతోంది. ఇక్కడే ఉండి నాతో సహా మేలుకొని ఉండండి” అని అన్నాడు.
39 యేసు యింకా కొంత దూరం వెళ్ళి సాష్టాంగపడి, “నా తండ్రి! వీలైతే దుఃఖంతో నిండిన ఈ పాత్రను నా నుండి తీసివేయి! అయినా నెరవేరవలసింది నా యిచ్ఛకాదు, నీది” అని అంటూ ప్రార్థించాడు. 40 ఆ తర్వాత తిరిగి వచ్చి శిష్యులు నిద్రిస్తూ ఉండటం గమనించాడు. ఆయన, “నాతో సహా ఒక గంట సేవు మేలుకోలేక పొయ్యారా?” అని అన్నాడు. 41 “మెలకువగా ఉండి ప్రార్థించండి! అప్పుడే మీరు దుష్ప్రేరేపణకు లోనైపోకుండా ఉంటారు. ఆత్మ సిద్ధంగా ఉంది కాని శరీరం బలహీనంగా ఉంది!” అని పేతురుతో అన్నాడు.
42 ఆయన రెండవసారి వెళ్ళి, “నా తండ్రీ! ఈ పాత్రలోవున్నది త్రాగితేగాని వీల్లేదంటే నేను దాన్ని త్రాగుతాను. నీ యిష్టమే నెరవేరు గాక!” అని ప్రార్ధించాడు.
43 ఆయన తిరిగి వచ్చి తన శిష్యులు మళ్ళీ నిద్రిస్తుండటం గమనించాడు. కళ్ళు బరువెక్కటంవల్ల వాళ్ళు నిద్రనాపుకోలేక పోయారు. 44 ఆయన మూడవ సారి వాళ్ళను వదిలి వెళ్ళి ముందు ప్రార్థించినట్లే మళ్ళీ ప్రార్ధించాడు.
45 ఆ తదుపరి తన శిష్యుల దగ్గరకు వచ్చి, “మీరింకా నిద్రిస్తూ, విశ్రాంతి తీసుకొంటున్నారా. చూడండి! మనుష్యకుమారుడు పాపాత్ములకు అప్పగింపబడే ఘడియ దగ్గరకు వచ్చింది. 46 వెళ్దాం, లేవండి. అదిగో! నాకు ద్రోహం చేయనున్నవాడు వస్తున్నాడు!” అని అన్నాడు.
యేసు బంధించటం
(మార్కు 14:43-50; లూకా 22:47-53; యోహాను 18:3-12)
47 ఆయనింకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండుగురిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులు, ప్రజాప్రముఖులు పంపించిన పెద్ద ప్రజల గుంపు ఒకటి వాని వెంట ఉంది. వాళ్ళ చేతుల్లో కత్తులు, కర్రలు ఉన్నాయి. 48 ఆ ద్రోహి, “నేను వెళ్ళి ఎవర్ని ముద్దు పెట్టుకుంటానో, ఆయన్ని బంధించండి!” అని ముందే ఒక ఏర్పాటు చేసుకొన్నాడు. 49 యూదా వెంటనే యేసు దగ్గరకు వెళ్ళి, “వందనాలు రబ్బీ!” అని ఆయన్ని ముద్దుపెట్టుకున్నాడు.
50 యేసు, “మిత్రమా! నీవు చేయవచ్చిన పని చెయ్యి” అని అన్నాడు.
వెంటనే కొందరు వ్యక్తులు ముందుకు వచ్చి ఆయన్ని బంధించారు. 51 యేసుతో ఉన్న వాళ్ళలో ఒకడు వెంటనే తన కత్తిని వరనుండి తీసి, ప్రధాన యాజకుని సేవకుని యొక్క చెవిని నరికి వేసాడు.
52 యేసు, “కత్తిని వరలో పెట్టెయి! కత్తినెత్తిన వాడు ఆ కత్తితోనే మరణిస్తాడు. 53 నేను నా తండ్రిని సహాయం కావాలని అడగలేననుకొన్నావా? నేను అడిగిన వెంటనే పన్నెండు దళాలకంటే[d] ఎక్కువ మంది దేవదూతల్ని పంపుతాడు. 54 నేను అలాచేస్తే ఈ విధంగా జరగాలని లేఖనాల్లో వ్రాసినవి ఎట్లా నెరవేరుతాయి?” అని అన్నాడు.
55 ఆ తదుపరి యేసు వచ్చిన ప్రజలతో, “దోపిడి దొంగను పట్టుకోవటానికి వచ్చినట్లు కత్తులతో, కర్రలతో వచ్చారేం? మందిరావరణంలో కూర్చొని ప్రతిరోజు బోధించాను. కాని అప్పుడు మీరు నన్ను బంధించలేదు. 56 కాని, ప్రవక్తలు వ్రాసినవి నెరవేరాలని యివన్నీ జరిగాయి” అని అన్నాడు. వెంటనే ఆయన శిష్యులందరూ ఆయన్ని వదిలి వెళ్ళి పొయ్యారు.
మహాసభ సమక్షంలో యేసు
(మార్కు 14:53-65; లూకా 22:54-55, 63-71; యోహాను 18:13-14, 19-24)
57 వాళ్ళు యేసును బంధించి ప్రధాన యాజకుడైన కయప దగ్గరకు తీసుకు వెళ్ళారు. అక్కడ శాస్త్రులు, పెద్దలు ఇదివరకే సమావేశమై వున్నారు. 58 కాని పేతురు కొంత దూరంలోవుండి యేసును ప్రధానయాజకుని యింటి దాకా అనుసరించాడు. ఇంట్లో ఏం జరుగుతుందో చూడాలని భటుల్తో కలసి యింటి ముగింట్లో కూర్చున్నాడు.
59 మరణ శిక్ష విధించాలనే ఉద్దేశ్యంతో ప్రధాన యాజకులు, మహాసభ సభ్యులు యేసుకు ప్రతికూలంగా, దొంగ సాక్ష్యం కొరకు చూసారు. 60 చాలా మంది దొంగ సాక్ష్యం చెప్పటానికి ముందుకు వచ్చారు. కాని చంపడానికి సరైన కారణం లభించలేదు. చివరకు యిద్దరు వ్యక్తులు ముందుకు వచ్చి 61 ఈ విధంగా చెప్పారు, “ఈ వ్యక్తి ‘నేను దేవాలయాన్ని నాశనం చేసి మూడు రోజుల్లో మళ్ళీ నిర్మించగలను’ అని అన్నాడు.”
62 అప్పుడు ప్రధాన యాజకుడు లేచి నిలబడి యేసుతో, “నీవు సమాధానం చెప్పవా? వీళ్ళు చేస్తున్న నేరారోపణలేమిటి?” అని అడిగాడు. 63 కాని యేసు సమాధానం చెప్పలేదు.
ప్రధాన యాజకుడు, “సజీవుడైన దేవునిపై ప్రమాణం చేసి చెప్పు, నీవు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తువా?” అని అడిగాడు. 64 యేసు సమాధానం చెబుతూ, “ఔను! మీరన్నది నిజం. అంతే. నేను మీతో చెప్పేదేమిటంటే యిక మీదటి నుండి మనుష్యకుమారుడు సర్వశక్తిసంపన్నుని కుడివైపు కూర్చొని ఉండటం మీరు చూస్తారు. ఆయన మేఘాలపై రావటం మీరు చూస్తారు” అని అన్నాడు.
65 ఇది విని ప్రధానయాజకుడు తన దుస్తుల్ని చింపుకొని కోపాన్ని వ్యక్తపరుస్తూ, “ఇతను దైవదూషణ చేస్తున్నాడు. మనకింక ఇతర సాక్ష్యాలు ఎందుకు? చూడండి అతడు చేసిన దైవదూషణ విన్నారు కదా! 66 మరి మీరేమంటారు?” అని అడిగాడు. “అతనికి మరణదండన విధించవలసిందే” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
67 వాళ్ళలో కొందరు ఆయన ముఖంమ్మీద ఉమ్మేసి కొట్టారు. మరి కొందరు ఆయన చెంప మీద కొట్టి 68 “ఓ క్రీస్తూ! నిన్నెవరు కొట్టారో చెప్పుకో!” అని అన్నారు.
పేతురు యేసును ఎరుగుననుటకు భయపడటం
(మార్కు 14:66-72; లూకా 22:56-62; యోహాను 18:15-18, 25-27)
69 ఇక్కడ పేతురు బయట ముంగిట్లో కూర్చొని ఉండగా ఒక దాసీ పిల్ల అతని దగ్గరకు వచ్చి, “నీవు కూడా గలిలయ వాడైన యేసుతో ఉన్న వాడవే కదూ!” అని అడిగింది.
70 కాని అతడు వాళ్ళందరి ముందు, “నీవేం మాట్లాడుతున్నావో నాకు తెలియదు!” అని అంటూ ఆమె మాటను కాదన్నాడు.
71 ఆ తదుపరి, అతడు అక్కడి నుండి ద్వారం దగ్గరకు వెళ్ళాడు. అక్కడతణ్ణి మరోదాసీ పిల్ల చూసి, అక్కడున్న ప్రజలతో, “ఈ వ్యక్తి, నజరేతు యేసుతో ఉన్నవాడే!” అని అన్నది.
72 పేతురు ఒట్టు పెట్టుకొని మళ్ళీ ఆమె మాటల్ని కాదంటూ, “నాకు ఆ మనిషి ఎవరో తెలియదు!” అని అన్నాడు.
73 కొద్ది సేపయ్యాక అక్కడ నిలుచున్న వాళ్ళు పేతురు దగ్గరకు వచ్చి, “నీవు తప్పకుండా వాళ్ళలో ఒకడివి. నీ మాట తీరు చూస్తేనే తెలిసిపోతుంది!” అని అన్నారు.
74 అప్పుడు పేతురు శపించుకోవటం మొదలు పెట్టాడు. అతడు ప్రమాణం చేస్తూ, “ఆ మనిషి ఎవరో నాకు తెలియదు!” అని అన్నాడు. వెంటనే కోడి కూసింది. 75 అప్పుడు యేసు చెప్పిన ఈ మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి: “కోడి కూయక ముందే నేనెవరో తెలియదని మూడు సార్లంటావు” పేతురు బయటకు వెళ్ళి భోరున ఏడ్చాడు.
యూదుల వినాశనానికి హామాను పథకం
3 ఈ సంఘటనల తర్వాత అహష్వేరోషు మహారాజు హామానుకు గౌరవనీయ స్థానం ఇచ్చాడు. అగాగీయుడైన హామాను హమ్మెదాతా కొడుకు. మహారాజు హామానుకు ఉన్నత పదవి ఇచ్చి, అతన్ని మిగిలిన అధికారులందరికంటె ఉన్నత స్థానంలో ఉంచాడు. 2 రాజభవన ద్వారం దగ్గర వుండే అధికారులందరూ హామానుకు మోకరిల్లి, నమస్కరించాలని మహారాజు ఆజ్ఞ జారీ చేశాడు. అధికారులందరూ ఈ ఆజ్ఞను పాటించేవారు. అయితే, మొర్దెకై మాత్రం మోకరిల్లేందుకూ, గౌరవాభివందనం చేసేందుకూ నిరాకరించాడు. 3 అప్పుడు ద్వారం దగ్గరి ఉద్యోగులు మొర్దెకైని “హామాను ముందు మోకరిల్లాలన్న మహారాజు ఆజ్ఞను నువ్వెందుకు పాటించడం లేదు?” అని ప్రశ్నించారు.
4 ఆ రాజోద్యోగులు ప్రతిరోజూ మొర్దెకైతో ఈ విషయమై ప్రస్తావించేవారు. అయితే, హామాను ముందు మోకరిల్లాలన్న ఆజ్ఞను పాటించేందుకు మొర్దెకై తిరస్కరిస్తూ వచ్చాడు. దానితో, ఆ ఉద్యోగులు ఈ విషయాన్ని హామానుకు తెలియ జెప్పారు. మొర్దెకై విషయంలో హామాను ఏమి చేస్తాడో చూద్దామనుకున్నారు. తను యూదుడనన్న విషయాన్ని మొర్దెకై ఆ ఉద్యోగులకు చెప్పాడు. 5 మొర్దెకై తన ముందు మోకరిల్లి, గౌరవాభివందనం చేసేందుకు నిరాకరించాడని విన్న హామాను చాలా కోపం చెందాడు. 6 మొర్దెకై యూదుడు అన్న విషయం హామానుకు తెలిసింది. అయితే, ఒక్క మొర్దెకైని మాత్రమే చంపడం అతనికి తృప్తికరంగా కనిపించలేదు. మొర్దెకై జాతీయులందర్నీ, అంటే, అహష్వేరోషు సామ్రాజ్యంలోని రాజ్యాలన్నింట్లో గల యూదులందర్నీ సమూలంగా నాశనం చేసే మార్గం వెదక నారంభించాడు.
7 మహారాజు అహష్వేరోషు పాలనలో పన్నెండవ సంవత్సరం, నీసాను అనబడే మొదటి నెలలో హామాను తన కార్యక్రమానికి మంచి రోజును, నెలను ఎంచుకొనేందుకు చీటీలు వేశాడు. (ఆ రోజుల్లో ఈ చీటీలను “పూరు” అనేవారు). దాంట్లో అదారు అనబడే పన్నెండవ నెల ఎన్నిక చేయబడింది. 8 అప్పుడిక హామాను అహష్వేరోషు మహారాజు దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు: “మహారాజా, మీ సామ్రాజ్యంలోని అన్ని సామంత రాజ్యాల్లోనూ చెదురుమదురుగా ఒక జాతివాళ్లు వున్నారు. వాళ్లు ఆ దేశాల ప్రజలతో కలిసివుండక వేరుగా వుంటారు. వాళ్ల ఆచార సంప్రదాయాలు మిగిలిన ప్రజల వాటికి భిన్నమైనవి. వాళ్లు మహారాజు శాసనాలను పాటించరు. వాళ్లను మీ సామ్రాజ్యంలో ఉండనివ్వడం క్షేమ దాయకం కాదు.
9 “మహారాజు మన్నిస్తే నాదొక సలహా. ఆ జాతి ప్రజలను హతమార్చేందుకు ఆజ్ఞ జారీ చెయ్యండి. ఇందుకయ్యే ఖర్చుకుగాను నేను 10,000 వెండి నాణ్యాలు రాజ్య ఖజానాలో జమకడతాను. ఈ కార్య క్రమాన్ని నిర్వహించేవారికి వేతనాలు చెల్లించేందుకు ఈ మొత్తాన్ని వినియోగించవచ్చు.”
10 మహారాజు రాజముద్రిక ఉన్న ఉంగరాన్ని తీసి హామానుకు ఇచ్చాడు. హామాను అగాగీయుడైన హమ్మెదాతా కొడుకు. హామాను యూదులకు బద్ధ శత్రువు. 11 మహారాజు హామానుతో ఇలా అన్నాడు, “ఆ సొమ్ము నీ దగ్గరే వుంచుకో. ఆ జాతివాళ్ల విషయంలో నువ్వేమి చెయ్యదలచుకున్నావో చెయ్యి.”
12 అటు తర్వాత మొదటి నెల 13వ రోజున మహారాజుగారి లేఖకులు పిలువనంపబడ్డారు. వాళ్లు హామాను ఆజ్ఞలన్నింటినీ ఒక్కొక్క దేశపు భాషాలిపిలో వ్రాశారు. వాళ్లు వాటిని ఆయా ప్రజాబృందాల భాషల్లో వ్రాశారు. వాళ్లు మహారాజు సామంతులకు, ఆయా ప్రాంతాల పాలకులకు ఆ తాఖీదులు పంపారు. వాళ్లు ఆ తాఖీదులను మహారాజు పేరిట, మహారాజు ముద్రికతో పంపారు.
13 వార్తాహరులు ఆయా సామంత దేశాలకు యీ తాఖీదు పత్రాలను తీసుకెళ్లారు. యూదులందర్నీ చంపి వేయాలి, ఆ జాతి మొత్తాన్ని సర్వనాశనం చేయాలి, యిదీ మహారాజు ఆజ్ఞ. అంటే, యూదులందరూ పిల్లపాపలూ, యువతీ యువకులూ, ముసలి, వయస్సులో వున్నవాళ్లు, వయస్సు మళ్లినవాళ్లు, ఒక్కరోజులో హతమార్చ బడాలన్నమాట. ఆ రోజు అదారు అనబడే 12వ నెలలో 13వ రోజు అవుతుంది. ఆ ఆజ్ఞలో మరో అంశం యూదులకు చెందిన వస్తువులన్నింటినీ తీసేసు కోవడం. ఈలాగున ఆ తాఖీదు పత్రాలలో వ్రాయబడియున్నది.
14 ఆ ఆజ్ఞల ప్రతులు రాజశాసనంగా అందరికీ పంపబడ్డాయి. ఈ తాఖీదును అన్ని సామంత రాజ్యాల్లోనూ శాసనంగా చెల్లుబడి చెయ్యాలి, దాన్ని సామ్రాజ్యంలో అన్ని జాతుల ప్రజలకీ ప్రకటించాలి. 15 రాజాజ్ఞ మేరకు వార్తాహరులు హుటాహుటిగా బయల్దేరారు. రాజధాని నగరం షూషనులో కూడా యీ తాఖీదు ప్రతులు పంచబడ్డాయి. మహారాజూ, హామానూ మద్యం సేవిస్తూ కూర్చుండగా, అటు షూషను నగరం గందరగోళంలో మునిగిపోయింది.
పౌలు తాను నిర్దోషినని వాదించటం
26 అప్పుడు అగ్రిప్ప రాజు పౌలుతో, “నీవు చెప్పుకోదలచింది ఇక చెప్పకోవచ్చు!” అని అన్నాడు. పౌలు తన చేతులెత్తి, తాను నిర్దోషినని నిరూపించుకోవటానికి ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు: 2 “అగ్రిప్ప రాజా! ఈ రోజు మీ ముందు నిలుచొని యూదులు నాపై ఆరోపించిన నేరాలు అసత్యమని రుజువు చేసుకోవటానికి అవకాశం కలగటం నా అదృష్టం. 3 మీకు యూదులతో, వాళ్ళ ఆచారాలతో, వాళ్ళు తర్కించే విషయాలతో బాగా పరిచయముంది. కనుక యిది నిజంగా నా అదృష్టం. నేను చెప్పేది మీరు శాంతంగా వినాలని మనవి చేసుకొంటున్నాను.
4 “నేను చిన్ననాటినుండి ఏ విధంగా జీవించానో యూదులందరికీ తెలుసు. నా దేశంలో గడచిన నా బాల్యం మొదలుకొని యెరూషలేములో జరిగిన సంఘటనల దాకా జరిగినదంతా వాళ్ళకు తెలుసు. 5 వాళ్ళు నన్ను ఎన్నో సంవత్సరాలనుండి ఎరుగుదురు. నేను, మన మతంలోని నిష్ఠగల పరిసయ్యుల తెగను అనుసరిస్తూ జీవించానని వాళ్ళకు తెలుసు. కావాలనుకొంటే వాళ్ళే యిది నిజమని సాక్ష్యం చెబుతారు. 6 దేవుడు మన పూర్వికులకు చేసిన వాగ్దానంలో నాకు నమ్మకం ఉంది. అందువల్లే నేను ఈ రోజు ఈ పరీక్షకు నిలబడవలసి వచ్చింది. 7 ఈ వాగ్దానం పూర్తి కావాలని మన పండ్రెండు గోత్రాలవాళ్ళు రాత్రింబగళ్ళు విశ్వాసంతో దేవుణ్ణి సేవిస్తూ ఎదురు చూస్తున్నారు. ఓ రాజా! ఈ ఆశ నాలో ఉండటం వల్లే యూదులు నన్ను నేరస్థునిగా పరిగణిస్తున్నారు. 8 దేవుడు చనిపోయినవాళ్ళను బ్రతికిస్తాడు. ఈ సత్యాన్ని మీరు ఎందుకు కాదంటున్నారు?
9 “ఒకప్పుడు నేను కూడా నజరేతు నివాసి యేసు నామము లేకుండా చెయ్యటం నా కర్తవ్యంగా భావించాను. 10 నేను యెరూషలేములో చేసింది అదే. ప్రధానయాజకులు యిచ్చిన అధికారంతో నేను చాలామంది పరిశుద్ధుల్ని కారాగారంలో వేసాను. వాళ్ళను చంపటానికి నేను అంగీకారం కూడా తెలిపాను. 11 ఎన్నోసార్లు నేను ఒక సమాజమందిరమునుండి మరొక సమాజమందిరానికి వెళ్ళి వాళ్ళను శిక్షించాను. వాళ్ళతో బలవంతంగా యేసును దూషింపచేసాను. పిచ్చి కోపంతో యితర పట్టణాలకు కూడా వెళ్ళి ఆ మార్గాన్ని అనుసరించే వాళ్ళను హింసించాను.
యేసును చూశానని పౌలు సాక్ష్యమివ్వటం
12 “ఒక రోజు నేను, ప్రధాన యాజకుల అధికారంతో, అనుమతితో డెమాస్కసుకు వెళ్తున్నాను. 13 సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు, ఓ రాజా! నేను దారిలో ఉండగా ఆకాశంనుండి ఒక గొప్ప వెలుగు రావటం చూసాను. ఆ వెలుగు సూర్యునికన్నా యింకా ఎక్కువ వెలుగుతో వచ్చి నా మీద నాతో ఉన్నవాళ్ళ మీద ప్రకాశించింది. 14 మేమంతా నేలపై పడిపొయ్యాము. ఒక స్వరం హెబ్రీ భాషలో నాతో ఈ విధంగా అనటం విన్నాను: ‘సౌలా! సౌలా! నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఇలా చేయటంవల్ల నీకే నష్టం కలుగుతుంది.’
15 “నేను, ‘మీరెవరు ప్రభూ!’ అని అడిగాను.
“‘నేను నీవు హింసిస్తున్న యేసును’ అని ప్రభువు జవాబు చెప్పాడు. 16 ‘ఇక లేచి నిలబడు, నిన్ను నా సేవకునిగా నియమించుకోవాలని అనుకున్నాను. నన్ను చూసిన ఈ సంఘటనను గురించి, నేను చూపబోయేవాటిని గురించి యితర్లకు చెప్పటానికి నిన్ను నియమించాలని నీకు ప్రత్యక్షమయ్యాను. 17 నిన్ను నీ వాళ్ళనుండి, యూదులుకాని వాళ్ళనుండి రక్షిస్తాను. 18 నీవు వాళ్ళని సత్యం అర్థం చేసుకొనేట్టు చేయగలవు. వాళ్ళు చీకటినుండి వెలుగుకు తిరుగుతారు. వాళ్ళు సాతాను శక్తినుండి మళ్ళుకొని దేవుని వైపు తిరుగుతారు. వాళ్ళు నన్ను విశ్వసించి తమ పాపాలకు క్షమాపణ పొందాలని, దేవుడు ఎన్నుకొన్నవాళ్ళతో కలిసి తమ స్థానం పొందాలని యిలా చేస్తున్నాను’అన్నాడు.
పౌలు తన సేవనుగూర్చి చెప్పటం
19 “అందువల్ల అగ్రిప్ప రాజా! ఆకాశంనుండి వచ్చిన దివ్య దర్శనమును నేను అతిక్రమించలేను. 20 మారు మనస్సు పొంది దేవుని వైపు మళ్ళమని, తమ నిజమైన పశ్చాత్తాపం మారు మనస్సు అన్న విషయం పనుల ద్వారా రుజువు చేయమని ఉపదేశించాను. ఈ ఉపదేశం డెమాస్కసు ప్రజలతో మొదలు పెట్టి యెరూషలేములోని ప్రజలకు, యూదయలోని యితర ప్రజలకు, యూదులు కానివాళ్ళకు చెప్పాను.
21 “ఆ కారణంగా యూదులు నన్ను మందిరంలో పట్టుకొని చంపాలని ప్రయత్నించారు. 22 కాని దేవుని దయ ఈనాటికీ నా మీద ఉంది. కనుక చిన్నా, పెద్దా అనే భేధం లేకుండా అందరికీ దీన్ని గురించి చెబుతున్నాను. మోషే, మరియు ప్రవక్తలు జరుగనున్న వాటిని గురించి ముందే ఈ విధంగా చెప్పారు: 23 ‘క్రీస్తు మరణించవలసి వస్తుంది. కాని బ్రతికి వచ్చినవాళ్ళలో ఆయన మొదటివాడౌతాడు. తన ప్రజలకు, యూదులు కానివాళ్ళకు వెలుగునివ్వటానికి వచ్చాడని చెపుతున్నాను.’ నేను వీళ్ళు చెప్పినవి తప్ప వేరే విషయాలు చెప్పటం లేదు.”
పౌలు అగ్రిప్పను ఒప్పించుటకు ప్రయత్నించటం
24 పౌలు తన రక్షణార్థం ఈ విధంగా మాట్లాడుతుండగా, ఫేస్తు పౌలుతో వాదన ఆపమంటూ, “నీకు మతిపోయింది పౌలూ! నీ పాండిత్యం నిన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది” అని బిగ్గరగా అన్నాడు.
25 పౌలు, “మహా ఘనత పొందిన ఓ ఫేస్తూ! నేను పిచ్చివాణ్ణి కాదు. సక్రమంగానే మాట్లాడాను. సత్యం చెప్పాను. 26 రాజుకు యివన్నీ తెలుసు. నేను రాజుతో స్వేచ్ఛగా మాట్లాడగలను. ఇవి అతని దృష్టినుండి తప్పించుకోలేవన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే యివి రహస్యంగా సంభవించలేదు. 27 అగ్రిప్ప రాజా! నీవు ప్రవక్తలు వ్రాసిన వాటిని నమ్ముచున్నావా? అవును, నమ్ముచున్నావని నాకు తెలుసు” అని పౌలు అన్నాడు.
28 అగ్రిప్ప, “అంత సులభంగా నన్ను క్రైస్తవునిగా చెయ్యాలనుకుంటున్నావా?” అని అన్నాడు.
29 పౌలు, “సులభమో, కష్టమో! నీవే కాదు, ఈ రోజు నా మాటలు వింటున్న ప్రతి ఒక్కడూ ఈ సంకెళ్ళు తప్ప మిగిలిన వాటిలో నావలె కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని అన్నాడు.
30 రాజు లేవగానే రాష్ట్రాధిపతి, బెర్నీకే, మరియు వాళ్ళతో కూర్చున్నవాళ్ళు లేచి నిలుచున్నారు. 31 వాళ్ళా గది వదిలివెళ్తూ తమలో తాము, “ఇతడు మరణదండన పొందటానికి కాని, కారాగారంలో ఉండవలసిన నేరం కాని ఏదీ చేయలేదు” అని అనుకున్నారు. 32 అగ్రిప్ప ఫేస్తుతో, “ఇతడు చక్రవర్తికి విన్నపం చేయకుండా ఉండినట్లైతే విడుదల చేసి ఉండేవాణ్ణి!” అని అన్నాడు.
© 1997 Bible League International