మార్కు 14:53-65
Telugu Holy Bible: Easy-to-Read Version
మహాసభ సమక్షంలో యేసు
(మత్తయి 26:57-68; లూకా 22:54-55, 63-71; యోహాను 18:13-14, 19-24)
53 వాళ్ళు యేసును ప్రధానయాజకుని దగ్గరకు తీసుకు వెళ్ళారు. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అక్కడ సమావేశం అయ్యారు. 54 పేతురు కొంత దూరంలో ఉండి వాళ్ళను అనుసరిస్తూ ప్రధాన యాజకుని యింటి పెరట్లోకి వచ్చాడు. భటులతో పాటు తాను కూడా చలిమంటలు వేసుకొంటూ వాళ్ళతో కూర్చున్నాడు.
55 ప్రధానయాజకులు, మహాసభకు చెందిన అందరు సభ్యులు, యేసుకు మరణదండన విధించటానికి తగిన సాక్ష్యం కోసం వెతక సాగారు. కాని వాళ్ళకు సాక్ష్యం లభించలేదు. 56 చాలా మంది ప్రతికూలంగా దొంగసాక్ష్యం చెప్పారు. కాని వాళ్ళ సాక్ష్యాలు ఒకదానితో ఒకటి పొసగలేదు.
57 అప్పుడు కొందరు లేచి ఈ దొంగ సాక్ష్యం చెప్పారు: 58 “‘మానవులు కట్టిన ఈ మందిరాన్ని పడగొట్టి మూడు రోజుల్లో మానవులు కట్టని మరొక మందిరాన్ని నిర్మిస్తాను’ అని అతడు అనటం మేము విన్నాము.” 59 కాని ఆ సాక్ష్యం కూడా ఒకరు ఒక విధంగా, యింకొకరు యింకో విధంగా చెప్పారు.
60 ఆ తర్వాత ప్రధాన యాజకుడు లేచి సభ్యుల ముందు నిలుచొని యేసుతో, “నీవు సమాధానం చెప్పదలచుకోలేదా? వీళ్ళు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నారు కదా! నీవేమంటావు?” అని అడిగాడు. 61 కాని యేసు ఏ సమాధానం చెప్పక మౌనం వహించాడు.
ప్రధాన యాజకుడు, “నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా? మానవులు స్తుతించే దేవుని కుమారుడవా?” అని మళ్ళీ ప్రశ్నించాడు.
62 యేసు, “ఔను, సర్వశక్తిసంపన్నుడైన దేవుని కుడిచేతి వైపు మనుష్యకుమారుడు కూర్చొని ఉండటం, ఆయన పరలోకంలో నుండి మేఘాలపై రావటం మీరు చూస్తారు” అని అన్నాడు.
63 ప్రధానయాజకుడు తన దుస్తుల్ని చింపుకొని[a] “మనకు యితర సాక్ష్యాలు ఎందుకు? 64 అతడు దైవదూషణ చేయటం మీరు విన్నారుగదా; మీ అభిప్రాయమేమిటి?” అని సభ్యుల్ని అడిగాడు.
అందరూ మరణదండన విధించాలని అన్నారు. 65 ఆ తర్వాత కొందరు యేసు మీద ఉమ్మివేయటం మొదలుపెట్టారు. కొందరు ఆయన కళ్ళకు గంతలు కట్టి తమ పిడికిలితో గుద్ది, “ఎవరో చెప్పుకో” అని హేళన చేసారు. కాపలాకాచే భటులు ఆయన్ని తీసుకువెళ్ళి కొట్టారు.
Read full chapterFootnotes
- 14:63 దుస్తుల్ని చింపుకొని వాళ్ళు ఇలా తమ కోపం వ్యక్త పరిచే వాళ్ళు.
© 1997 Bible League International