Add parallel Print Page Options

పస్కా భోజనం

(మత్తయి 26:17-25; లూకా 22:7-14, 21-23; యోహాను 13:21-30)

12 పులియబెట్టని రొట్టెలపండుగ వచ్చింది. మొదటి రోజు పస్కా గొఱ్ఱెపిల్లను బలి యివ్వటం ఆచారం. ఆ రోజు యేసు శిష్యులు ఆయనతో, “ఎక్కడికి వెళ్ళి పస్కా[a] పండుగ భోజనం సిద్ధం చెయ్యమంటారు?” అని అడిగారు.

13 యేసు తన శిష్యుల్లో యిద్దరిని పంపుతూ వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నగరంలోకి వెళ్ళండి. నీళ్ల కడవనెత్తుకొని వస్తున్న ఒక మనిషి మీకు కనిపిస్తాడు. అతణ్ణి అనుసరించండి. 14 అతడు ప్రవేశించిన యింటి యజమానితో, అతిథులు ఉండే గది ఎక్కడుందో బోధకుడు అడగమన్నాడని, ఆయన తన శిష్యులతో కలిసి ఆ గదిలో పస్కా పండుగ భోజనం చెయ్యాలని అనుకుంటున్నాడని, నేను అన్నట్లు చెప్పండి. 15 అన్ని వస్తువులతో సిద్దంగా ఉన్న మేడమీది విశాలమైన గదిని అతడు మీకు చూపుతాడు. మనకోసం అక్కడ భోజనం ఏర్పాటు చేయండి.”

16 శిష్యులు పట్టణంలోకి వెళ్ళారు. యేసు చెప్పి నట్లే అన్నీ జరిగాయి. వాళ్ళు పస్కా పండుగ భోజనం సిద్ధం చేసారు.

17 సాయంత్రం కాగానే యేసు పన్నెండుగురితో కలిసి వచ్చాడు. 18 వాళ్ళంతా బల్లముందు కూర్చొని భోజనం చేస్తూవున్నారు. అప్పుడు యేసు వాళ్ళతో, “ఇది నిజం. మీలో ఒకడు అంటే ప్రస్తుతం నాతో కూర్చొని భోజనం చేస్తున్న వాళ్ళలో ఒకడు, నాకు ద్రోహం చేస్తాడు” అని అన్నాడు.

19 వాళ్ళకు దుఃఖం వచ్చింది. “ఖచ్చితంగా నేను కాదుగదా ప్రభూ” అని ఒకరి తర్వాత ఒకరు ఆయనతో అన్నారు.

20 యేసు, “మీ పన్నెండుగురిలో ఒకడు, నాతో కలిసి రొట్టె గిన్నెలో ముంచేవాడు, నాకు ద్రోహం చేస్తాడు. 21 లేఖనాల్లో వ్రాసిన విధంగా మనుష్యకుమారుడు వెళ్లిపోవుచున్నాడు. కాని మనుష్యకుమారునికి ద్రోహం చేసినవాడు శాపగ్రస్తుడౌతాడు. వాడు జన్మించివుండకపోతే బాగుండేది” అని అన్నాడు.

Read full chapter

Footnotes

  1. 14:12 పస్కా ముఖ్యమైన యూదుల పండుగ.