M’Cheyne Bible Reading Plan
జల ప్రళయం ఆగి పోవుట
8 అయితే నోవహును దేవుడు మరచిపోలేదు. నోవహును, అతనితో కూడ ఓడలో ఉన్న జంతువులన్నింటిని, పశువులన్నింటిని దేవుడు జ్ఞాపకం చేసుకొన్నాడు. భూమిమీద గాలి వీచేటట్లు దేవుడు చేశాడు. నీళ్లన్నీ కనపడకుండా పోయాయి.
2 ఆకాశం నుండి వర్షం కురవటం ఆగిపోయింది. భూమి క్రింద నుండి నీళ్లు ఉబుకుట కూడ నిలిచిపోయింది. 3-4 నేలమీద నిండిన నీళ్లు బాగా ఇంకిపోవడం మొదలయింది. 150 రోజుల తర్వాత నీళ్లు బాగా తగ్గిపోయాయి, గనుక ఓడ మరల నేలమీద నిలిచింది. అరారాతు పర్వతాల్లో ఒకదాని మీద ఓడ నిలిచింది. ఇది ఏడవ నెల పదిహేడవ రోజు. 5 నీళ్లు ఇంకిపోతూనే ఉన్నాయి, పదవ నెల మొదటి రోజుకు కొండ శిఖరాలు నీళ్లకు పైగా కనబడ్డాయి.
6 నలభై రోజుల తర్వాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తెరిచాడు. 7 ఒక కాకిని నోవహు బయటకు పంపాడు. నీళ్లన్నీ ఇంకి పోయి, నేల ఆరిపోయేంత వరకు ఒక చోటునుండి మరో చోటుకు ఆ కాకి ఎగురుతూనే ఉంది. 8 ఒక పావురాన్ని కూడా నోవహు పంపించాడు. ఆరిన నేలను పావురం తెల్సుకోవాలనుకొన్నాడు నోవహు. అతడు నేల ఇంకా నీళ్లతో నిండి ఉందేమో తెల్సుకోవాలనుకొన్నాడు.
9 నేలమీద ఇంకా నీళ్లు నిండి ఉండటం చేత పావురం తిరిగి ఓడలోకి వచ్చేసింది. నోవహు చేయి బయటకు చాచి పావురాన్ని పట్టుకున్నాడు. ఆ పావురాన్ని నోవహు మళ్లీ ఓడలోకి తెచ్చాడు.
10 ఏడు రోజుల తర్వాత నోవహు పావురాన్ని మళ్లీ బయటకి పంపించాడు. 11 ఆ మధ్యాహ్నం ఆ పావురం మళ్లీ నోవహు దగ్గరకు వచ్చేసింది. తాజా ఒలీవ ఆకు ఆ పావురం నోటిలో ఉంది. భూమిమీద ఆరిన నేల ఉన్నట్లుగా నోవహుకు అది ఒక గుర్తు. 12 ఏడు రోజుల తర్వాత నోవహు పావురాన్ని మరల బయటకి పంపించాడు. అయితే ఈసారి పావురం మరల ఎన్నడూ తిరిగిరాలేదు.
13 ఆ తర్వాత నోవహు ఓడ తలుపులు తెరిచాడు. నేల ఆరిపోయినట్లుగా నోవహు చూశాడు. అది సంవత్సరములో మొదటి నెల మొదటి రోజు. అప్పుడు నోవహు వయస్సు 601 సంవత్సరాలు. 14 రెండవ నెల 27వ రోజుకు నేల పూర్తిగా ఆరిపోయింది.
15 అప్పుడు యెహోవా నోవహుతో అన్నాడు: 16 “ఓడ నేలకు దిగింది. నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడళ్లు ఇప్పుడు బయటకు వెళ్లాలి. 17 జీవమున్న ప్రతి జంతువును, పక్షులన్నింటిని, భూమిమీద ప్రాకు ప్రాణులన్నిటిని నీతోబాటు బయటకు తీసుకొనిరా. ఆ జంతువులు సంతానాభివృద్ధి చెంది, అవి మరల భూమిని నింపుతాయి.”
18 తన కుమారులు, తన భార్య, తన కోడళ్లతో నోవహు బయటకు వెళ్లాడు. 19 జంతువులన్నీ ప్రాకు ప్రాణులన్నీ, ప్రతి పక్షి ఓడను విడచి వెళ్లాయి. జంతువులన్నీ వాటి జాతి ప్రకారం గుంపులుగా బయటకు వచ్చాయి.
20 అప్పుడు యెహోవాకు ఒక బలిపీఠాన్ని నోవహు కట్టాడు. పవిత్రమైన పక్షులన్నింటిలో నుండి, పవిత్రమైన జంతువులన్నింటిలో నుండి కొన్నింటిని నోవహు తీసుకొని, దేవునికి కానుకగా బలిపీఠం మీద వాటిని దహించాడు.
21 యెహోవా ఈ బలుల సువాసనను ఆఘ్రాణించి ఆనందించాడు. యెహోవా తనలో తాను అనుకొన్నాడు, “మనుష్యుల్ని శిక్షించేందుకోసం ఒక పద్ధతిగా మరల ఎన్నడు నేను భూమిని శపించను. మనుష్యులు చిన్నప్పటినుండే దుర్మార్గులు కనుక భూమిమీద జీవిస్తున్న వాటన్నింటిని మరల ఎన్నడును నాశనం చేయను. లేదు, మరల నేను ఇలా చేయను. 22 భూమి ఉన్నంత కాలమూ నాటుటకు, పంట కోయుటకు ఎల్లప్పుడూ ఒక సమయం ఉంటుంది. భూమిమీద ఎప్పటికీ చల్లదనం, వేడి, వేసవికాలం, చలికాలం, పగలు, రాత్రిళ్లు ఉంటాయి.”
యేసు రోగిని నయం చేయటం
(మార్కు 1:40-45; లూకా 5:12-16)
8 యేసు కొండదిగి రాగా, ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు. 2 కుష్టురోగంతో ఉన్న వాడొకడు వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “మీరు తలచుకొంటే నన్ను బాగుచెయ్యగలరు” అని అన్నాడు.
3 యేసు తన చేయి చాపి అతణ్ణి తాకుతూ, “నీకు బాగు కావాలని కోరుతున్నాను, స్వస్థుడవుకమ్ము!” అని అన్నాడు. వెంటనే అతనికి నయమైపోయింది. 4 అప్పుడు యేసు అతనితో, “ఈ సంఘటనను గురించి ఎవ్వరికీ చెప్పకు. కాని యాజకుని దగ్గరకు వెళ్ళి నీ దేహాన్ని చూపి, మోషే ఆజ్ఞాపించిన కానుకను అర్పించు. తద్వారా నీకు నయమైనట్లు వాళ్ళకు రుజువౌతుంది” అని అన్నాడు.
యేసు శతాధిపతి సేవకుని నయం చేయటం
(లూకా 7:1-10; యోహాను 4:43-54)
5 యేసు కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాక శతాధిపతి ఒకడు ఆయన దగ్గరకు వచ్చి, ఆయన సహాయం కావాలని కోరుతూ, 6 “ప్రభూ! నా సేవకుడు పక్షవాతం వచ్చి యింట్లో పడుకొని ఉన్నాడు. వానికి చాలా బాధ కలుగుతోంది” అని అన్నాడు.
7 యేసు, “నేను వచ్చి నయం చేస్తాను” అని అన్నాడు.
8 కాని శతాధిపతి సమాధానంగా, “ప్రభూ! మీరు మా యింటి గడపలో కాలు పెట్టటానికి కూడా నేను అర్హుడను కాను. కాని మీరు మాటంటే చాలు, నా సేవకునికి నయమైపోతుంది. 9 ఎందుకంటే, నేను కూడా అధికారుల క్రింద ఉన్నవాణ్ణి. నా క్రింద కూడా సైనికులున్నారు. నేను ఈ సైనికునితో ‘వెళ్ళు’ అంటే వెళ్తాడు; ఆ సైనికునితో ‘రా’ అంటే వస్తాడు. నా సేవకునితో ‘ఇది చేయి’ అంటే చేస్తాడు” అని అన్నాడు.
10 యేసు ఇది విని ఆశ్చర్యపొయ్యాడు. ఆయన తన వెంట వస్తున్న వాళ్ళతో, “ఇది సత్యం. ఇంత గొప్ప విశ్వాసమున్న వ్యక్తి నాకు ఇశ్రాయేలీయులలో ఎవ్వరూ కనిపించలేదు. 11 నేను చెప్పెదేమిటంటే, తూర్పునుండి, పడమరనుండి, చాలామంది ప్రజలు వస్తారు. వచ్చి, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో కలిసి దేవుని రాజ్యంలో జరిగే విందులో పాల్గొంటారు. 12 కాని దేవుడు తన రాజ్యానికి తమ పుట్టుకవల్ల వారసులైన వాళ్ళను అవతల దూరంగా చీకట్లో పారవేస్తాడు. అక్కడ వాళ్ళు ఏడుస్తూ బాధననుభవిస్తారు.”
13 ఇలా అని, యేసు శతాధిపతితో, “వెళ్ళు! నీవు విశ్వసించినట్లే జరుగుతుంది” అని అన్నాడు. అదే క్షణంలో అతని సేవకునికి నయమైపోయింది.
యేసు అనేకులను నయం చేయటం
(మార్కు 1:29-34; లూకా 4:38-41)
14 యేసు పేతురు యింటికి వచ్చి పేతురు అత్త జ్వరంతో మంచం పట్టి ఉండటం చూసాడు. 15 ఆయన ఆమె చేతిని తాకగానే, జ్వరం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. ఆమె లేచి ఆయనకు సపర్యలు చెయ్యటం మొదలుపెట్టింది.
16 ప్రజలు సాయంత్రం కాగానే, దయ్యాలు పట్టిన వాళ్ళను చాలా మందిని యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. ఆయన ఒక మాటతో దయ్యాల్ని వదిలించాడు. రోగాలున్న వాళ్ళందరికి నయం చేసాడు. 17 యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన ఈ మాటలు నిజం కావటానికి ఇలా జరిగింది:
“మన రోగాల్ని ఆయన తనపై వేసుకొన్నాడు. మన బాధల్ని ఆయన అనుభవించాడు.”(A)
యేసును వెంబడించటం
(లూకా 9:57-62)
18 యేసు తన చుట్టూ ఉన్న ప్రజల గుంపును చూసి, తన శిష్యులతో సరస్సు అవతలి వైపుకు వెళ్ళండని అన్నాడు. 19 అప్పుడు శాస్త్రుడొకడు ఆయన దగ్గరకు వచ్చి, “బోధకుడా! మీరెక్కడికి వేళ్తే నేనక్కడికి వస్తాను” అని అన్నాడు.
20 యేసు, “నక్కలు దాక్కోవటానికి బిలములున్నాయి. గాలిలో ఎగిరే పక్షులు ఉండటానికి గూళ్ళున్నాయి. కాని మనుష్యకుమారుడు తల వాల్చటానికి కూడ స్థలం లేదు” అని అతనితో అన్నాడు.
21 మరొక శిష్యుడు, “ప్రభూ! మొదట నా తండ్రిని సమాధి చేసుకోనివ్వండి” అని అన్నాడు.
22 యేసు అతనితో, “చనిపోయిన తమ వాళ్ళను చనిపోయే వాళ్ళు సమాధి చేసుకోనిమ్ము! నీవు నన్ను అనుసరించు!” అని అన్నాడు.
యేసుని శిష్యులు ఆయన శక్తిని చూడటం
(మార్కు 4:35-41; లూకా 8:22-25)
23 యేసు పడవనెక్కాడు. ఆయన శిష్యులు ఆయన్ని అనుసరించారు. 24 అకస్మాత్తుగా ఒక పెద్ద తుఫాను ఆ సరస్సు మీదికి రావటం వల్ల ఆ పడవ అలల్లో చిక్కుకు పోయింది. ఆసమయంలో యేసు నిద్రపోతూ ఉన్నాడు. 25 శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని నిద్రలేపుతూ, “ప్రభూ! రక్షించండి. మునిగిపోతున్నాము!” అని అన్నారు.
26 యేసు, “మీ విశ్వాసం ఏమైంది? ఎందుకు భయపడుతున్నారు?” అని అంటూ లేచి గాలిని, అలల్ని శాంతించమని ఆజ్ఞాపించాడు. అవి శాంతించాయి.
27 వాళ్ళు ఆశ్చర్యపడి, “ఈయనేలాంటి వాడు? గాలి, అలలు కూడా ఈయన మాట వింటున్నాయే!” అని అన్నారు.
దయ్యం పట్టిన యిద్దరిని నయం చేయటం
(మార్కు 5:1-20; లూకా 8:26-39)
28 యేసు, సరస్సు ఆవలి పైపుననున్న గదరేనీయుల ప్రాంతాన్ని చేరుకున్నాడు. దయ్యాలు పట్టిన మనుష్యులిద్దరు స్మశానం నుండి వచ్చి ఆయన్ని కలుసుకొన్నారు. వీళ్ళ క్రూర ప్రవర్తన వల్ల ఆ దారిమీద ఎవ్వరూ వెళ్ళేవాళ్ళు కారు. 29 అవి, “దేవుని కుమారుడా! మాకేం చెయ్యాలని వచ్చావు తగిన సమయం రాకముందే మమ్మల్ని శిక్షించాలని యిక్కడికి వచ్చారా?” అని బిగ్గరగా అన్నాయి.
30 వాళ్ళకు కొంత దూరంలో ఒక పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది. 31 ఆ దయ్యాలు యేసుతో, “మీరు మమ్మల్ని వెళ్ళగొట్టాలని అనుకొంటే ఆ పందుల గుంపులోకి పంపండి” అని ప్రాధేయపడ్డాయి.
32 ఆయన వాటితో, “వెళ్ళండి!” అని అన్నాడు. అందువల్ల అవి వెలుపలికి వచ్చి ఆ పందుల్లోకి ప్రవేశించాయి. ఆ పందుల గుంపంతా నిటారుగా ఉన్న కొండ మీదనుండి జారి సరస్సులో పడి చనిపొయ్యాయి. 33 ఆ పందుల్ని కాస్తున్న వాళ్ళు అక్కడి నుండి పరుగెత్తి గ్రామంలోకి వెళ్ళి జరిగిందంతా, అంటే ఆ దయ్యం పట్టిన వాళ్ళకేమైందో అంతా చెప్పారు. 34 ఇది విని ఆ గ్రామమంతా యేసును కలవటానికి వచ్చింది. వాళ్ళాయన్ని చూసాక తమ పరిసరాల్ని వదిలి వెళ్ళమని ఆయనను ప్రాధేయపడ్డారు.
ఎజ్రాతో తిరిగివచ్చిన పెద్దల జాబితా
8 రాజు అర్తహషస్త పాలన కాలంలో బబులోను నుంచి యెరూషలేముకు నాతో (ఎజ్రా) పాటు తిరిగివచ్చిన ఆయా కుటుంబాల పెద్దల, తదితరుల పేర్ల జాబితా ఇది:
2 ఫీనెహాసు సంతతి నుంచి గెర్షోము; ఈతామారు సంతతినుంచి దానియేలు; దావీదు సంతతి నుంచి హట్టూషు:
3 షెకన్యా సంతతినుంచి పరోషు; పరోషు సంతతినుంచి జెకర్యా, మరో 150 మంది పురుషులు;
4 పహత్మోయాబు సంతతినుంచి జెరహ్యా కొడుకు ఎల్యోయేనై, మరో 200 మంది పురుషులు;
5 షెకన్యా సంతతి నుంచి యహజీయేలు కొడుకు షెకన్యా, మరో 300 మంది పురుషులు;
6 అదీను సంతతినుంచి యోనాతాను కొడుకు ఏబెదు, మరో 50 మంది పురుషులు;
7 ఏలాము సంతతి నుంచి అతల్యా కొడుకు యెషయా, మరో 70 మంది పురుషులు;
8 షెపట్య సంతతినుంచి మిఖాయేలు కొడుకు జెబద్యా, మరో 80 మంది పురుషులు;
9 యోవాబు సంతతినుంచి యెహీయేలు కొడుకు ఓబద్యా, మరో 218 మంది పురుషులు;
10 షెలోమీతు సంతతినుంచి యోసిప్యా కొడుకు షెలోమీతు, మరో 160 మంది పురుషులు;
11 బేబై సంతతినుంచి బేబై కొడుకు జెకర్యా, మరో 28 మంది పురుషులు;
12 అజ్గాదు సంతతినుంచి హక్కాటాను కొడుకు యోహానాను, మరో 110 మంది పురుషులు;
13 అదోనీకాము సంతతిలో చివరి వారినుంచి ఎలీఫెలెటు; యెహీయేలు, షెమాయా, మరో 60 మంది పురుషులు;
14 బిగ్వయి సంతతినుంచి ఊతైయు, జబ్బూదు, మరో 70 మంది పురుషులు.
యెరూషలేముకు తిరిగి రాక
15 నేను (ఎజ్రా) వాళ్లందరినీ అహవా వైపు పారే ఒక నది దగ్గర సమావేశపరిచాను. మేము మూడు రోడుల పాటు అక్కడనే యుంటిమి. ఆ బృందంలో యాజకులు వున్నారుగాని, లేవీయులెవ్వరూ లేరన్న విషయం నేను గమనించాను. 16 అందుకని, నేను ఎలియెజెరు, అరీయేలు, షెమయా, ఎల్నాతాను, యారీబు, (మరో) ఎల్నాతాను, నాతాను, జెకర్యా, మెషుల్లూము అనే పెద్దలను పిలిచాను. వీరికి తోడు యోయారీబు, ఎల్నాతాను అనే మరో ఇద్దర్ని (వీళ్లిద్దరూ ఉపాధ్యాయులు) కూడా పిలిచాను. 17 వాళ్లని ఇద్దో వద్దకు పంపించాను. ఇద్దో కాసిఫ్యా పట్టణానికి నాయకుడు. ఇద్దోకీ, అతని బంధువులకు ఏమి చెప్పాలో వివరించి నేను నా మనుష్యులను అక్కడికి పంపాను. ఇద్దో బంధువులు కాసిఫ్యాలో దేవాలయ సేవకులు దేవాలయంలో పనిచేసే సేవకులను పంపవచ్చునన్న ఆశతో నేను నా మనుష్యులను ఇద్దో దగ్గరికి పంపాను. 18 దేవుడు మాతో ఉన్నాడు కాబట్టి, ఇద్దో బంధువులు ఈ క్రిందివాళ్లను మాకు పంపారు: మావీ సంతతి నుంచి షేరేబ్యా అనే ఒక వివేకి (మాలీ లేవీ సంతతుల్లో ఒకడు. లేవీ ఇశ్రాయేలు కొడుకుల్లో ఒకడు. వాళ్లు అతని కొడుకునీ, అన్నదమ్ముల్నీ కూడా పంపారు. మొత్తంమీద ఆ కుటుంబానికి చెందిన వాళ్లు 18 మంది). 19 మెరారీ సంతతివారి నుంచి హషబ్యా, యెషయా (వాళ్లు తమ కొడుకులను, సోదరులను, బందువులను కూడా పంపారు, ఆ కుటుంబం నుంచి మొత్తం 20 మంది మగాళ్లు వచ్చారు) 20 వారితోపాటు 220 మంది దేవాలయ పరిచారకులు వచ్చారు. (వాళ్లు లేవీయులకు సాయం చేసేవాళ్లు. వాళ్ల పూర్వీకులు దావీదు చేత, ముఖ్యాధికారుల చేత ఎంపిక చేయబడినవాళ్లు. వాళ్లందరి పేర్లూ వ్రాసి వుంచబడ్డాయి).
21 అక్కడ, ఆ అహవా నది దగ్గర నేను (ఎజ్రా) మనమందరం ఉపవాసం చెయ్యాలని ప్రకటించాను. మన దేవుని ముందు విధేయత చూపేందుకుగాను మనం ఉపవాసం చెయ్యాలి. మేమూ, మా పిల్లలూ, మాకున్న సమస్త వస్తువులూ క్షేమంగా యెరూషలేము చేరేలా దీవించుమని దేవుణ్ణి వేడు కోవాలనుకున్నాము. 22 మా ప్రయాణ మార్గంలో మా రక్షణ కోసం సైనికుల్నీ, అశ్వికుల్నీ పంపమని అర్తహషస్త రాజుని అర్థించడం నాకు సిగ్గుగా తోచింది. మార్గంలో శత్రువులున్నారని నాకు తెలుసు. అయితే అర్తహషస్త రాజుకి మేమంతకు ముందు ఇలా చెప్పివున్నాము: “మా దేవుడు తనని నమ్మే ప్రతి ఒక్కరికీ తోడుగా ఉంటాడు. అయితే, దేవుడు తనకు ఎడముఖంగా వున్న ప్రతి ఒక్కనిపట్లా చాలా కోపంగా వుంటాడు.” 23 అందుకని, మేము ఉపవాసం వుండి, మా ప్రయాణం గురించి మేము దేవుణ్ణి ప్రార్థించాము. ఆయన మా ప్రార్థనలకు జవాబిచ్చాడు.
24 తర్వాత నేను పన్నెండుగురు ముఖ్య యాజకులను, షెరేబ్యాను, హషబ్యాను, వాళ్ల సొదరులు పది మందిని ఎంపికచేశాను. 25 దేవాలయం కోసం ఇవ్వబడిన వెండిని, బంగారాన్ని తదితర వస్తువులను తూకం వేయించాను. నేను ఎంపికచేసిన పన్నెండుగురు యాజకులకు నేను వాటిని అప్పగించాను. అర్తహషస్త రాజు, ఆయన మంత్రులు, ఆయన ముఖ్యాధికారులు, బబులోనులోని ఇశ్రాయేలీయులు అందరూ దేవుని దేవాలయం కోసం యిచ్చిన వస్తువులవి. 26 నేను వాటన్నింటినీ తూకం వేశాను. వెండి 25 టన్నులు వుంది. వెండిగిన్నెలు, వస్తువులు మూడుమ్ముప్పాతిక టన్నులున్నాయి. మూడుమ్ముప్పాతిక టన్నుల బంగారం వుంది. 27 నేను వాళ్లకి 20 బంగారు గిన్నెలు యిచ్చాను. అవి 19 పౌనుల బరువున్నాయి. నేను వాళ్లకి మెరుగు పెట్టిన కంచుతో చేసిన అందమైన రెండు పాత్రలు ఇచ్చాను. అవి బంగారు వస్తువులంతటి విలువైనవి. 28 తర్వాత నేనా పన్నెండుగురు యాజకులతో యిలా చెప్పాను: “యెహోవా దేవుని దృష్టిలో మీరు పవిత్రులు, ఆ వస్తువులు పవిత్రమైనవి. ప్రజలు యీ వెండి బంగారాలను మీ పూర్వీకుల దేవునికి యిచ్చారు. 29 అందుకని, మీరీ వస్తువులను జాగ్రత్తగా కాపాడండి. యెరూషలేములోని దేవాలయ పెద్దలకు మీరు వీటిని అప్పగించేదాకా, యీ వస్తువులకు మీరే బాధ్యులు. మీరు వీటిని ముఖ్య లేవీయులకి, ఇశ్రాయేలు కుటుంబ పెద్దలకీ యిచ్చినప్పుడు వాళ్లు వీటిని తూకం వేసి, యెరూషలేములోని యెహోవా దేవాలయంలోని గదుల్లో పదిలపరుస్తారు.”
30 ఎజ్రా తూకం వేసి తమకిచ్చిన వెండి బంగారాలనూ, ప్రత్యేక వస్తువులనూ యాజకులూ, లేవీయులు స్వీకరించి, ఎజ్రా చెప్పినట్లు, వాటిని యెరూషలేము లోని దేవాలయానికి చేర్చేందుకు సంసిద్ధులయ్యారు.
31 మొదటి నెల పన్నెండవ రోజున మేము అహవానది దగ్గరనుంచి యెరూషలేముకు బయల్దేరాము. దేవుడు మాకు తోడుగావుండి, మార్గంలో శత్రువులనుంచీ, దోపిడిగాండ్రనుంచీ మమ్మల్ని కాపాడాడు. 32 చివరకు మేము యెరూషలేము చేరుకున్నాము. మేమక్కడ మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాము. 33 నాల్గవ రోజున దేవాలయానికి వెళ్లి వెండి బంగారాలనూ, ప్రత్యేక వస్తువులనూ తూకం వేశాము. మేమా వస్తువులను ఊరియా యాజకుని కొడుకైన మెరేమోతుకు అప్పగించాము. అతనితో ఫినేహాసు కుమారుడు ఎలీయాజరు వున్నాడు. వాళ్లతోబాటు లేవీయులైన యేషూవ కొడుకు యోజాబాదు, బిన్నూయి కొడుకు నోవద్యా కూడా వున్నారు. 34 మేము అన్ని వస్తువులనూ లెక్క పెట్టి, వాటన్నింటినీ తూకం వేశాము. తర్వాత మేము అప్పటి మొత్తం బరువును వ్రాసి పెట్టాము.
35 అటు తర్వాత నిర్బంధంనుంచి తిరిగివచ్చిన యూదులు ఇశ్రాయేలు దేవునికి దహనబలులు అర్పించారు. వాళ్లు ఇశ్రాయేలీయులందరి కొరకు 12 ఎడ్లను, 96 పోట్టేళ్లను, 77 మగ గొర్రెపిల్లలను, పాప పరిహారార్థబలి నిమిత్తం 12 మేక పోతులను బలి యిచ్చారు. ఇవన్నీ దహసబలిగా ఇవ్వబడ్డాయి.
36 అటుతర్వాత వాళ్లు అర్తహషస్త ఆజ్ఞలను రాజ ప్రతినిధులైన సామంత నాయకులకు, యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతపు పాలనాధికారులకు అందజేశారు. కనుక వారందరూ వచ్చి దేవుని ఆలయపు పనిలో సహాయపడ్డారు.
8 1-3 అతణ్ణి చంపటానికి తన అంగీకారం చూపుతున్నట్లు సౌలు అక్కడే ఉన్నాడు. కొందరు విశ్వాసులు స్తెఫన్ను సమాధి చేసి, అతని కోసం దుఃఖించారు.
సౌలు సంఘాన్ని హింసించటం
ఆ రోజు యెరూషలేములోని సంఘంపై పెద్ద హింసాకాండ మొదలైంది. సౌలు సంఘాన్ని నాశనం చెయ్యటం మొదలు పెట్టాడు. ఇంటింటికి వెళ్ళి ఆడవాళ్ళను, మగవాళ్ళను బయటకు లాగి కారాగారంలో వేసాడు. అపొస్తలులు తప్ప మిగతా వాళ్ళంతా చెదిరిపోయి, యూదయ, సమరయ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. 4 ఇలా చెదిరిపోయినవాళ్ళు తాము వెళ్ళిన ప్రతిచోటా సువార్త ప్రకటించారు.
సమరయలో ఫిలిప్పు
5 ఫిలిప్పు సమరయలోని ఒక పట్టణానికి వెళ్ళి క్రీస్తును గురించి ప్రకటించాడు. 6-7 ప్రజలు ఫిలిప్పు చెప్పిన ఉపన్యాసాలు విన్నారు. చేసిన అద్భుతాలు చూసారు. దయ్యాలు పట్టినవాళ్ళు, పక్షవాత రోగులు, కుంటివాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు. దయ్యాలు పట్టినవాళ్ళనుండి దయ్యాలు పెద్ద కేకలు వేస్తూ వెలుపలికి వచ్చాయి. పక్షవాత రోగులకు, కుంటివాళ్ళకు నయమైంది. ఈ కారణంగా వాళ్ళు అతడు చెప్పిన విషయాల్ని జాగ్రత్తగా గమనించారు. 8 ఆ పట్టణంలో ఉన్నవాళ్ళందరూ ఆనందించారు.
9 సీమోను సమరయకు చెందినవాడు. అతడు చాలా కాలంనుండి మంత్రతంత్రాలు చేస్తూ, సమరయ ప్రజల్ని ఆశ్చర్య పరుస్తుండేవాడు. తానొక గొప్పవాణ్ణని చెప్పుకొనేవాడు. 10 చిన్నా, పెద్దా అంతా అతడు చెప్పినవి జాగ్రత్తగా వినేవాళ్ళు. “మనం గొప్ప శక్తి అంటామే, ఆ దైవికమైన శక్తి అతనిలో ఉంది” అని ప్రజలు అనేవాళ్ళు. 11 అతడు వాళ్ళను తన మంత్రతంత్రాలతో చాలాకాలంనుండి ఆశ్చర్య పరుస్తూ ఉండటంవల్ల వాళ్ళు అతడు చెప్పినట్లు చేసేవాళ్ళు. 12 కాని దేవుని రాజ్యాన్ని గురించిన శుభవార్తను, యేసు క్రీస్తు పేరును ఫిలిప్పు ప్రకటించిన తరువాత ఆడ, మగా అందరూ విని, విశ్వసించి, బాప్తిస్మము పొందారు. 13 సీమోను కూడా విశ్వసించి బాప్తిస్మము పొందాడు. అతడు ఫిలిప్పుకు సన్నిహితంగా ఉండి అతడు చేసిన మహత్యాల్ని, అద్భుతాల్ని చూసి ఆశ్చర్యపడ్డాడు.
14 యెరూషలేములోని అపొస్తలులు సమరయ దేశం దేవుని సందేశాన్ని అంగీకరించిందని విని, పేతురును, యోహాన్ను అక్కడికి పంపారు. 15 పేతురు, యోహాను వచ్చి అక్కడివాళ్ళు పవిత్రాత్మను పొందాలని ప్రార్థించారు. 16 ఎందుకంటే అక్కడివాళ్ళు యేసు ప్రభువు పేరిట బాప్తిస్మము పొందారు. కాని వాళ్ళ మీదికి పవిత్రాత్మ యింకా రాలేదు. 17 వాళ్ళు తమ చేతుల్ని అక్కడి ప్రజలపై ఉంచిన వెంటనే ఆ ప్రజలు పవిత్రాత్మను పొందారు.
18 అపొస్తలులు తమ చేతుల్ని వాళ్ళపై ఉంచిన వెంటనే వాళ్ళలోకి పవిత్రాత్మ రావటం సీమోను గమనించి వాళ్ళతో, 19 “నేను మీకు డబ్బులిస్తాను; నా చేతులుంచిన ప్రతి ఒక్కనికి పవిత్రాత్మ లభించేటట్లు చేసే ఈ శక్తి నాక్కూడా యివ్వండి” అని అడిగాడు.
20 పేతురు, “దేవుని వరాన్ని డబ్బుతో కొనగలనని అనుకొన్నావు కనుక నీ డబ్బు నీతో నాశనమైపోనీ! 21 దేవుని దృష్టిలో నీ హృదయం మంచిది కాదు. కనుక ఈ సేవలో నీకు స్థానం లేదు. 22 నీ దుర్బుద్ధికి పశ్చాత్తాపం చెంది ప్రభువును ప్రార్థించు. అలాంటి ఆలోచన నీలో కలిగినందుకు ప్రభువు నిన్ను క్షమించవచ్చు. 23 నీలో దుష్టత్వం నిండి ఉండటం నేను చూస్తున్నాను. నీవు అపవిత్రతకు లోబడిపోయావు” అని సమాధానం చెప్పాడు.
24 ఆ తదుపరి సీమోను వాళ్ళతో, “మీరన్నదేదీ నాకు కలగకూడదని నా పక్షాన ప్రభువును ప్రార్థించండి” అని అడిగాడు.
25 పేతురు, యోహాను తాము ప్రభువును గురించి విన్నది, చూసినది అక్కడి ప్రజలకు చెప్పారు. ప్రభువు చెప్పిన సందేశాన్ని ప్రకటించారు. ఆ తర్వాత వాళ్ళు శుభవార్తను ఎన్నో సమరయ పల్లెల్లో ప్రకటిస్తూ యెరూషలేమునకు తిరిగి వచ్చారు.
ఫిలిప్పు ఇతియోపియా దేశస్థునికి బాప్తిస్మము ఇవ్వటం
26 ఒక దేవదూత ఫిలిప్పుతో, “లే! దక్షిణంగా వెళ్ళి యెరూషలేమునుండి గాజా వెళ్ళే ఎడారి దారిని చేరుకో!” అని అన్నాడు.
27 అతడు లేచి వెళ్ళాడు. అక్కడ ఇతియోపియా దేశానికి చెందిన ఒక వ్యక్తి కనిపించాడు. అతడు నపుంసకుడు. ఇతియొపీయుల రాణి కందాకే రాజ్యంలో ప్రధాన కోశాధికారిగా పని చేస్తుండేవాడు. యెరూషలేమునకు ఆరాధనకు వెళ్ళి, 28 తిరిగి వస్తూ తన రథంలో కూర్చొని యెషయా గ్రంథాన్ని చదువుచుండగా,
29 దేవుని ఆత్మ ఫిలిప్పుతో, “ఆ రథం దగ్గరకు వెళ్ళి అతన్ని కలుసుకో” అని అన్నాడు. 30 ఫిలిప్పు రథం దగ్గరకు పరుగెత్తుతూ యెషయా గ్రంథాన్ని ఆ కోశాధికారి చదవటం విన్నాడు. అక్కడికి వెళ్ళి ఆ కోశాధికారిని, “నీవు చదువుతున్నది అర్థమౌతోందా?” అని అడిగాడు.
31 “ఎవరైనా నాకు విడమర్చి చెబితే తప్ప ఎట్లా అర్థమౌతుంది” అని కోశాధికారి అన్నాడు. అతడు ఫిలిప్పును రథమెక్కి కూర్చోమని చెప్పాడు. 32 ఆ కోశాధికారి ధర్మశాస్త్రంలోని ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు:
“చంపటానికి తీసుకు వెళ్ళుతున్న గొఱ్ఱెలా ఆయన నడిపించబడ్డాడు
బొచ్చును కత్తిరిస్తున్న గొఱ్ఱెపిల్ల మౌనం వహించినట్లుగా
ఆయన మాట్లాడ లేదు!
33 ఆయన దీనత్వాన్ని చూసి అన్యాయం జరిగించారు.
ఆయన జీవితాన్ని భూమ్మీదనుండి తొలగించారు.
ఆయన సంతతిని గురించి యిక మాట్లాడేదెవరు?”(A)
34 ఆ కోశాధికారి ఫిలిప్పును, “ఈ ప్రవక్త ఎవర్ని గురించి మాట్లాడుతున్నాడు? తనను గురించా లేక మరొకర్ని గురించా? దయచేసి చెప్పు” అని అడిగాడు. 35 ఫిలిప్పు ప్రవచనాల్లోని ఆ వాక్యాలతో మొదలెట్టి, యేసును గురించిన శుభవార్తను అతనికి చెప్పాడు.
36 ఆ దారిన ప్రయాణం చేస్తూ వాళ్ళు నీళ్ళున్న ఒక ప్రదేశాన్ని చేరుకొన్నారు. ఆ కోశాధికారి, “ఇదిగో! ఇక్కడ నీళ్ళున్నాయి, నీవు నాకు బాప్తిస్మమునెందుకు ఇవ్వకూడదు?” అని అడిగి, రథాన్ని ఆపమని ఆజ్ఞాపించాడు. 37 ఫిలిప్పు, “నీవు పూర్ణ హృదయంతో విశ్వసిస్తే నేను ఇస్తాను” అన్నాడు. ఆ కోశాధికారి, “యేసు క్రీస్తు దేవుని కుమారుడని నేను విశ్వసిస్తున్నాను” అన్నాడు. 38 ఫిలిప్పు, ఆ కోశాధికారి ఇద్దరు కలిసి నీళ్ళలోకి వెళ్ళారు. ఫిలిప్పు అతనికి బాప్తిస్మమునిచ్చాడు. 39 వాళ్ళు నీళ్ళనుండి వెలుపలికొచ్చాక ప్రభువు ఆత్మ అకస్మాత్తుగా ఫిలిప్పును అక్కడినుండి తీసుకొని వెళ్ళాడు. ఆ కోశాధికారి ఫిలిప్పును మళ్ళీ చూడలేదు. అయినా అతడు ఆనందంతో తన దారిన తాను వెళ్ళిపొయ్యాడు. 40 ఫిలిప్పు అజోతు అనే పట్టణంలో కనిపించాడు. అక్కడినుండి బయలుదేరి అన్ని పట్టణాలకు వెళ్ళి శుభవార్తను ప్రకటించాడు. చివరకు కైసరియ చేరుకొన్నాడు.
© 1997 Bible League International