Read the Gospels in 40 Days
యేసు వంశావళి
(లూకా 3:23-38)
1 యేసు క్రీస్తు వంశక్రమము: ఈయన దావీదు మరియు అబ్రాహాము వంశానికి చెందినవాడు.
2 అబ్రాహాము కుమారుడు ఇస్సాకు.
ఇస్సాకు కుమారుడు యాకోబు.
యాకోబు కుమారులు యూదా మరియు అతని సహోదరులు.
3 యూదా కుమారులు పెరెసు మరియు జెరహు. (పెరెసు, జెరహుల తల్లి తామారు.)
పెరెసు కుమారుడు ఎస్రోము.
ఎస్రోము కుమారుడు అరాము.
4 అరాము కుమారుడు అమ్మీనాదాబు.
అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను.
నయస్సోను కుమారుడు శల్మా.
5 శల్మా కుమారుడు బోయజు. (బోయజు తల్లి రాహాబు.)
బోయజు కుమారుడు ఓబేదు. (ఓబేదు తల్లి రూతు.)
ఓబేదు కుమారుడు యెష్షయి.
6 యెష్షయి కుమారుడు రాజు దావీదు.
దావీదు కుమారుడు సొలొమోను. (సొలొమోను తల్లి పూర్వం ఊరియా భార్య.)
7 సొలొమోను కుమారుడు రెహబాము.
రెహబాము కుమారుడు అబీయా.
అబీయా కుమారుడు ఆసా.
8 ఆసా కుమారుడు యెహోషాపాతు.
యెహోషాపాతు కుమారుడు యెహోరాము.
యెహోరాము కుమారుడు ఉజ్జియా.
9 ఉజ్జియా కుమారుడు యోతాము.
యోతాము కుమారుడు ఆహాజు.
ఆహాజు కుమారుడు హిజ్కియా.
10 హిజ్కియా కుమారుడు మనష్షే.
మనష్షే కుమారుడు ఆమోసు.
ఆమోసు కుమారుడు యోషీయా.
11 యోషీయా కుమారులు యెకొన్యా మరియు అతని సోదరులు. వీళ్ళ కాలంలోనే యూదులు బబులోను నగరానికి బందీలుగా కొనిపోబడినారు.
12 బబులోను నగరానికి కొనిపోబడిన తరువాతి వంశ క్రమము:
యెకొన్యా కుమారుడు షయల్తీయేలు.
షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు.
13 జెరుబ్బాబెలు కుమారుడు అబీహూదు.
అబీహూదు కుమారుడు ఎల్యాకీము.
ఎల్యాకీము కుమారుడు అజోరు.
14 అజోరు కుమారుడు సాదోకు.
సాదోకు కుమారుడు ఆకీము.
ఆకీము కుమారుడు ఎలీహూదు.
15 ఎలీహూదు కుమారుడు ఎలియాజరు.
ఎలియాజరు కుమారుడు మత్తాను.
మత్తాను కుమారుడు యాకోబు.
16 యాకోబు కుమారుడు యోసేపు.
యోసేపు భార్య మరియ.
మరియ కుమారుడు యేసు. ఈయన్ని క్రీస్తు అంటారు.
17 అంటే అబ్రాహాము కాలం నుండి దావీదు కాలం వరకు మొత్తం పదునాలుగు తరాలు. దావీదు కాలం నుండి బబులోను నగరానికి బందీలుగా కొనిపోబడిన కాలం వరకు పదునాలుగు తరాలు. అలా కొనిపోబడిన కాలం నుండి క్రీస్తు వరకు పదునాలుగు తరాలు.
యేసు క్రీస్తు జననం
(లూకా 2:1-7)
18 యేసు క్రీస్తు జననం ఇలా సంభవించింది: యేసు క్రీస్తు తల్లి మరియకు, యోసేపు అనే వ్యక్తికి వివాహం నిశ్చయమై ఉంది. వివాహంకాకముందే పవిత్రాత్మ శక్తి ద్వారా మరియ గర్భవతి అయింది. 19 కాని ఆమె భర్త యోసేపు నీతిమంతుడు. అందువల్ల అతడు అమెను నలుగురిలో అవమాన పరచదలచుకోలేదు. ఆమెతో రహస్యంగా తెగతెంపులు చేసుకోవాలని మనస్సులో అనుకొన్నాడు.
20 అతడీవిధంగా అనుకొన్న తర్వాత, దేవదూత అతనికి కలలో కనిపించి, “యోసేపూ, దావీదు కుమారుడా, మరియ పవిత్రాత్మ ద్వారా గర్భవతి అయింది. కనుక ఆమెను భార్యగా స్వీకరించటానికి భయపడకు. 21 ఆమె ఒక మగ శిశువును ప్రసవిస్తుంది. ఆయన తన ప్రజల్ని వాళ్ళు చేసిన పాపాలనుండి రక్షిస్తాడు. కనుక ఆయనకు ‘యేసు’ అని పేరు పెట్టు” అని అన్నాడు.
22-23 ప్రవక్త ద్వారా ప్రభువు ఈ విధంగా చెప్పాడు: “కన్యక గర్భవతియై మగ శిశువును ప్రసవిస్తుంది. వాళ్ళాయనను ఇమ్మానుయేలు అని పిలుస్తారు”(A) ఇది నిజం కావటానికే ఇలా జరిగింది.
24 యోసేపు నిద్రలేచి దేవదూత ఆజ్ఞాపించినట్లు చేసాడు. మరియను తన భార్యగా స్వీకరించి తన ఇంటికి పిలుచుకు వెళ్ళాడు. 25 కాని, ఆమె కుమారుణ్ణి ప్రసవించే వరకు అతడు ఆమెతో కలియలేదు. అతడు ఆ బాలునికి “యేసు” అని నామకరణం చేసాడు.
తూర్పు నుండి జ్ఞానులు రావటం
2 హేరోదు రాజ్యపాలన చేస్తున్న కాలంలో యూదయ దేశంలోని బేత్లెహేములో యేసు జన్మించాడు. తూర్పు దిశనుండి జ్ఞానులు యెరూషలేముకు వచ్చి 2 “యూదుల రాజుగా జన్మించినవాడు ఎక్కడున్నాడు? తూర్పున మేమాయన నక్షత్రాన్ని చూసి ఆయన్ని ఆరాధించటానికి వచ్చాము” అని అన్నారు.
3 ఈ విషయం విని హేరోదు చాలా కలవరం చెందాడు. అతనితో పాటు యెరూషలేము ప్రజలు కూడ కలవరపడ్డారు. 4 అతడు ప్రధానయాజకుల్ని, పండితుల్ని[a] సమావేశపరచి, “క్రీస్తు ఎక్కడ జన్మించబోతున్నాడు?” అని అడిగాడు. 5 వాళ్ళు, “యూదయ దేశంలోని బేత్లెహేములో” అని సమాధానం చెప్పారు. దీన్ని గురించి ప్రవక్త ఈ విధంగా వ్రాసాడు:
6 “‘యూదయ దేశంలోని బేత్లెహేమా!
నీవు యూదయ పాలకులకన్నా తక్కువేమీ కాదు!
ఎందుకంటే, నీ నుండి ఒక పాలకుడు వస్తాడు.
ఆయన నా ప్రజల, అంటే ఇశ్రాయేలు ప్రజల, కాపరిగా ఉంటాడు.’”(B)
7 ఆ తర్వాత హేరోదు జ్ఞానుల్ని రహస్యంగా పిలిచి ఆ నక్షత్రం కనిపించిన సరియైన సమయం వాళ్ళనడిగి తెలుసుకొన్నాడు. 8 వాళ్ళను బేత్లెహేముకు పంపుతూ, “వెళ్ళి, ఆ శిశువును గురించి సమాచారం పూర్తిగా కనుక్కోండి. ఆ శిశువును కనుక్కొన్నాక నాకు వచ్చి చెప్పండి. అప్పుడు నేను కూడా వచ్చి ఆరాధిస్తాను” అని అన్నాడు.
9 వాళ్ళు రాజు మాటలు విని తమ దారిన తాము వెళ్ళిపొయ్యారు. వాళ్ళు తూర్పు దిశన చూసిన నక్షత్రం వాళ్ళకన్నా ముందు వెళ్ళుతూ ఆ శిశువు ఉన్న ఇంటి మీద ఆగింది. 10 వాళ్ళా నక్షత్రం ఆగిపోవటం చూసి చాలా ఆనందించారు.
11 ఇంట్లోకి వెళ్ళి ఆ పసివాడు తన తల్లి మరియతో ఉండటం చూసారు. వాళ్ళు ఆయన ముందు మోకరిల్లి ఆయన్ని ఆరాధించారు. ఆ తర్వాత తమ కానుకల మూటలు విప్పి ఆయనకు బంగారు కానుకలు, సాంబ్రాణి, బోళం బహూకరించారు. 12 హేరోదు దగ్గరకు వెళ్ళొద్దని దేవుడు ఆ జ్ఞానులతో చెప్పాడు. అందువల్ల వాళ్ళు తమ దేశానికి మరో దారి మీదుగా వెళ్ళిపోయారు.
ఈజిప్టు దేశానికి తరలి వెళ్ళటం
13 వాళ్ళు వెళ్ళిపొయ్యాక దేవదూత యోసేపుకు కలలో కనిపించి, “లెమ్ము! తప్పించుకొని తల్లీబిడ్డలతో ఈజిప్టు దేశానికి వెళ్ళు! హేరోదు శిశువును చంపాలని అతని కోసం వెతుకనున్నాడు. కనుక నేను చెప్పే వరకు అక్కడే ఉండు” అని అన్నాడు.
14 యోసేపు లేచి తల్లీ బిడ్డలతో ఆ రాత్రి ఈజిప్టు దేశానికి బయలుదేరాడు. 15 యోసేపు హేరోదు మరణించేదాకా అక్కడే ఉండి పొయ్యాడు. తద్వారా ప్రభువు ప్రవక్త ద్వారా, “నేను నా కుమారుణ్ణి ఈజిప్టు నుండి పిలుస్తాను”(C) అని అన్న మాట నిజమైంది.
హెరోదు బెత్లెహేములో మగపిల్లలను చంపటం
16 జ్ఞానులు తనను మోసం చేసారని గ్రహించి హేరోదు కోపంతో మండిపొయ్యాడు. అతడు వాళ్ళు చెప్పిన కాలాన్ననుసరించి బేత్లేహేములో, దాని పరిసర ప్రాంతాల్లో రెండు సంవత్సరాలు, లేక అంతకన్నా తక్కువ వయస్సుగల బాలురనందర్ని చంపివేయమని ఆజ్ఞాపించాడు. 17 తద్వారా యిర్మీయా ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన ఈ విషయం నిజమైంది:
18 “రామా గ్రామంలో అతి దుఃఖంతో
ఏడుస్తున్న స్వరం వినిపించింది.
రాహేలు తన సంతానం కొఱకు ఏడ్చింది.
ఎవరు ఓదార్చిన వినలేదు.
ఆమె సంతానంలో ఎవ్వరూ మిగల్లేదు.”(D)
నజరేతుకు తిరుగు ప్రయాణం
19 హేరోదు మరణించిన తర్వాత దేవదూత ఈజిప్టులో ఉన్న యోసేపుకు కలలో కనిపించి, 20 “లెమ్ము! శిశువును చంపాలని ప్రయత్నం చేసిన వాళ్ళు చనిపోయారు. కనుక తల్లిని, బిడ్డను తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు” అని అన్నాడు.
21 అందువల్ల యోసేపు లేచి తల్లిని, బిడ్డను తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాడు. 22 కాని, యూదయ దేశాన్ని హేరోదుకు మారుగా అతని కుమారుడు అర్కెలాయు పాలిస్తున్నాడని విని అక్కడికి వెళ్ళటానికి భయపడిపొయ్యాడు. అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ప్రభువు హెచ్చరించటంవల్ల అతడు గలిలయ ప్రాంతానికి వెళ్ళిపొయ్యాడు. 23 అక్కడికి వెళ్ళి నజరేతు అనే గ్రామంలో నివసించాడు. తద్వారా, ఆయన నజరేతు నివాసి అని పిలువబడతాడు అని దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పిన మాటలు నిజమయ్యాయి.
యోహాను బోధించటం
(మార్కు 1:1-8; లూకా 3:1-9, 15-17; యోహాను 1:19-28)
3 బాప్తిస్మము[b] యిచ్చే యోహాను, ఆ కాలంలో యూదయ దేశంలోని ఎడారిలో ఉపదేశిస్తూ ఉండేవాడు. 2 అతడు, “దేవుని రాజ్యం సమీపంలోనే ఉంది కనుక మారుమనస్సు పొందండి!” అని ఉపదేశించాడు. 3 ఇతణ్ణి గురించి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ విధంగా చెప్పాడు:
“‘ప్రభువు మార్గాన్ని సిద్ధం చెయ్యమని,
తిన్నని మార్గాన్ని వెయ్యమని’
ఎడారిలో ఒక గొంతు ఎలుగెత్తి పలికింది.”(E)
4 యోహాను ఒంటె వెంట్రుకలతో చెయ్యబడిన వస్త్రాల్ని ధరించి, నడుముకు తోలు దట్టి కట్టుకొని, మిడుతల్ని, అడవి తేనెను తింటూ జీవించేవాడు. 5 యెరూషలేము నుండి, యూదయ దేశము నుండి యోర్దాను నదీ ప్రాంతాలన్నిటి నుండి ప్రజలు అతని దగ్గరకు వెళ్ళి, 6 తాము చేసిన పాపాల్ని ఒప్పుకొనే వాళ్ళు. అతడు వాళ్ళకు యొర్దాను నదిలో బాప్తిస్మమునిచ్చేవాడు.
7 పరిసయ్యులు[c] సద్దూకయ్యులు[d] యోహాను బాప్తిస్మమునిస్తున్న ప్రాంతానికి వచ్చారు. అతడు వాళ్ళను చూసి, “మీరు సర్పసంతానం. దేవుని కోపం నుండి తప్పించుకొనుటకు మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు? 8 మీరు మారుమనస్సు పొందినట్లుగా మీ ప్రవర్తన మార్చుకోండి. 9 ‘అబ్రాహాము మా తండ్రి’ అని మీలో మీరు గర్వించకండి. ఈ రాళ్ళ నుండి దేవుడు అబ్రాహాముకు సంతానాన్ని సృష్టించ గలడని నేను చెబుతున్నాను. 10 చెట్ల వేర్ల మీద గొడ్డలి సిద్ధంగా ఉంది. దేవుడు మంచి ఫలమివ్వని చెట్లను నరికి మంటల్లోకి వేస్తాడు.
11 “మీరు మారుమనస్సు పొందారు కనుక నేను మీకు బాప్తిస్మము నిస్తున్నాను. కాని నా తర్వాత రానున్నవాడు నా కన్నా శక్తి కలవాడు! ఆయన చెప్పుల్ని మోయటానికి కూడా నేను తగను. ఆయన మీకు పవిత్రాత్మతో, అగ్నితో, బాప్తిస్మము నిస్తాడు. 12 తూర్పార బట్టే చేట ఆయన చేతిలో ఉంది. ఆయన కళ్ళమును శుభ్రం చేసి తన గోధుమల్ని ధాన్యపు కొట్టులో వేసుకొంటాడు. పొట్టును ఆరని మంటల్లో వేసి కాలుస్తాడు” అని అన్నాడు.
యోహాను చేత యేసు బాప్తిస్మం పొందటం
(మార్కు 1:9-11; లూకా 3:21-22)
13 గలిలయ నుండి యేసు యోహాను ద్వారా బాప్తిస్మము పొందటానికి యొర్దాను నదీ ప్రాంతానికి వచ్చాడు. 14 కాని యోహాను ఆయనతో, “నీ ద్వారా నేను బాప్తిస్మము పొందాలి కాని, నీవు నా ద్వారా బాప్తిస్మము పొందటానికి రావటమా?” అని అంటూ యేసును ఆపటానికి ప్రయత్నించాడు.
15 యేసు సమాధానంగా, “ప్రస్తుతానికి ఇది జరుగనివ్వుము. నీతిని నిలబెట్టటానికి మనమిలా చెయ్యటం సమంజసమే!” అని అన్నాడు. దీనికి యోహాను అంగీకరించాడు.
16 యేసు బాప్తిస్మము పొంది, నీళ్ళ నుండి వెలుపలికి రాగానే అదే క్షణంలో ఆకాశం తెరుచుకొంది. దేవుని ఆత్మ ఒక పాపురంలాగ తన మీదికి రావటం యేసు చూసాడు. 17 పరలోకంనుండి ఒక స్వరం, “ఈయన నా ప్రియ కుమారుడు. ఇతని పట్ల నాకెంతో ఆనందం” అని అన్నది.
© 1997 Bible League International