Read the Gospels in 40 Days
లాజరు మరణము
11 బేతనియ గ్రామానికి చెందిన లాజరుకు జబ్బు చేసింది. మరియ, ఆమె సోదరి మార్త కూడా ఆ గ్రామంలో ఉండే వాళ్ళు. 2 ఒకప్పుడు ప్రభువు పాదాల మీద అత్తరు పోసి తన తల వెంట్రుకలతో తుడిచింది ఈ మరియయే! జబ్బుతో ఉండిన లాజరు మరియ సోదరుడు. 3 ఈ స్త్రీలు, “ప్రభూ! మీరు ప్రేమిస్తున్న లాజరు జబ్బుతో ఉన్నాడు” అన్న వార్త యేసుకు పంపారు.
4 యేసు, విని, “ఈ జబ్బు చంపటానికి రాలేదు. దేవుని కుమారునికి మహిమ కలుగచేసి తద్వారా దేవుని మహిమను ప్రకటించటానికి వచ్చింది” అని అన్నాడు. 5 యేసుకు మార్త పట్ల, ఆమె సోదరి పట్ల, లాజరు పట్ల ప్రేమ ఉంది. 6 లాజరు జబ్బుతో ఉన్నాడని యేసు విన్నాడు. అక్కడ రెండురోజులు ఉండి, 7 ఆ తర్వాత తన శిష్యులతో, “మనమంతా యూదయకు తిరిగి వెళ్దాం” అని అన్నాడు.
8 వాళ్ళు, “కాని రబ్బీ! యింతకు ముందే యూదులు మిమ్మల్ని రాళ్ళతో కొట్టాలని ప్రయత్నించారు. అయినా మీరు తిరిగి అక్కడికి వెళ్తున్నారా?” అని అడిగారు.
9 యేసు, “దినానికి పన్నెండు గంటలు వెలుతురుంటుంది. పగటి వేళ నడిచేవాడు ప్రపంచం యొక్క వెలుగు చూస్తుంటాడు. కనుక క్రిందపడడు. 10 రాత్రి వేళ నడిచే వానిలో వెలుగు ఉండదు. కనుక క్రిందపడతాడు” అని అన్నాడు.
11 ఈ విషయాలు చెప్పాక యేసు యింకా ఈ విధంగా అన్నాడు: “మన స్నేహితుడు లాజరు నిద్రపోయాడు. అతణ్ణి నిద్రనుండి లేపటానికి నేను అక్కడికి వెళ్తున్నాను.”
12 ఆయన శిష్యులు, “ప్రభూ! నిద్ర పోతే ఆరోగ్యంగా ఉంటాడు” అని అన్నారు. 13 యేసు మాట్లాడింది అతని చావును గురించి. కాని ఆయన శిష్యులు ఆయన సహజమైన నిద్రను గురించి మాట్లాడుతున్నాడనుకున్నారు.
14 అప్పుడు యేసు స్పష్టంగా, “లాజరు చనిపోయాడు. 15 నేనక్కడ లేనిది మంచిదైంది. మీ కోసమే అలా జరిగింది. మీరు నమ్మాలని నా ఉద్దేశ్యం. ఇప్పుడు అక్కడికి వెళ్దాం” అని అన్నాడు.
16 దిదుమ అని పిలువబడే తోమా, మిగతా శిష్యులతో, “యేసుతో కలిసి చనిపోవటానికి మనం కూడా ఆయన వెంట వెళ్దాం” అని అన్నాడు.
లాజరు కుటుంబాన్ని ఓదార్చుట
17 యేసు అక్కడికి చేరుకున్నాడు. నాలుగు రోజుల ముందే లాజరు సమాధి చేయబడ్డాడని ఆయనకు తెలిసింది. 18 బేతనియ, యెరూషలేమునకు సుమారు రెండు మైళ్ళ దూరంలో ఉంటుంది. 19 చాలా మంది యూదులు మార్తను, మరియను వాళ్ళ సోదరుడు చనిపోయినందుకు ఓదార్చటానికి వచ్చారు.
20 యేసు వస్తున్నాడని విని మార్త ఆయన్ని కలుసుకోవటానికి వెళ్ళింది. కాని మరియ ఇంట్లోనే ఉండిపోయింది. 21 మార్త యేసుతో, “ప్రభూ! మీరిక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయే వాడు కాదు. 22 కాని, యిప్పటికైనా మీరడిగితే దేవుడు మీరడిగింది యిస్తాడని నాకు తెలుసు” అని అన్నది.
23 యేసు ఆమెతో, “మీ సోదరుడు మళ్ళీ బ్రతికివస్తాడు” అని అన్నాడు.
24 మార్త, “చివరి రోజున అనగా అందరూ బ్రతికి వచ్చే రోజున అతడూ బ్రతికి వస్తాడని నాకు తెలుసు” అని సమాధానం చెప్పింది.
25 యేసు, “బ్రతికించే వాణ్ణి, బ్రతుకును నేనే. నన్ను నమ్మినవాడు చనిపోయినా జీవిస్తాడు. 26 జీవిస్తున్నవాడు నన్ను విశ్వసిస్తే ఎన్నటికి మరణించడు. ఇది నీవు నమ్ముతున్నావా?” అని అడిగాడు.
27 ఆమె, “నమ్ముతున్నాను ప్రభూ! మీరు క్రీస్తు అని, ఈ ప్రపంచంలోకి వచ్చిన దేవుని కుమారుడవని నమ్ముతున్నాను” అని అన్నది.
యేసు యేడవటం
28 ఈ విధంగా అన్న తర్వాత యింటికి వెళ్ళి తన సోదరి మరియను ప్రక్కకు పిలిచి, ఆమెతో, “బోధకుడు వచ్చాడు. నీ కొరకు అడుగుతున్నాడు” అని అన్నది. 29 మరియ యిది విని వెంటనే లేచి ఆయన దగ్గరకు వెళ్ళింది. 30 యేసు గ్రామంలోకి రాలేదు. ఆయనింకా మార్త కులుసుకొన్న చోటే ఉన్నాడు. 31 మరియ యింట్లో ఆమెను ఓదారుస్తున్న యూదులు ఆమె హడావుడిగా లేచి బయటకు వెళ్ళటం చూసారు. ఆమె దుఃఖించటానికి సమాధి దగ్గరకు వెళ్తోందని ఆమె వెంట వెళ్ళారు. 32 మరియ యేసు ఉన్న చోటికి వెళ్ళి ఆయన్ని చూసి, కాళ్ళ ముందుపడి, “ప్రభూ! మీరిక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయేవాడు కాదు!” అని అన్నది.
33 ఆమె, ఆమెతో వచ్చిన యూదులు దుఃఖించటం చూసి యేసు తన ఆత్మలో కలవర పడ్డాడు. ఆయన హృదయం కరిగి పోయింది. 34 “అతన్నెక్కడ సమాధిచేసారు?” అని యేసు అడిగాడు.
“వచ్చి చూడండి ప్రభూ!” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
35 యేసు కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
36 అప్పుడు యూదులు, “యేసు అతన్నెంతగా ప్రేమించాడో చూడండి!” అని అన్నారు.
37 కాని కొందరు, “గ్రుడ్డివానికి కళ్ళు తెప్పించిన యితడు, చనిపోకుండా చెయ్యలేక పోయాడా?” అని అన్నారు.
యేసు లాజరును బ్రతికించటం
38 యేసు హృదయం మళ్ళీ కదిలింది. ఆయన సమాధి దగ్గరకు వెళ్ళాడు. ఆ సమాధి ఒక గుహలా ఉంది. ఒక రాయి దానికి అడ్డంగా పెట్టబడి ఉంది. 39 “ఆ రాయి తీసి వెయ్యండి!” అని అన్నాడు.
చనిపోయిన వాని సోదరి మార్త, “కాని, ప్రభూ! అతని దేహం నాలుగు రోజులనుండి అక్కడవుంది. యిప్పటికది కంపు కొడ్తూ ఉంటుంది” అని అన్నది.
40 అప్పుడు యేసు, “నమ్మితే దేవుని మహిమను చూస్తావని నేను చెప్పలేదా?” అని అన్నాడు.
41 వాళ్ళు ఆ రాయి తీసి వేసారు. యేసు పైకి చూసి, “తండ్రి నీవు నా మాటలు విన్నందుకు కృతజ్ఞుణ్ణి. 42 నా మాటలు అన్ని వేళలా వింటావని నాకు తెలుసు. నీవు నన్ను పంపించినట్లు వీళ్ళు నమ్మాలని, వీళ్ళకు అర్థం కావాలాని అక్కడ నిలుచున్న వాళ్ళ మంచి కోసం యిలా అంటున్నాను” అని అన్నాడు. 43 ఈ విధంగా అన్నాక యేసు పెద్ద స్వరంతో, “లాజరూ! వెలుపలికి రా!” అని పిలిచాడు. 44 చినిపోయిన వాడు వెలుపలికి వచ్చాడు. అతని కాళ్ళు చేతులు వస్త్రాలతో చుట్టబడి ఉన్నాయి. అతని ముఖం మీద కూడా ఒక గుడ్డ కట్టబడి ఉంది.
యేసు వాళ్ళతో, “సమాధి దుస్తుల్ని తీసి వేయండి, అతణ్ణి వెళ్ళనివ్వండి!” అని అన్నాడు.
యూదా నాయకులు యేసును చంపుటకు కుట్ర పన్నటం
(మత్తయి 26:1-5; మార్కు 14:1-2; లూకా 22:1-2)
45 మరియ దగ్గరకు వచ్చిన యూదుల్లో చాల మంది యేసు చేసింది చూసి ఆయన యందు నమ్మకం ఉంచారు. 46 కొందరు మాత్రం పరిసయ్యుల దగ్గరకు వెళ్ళి యేసు చేసింది చెప్పారు. 47 అప్పుడు ప్రధాన యాజకులు, పరిసయ్యులు మహాసభను ఏర్పాటు చేసారు. “మనం ఏం చేద్దాం? ఈ మనుష్యుడు చాలా మహాత్కార్యాలు చేస్తున్నాడు. 48 అతణ్ణి ఈ విధంగా వదిలి వేస్తే ప్రతి ఒక్కడు అతని శిష్యుడవుతాడు. ఆ తర్వాత రోమనులు వచ్చి మన మందిరాన్ని, మన దేశాన్ని నాశనం చేస్తారు” అని అన్నారు.
49 వాళ్ళలో ఒకడైన కయప అనబడే వాడు, “మీకేమీ తెలియదు!” అని అన్నాడు. కయప ఆ సంవత్సరానికి ప్రధాన యాజకుడు. 50 అతడు యింకా, “దేశమంతా నాశనం కావటానికన్నా ప్రజల కోసం ఒక మనిషి చావటం మంచిది. ఇది మీకు అర్థం కాదా?” అని అన్నాడు.
51-52 యూదుల దేశం కోసమేకాక, ప్రపంచంలో చెదిరియున్న దేవుని ఇతర జనాంగములను ఒకటిగా చేయటానికి కూడా యేసు ప్రాణమిస్తాడని కయప ప్రవచనం చెప్పాడు. అవి అతడు స్వయంగా ఆడిన మాటలు కావు. అవి అతడు ఆ సంవత్సరపు ప్రధాన యాజకునిగా పలికిన మాటలు.
53 ప్రధాన యాజకుని మాటలు విని ప్రజలు ఆనాటి నుండి యేసును చంపటానికి పన్నాగాలు పన్నటం మొదలు పెట్టారు. 54 అందువల్ల యేసు యూదుల మధ్య బహిరంగంగా తిరగటం మానేసి వాళ్ళకు దూరంగా ఎడారి దగ్గర ఉన్న ఎఫ్రాయిము అనే గ్రామానికి వెళ్ళి పోయాడు. అక్కడ ఆయన తన శిష్యులతో కొంత కాలం గడిపాడు.
55 యూదుల పస్కా పండుగ దగ్గరకు వచ్చింది. పండుగకు ముందు శుద్ధి చేసుకోవటానికి గ్రామ గ్రామాలనుండి చాలా మంది ప్రజలు యెరూషలేముకు వెళ్ళారు. 56 అక్కడ వీళ్ళంతా యేసు కోసం వెతికారు. మందిరంలో సమావేశం అయ్యాక వాళ్ళు, “మీరేమనుకుంటున్నారు? పండుగకు వస్తాడా? రాడా?” అంటూ పరస్పరం మాట్లాడుకున్నారు. 57 ప్రధానయాజకులు, పరిసయ్యులు, “యేసు ఎక్కడున్న విషయం తెలిసినవాడు వెంటనే తమకు తెలియచెయవలెనని” ఒక ఆజ్ఞ ప్రకటించారు. యేసును బంధించాలని వాళ్ళ ఉద్దేశ్యం.
యేసు బేతనియలో తన స్నేహితులతో
(మత్తయి 26:6-13; మార్కు 14:3-9)
12 పస్కా పండుగకు ఆరు రోజుల ముందే యేసు బేతనియ చేరుకున్నాడు. యేసు బ్రతికించిన లాజరు యింతకు పూర్వం ఆ గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. 2 అక్కడ యేసు గౌరవార్థం ఒక విందు ఏర్పాటు చేయబడింది. మార్త వడ్డిస్తూ ఉంది. యేసుతో సహా కూర్చున్న వాళ్ళలో లాజరు ఒకడు. 3 మరియ జటామాంసి చెట్టుతో చేయబడిన ఒక సేరున్నర విలువైన మంచి అత్తరు యేసు పాదాల మీద పోసి, తన తల వెంట్రుకలతో పాదాలను తుడుచింది. ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది.
4-5 యూదా ఇస్కరియోతు యేసు శిష్యుల్లో ఒక్కడు. యేసుకు ద్రోహం చెయ్యబోయేవాడు వీడే. యూదా, “ఈ అత్తరు అమ్మి, ఆ డబ్బు పేద వాళ్ళ కెందుకివ్వలేదు. ఆ అత్తరు వెల మూడువందల దేనారా లన్నా ఉంటుంది కదా!” అని అన్నాడు. 6 యూదాకు పేద వాళ్ళపై కనికరం ఉండుటవలన యిలా అనలేదు. వీడు దొంగ. డబ్బు సంచి తన దగ్గర ఉండటంవల్ల దానిలోవున్న డబ్బు దొంగలించే వాడు.
7 యేసు, “ఆమె ఈ అత్తరుతో నన్ను సమాధికి సిద్ధం చెయ్యటానికి ఈనాటి దాకా దాన్ని దాచి ఉంచింది. 8 మీతో పేదవాళ్ళు ఎప్పటికీ ఉంటారు. కాని నేను ఎల్లకాలం మీతో ఉండను” అని అన్నాడు.
లాజరుకు విరోధముగా కుట్ర
9 ఇంతలో పెద్ద యూదుల గుంపు ఒకటి యేసు అక్కడవున్నాడని విని అక్కడికి వచ్చింది. ఆయన కోసమే కాకుండా ఆయన బ్రతికించిన లాజరును కూడా చూడటానికి వచ్చారు. 10-11 తద్వారా ప్రధాన యాజకులు లాజరును కూడా చంపాలని పన్నాగం పన్నారు. ఎందుకంటే యితని కారణంగానే చాలామంది యూదులు యేసు దగ్గరకు వెళ్ళి ఆయన యందు నమ్మకం ఉంచారు.
యేసు యెరూషలేము ప్రవేశించటం
(మత్తయి 21:1-11; మార్కు 11:1-11; లూకా 19:28-40)
12 మరుసటి రోజు పండుగ కోసం వచ్చిన గుంపు ఒకటి యేసు యెరూషలేంలోకి వస్తున్నాడని విన్నది. 13 వాళ్ళు ఖర్జూరపు మట్టల్ని పట్టుకొని,
అని కేకలు వేస్తూ ఆయన్ని కలవటానికి వచ్చారు.
14 యేసు ఒక గాడిద పిల్లను కనుగొని దానిపై కూర్చున్నాడు. ఈ సందర్భాన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:
15 “సీయోను కుమారీ, భయపడకు!
గాడిద పిల్లపై కూర్చొని
నీ రాజు వస్తున్నాడు చూడు!”(B)
16 ఇవి ఆయన శిష్యులకు అప్పుడు అర్థంకాలేదు. కాని యేసు మహిమ పొందిన తర్వాత ప్రవక్తలు ఆయన్ని గురించి వ్రాశారని గుర్తించారు. అంతేగాక తాము చేసిన వాటిని గురించి అర్థం చేసుకొన్నారు.
17 యేసు లాజరును సమాధినుండి లేచి రమ్మని పిలవటము, అతణ్ణి బ్రతికించటము చూసిన ప్రజలు ఆవార్త ప్రచారం చేసారు. 18 చాలా మంది ఆయన ఈ అద్భుతాన్ని చేసాడని విన్నందువలన ఆయన్ని కలుసు కోవటానికి వెళ్ళారు. 19 అందువలన పరిసయ్యులు పరస్పరం, “చూడండి! మనం గెలవటం లేదు. ప్రపంచమంతా అతని వెంట ఎట్లా వెళ్తున్నారో చూడండి!” అని మాట్లాడుకున్నారు.
జీవము, మరణముల గురించి యేసు మాట్లాడటం
20 పండుగ రోజు ఆరాధన చెయ్యటానికి వెళ్ళిన వాళ్ళల్లో గ్రీకులు కూడా ఉన్నారు. 21 వాళ్ళు ఫిలిప్పును కలుసుకొని, “అయ్యా! మేము యేసును చూడటానికి వచ్చాము” అని అన్నారు. ఫిలిప్పు, గలిలయలోని బేత్సయిదా అనే గ్రామానికి చెందిన వాడు. 22 ఫిలిప్పు వెళ్ళి అంద్రెయతో చెప్పాడు. వీళ్ళిద్దరూ వెళ్ళి యేసుతో చెప్పారు.
23 యేసు ఇలా అన్నాడు: “మనుష్యకుమారుడు మహిమపొందు గడియ దగ్గరకు వచ్చింది. 24 ఇది నిజం. గోధుమ విత్తనం భూమ్మీద పడి చనిపోకపోతే అది ఒకటిగానే ఉంటుంది. అది చనిపోతే ఎన్నో విత్తనాల్ని ఉత్పత్తి చేస్తుంది. 25 తన ప్రాణాన్ని ప్రేమించే వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని ఈ ప్రాపంచిక జీవితాన్ని ఏవగించుకొన్నవాడు తన ప్రాణాన్ని కాపాడు కొంటాడు. పైగా అనంతజీవితం పొందుతాడు. 26 నా సేవ చేయదలచిన వాడు నన్ను అనుసరించాలి. నేను ఎక్కడ ఉంటే నా సేవకుడు అక్కడ ఉంటాడు. నా సేవ చేసేవాణ్ణి నా తండ్రి గౌరవిస్తాడు.
యేసు తన మరణాన్ని గురించి మాట్లాడటం
27 “ఇక నా ఆత్మ కలవరం చెందుతున్నది. తండ్రీ నేనేమనాలి? ఈ గడియనుండి నన్ను రక్షించుమని అడగాలా? కాదు! నేను వచ్చింది ఈ గడియ కోసమే కదా! 28 తండ్రీ నీ పేరుకు మహిమ కలిగించుకో.”
అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం, “నేను యిదివరలో నా పేరుకు మహిమ కలిగించాను. మళ్ళీ దానికి మహిమ కలిగిస్తాను!” అని అన్నది.
29 అక్కడ నిలుచున్న ప్రజలు యిది విన్నారు. కొందరు ఉరిమిందన్నారు.
మరి కొందరు, “దేవదూత ఆయనతో మాట్లాడాడు” అని అన్నారు.
30 యేసు, “ఆ గొంతు మీ కోసం పలికింది. నా కోసం కాదు. 31 ఈ ప్రపంచంపై తీర్పు చెప్పే సమయం వచ్చింది. ఈ లోకాధికారిని బయటకు తరిమి వేసే సమయం వచ్చింది. 32 కాని దేవుడు నన్ను ఈ భూమ్మీదినుండి పైకెత్తినప్పుడు నేను ప్రజలందర్ని నా యొద్దకు ఆకర్షిస్తాను. వాళ్ళను నా దగ్గరకు పిలి పించుకుంటాను” అని అన్నాడు. 33 ఇది చెప్పి తాను ఏ విధంగా మరణించనున్నాడో సూచించాడు.
34 ప్రజలు, “మేము ధర్మశాస్త్రం ద్వారా ‘క్రీస్తు’ చిరకాలం ఉంటాడని విన్నాము. అలాంటప్పుడు మనుష్యకుమారుణ్ణి దేవుడు పైకెత్తుతాడని ఎట్లా అనగలుగుతున్నావు? ఈ మనుష్యకుమారుడెవరు?” అని అన్నారు.
35 అప్పుడు యేసు వాళ్ళతో, “వెలుగు మీకోసం యింకా కొంత కాలం మాత్రమే ఉంటుంది. చీకటి రాకముందే, అంటే వెలుగు ఉండగానే ప్రయాణం సాగించండి. చీకట్లో నడిచే వ్యక్తికి తానెక్కడికి వెళుతున్నాడో తెలియదు. 36 వెలుగు ఉన్నప్పుడే దాన్ని విశ్వసించండి. అప్పుడు మీరు వెలుగు యొక్క సంతానంగా లెక్కింపబడతారు” అని అన్నాడు. యేసు మాట్లాడటం ముగించాక వాళ్ళకు కనిపించకుండా ఉండాలని దూరంగా వెళ్ళిపోయాడు.
యూదులు నిరాకరించటం
37 యేసు ఇన్ని మహాత్కార్యాలు వాళ్ళ సమక్షంలో చేసినా వాళ్ళలో ఆయన పట్ల విశ్వసం కలుగలేదు. 38 ప్రవక్త యెషయా చెప్పిన ఈ వాక్యాలు నిజం కావటానికి యిలా జరిగింది:
“ప్రభూ! మా సందేశం ఎవరు విశ్వసించారు?
ప్రభువు తన శక్తిని ఎవరికి చూపాడు?”(C)
39 అందుచేత వాళ్ళు విశ్వసించలేక పోయారు. ఈ విషయాన్ని యెషయా ప్రవక్త మరొక చోట చెప్పినది నెరవేరునట్లు యిలా జరిగింది:
40 “ప్రభువు వాళ్ళ కళ్ళు కప్పి,
వాళ్ళ హృదయాలు మూసి వేశాడు.
వాళ్ళు చూడరాదని, వాళ్ళు అర్థం చేసుకోరాదని ఆయన ఉద్దేశ్యం.
అలా చేయకపోతే వాళ్ళు నా వైపు మళ్లుతారు
వాళ్ళకు నేను నయం చేయవలసివస్తుంది.”(D)
41 యెషయా యేసు మహిమను చూసాడు. కనుకనే ఆయన్ని గురించి ఆ విధంగా మాట్లాడాడు.
42 ఈ పరిస్థితుల్లో కూడా యూదుల నాయకుల్లో కొందరు యేసును విశ్వసించారు. కాని పరిసయ్యులు తమను సమాజం నుండి బహిష్కరిస్తారనే భయం వల్ల ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పలేదు. 43 ఎందుకంటే, వీళ్ళకు దేవుని మెప్పుకన్నా ప్రజల పొగడ్తలంటే ఎక్కవ యిష్టం.
యేసు బోధ జనులకు తీర్పు తీర్చును
44 యేసు, “నన్ను విశ్వసించేవాడు, నన్నే కాక నన్ను పంపిన వానియందు కూడా విశ్వసిస్తాడు. 45 అతడు నన్ను చూసేటప్పుడు నన్ను పంపిన వానిని చూస్తున్నట్లే! 46 నేను ఈ ప్రపంచంలోకి వెలుగ్గా వచ్చాను! ఎందుకంటే నన్ను విశ్వసించేవాడు చీకటిలో ఉండ కూడదని. అందుచేత నేను చెప్పే మాటలన్నీ తండ్రీ నాతో చెప్పుమని ఇచ్చిన మాటలే.
47 “ఎవడైనను నా మాటలు విని వాటిని అనుసరించని వానికి నేను తీర్పు తీర్చను. ఎందుకంటే నేను ఈ ప్రపంచానికి తీర్పు తీర్చటానికి రాలేదు, కాని నేను రక్షించటానికి వచ్చాను. 48 నన్ను, నా మాటల్ని ఇష్టపడక వ్యతిరేకించేవానిపై ఒక న్యాయాధిపతి ఉన్నాడు. నేను పలికిన మాటయే చివరి దినమున వానికి తీర్పుతీరుస్తుంది. 49 నేను నా యిష్ట ప్రకారం మాట్లాడలేదు, గాని నా తండ్రి ఏమి చెప్పుమని నాకు ఆజ్ఞాపించాడో అలాగే చెప్పాను. 50 ఆయన ఆజ్ఞ నిత్య జీవానికి నడిపిస్తుందని నాకు తెలుసు. అందుచేత నేను చెప్పే మాటలన్నీ తండ్రి నాతో చెప్పుమని ఇచ్చిన మాటలే” అని అన్నాడు.
© 1997 Bible League International