Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెహెజ్కేలు 18-20

నిజమైన న్యాయం

18 యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా చెప్పాడు: “మీరీ సామెత వల్లిస్తూ ఉంటారు:

‘తల్లిదండ్రులు పుల్లని ద్రాక్ష తింటే
    పిల్లలపండ్లు పులిశాయి!’ అని.

ఇలా మీరెందుకు అంటూ వుంటారు? మీరు పాపంచేస్తే, మీ బదులు భవిష్యత్తులో మరెవ్వడో శిక్షింపబడతాడని మీరనుకుంటున్నారు.”

కాని నా ప్రభువైన యెహోవా చెబుతున్నదేమంటే, “నా జీవ ప్రమాణంగా ఇశ్రాయేలు ప్రజలు ఈ సామెత ఇక మీదట నిజమని నమ్మరని నేను మీకు ఖచ్చితంగా చెబుతున్నాను! నేను ప్రతి వ్యక్తినీ ఒకే రకంగా చూస్తాను. ఆ వ్యక్తి తండ్రిగాని, బిడ్డగాని కావచ్చు. పర్వాలేదు. ఎవరైతే పాపం చేశారో ఆ వ్యక్తులే చనిపోతారు!

“మంచి మనిషి ఎవరైనా వుంటే, ఆ వ్యక్తి జీవిస్తాడు! ఆ మంచి వ్యక్తి ప్రజలయెడల నీతిగా న్యాయంగా వుంటాడు. ఆ సజ్జనుడు పర్వతాలమీదికి వెళ్లి, అక్కడ బూటకపు దేవతలకు అర్పించిన నైవేద్యాలను తినడు. అతడు ఇశ్రాయేలులో నెలకొల్పిన రోత విగ్రహాలను ప్రార్థించడు. అతడు తన పొరుగువాని భార్యతో వ్యభిచరించే పాపానికి ఒడిగట్టడు. తన భార్య ముట్టయినప్పుడు ఆమెతో సంభోగించడు. ఆ సజ్జనుడు ప్రజల మంచితనాన్ని ఆసరాగా తీసుకోడు, ఎవ్వరేగాని అతని వద్దకు అప్పుకు వచ్చినప్పుడు, మంచి వ్యక్తి వస్తువులను తాకట్టు[a] పెట్టుకొని డబ్బు ఇస్తాడు. అప్పు తీసుకొన్నవాడు తిరిగి చెల్లించినప్పుడు, సజ్జనుడు తన డబ్బు తీసుకొని తాకట్టు వస్తువులను ఇచ్చివేస్తాడు. ఆకలిగొన్న వారికి సజ్జనుడు అన్నం పెడతాడు. కట్టు బట్టలు లేక బాధపడేవారికి అతడు వస్త్రదానం చేస్తాడు. అప్పు కోరి అతనిని ఆశ్రయిస్తే మంచి వ్యక్తి ఆ వచ్చిన వానికి డబ్బు ఇస్తాడు. కాని అతడా ఋణానికి వడ్డీ తీసుకోడు. మంచివాడు కపటంగా ప్రవర్తించటానికి నిరాకరిస్తాడు. అతడు ప్రతి మనిషి పట్ల ఎల్లప్పుడూ ఉదారంగా ప్రవర్తిస్తాడు. ప్రజలతనిని నమ్మవచ్చు. అతడు నా కట్టడలను అనుసరిస్తాడు. అతడు నా నిర్ణయాలను గురించి ఆలోచించి, ధర్మవర్తనుడై నమ్మదగినవాడుగా వుండటం నేర్చుకుంటాడు. అతడు సజ్జనుడు. అందుచేత అతడు జీవిస్తాడు.

10 “కాని ఆ మంచి వ్యక్తికీ అటువంటి మంచి పనులేవీ చేయని ఒక కుమారుడు వుండవచ్చు. ఆ కుమారుడు వస్తువులను దొంగిలించి, నరహత్య చేయవచ్చు. 11 అతడు ఈ చెడ్డ పనులలో దేనినైనా చేయవచ్చు. పర్వతాల మీదకి వెళ్లి బూటకపు దేవుళ్ళకు అర్పించిన నైవేద్యాలను తినవచ్చు. ఆ చెడ్డ కుమారుడు తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించి పాపం చేయవచ్చు. 12 అతడు పేదలను, నిస్సహాయులను అలక్ష్యము చేయవచ్చు. అతడు ప్రజల మంచితనాన్ని వినియోగ పర్చుకోవచ్చు. అప్పు తీసుకున్నవాడు సొమ్ము చెల్లించినప్పుడు, అతడు తాకట్టు వస్తువును తిరిగి ఇచ్చివేయక పోవచ్చు. ఆ చెడ్డ కుమారుడు రోత పుట్టించే విగ్రహాలను ఆరాధించి, ఇతర భయంకరమైన పనులు చేయవచ్చు. 13 ఆ దుష్టుడైన కుమారుని వద్ద డబ్బు అప్పు తీసుకొనే అవసరం ఎవరికైన కలుగవచ్చు. అతడు వానికి అప్పు ఇవ్వవచ్చు. కాని, అతడిచ్చిన అప్పుమీద వడ్డీ చెల్లించమని అప్పుదారుని అతడు పీడిస్తాడు. అందువల్ల ఆ చెడ్డ కుమారుడు జీవించడు. అతడు చేసిన ఘోరమైన పనులకు అతడు చంపబడతాడు. పైగా అతని చావుకు అతడే బాధ్యుడు.

14 “ఇప్పుడా దుష్టుడైన కుమారునికి ఒక కుమారుడు కలుగవచ్చు. ఈ కుమారుడు తన తండ్రి చేసే దుష్కార్యాలను చూసి, వాటిని నిరసించి తన తండ్రిలాగా ఉండకపోవచ్చు. వాడు ప్రజలందరినీ సమాదాన పరుస్తాడు. 15 ఆ మంచి కుమారుడు కొండల మీదికి వెళ్లి చిల్లర దేవుళ్లను ఆరాధించడు, ఆ దేవుళ్ళకు అర్పించిన నైవేద్యాలను తినడు. ఇశ్రాయేలులో నెలకొల్పిన రోత విగ్రహాలకు అతడు ప్రార్థన చేయడు. అతడు తన పొరుగువాని భార్యతో వ్యభిచార పాపానికి ఒడిగట్టడు. 16 ఆ మంచి కుమారుడు ప్రజల మంచితనాన్ని ఉపయోగించు కోకుండా ఉండవచ్చు. ఏ వ్యక్తి అయినా తన వద్దకు అప్పుకోరివస్తే, అతడు వస్తువులు తాకట్టు పెట్టుకొని డబ్బు ఇస్తాడు. మళ్లీ అప్పు తీసుకొన్నవాడు డబ్బు చెల్లిస్తే, ఆ మంచి కుమారుడు తాకట్టు వస్తువులు తిరిగి ఇచ్చివేస్తాడు. మంచి కుమారుడు ఆకలిగొన్న వారికి అన్నం పెడతాడు. అవసరమైన వారికి అతడు వస్త్రదానం చేస్తాడు. 17 అతడు పేదలకు సహాయం చేస్తాడు. ఎవరైనా తనవద్ద అప్పు తీసుకో తలంచితే, మంచి కుమారుడు అతనికి డబ్బు ఇస్తాడు. కాని అతడు ఆ అప్పుమీద వడ్డీ తీసుకొనడు! మంచి కుమారుడు నా న్యాయాన్ని శిరసావహిస్తాడు. నా కట్టడలను పాటిస్తాడు. తన తండ్రి చేసిన పాపాలకు ఆ మంచి కుమారుడు చంపబడడు! ఆ మంచి కుమారుడు జీవిస్తాడు. 18 తండ్రి ప్రజలను బాధించవచ్చు. వస్తువులను దొంగిలించవచ్చు. అతడు అతని ప్రజలకు ఏ మంచిని ఎన్నడూ చేసియుండడు! ఆ తండ్రి తన పాపాల కారణంగానే చనిపోతాడు. అయితే, కుమారుడు మాత్రం అతని తండ్రి పాపాలకు శిక్షింపబడడు.

19 “తన తండ్రి పాపాలకు కుమారుడు ‘ఎందుకు చంపబడడు?’ అని నీవు అడుగవచ్చు. అందుకు కారణం కుమారుడు న్యాయవర్తనుడై మంచి పనులు చేయటమే! అతడు నా కట్టడలను మిక్కిలి శ్రద్ధగా అనుసరించి నడచుకొన్నాడు! అందువల్ల అతడు జీవిస్తాడు. 20 చంపబడేది పాపాలకు ఒడిగట్టిన వ్యక్తి మాత్రమే! ఒక కుమారుడు అతని తండ్రి పాపాలకు శిక్షింపబడడు. ఒక తండ్రి తన కుమారుడు చేసిన తప్పులకు గాను శిక్షింపబడడు. ఒక మంచి వ్యక్తి మంచి తనం అతనికి మాత్రమే చెంది ఉంటుంది. ఒక చెడ్డ వ్యక్తి చెడుతనం అతనికి మాత్రమే పరిమితమై ఉంటుంది.

21 “ఒకవేళ చెడ్డ వ్యక్తి తన జీవిత విధానాన్ని మార్చుకుంటే అతడు జీవిస్తాడు. అతడు చనిపోడు. అతడు గతంలో చేసిన చెడ్డపనులన్నీ కొనసాగించటం మానివేస్తాడు. నా కట్టడలన్నీ అతడు శ్రద్ధతో పాటిస్తాడు. అతడు న్యాయవర్తనుడై, మంచివాడు అవుతాడు. 22 అతడు చేసిన చెడ్డకార్యాలను దేవుడు గుర్తుపెట్టుకోడు. అప్పుడు దేవుని దృష్టిలో అతని మంచి తనమే వుంటుంది! అందవల్ల ఆ వ్యక్తి జీవిస్తాడు!”

23 నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “చెడ్డవాళ్లంతా చనిపోవాలని నేను కోరుకోవటం లేదు. వారు జీవించేటందుకు వారు తమ జీవన విధానం మార్చుకోవాలని నేను కోరుకుంటున్నాను!

24 “ఇప్పుడు ఒక మంచి వ్యక్తి తన మంచితనాన్ని విడనాడవచ్చు. తన జీవన విధానాన్ని మార్చుకొని గతంలో చెడ్డమనిషి చెసిన ఘోరమైన పాపాలన్నీ చెయవచ్చు. అలాంటి వ్యక్తి జీవిస్తాడా? కావున ఆ మంచి మనిషి మారిపోయి చెడ్డవాడయితే, అతడు పూర్వం చేసిన మంచి పనులేవీ దేవుడు గుర్తు పెట్టుకోడు. ఆ వ్యక్తి తనకు వ్యతిరేకి అయ్యాడనీ, పాపం చేయటం మొదలు పెట్టాడనీ మాత్రం దేవుడు గుర్తు పెట్టుకుంటాడు. అందువల్ల అతని పాపాల కారణంగా అతడు చనిపోతాడు.”

25 దేవుడు ఇలా చెప్పాడు: “ప్రజలారా మీరు, ‘మా ప్రభువైన దేవుడు న్యాయంగా ప్రవర్తించడు’ అని అంటారు. కాని ఇశ్రాయేలు వంశములారా, వినండి. నేను న్యాయంగానే ఉన్నాను. మీరే న్యాయంగా లేరు. 26 ఒక మంచి మనిషి మారిపోయి, చెడ్డవాడైతే అతని చెడ్డకార్యాలకు ఫలితంగా అతడు చనిపోతాడు. 27 ఒక చెడ్డ వ్యక్తి మారి, మంచివాడై, మంచికార్యాలు చేస్తే, అతడు తన జీవితాన్ని రక్షించుకుంటాడు. అతడు బతుకుతాడు! 28 తాను పూర్వం ఎంత చెడ్డవాడో తెలుసుకొని, నావద్దకు తిరిగి వచ్చిన వాడవుతాడు. తాను గతంలో చేసిన చెడ్డకార్యాలు మళ్లీ చేయటం మానటంతో అతడు జీవిస్తాడు! అతడు మరణించడు!”

29 ఇశ్రాయేలు ప్రజలు, “అది న్యాయం కాదు! మా ప్రభువైన యెహోవా న్యాయంగా వుండనేరడు!” అని అన్నారు.

అందుకు దేవుడు ఇలా అన్నాడు: “నేను న్యాయంగానే ఉన్నాను. మీరే న్యాయంగా లేరు. 30 ఓ ఇశ్రాయేలు వంశమా, ఎందువల్లనంటే, నేను ప్రతి వ్యక్తికీ అతను చేసిన కార్యాలను అనుసరించి న్యాయనిర్ణయం చేస్తాను!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. “కావున, మీరు నా వద్దకు తిరిగిరండి. చెడుకార్యాలు చేయటం మానండి! ఆ ఘోరమైన వస్తువులు మీరు పాపం చేయటానికి కారణం కానీయకండి! 31 మీరు చేసిన భయంకర వస్తువులన్నీ పారవేయండి. అవన్నీ కేవలం మీరు పాపం చేయటానికే దోహదం చేస్తాయి! మీ హృదయాలను, ఆత్మలను మార్చుకోండి. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మిమ్మల్ని మీరెందుకు చనిపోయేలాగు చేసుకొంటున్నారు? 32 నేను మిమ్మల్ని చంపకోరటం లేదు! దయచేసి నా వద్దకు తిరిగి రండి. జీవించండి!” ఆ విషయాలు నా ప్రభువైన యెహోవా చెప్పాడు.

ఇశ్రాయేలును గూర్చి విషాద గీతం

19 దేవుడు నాకు ఈ విధంగా చెప్పాడు: “ఇశ్రాయేలు నాయకులను గురించి నీవు ఈ విషాద గీతం ఆలపించాలి:

“‘నీ తల్లి ఆడసింహంలా,
    మగసింహాల మధ్య పడుకొని ఉంది.
ఆమె యౌవ్వనంలో ఉన్న మగ సింహాలతో పడుకొని ఉంది.
    దానికి చాలా మంది పిల్లలున్నారు.
ఆ సింహపు పిల్లల్లో ఒకటి లేచింది.
    అది బలమైన యువసింహంలా తయారయ్యింది.
అది తన ఆహారాన్ని వేటాడటం నేర్చుకుంది.
    అది ఒక మనుష్యుని తినేసింది.

“‘అది గర్జించటం ప్రజలు విన్నారు.
    తాము పన్నిన బోనులో దానిని పట్టుకున్నారు!
దాని నోటికి గాలం తగిలించారు.
    వారా కొదమ సింహాన్ని ఈజిప్టుకు తీసుకొని వెళ్లారు.

“‘తల్లి తన యువసింహం నాయకత్వం వహిస్తుందనుకుంది.
    కాని ఆమె ఆశలు అడియాశలయ్యాయి.
అందువల్ల ఆమె తన పిల్లల్లో మరో దానిని తీసుకుంది.
    దానిని యువ సింహంలా తీర్చిదిద్దింది.
అది పెద్ద సింహాలతో కలిసి వేటకెళ్లింది.
    అది భయంకర సింహంలా తయారయ్యింది.
అది తన ఆహారం వేటాడ నేర్చుకుంది.
    అది ఒక మనుష్యుని చంపి తినివేసింది.
ఆది రాజభవనాల మీద దాడి చేసింది. అది నగరాలను నాశనం చేసింది.
    దాని గర్జన విన్న ప్రతివాడూ నోట మాట లేక నివ్వెరపోయాడు.
అప్పుడు తనచుట్టూ నివసిస్తున్నవారు దానికై వలపన్నారు.
    అది వారి వలలో చిక్కిపోయింది.
వారు దానికి కొక్కీలు వేసి బంధించారు.
    వారు దానిని తమ బోనులో ఇరికించారు.
    వారు దానిని బబులోను రాజు వద్దకు తీసుకొని పోయారు.
అందువల్ల ఇశ్రాయేలు పర్వతాలలో
    ఇప్పుడు మీరు గర్జన వినలేరు.

10 “‘మీ తల్లి నీటి ప్రక్క
    నాటిన ద్రాక్షాలతలాంటిది.
దానికి నీరు పుష్కలంగా ఉంది.
    అది చాలా ఫలభరితమైన దళమైన ద్రాక్షా తీగలతో పెరిగింది.
11 ఆ పిమ్మట దానికి కొన్ని పెద్ద కొమ్మలు పెరిగాయి.
    అవి కొన్ని చేతికర్రల్లా ఉన్నాయి.
    ఆ కొమ్మలు రాజదండాల్లా ఉన్నాయి.
ఆ ద్రాక్షాలత అలా, అలా పొడుగ్గా,
    చాలా కొమ్మలతో మేఘాలను అంటేలా పెరిగింది.
12 కాని ఆ ద్రాక్షా చెట్టు వేర్లతో పెరికివేయబడి,
    నేలమీద కూల్చి వేయబడింది.
తూర్పుదిక్కు వేడిగాడ్పులు వీయగా దాని పండ్లు ఎండి పోయాయి.
    దాని పెద్ద కొమ్మలు విరిగి పోయాయి. అవి అగ్నిలో వేయబడ్డాయి.

13 “‘ఇప్పుడా ద్రాక్ష మొక్క ఎడారిలో నాటబడింది.
    అది నీరులేక, దాహం పుట్టించే ప్రాంతం.
14 దాని పెద్ద కొమ్మ నుండి నిప్పు చెలరేగింది.
    నిప్పు దాని రెమ్మలను, పండ్లను నాశనం చేసింది.
అందుచే బలమైన చేతికర్రగా లేదు;
    రాజదండముగా లేదు’

ఇది ఒక విషాద గీతం. అది వినాశనాన్ని గూర్చి పాడబడింది.”

ఇశ్రాయేలు దేవునినుండి తొలగిపోవుట

20 ఒక రోజు ఇశ్రాయేలు పెద్దలు యెహోవా సలహా తీసుకొనగోరి నా వద్దకు వచ్చారు. ఇది ప్రవాసంలో ఏడవ సంవత్సరం ఐదవ నెల (జులై), పదవ రోజున జరిగింది. పెద్దలు (నాయకులు) నా ముందు కూర్చున్నారు.

అప్పుడు యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, ఇశ్రాయేలు పెద్దలతో మాట్లాడు. వారితో ఇలా చెప్పు, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుచున్నాడు, మీరంతా నా సలహా తీసుకోదలచి వచ్చారా? అలా వచ్చివుంటే, దానిని మీకు నేను యివ్వను. ఈ విషయాలు నా ప్రభువైన యెహోవా చెప్పియున్నాడు.’ నీవు వారికి తీర్పు తీర్చుతావా? నరపుత్రుడా, నీవు వారికి న్యాయ నిర్ణయం చేస్తావా? వారి తండ్రులు చేసిన భయంకర నేరాలను గూర్చి నీవు వారికి తెలియజెప్పాలి. వారికి నీవిలా చెప్పాలి, నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెబుతున్నాడు, నేను ఇశ్రాయేలును ఎంపిక చేసుకొన్నప్పుడు, యాకోబు వంశం కొరకు నా చేయెత్తి ఈజిప్టు వారికి ఒక వాగ్దానం చేశాను. అక్కడ నన్ను నేను ప్రత్యక్షపరచుకొన్నాను. నా చేయెత్తి ఇలా చేప్పాను: ‘నేను మీ దేవుడనైన యెహోవాను.’ ఆ రోజున మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చి, నేను మీకు ఇవ్వబోతున్న దేశంలోకి నడిపిస్తానని వాగ్దానం చేశాను. ఆది చాలా మంచి వస్తువులున్న దేశం.[b] దేశాలన్నిటిలోకి అది సుందరమైనది!

“‘రోత పుట్టించే విగ్రహాలన్నిటినీ పారవేయమని నేను ఇశ్రాయేలు వంశం వారికి చెప్పాను. ఈజిప్టు నుండి తేబడిన హేయమైన విగ్రహాలతో వారు కూడ హేయమైనవారుగా తయారు కావద్దని నేను చెప్పియున్నాను. నేను మీ దేవుడనైన యెహోవాను కాని వారు నాపై తిరుగుబాటు చేసి, నేను చెప్పేది వినలేదు. ఈజిప్టువారి అపవిత్రమైన విగ్రహాలను పారవేయలేదు. వారి అపవిత్ర విగ్రహాలను ఈజిప్టులో వదిలివేయలేదు. కావున నేను (దేవుడు) ఉగ్రమైన నా కోపాన్ని చూపించటానికి ఈజిప్టులోనే వారిని నాశనం చేయదల్చాను. అయినా నేను వారిని సంహరించలేదు. ఈజిప్టు నుండి నా ప్రజలను బయటకు తీసుకొని వస్తానని గతంలోనే వారు నివసిస్తున్న చోటి ప్రజలకు తెలియజేశాను. నా మంచి పేరును నేను పాడుచేయదల్చుకోలేదు. అందువల్ల ఆ అన్యప్రజల ముందు ఇశ్రాయేలును నాశనం చేయలేదు. 10 ఇశ్రాయేలు వంశాన్ని నేను ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చాను. వారిని ఎడారిలోకి నడిపించాను. 11 అక్కడ నేను వారికి నా కట్టడలను తెలియజేశాను. నా నియమ నిబంధనలన్నీ వారికి తెలియజెప్పాను. నా కట్టడలను పాటించిన వ్యక్తి జీవిస్తాడు. 12 ప్రత్యేక విశ్రాంతి రోజులన్నిటి గురించి కూడా నేను వారికి చెప్పాను. నాకు, వారికి మధ్య ఆ సెలవు రోజులు ఒక ప్రత్యేక సంకేతం. అవి నేను యెహోవానని, వారిని నా ప్రత్యేక ప్రజలుగా చేసుకున్నానని తెలియజేస్తాయి.

13 “‘అయినా ఇశ్రాయేలు వంశం ఎడారిలో నా మీద తిరుగుబాటు చేసింది. వారు నా న్యాయాన్ని పాటించలేదు. వారు నా కట్టడలను అనుసరించటానికి నిరాకరించారు. పైగా అవి ఎంతో మంచి నియమాలు. ఏ వ్యక్తి అయినా ఆ నియమాలను పాటిస్తే, అతడు జీవిస్తాడు. నేను నియమించిన ప్రత్యేక విశ్రాంతి రోజులను వారు సామాన్య రోజులుగా పరిగణించారు. అనేకసార్లు వారా విశ్రాంతి రోజులలో పనిచేశారు. నా ఉగ్రమైన కోపాన్ని వారు చవిచూడటానికి నేను వారిని ఎడారిలో నాశనం చేయ సంకల్పించాను. 14 అయినా నేను వారిని సంహరించలేదు. నేను ఇశ్రాయేలును, ఈజిప్టు నుండి వెలికి తీసుకొని రావటం ఇతర దేశాలు చూశాయి. నాకున్న మంచి పేరును నేను పాడుచేసుకోదల్చలేదు. అందువల్ల అన్యప్రజల ముందు నేను ఇశ్రాయేలును సంహరించలేదు. 15 ఎడారిలోని ఆ ప్రజలకు నేను మరొక వాగ్దానం చేశాను. వారికి నేనివ్వబోయే దేశంలోకి వారిని నేను తీసుకొని వెళ్లనని గట్టిగా చెప్పాను. ఆది పాలు, తేనె ప్రవహించే సుభిక్షమైన దేశం. అది దేశాలన్నిటిలోకీ సుందరమైన దేశం!

16 “‘ఇశ్రాయేలు ప్రజలు నా కట్టడలను పాటించ నిరాకరించారు. వారు నా విధులను అనుసరించలేదు. నేను నిర్ణయించిన విశ్రాంతి రోజులను అతి సామాన్యమైనవిగా వారు పరిగణించారు. వారి హృదయాలు ఆ అపవిత్ర విగ్రహాలమీద లగ్నమై వుండుటచేత వారీ పనులన్నీ చేశారు. 17 కాని వారి స్థితిపట్ల నేను విచారం వ్యక్తం చేశాను. వారిని నేను సంహరించలేదు. ఎడారిలో వారిని నేను సర్వనాశనం చేయలేదు. 18 నేను వారి పిల్లలతో ఎడారిలో మాట్లాడాను. నేను వారితో, “మీరు మీ తల్లిదండ్రులవలె ప్రవర్తించవద్దు. అపవిత్ర విగ్రహాల జోలికిపోయి మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు. వాటి ధర్మాన్ని మీరు అనుసరించవద్దు. వాటి ఆజ్ఞలను మీరు పాటించవద్దు. 19 నేనే యెహోవాను. నేను మీ దేవుణ్ణి. నా ధర్మాన్ని అనుసరించండి. ఆజ్ఞాపాలన గావించండి. నేను చెప్పే పనులు చేయండి. 20 నేను నిర్దేశించిన విశ్రాంతి రోజులు మీకు అతి ముఖ్యమైనవని చూపించండి. అవి నాకును, మీకును మధ్య ఒక ప్రత్యేక సంకేతమని గుర్తు పెట్టుకోండి. నేనే యెహోవాను. నేను మీ దేవుడనని ఆ సెలవు రోజులు మీకు సూచిస్తాయి.”

21 “‘కాని ఆ పిల్లలు నాకు వ్యతిరేకులయ్యారు. వారు నా కట్టడలను పాటించలేదు. వారు నా ఆజ్ఞలను లెక్క చేయలేదు. నేను వారికి చెప్పిన పనులు చేయలేదు. అవన్నీ మంచి న్యాయ సూత్రాలు. ఎవ్వరు వాటిని అనుసరించినా, ఆ వ్యక్తి జీవిస్తాడు. నేను నిర్దేశించిన ప్రత్యేక విశ్రాంతి రోజులను ప్రాముఖ్యంలేని వాటినిగా వారు పరిగణించారు. అందువల్ల నేను ఎడారిలో నా ఉగ్రమైన కోపం చూపటానికి వారిని సర్వనాశనం చేద్దామనుకున్నాను. 22 కాని నాకు నేనే ఆగిపోయాను. నేను ఇశ్రాయేలును ఈజిప్టు నుండి బయటకు తీసుకొని రావటం ఇతర రాజ్యాలు చూశాయి. నాకున్న మంచి పేరును నేను పాడు చేసుకోదల్చలేదు. అందువల్ల నేను ఇశ్రాయేలును అన్య జనుల ముందు సంహరించలేదు. 23 అందువల్ల ఎడారిలో వారికి నేను ఇంకొక మాట చెప్పాను. వారిని ఇతర రాజ్యాలలోకి చెదరగొడతాననీ, వారిని అనేక దేశాలకు పంపించి వేస్తాననీ చెప్పాను.

24 “‘ఇశ్రాయేలు ప్రజలు నా ఆజ్ఞలను శిరసావహించలేదు. వారు నా కట్టడలను అనుసరించటానికి నిరాకరించవారు. వారు నేనిచ్చిన ప్రత్యేక విశ్రాంతి రోజులను ముఖ్యమైనవిగా పరిగణించలేదు. వారి తండ్రుల అపవిత్ర విగ్రహాలను వారు పూజించారు. 25 అందువల్ల వారికి నేను చెడ్డ నీతిని ప్రసాదించాను. వారు బతకటానికి ఆధారం కాని ఆజ్ఞలను నేను వారికి ఇచ్చాను. 26 వారి కానుకలతో వారిని వారే మలిన పర్చుకొనేలా వారిని వదిలివేశాను. వారు తమ మొదటి సంతానాన్ని సహితం బలి ఇవ్వటం మొదలు పెట్టారు. ఈ రకంగా ఆ ప్రజలను నేను నాశనం చేస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకొంటారు.’ 27 కావున, ఓ నరపుత్రుడా, ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వంశంతో మాట్లాడు. వారికిలా చేప్పు, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు నాకు వ్యతిరేకంగా చెడుమాటలు పలికారు. నాపై కుట్రపన్నారు. 28 అయినా నేను వారికి ఇస్తానని వాగ్దానం చేసిన రాజ్యానికి వారిని తీసుకొని వచ్చాను. వారు కొండలను, పచ్చని చెట్లను అన్నిటినీ చూసి పూజలు చేయటానికి ఆ ప్రదేశాలకు వెళ్లేవారు. వారు బలులను, కోప కానుకలను[c] ఆ ప్రదేశాలన్నిటికీ తీసుకొని వెళ్లారు. సువాసన వేసే వారి బలులన్నీ వారు అర్పించారు. ఆ స్థలాలలో పానార్పణాలు కూడా వారు అర్పించారు. 29 వారా ఉన్నత స్థలాలకు ఎందుకు వెళ్తున్నారని నేను వారిని అడిగాను. ఆ ఆరాధనా స్థలాలన్నీ ఈనాటికీ ఉన్నత స్థలాలు[d] అనే పిలవబడుతున్నాయి.’”

30 దేవుడు ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలు ఆ చెడు కార్యాలన్నీ చేశారు. అందువల్ల ఇశ్రాయేలు వంశంవారితో మాట్లాడు. వారికి ఈ రకంగా చెప్పుము, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు. మీ పూర్వీకులు చేసిన పనులనే చేస్తూ మిమ్మును మీరు మలిన పర్చుకుంటున్నారు. మీరు వేశ్య[e] వలె ప్రవర్తిస్తున్నారు. మీ పూర్వీకులు ఆరాధించిన భయంకర దేవుళ్ళను ఆరాధించటానికి మీరు నన్ను వదిలివేశారు. 31 మీరు కూడా అవే రకమైన కానుకలు సమర్పిస్తున్నారు. మీ బూటకపు దేవతలకు కానుకగా మీ పిల్లలను అగ్నిలో పడవేస్తున్నారు. ఈనాడు ఆ రోత విగ్రహాలను ఆశ్రయించి మిమ్మల్ని మీరు మరింత మలిన పర్చుకుంటున్నారు! నేను మిమ్మల్ని నా వద్దకు రానిచ్చి, నా సలహా తీసుకోనివ్వాలని మీరు నిజంగా అనుకుంటున్నారా? నేను ప్రభువును; యెహోవాను. నా జీవ ప్రమాణంగా మీ ప్రశ్నలకు సమాధానమివ్వను. మీకు సలహా ఇవ్వను! 32 ఇతర రాజ్యాల మాదిరిగా ఉండాలని కోరుకుంటున్నట్లు మీరు అంటూ ఉంటారు. కానీ మీ అభిప్రాయాలు, ఆశలూ ఎప్పటికీ నెరవేరవు. ఇతర జనాంగముల ప్రజల మాదిరిగా మీరు నివసిస్తున్నారు. కొయ్యముక్కలను, రాతి ముక్కలను (విగ్రహాలు) మీరు కొలుస్తారు!’”

33 నా ప్రభువైన యెహోవా ఇలా చెప్పుతున్నాడు, “నా జీవ ప్రమాణంగా, రాజునై మిమ్మల్ని పరిపాలిస్తానని వాగ్దానం చేస్తున్నాను. కాని నా శక్తివంతమైన హస్తాన్ని ఎత్తి మిమ్మల్ని శిక్షిస్తాను. మీపట్ల నా కోపాన్ని చూపిస్తాను! 34 మిమ్మల్నందరినీ ఈ అన్యదేశాల నుండి వెలికి తెస్తాను. ఈ రాజ్యాలకు నేను మిమ్మల్ని చెదర గొట్టాను. కాని మిమ్మల్నందరినీ కూడదీసి, ఈ రాజ్యాల నుండి తిరిగి తీసుకొని వస్తాను. అయినా నా బలమైన హస్తాన్ని ఎత్తి మిమ్మల్ని శిక్షిస్తాను. మీమీద నాకు గల కోపాన్ని వెల్లడిస్తాను! 35 నేను గతంలో చేసినట్లు మిమ్మల్ని ఒక ఎడారికి నడిపిస్తాను. కాని ఇది అన్యదేశీయులు నివసించే ఒక స్థలం. అక్కడ నేను ముఖాముఖిగా మీతో వ్యాజ్యెమాడుతాను. 36 గతంలో ఈజిప్టు వద్దగల ఎడారిలో నేను మీ పూర్వికులకు తీర్పు తీర్చినట్లు, ఇప్పుడిక్కడ మీకు న్యాయ నిర్ణయం చేస్తాను.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

37 “మీరు నేరస్థులని తీర్పు ఇచ్చి, ఒడంబడిక[f] ప్రకారం మిమ్మల్ని శిక్షిస్తాను. 38 నాపై తిరుగుబాటు చేసి, నాపట్ల పాపం చేసిన ప్రజలందరినీ నేను తొలగిస్తాను. మీ స్వదేశాన్నుండి వారందరినీ తొలగిస్తాను. వారు మరెన్నడూ ఇశ్రాయేలు రాజ్యానికి తిరిగిరారు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు.”

39 ఓ ఇశ్రాయేలు వంశములారా, నా ప్రభువైన యెహోవా ఇప్పుడు ఈ విషయాలు చెప్పుతున్నాడు, “ఏ వ్యక్తి అయినా తన రోత విగ్రహాలను పూజింపగోరితే, అతనిని వెళ్లి వాటిని పూజించనీయండి. కాని, తరువాత నానుండి ఏదైనా సలహా మీకు వస్తుందని మాత్రం మీరు అనుకోవద్దు! మీరు నా పేరు ఇక ఏ మాత్రం పాడుచేయలేరు! ముఖ్యంగా మీరు మీ నీచ విగ్రహాలకు కానుకలను సమర్పించినా అది జరగదు.”

40 నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “ప్రజలు నన్ను సేవించటానికి ఇశ్రాయేలులో ఎత్తైన పర్వతంగా పేరొందిన నా పవిత్ర పర్వతం వద్దకు రావాలి! ఇశ్రాయేలు వంశంవారంతా తమ స్వంత భూమి మీదికి వస్తారు. వారు తమ దేశంలో ఉంటారు. మీరు నా సలహా కోరి రావలసిన స్థలం అదే. మీరు ఆ స్థలానికి నాకు అర్పణలు ఇవ్వటానికి రావాలి. ఆ స్థలంలో మీ పంటలో తొలి భాగాన్ని నా కొరకు తేవాలి. ఆ స్థలంలో మీ పవిత్ర కానుకలు నాకు సమర్పించాలి. 41 అప్పుడు మీరు సమర్పించే బలుల సువాసనలతో నేను సంతృప్తి చెందుతాను. ఇదంతా నేను మిమ్మల్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు జరుగుతుంది. నేను మిమ్మల్ని అనేక దేశాలకు చెదరగొట్టాను. అయినా నేను మిమ్మల్నందరినీ కూడగట్టి, మళ్లీ నా ప్రత్యేక ప్రజగా స్వీకరిస్తాను. పైగా ఆయా దేశాలన్నీ ఇదంతా చూస్తాయి. 42 అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు. నేను మిమ్మల్ని ఇశ్రాయేలు రాజ్యానికి తీసుకొని వచ్చినప్పుడు ఇది మీరు తెలుసుకొంటారు. అది నేను మీ పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన రాజ్యం. 43 ఆ రాజ్యంలో మిమ్మల్ని మలినపర్చిన వస్తువులను, మీరు చేసిన చెడుకార్యాలను మీరు గుర్తుకు తెచ్చుకుని సిగ్గుపడతారు. 44 ఇశ్రాయేలు వంశములారా, మీరు ఎన్నో అకృత్యాలు చేశారు. ఆ చెడుకార్యాలకు ఫలితంగా మీరు నాశనం చేయబడాలి. కాని నాకున్న మంచి పేరు కాపాడుకోవటానికి, మీకు నిజంగా అర్హమైన శిక్ష విధించవలసి వుండి కూడా నేను విధించను. నేనే యెహోవానని పిమ్మట మీరు తెలుసుకొంటారు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

45 మళ్లీ యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఈ విధంగా చెప్పాడు: 46 “నరపుత్రుడా, యూదా రాజ్యం దక్షిణాన వున్న నెగెవు వైపు చూడు. నెగెవు అరణ్యానికి[g] వ్యతిరేకంగా మాట్లాడు. 47 నెగెవు అరణ్యానికి ఇలా చెప్పు, ‘యెహోవా వాక్కు విను. నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. చూడు, నీ అరణ్యంలో అగ్ని రగల్చటానికి నేను సిద్దంగా ఉన్నాను. ప్రతి పచ్చని చెట్టునూ, ప్రతి ఎండిన చెట్టునూ అగ్ని దహించి వేస్తుంది. అలా కాల్చివేసే ఆ నిప్పు ఆర్పబడదు. దక్షణం నుండి ఉత్తరం వరకు గల ప్రదేశమంతా కాల్చివేయ బడుతుంది. 48 అప్పుడు ప్రజలంతా యెహోవానైన నేనే ఈ అగ్నిని ప్రజ్వలింపచేసినట్లు తెలుసుకుంటారు. ఆ నిప్పు ఆర్పివేయబడదు.’”

49 పిమ్మట నేను (యెహెజ్కేలు) ఇలా అన్నాను: “ఓ నా ప్రభువైన యెహోవా! నేనా విషయాలు ప్రజలకు చెప్తే నేనేవో కాకమ్మ కథలు వారికి చెబుతున్నానని అనుకుంటారు. అది నిజంగా సంభవిస్తుందని వారను కోరు!”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International