Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ప్రసంగి 5-8

వాగ్దానం చేయుటలో జాగ్రత్తగా వుండండి

దేవుణ్ణి ఆరాధించేందుకు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మూఢ జనం మాదిరిగా బలులు ఇవ్వడం కంటె (దైవవాణిని) వినడం మేలు. మూఢులు తరచు చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. వాళ్లకి తమ పనులు చెడ్డవని కూడా తెలియదు. దేవునికి మీరు మొక్కులు మొక్కేటప్పుడు మీరు జాగ్రత్తగా వహించండి. దేవునికి మీ సమర్పణ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆవేశంలో తొందరపడి నోరుజారకండి. దేవుడు పైన పరలోకంలో ఉన్నాడు, మీరు క్రింద భూమిమీద వున్నారు. అందుకని దేవునికి వేడుకొనుట కొద్దిగా మాత్రమే మీరు చెయ్యండి. (ఈ కింది లోకోక్తి లోని వాస్తవాన్ని గమనించండి)

అధిక వ్యాకుల మనస్కులు పీడకలలు కంటారు,
    బుద్ధిహీనులు అతిగా వాగుతారు.

దేవునికి నీవేదైనా మొక్కకుంటే, దాన్ని చెల్లించు. నీవు మొక్కుకున్నదాన్ని చెల్లించడంలో ఆలస్యం చేయకు. బుద్ధిహీనుల విషయంలో దేవుడు ప్రసన్నుడు కాడు. దేవునికి ఇస్తానన్నదాన్ని నీవాయనకు ఇవ్వు. ఏదైనా వాగ్దానం చేసి దాన్ని చేయలేక పోవడం కంటె, అసలేమి మొక్కుకోక పోవడమే మేలు. అందుకని, నీ మాటలు పాపకారణం కాకుండా చూసుకో. “నేను అన్న మాట అర్థం అది కాదు!” అని నీ యాజకుడితో చెప్పబోకు.[a] నీవాపని చేస్తే, దేవునికి నీ మాటల పట్ల కోపం రావచ్చు, నీవు శ్రమించి సాధించిన దాన్నంతటినీ నాశనం చెయ్యవచ్చు. నీ పనికిమాలిన స్వప్నాలు, బింకాలు (నీకు హాని కలిగించకుండా) చూసుకో. నీవు దేవుని పట్ల భక్తి కలిగి ఉండు.

ప్రతి అధికారిపైన మరొక అధికారి ఉంటాడు

ఏ దేశమైనా తీసుకో. బీదవాళ్లు బలవంతముగా కఠిన పని చేయడం నీవు చూడవచ్చు. బీదల విషయంలో ఇది అన్యాయ వర్తన అని, బీదల హక్కులకు ఇది విరుద్ధమని నీవు చూడగలుగుతావు. అయితే, నీవు యిందుకు ఆశ్చర్యపడబోకు! వాళ్లచేత అలా బలవంతాన పనిచేయించే అధికారి పైన, మరో అధికారి ఉంటాడు. ఈ ఇద్దరు అధికారులపైనా పెత్తనం చలాయించి పనిచేయించే మరో పై అధికారి వుంటాడు. రాజు కూడా బానిసే. అతని రాజ్యం అతనికి యజమాని.

ధనం సంతోషమును కొనలేదు

10 డబ్బు పట్ల వ్యామోహం ఉన్నవాడు తనకు ఉన్న డబ్బుతో ఎన్నడూ తృప్తి చెందడు. ఐశ్వర్యాన్ని ప్రేమించేవాడు తనికు ఇంకా ఇంకా వచ్చి పడినా తృప్తి చెందడు. ధన వ్యామోహం కూడా అర్థరహిత మైనదే.

11 ఒక వ్యక్తికి ఎంత ఎక్కువ ఆస్తి ఉంటే, దాన్ని ఖర్చు పెట్టడంలో తోడ్పడే “మిత్రులు” అంత ఎక్కువ మంది ఉంటారు. దానితో, వాస్తవంలో ఆ ధనికుడు పొందే లాభమేమీ ఉండదు. అతను తన సంపదని చూసుకుని మురిసిపోగలడు. అంత మాత్రమే.

12 రోజంతా చెమటోర్చి కష్టపడేవాడు యింటికి తిరిగి వచ్చి తక్కువగా తిన్నా లేక ఎక్కువగా తిన్నా నిశ్చింతగా నిద్రపోతాడు. శ్రమజీవికి తినేందుకు కొంచెమే వున్నా, ఎక్కువ వున్నా అతనికి అదేమంత ముఖ్యంకాదు. కాని, ధనికుడికి తన సంపద విషయంలో దిగులుతో నిద్రపట్టదు.

13 ఈ ప్రపంచంలో చాలా విచారకరమైన విషయం ఒకటి నేను గమనించాను. ఒకడు భవిష్యత్తు కోసం డబ్బు పొదుపు చేస్తాడు. 14 తర్వాత ఏదో విపత్తు వచ్చి, తన ఆస్తి సర్వస్వం కోల్పోతాడు. అప్పుడిక తన కొడుక్కి ఇచ్చేందుకు అతని దగ్గర చిల్లి గవ్వకూడా మిగలదు.

15 తల్లి గర్భం నుంచి వ్యక్తి పుట్టినప్పుడు అతని దగ్గర ఏమీ ఉండదు. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు తనతో తీసుకెళ్లేది ఏమీ ఉండదు. అతను ఆయా వస్తువుల కోసం చచ్చేలా శ్రమిస్తాడు. కాని, తాను చనిపోయినప్పుడు అతను తన వెంట తీసుకువెళ్లగలిగింది ఏమీ ఉండదు. 16 ఇది చాలా విచారకరమైన విషయం. తను ఈ లోకంలోకి ఎలా వస్తాడో అలాగే పోతాడు. కాగా, “గాలిని పట్టుకొనేందుకు చేసే ప్రయత్నం” వల్ల మనిషికి ఒరిగేదేమిటి? 17 దుఃఖంతో, విచారంతో నిండిన రోజులు. నిరాశా నిస్పృహలు అనారోగ్యాలు, చికాకులు చివరికి అతనికి మిగిలేవి ఇవే!

మీ జీవిత కృషి ఫలితాన్ని అనుభవించండి

18 ఈ భూమిమీద ఉత్తమమైనది ఏమనగా, తనకున్న స్వల్ప జీవితకాల వ్యవధిలో మనిషి అన్న పానాలు తృప్తిగా సేవించాలి, తన పని ఫలితాన్ని సుఖంగా అనుభవించాలి. దేవుడు అతనికి ఇచ్చినది ఈ కొద్ది రోజులు మాత్రమే అన్న విషయాన్ని దృష్టిలో వుంచుకోవాలి ఇదే మనిషి చేయగలిగినదన్న విషయాన్ని నేను గమనించాను.

19 దేవుడు ఒక వ్యక్తికి సంపదని, ఆస్తిని హాయిగా అనుభవించే శక్తిని ఇస్తే, ఆ వ్యక్తి వాటిని అనుభవించాలి. ఆ వ్యక్తి తనకున్న వాటిని స్వీకరించాలి. దేవుని వరమైన తన పనిని సంతోషంగా చెయ్యాలి. 20 మనిషి ఆయుష్షు సుదీర్ఘమైనది కాదు కనుక, అతని విషయాలన్నీ తన జీవితం పొడుగునా గుర్తుంచు కోవాలి. ఆ మనిషి ఇష్టంగా చేసే పనిలో దేవుడు అతన్ని నిమగ్నుణ్ణి చేస్తాడు.[b]

ఐశ్వర్యం సంతోషాన్ని ఇవ్వదు

నేను ఈ ప్రపంచంలో అసమంజసమైన మరో విషయాన్ని గమనించాను. దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. దేవుడు ఒక మనిషికి గొప్ప సంపద, ఆస్తి మరియు గౌరవమూ ప్రసాదిస్తాడు. అతనికి కావలసినవన్నీ, అతను కోరుకోగలిగిన సమస్తం వుంటాయి. అయితే, ఆ వ్యక్తి వాటిని అనుభవించకుండా చేస్తాడు దేవుడు. ఒక అపరిచితుడు వస్తాడు, వాటన్నింటినీ చేజిక్కించుకుంటాడు. ఇది కూడా అర్థరహితమైన చాలా చెడ్డ విషయమే.

ఒక వ్యక్తి దీర్ఘకాలం జీవించవచ్చు. అతనికి వంద మంది సంతానం ఉండవచ్చు. అయితే, ఈ మంచి విషయాలు అతనికి తృప్తి కలిగించలేదనీ, అతని మరణానంతరం[c] ఏ ఒక్కరూ అతన్ని జ్ఞాపకం ఉంచుకోరనీ అనుకోండి, అప్పుడు అతనికంటె పురిట్లోనే చనిపోయే శిశువు మెరుగని నేనంటాను. మృత శిశువుగా పుట్టడం నిజంగానే అర్థరహితం. పేరైనా లేని ఆ శిశువుని వెంటనే తీసుకుపోయి సూర్యరశ్మి చొరని చీకటి సమాధిలో పూడ్చేస్తారు. సూర్యరశ్మినైనా చూడని ఆ శిశువుకి బొత్తిగా ఏది ఏమాత్రం తెలియదు. కాని, దేవుడు తనకిచ్చిన మంచివాటిని అనుభవించని ఆ మనిషికంటె ఆ శిశువు ఎక్కువ ప్రశాంతిని అనుభవిస్తుంది. ఆ మనిషి రెండు వేల సంవత్సరాలు బతకవచ్చు. అయినా అతను తనకు ఇచ్చిన జీవితాన్ని అనుభవించక పోతే అతనికంటె గర్భంలో చనిపోయిన శిశువు సులభమయిన మార్గంలో ఆ అంత్యదశను పొందిందనవచ్చు.

తిండి కోసం మనిషి చచ్చేలా పాటుపడతాడు. అయితే, అతను ఎన్నడూ తృప్తి చెందడు. వివేకవంతుడు అవివేకికంటె విశేషమైనవాడు కాడు. అంతకంటె, ఉన్నవి ఉన్నట్లు జీవితాన్ని స్వీకరించడం తెలిసిన బీదవాడు మేలు. ఎప్పుడూ ఇంకా ఇంకా ఏదో కావాలని ఆశించడంకంటె, ఉన్నదానితో తృప్తి చెంది సంతోషంగా ఉండటంమేలు. ఎప్పుడూ ఇంకా ఇంకా కావాలని కోరుకోవడం వృధా ప్రయాసం. అది గాలిని పట్టుకొనేందుకు చేసే ప్రయత్నమే.

10-11 మనిషి ఎందుకు సృష్టింపబడ్డాడు? మనిషిగా ఉండేందుకు మాత్రమే. దీన్ని గురించి చర్చించడం వృధా ప్రయాసమే. దీన్ని గురించి మనిషి దేవునితో చర్చించలేడు. ఎందుకంటే, మనిషికంటె దేవుడు శక్తిమంతుడు. సుదీర్ఘంగా వాదించినంత మాత్రాన ఈ వాస్తవం మారిపోదు.

12 భూమిమీద స్వల్ప కాలం జీవించే మనిషికి, ఆ స్వల్ప కాలంలో అతనికి ఏది అత్యుత్తమమైనదో ఎవరికి తెలుస్తుంది? అతని జీవితం నీడలా గడిచిపోతుంది. తర్వాత ఏమి జరుగుతుందో ఎవరూ అతనికి చెప్పలేరు.

జ్ఞాన బోధల సేకరణ

మంచి పరిమళ ద్రవ్యంకంటె మంచి పేరు (గౌరవం) కలిగివుండటం మేలు.
    జన్మ దినం కంటె మరణ దినం మేలు.
విందుకి పోవడంకంటె, మరణించినవారి అంత్య క్రియలకి హాజరవడం మేలు.
    ఎందుకంటే, పుట్టిన వాళ్లెవరూ గిట్టకమానరు, బ్రతికున్న ప్రతివాడు ఈ విషయం గుర్తుంచుకోవాలి.
నవ్వుకంటె దుఃఖం మరింత మేలు,
    ఎందుకంటే, మన ముఖం విచారగ్రస్తమైనప్పుడు, మన మనస్సు మెరుగవుతుంది.
అవివేకి సరదాగా హాయిగా గడపాలని మాత్రమే ఆలోచిస్తాడు,
    కాని, వివేకి మృత్యువు గురించి ఆలోచిస్తాడు.
మూర్ఖుడి పొగడ్త పొందడం కంటె,
    వివేకిచే విమర్శింప బడటం మేలు.
మూర్ఖుల నవ్వులాటలు
    కుండ కింద చిటపట మండే ముళ్లలా ఉంటాయి.
(కుండ వేడైనా ఎక్కకముందే, ఆ ముళ్లు చురచుర మండి పోతాయి.)
    ఇది కూడా నిష్ర్పయోజనమే.
ఎవడైనా తగినంత డబ్బు ముట్టచెప్పితే
    వివేక వంతుడైనా తన వివేకాన్ని విస్మరిస్తాడు.
ఆ డబ్బు అతని విచక్షణను నాశనం చేస్తుంది.
ఏదైనా మొదలెట్టడం కంటె
    దాన్ని ముగించడం మేలు.
అహంభావం, అసహనం కంటె
    సాధుత్వం, సహనము మేలు.
తొందరపడి కోపం తెచ్చుకోకు
    ఎందుకంటే అది అవివేకం (మూర్ఖులు అవి చేస్తారు)
10 “గడిచి పోయిన రోజులే మేలు” అనబోకు.
    “అప్పుడు జరిగినదేమిటి?”
ఇది అవివేకమైన ప్రశ్న.

11 నీకు ఆస్తితో బాటు జ్ఞానం కూడా ఉంటే మరింత మంచిది. నిజానికి, వివేకవంతులు కావలసిన దానికంటే అధికంగానే ఐశ్వర్యాన్ని పొందుతారు. 12 వివేకవంతుడు సంపన్నుడవగలడు. ధనం అండ అయినట్టే వివేకం అండ అవుతుంది. కాని జ్ఞానంయొక్క ప్రయోజనం ఏమంటే, వివేకం తన యజమానికి అండ అవుతుంది.

13 దేవుడు చేసినవాటిని పరిశీలించి చూడండి. వాటిలో ఏదైనా ఒకటి పొరపాటైనదని నీవు అనుకున్నా వాటిలో ఏ ఒక్కదాన్ని నీవు మార్చలేవు! 14 రోజులు బాగున్నప్పుడు, నీవు దాన్ని అనుభవించు. కాని, రోజులు బాగుండనప్పుడు, దేవుడు మనకి మంచి రోజులు, చెడ్డ రోజులు వ్రాసి పెట్టాడన్న విషయం మరచిపోకు. ముందేమి జరుగుతుందో ఏ ఒక్కరికీ తెలియదు.

మంచివాళ్లుగా ఉండటం నిజంగా అసాధ్యం

15 నా స్వల్ప జీవిత కాలంలో నేను అన్ని చూశాను. మంచివాళ్లు చిన్న వయస్సులోనే మరణించడం చూశాను. చెడ్డవాళ్లు సుదీర్ఘకాలం జీవించడం చూశాను. 16-17 అందుకని అకాలంగా నిన్ను నీవు చంపుకోవడం దేనికి? అతి మంచిగా కాని, అతి చెడ్డగా కాని ఉండకు. అతి తెలివిగా కాని అతి మూర్ఖంగా కాని ఉండకు. నీ ఆయువు తీరక ముందే నువ్వెందుకు చనిపోవాలి?

18 దీనిని పట్టుకో గాని దానిని చేయి విడువకుండా ఉండటం మేలు. దేవునికి భయపడేవారు కూడా కొన్ని మంచికార్యాలు, కొన్ని చెడ్డకార్యాలు చేస్తారు. 19-20 ఎప్పుడు మంచి పనులే చేసి, ఎన్నడూ పాపాలు చేయని మంచివాడంటూ లేడని ఖచ్చితంగా చెప్పవచ్చు. జ్ఞానం మనిషికి శక్తిని చేకూరుస్తుంది. నగరంలో పదిమంది (మూర్ఖులైన) నాయకులకంటె ఒక్క వివేకవంతుడు ఎక్కువ బలవంతుడై ఉంటాడు.

21 జనం చెప్పే మాటలన్ని చెవిని చొరనీయకు. నీ స్వంత నౌకరే నీ గురించి చెడ్డ మాటలు చెప్పడం నీవు వినవచ్చు. 22 నీవు కూడా అనేకసార్లు యితరులను గురించి చెడ్డ మాటలు చెప్పియుండ వచ్చునని నీకు తెలుసు.

23 నేను నా వివేకాన్ని వినియోగించి, ఈ విషయాలన్నింటిని గురించి ఆలోచించాను. నేను సరైన వివేకిగా వుండాలని కోరుకున్నాను. కాని అది దుస్సాధ్యం. 24 విషయాలెందుకిలా ఉన్నాయో నేను అర్థం చేసుకోలేను. దాన్ని అర్థం చేసుకోవడం ఎవరికైనా చాలా కష్టమే. 25 నేను అధ్యయనం చేసి, సరైన జ్ఞానాన్ని అన్వేషించేందుకు చాలా గట్టి ప్రయత్నం చేశాను. ప్రతి ఒక్కదానికి హేతువును కనుక్కునేందుకు నేను ప్రయత్నించాను. (నేనేమి తెలుసుకున్నాను?)

చెడ్డగా ఉండటం మూర్ఖత్వమనీ, మూర్ఖంగా వ్యవహరించడం పిచ్చితనమనీ నేను తెలుసుకున్నాను. 26 (కొందరు) స్త్రీలు వలల మాదిరిగా ప్రమాద కారులు అన్న విషయం కూడా నేను తెలుసుకున్నాను. వాళ్ల హృదయాలు వలల్లాంటివి, వాళ్ల చేతులు గొలుసుల్లాంటివి. ఆ స్త్రీల చేతుల్లో చిక్కడం మరణం కంటె హీనం. దేవుణ్ణి అనుసరించే వ్యక్తి అలాంటి స్త్రీలనుండి పారిపోతాడు. అయితే, పాపులు సరిగ్గా వాళ్లకే చిక్కుతారు.

27-28 ప్రసంగి ననే నేను చెప్పేదేమిటంటే, “వీటన్నింటికీ సమాధానాలు కనుగొనగలనేమోనని నేను పై విషయాలన్నీ మొత్తంగా పరిశీలించాను. సమాధానాల కోసం నేనిప్పటికీ అన్వేషిస్తూనే వున్నాను. అయితే, నేను కనుగొన్నది ఇది: నాకు వెయ్యి మందిలో ఒక్క మంచి మగాడు కనిపించగా, వెయ్యి మందిలో ఒక్క మంచి స్త్రీ కూడా కనిపించలేదు.

29 “నేను తెలుసుకున్న మరో విషయం: దేవుడు మనుష్యుల్ని నిజాయితీగల (మంచి) వాళ్లుగా సృష్టించాడు. కాని, మనుష్యులు చెడ్డగా ఉండేందుకు అనేక మార్గాలు కనుగొన్నారు.”

జ్ఞానం మరియు అధికారం

ఆయా విషయాలను ఒక జ్ఞాని అర్థం చేసుకుని, వివరించి చెప్పగలిగినట్లు మరొకరెవరూ చెయ్యలేరు. అతని జ్ఞానం అతనికి ఆనందాన్నిస్తుంది. జ్ఞానంవల్ల ముఖంలో విచారం తొలగి, ఆనందం చోటు చేసుకుంటుంది.

నేను చెప్పేదేమిటంటే, నీవు ఎల్లప్పుడూ రాజాజ్ఞను పాటింలించాలి. నీవు దేవుని ఎదుట ప్రమాణం చేశావు కనుక నీవీ పని చెయ్యాలి. రాజుకు సలహాలు ఇచ్చేందుకు భయపడకు. చెడ్డదాన్ని దేన్ని సమర్థించకు. కాని ఒక విషయం గుర్తుంచుకో: రాజు తనకు సంతోషం కలిగించే ఆజ్ఞలు ఇస్తాడు. రాజుకు ఆజ్ఞలు ఇచ్చే అధికారం ఉంది. రాజు ఏమి చెయ్యాలో అతనికి ఎవరూ చెప్పలేరు. రాజాజ్ఞను పాటించే వ్యక్తి క్షేమంగా వుంటాడు. అయితే, వివేకవంతుడికి ఈ పని చేయవలసిన సరైన తరుణం ఏదో, ఆ సరైన పని ఎప్పుడు చెయ్యాలో తెలుస్తుంది.

మనిషి ఏ పనైనా చెయ్యవలసినప్పుడు, దానికి సరైన సమయం, సరైన మార్గం వుంటాయి. (ప్రతి వ్యక్తీ ప్రయత్నించి, తాను చెయ్యవలసింది ఏమిటో నిర్ణయించుకోవాలి.) తనకి అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు, ఏమి జరుగుతుందో తెలియనప్పుడు కూడా అతనీ పని చెయ్యాలి. ఎందుకంటే, భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఏ ఒక్కరూ చెప్పలేరు గనుక.

తన ఆత్మ తొలగిపోకుండా నిలుపుకోగల శక్తి ఏ ఒక్కరికి లేదు. తన మృత్యువును ఆపు చేయగల శక్తి ఏ ఒక్కరికీ లేదు. యుద్ధ సమయంలో తన ఇష్టంవచ్చిన చోటికి పోగల స్వేచ్ఛ సైనికుడికి ఎలా వుండదో, అలాగే ఒక వ్యక్తి పాపం చేస్తే, ఆ పాపం అతన్ని స్వేచ్ఛగా వుండనివ్వదు.

నేనీ విషయాలన్నీ గమనించాను. ఈ ప్రపంచంలో జరిగే విషయాలను గురించి నేను తీవ్రంగా ఆలోచించాను. మనుష్యులు ఎప్పుడూ యితరుల మీద అధికారం చలాయించే శక్తిని సంపాదించుకునేందుకు తంటాలు పడుతూ ఉంటారన్న విషయం నేను గమనించాను. ఇది వాళ్లకి చెరుపు చేస్తుంది.

10 దుర్మార్గులకు ఘనంగా అంత్యక్రియలు జరగడం కూడా నేను చూశాను. అంత్యక్రియలు ముగించి, మనుష్యులు ఇళ్లకి తిరిగివెళ్లేటప్పుడు, చనిపోయిన దుర్మార్గుణ్ణి గురించి మంచి మాటలు చెప్పడం నేను విన్నాను. ఆ దుర్మార్గులు అనేకానేకమైన చెడ్డ పనులు చేసిన పట్టణాల్లో కూడా అర్థరహితమైన పని జరిగింది. అది అర్థరహితమైనది.

న్యాయం, బహుమతులు, దండన

11 కొన్ని సందర్భాల్లో, మనుష్యులు చేసిన చెడ్డ పనులకుగాను, వాళ్లు వెంటనే శిక్షింపబడరు. శిక్ష తాపీగా వస్తుంది. దానితో, యితరులకు కూడా చెడ్డ పనులు చెయ్యాలన్న కోర్కె కలుగుతుంది.

12 ఒకానొక పాపి నూరు చెడు పనులు చేసియుండవచ్చు, అతను దీర్ఘాయుష్షు కలిగియుండవచ్చు. అయినప్పటికీ, దేవుడిపట్ల విధేయత, గౌరవం కలిగివుండటం మేలన్న విషయం నాకు తెలుసు. 13 దుర్మార్గులు దేవుణ్ణి గౌరవించరు. అందుకని, నిజంగానే వాళ్లకి మంచి ఫలితాలు లభించవు. ఆ దుర్మార్గులు దీర్గకాలం జీవించరు. (సూర్యుడు క్రిందకి వాలిన కొద్ది) పొడుగయ్యే నీడల్లాగా వాళ్ల జీవితాలు దీర్ఘంకావు.

14 న్యాయంగా కనిపించని మరొకటి కూడా భూమి మీద సంభవిస్తూ ఉంటుంది. చెడ్డవాళ్లకి చెడు, మంచి వాళ్లకి మంచి జరగాలి. కాని, కొన్ని సందర్భాల్లో మంచి వాళ్లకి చెడు, చెడ్డవాళ్లకి మంచి జరుగుతూ ఉంటుంది. ఇది సరైనది కాదు. 15 అందుకని, జీవితాన్ని హాయిగా అనుభవించడం మరింత మెరుగైనదని నేను తీర్మానించుకున్నాను. ఈ ప్రపంచంలో మనుష్యులు చెయ్యగలిగిన అత్యుత్తమమైన పనేమిటంటే, తినడం, తాగడం, జీవితాన్ని హాయిగా అనుభవించడమే. కనీసం అలా చేస్తేనైనా, తమ జీవితకాలంలో దేవుడు తమకిచ్చిన కఠిన శ్రమని మనుష్యులు సరదాగా సంతోషంగా చేసేందుకు అది తోడ్పడుతుంది.

దేవుడు చేసేవన్ని మనకు బోధపడవు

16 ఈ ప్రపంచంలో మనుష్యులు చేసే పనులను నేను శ్రద్ధగా పరిశీలించాను. మనుష్యులు ఎంత హడావుడిగా ఉంటారో నేను చూశాను. వాళ్లు రాత్రింబగళ్లు శ్రమిస్తారు. వాళ్లు దాదాపు నిద్రేపోరు. 17 దేవుడు చేసేవాటిలో అనేకం కూడా నేను చూశాను. ఈ భూమిమీద దేవుడు చేసేదాన్నంతటినీ మనుష్యులు అర్థంచేసుకోలేరు. మనిషి వాటిని అర్థం చేసుకునేందుకు ఎంతైనా ప్రయత్నించవచ్చు. కాని, అతను అర్థంచేసుకోలేడు. దేవుడు చేసినదాన్ని తాను అర్థం చేసుకున్నానని ఒక జ్ఞాని అనవచ్చు. కాని, అది నిజంకాదు. వాటన్నింటినీ ఏ ఒక్కడూ అర్థం చేసుకోలేడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International