Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సామెతలు 24-26

—19—

24 దుర్మార్గులను చూచి అసూయపడవద్దు. వారితో వుండేందుకు నీ సమయం వ్యర్థం చేసుకోకు. కీడు చేయాలని వారు వారి హృదయాల్లో పథకం వేస్తారు. వారు మాట్లాడేది అంతా కష్టం కలిగించాలని మాత్రమే.

—20—

మంచి గృహాలు జ్ఞానము, వివేకము మీద కట్టబడతాయి. జ్ఞానంవల్ల గదులు అన్నీ ప్రశస్తమైన మరియు సంతోషకరమైన సంపదలతో నింపబడతాయి.

—21—

జ్ఞానము ఒక మనిషిని శక్తివంతం చేస్తుంది. తెలివి ఒక మనిషికి బలం ఇస్తుంది. నీవు యుద్ధం ప్రారంభించక ముందు జాగ్రత్తగా పథకాలు వేయాలి. నీవు విజయం కావాలి అని అనుకొంటే నీకు మంచి సలహాదారులు చాలా మంది ఉండాలి.

—22—

బుద్ధిహీనులు జ్ఞానమును గ్రహించలేరు. మనుష్యులు ముఖ్యమైన విషయాలను చర్చిస్తున్నప్పుడు బుద్దిహీనులు ఏమీ చెప్పలేరు.

—23—

నీవు కష్టాలు కలిగించాలని ఎల్లప్పుడూ తలుస్తూంటే, నీవు కష్టాలు పెట్టే మనిషివి అని ప్రజలు తెలుసుకొంటారు. మరియు వారు నీ మాట వినరు. బుద్ధిహీనుడు చేయాలని తలపెట్టే విషయాలు పాపం. ఇతరుల కంటే తానే మంచి వాడిని అనుకోనే మనిషిని ప్రజలు అసహ్యించుకొంటారు.

—24—

10 కష్ట సమయాలలో నీవు బలహీనంగా ఉంటే అప్పుడు నీవు నిజంగా బలహీనుడివే.

—25—

11 మనుష్యులు ఒక వ్యక్తిని చంపాలని ప్రయత్నిస్తూంటే నీవు వానిని రక్షించుటకు ప్రయత్నించాలి. 12 “ఇది నా పని కాదు” అని నీవు చెప్పకూడదు. యెహోవాకు అంతా తెలుసు. నీవు వాటిని ఎందుకు చేస్తావో ఆయనకు తెలుసు. యెహోవా నిన్ను గమనిస్తూ ఉంటాడు. ఆయనకు తెలుసు. నీవు చేసే పనులకు యెహోవా నీకు బహుమానం ఇస్తాడు.

—26—

13 నా కుమారుడా, తేనె తాగు. అది మంచిది. తేనెపట్టులోని తేనె తియ్యగా ఉంటుంది. 14 అదే విధంగా జ్ఞానము నీ ఆత్మకు మంచిది. నీకు జ్ఞానము ఉంటే, అప్పుడు నీకు ఆశ ఉంటుంది. నీ ఆశకు అంతం ఉండదు.

—27—

15 మంచిమనిషి దగ్గర దొంగతనం చేయాలని లేక వాని ఇల్లు తీసివేసుకోవాలని కోరుకొనే దొంగలా ఉండవద్దు. 16 ఒక మంచి వాడు ఏడుసార్లు పడిపోయినా సరే, అతడు ఎల్లప్పుడూ మరల నిలబడతాడు. కాని దుర్మార్గులు ఎల్లప్పుడూ కష్టంచేత ఓడించబడతారు.

—28—

17 నీ శత్రువుకు కష్టాలు వచ్చినప్పుడు సంతోషపడకు. అతడు పడిపోయినప్పుడు సంతోషపడకు. 18 నీవు అలా చేస్తే, అది యెహోవా చూస్తాడు. నీ విషయంలో యెహోవా సంతోషించడు. అప్పుడు యెహోవా ఒకవేళ నీ శత్రువుకు సహాయం చేయవచ్చు.

—29—

19 దుర్మార్గులను చూచి నీవు చింత పడకు. దుర్మార్గుల విషయమై అసూయపడకు. 20 ఆ దుర్మార్గులకు ఆశ లేదు. వారి వెలుగు చీకటి అవుతుంది.

—30—

21 నా కుమారుడా, యెహోవాను మరియు రాజును గౌరవించు. వారికి విరోధంగా ఉండేవారితో చేరవద్దు. 22 ఎందుకంటే, అలాంటి వాళ్లు త్వరగా నాశనం చేయబడవచ్చు. దేవుడు, రాజుకూడ వారి శత్రువులకు ఎంత కష్టం కలిగించగలరో నీకు తెలియదు.

మరిన్ని జ్ఞాన సూక్తులు

23 ఇవి జ్ఞానుల మాటలు:

ఒక న్యాయమూర్తి న్యాయంగా ఉండాలి. ఒకడు తనకు తెలిసినవాడైనంత మాత్రాన అతడుఆయన అతనిని బలపరచకూడదు. 24 ఒక నేరస్థుడు స్వేచ్చగా వెళ్లిపోవచ్చని గనుక న్యాయమూర్తి చెబితే, అప్పుడు ప్రజలు అతనికి విరోధంగా ఉంటారు. అతని గూర్చి దేశాలే చెడుగా చెప్పుకుంటాయి. 25 అయితే ఒక న్యాయమూర్తి ఒక నేరస్తుని శిక్షిస్తే, అప్పుడు ప్రజలంతా అతనితో కలిసి ఆనందిస్తారు.

26 నిజాయితీగల జవాబు ప్రజలందరికీ సంతోషం కలిగిస్తుంది అది పెదాలమీద ముద్దు పెట్టుకున్నట్టు ఉంటుంది.

27 నీ పొలంలో నాట్లు వేయక ముందు నీ ఇల్లు కట్టుకోవద్దు. నీవు నివసించేందుకు ఒక గృహం కట్టు కొనకముందే, నీవు ఆహారం పండించటానికి సిద్ధంగా ఉన్నట్టు గట్టిగా తెలుసుకో.

28 గట్టి కారణం లేకుండా ఎవరికీ విరోధంగా మాట్లాడవద్దు. మరియు అబద్దాలు మాట్లాడకు,

29 “అతడు నాకు హాని చేశాడు, గనుక నేను అతనికి అలానే చేస్తాను. అతడు నాకు చేసిన వాటిని బట్టి నేను అతణ్ణి శిక్షిస్తాను” అని చెప్పవద్దు.

30 ఒక సోమరివాని పొలం ప్రక్కగానే నేను నడిచాను. జ్ఞానములేని ఒక మనిషి ద్రాక్షాతోట పక్కగా నేను నడిచాను. 31 ఆ పొలాల నిండా కలుపు మొక్కలు పెరుగుతున్నాయి. నేలమీద పనికిమాలిన మొక్కలు పెరుగుతున్నాయి. పొలాల చుట్టూ గోడ విరిగిపోయి పడిపోతుంది. 32 నేను అది చూచి, దాని గూర్చి ఆలోచించాను. అప్పుడు ఈ విషయాల నుండి నేను ఒక పాఠం నేర్చుకున్నాను. 33 కొంచెం నిద్ర, కొంచెం విశ్రాంతి, నీ చేతులు ముడుచుకొని, ఒక నిద్ర తియ్యటం. 34 ఈ విషయాలు నిన్ను త్వరగా దరిద్రుని చేస్తాయి. నీకు ఏమీ ఉండదు. ఒక దొంగ అకస్మాత్తుగా వచ్చి అంతా దోచుకొని పోయినట్టుగా అది ఉంటుంది.

సొలొమోను చెప్పిన మరికొన్ని జ్ఞానసూక్తులు

25 ఇవి సొలొమోను చెప్పిన మరికొన్ని జ్ఞానసూక్తులు: యూదా రాజు హిజ్కియా సేవకులు నకలు చేసిన మాటలు ఇవి:

మనం తెలిసికోగూడదని దేవుడు కోరే విషయాలను దాచి పెట్టేందుకు ఆయనకు అధికారం ఉంది. కాని ఒక రాజు విషయమును పరిశోధించుట మూలంగానే ఘనపర్చబడతాడు.

ఆకాశం మనకు పైన చాలా ఎత్తుగాను, భూమి మన క్రింద చాలా లోతువరకును ఉన్నాయి. రాజుల మనస్సులు కూడ అదే విధంగా ఉంటాయి. మనం వాటిని గ్రహించలేం.

వెండి నుండి పనికిమాలిన పదార్థాలను నీవు తీసివేసినట్లయితే అప్పుడు పనివాడు దానితో అందమైన వస్తువులు చేయగలడు. అదే విధంగా ఒక రాజు సమక్షం నుండి దుర్మార్గపు సలహాదారులను నీవు తొలగించి వేస్తే అప్పుడు మంచితనం అతని రాజ్యాన్ని బలమైనదిగా చేస్తుంది.

ఒక రాజు ఎదుట నిన్ను గూర్చి నీవు అతిశయించవద్దు. నీవు చాలా ప్రఖ్యాత వ్యక్తివి అని చెప్పుకోవద్దు. రాజుగారే నిన్ను ఆహ్వానించటం చాలా మంచిది. కాని నిన్ను నీవే ఆహ్వానించుకొంటే అప్పుడు నీవు ఇతరుల ఎదుట ఇబ్బంది పడవచ్చును.

నీవు చూచిన దానిని గూర్చి న్యాయమూర్తికి చెప్పుటకు త్వరపడవద్దు. నీవు చెప్పింది తప్పు అని మరో వ్యక్తి గనుక చెబితే అప్పుడు నీవు ఇబ్బంది పడాల్సి వస్తుంది.

నీవూ మరో వ్యక్తి ఏకీభవించలేకపోతే ఏమి చేయాలి? అనే విషయం, మీ మధ్యనే నిర్ణయం కావాలి. మరో వ్యక్తి రహస్యాన్ని చెప్పవద్దు. 10 నీవలా చేస్తే నీకు అవమానం కలుగుతుంది. ఆ చెడ్డ పేరు నీకు ఎప్పటికీ పోదు.

11 సమయానికి తగిన రీతిగా పలికిన మంచిమాటలు వెండి పళ్లెంలో ఉంచిన బంగారు పండులా ఉంటవి. 12 జ్ఞానముగల ఒక మనిషి నీకు ఒక హెచ్చరిక ఇస్తే బంగారు ఉంగరాలకంటే లేక మేలిమి బంగారు నగలకంటే అది ఎక్కువ విలువగలది.

13 నమ్మదగిన వార్తాహరుడు అతనిని పంపిన వారికి ఎంతో విలువగలవాడు. అతడు కోతకాలపు ఎండ రోజుల్లో చల్లటి నీళ్లలాంటివాడు.

14 కానుకలు ఇస్తామని వాగ్దానం చేసి, వాటిని ఎన్నడూ ఇవ్వని వారు వర్షం కురిపించని మేఘాలు, గాలిలాంటివారు.

15 సహనంగా మాట్లాడటం ఏ వ్యక్తినేగాని, చివరికి ఒక అధికారి ఆలోచననేగాని మార్చుతుంది. నిదానంగా మాట్లాడటం చాలా శక్తివంతమైనది.

16 తేనె మంచిది. కాని దానిని మరీ ఎక్కువగా తినవద్దు. నీవలా చేస్తే నీకు జబ్బు వస్తుంది. 17 అదే విధంగా నీ పొరుగు వాని ఇంటికి మరీ తరచుగా వెళ్లవద్దు. నీవలా చేస్తే అప్పుడు అతడు నిన్ను అసహ్యించు కోవటం మొదలు పెడతాడు.

18 సత్యం చెప్పని మనిషి ప్రమాదకరమైనవాడు. అతడు ఒక గునపం, లేక ఖడ్గం లేక వాడిగల బాణం లాంటివాడు. 19 కష్టకాలంలో అబద్ధీకుని మీద ఎన్నడూ ఆధారపడవద్దు. ఆ మనిషి నొప్పెడుతున్న పన్నులా లేక కుంటిపాదంలా ఉంటాడు. నీకు అతడు ఎంతో అవసరమైనప్పుడే అతడు నిన్ను బాధపెడతాడు.

20 ధు ఖంలో ఉన్న మనిషి దగ్గర ఆనంద గీతాలు పాడటం అతనికి చలిపెడుతున్నప్పుడు అతని గుడ్డలు తీసివేయటంలా ఉంటుంది. అది సోడా, చిరకా మిళితం చేసినట్టు ఉంటుంది.

21 నీ శత్రువు ఆకలితో ఉన్నప్పుడు తినేందుకు అతనికి భోజనం పెట్టు. నీ శత్రువు దాహంతో ఉంటే తాగేందుకు అతనికి నీళ్లు యివ్వు. 22 నీవు ఇలా చేస్తే నీవు అతనిని సిగ్గుపడేలా చేస్తావు. అది మండుతున్న నిప్పులు అతని తల మీద ఉంచినట్టు ఉంటుంది. మరియు నీ శత్రువుకు నీవు మంచి చేశావు గనుక యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు.

23 ఉత్తరం నుండి వీచే గాలి వర్షాన్ని తెస్తుంది. అదే విధంగా చెప్పుడు మాటలు కోపం రప్పిస్తాయి.

24 వివాదం కోరుకొనే భార్యతో కలిసి ఇంటిలో ఉండటంకంటె, ఇంటికప్పు మీద బ్రతకటం మేలు.

25 దూరస్థలం నుండి వచ్చిన శుభవార్త నీకు వేడిగా, దాహంగా ఉన్నప్పుడు చల్లటి నీళ్లు తాగినట్టు ఉంటుంది.

26 ఒక మంచి మనిషి బలహీనుడై ఒక దుర్మార్గుని వెంబడిస్తే, అది మంచి నీళ్లు బురద నీళ్లు అయినట్టుగా ఉంటుంది.

27 నీవు చాలా ఎక్కువ తేనెను తింటే అది నీకు మంచిది కాదు. అదే విధంగా నీకోసం మరీ ఎక్కువ ఘనత తెచ్చుకోవాలని ప్రయత్నించకు.

28 ఒక మనిషి తనను తాను అదుపులో ఉంచుకోలేకపోతే, అప్పుడు అతడు కూలిపోయిన గోడలుగల పట్టణంలా ఉంటాడు.

బుద్ధిహీనులను గూర్చిన జ్ఞాన సూక్తులు

26 తెలివి తక్కువ వానిని గౌరవించటం వ్యర్థం. అది వేసవిలో మంచులా, కోతకాలంలో వర్షంలా ఉంటుంది.

నీకు చెడు సంగతులు సంభవించాలని ఒక మనిషి కోరుకొంటే చింతపడవద్దు. నీవు తప్పు ఏమీ చేయక పోతే నీకేమీ చెడు సంభవించదు. ఆ మనిషి మాటలు నీ పక్కగా ఎగురుతూ, ఎన్నడూ ఆగని పక్షుల్లా ఉంటాయి.

గుర్రాన్ని చబుకుతో కొట్టాలి. గాడిదకు కళ్లెం పెట్టాలి. బుద్ధిహీనుణ్ణి బెత్తంతో కొట్టాలి.

ఇక్కడ ఒక కష్టతరమైన పరిస్థితి ఉంది. ఒక బుద్ధి హీనుడు ఒక మూర్ఖ ప్రశ్న నిన్ను అడిగితే, నీవు మూర్ఖ జవాబు ఇవ్వవద్దు, అలా ఇస్తే నీవుకూడ బుద్ధిహీనునిలా కనబడతావు. కాని ఒక బుద్ధిహీనుడు ఒక మూర్ఖ ప్రశ్న అడిగితే, అప్పుడు నీవు తగిన మూర్ఖపు జవాబు ఇవ్వాలి, లేకపోతే అతడు తాను చాలా తేలివిగలవాడిని అనుకొంటాడు.

తెలివి తక్కువ వాణ్ణి ఎన్నడూ నీ సందేశం తీసికొని వెళ్లనివ్వకు. నీవు అలా చేస్తే, నీ స్వంత కాళ్లు కోసి కొన్నట్టు ఉంటుంది. నీవు కష్టం అడిగి తెచ్చుకొంటావు.

బుద్ధిహీనుడు జ్ఞానముగలది చెప్పటానికి ప్రయత్నించినప్పుడు, అది ఒక కుంటివాడు నడవటానికి ప్రయత్నించినట్టు ఉంటుంది.

బుద్ధిహీనునికి గౌరవం చూపించటం వడిసెలలో బండను కట్టడానికి ప్రయత్నించినట్టు ఉంటుంది.

ఒక బుద్ధిహీనుడు జ్ఞానముగల మాట చెప్పటానికి ప్రయత్నిస్తే, అది ఒక తాగుబోతువాడు తన చేతిలోని ముల్లు తీసికోవటానికి ప్రయత్నించినట్టు ఉంటుంది.

10 ఒక బుద్ధిహీనుణ్ణి లేక దారిన పోయే వాళ్లను ఎవరినంటే వారిని కూలికి పెట్టుకోవటం ప్రమాదకరం. ఎవరికి హాని జరుగుతుందో నీకు తెలియదు.

11 ఒక కుక్క ఆహారం తింటుంది. తరువాత దానికి జబ్బుచేసి, వాంతి చేసికొంటుంది. తర్వాత ఆ కుక్క ఆ ఆహారాన్ని మళ్లీ తింటుంది. ఒక బుద్ధిహీనుని విషయం కూడ అలానే ఉంటుంది. అతడు బుద్ధిహీనమైన అదే పనిని మరల మరల చేస్తాడు.

12 ఒక మనిషి జ్ఞానము లేకుండానే జ్ఞానిని అని తలిస్తే అతడు బుద్ధిహీనునికంటె దౌర్భాగ్యుడు.

13 “నేను ఇల్లు విడిచి వెళ్లలేను. వీధిలో సింహంఉంది” అంటాడు ఒక సోమరి.

14 ఒక సోమరి ఒక తలుపులాంటివాడు. ఒక తలుపు దాని బందుల మీద తిరిగినట్టు తన పడక మీద అటు ఇటు తిరగటమే అతడు చేసేది అంతాను. అతడు ఎన్నడూ ఎక్కడికి వెళ్లడు.

15 ఒక సోమరి మనిషి తన పళ్లెంలో నుండి తన భోజనాన్ని తన నోటి వరకు గూడ ఎత్తని మరీ బద్ధకస్తుడు.

16 ఒక సోమరి మనిషి తాను చాలా జ్ఞానము గలవాడను అనుకుంటాడు. వారి తలంపులకు మంచి కారణాలు ఇవ్వగలిగిన ఏడుగురు మనుష్యులకంటే తాను చాలా ఎక్కువ తెలివిగల వాడనని అతడు తలస్తాడు.

17 ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదంలో పాల్గొనడం ప్రమాదకరం. అది దారిన పోతూ ఒక కుక్క చెవులు పట్టి లాగినట్టు ఉంటుంది.

18-19 మరో మనిషిని మాయచేసి, ఊరకనే సరదాగా అలా చేసాను అనేవాడు, అగ్ని బాణాలు గాలిలోకి కొట్టి, ప్రమాదవశాత్తు ఎవరినో చంపిన పిచ్చివాడిలా ఉంటాడు.

20 మంటకు కట్టెలు లేకపోతే మంట చల్లారి పోతుంది. అదే విధంగా చెప్పుడు మాటలు లేకపోతే వివాదం సమసిపోతుంది.

21 బొగ్గులు బూడిదను మండింపచేస్తూ ఉంటాయి. కట్టెలు మంటను మండిస్తూ ఉంటాయి. అదే విధంగా చిక్కులు పెట్టే మనుష్యులు వివాదాన్ని బ్రతకనిస్తారు.

22 మనుష్యులు చెప్పుడు మాటలను ప్రేమిస్తారు. అది మంచి ఆహారాన్ని భోంచేసినట్టు ఉంటుంది.

23 ఒక దుర్మార్గపు పథకాన్ని దాచిపెట్టే మంచి మాటలు ఒక చవకబారు మట్టి కుండ మీద వెండి పూతలా ఉంటాయి. 24 ఒక దుర్మార్గుడు తాను చెప్పే విషయాల ద్వారా తాను మంచివానిలా చూపెట్టు కుంటాడు. కాని అతడు తన దుర్మార్గపు పథకాలను తన హృదయంలో దాచి పెడతాడు. 25 అతడు చెప్పే విషయాలు మంచివిగా కనబడవచ్చు. కాని అతణ్ణి నమ్మవద్దు. అతని హృదయం దురాలోచనలతో నిండిపోయింది. 26 అతడు తన దుర్మార్గపు పథకాలను చక్కని మాటలతో దాచిపెడతాడు. కాని అతడు నీచుడు. చివరికి అతడు చేసే దుర్మార్గవు విషయాలను మనుష్యులందరు చూస్తారు.

27 ఒక మనిషి ఇతరులను ఇక్కట్టులో పెట్టాలని ప్రయత్నించి, గొయ్యి తవ్వితే అతడు తానే ఆ గోతిలో పడతాడు. మరో మనిషి మీదకు ఒక బండను దొర్లించాలని ప్రయత్నిస్తే అతడు తనను తానే చితుక గొట్టుకుంటాడు.

28 అబద్ధాలు చెప్పే మనిషి తనకు భోధించే వారిని ద్వేషిస్తాడు. మరియు ఒక మనిషి చెప్పే విషయాలు అర్థవంతంగా చెప్పకపోతే అతడు తనను తానే బాధించుకొంటాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International