Book of Common Prayer
యాత్ర కీర్తన.
132 యెహోవా, దావీదు శ్రమపడిన విధానం జ్ఞాపకం చేసుకొమ్ము.
2 కాని దావీదు యెహోవాకు ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు.
ఇశ్రాయేలీయుల మహత్తర శక్తిగల దేవునికి దావీదు ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు.
3 దావీదు చెప్పాడు, “నేను నా యింట్లోకి వెళ్లను.
నేను నా పడక మీద పండుకొనను,
4 నేను నిద్రపోను,
నేను నా కండ్లకు విశ్రాంతినివ్వను,
5 యెహోవా కోసం నేను ఒక మందిరాన్ని కనుగొనేంత వరకు ఆ పనుల్లో ఏదీ నేను చేయను!
ఇశ్రాయేలీయుల మహా శక్తిగల దేవునికి నేనొక గృహం చూస్తాను!”
6 ఎఫ్రాతాలో[a] మేము దాన్ని గూర్చి విన్నాం.
ఒడంబడిక పెట్టెను కిర్యత్యారీము[b] దగ్గర మేము కనుగొన్నాము.
7 మనం పవిత్ర గుడారానికి వెళ్దాం రండి.
దేవుడు తన పాదాలు పెట్టుకొనే పీఠం దగ్గర మనము ఆయనను ఆరాధించుకొందాం.
8 యెహోవా, నీ విశ్రమ స్థానం నుండి లెమ్ము.
యెహోవా, నీవు నీ శక్తిగల ఒడంబడిక పెట్టెతో రమ్ము.
9 యెహోవా, నీ యాజకులు నీతిని వస్త్రాలుగా ధరించనిమ్ము.
నీ అనుచరులు చాలా సంతోషంగా ఉన్నారు.
10 నీ సేవకుడైన దావీదు కోసం
నీవు ఏర్పరచుకొన్న రాజును నిరాకరించవద్దు.
11 యెహోవా దావీదుతో ఒక స్థిర ప్రమాణం చేశాడు. యెహోవా దావీదుతో వెనుక తిరుగని ప్రమాణం చేశాడు.
దావీదు వంశం నుండి రాజులు వస్తారని యెహోవా ప్రమాణం చేశాడు.
12 “దావీదూ, నీ పిల్లలు నా ఒడంబడికకు, నేను వారికి నేర్పించే నా న్యాయ చట్టాలకు విధేయులయితే
అప్పుడు నీ వంశంలో నుండి ఎవరో ఒకరు ఎల్లప్పుడూ రాజుగా ఉంటాడు” అని యెహోవా చెప్పాడు.
13 యెహోవా, తన ఆలయ స్థానంగా ఉండుటకు సీయోనును ఎంచుకున్నాడు.
తన నివాసస్థలంగా దాన్ని కోరుకొని యున్నాడు.
14 యెహోవా చెప్పాడు, “శాశ్వతంగా ఇదే నా స్థలం.
నేను ఉండే చోటుగా ఈ స్థలాన్ని ఎంచుకొంటున్నాను.
15 సమృద్ధిగా ఆహారం యిచ్చి నేను ఈ పట్టణాన్ని ఆశీర్వదిస్తాను.
ఇక్కడ పేదవాళ్లకు కూడా తినుటకు సమృద్ధిగా ఉంటుంది.
16 యాజకులకు నేను రక్షణను ధరింపచేస్తాను.
మరియు నా అనుచరులు ఇక్కడ చాలా సంతోషంగా ఉంటారు.
17 ఈ స్థలంలో, దావీదుకు ఒక కొమ్ము లేచేలా చేస్తాను.
నేను ఏర్పాటు చేసుకొన్న రాజుకు నేను ఒక దీపాన్ని సిద్ధం చేస్తాను.
18 దావీదు శత్రువులను నేను అవమానంతో కప్పుతాను.
కాని దావీదు కిరీటం దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది.”
సమాధాన ప్రభువు వస్తున్నాడు
11 యెష్షయి మొద్దునుండి (వంశం నుండి) ఒక చిగురు (శిశువు) పుడుతుంది. యెష్షయి వేరులనుండి అంకురం ఎదుగుతుంది. 2 ఆ శిశువులో యెహోవా ఆత్మ ఉంటుంది. జ్ఞానం, అవగాహన, నడిపింపు, శక్తిని ఆత్మ ఇస్తుంది. ఈ శిశువు యెహోవాను తెలుసుకొని, ఘనపర్చటానికి ఆత్మ సహాయం ఉంటుంది. 3 ఈ శిశువు యెహోవాను ఘనపరుస్తాడు. అందువల్ల శిశువు సంతోషంగా ఉంటాడు.
ఈ శిశువు కనబడే వాటిని బట్టి తీర్పు తీర్చడు. అతడు వినేవిషయాలను బట్టి తీర్పు తీర్చడు. 4-5 బీదలకు అతడు న్యాయంగా, నిజాయితీగా తీర్పుచెబుతాడు. దేశంలో పేద ప్రజలకు జరగాల్సిన విషయాల్లో నిర్ణయాలు చేయాల్సినప్పుడు అతడు న్యాయంగా ఉంటాడు. ప్రజలు కొట్టబడాలని అతడు నిర్ణయిస్తే, అప్పుడు అతడు ఆదేశం ఇస్తాడు, ఆ ప్రజలు కొట్టబడతారు. ఎవరైనా చావాలని అతడు నిర్ణయం చేస్తే, అప్పుడు అతడు ఆదేశం ఇస్తాడు. ఆ దుష్టులు చంపబడతారు. మంచితనం, న్యాయం ఈ శిశువుకు బలం ప్రసాదిస్తాయి. అవి అతడు తన నడుముకు కట్టుకొనే పట్టాలా ఉంటాయి.
6 ఆ సమయంలో తోడేళ్లు గొర్రెపిల్లలతో కలిసి శాంతిగా జీవిస్తాయి. పెద్ద పులులు మేక పిల్లలతో కలిసి శాంతంగా పండుకొంటాయి. దూడలు, సింహాలు, ఎద్దులు కలిసి శాంతిగా జీవిస్తాయి. ఒక చిన్న పిల్లాడు వాటిని తోల్తాడు. 7 ఆవులు, ఎలుగుబంట్లు కలిసి శాంతిగా జీవిస్తాయి. వాటి పిల్లలన్నీ కలసి పండుకొంటాయి, ఒక దానిని ఒకటి బాధించవు. సింహాలు, ఆవుల్లా గడ్డి మేస్తాయి. చివరికి సర్పాలు కూడా మనుష్యులకు హాని చేయవు. 8 ఒక చిన్నబిడ్డ నాగుపాముపుట్ట దగ్గర ఆడుకొంటుంది. విషసర్పం పుట్టలో ఒకచిన్న పాప చేయి పెట్టగలుగుతుంది.
9 అంతా శాంతిగా ఉంటుందనీ, ఎవరూ ఒకరిని ఒకరు బాధించుకోరనీ ఈ విషయాలు తెలియ జేస్తున్నాయి. నా పరిశుద్ధ పర్వతం మీద ప్రజలు దేనినీ నాశనం చేయాలని ఆశించరు. ఎందుకంటే, ప్రజలు వాస్తవంగా యెహోవాను తెలుసుకొని ఉంటారు గనుక. సముద్రంనీళ్లతో నిండిపోయినట్టు, వారు దైవజ్ఞానంతో నిండిపోయి ఉంటారు.
10 ఆ సమయంలో యెష్షయి కుటుంబంలో ఒక ప్రత్యేక వ్యక్తి ఉంటాడు. ఈ వ్యక్తి ఒక పతాకంలా ఉంటాడు. రాజ్యాలన్నీ తన చుట్టూ సమావేశం కావాలని ఈ “పతాకం” చూపిస్తుంది. తాము చేయాల్సిన వాటిని గూర్చి రాజ్యాలు అతణ్ణి అడుగుతాయి. అతడు ఉండే స్థలం మహిమతో నిండిపోతుంది.
11 ఆయన పవిత్రం చేసిన ప్రజలు, పవిత్రం చేసే ఆయన ఒకే కుటుంబానికి చెందినవాళ్ళు. అందువలనే, వాళ్ళు తన సోదరులని చెప్పుకోవటానికి యేసు సిగ్గుపడటంలేదు. 12 ఆయన ఈ విధంగా అన్నాడు:
“నిన్ను గురించి నా సోదరులకు తెలియ చేస్తాను.
సభలో, నిన్ను స్తుతిస్తూ పాటలు పాడతాను!”(A)
13 మరొక చోట
“నేను దేవుణ్ణి నమ్ముతున్నాను!”(B)
అంతేకాక ఇలా కూడా అన్నాడు:
“నేను, దేవుడు నాకిచ్చిన సంతానం యిక్కడ ఉన్నాము!”(C)
14 ఆయన “సంతానమని” పిలువబడినవాళ్ళు రక్తమాంసాలుగల ప్రజలు. యేసు వాళ్ళలా అయిపోయి వాళ్ళ మానవనైజాన్ని పంచుకొన్నాడు. ఆయన తన మరణం ద్వారా మరణంపై అధికారమున్న సాతాన్ను నాశనం చేయాలని ఇలా చేశాడు. 15 తద్వారా జీవితాంతం మరణానికి భయపడి జీవించే వాళ్ళకు స్వేచ్ఛకలిగించాడు. 16 నిజానికి, ఆయన దేవదూతలకు సహయం చెయ్యాలని రాలేదు. అబ్రాహాము సంతానానికి సహయం చెయ్యాలని వచ్చాడు. 17 ఈ కారణంగా ఆయన అన్ని విధాల తన సోదరులను పోలి జన్మించవలసి వచ్చింది. ఆయన మహాయాజకుడై తన ప్రజలపై దయ చూపటానికి మానవ జన్మనెత్తాడు. ఆయన ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తం చెయ్యాలని వారిలో ఒకడయ్యాడు. 18 శోధన సమయాల్లో యేసు కష్టాలను అనుభవించాడు. కనుక యిప్పుడు శోధనలకు గురౌతున్న వాళ్ళకు ఆయన సహాయం చేయగలడు.
© 1997 Bible League International