Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 75-76

సంగీత నాయకునికి: “నాశనం చేయకు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.

75 దేవా, మేము నిన్ను స్తుతిస్తున్నాము.
    మేము నీ నామాన్ని స్తుతిస్తున్నాము.
    నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మేము చెబుతున్నాము.

దేవుడు ఇలా చెబుతున్నాడు; “తీర్పు సమయాన్ని నేను నిర్ణయిస్తాను.
    న్యాయంగా నేను తీర్పు తీరుస్తాను.
భూమి, దాని మీద ఉన్న సమస్తం కంపిస్తూ ఉన్నప్పుడు
    దాని పునాది స్తంభాలను స్థిర పరచేవాడను నేనే.”

4-5 “కొందరు మనుష్యులు చాలా గర్విష్ఠులు. తాము శక్తిగలవారమని, ప్రముఖులమని తలుస్తారు.
    కాని ‘అతిశయ పడవద్దు’ ‘అంతగా గర్వపడవద్దు.’ అని నేను ఆ మనుష్యులతో చెబుతాను.”

తూర్పునుండిగాని పడమరనుండిగాని
    ఎడారినుండి గాని వచ్చే ఎవరూ ఒక మనిషిని గొప్ప చేయలేరు.
దేవుడే న్యాయమూర్తి, ఏ మనిషి ప్రముఖుడో దేవుడే నిర్ణయిస్తాడు.
    దేవుడు ఒక వ్యక్తిని ప్రముఖ స్థానానికి హెచ్చిస్తాడు.
    ఆయనే మరొక వ్యక్తిని తక్కువ స్థానానికి దించివేస్తాడు.
దుర్మార్గులను శిక్షించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యెహోవా చేతిలో ఒక పాత్రవుంది.
    అది ద్రాక్షారసంలో కలిసిన విషపూరితమైన మూలికలతో నిండివుంది.
ఆయన ఈ ద్రాక్షారసాన్ని (శిక్ష) కుమ్మరిస్తాడు.
    దుర్మార్గులు చివరి బొట్టు వరకు దాన్ని తాగుతారు.
ఈ సంగతులను గూర్చి నేను ఎల్లప్పుడూ ప్రజలకు చెబుతాను.
    ఇశ్రాయేలీయుల దేవునికి నేను స్తుతి పాడుతాను.
10 దుర్మార్గుల నుండి శక్తిని నేను తీసివేస్తాను.
    మంచి మనుష్యులకు నేను శక్తినిస్తాను.

సంగీత నాయకునికి: వాయిద్యాలతో. ఆసాపు స్తుతి కీర్తన.

76 యూదాలో ప్రజలు దేవుని ఎరుగుదురు.
    దేవుని నామం నిజంగా గొప్పదని ఇశ్రాయేలుకు తెలుసు.
దేవుని ఆలయం షాలేములో[a] ఉంది.
    దేవుని గృహం సీయోను కొండ మీద ఉంది.
అక్కడ విల్లులను, బాణాలను కేడెములను,
    కత్తులను ఇతర యుద్ధ ఆయుధాలను దేవుడు విరుగగొట్టాడు.

దేవా, నీవు నీ శత్రువులను ఓడించిన ఆ కొండల నుండి
    తిరిగి వస్తూండగా నీవు ఎంతో మహిమతో ఉన్నావు.
ఆ సైనికులు చాలా బలం కలవారని తలంచారు. కాని యిప్పుడు వారు చచ్చి పొలాల్లో పడి ఉన్నారు.
    వారికి ఉన్నదంతా వారి శరీరాల నుండి దోచుకోబడింది.
    బలవంతులైన ఆ సైనికులలో ఒక్కరు కూడా వారిని కాపాడుకోలేకపోయారు.
యాకోబు దేవుడు ఆ సైనికులను గద్దించాడు.
    రథాలు, గుర్రాలుగల ఆ సైన్యం చచ్చిపడింది.
దేవా, నీవు భీకరుడవు.
    నీవు కోపంగా ఉన్నప్పుడు ఏ మనిషీ నీకు విరోధంగా నిలువలేడు.
8-9 యెహోవా న్యాయమూర్తిగా నిలిచి తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
    దేశంలోని దీన ప్రజలను దేవుడు రక్షించాడు.
పరలోకం నుండి ఆయన తీర్మానం ఇచ్చాడు.
    భూమి అంతా భయంతో నిశ్శబ్దం ఆయ్యింది.
10 దేవా, నీవు దుర్మార్గులను శిక్షించినప్పుడు ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
    నీవు నీ కోపం చూపిస్తావు. బ్రతికి ఉన్నవారు మరింత బలంగలవారు అవుతారు.

11 ప్రజలారా! మీ దేవుడైన యెహోవాకు మీరు వాగ్దానాలు చేశారు.
    ఇప్పుడు మీరు వాగ్దానం చేసినదాన్ని ఆయనకు ఇవ్వండి.
అన్ని చోట్లనుండీ ప్రజలు
    తాము భయపడే దేవునికి కానుకలు తెస్తారు.
12 దేవుడు మహా నాయకులను ఓడిస్తాడు.
    భూలోక రాజులందరూ ఆయనకు భయపడుతారు.

కీర్తనలు. 23

దావీదు కీర్తన.

23 యెహోవా నా కాపరి
    నాకు కొరత ఉండదు
పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు.
    ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు.
ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలం ప్రసాదిస్తాడు.
    ఆయన నిజంగా మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను మంచితనపు మార్గాల్లో నడిపిస్తాడు.
చివరికి మరణాంధకారపు లోయలో నడిచినప్పుడు కూడా
    నేను భయపడను. ఎందుకంటే, యెహోవా, నీవు నాతో ఉన్నావు.
    నీ చేతికర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాయి కనుక.
యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాకు భోజనం సిద్ధం చేశావు.
    నూనెతో నా తలను నీవు అభిషేకిస్తావు.
    నా పాత్ర నిండి, పొర్లిపోతుంది.
నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో ఉంటాయి.
    మరియు నేను ఎల్లకాలం యెహోవా ఆలయంలో నివసిస్తాను.

కీర్తనలు. 27

దావీదు కీర్తన.

27 యెహోవా, నీవే నా వెలుగు, నా రక్షకుడవు.
    నేను ఎవరిని గూర్చి భయపడనక్కర్లేదు.
యెహోవా, నీవే నా జీవిత క్షేమస్థానం.
    కనుక నేను ఎవరికి భయపడను.
దుర్మార్గులు నా మీద దాడి చేయవచ్చు.
    వారు నా శరీరాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించవచ్చు.
వారు నా శత్రువులు, విరోధులు.
    వారు కాలు తప్పి పడిపోదురు.
అయితే నా చుట్టూరా సైన్యం ఉన్నప్పటికీ నేను భయపడను.
    యుద్ధంలో ప్రజలు నామీద విరుచుకు పడ్డప్పటికీ నేను భయపడను. ఎందుకంటే నేను యెహోవాను నమ్ముకొన్నాను.

యెహోవా నాకు అనుగ్రహించాలని నేను ఆయనను అడిగేది ఒకే ఒకటి ఉంది.
    నేను అడిగేది ఇదే:
“నా జీవిత కాలం అంతా నన్ను యెహోవా ఆలయంలో కూర్చుండనిచ్చుట.
    ఆయన రాజ భవనాన్ని నన్ను సందర్శించనిచ్చుట.
    యెహోవా సౌందర్యాన్ని నన్ను చూడనిమ్ము.”

నేను ఆపదలో ఉన్నప్పుడు యెహోవా నన్ను కాపాడుతాడు.
    ఆయన తన గుడారంలో నన్ను దాచిపెడతాడు.
    ఆయన తన క్షేమ స్థానానికి నన్ను తీసుకొని వెళ్తాడు.
నా శత్రువులు నన్ను చుట్టుముట్టేశారు. కాని ఇప్పుడు వారిని ఓడించటానికి యెహోవా నాకు సహాయం చేస్తాడు.
    అప్పుడు నేను ఆయన గుడారంలో బలులు అర్పిస్తాను. సంతోషంతో కేకలు వేస్తూ ఆ బలులు నేను అర్పిస్తాను.
    యెహోవాను ఘనపరచుటకు నేను వాద్యం వాయిస్తూ గానం చేస్తాను.

యెహోవా, నా స్వరం ఆలకించి నాకు జవాబు ఇమ్ము.
    నా మీద దయ చూపించుము.
యెహోవా, నా హృదయం నిన్ను గూర్చి మాట్లాడమంటున్నది.
    వెళ్లు, నీ యెహోవాను ఆరాధించమంటున్నది అందువల్ల యెహోవా నేను నిన్ను ఆరాధించటానికి వచ్చాను.
యెహోవా, నా దగ్గర్నుండి తిరిగిపోకుము.
    కోపగించవద్దు, నీ సేవకుని దగ్గర్నుండి తిరిగి వెళ్లిపోవద్దు.
    నీవు నాకు సహాయమైయున్నావు, నన్ను త్రోసివేయకుము. నన్ను విడిచిపెట్టవద్దు. నా దేవా, నీవు నా రక్షకుడవు.
10 నా తల్లి, నా తండ్రి నన్ను విడిచిపెట్టారు.
    అయితే యెహోవా నన్ను తీసుకొని, తన వానిగా చేసాడు.
11 యెహోవా, నాకు శత్రువులు ఉన్నారు, కనుక నాకు నీ మార్గాలు నేర్పించుము.
    సరైన వాటిని చేయటం నాకు నేర్పించుము.
12 నా శత్రువుల కోరికకు నన్నప్పగించవద్దు.
    నన్ను గూర్చి వాళ్లు అబద్ధాలు చెప్పారు. నాకు హాని కలిగించేందుకు వాళ్లు అబద్ధాలు చెప్పారు.
13 నేను చనిపోక ముందు యెహోవా మంచితనాన్ని నేను చూస్తానని
    నిజంగా నేను నమ్ముచున్నాను.
14 యెహోవా సహాయం కోసం కనిపెట్టి ఉండుము.
    బలంగా, ధైర్యంగా ఉండుము.
    యెహోవా సహాయం కోసం కనిపెట్టుము.

Error: Book name not found: Wis for the version: Telugu Holy Bible: Easy-to-Read Version
Error: Book name not found: Wis for the version: Telugu Holy Bible: Easy-to-Read Version
రోమీయులకు 15:1-13

15 సంపూర్ణ విశ్వాసం గల మనము సంపూర్ణ విశ్వాసం లేనివాళ్ళ బలహీనతల్ని సహించాలి. మనం మన ఆనందం మాత్రమే చూసుకోకూడదు. ప్రతి వ్యక్తి తన సోదరుని మేలు కోసం, అభివృద్ధి కోసం అతనికి అనుగుణంగా నడుచుకోవాలి. క్రీస్తు కూడా తన ఆనందం మాత్రమే చూసుకోలేదు. దీన్ని గురించి ఈ విధంగా వ్రాసారు: “దేవా! నిన్ను అవమానించినవాళ్ళు నన్నూ అవమానించారు.” గతంలో వ్రాసిన లేఖనాలు మనకు బోధించటానికి వ్రాశారు. వాటి ద్వారా సహనము, ప్రోత్సాహము పొంది, రక్షణ లభిస్తుందన్న నమ్మకం మనలో కలగాలని దానిలోని ఉద్దేశ్యం. మనలో సహనము, ప్రోత్సాహము కలుగచేసే దేవుడు, యేసు క్రీస్తు ద్వారా మీ మధ్య ఐకమత్యము కలుగచేయునుగాక! అప్పుడు మనము ఒకే హృదయంతో, ఒకే నాలుకతో మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించగలుగుతాము. దేవునికి ఘనత కలగాలని క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్లే మీరు కూడా ఇతర్లను అంగీకరించండి. మూలపురుషులకు దేవుడు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టాలని, దేవుడు సత్యవంతుడని నిరూపించాలని, క్రీస్తు యూదుల సేవకుడు అయ్యాడు. యూదులు కానివాళ్ళు దేవుని అనుగ్రహం కోసం ఆయన్ని స్తుతించాలని క్రీస్తు ఉద్దేశ్యం. ఈ సందర్భాన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది:

“ఈ కారణంగానే యూదులు కాని వాళ్ళతో కలిసి నిన్ను స్తుతిస్తాను.
    నీ పేరిట భక్తి గీతాలు పాడతాను.”(A)

10 మరొక చోట:

“యూదులు కాని ప్రజలారా!
    మీరు కూడా దేవుని ప్రజలతో ఆనందించండి.”(B)

11 ఇంకొక చోట ఇలా వ్రాయబడి వుంది:

“యూదులు కాని ప్రజలారా! ప్రభువును స్తుతించండి.
    ఆయన్ని స్తుతిస్తూ గీతాలు పాడండి!”(C)

12 యెషయా ఒక చోట ఈ విధంగా అన్నాడు:

“యెష్షయి వంశ వృక్షం యొక్క వేరు చిగురిస్తుంది.
    ఆయన దేశాలను పాలిస్తాడు.
    యూదులు కానివాళ్ళు ఆయనలో నిరీక్షిస్తారు.”(D)

13 రక్షణ లభిస్తుందని నిరీక్షణ కలిగించే ఆ దేవుడు మీలో ఉన్న విశ్వాసం ద్వారా మీకు సంపూర్ణమైన ఆనందాన్ని, శాంతిని కలుగ చేయుగాక! అప్పుడు మీలో ఉన్న నిరీక్షణ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పొంగి పొర్లుతుంది.

లూకా 9:1-17

యేసు అపోస్తలులను పంపటం

(మత్తయి 10:5-15; మార్కు 6:7-13)

యేసు తన పన్నెండు మంది శిష్యుల్ని సమావేశ పరిచి దయ్యాల్ని పారద్రోలటానికి, రోగాలను నయం చేయటానికి వాళ్ళకు శక్తి, అధికారము ఇచ్చాడు. వాళ్ళను ప్రపంచంలోకి పంపుతూ దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించుమని, రోగాలున్న వాళ్ళకు నయం చెయ్యమని వాళ్ళతో చెప్పాడు. వాళ్ళతో, “ప్రయాణం చేస్తున్నప్పుడు మీ వెంట చేతి కర్రకాని, సంచికాని, ఆహారంకాని, ధనంకాని, మారు దుస్తులు కాని, యితర వస్తువులు కాని తీసుకు వెళ్ళకండి. ఒక యింటికి వెళ్తే ఆ గ్రామం వదిలే దాకా ఆ యిల్లు విడిచి వెళ్ళకండి. ప్రజలు మీకు స్వాగతం ఇవ్వకుంటే ఆ ఊరు వదిలి వెళ్ళే ముందు వాళ్ళు చేసిన పొరపాటు చూపటానికి మీ కాలి ధూళి దులపండి” అని అన్నాడు.

ఆ తర్వాత వాళ్ళు బయలు దేరి ప్రతి గ్రామానికి వెళ్ళారు. ప్రతిచోటా దైవ సందేశాన్ని ప్రకటించారు. రోగాలున్న వాళ్ళకు నయం చేసారు.

హేరోదు ఆందోళన

(మత్తయి 14:1-12; మార్కు 6:14-29)

సామంతరాజైన హేరోదు జరుగుతున్న వాటిని గురించి విని చాలా కంగారు పడ్డాడు. యోహాను బ్రతికి వచ్చాడని కొందరన్నారు. ఏలీయా కనిపించాడని కొందరన్నారు. మరికొందరు పూర్వకాలం నాటి ప్రవక్తల్లో ఒకడు బ్రతికి వచ్చాడని అన్నారు. కాని హేరోదు, “నేను యోహాను తల నరికించాను కదా. మరి ఎవర్ని గురించి వింటున్నాను?” అని మనస్సులో అనుకొన్నాడు. హేరోదు యేసును చూడాలని ఆతృత పడ్డాడు.

యేసు ఐదువేల మందికి పైగా భోజనం పెట్టటం

(మత్తయి 14:13-21; మార్కు 6:30-44; యోహాను 6:1-14)

10 అపొస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ యేసుతో చెప్పారు. ఆ తర్వాత యేసు అపొస్తలులను ప్రజలకు దూరంగా బేత్సయిదా అనే పట్టణానికి తన వెంట తీసుకు వెళ్ళాడు. 11 ప్రజలకు ఈ విషయం తెలిసింది. వాళ్ళు యేసును చూడటానికి అక్కడికి కూడా వెళ్ళారు. ఆయన వాళ్ళను ఆహ్వానించి దేవుని రాజ్యాన్ని గురించి చెప్పి రోగాలున్న వాళ్ళకు నయం చేశాడు.

12 సూర్యాస్తమయమౌతుండగా ఆయన వద్దకు పన్నెండు మంది అపొస్తలులు వచ్చి, “మనం ఏ మూలో ఉన్నాం. ప్రజల్ని వెళ్ళమనండి. చుట్టూ ఉన్న పల్లెలకు, గ్రామాలకు వెళ్ళి ఆహారము, విశ్రమించటానికి స్థలం చూసుకొంటారు” అని అన్నారు.

13 యేసు వాళ్ళతో, “వాళ్ళు తినటానికి మీరేదైనా ఆహారం ఇవ్వండి” అని అన్నాడు.

వాళ్ళు, “మా దగ్గర అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే ఉన్నాయి. మేము వెళ్ళి వీళ్ళందరికోసం ఆహారం కోనుక్కు రావాలని మీ ఉద్దేశ్యమా?” అని అన్నారు. 14 సుమారు ఐదువేలమంది పురుషులు అక్కడ ఉన్నారు.

కాని యేసు తన శిష్యులతో, “పంక్తికి యాభైమంది చొప్పున వాళ్ళను కూర్చో బెట్టండి” అని అన్నాడు.

15 శిష్యులు ఆయన చెప్పినట్లు చేసారు. వచ్చిన వాళ్ళందరూ కూర్చున్నారు. 16 యేసు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు తీసుకొని ఆకాశం వైపు చూసి, దేవునికి కృతజ్ఞత చెప్పి వాటిని భాగాలు చేశాడు. వాటిని తన శిష్యులకిచ్చి ప్రజలకు పంచమన్నాడు. 17 అందరూ కడుపు నిండుగా తిన్నారు. ఆ తర్వాత శిష్యులు మిగిలిన ఆహారాన్ని పండ్రెండు గంపల నిండా నింపారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International