Book of Common Prayer
105 యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుము. ఆయన నామాన్ని ఆరాధించుము.
ఆయన చేసే అద్భుత కార్యాలను గూర్చి జనాలతో చెప్పు.
2 యెహోవాను గూర్చి పాడుము. ఆయనకు స్తుతులు పాడుము.
ఆయన చేసే అద్భుతకార్యాలు అన్నింటిని గూర్చి చెప్పు.
3 యెహోవా పవిత్ర నామాన్ని గూర్చి అతిశయించు.
యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరంతా సంతోషించండి.
4 బలంకోసం యెహోవా దగ్గరకు వెళ్లండి.
సహాయంకోసం ఎల్లప్పుడూ ఆయన దగ్గరకు వెళ్లండి.
5 యెహోవా చేసే ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి.
ఆయన అద్భుతాలను, జ్ఞానంగల నిర్ణయాలను జ్ఞాపకం చేసుకోండి.
6 దేవుని సేవకుడైన అబ్రాహాము సంతతివారు మీరు.
దేవుడు ఏర్పరచుకొన్న యాకోబు సంతతివారు మీరు.
7 యెహోవా మన దేవుడు.
యెహోవా సర్వలోకాన్ని పాలిస్తాడు.[a]
8 దేవుని ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం చేసికోండి.
వెయ్యి తరాలవరకు ఆయన ఆదేశాలను జ్ఞాపకం ఉంచుకోండి.
9 దేవుడు అబ్రాహాముతో ఒక ఒడంబడిక చేసాడు.
ఇస్సాకుకు దేవుడు వాగ్దానం చేశాడు.
10 యాకోబుకు (ఇశ్రాయేలు) దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు.
ఇశ్రాయేలుతో దేవుడు తన శాశ్వత ఒడంబడిక చేసాడు.
11 “నేను నీకు కనాను దేశాన్ని ఇస్తాను, ఆ దేశం నీకు చెందుతుంది.”
అని దేవుడు చెప్పాడు.
12 అబ్రాహాము కుటుంబం చిన్నదిగా ఉన్నప్పుడు దేవుడు ఆ వాగ్దానం చేశాడు.
మరియు వారు కనానులో నివసిస్తున్న యాత్రికులు మాత్రమే.
13 దేశం నుండి దేశానికి, రాజ్యం నుండి రాజ్యానికి
వారు ప్రయాణం చేసారు.
14 కాని యితర మనుష్యులు ఆ కుటుంబాన్ని బాధించనియ్యకుండా దేవుడు చేసాడు.
వారిని బాధించవద్దని దేవుడు రాజులను హెచ్చరించాడు.
15 “నేను ఏర్పాటు చేసుకొన్న నా ప్రజలను బాధించవద్దు.
నా ప్రవక్తలకు ఎలాంటి కీడూ చేయవద్దు.” అని దేవుడు చెప్పాడు.
16 దేవుడు ఆ దేశంలో ఒక కరువు వచ్చేటట్టు చేశాడు.
ప్రజలకు తినుటకు సరిపడినంత ఆహారం లేదు.
17 అయితే దేవుడు వారికి ముందుగా వెళ్లుటకు యోసేపు అనే మనిషిని పంపించాడు.
యోసేపు ఒక బానిసవలె అమ్మబడ్డాడు.
18 యోసేపు కాళ్లను తాళ్లతో వారు కట్టివేశారు.
అతని మెడకు వారు ఒక ఇనుప కంటె వేశారు.
19 యోసేపు చెప్పిన సంగతులు నిజంగా జరిగేంతవరకు
అతడు (యోసేపు) బానిసగా చెప్పింది సరియైనది అని యెహోవా సందేశం రుజువు చేసింది.
20 కనుక యోసేపును విడుదల చేయమని ఈజిప్టు రాజు ఆదేశించాడు.
అనేక మందికి అధికారిగా ఉన్న అతనిని కారాగారం నుండి వెళ్లనిచ్చాడు.
21 అతడు యోసేపును తన ఇంటికి యజమానిగా నియమించాడు.
రాజ్యంలో అన్ని విషయాలను గూర్చి యోసేపు జాగ్రత్త తీసుకొన్నాడు.
22 యోసేపు యితర నాయకులకు హెచ్చరిక ఇచ్చాడు.
పెద్ద మనుష్యులకు యోసేపు నేర్పించాడు.
23 తరువాత ఇశ్రాయేలు ఈజిప్టుకు వచ్చాడు.
యాకోబు హాము దేశంలో[b] నివసించాడు.
24 యాకోబు కుటుంబం చాలా పెద్దది అయింది.
వారు వారి శత్రువులకంటే శక్తిగలవారయ్యారు.
25 కనుక ఈజిప్టు ప్రజలు యాకోబు వంశాన్ని ద్వేషించటం మొదలు పెట్టారు.
ఈజిప్టువారు బానిసలకు విరోధంగా పథకాలు వేయటం ప్రారంభించారు.
26 కనుక దేవుడు తన సేవకుడైన మోషేను,
తాను ఏర్పాటు చేసుకొన్న యాజకుడు అహరోనును పంపించాడు.
27 హాము దేశంలో అనేక అద్భుతాలు చేయటానికి
దేవుడు మోషే, అహరోనులను వాడుకొన్నాడు.
28 దేవుడు కటిక చీకటిని పంపించాడు.
కాని ఈజిప్టు వాళ్లు ఆయన మాట వినలేదు.
29 కనుక దేవుడు నీళ్లను రక్తంగా మార్చాడు.
వాళ్ల చేపలన్నీ చచ్చాయి.
30 ఆ దేశం కప్పలతో నింపివేయబడింది.
రాజు గదులలోకి కూడ కప్పలు వచ్చాయి.
31 దేవుడు ఆజ్ఞ ఇవ్వగా జోరీగలు,
దోమలు వచ్చాయి.
అన్నిచోట్లా అవే ఉన్నాయి.
32 దేవుడు వర్షాన్ని వడగండ్లుగా చేశాడు.
ఈజిప్టువారి దేశంలో అన్ని చోట్లా అగ్ని మెరుపులు కలిగాయి.
33 ఈజిప్టువారి ద్రాక్షా తోటలను, అంజూరపు చెట్లను దేవుడు నాశనం చేశాడు.
వారి దేశంలో ప్రతి చెట్టునూ దేవుడు నాశనం చేసాడు.
34 దేవుడు ఆజ్ఞ ఇవ్వగా మిడుతలు వచ్చాయి.
అవి లెక్కింపజాలనంత విస్తారంగా ఉన్నాయి.
35 మిడుతలు దేశంలోని మొక్కలన్నింటినీ తినివేశాయి.
నేల మీద పంటలన్నింటినీ అవి తినివేశాయి.
36 అప్పుడు ఈజిప్టు దేశంలో ప్రతి మొదటి సంతానాన్ని దేవుడు చంపేశాడు.
వారి జ్యేష్ఠ కుమారులను దేవుడు చంపివేశాడు.
37 అప్పుడు దేవుడు ఈజిప్టు నుండి తన ప్రజలను బయటకు తీసుకొని వచ్చాడు.
వారు వెండి బంగారాలు వారి వెంట తెచ్చారు.
దేవుని ప్రజలు ఎవ్వరూ తొట్రిల్లి పడిపోలేదు.
38 దేవుని ప్రజలు వెళ్లిపోవటం చూచి ఈజిప్టు సంతోషించింది.
ఎందుకంటే దేవుని ప్రజలను గూర్చి వారు భయపడ్డారు.
39 దేవుడు తన మేఘాన్ని ఒక దుప్పటిలా పరిచాడు.
రాత్రివేళ తన ప్రజలకు వెలుగు ఇచ్చుటకు దేవుడు తన అగ్నిస్తంభాన్ని ఉపయోగించాడు.
40 ప్రజలు మాంసం కోసం ఆడిగినప్పుడు దేవుడు వారికి పూరేళ్లను రప్పించాడు.
దేవుడు వారికి ఆకాశం నుండి సమృద్ధిగా ఆహారాన్ని యిచ్చాడు.
41 దేవుడు బండను చీల్చగా నీళ్లు ఉబుకుతూ వచ్చాయి.
ఎడారిలో ఒక నది ప్రవహించడం మొదలైంది.
42 దేవుడు తన పవిత్ర వాగ్దానం జ్ఞాపకం చేసికొన్నాడు.
దేవుడు తన సేవకుడు ఆబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసికొన్నాడు.
43 దేవుడు తన ప్రజలను ఈజిప్టునుండి బయటకు రప్పించాడు.
ప్రజలు వారి సంతోష గీతాలు పాడుతూ ఆనందంగా బయటకు వచ్చారు.
44 అప్పుడు యితరులు నివసిస్తున్న దేశాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు.
ఇతరుల కష్టార్జితాన్ని దేవుని ప్రజలు పొందారు.
45 దేవుడు తన ప్రజలు తన న్యాయ చట్టాలకు విధేయులవుతారని ఇలా చేసాడు.
వారు ఆయన ఉపదేశములకు జాగ్రత్తగా విధేయులు కావాలని దేవుడు ఇలా చేసాడు.
యెహోవాను స్తుతించండి.
నిజమైన న్యాయం
18 యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా చెప్పాడు: 2 “మీరీ సామెత వల్లిస్తూ ఉంటారు:
‘తల్లిదండ్రులు పుల్లని ద్రాక్ష తింటే
పిల్లలపండ్లు పులిశాయి!’ అని.
ఇలా మీరెందుకు అంటూ వుంటారు? మీరు పాపంచేస్తే, మీ బదులు భవిష్యత్తులో మరెవ్వడో శిక్షింపబడతాడని మీరనుకుంటున్నారు.”
3 కాని నా ప్రభువైన యెహోవా చెబుతున్నదేమంటే, “నా జీవ ప్రమాణంగా ఇశ్రాయేలు ప్రజలు ఈ సామెత ఇక మీదట నిజమని నమ్మరని నేను మీకు ఖచ్చితంగా చెబుతున్నాను! 4 నేను ప్రతి వ్యక్తినీ ఒకే రకంగా చూస్తాను. ఆ వ్యక్తి తండ్రిగాని, బిడ్డగాని కావచ్చు. పర్వాలేదు. ఎవరైతే పాపం చేశారో ఆ వ్యక్తులే చనిపోతారు!
19 “తన తండ్రి పాపాలకు కుమారుడు ‘ఎందుకు చంపబడడు?’ అని నీవు అడుగవచ్చు. అందుకు కారణం కుమారుడు న్యాయవర్తనుడై మంచి పనులు చేయటమే! అతడు నా కట్టడలను మిక్కిలి శ్రద్ధగా అనుసరించి నడచుకొన్నాడు! అందువల్ల అతడు జీవిస్తాడు. 20 చంపబడేది పాపాలకు ఒడిగట్టిన వ్యక్తి మాత్రమే! ఒక కుమారుడు అతని తండ్రి పాపాలకు శిక్షింపబడడు. ఒక తండ్రి తన కుమారుడు చేసిన తప్పులకు గాను శిక్షింపబడడు. ఒక మంచి వ్యక్తి మంచి తనం అతనికి మాత్రమే చెంది ఉంటుంది. ఒక చెడ్డ వ్యక్తి చెడుతనం అతనికి మాత్రమే పరిమితమై ఉంటుంది.
21 “ఒకవేళ చెడ్డ వ్యక్తి తన జీవిత విధానాన్ని మార్చుకుంటే అతడు జీవిస్తాడు. అతడు చనిపోడు. అతడు గతంలో చేసిన చెడ్డపనులన్నీ కొనసాగించటం మానివేస్తాడు. నా కట్టడలన్నీ అతడు శ్రద్ధతో పాటిస్తాడు. అతడు న్యాయవర్తనుడై, మంచివాడు అవుతాడు. 22 అతడు చేసిన చెడ్డకార్యాలను దేవుడు గుర్తుపెట్టుకోడు. అప్పుడు దేవుని దృష్టిలో అతని మంచి తనమే వుంటుంది! అందవల్ల ఆ వ్యక్తి జీవిస్తాడు!”
23 నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “చెడ్డవాళ్లంతా చనిపోవాలని నేను కోరుకోవటం లేదు. వారు జీవించేటందుకు వారు తమ జీవన విధానం మార్చుకోవాలని నేను కోరుకుంటున్నాను!
24 “ఇప్పుడు ఒక మంచి వ్యక్తి తన మంచితనాన్ని విడనాడవచ్చు. తన జీవన విధానాన్ని మార్చుకొని గతంలో చెడ్డమనిషి చెసిన ఘోరమైన పాపాలన్నీ చెయవచ్చు. అలాంటి వ్యక్తి జీవిస్తాడా? కావున ఆ మంచి మనిషి మారిపోయి చెడ్డవాడయితే, అతడు పూర్వం చేసిన మంచి పనులేవీ దేవుడు గుర్తు పెట్టుకోడు. ఆ వ్యక్తి తనకు వ్యతిరేకి అయ్యాడనీ, పాపం చేయటం మొదలు పెట్టాడనీ మాత్రం దేవుడు గుర్తు పెట్టుకుంటాడు. అందువల్ల అతని పాపాల కారణంగా అతడు చనిపోతాడు.”
25 దేవుడు ఇలా చెప్పాడు: “ప్రజలారా మీరు, ‘మా ప్రభువైన దేవుడు న్యాయంగా ప్రవర్తించడు’ అని అంటారు. కాని ఇశ్రాయేలు వంశములారా, వినండి. నేను న్యాయంగానే ఉన్నాను. మీరే న్యాయంగా లేరు. 26 ఒక మంచి మనిషి మారిపోయి, చెడ్డవాడైతే అతని చెడ్డకార్యాలకు ఫలితంగా అతడు చనిపోతాడు. 27 ఒక చెడ్డ వ్యక్తి మారి, మంచివాడై, మంచికార్యాలు చేస్తే, అతడు తన జీవితాన్ని రక్షించుకుంటాడు. అతడు బతుకుతాడు! 28 తాను పూర్వం ఎంత చెడ్డవాడో తెలుసుకొని, నావద్దకు తిరిగి వచ్చిన వాడవుతాడు. తాను గతంలో చేసిన చెడ్డకార్యాలు మళ్లీ చేయటం మానటంతో అతడు జీవిస్తాడు! అతడు మరణించడు!”
29 ఇశ్రాయేలు ప్రజలు, “అది న్యాయం కాదు! మా ప్రభువైన యెహోవా న్యాయంగా వుండనేరడు!” అని అన్నారు.
అందుకు దేవుడు ఇలా అన్నాడు: “నేను న్యాయంగానే ఉన్నాను. మీరే న్యాయంగా లేరు. 30 ఓ ఇశ్రాయేలు వంశమా, ఎందువల్లనంటే, నేను ప్రతి వ్యక్తికీ అతను చేసిన కార్యాలను అనుసరించి న్యాయనిర్ణయం చేస్తాను!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. “కావున, మీరు నా వద్దకు తిరిగిరండి. చెడుకార్యాలు చేయటం మానండి! ఆ ఘోరమైన వస్తువులు మీరు పాపం చేయటానికి కారణం కానీయకండి! 31 మీరు చేసిన భయంకర వస్తువులన్నీ పారవేయండి. అవన్నీ కేవలం మీరు పాపం చేయటానికే దోహదం చేస్తాయి! మీ హృదయాలను, ఆత్మలను మార్చుకోండి. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మిమ్మల్ని మీరెందుకు చనిపోయేలాగు చేసుకొంటున్నారు? 32 నేను మిమ్మల్ని చంపకోరటం లేదు! దయచేసి నా వద్దకు తిరిగి రండి. జీవించండి!” ఆ విషయాలు నా ప్రభువైన యెహోవా చెప్పాడు.
18 పాత నియమం సత్తువ లేనిది, నిరుపయోగమైనది. కనుక, అది రద్దు చేయబడింది. 19 ఆ ధర్మశాస్త్రం ఎవనిలోనూ పరిపూర్ణత కలిగించలేక పోయింది. అందువల్ల దేవుడు మనలో క్రొత్త నిరీక్షణను ప్రవేశపెట్టాడు. ఈ నిరీక్షణ మనల్ని ఆయనకు దగ్గర చేస్తుంది.
20 దీని విషయంలో దేవుడు ప్రమాణం కూడా చేశాడు. మిగతావాళ్ళు యాజకులైనప్పుడు ఎవ్వరూ ప్రమాణం చెయ్యలేదు. 21 కాని యేసు ప్రమాణం ద్వారా యాజకుడైనాడు. ఈయన విషయంలో దేవుడాయనతో ఇలా అన్నాడు:
“ప్రభువు ప్రమాణం చేశాడు.
తన మనస్సును మార్చుకోడు.
‘నీవు చిరకాలం యాజకుడుగావుంటావు.’”(A)
22 ఈ ప్రమాణం ద్వారా యేసు శ్రేష్ఠమైన క్రొత్త ఒడంబడికకు బాధ్యుడయ్యాడు.
23 ఎందరో యాజకులయ్యారు కాని, చావు వాళ్ళని యాజకులుగా పనిచేయకుండా అడ్డగించింది. 24 కాని యేసు చిరంజీవి గనుక చిరకాలం యాజకుడుగా ఉంటాడు. 25 అందువలన తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళను ఆయన ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. ఆయన వాళ్ళ పక్షాన దేవుణ్ణి వేడుకోటానికి చిరకాలం జీవిస్తూ ఉంటాడు.
26 పవిత్రమైన వాడు, ఏ కళంకం లేనివాడు, పరిశుద్ధమైన వాడు, పాపుల గుంపుకు చెందనివాడు, పరలోకంలో ఉన్నత స్థానాన్ని పొందినవాడు, ఇలాంటి ప్రధానయాజకుడై అవసరాన్ని తీరుస్తున్నాడు. 27 ఆయన, ఇతర ప్రధానయాజకులవలె తన పాపాల కొరకు గానీ, ప్రజల పాపాల కొరకు గానీ ప్రతి రోజు బలుల్ని అర్పించవలసిన అవసరం లేదు. ఆయన తనను తానే బలిగా అర్పించుకున్నాడు. అంటే మొదటి బలి, చివరి బలి ఆయనే! 28 ధర్మశాస్త్రం బలహీనులైనవాళ్ళను యాజకులుగా నియమించింది: కాని, ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణం కుమారుణ్ణి ప్రధానయాజకునిగా నియమించింది. అంతేకాక, ఆయన చిరకాలం పరిపూర్ణునిగా చేయబడ్డాడు.
మంచి సమరయుని ఉపమానం
25 ఒక ధర్మశాస్త్ర పండితుడు యేసును పరీక్షించాలనుకొని లేచి, “బోధకుడా! నేను నిత్యజీవం[a] పొందాలంటే ఏమి చెయ్యాలి?” అని అడిగాడు.
26 దానికి యేసు, “ధర్మశాస్త్రంలో ఏమి వ్రాసారు? నీవు ఏమిచదివావు?” అని అడిగాడు.
27 అతడు, “‘నీ ప్రభువైనటువంటి దేవుణ్ణి సంపూర్ణమైన మనస్సుతో, సంపూర్ణమైన ఆత్మతో, సంపూర్ణమైన బుద్ధితోనూ, శక్తితోనూ ప్రేమించు.’ అంతేకాక, ‘నిన్ను ప్రేమించుకొన్నంతగా నీ పొరుగు వాళ్ళను ప్రేమించు’ అని వ్రాయబడివుంది” అని చెప్పాడు.
28 యేసు ఈ విధంగా అన్నాడు: “నీవు సరియైన సమాధానం చెప్పావు. ఆ విధంగా నడుచుకో, అనంత జీవితం పొందుతావు.”
29 ఆ పండితుడు తాను నీతిమంతుడనని రుజువు చేయటానికి యేసుతో, “మరి నా పొరుగువాడు ఎవరు?” అని అడిగాడు.
30 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఒకడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేస్తూ దార్లో దొంగల చేతిలో చిక్కాడు. వాళ్ళతణ్ణి నిలువు దోపిడి చేసి బాగాకొట్టి వదిలి వేసారు. అతడు కొన ప్రాణంతో ఉన్నాడు.
31 “అనుకోకుండా ఒక యాజకుడు ఆ దారిన రావటం తటస్థించింది. అతణ్ణి చూసి కూడా ఆ యాజకుడు ప్రక్కకు తొలిగి వెళ్ళిపొయ్యాడు. 32 అదే విధంగా ఒక లేవీయుడు కూడా వచ్చి అతణ్ణి చూసి ప్రక్కకు తొలిగి వెళ్ళి పొయ్యాడు.
33 “ఒక సమరయ ప్రాంతపువాడు ప్రయాణం చేస్తూ అతని దగ్గరకు వచ్చాడు. అతణ్ణి చూసి ఆ సమరయ వానికి చాలా జాలి కలిగింది. 34 అతని దగ్గరకు వెళ్ళి అతని గాయాలమీద ద్రాక్షారసం పోసి, నూనె రాచి, కట్లుకట్టాడు. ఆ తర్వాత తన దగ్గరున్న గాడిద మీద అతణ్ణి ఎక్కించుకొని ఒక సత్రానికి తీసుకు వెళ్ళాడు. ఈ విధంగా అతనికి చాలా ఉపకారం చేశాడు. 35 మరుసటి రోజు ఆ సత్రపు యజమానికి రెండు దేనారాలిచ్చి, ‘ఇతణ్ణి జాగ్రత్తగా చూసుకో. ఇతని కోసం నేనిచ్చిన దాని కన్నా ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తే నేను తిరిగి వచ్చినప్పుడు ఆ డబ్బు నీకిస్తాను’ అని చెప్పి వెళ్ళి పొయ్యాడు.”
36 ఈ విషయం చెప్పి యేసు, “దొంగల చేతుల్లో చిక్కిన వానికి ఈ ముగ్గరిలో ఎవరు పొరుగువాడని నీ అభిప్రాయం?” అని అడిగాడు.
37 ఆ పండితుడు, “అతనిపై జాలి చూపిన వాడే!” అని సమాధానం చెప్పాడు.
దానికి యేసు, “నీవు కూడా అతనిలాగే నడుచుకో” అని చెప్పాడు.
© 1997 Bible League International