Book of Common Prayer
జాయిన్
49 యెహోవా, నాకు చేసిన నీ వాగ్దానం జ్ఞాపకం చేసుకొనుము.
ఆ వాగ్దానం నాకు ఆశనిస్తుంది.
50 నేను శ్రమ పడుతున్నప్పుడు నీవు నన్ను ఆదరించావు
నీ మాటలు నన్ను మరల బ్రతికించాయి.
51 నా కంటే తామే మంచివాళ్లు అనుకొన్న మనుష్యులు ఎడతెగక నన్ను అవమానించారు.
కాని యెహోవా, నీ ఉపదేశాలను అనుసరించటం నేను మానుకోలేదు.
52 జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటాను.
యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాలు నన్ను ఆదరిస్తాయి.
53 నీ ఉపదేశాలను అనుసరించటం మానివేసిన దుర్మార్గులను చూస్తే
నాకు చాలా కోపం వస్తుంది.
54 నీ న్యాయ చట్టాలు
నా ఇంటివద్ద పాడుకొనే పాటలు.
55 యెహోవా, రాత్రివేళ నేను నీ నామం జ్ఞాపకం చేసుకొంటాను.
నీ ఉపదేశాలను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నీ న్యాయ చట్టాన్ని నేను అనుసరిస్తాను.
56 నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడను అవుతాను
కనుక నాకు ఈలాగు జరుగుతుంది.
హేత్
57 యెహోవా, నీ ఆజ్ఞలకు విధేయుడనగుట నా విధి అని నేను తీర్మానించుకొన్నాను.
58 యెహోవా, నేను పూర్తిగా నీమీద ఆధారపడుతున్నాను.
నీ వాగ్దానం ప్రకారం నాకు దయచూపించుము.
59 నేను నా జీవితాన్ని గూర్చి చాలా జాగ్రత్తగా ఆలోచించాను.
మళ్లీ నీ ఒడంబడికను అనుసరించటానికే వచ్చాను.
60 ఆలస్యం లేకుండా నీ ఆజ్ఞలకు విధేయత చూపాలని నేను త్వరగా మళ్లుకొన్నాను.
61 దుర్మార్గులు కొందరు నన్ను చుట్టుముట్టారు.
అయితే యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు.
62 నీ మంచి నిర్ణయాల కోసం నీకు కృతజ్ఞత చెల్లించటానికి
అర్ధరాత్రి వేళ నేను మేల్కొంటాను.
63 నిన్ను ఆరాధించే ప్రతి మనిషికీ నేను స్నేహితుడను.
నీ ఆజ్ఞలకు విధేయత చూపే ప్రతి మనిషికి నేను స్నేహితుడను.
64 యెహోవా, నీ నిజమైన ప్రేమ భూమిని నింపుతుంది.
నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
తేత్
65 యెహోవా, నీ సేవకుడనైన నాకోసం నీవు మంచి వాటిని జరిగించావు.
నీవు చేస్తానని వాగ్దానం చేసిన వాటినే సరిగా నీవు చేశావు.
66 యెహోవా, నేను జ్ఞానంగల నిర్ణయాలు చేయడానికి నాకు గ్రహింపును ప్రసాదించు.
నేను నీ ఆజ్ఞలను నమ్ముకొంటున్నాను.
67 నేను శ్రమపడక ముందు అనేక తప్పులు చేశాను.
కాని ఇప్పుడు నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడనవుతున్నాను.
68 దేవా, నీవు మంచివాడవు, నీవు మంచి వాటినే చేస్తావు.
నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
69 నాకంటే తామే మంచి వాళ్లు అనుకొనే మనుష్యులు నన్ను గూర్చి చెడుగా అబద్ధాలు చెబుతారు.
కాని యెహోవా, నేను నా హృదయపూర్తిగా నీ ఆజ్ఞలకు లోబడుతూ, అలాగే కొనసాగుతున్నాను.
70 ఆ మనుష్యులు చాల తెలివితక్కువ వాళ్లు.
నీ ఉపదేశాలు ధ్యానించటం నాకు ఆనందం.
71 శ్రమపడటం నాకు మంచిది.
నేను నీ న్యాయ చట్టాలు నేర్చుకొన్నాను.
72 యెహోవా, నీ ఉపదేశాలు నాకు మంచివి.
వెయ్యి వెండి, బంగారు నాణెముల కంటే నీ ఉపదేశాలు మంచివి.
సంగీత నాయకునికి: కోరహు కుమారుల కీర్తన.
49 సర్వ దేశములారా, ఇది వినండి.
భూమి మీద నివసించే సకల ప్రజలారా, ఇది వినండి.
2 ప్రతి మనిషి, ధనికులు, దరిద్రులు కలిసి వినాలి.
3 నేను మీకు కొన్ని జ్ఞాన విషయాలు చెబుతాను.
నా ఆలోచనలు బుద్ధినిస్తాయి.
4 సామెతపైనా ఆసక్తినుంచుతాను.
ఇప్పుడు నా సితారాను వాయిస్తూ కథను వివరిస్తాను.
5 అపాయాన్నిగూర్చి నేను భయపడాల్సిన అవసరం నాకేమీ లేదు.
నా దుష్ట శత్రువులు నన్ను చుట్టుముట్టినప్పుడు నేను భయపడాల్సిన కారణం ఏమీ లేదు.
6 ఆ ప్రజలు తమ స్వంత బలాన్ని నమ్మి
తమ ఐశ్వర్యాన్ని గూర్చి గొప్పలు చెప్పుకొంటారు.
7 ఎవడూ తనకు తాను విడుదల చేసుకోలేడు.
నీవు ఒకని జీవితపు వెలను దేవునికి చెల్లించలేవు.
8 ఏ మనిషీ తన సొంత ప్రాణాన్ని కొనుక్కునేందుకు
సరిపడేంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేడు.
9 ఏ మనిషీ శాశ్వతంగా జీవించే హక్కు
కొనుక్కునేందుకు సరిపడేంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేడు,
మరియు తన సొంత శరీరం సమాధిలో కుళ్లిపోకుండా రక్షించుకోలేడు.
10 చూడు, వెఱ్ఱివాళ్లు, బుద్ధిహీనులు చనిపోయినట్టే జ్ఞానులు కూడా చనిపోతారు.
మరియు వారు తమ ఐశ్వర్యమంతటినీ ఇతరులకు విడిచిపెడతారు.
11 శాశ్వతంగా సదాకాలం సమాధి ప్రతి ఒక్కరి గృహంగా ఉంటుంది.
వారికి సొంతంగా ఎంత భూమి ఉన్నా సరే లెక్కలేదు.
12 ధనికులు నిరంతరం జీవించలేరు.
వారు జంతువుల్లా మరణిస్తారు.
13 బుద్ధిహీనులకు, మరియు వారు చెప్పేది
అంగీకరించే వారికి ఇలాగే జరుగుతుంది.
14 మనుష్యులందరూ గొర్రెల్లా ఉన్నారు. సమాధి వారిదొడ్డి.
మరణం వారి కాపరి.
వారి శరీరాలు సమాధిలో కుళ్లిపోయి వ్యర్థమైపోతాయి.
15 కాని దేవుడు విలువ చెల్లించి నా ప్రాణాన్ని విమోచిస్తాడు.
సమాధి శక్తి నుండి ఆయన నన్ను విడుదల చేస్తాడు.
16 మనుష్యుడు కేవలం ధనికుడని వానికి భయపడవద్దు.
వాని ఇంటి ఐశ్వర్యం పెరిగిందని వానికి భయపడవద్దు.
17 ఆ మనుష్యుడు చనిపోయినప్పుడు వాని వెంట వాడేమీ తీసుకొనిపోడు.
వాని ఐశ్వర్యం వానితో సమాధిలోనికి దిగిపోదు.
18 అయినప్పటికీ, అతడు జీవించినంత కాలం సంతోషంగా ఉంటాడు.
ఒక మనుష్యుడు తనకు తాను మంచి చేసికొని పొగడ్తలు పొందినా,
19 అతడు తన పూర్వీకుల వద్దకు వెళ్తాడు.
అతడు ఇక వెలుగును ఎన్నటికి చూడడు.
20 మనుష్యుడు తన వైభవంలో ఎక్కువ కాలం నిలిచియుండలేడు. అతడు నశించే మృగంలాంటి వాడు.
సంగీత నాయకునికి: మాహలతు రాగంలో పాడదగిన దావీదు ధ్యానం.
53 తెలివి తక్కువ వాడు మాత్రమే దేవుడు లేడని తలుస్తాడు.
అలాంటి మనుష్యులు చెడిపోయిన వారు, చెడు విషయాలను చేస్తారు.
సరియైనదాన్ని చేసేవాడు ఒక్కడూ లేడు.
2 నిజంగా దేవుడు పరలోకంలో ఉండి మనల్ని చూస్తూ ఉన్నాడు.
దేవునికొరకు చూసే జ్ఞానంగలవాళ్లు ఎవరైనా ఉన్నారేమో అని
కనుగొనేందుకు దేవుడు చూస్తూ ఉన్నాడు.
3 కాని ప్రతి మనిషీ దేవునికి వ్యతిరేకంగా తిరిగి పోయాడు.
ప్రతి మనిషీ చెడ్డవాడే.
మంచి చేసేవాడు లేడు.
ఒక్కడూ లేడు.
4 దేవుడు చెబుతున్నాడు, “ఆ దుర్మార్గులకు సత్యం బాగా తెలుసు.
కాని వారు నన్ను ప్రార్థించరు.
ఆ దుర్మార్గులు వారి భోజనం తినటానికి ఎంత సిద్ధంగా ఉంటారో నా ప్రజలను నాశనం చేయటానికి కూడ అంత సిద్ధంగా ఉంటారు.”
5 కాని ఆ దుర్మార్గులు ఇంతకు ముందెన్నడూ
భయపడనంతగా భయపడిపోతారు.
ఆ దుర్మార్గులు ఇశ్రాయేలీయులకు శత్రువులు. దేవుడు ఆ దుర్మార్గులను నిరాకరించాడు.
కనుక మీరు వారిని ఓడిస్తారు.
దేవుడు మీ శత్రువుల ఎముకలను చెదరగొట్టేస్తాడు.
6 ఇశ్రాయేలు ప్రజలారా,
సీయోనుకు విజయాన్ని ఎవరిస్తారు?
దేవుడు తన ప్రజలను తిరిగి వర్ధిల్లజేసేటప్పుడు
యాకోబు సంతోషిస్తాడు.
ఇశ్రాయేలు బహుగా ఆనందిస్తాడు.
దేవుడు ఇశ్రాయేలును శిక్షిస్తాడు
8 యాకోబు (ఇశ్రాయేలు) ప్రజలకు విరోధంగా నా ప్రభువు ఒక ఆదేశం ఇచ్చాడు. ఇశ్రాయేలీయులకు విరోధంగా ఇవ్వబడిన ఆదేశానికి విధేయత చూపబడుతుంది. 9 అప్పుడు ఎఫ్రాయింము (ఇశ్రాయేలు)లో ప్రతి వ్యక్తి, చివరికి సమరయ నాయకులు కూడా దేవుడు తమని శిక్షించాడని తెలుసుకొంటారు.
ఇప్పుడు ఆ ప్రజలు చాలా గర్వంగా, అతిశయంగా ఉన్నారు. 10 “ఈ ఇటుకలు పడిపోవచ్చు గాని మేము మళ్లీ నిర్మిస్తాం. ఇంకా గట్టి రాయితో మేము నిర్మిస్తాం. ఈ చిన్న చెట్లు నరికి వేయబడవచ్చును. కానీ మేము అక్కడ క్రొత్త చెట్లు వేస్తాము. ఆ క్రొత్త చెట్లు ఇంకా పెద్దగా, గట్టిగా ఉంటాయి.” అని ఆ ప్రజలు అంటారు.
11 అందుచేత ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసేందుకు యెహోవా మనుష్యుల్ని చూస్తాడు. వారి మీదికి రెజీను శత్రువులను యెహోవా తీసుకొని వస్తాడు. 12 తూర్పు నుండి సిరియన్లను, పడమటినుండి ఫిలిష్తీయులను యెహోవా తీసుకొని వస్తాడు. ఆ శత్రువులు తమ సైన్యాలతో ఇశ్రాయేలును ఓడిస్తారు. కానీ యెహోవా మాత్రం ఇంకా ఇశ్రాయేలు మీద కోపంగానే ఉంటాడు. యెహోవా ఆ ప్రజలను శిక్షించటానికి ఇంకా సిద్ధంగానే ఉంటాడు.
13 దేవుడు ప్రజలను శిక్షిస్తాడు గాని వాళ్లు మాత్రం పాపం చేయటం మానరు. వాళ్లు ఆయన దగ్గరకు మళ్లుకోరు. సర్వశక్తిమంతుడైన యెహోవాను వారు అనుసరించరు. 14 అందుచేత యెహోవా ఇశ్రాయేలీయుల తల, తోక కత్తిరించి వేస్తాడు. కాండాన్ని కొమ్మను కూడ ఒక్క రోజునే యెహోవా నరికి వేస్తాడు. 15 (తల అంటే పెద్దలు ప్రముఖ నాయకులు తోక అంటె అబద్ధాలు చెప్పే ప్రవక్తలు.)
16 ప్రజలను నడిపించే మనుష్యులు వారిని తప్పు త్రోవన నడిపిస్తున్నారు. కనుక వారిని అనుసరించే ప్రజలు నాశనం చేయబడతారు. 17 మనుష్యులు అంతా చెడ్డవాళ్లే. అందుచేత యువకుల విషయం యెహోవాకు సంతోషం లేదు. వారి విధవలకు, అనాధలకు యెహోవా దయ చూపించడు. ఎందుకంటే, ప్రజలంతా చెడ్డవాళ్లే గనుక. దేవునికి విరోధమైన వాటిని మనుష్యులు చేస్తారు. మనుష్యులు అబద్ధాలు చెబుతారు.
అందుచేత దేవుడు మనుష్యులమీద కోపంగానే ఉంటాడు. దేవుడు మనుష్యుల్ని శిక్షిస్తూనే ఉంటాడు.
దుర్బోధకులు
2 కాని పూర్వం ప్రజల మధ్య దొంగ ప్రవక్తలు కూడా ఉండేవాళ్ళు. అదే విధంగా మీ మధ్యకూడా దుర్బోధకులు ఉంటారు. వాళ్ళు నాశనానికి దారితీసే సిద్ధాంతాల్ని రహస్యంగా ప్రవేశపెడుతూ, తమను కొన్న ప్రభువును కూడా కాదంటారు. తద్వారా తమను తాము నాశనం చేసుకుంటారు. ఇది త్వరలోనే జరుగుతుంది. 2 అవమానకరమైన వాళ్ళ పద్దతుల్ని అనేకులు పాటించి సత్యానికే అపకీర్తి తెస్తారు. 3 ఈ దుర్బోధకులు తమలో ఉన్న అత్యాశలవల్ల తాము సృష్టించిన కథలతో తమ స్వలాభం కొరకు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. దేవుడు వాళ్ళకు విధించిన శిక్ష చాలాకాలం నుండి వాళ్ళ కోసం కాచుకొని ఉంది. రానున్న ఆ వినాశనం ఆగదు.
4 దేవుడు పాపం చేసిన దేవదూతల్ని కూడా విడిచిపెట్టకుండా నరకంలో[a] వేసాడు. తీర్పు చెప్పే రోజుదాకా అక్కడ వాళ్ళను అంధకారంలో బంధించి ఉంచుతాడు.
5 దేవుడు పురాతన ప్రపంచంపై సానుభూతి చూపలేదు. దుర్మార్గులైన ఆనాటి ప్రజలమీదికి ప్రళయం రప్పించాడు. నీతిని బోధించిన నోవహు, మిగతా ఏడుగురు తప్ప అందరూ నాశనమైపొయ్యారు.
6 దుర్మార్గులకు ఏమి సంభవిస్తుందో చూపడానికి దేవుడు సొదొమ, గొమొఱ్ఱా పట్టణాలను భస్మం చేసి వాటిని ఉదాహరణలుగా చూపించాడు. 7 కాని దేవుడు నీతిమంతుడైన లోతును రక్షించాడు. ప్రజలు అరాచకంగా, అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండటంవల్ల లోతు చాలా బాధపడ్తూ ఉండేవాడు. 8 ఆ నీతిమంతుడు దుర్మార్గుల మధ్య ప్రతిరోజూ నివసిస్తూ, వాళ్ళ దుష్ప్రవర్తనల్ని చూస్తూ, వింటూ ఉండేవాడు. వాళ్ళు చేస్తున్న దుష్ట పనులు చూసి అతని హృదయం తరుక్కుపోయేది.
9 విశ్వాసుల్ని పాపాలు చేయకుండా చేసి ఎలా కాపాడుకోవాలో ఆ ప్రభువుకు తెలుసు. తీర్పు చెప్పే రోజుదాకా దుర్మార్గుల్ని ఎలా శిక్షిస్తూ ఉండాలో కూడా ఆ ప్రభువుకు తెలుసు. 10 అధికారాన్నుల్లంఘిస్తూ, అసహ్యకరమైన ఐహిక వాంఛల్ని తీర్చుకుంటూ గర్వాంధులై పరలోక నివాసుల్ని దూషించటానికి భయపడనివాళ్ళ విషయంలో యిది ముఖ్యంగా నిజమౌతుంది.
ఇలాంటి దుర్బోధకులు ధైర్యంగా గర్వంతో గొప్పవాళ్ళను దూషిస్తారు.
యోహాను బోధించటం
(మత్తయి 3:1-12; లూకా 3:1-9, 15-17; యోహాను 1:19-28)
1 దేవుని కుమారుడైన[a] యేసు క్రీస్తును గురించి సువార్త ప్రారంభం. 2 యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“ఇతడు నా దూత. ఇతణ్ణి నీకన్నా ముందు పంపుతాను,
ఇతడు నీ కోసం దారి సిద్ధం చేస్తాడు.”(A)
3 “‘ప్రభువు మార్గాన్ని సిద్ధం చేయుము,
అతని కోసం చక్కటిదారుల్ని, వేయుము’
అని అరణ్య ప్రాంతంలో ఒక వ్యక్తి కేక వేయుచున్నాడు.”(B)
4 కనుక యోహాను ప్రజలకు ఎడారి ప్రాంతంలో బాప్తిస్మమిచ్చాడు. పాపపరిహారార్థం మారుమనస్సు పొందటం, బాప్తిస్మము పొందటం అవసరమని వాళ్ళకు ప్రకటించాడు. 5 యూదయ దేశంలోని ప్రజలు, యెరూషలేములోని ప్రజలు అతని దగ్గరకు వెళ్ళారు. తాము చేసిన పాపాలను చెప్పుకొన్నారు. అతడు వాళ్ళకు యొర్దాను నదిలో బాప్తిస్మం[b] ఇచ్చాడు.
6 యోహాను ఒంటె వెంట్రుకలతో చేసిన దుస్తుల్ని వేసుకొనేవాడు. నడుముకు తోలుదట్టి కట్టుకొనేవాడు. మిడుతల్ని, అడవి తేనెను తింటూ జీవించేవాడు.
7 అతడు ప్రకటించిన సందేశం ఇది, “నా తర్వాత నాకన్నా శక్తివంతుడైన వాడు వస్తాడు. నేను వంగి అతని చెప్పులు విప్పే అర్హత కూడా నాకు లేదు. 8 నేను మీకు నీళ్ళతో బాప్తిస్మము యిస్తున్నాను. కాని ఆయన మీకు పవిత్రాత్మతో బాప్తిస్మమిస్తాడు.”
© 1997 Bible League International