Book of Common Prayer
ఎజ్రాహివాడైన ఏతాను ధ్యానగీతం.
89 యెహోవా ప్రేమను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతాను.
ఆయన నమ్మకత్వం గూర్చి శాశ్వతంగా, ఎప్పటికీ నేను పాడుతాను!
2 యెహోవా, నీ ప్రేమ శాశ్వతంగా నిలుస్తుందని నేను నిజంగా నమ్ముతాను.
నీ నమ్మకత్వం ఆకాశాలవలె కొనసాగుతుంది!
3 దేవుడు చెప్పాడు, “నేను ఏర్పరచుకొన్న రాజుతో నేను ఒడంబడిక చేసుకొన్నాను.
నా సేవకుడైన దావీదుకు నేను ఒక వాగ్దానం చేసాను.
4 ‘దావీదూ, నీ వంశం శాశ్వతంగా కొనసాగేట్టు నేను చేస్తాను.
నీ రాజ్యాన్ని శాశ్వతంగా ఎప్పటికీ నేను కొనసాగింపజేస్తాను.’”
5 యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి ఆకాశాలు స్తుతిస్తున్నాయి.
పరిశుద్ధుల సమాజం నీ నమ్మకత్వం గూర్చి పాడుతుంది.
6 పరలోకంలో ఎవ్వరూ యెహోవాకు సమానులు కారు.
“దేవుళ్లు” ఎవ్వరూ యెహోవాకు సాటికారు.
7 యెహోవా పరిశుద్ధ దూతలను కలిసినప్పుడు
ఆ దేవ దూతలు భయపడి యెహోవాను గౌరవిస్తారు.
వారు ఆయన పట్ల భయముతో నిలబడుతారు.
8 సర్వశక్తిమంతుడైన యెహోవా, దేవా, నీ అంతటి శక్తిగలవారు ఒక్కరూ లేరు.
మేము నిన్ను పూర్తిగా నమ్మగలము.
9 ఉప్పొంగే మహా సముద్రపు అలలపై నీవు అధికారం చేస్తావు.
దాని కోపపు అలలను నీవు నిమ్మళింప జేయగలవు.
10 దేవా, నీవు రహబును[a] ఓడించావు.
నీ మహా శక్తితో, నీవు నీ శత్రువును ఓడించావు.
11 దేవా, ఆకాశంలోనూ, భూమి మీదనూ ఉన్న సర్వం నీదే.
ప్రపంచాన్నీ, అందులో ఉన్న సర్వాన్నీ నీవు చేశావు.
12 ఉత్తర దక్షిణాలను నీవే సృష్టించావు.
తాబోరు పర్వతం, హెర్మోను పర్వతం నీ నామాన్ని కీర్తిస్తాయి. స్తుతి పాడుతాయి.
13 దేవా, నీకు శక్తి ఉంది!
నీ శక్తి గొప్పది!
విజయం నీదే!
14 సత్యం, న్యాయం మీద నీ రాజ్యం కట్టబడింది.
ప్రేమ, నమ్మకత్వం నీ సింహాసనం ఎదుట సేవకులు.
15 దేవా, నమ్మకమైన నీ అనుచరులు నిజంగా సంతోషంగా ఉన్నారు.
వారు నీ దయ వెలుగులో జీవిస్తారు.
16 నీ నామం వారిని ఎల్లప్పుడూ సంతోష పరుస్తుంది.
వారు నీ మంచితనాన్ని స్తుతిస్తారు.
17 నీవే వారి అద్భుత శక్తివి,
వారి శక్తి నీ నుండే లభిస్తుంది.
18 యెహోవా, నీవే మమ్మల్ని కాపాడేవాడవు.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు మా రాజు.
19 కనుక నిజమైన నీ అనుచరులతో దర్శనంలో నీవు మాట్లాడావు.
నీవు చెప్పావు: “ప్రజల్లోనుండి నేను ఒక యువకుని ఏర్పాటు చేసికొన్నాను.
ఆ యువకుని నేను ప్రముఖుణ్ణి చేసాను. నేను యుద్ధ వీరునికి శక్తిని అనుగ్రహించాను.
20 నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను.
నా ప్రత్యేక తైలంతో నేను అతన్ని అభిషేకించాను.
21 నా కుడిచేతితో నేను దావీదును బలపరచాను.
మరి నా శక్తితో నేను అతన్ని బలముగల వానిగా చేశాను.
22 ఏర్పాటు చేసికోబడిన రాజును శత్రువు ఓడించలేకపోయాడు.
దుర్మార్గులు అతన్ని ఓడించలేక పోయారు.
23 అతని శత్రువులను నేను అంతం చేసాను.
ఏర్పరచబడిన రాజును ద్వేషించిన వారిని నేను ఓడించాను.
24 ఏర్పరచబడిన రాజును నేను ఎల్లప్పుడూ ప్రేమిస్తాను. బలపరుస్తాను.
నేను ఎల్లప్పుడూ అతన్ని బలవంతునిగా చేస్తాను.
25 ఏర్పరచబడిన నా రాజును సముద్రం మీద నాయకునిగా ఉంచుతాను.
నదులను అతడు అదుపులో ఉంచుతాడు.
26 ‘నీవు నా తండ్రివి నీవు నా దేవుడవు, నా బండవు, నా రక్షకుడవు’
అని అతడు నాతో చెబుతాడు.
27 మరి నేను అతనిని నా ప్రథమ సంతానంగా చేసుకొంటాను.
భూరాజులకంటె అతడు ఉన్నతంగా చేయబడుతాడు.
28 ఏర్పరచబడిన రాజును నా ప్రేమ శాశ్వతంగా కాపాడుతుంది.
అతనితో నా ఒడంబడిక ఎప్పటికీ అంతంకాదు.
29 అతని వంశం శాశ్వతంగా కొనసాగుతుంది.
ఆకాశాలు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.
15 సత్యం పోయింది.
మంచి జరిగించాలనుకొనే మనుష్యులు దోచుకోబడ్డారు.
యెహోవా చూశాడు, కానీ మంచితనం ఏమీ ఆయనకు కనబడలేదు. ఇది
యెహోవాకు ఇష్టం కాలేదు.
16 యెహోవా చూశాడు.
నిలిచి, ప్రజలకు సహాయం చేసే వ్యక్తి ఒక్కడూ ఆయనకు కనిపించలేదు.
కనుక యెహోవా తన స్వంత శక్తి, తన స్వంత మంచితనం ప్రయోగించాడు.
మరియు యెహోవా ప్రజలను రక్షించాడు.
17 యెహోవా యుద్ధానికి సిద్ధమయ్యాడు.
యెహోవా మంచితనాన్ని ఒక కవచంలా కప్పుకొన్నాడు.
రక్షణ శిరస్త్రాణం ధరించాడు.
శిక్షను వస్త్రాలుగా ధరించాడు.
బలీయమైన ప్రేమ అంగీ ధరించాడు.
18 యెహోవా తన శత్రువుల మీద కోపంగా ఉన్నాడు
కనుక వారికి తగిన శిక్షను యెహోవా వారికి ఇస్తాడు.
యెహోవా తన శత్రువులమీద కోపంగా ఉన్నాడు.
కనుక దూరస్థలాలు అన్నింటిలోను ప్రజలను యెహోవా శిక్షిస్తాడు. వారికి తగిన శిక్షను యెహోవా వారికి ఇస్తాడు.
19 అప్పుడు పశ్చిమాన ప్రజలు యెహోవా నామాన్ని గౌరవిస్తారు. తూర్పున ప్రజలు యెహోవా మహిమను గూర్చి భయపడతారు.
వేగంగా ప్రవహించే ఒక నదిలా యెహోవా వెంటనే వస్తాడు.
యెహోవా ఈ నదిమీద విసరగా వచ్చిన శక్తివంతమైన గాలిలా అది ఉంటుంది.
20 అప్పుడు సీయోనుకు ఒక రక్షకుడు వస్తాడు.
పాపం చేసినప్పటికి, తిరిగి దేవుని దగ్గరకు వచ్చిన యాకోబు ప్రజల దగ్గరకు ఆయన వస్తాడు.
21 “ఆ ప్రజలతో నేను ఒక ఒడంబడిక చేసుకుంటాను. నీ నోట నేను ఉంచే నా ఆత్మ, నా మాటలు నిన్ను ఎన్నడూ విడిచిపోవు అని నేను ప్రమాణం చేస్తున్నాను. నీ పిల్లలతోను, నీ పిల్లల పిల్లలతోను అవి ఉంటాయి. అవి ఇప్పుడు, ఎల్లప్పుడు నీతో ఉంటాయి” అని యెహోవా చెబుతున్నాడు.
నిస్వార్థంగా నుండుటకు క్రీస్తునుండి నేర్చుకొనండి
5 యేసు క్రీస్తులో ఉన్న మనస్సును పెంచుకోండి.
6 ఆయన దేవునితో సమానము.
అయినా ఆయన ఆ స్థానాన్ని పట్టుకొని కూర్చోవాలనుకోలేదు.
7 ఆయన అంతా వదులుకొన్నాడు.
మానవ రూపం దాల్చి సేవకునివలే ఉండటానికి వచ్చాడు.
8 మానవుని వలే కనిపిస్తూ, వినయంగా వుంటూ,
మరణాన్ని కూడా విధేయతగా అంగీకరించి, సిలువపై మరణించాడు.
9 అందువల్ల దేవుడాయనకు ఉన్నత స్థానం ఇచ్చి
అన్ని పేర్లకన్నా ఉత్తమమైన పేరు యిచ్చాడు.
10 యేసు పేరు విన్నప్పుడు పరలోకంలో, భూలోకంలో, పాతాళలోకంలో
ఉన్నవాళ్ళంతా ఆయన ముందు మోకరిల్లాలని ఈ విధంగా చేసాడు.
11 ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని అంగీకరించాలని ఈ విధంగా చేసాడు.
తండ్రియైన దేవునికి మహిమ కలుగుగాక!
© 1997 Bible League International