Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
లూకా 1:46-55

మరియ పాడిన భక్తి గీతం

46 మరియ ఈ విధంగా అన్నది:

47 “నా ఆత్మ ప్రభువును కొలిచింది.
    దేవుడు చేసిన ఈ మంచికి నా మనస్సు ఆనందం పొందింది. ఆయనే నా రక్షకుడు.
48 దీనురాల్ని నేను!
    ఆయన దాసీని నేను, నన్ను కరుణించాడు!
ఇకనుండి అందరూ
    నన్ను ధన్యురాలంటారు!
49 దేవుడు సర్వశక్తి సంపన్నుడు.
    ఆయన నాకు ఎంతో మంచి చేశాడు! ఆయన నామం పవిత్రం!
50 తనంటే భయపడే వాళ్ళపై తరతరాలు దయ చూపుతాడు.
51 తన బలమైన హస్తాన్ని జాపి
    గర్వించే వాళ్ళను వాళ్ళ ఆలోచనల్ని అణిచి వేస్తాడు.
52 రాజుల్ని, వాళ్ళ సింహాసనాల నుండి దింపి వేస్తాడు.
    దీనులకు గొప్ప స్థానాలిస్తాడు.
53 పేదవాళ్ళ అవసరాలన్నీ తీరుస్తాడు.
    ధనవంతుల్ని వట్టి చేతుల్తో పంపేస్తాడు.
54 తరతరాల నుండి మన పూర్వీకులతో, అబ్రాహాముతో,
    అతని సంతతితో చెప్పినట్లు
55 దేవుని ఇష్టానుసారం జీవించిన ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేశాడు. మరవకుండా వాళ్ళపై దయ చూపాడు.”

2 సమూయేలు 7:18

దావీదు దేవుని ప్రార్థించటం

18 పిమ్మట దావీదు రాజు లోనికి వెళ్లి యెహోవా ముందు కూర్చున్నాడు. దావీదు ప్రార్థనా పూర్వకంగా యెహోవాతో ఇలా విన్నవించుకున్నాడు,

“యెహోవా, నా దేవా, నీకు నేనెందుకంత ముఖ్యుడనయ్యాను? నా కుటుంబం ఎందుకంత ప్రాముఖ్యం గలదయ్యింది? నన్నెందుకు అంత ముఖ్యమైన వాణ్ణిచేశావు?

2 సమూయేలు 7:23-29

23 “ఇశ్రాయేలీయులైన నీ ప్రజలవలె మరో జనం ఈ భూమిమీద లేదు. ఆ ప్రజలు అసాధారణమైన వారు. వారు ఈజిప్టులో బానిసలయ్యారు. కాని నీవు వారిని విముక్తి చేసి తీసుకొని వచ్చావు. వారిని నీ ప్రజలుగా చేశావు. ఇశ్రాయేలీయుల కొరకు నీవు గొప్పవైన, అద్భుతమైన క్రియలు నెరవేర్చావు. నీ దేశంకొరకు ఆశ్చర్యకరమైన పనులు చేశావు. 24 ఇశ్రాయేలు ప్రజలను శాశ్వతంగా నీకు అతి సన్నిహితులైన స్వంత ప్రజలుగా చేసుకున్నావు. యెహోవా, నీవు వారి పవిత్ర దేవుడవు.

25 “ప్రభువైన దేవా! ఇప్పుడు నీవు నీ సేవకుడినైన నా నిమిత్తం, మరియు నా కుటుంబం నిమిత్తం ఈ సంగతులు చేసెదనని వాగ్దానము చేసియున్నావు. నీవిచ్చిన వాగ్దానాలు శాశ్వతంగా నిజమయ్యేలా చేయుము! నా కుటుంబాన్ని శాశ్వతంగా ఒక రాజ కుటుంబంగా చేయుము. 26 అప్పుడు నీ నామము మహిమాన్వితం చేయబడుతుంది. ప్రజలంతా, ‘సర్వశక్తిగల యెహోవా, ఇశ్రాయేలును పరిపాలించు దేవుడు. తన సేవకుడైన దావీదు కుటుంబం ఆయన సేవలో బలముతో కొనసాగుతుంది’ అని అందురు.

27 “సర్వశక్తిమంతుడవైన యెహోవా! ఇశ్రాయేలీయుల దేవా నాకు చాలా విషయాలు విశదం చేశావు. ‘నా వంశాభివృద్దికి నీ ఆశీస్సులిచ్చావు.’ నీ సేవకుడనైన నేను అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 28 యెహోవా, నా దేవా! నీవే దేవునివి. నీవి సత్యవాక్కులు. నీ సేవకుడనైన నాకు ఈ మంచి విషయాలన్నీ వాగ్దానం చేశావు. 29 దయచేసి నా కుటుంబాన్ని దీవించు. నీ ముందు దానిని ఎల్లప్పుడూ వర్ధిల్లేలా చేయుము. యెహోవా, నా దేవా! నీవీ అద్భుత విషయాలు చెప్పావు. నీ దీవెనతో నా కుటుంబం ఎల్లప్పుడూ ఆశీర్వదింపబడియుండు గాక!”

గలతీయులకు 3:6-14

అబ్రాహామును పరిశీలించండి. “అతడు దేవుణ్ణి విశ్వసించాడు. కనుక దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు.”(A) కనుక విశ్వాసమున్న వాళ్ళే అబ్రాహాము కుమారులని గ్రహించండి. యూదులు కానివాళ్ళను దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా నిర్ణయిస్తాడని లేఖనాలు వ్రాసినవాళ్ళు దివ్యదృష్టితో చూసి చెప్పారు. ఈ విషయాన్ని దేవుడు అబ్రాహాముతో, “అన్ని జనముల వారు నీ కారణంగా ధన్యులౌతారు!”(B) అని ముందే చెప్పాడు. కనుక అబ్రాహాము విశ్వసించి ధన్యుడయ్యాడు. అదే విధంగా అతని వలె విశ్వసించిన వాళ్ళు కూడా ధన్యులౌతారు.

10 ధర్మశాస్త్రంపై ఆధారపడిన వాళ్ళందరి మీద శాపం ఉంది. “ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని అన్ని వేళలా ఆచరిస్తూ జీవించని వాడు దేవుని శాపానికి గురి ఔతాడు”(C) అని వ్రాయబడి ఉంది. 11 ధర్మశాస్త్రం ద్వారా దేవుడు ఎవ్వరినీ నీతిమంతునిగా చెయ్యడని మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే, “విశ్వాసం ద్వారా నీతిమంతుడైనవాడు అనంతజీవితం పొందుతాడు”[a] అని ప్రవచనంలో వ్రాయబడి ఉంది.

12 ధర్మశాస్త్రానికి విశ్వాసం పునాది కాదు. పైగా, “ధర్మశాస్త్రం చెప్పినట్లు అన్నీ చేసినవాడు మాత్రమే అనంత జీవితం పొందుతాడు”[b] అని వ్రాయబడి ఉంది. 13 “చెట్టుకు వ్రేలాడవేయబడిన ప్రతి ఒక్కడూ శాపగ్రస్తుడు!”(D) అని ధర్మశాస్త్రంలో వ్రాయబడింది. కనుక మనకు ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విముక్తి కలిగించాలని క్రీస్తు ఆ శాపానికి గురి అయ్యాడు. 14 దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానం తన ద్వారా యూదులు కానివాళ్ళకు కూడా లభించాలని క్రీస్తు మనకు విముక్తి కలిగించాడు. వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ మనకు విశ్వాసం ద్వారా లభించాలని ఆయన ఉద్దేశ్యం.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International