Revised Common Lectionary (Semicontinuous)
దేవుడు తన ప్రజలను ఓదారుస్తాడు
35 ఎండిన అరణ్యం సంతోషిస్తుంది. అరణ్యం ఉల్లసించి, కస్తూరి పుష్పంలా పూస్తుంది. 2 అరణ్యం వికసించే పూలతో నిండిపోయి దాని సంతోషాన్ని వ్యక్తం చేయటం మొదలు పెడ్తుంది. అరణ్యం ఆనందంతో నాట్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది. లెబానోను అరణ్యంలా, కర్మెలు పర్వతంలా, షారోనులోయలా అరణ్యం సౌందర్యంగా ఉంటుంది. ప్రజలంతా యెహోవా మహిమ[a] చూస్తారు గనుక ఇలా జరుగుతుంది. ప్రజలు మన యెహోవా మాహాత్మ్యం చూస్తారు.
3 బలహీనమైన చేతుల్ని మళ్లీ బలపర్చండి. బలహీనమైన మోకాళ్లను బలపర్చండి. 4 ప్రజలు భయంతో, కలవరపడుతున్నారు. “బలంగా ఉండండి, భయపడవద్దు” అని ఆ మనుష్యులతో చెప్పండి. చూడండి, మీ దేవుడు వచ్చి, మీ శత్రువులను శిక్షిస్తాడు. ఆయన వచ్చి మీ బహుమానం మీకు ఇస్తాడు. యెహోవా మిమ్మల్ని రక్షిస్తాడు. 5 అప్పుడు గుడ్డివాళ్లు మళ్లీ చూస్తారు. వారి నేత్రాలు తెరువబడతాయి. అప్పుడు చెవిటివాళ్లు వినగలుగుతారు. వారి చెవులు తెరువబడుతాయి. 6 కుంటివాళ్లు లేడిలా గంతులు వేస్తారు. ఇప్పుడు మాట్లాడలేని మూగవాళ్లు, వారి కంఠం ఎత్తి ఆనంద గీతాలు పాడుతారు. అరణ్యంలో జల ఊటలు పారటం మొదలైనప్పుడు ఇది జరుగుతుంది. ఎండిన భూమిలో నీటి ఊటలు ప్రవహిస్తాయి. 7 ఇప్పుడు నీళ్లలా కనిపించే ఎండమావుల్ని ప్రజలు చూస్తున్నారు. కానీ ఆ సమయంలో నిజంగానే నీళ్ల కొలనులు ఉంటాయి. ఎండిన భూమిలో బావులు ఉంటాయి. భూమిలో నుండి నీళ్లు ఉబుకుతాయి. ఒకప్పుడు అడవిమృగాలు ఏలిన చోట ఎత్తయిన నీటి మొక్కలు పెరుగుతాయి.
8 ఆ సమయంలో అక్కడ ఒక రాజమార్గం ఉంటుంది. ఈ రాజమార్గం “పవిత్ర రాజమార్గం” అని పిలువబడుతుంది. ఆ రాజమార్గంలో చెడ్డవాళ్లను నడవనీయరు. తెలివి తక్కువ వాళ్లెవరూ ఆ మార్గానికి వెళ్లరు. మంచివాళ్లు మాత్రమే ఆ మార్గంలో వెళ్తారు. 9 ఆ మార్గంలో అపాయాలు ఏమీ ఉండవు. ప్రజలకు హానిచేసేందుకు ఆ మార్గంలో సింహాలు ఉండవు. ప్రమాదకరమైన జంతువులు ఏమీ ఆ మార్గంలో ఉండవు. ఆ మార్గం దేవుడు రక్షించే ప్రజలకోసమే ఉంటుంది.
10 దేవుడు తన ప్రజలను స్వతంత్రులను చేస్తాడు. ఆ ప్రజలు ఆయన దగ్గరకు తిరిగి వస్తారు. ప్రజలు సీయోను లోనికి వచ్చినప్పుడు సంతోషిస్తారు. ఆ ప్రజలు ఎప్పటికీ సంతోషంగా ఉంటారు. వారి సంతోషం వారి తలల మీద ఒక కిరీటంలా ఉంటుంది. వారి సంతోషం, ఆనందం వారిని సంపూర్ణంగా నింపేస్తాయి. విచారం, దుఃఖం దూరదూరాలకు పారిపోతాయి.
5 సహాయం కోసం దేవుణ్ణి అడిగేవారు చాలా సంతోషంగా ఉంటారు.
ఆ మనుష్యులు వారి దేవుడైన యెహోవా మీద ఆధారపడతారు.
6 భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.
సముద్రాన్నీ, అందులో ఉన్న సమస్తాన్నీ యెహోవా చేశాడు.
యెహోవా వాటిని శాశ్వతంగా కాపాడుతాడు.
7 అణచివేయబడిన ప్రజలకు యెహోవా సరియైన సహాయం చేస్తాడు.
ఆకలితో ఉన్న ప్రజలకు దేవుడు ఆహారం ఇస్తాడు.
చెరలోవున్న ప్రజలను యెహోవా విడుదల చేస్తాడు.
8 గుడ్డివారు మరల చూచుటకు యెహోవా సహాయం చేస్తాడు.
కష్టంలో ఉన్న ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు.
మంచి మనుష్యులను యెహోవా ప్రేమిస్తాడు.
9 మన దేశంలో నివసిస్తున్న పరాయి వాళ్లను యెహోవా కాపాడుతాడు.
విధవరాండ్రు, అనాథల విషయమై యెహోవా శ్రద్ధ తీసికొంటాడు.
అయితే దుర్మార్గుల పథకాలను యెహోవా నాశనం చేస్తాడు.
10 యెహోవా శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
సీయోనూ, నీ దేవుడు శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
యెహోవాను స్తుతించండి!
మరియ పాడిన భక్తి గీతం
46 మరియ ఈ విధంగా అన్నది:
47 “నా ఆత్మ ప్రభువును కొలిచింది.
దేవుడు చేసిన ఈ మంచికి నా మనస్సు ఆనందం పొందింది. ఆయనే నా రక్షకుడు.
48 దీనురాల్ని నేను!
ఆయన దాసీని నేను, నన్ను కరుణించాడు!
ఇకనుండి అందరూ
నన్ను ధన్యురాలంటారు!
49 దేవుడు సర్వశక్తి సంపన్నుడు.
ఆయన నాకు ఎంతో మంచి చేశాడు! ఆయన నామం పవిత్రం!
50 తనంటే భయపడే వాళ్ళపై తరతరాలు దయ చూపుతాడు.
51 తన బలమైన హస్తాన్ని జాపి
గర్వించే వాళ్ళను వాళ్ళ ఆలోచనల్ని అణిచి వేస్తాడు.
52 రాజుల్ని, వాళ్ళ సింహాసనాల నుండి దింపి వేస్తాడు.
దీనులకు గొప్ప స్థానాలిస్తాడు.
53 పేదవాళ్ళ అవసరాలన్నీ తీరుస్తాడు.
ధనవంతుల్ని వట్టి చేతుల్తో పంపేస్తాడు.
54 తరతరాల నుండి మన పూర్వీకులతో, అబ్రాహాముతో,
అతని సంతతితో చెప్పినట్లు
55 దేవుని ఇష్టానుసారం జీవించిన ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేశాడు. మరవకుండా వాళ్ళపై దయ చూపాడు.”
సహనము
7 అందువల్ల సోదరులారా! ప్రభువు వచ్చే వరకు సహనంతో ఉండండి. రైతు పొలం నుండి వచ్చే విలువైన పంటకోసం ఏ విధంగా కాచుకొని ఉంటాడో గమనించండి. అతడు, తొలకరి కడవరి వర్షం దాకా సహనంతో కాచుకొని ఉంటాడు. 8 ప్రభువు రానున్న సమయం సమీపిస్తోంది. కనుక ధైర్యం చెడకుండా సహనంతో ఉండండి. 9 సోదరులారా! ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోకండి. అలా చేస్తే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆ న్యాయాధిపతి మీ తలుపు ముందు నిలుచున్నాడు.
10 సోదరులారా! ప్రభువు పక్షాన మాట్లాడిన ప్రవక్తలు కష్టాలు అనుభవించారు. వాళ్ళలో సహనం ఉంది. వాళ్ళను ఆదర్శంగా తీసుకోండి.
2 కారాగారంలోవున్న యోహాను క్రీస్తు చేస్తున్న వాటిని గురించి విన్నాడు. అతడు తన శిష్యుల్ని యేసు దగ్గరకు పంపి, 3 వాళ్ళ ద్వారా, “రావలసిన వాడవు నువ్వేనా? లేక మరెవరికోసమైనా మేము ఎదురు చూడాలా?” అని అడిగించాడు.
4 యేసు, “మీరు విన్నవాటిని గురించి, చూసిన వాటిని గురించి వెళ్ళి యోహానుకు చెప్పండి. 5 గ్రుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారని, కుంటివాళ్ళు నడువ గలుగుతున్నారని, కుష్టురోగులకు నయమైపోతోందని, చెవిటి వాళ్ళు వినగలుగుతున్నారని, చనిపోయిన వాళ్ళు బ్రతికి వస్తున్నారని, సువార్త పేదవాళ్ళకు ప్రకటింపబడుతోందని చెప్పండి. 6 నా విషయంలో అనుమానం చెందనివాడు ధన్యుడు” అని సమాధానం చెప్పాడు.
7 యోహాను శిష్యులు వెళ్తూ ఉంటే, యేసు యోహానును గురించి అక్కడున్న ప్రజలతో ఇలా మాట్లాడటం మొదలు పెట్టాడు: “ఎడారి ప్రాంతాల్లోకి ఏం చూడాలని వెళ్ళారు? గాలికి కొట్టుకొనే రెల్లును చూడాలని వెళ్ళారా? 8 మరి ఏం చూడాలని వెళ్ళారు? మంచి దుస్తులు వేసుకొన్న మనిషిని చూడాలని వెళ్ళారా? మంచి దుస్తులు వేసుకొన్న వాళ్ళు రాజభవనంలో నివసిస్తారు. 9 మరి, ఏం చూడాలని వెళ్ళారు? ప్రవక్తనా? అవును, యోహాను ప్రవక్త కన్నా గొప్పవాడని నేను చెబుతున్నాను. 10 అతణ్ణి గురించి ఈ విధంగా వ్రాసారు:
‘నీ కన్నా ముందు నా దూతను పంపుతాను,
అతడు నీ కన్నా ముందు వెళ్ళి నీ మార్గాన్ని సిద్ధం చేస్తాడు.’(A)
11 “ఇది సత్యం. ఇదివరకు జన్మించిన వాళ్ళలో బాప్తిస్మము ఇచ్చే యోహాను కన్నా గొప్పవాడు లేడు. అయినా దేవుని రాజ్యంలో అత్యల్పుడు యోహాను కన్నా గొప్పవానిగా పరిగణింపబడతాడు.
© 1997 Bible League International