Revised Common Lectionary (Semicontinuous)
దావీదు కీర్తన.
27 యెహోవా, నీవే నా వెలుగు, నా రక్షకుడవు.
నేను ఎవరిని గూర్చి భయపడనక్కర్లేదు.
యెహోవా, నీవే నా జీవిత క్షేమస్థానం.
కనుక నేను ఎవరికి భయపడను.
2 దుర్మార్గులు నా మీద దాడి చేయవచ్చు.
వారు నా శరీరాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించవచ్చు.
వారు నా శత్రువులు, విరోధులు.
వారు కాలు తప్పి పడిపోదురు.
3 అయితే నా చుట్టూరా సైన్యం ఉన్నప్పటికీ నేను భయపడను.
యుద్ధంలో ప్రజలు నామీద విరుచుకు పడ్డప్పటికీ నేను భయపడను. ఎందుకంటే నేను యెహోవాను నమ్ముకొన్నాను.
4 యెహోవా నాకు అనుగ్రహించాలని నేను ఆయనను అడిగేది ఒకే ఒకటి ఉంది.
నేను అడిగేది ఇదే:
“నా జీవిత కాలం అంతా నన్ను యెహోవా ఆలయంలో కూర్చుండనిచ్చుట.
ఆయన రాజ భవనాన్ని నన్ను సందర్శించనిచ్చుట.
యెహోవా సౌందర్యాన్ని నన్ను చూడనిమ్ము.”
5 నేను ఆపదలో ఉన్నప్పుడు యెహోవా నన్ను కాపాడుతాడు.
ఆయన తన గుడారంలో నన్ను దాచిపెడతాడు.
ఆయన తన క్షేమ స్థానానికి నన్ను తీసుకొని వెళ్తాడు.
6 నా శత్రువులు నన్ను చుట్టుముట్టేశారు. కాని ఇప్పుడు వారిని ఓడించటానికి యెహోవా నాకు సహాయం చేస్తాడు.
అప్పుడు నేను ఆయన గుడారంలో బలులు అర్పిస్తాను. సంతోషంతో కేకలు వేస్తూ ఆ బలులు నేను అర్పిస్తాను.
యెహోవాను ఘనపరచుటకు నేను వాద్యం వాయిస్తూ గానం చేస్తాను.
7 యెహోవా, నా స్వరం ఆలకించి నాకు జవాబు ఇమ్ము.
నా మీద దయ చూపించుము.
8 యెహోవా, నా హృదయం నిన్ను గూర్చి మాట్లాడమంటున్నది.
వెళ్లు, నీ యెహోవాను ఆరాధించమంటున్నది అందువల్ల యెహోవా నేను నిన్ను ఆరాధించటానికి వచ్చాను.
9 యెహోవా, నా దగ్గర్నుండి తిరిగిపోకుము.
కోపగించవద్దు, నీ సేవకుని దగ్గర్నుండి తిరిగి వెళ్లిపోవద్దు.
నీవు నాకు సహాయమైయున్నావు, నన్ను త్రోసివేయకుము. నన్ను విడిచిపెట్టవద్దు. నా దేవా, నీవు నా రక్షకుడవు.
10 నా తల్లి, నా తండ్రి నన్ను విడిచిపెట్టారు.
అయితే యెహోవా నన్ను తీసుకొని, తన వానిగా చేసాడు.
11 యెహోవా, నాకు శత్రువులు ఉన్నారు, కనుక నాకు నీ మార్గాలు నేర్పించుము.
సరైన వాటిని చేయటం నాకు నేర్పించుము.
12 నా శత్రువుల కోరికకు నన్నప్పగించవద్దు.
నన్ను గూర్చి వాళ్లు అబద్ధాలు చెప్పారు. నాకు హాని కలిగించేందుకు వాళ్లు అబద్ధాలు చెప్పారు.
13 నేను చనిపోక ముందు యెహోవా మంచితనాన్ని నేను చూస్తానని
నిజంగా నేను నమ్ముచున్నాను.
14 యెహోవా సహాయం కోసం కనిపెట్టి ఉండుము.
బలంగా, ధైర్యంగా ఉండుము.
యెహోవా సహాయం కోసం కనిపెట్టుము.
7 మంచి వాళ్లకు నిజాయితీయే జీవన విధానం
మంచి మనుష్యులు సూటి సత్య మార్గం అవలంబిస్తారు.
మరియు దేవా, ఆ మార్గాన్ని అనుసరించటానికి
దానిని నీవు తేలికగా మృదువుగా చేస్తావు.
8 కానీ యెహోవా, మేము నీ న్యాయ మార్గం కోసం ఎదురు చూస్తున్నాం.
నిన్ను, నీ నామాన్ని మా ఆత్మలు జ్ఞాపకం చేసుకోవాలని ఆశిస్తున్నాయి.
9 నా ఆత్మ రాత్రిపూట నీతో ఉండాలని ఆశిస్తుంది.
ప్రతి నూతన దినపు సంధ్యా సమయంలో నీతో ఉండాలని నా ఆత్మ నాలో కోరుతుంది.
దేశంలోనికి నీ న్యాయ మార్గం వచ్చినప్పుడు
ప్రజలు సరైన జీవన విధానం నేర్చుకొంటారు.
10 చెడ్డవాడికి నీవు దయ మాత్రమే చూపిస్తే
వాడు మంచి చేయటం నేర్చుకోడు.
చెడ్డవాడు మంచి ప్రపంచంలో జీవించినప్పటికీ వాడు చెడ్డ పనులే చేస్తూ ఉంటాడు.
ఆ చెడ్డ వ్యక్తి యెహోవా గొప్ప తనాన్ని ఎప్పటికీ చూడకపోవచ్చు.
11 కానీ, యెహోవా, అలాంటి ప్రజలను నీవు శిక్షిస్తే
వారు దానిని చూస్తారు.
యెహోవా నీ ప్రజల మీద నీకు ఉన్న బలమైన ప్రేమను నీవు చెడ్డ మనుష్యులకు చూపించు.
అప్పుడు చెడ్డవాళ్లు సిగ్గుపడతారు.
నీ శత్రువులు నీ స్వంత అగ్నిలో కాలిపోతారు.
12 యెహోవా, మేము చేయాలని ప్రయత్నించిన వాటన్నింటినీ చేయటంలో నీదే విజయం.
కనుక మాకు శాంతి ప్రసాదించు.
తన ప్రజలకు దేవుడు క్రొత్త జీవితాన్ని ఇస్తాడు
13 యెహోవా, నీవే మా దేవుడివి. అయితే గతంలో మేము ఇతర ప్రభువులను అనుసరించాం.
మేము ఇతర యజమానులకు చెందిన వాళ్లం
కానీ ప్రజలు ఇప్పుడు ఒకే ఒక్క పేరు, నీపేరు మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలని మేము కోరుతున్నాం.
14 ఆ అబద్ధ దేవుళ్లు జీవం లేనివి
ఆ దయ్యాలు మరణం నుండి మళ్లీ లేవవు
నీవు వాటిని నాశనం చేయాలని నిర్ణయించావు.
మేము వాటిని జ్ఞాపకం చేసుకొనేటట్టు చేసే వాటన్నింటినీ నీవు నాశనం చేశావు.
15 నీవు ప్రేమించే దేశానికి నీవు సహాయం చేశావు
ఇతరులు ఆ దేశాన్ని జయించకుండ నీవు నిలిపివేశావు.
37 ఇది విని ప్రజల హృదయాలు కదిలిపొయ్యాయి. వాళ్ళు పేతురు మరియు యితర అపొస్తలులను, “సోదరులారా! మేము ఏం చెయ్యాలి?” అని అడిగారు.
38 పేతురు ఈ విధంగా జవాబు చెప్పాడు: “మీలో ప్రతి ఒక్కడూ పాప క్షమాపణ నిమిత్తం మారుమనస్సు కలిగి యేసు క్రీస్తు పేరిట బాప్తిస్మము పొందాలి. అప్పుడు మీ పాపాలు క్షమించబడ్తాయి. మీకు పవిత్రాత్మ వరం లభిస్తుంది. 39 దేవుడు ఈ వాగ్దానాన్ని మీకోసం, మీ సంతానాని కోసం, ప్రభువు ఆహ్వానించబోయే దూర ప్రాంతాల వాళ్ళకందరి కోసం చేసాడు.”
40 వాళ్ళకు అనేక మాటల ద్వారా ఎన్నో విషయాలు చెప్పాడు. అంతేకాక, వాళ్ళతో ఈ విధంగా బ్రతిమిలాడాడు: “వక్రబుద్ధులున్న ఈ తరం వాళ్ళనుండి విడిపోయి రక్షణ పొందండి.” 41 అతని సందేశాన్ని అంగీకరించినవాళ్ళు బాప్తిస్మము పొందారు. ఆ రోజు సుమారు మూడువేల మంది విశ్వాసులుగా చేరారు.
విశ్వాసుల సహవాసం
42 వాళ్ళు అపొస్తలుల బోధను వింటూ సహవాసములోను, రొట్టె విరుచుటలోను పాలి భాగస్థులై, ప్రార్థన చేయుటలో నిమగ్నులై యుండేవాళ్ళు.
© 1997 Bible League International