Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: “ఒప్పందం పుష్పాలు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.
80 ఇశ్రాయేలీయుల కాపరీ, నా మాట వినుము.
యోసేపు గొర్రెలను (ప్రజలను) నీవు నడిపించుము.
కెరూబులపై నీవు రాజుగా కూర్చున్నావు. ప్రకాశించుము.
2 ఇశ్రాయేలీయుల కాపరీ, ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షేలకు నీ మహాత్యం చూపించుము.
వచ్చి మమ్మల్ని రక్షించుము.
3 దేవా, మరల మమ్మల్ని స్వీకరించుము.
మేము రక్షించబడునట్లు నీ ముఖాన్ని మా మీద ప్రకాశింపచేయుము.
4 సర్వశక్తిగల యెహోవా దేవా, నీవు మా మీద ఎప్పటికి కోపంగానే ఉంటావా?
మా ప్రార్థనలు నీవు ఎప్పుడు వింటావు?
5 నీవు నీ ప్రజలకు కన్నీళ్లే ఆహారంగా ఇచ్చావు.
నీ ప్రజల కన్నీళ్లతో నిండిన పాత్రలే నీవు నీ ప్రజలకు ఇచ్చావు. అవే వారు తాగుటకు నీళ్లు.
6 మా పొరుగువారు పోరాడుటకు నీవు మమ్మల్ని హేతువుగా ఉండనిచ్చావు.
మా శత్రువులు మమ్మల్ని చూచి నవ్వుచున్నారు.
7 సర్వశక్తిమంతుడవైన దేవా, మరల మమ్మల్ని అంగీకరించుము.
నీ ముఖము మామీద ప్రకాశించునట్లు మమ్మల్ని రక్షించుము.
17 దేవా, నీ కుడి ప్రక్క నిలిచి ఉన్న నీ కుమారుని ఆదుకొనుము.
నీవు పెంచిన నీ కుమారుని ఆదుకొనుము.
18 అతడు మరల నిన్ను విడువడు.
అతన్ని బ్రదుక నీయుము. అతడు నీ నామాన్ని ఆరాధిస్తాడు.
19 సర్వశక్తిమంతుడవైన యెహోవా, దేవా, తిరిగి మా దగ్గరకు రమ్ము.
నీ ముఖ మహిమను మామీద ప్రకాశించనీయుము. మమ్మల్ని రక్షించుము.
ప్రజల దుష్ట పథకాలు
2 పాపం చేయటానికి ఉపాయం పన్నేవారికి ఆపదలు వస్తాయి.
ఆ ప్రజలు తమ పాన్పులపై పడుకొని పాపం చేయటానికి పథకాలు వేస్తారు.
తెల్లవారగానే, ఈ ప్రజలు తమ పథకం ప్రకారం చెడు పనులు చేస్తారు.
ఎందుకంటే వాటిని చేయటానికి వారికి శక్తి ఉంది.
2 వారు భూములను ఆశించి, వాటిని తీసుకుంటారు.
వారు ఇండ్లను కోరి వాటిని ఆక్రమిస్తారు.
వారొక వ్యక్తిని మోసపుచ్చి వాని ఇంటిని తీసుకుంటారు.
వారొక వ్యక్తిని మోసగించి అతని వస్తువులను కాజేస్తారు.
ప్రజలను శిక్షించటానికి యెహోవా పథకం
3 అందువల్ల యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“చూడండి, ఈ వంశం మీదికి ఆపద తీసుకురావటానికి నేను పథకం వేస్తున్నాను.
మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు.
మీరు గర్వంగా నడవలేరు.
ఎందుకంటే అది కీడుమూడే సమయం.
4 ఆ సమయంలో ప్రజలు మిమ్మల్ని గురించి పాటలు పాడుకుంటారు.
ప్రజలు మిమ్మల్ని గురించి దుఃఖ సూచకపాటలు ఆలపిస్తారు. మీరు ఇలా అంటారు:
‘మేము నాశనమయ్యాము!
యెహోవా నా ప్రజల భూమిని తీసుకున్నాడు. ఆయన దానిని అన్యజనులకు ఇచ్చాడు.
అవును, నా భూమిని ఆయన నానుండి తీసుకున్నాడు.
యెహోవా మా పొలాలను మా శత్రువులమధ్య విభజించాడు.
5 ప్రజలు మీ భూమిని కొలవలేరు.
భూమిని యెహోవా ప్రజల మధ్య విభజించటానికి ప్రజలు చీట్లు వేయలేరు.
ఎందుకంటే, ఆ భూమి మీకు చెందియుండదు!’”
మీకాను ఇక బోధించవద్దనటం
6 ప్రజలు ఇలా అంటారు: “మాకు బోధించవద్దు.
మా గురించి ఆ చెడు విషయాలు చెప్పవద్దు.
మాకు ఏ కీడూ జరుగబోదు.”
7 కాని, యాకోబు వంశీయులారా!
నేనీ విషయాలు చెప్పాలి.
మీరు చేసిన పనుల పట్ల
యెహోవా కోపగిస్తున్నాడు.
మీరు ధర్మంగా ప్రవర్తిస్తే
నేను మిమ్మల్ని గురించి మంచి మాటలు చెప్పేవాడిని.
8 కాని, ఇటీవల నా ప్రజలే నా శత్రువులయ్యారు.
దారిన పోయే వారివద్దనుండి మీరు బట్టలు దొంగిలిస్తారు.
ఆ జనులు మాత్రం సురక్షితంగా ఉన్నామనుకున్నారు.
కాని వారు యుద్ధ ఖైదీలు అన్నట్లు, వారి వస్తువులు మీరు తీసుకుంటారు.
9 నా ప్రజల స్త్రీలను వారి అందమైన,
సౌకర్యాలు గల ఇండ్లనుండి మీరు వెళ్లగొట్టారు.
వారి చిన్నపిల్లల మధ్యనుండి
నా మహిమను మీరు తీసివేశారు.
10 లేచి వెళ్లిపొండి!
ఎందుకంటే, ఇది విశ్రాంతి తీసుకొనే స్థలం కాదు. మీరు ఈ స్థలాన్ని పాడు చేశారు!
మీరు దీన్ని అపవిత్రం చేశారు. కనుక అది నాశనం చేయబడుతుంది!
11 ఒక బూటకపు ప్రవక్త వచ్చి, అబద్ధాలు చెప్పవచ్చు. అతడు,
“నాకు ద్రాక్షారసం, మద్యం ఇవ్వండి. నేను మీకు మంచి విషయాలు చెపుతాను” అని అనవచ్చు.
అతడు వారికి ఆ విధంగా బోధకుడవుతాడు!
యెహోవా తన ప్రజలను ఒక్క చోటికి చేర్చటం
12 అవును, యాకోబు వంశీయులారా, నేను మీ అందరినీ ఒక్కచోటికి తీసుకువస్తాను.
ఇశ్రాయేలు ప్రజలలో మిగిలిన వారందరినీ సమకూర్చుతాను.
దొడ్డిలోని గొర్రెల్లా, పచ్చిక బీడులోని మందల్లా, వారిని నేను సమకూర్చుతాను.
అప్పుడు ఆ స్థలమంతా అనేకమందిచేసే ధ్వనులతో నిండిపోతుంది.
13 “ఒక వ్యక్తి” ముందుకు తోసుకు వచ్చి, తన ప్రజల ముందుకు వస్తాడు.
ఆయన ద్వారాలను పడదోసుకుపోతాడు. ప్రజలు ఆ నగరాన్ని వదలివేస్తారు.
వారి రాజు వారిముందు నడుస్తాడు.
యెహోవా తన ప్రజల ముందు ఉంటాడు.
15 “అసహ్యం కలిగించేది, సర్వ నాశనం కలిగించేది పవిత్ర స్థానంలో నిలుచొని ఉండటం మీరు చూస్తారు. దీన్ని గురించి దానియేలు ప్రవక్త మాట్లాడాడు. పాఠకుడు దీని అర్థం గ్రహించాలి. 16 అప్పుడు యూదయ ప్రాంతలోవున్న ప్రజలు కొండల మీదికి పారిపోవటం మంచిది. 17 మిద్దె మీద ఉన్నవాడు తన యింట్లోకి వెళ్ళి ఏదీ తీసుకోరాదు. 18 పొలంలో వున్నవాడు తన వస్త్రాన్ని తీసుకు రావటానికి వెనక్కు మళ్ళరాదు.
19 “ఆ రోజుల్లో గర్భిణీ స్త్రీలకు, పురిటి స్త్రీలకు ఎంత దుఃఖం కలుగుతుందో కదా! 20 ఆ రోజుల్లో చాలా కష్టంగా ఉంటుంది. కనుక చలికాలంలో కాని, లేక విశ్రాంతి రోజు కాని పారిపోవలసిన పరిస్థితి ఏర్పడ కూడదని ప్రార్థించండి. 21 ప్రపంచం సృష్టింపబడిన నాటి నుండి నేటి దాకా అలాంటి కష్టం ఎన్నడూ సంభవించలేదు. యిక ముందు సంభవించదు.
22 “దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చేసి ఉండక పోయినట్లయితే, ఎవ్వరూ బ్రతికి ఉండే వాళ్ళు కాదు. కాని దేవుడు తానెన్నుకొన్న వాళ్ళకోసం ఆ రోజుల సంఖ్య తగ్గించాడు.
23 “ఆ రోజుల్లో మీలో ఎవరైనా, ‘ఇదిగో చూడండి క్రీస్తు యిక్కడ ఉన్నాడు’ అని కాని, లేక, ‘అక్కడున్నాడు’ అని కాని అంటే నమ్మకండి. 24 ఎందుకంటే క్రీస్తులమని, ప్రవక్తలమని చెప్పుకొంటూ ప్రజల్ని మోసం చెయ్యటానికి గొప్ప మహత్యాలు, ఆశ్చర్యం కలిగించే కార్యాలు చేసే మోసగాళ్ళు బయలు దేరుతారు. వీళ్ళు వీలైతే దేవుడు ఎన్నుకొన్నవాళ్ళను కూడా మోసం చెయ్యటానికి ప్రయత్నిస్తారు. 25 చూడండి! ముందే మీకు చెబుతున్నాను.
26 “కనుక మీతో ఎవరైనా, ‘అదిగో! ఆయన నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్నాడు’ అంటే, అక్కడికి వెళ్ళకండి. లేక, ‘యిక్కడ గదుల్లో ఉన్నాడు’ అంటే, నమ్మకండి. 27 తూర్పునుండి పడమర దాకా మెరిసే మెరుపు వలే మనుష్యకుమారుడు వస్తాడు. 28 శవమున్న చోటే రాబందులు ప్రోగౌతాయి.
29 “ఆ కష్టకాలం గడిచిన వెంటనే,
‘దేవుడు సూర్యుణ్ణి చీకటిగా చేస్తాడు.
చంద్రుడు వెలుగునివ్వడు
నక్షత్రాలు ఆకాశంనుండి రాలిపోతాయి
ఆకాశంలోని శక్తులు కదలిపోతాయి.’[a]
30 “అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశంలో కనిపిస్తుంది. భూమ్మీద ఉన్న దేశాలన్నీ దుఃఖిస్తాయి. మనుష్యకుమారుడు శక్తితో, గొప్ప తేజస్సుతో ఆకాశంలోని మేఘాలపై రావటం వాళ్ళు చూస్తారు. 31 అప్పుడు దేవుడు తన దూతల్ని గొప్ప బూరధ్వనితో పంపుతాడు. ఆ దూతలు నలువైపుల నుండి అంటే, ఆ చివరి నుండి ఈ చివరిదాకా గాలించి దేవుడెన్నుకొన్న వాళ్ళను ప్రోగు చేస్తారు.
© 1997 Bible League International