Revised Common Lectionary (Semicontinuous)
హేత్
57 యెహోవా, నీ ఆజ్ఞలకు విధేయుడనగుట నా విధి అని నేను తీర్మానించుకొన్నాను.
58 యెహోవా, నేను పూర్తిగా నీమీద ఆధారపడుతున్నాను.
నీ వాగ్దానం ప్రకారం నాకు దయచూపించుము.
59 నేను నా జీవితాన్ని గూర్చి చాలా జాగ్రత్తగా ఆలోచించాను.
మళ్లీ నీ ఒడంబడికను అనుసరించటానికే వచ్చాను.
60 ఆలస్యం లేకుండా నీ ఆజ్ఞలకు విధేయత చూపాలని నేను త్వరగా మళ్లుకొన్నాను.
61 దుర్మార్గులు కొందరు నన్ను చుట్టుముట్టారు.
అయితే యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు.
62 నీ మంచి నిర్ణయాల కోసం నీకు కృతజ్ఞత చెల్లించటానికి
అర్ధరాత్రి వేళ నేను మేల్కొంటాను.
63 నిన్ను ఆరాధించే ప్రతి మనిషికీ నేను స్నేహితుడను.
నీ ఆజ్ఞలకు విధేయత చూపే ప్రతి మనిషికి నేను స్నేహితుడను.
64 యెహోవా, నీ నిజమైన ప్రేమ భూమిని నింపుతుంది.
నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
27 మేలు చేయుట నీచేతనైనప్పుడు దాన్ని పొందదగినవారికి చేయకుండా వెనుదీయకుము. 28 నీ పొరుగు వాడు అతని స్వంత వస్తువులను తిరిగి ఇచ్చి వేయుమని నిన్ను అడిగితే వాటిని అప్పుడే అతనికి ఇచ్చివేయుము. “తిరిగి రేపు రమ్మని” అతనితో చెప్పవద్దు.
29 నీ పొరుగువాడు నీతో శాంతియుతంగా జీవిస్తున్నాడు, గనుక అతనికి విరోధంగా కీడు తల పెట్టవద్దు.
30 మరో వ్యక్తి నీ యెడల ఎలాంటి తప్పూ చేయకపోతే అతనిని న్యాయస్థానానికి తీసుకొని పోవద్దు.
31 కొంతమంది మనుష్యులు తేలికగా కోపం తెచ్చుకొని వెంటనే కీడు చేస్తారు. వారు జీవించే విధంగా జీవించకు. 32 ఎందుకంటే దుర్మార్గులను యెహోవా ద్వేషిస్తాడు. కాని సక్రమంగా జీవించే ప్రజలను యెహోవా బలపరుస్తాడు.
33 దుర్మార్గుల కుటుంబాలకు యెహోవా విరోధంగా ఉంటాడు. కాని సక్రమంగా జీవించే వారి కుటుంబాలను ఆయన ఆశీర్వదిస్తాడు.
34 ఒక వేళ ఒక వ్యక్తి గర్వించి, ఇతరులకంటే అతడే మంచివాడని తలచి, హేళన చేస్తే యెహోవా అతనిని శిక్షించి, అతని గూర్చి హేళన చేస్తాడు. కాని దీనులకు యెహోవా సహాయం చేస్తాడు.
35 జ్ఞానముగల మనుష్యులు దేవుణ్ణి వెంబడిస్తారు. జ్ఞానముగల మనుష్యులను యెహోవా ఘనపరుస్తాడు. బుద్దిహీనులు దేవుణ్ణి వెంబడించరు. బుద్దిహీనులు అవమానించబడతారు.
ధనవంతుడు యేసును వెంబడించుటకు నిరాకరించటం
(మత్తయి 19:16-30; మార్కు 10:17-31)
18 ఒక యూదుల నాయకుడు యేసును, “బోధకుడా! మీరు మంచివాళ్ళు. నేను అనంత జీవితం పొందాలంటే ఏమి చెయ్యాలి?” అని అడిగాడు.
19 “నేను మంచివాణ్ణని ఎందుకంటున్నావు? దేవుడు తప్ప మరెవ్వరూ మంచివాళ్ళు కాదు. 20 నీకు దేవుని ఆజ్ఞలు తెలుసు కదా: ‘వ్యభిచారం చెయ్యరాదు, హత్య చెయ్యరాదు. దొంగతనము చెయ్యరాదు. దొంగ సాక్ష్యాలు చెప్పరాదు. తల్లి తండ్రుల్ని గౌరవించవలెను’” అని యేసు సమాధానం చెప్పాడు.
21 “నేను చిన్ననాటినుండి ఈ నియమాలు పాటిస్తూనేవున్నాను” అని ఆ యూదుల పెద్ద అన్నాడు.
22 ఇది విని యేసు అతనితో, “నీలో యింకొక లోపం ఉంది. నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి పేదవాళ్ళకు దానం చెయ్యి. అది నీకు పరలోకంలో సంపద అవుతుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు” అని అన్నాడు. 23 ఆ యూదుల పెద్ద చాలా ధనవంతుడు. అందువల్ల యిది విని అతనికి చాలా దుఃఖం కలిగింది.
24 యేసు అతడు దుఃఖపడటం చూసి, “ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించటం చాలా కష్టం. 25 ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటంకన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్ళటం సులభం” అని అన్నాడు.
ఎవరు రక్షింపబడగలరు
26 ఇది విని వాళ్ళు, “మరి ఎవరు రక్షింపబడుతారు?” అని అడిగారు.
27 “మానవునికి సాధ్యంకానిది దేవునికి సాధ్యమౌతుంది” అని యేసు అన్నాడు.
28 పేతురు, “మిమ్మల్ని అనుసరించటానికి మాకున్నవన్నీ వదిలివేసాము” అని అన్నాడు.
29 యేసు, “ఇది నిజం. దేవుని రాజ్యం కొరకు తన యింటిని, భార్యను, సోదరుల్ని, తల్లితండ్రుల్ని, సంతానాన్ని వదిలినవాడు ఏ మాత్రం నష్టపోడు. 30 ఇప్పుడు ఎన్నోరెట్లు ఫలం పొందటమే కాకుండా మున్ముందు అనంత జీవితం పొందుతాడు.” అని అన్నాడు.
© 1997 Bible League International